మూగజీవుడు - చామర్తి భానులింగమూర్తి

moogajeevudu

నా పేరు "కుందేలు". అవునండీ ..నా పేరు నిజంగానే కుందేలే . ఏంటి ?... అడవిలో జంతువుననుకొంటున్నారా .. ? కాదండి. ఆ జంతువు వేషంలో ఉన్న ఓ 'నిరుద్యోగిని'. ప్రస్తుతానికైతే నిరుద్యోగిని కాదులెండి. ఎందుకంటే 'కుందేలు' వేషంలో డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి.
నా ఉద్యోగం ఉదయాన్నే బట్టల దుకాణం తెరిచినవెంటనే ప్రారంభమౌతుంది. దుకాణం ముందర 'కుందేలు ' వేషం లో గెంతుతూ .. ఆడుతూ . పిల్లలని , పెద్దలని ఆకర్షించడమే నా ఉద్యోగం. నా తో పాటే ఇంకా ఏనుగు, ఎలుగుబంటి , పులి కూడా ఉన్నాయండి. మేము పనిచేసే బట్టల దుకాణం ఈ మధ్యే క్రొత్తగా ప్రారంభమయ్యింది. ఆ దుకాణం యజమాని అందరినీ ఆకర్షించి , తన బట్టల అమ్మకాలు పెంచుకునేందుకు మమ్మల్ని ఏర్పాటు చేసాడు.

మాది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం. పదవీవిరమణ చేసిన నాన్న చిరు పెన్షన్ మీద, చెల్లలు చెప్పే ట్యూషన్స్ మీద వచ్చే ఆదాయం తో ఇల్లు గడుస్తున్న పరిస్థితుల్లో, గ్రాడ్యుయేషన్ చేసి , ఏ ఉద్యోగం దొరకని నాకు ఈ ఉద్యోగమే పరమావధి అయ్యింది. చదువుకున్న చదువుకు ఎంత మాత్రం సంభంధం లేని ఈ వేషమే ఇంత కూడు పెడుతోంది.

ఇంక మా వేషాల గురించి చెప్తాను. మాలాంటి ఉద్యోగాలను చూపించే ఒక కాంట్రాక్టు సంస్థ ఒకటి వుంది. ఆ సంస్థ మాలాంటి జంతువులను దుకాణాలకు, షాపింగ్ మాల్స్ కు, ధనవంతుల పిల్లల పుట్టినరోజులకు, ఎక్కడైనా కొత్త షాప్స్ ప్రారంభానికి , మేళాలకి పంపుతూ ఉంటుంది. ఆ సంస్థ మాకు ఉద్యోగం చూపించినందుకు, షాపుల వారు మాకు ఇచ్చే జీతం లో నుండి కొంత భాగం తీసేసుకుంటుంది .

మా లాంటి జంతువులందరికీ ఒక మృగ రాజు లాంటి ఆ సంస్థ కు చెందిన అధికారి ఒకడు ఉంటాడు. అతడే మాకు వేషం కి తగిన డ్రెస్సులు ఇచ్చి ,ఏ షాప్ దగ్గర ఉండాలో చెప్తాడు.

మాకు పండగ , పెళ్లిళ్ళ సీజన్లలో గిరాకీ ఎక్కువ ఉంటుంది . షాప్ తెరిచిన మొదలు , మూసేసే వరకు వచ్చే పోయే పిల్లలకు ,పెద్దలకు కరచాలనం చేస్తూ గెంతుతూ ,ఆడుతూ ఉండాలి . మమ్మల్ని చూసి సరదా పడే పిల్లలు కొంతమంది , భయపడే చిన్న పిల్లలు కొంతమంది ఉం టారు. కొంత మంది సెల్ఫీ లు కూడా తీసుకుంటుంటారు.

అందరికీ ఆనందాన్ని పంచే ఆ వేషం మాత్రం మాకు చాలా బాధా కరం గా ఉంటుంది. ఉన్ని తో చాలా మందంగా తయారు చేసిన ఆ డ్రెస్ వల్ల శరీరం కి గాలి తగలక , శరీరం అంతా దురదగా ,మంటగా ఉంటుంది. తల మించి వేసుకొన్న డ్రెస్ లో మా కళ్ళు తప్ప ఇంకేమి బయటకి కనపడకూడదు. దాని వల్ల సరిఅయిన శ్వాస కూడా అందదు.

వేసవి కాలం లో అయితే మా బాధ వర్ణనాతీతం. వేషం తీసేసి కొంత సేపు కూర్చుందామంటే , షాప్ యజమాని ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. " మిమ్మల్ని బోల్డంత డబ్బు పెట్టి తెప్పించింది కూర్చోడానికి కాదు. అసలే షాప్ అమ్మకాలు అంతంత మాత్రమే ఉన్నాయి. వెళ్ళండి.వెళ్ళి అందరినీ ఆకర్షించండి " అని తిడుతూ ఉంటారు.

నోరు లేని ఆ మూగ జీవాల్లాగే, మేము కూడా నోరు లేని మనుషులమై పని చేస్తూఉంటాము. అమ్మే బట్టల్లో , సరుకుల్లో నాణ్యత ఉండాలి కానీ , అందరినీ ఆకర్షించి కొనిపిస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఒక విధం గా ఇలాంటి షాపుల వల్ల మా లాంటి వారికి ఉపాధి దొరుకుతోంది.

నా వేషాన్ని చూసి ఆనంద పడే, నవ్వే జనాలని చూసి ఒకొక్కక్కసారి 'చదువుకొని ఈ వేషాలేంటని'? నన్ను చూసి నవ్వు తున్నారని మనసు లో బాధ కలుగుతూ ఉంటుంది. ‘నా వేషం చూసి నవ్వుతున్నారులే’ అని నా మనసు కు సర్ది చెప్పుకుంటూ ఉంటాను.

మనసు లో ఎంత బాధ ఉన్నా, నా చదువుకు తగిన మరొక ఉద్యోగం ఎప్పడికైనా దొరుకుతుందనే ఆశ తో, నన్ను చూసి ఆనంద పడే పిల్లల నవ్వులో నా కష్టాలన్నీ మరచిపోతుంటాను. ఇదండీ నా కధ .

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం