రాజ్యంకోసం - బొందల నాగేశ్వరరావు

rajyam kosam

మధనపురి రాజ్యానికి రాజు రాజశేఖరుడు. ఆయన పరిపాలనలో ప్రజలు తిండి బట్టకు కొరత లేకుండా కష్టాలకు అతీతంగా ఎంతో సుభీక్షంగా బ్రతికేందుకు మంత్రి నందనుడి సలహాలతో జాగ్రతలు తీసుకొని తెలివిగా పరిపాలనను సాగిస్తున్నాడు. ప్రజలు కూడా రాజశేఖరుడి పరిపాలనలో సుఖ సంతోషాలతో జీవనాన్ని గడుపుతుండగా పొరుగు రాజ్యాలు సైతం రాజును పొగడ్తలతో అభినందించసాగాయి. అయితే రాజు భార్య వసుంధరదేవి, కొడుకు చంద్రశేఖరుడు పరిపాలనలో ఒక్కింత కూడా జోక్యం కల్పిచుకొనేవారుకాదు. అందుకే మంత్రి నందనుడు అలా రాజ్య పరిపాలనను పట్టించుకోని రాజుగారి భార్యను,అయన కొడుకుని కూడా ఎలాగైనా పరిపాలనలో పాలుపంచుకునేలా చేయాలని అప్పుడే వాళ్ళకూ ప్రజల యోగ క్షేమాలు, కష్టసుఖాలు తెలుస్తాయని భావించి రాజుకు విషయాన్ని విన్నవించుకొన్నాడు.కాని అదేమంత ముఖ్యం కాదన్నట్టుగా మౌనం వహించాడు రాజు.

అయితే పరాయి దేశాల కళ్ళు వాళ్ళ దేశంపై పడకుండా చూసుకోవడం, రాజ్యాభివృధ్ధికి పాటు పడడం తన కర్తవ్యంగా భావించిన మంత్రి రాజు ఆనతితో సైన్యాన్ని,అశ్వ, గజ బలాలను పటిష్ఠం చేసే పనిలో పడ్డాడు.రాజ్యంలో వున్న యువకులను సంఘటిత పరచి వాళ్ళను సైన్యంలో చేర్పించి శిక్షణను యివ్వాలన్న నిర్ణయం తీసుకొన్నాడు. తన కొడుకుతో పాటు ప్రతి ఇంటికి ఒకరి చొప్పున సైన్యంలో చేర్పించాడు. అందరికి కావలసిన శిక్షణను యిప్పిస్తున్నాడు. అయితే ఆలా శిక్షణ పొందుతున్న వారిలో రాజు కొడుకు చంద్రశేఖరుడు లేకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.అది గ్రహించిన మంత్రి రాజు కొడుకుని కూడా సైన్యంలో చేర్చాలన్న వుద్దేశ్యంతో రాజును సంప్రదించాడు.కాని ' అది కుదరని పనని,తన కొడుక్కి అలాంటి విద్యలను నేర్పుటకు భార్య వసుంధరదేవికి ససేమిరా యిష్టం లేదని చెప్పి'వాటికి దూరంగా వుంచాడు రాజు.ఇక చేసేది లేక వూరకుండి పోయాడు మంత్రి.

రోజులు దొర్లి పోతున్నాయ్ . మంత్రి కొడుకు సకల విద్యలను చక్కగా నేర్చుకొంటున్నాడు. కాని అవేమీ పట్టించుకోని రాజు కొడుకు అంతకంత దిగజారిపోయి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అందుకు పూర్తి బాధ్యత తన తల్లి తండ్రులదేనని ప్రజలు అనుకో సాగారు.

అనతి కాలంలోనే సకల విద్యలలో ప్రావీణ్యత పొందిన మంత్రి కొడుకు తన తండ్రి ఆనతిపై రాజ్యానికి కవచంగానూ, రాజ కుటుంబానికి రక్షగానూ వుంటూ చిన్నచిన్న సమస్యలను తనే పరిష్కరిస్తూ వస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజ్యాన్ని రాజ కుటుంబాన్ని కాపాడుతూ వున్నారు మంత్రి ,మంత్రి తనయుడు.

ఇలా వుండగా ఆ దేశంలో వున్న అమితమైన సంపద ,ప్రకృతి సిద్దమైన వనరులమీద పొరుగు రాజ్యపు రాజు పురుషోత్తముడి కన్ను పడింది.మధనపురి సంపదను ,వనరులను దోచుకోవాలన్న ఆశతో యుధ్ధాన్ని ప్రకటించాడు పురుషోత్తముడు.ఆ వార్తను తెలుసుకొన్నరాజు యుధ్ధానికి భయపడి మంత్రి సలహాతో రాజీ సందేశాన్ని పంపాడు పురుషోత్తముడికి.అయితే అసలే కరవుతో వున్న ఆ పొరుగు రాజ్యాధిపతి పురుషోత్తముడు తను రాజీకి రావాలంటే రాజ్యంలో కొంత భాగాన్ని,కొంత ఐశ్వర్యాన్ని ,ప్రకృతి వనరులను తనకు అప్పజెప్పాలని లేకుంటే యుధ్ధం తప్పదని మరు సందేశాన్ని పంపాడు.

అందుకు భయపడ్డ రాజ శేఖరుడు వెంటనే అత్యవసర సభను సమావేశ పరచాడు. మంత్రి, సేనాధిపతులు,రహస్య గుఢాచారులు, తదితర ముఖ్యులతో సంప్రదింపులు జరిపాడు. ఓ నిర్ణయానికొచ్చి మూడు నెలల తరువాత తామూ యుధ్ధానికి తయారని లేఖ ద్వారా పురుషొత్తముడికి తెలియజేశాడు. ఇక ఏర్పాట్లలో భాగంగా యుధ్ధానికి సైనికులతో పాటు శిక్షణ పొందుతున్న ప్రతి పౌరుడూ పాల్గొనాలని ఆఙ్ఞ జారీ చేశాడు.రాజాఙ్ఞ ప్రకారం వందలకొద్ది వీరులు యుధ్ధానికి సంసిద్ధమయ్యారు.కాని అందరూ రాజుని ఏహ్య భావంతో చూస్తూ వాళ్ళలో వాళ్ళే ఏదో గొణుక్కుంటూ వెళ్ళి పోవడం గమనించాడు రాజు.

మరుసటి రోజు సభలో ఆశీనుడైన రాజు మంత్రిని పిలిచి"మంత్రివర్యా!నిన్న మన రాజ్య ప్రజలందరూ నా వేపు అదోలా చూస్తూ ముభావంగా ఏహ్య భావాన్ని కనుబరుస్తూ వెళ్ళిపోయారు.అందుకుకారణమేమిటి"అని అడిగాడు.అందుకు మంత్రి లేచి రాజుకి దగ్గరగా వెళ్ళి "మహారాజా! ఈ విషయం తమకు కాస్త బాధను కలిగించవచ్చు.అయినా సమయం వచ్చింది కనుక చెబుతున్నాను. మన రాజ్యంలోని ప్రతి ఇంటినుంచి ఓ యువకుడు యుధ్ధంలో పాల్గొనాలని ఆఙ్ఞను జారీ చేసిన తమరు తమ కుమారుని వాళ్ళతో పాటు యుధ్ధానికి సన్నద్దం చేయలేదన్నదే వాళ్ళ బాధ.'అంటే...అంతఃపుర వాసంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేది యువరాజావారు, యుధ్ధాలకు వెళ్ళేది మేమా' అంటూ వాళ్ళలో వాళ్ళే మదన పడసాగారు"అని వివరించాడు. ఆ మాటలు రాజుగారిని ఆలోచింపజేశాయి. అందులో తన స్వార్థం స్పస్పుటమైంది. వెంటనే "అంటే కష్టాలు కన్నీళ్ళు ఒకరికి , సుఖసంతోషాలు మరొకరికన్న గూడార్థం అందులో దాగుందన్నమాట.అర్థమైంది. మంత్రివర్యా! ఇది మన చినరాజావారిని గూర్చిన ప్రస్తావన. మేము రాజ్య ప్రజలను యుద్దానికి పంపి మా కొడుకుని అంతఃపురంలో వుంచుకోవడం తప్పని నాకు చెప్పకనే చెప్పి తెలియజేశారు మన రాజ్య ప్రజలు. ఎటూ యుధ్ధానికి మరో మూడు మాసాలు వ్యవధి వుంది కనుక రేపటినుంచే చినరాజావారిని తీసుకువెళ్ళి యుధ్ధానికి కావలసిన అన్ని రకాలైన విద్యలను నేర్పి మీ కుమారుడివలే తయారు చేసి తీసుకు వచ్చే భాధ్యత మీకు అప్పగిస్తున్నాను.మహారాణివారితో మేము మాట్లాడుకొంటాము.ఏర్పాట్లు చేయండి"అంటూ వెళ్ళిపోయాడు.

మంత్రి ఆ రెండవ రోజునుంచే చినరాజావారికి సకల విద్యలు నేర్పుటకు గురువుల వద్దకు తీసుకువెళ్ళాడు.

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ