వదిలేయి - పోడూరి వెంకటరమణ శర్మ

vadiley

నేను చాలా కాలం నుంచి మా ఇంటికి దగ్గరగా ఉన్న హనుమాన్ పార్క్ లో రోజూ వాకింగ్ చేయడం జరుగుతోంది. అక్కడ పరిచయం అయ్యాడు చక్ర పాణి. మా కాంప్లెక్ కు ముందు కాంప్లెక్ లోనే ఉంటూన్నాడని తెలిసింది. రోజూ కలుస్తూ ఉండడం తో బాగా పరిచయం పెరిగింది మా మధ్య .

రోజూ నేను వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేసే వాణ్ని. చక్రపాణి మాత్రం యోగ చేయడానికి కొంచెం సేపు ఉండేవాడు. ఒక రోజు నాతో బాటే, యోగ చేయకుండా, బయలు దేరి వచ్చాడు. వాళ్ళ కాంప్లెక్స్ రాగానే, నేను గుడ్ బై చెప్పి ముందుకు వెడితే, "రండి వెడుదురు గాని. మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కదా" అంటే అతని తో పాటు అతని ఫ్లాట్ కి వెళ్లాను. బెల్ కొట్టగానే భార్య కాబోలు తలుపు తీసింది. ఆమెని చూడ గానే నేను చాలా ఆశ్చర్య పోయాను. " నా భార్య కల్యాణి" అని చక్రపాణి పరిచయం చేస్తే, యాంత్రికం గా నమస్కారం పెట్టి లోపలికి నడిచాను, ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. . ఆమె లోపలికి వెళ్లి పోయింది. నేను ఎవరో ఆమెకు తెలియదు. కానీ ఆమె మాత్రం నా జీవితం లో కొద్దీ రోజులు మనసులో పెద్ద దుమారం లేపి అత్యంత నిరుత్సాహానికి గురిచేసిన సంగతి ఆమెకి తెలియదు. వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ నా చేతిలో పెట్టి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళాడు చక్రపాణి. అది తెరవ గానే అప్పటి కల్యాణి ఫోటో చూడగానే అప్పటి వరకూ ఆమె అవునా కాదా అని పీకుతున్న అనుమానం పూర్తి గా తొలగిపోయింది నాకు. అప్పట్లో నేను పొందిన మనో వ్యధ, మా నాన్నగారి మిత్రుడు కరుణాకర్ గారు ఒక చక్కటి సలహా ఇచ్చి నన్ను ఆ కల్లోలం నుంచి బయట పడేయడం గుర్తుకు వచ్చింది

***

నా చదువు పూర్తి అయిన వెంఠనే క్యాంపస్ సెలెక్షన్ లో మంచి కంపెనీ లో ఉద్యోగం దొరికింది. రెండేళ్ల తరువాత కంపెనీ వాళ్ళు నన్ను ప్రోజక్ట్ పని మీద నెథర్లాండ్స్ పంపించారు. అక్కడ మూడేళ్లు ఉన్న తరువాత ఇంకో ఆరు నెలలలకి ఇండియా వచ్చేస్తా ననగా, మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడు మాట్రిమోనియాల్ సైట్లు లేవు. నాన్నగారూ వాళ్ళూ చిక్కడపల్లి లోనూ అక్కడా శర్మ గారూ, వసంత గారూ వంటి ఉచిత సేవల వారి దగ్గర రిజిస్టర్ చేస్తే, ఎవరెవరో ఫోటోలు బయో డేటాలు పంపే వారు. అలాటి వాటిలో నాలుగు ఫోటోలు నాకు పంపారు. అందులో ఒక ఫోటో కళ్యాణి అనే అమ్మాయిది నాకు చాలా నచ్చింది. నాన్నగారికి చెప్పాను. "జాతకాలూ అవీ చూపించి వాళ్లకి నీ ఇష్టం తెలుపుతాను నువ్వు వచ్చిన తరువాత ఫైనల్ చేద్దాము" అన్నారు నాన్నగారు. ఎందుకో నా మనసులో ఆ అమ్మాయి ఫోటో ముద్ర పడి పోయింది. ఆమెనే భార్య గా ఊహించు కుంటూ ఇండియా వచ్చే ముందు మిగతా నెలలు గడిపాను. కానీ ఇండియా వచ్చిన వెంఠనే నాన్నగారుచెప్పిన వార్త విని కుదేలయి పోయాను. నాన్నగారు జాతకాలు చూపించడం లో కొంచెం జాప్యం అయింది. మా నాన్నగారు మా ఇష్టాన్ని వాళ్ళకి తెలిపారు. ముందుకు వెళ్లడం గురించి కొద్దీ రోజులకి సంప్రదించి నప్పుడు, ఆ అమ్మాయికి వేరే సంబంధం కుదిరి పోయిందని చెప్పారు. నేను ఊహించు కున్న వన్నీ నాన్న గారికి తెలియదు కాబట్టి "పోనీ లేరా వేరే మంచి సంబంధం చూద్దాము" అన్నారు . కానీ ఆయన చెప్పినంత సులువు గా కల్యాణి ని మనసునించి తొలగించుకో లెకపొయాను. గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధ వేసేది. వేరే సంబంధాలు అప్పుడే చూడ వద్దని చెప్పడం, ఎప్పుడూ నిరుత్సాహం గా ఉండడం చూసి మా అమ్మ నాన్న వర్రీ అవుతున్నారని తెలిసినా నేను ఏమీ చేయలేక ఊరుకున్నాను.

ఒక రోజు నాన్నగారు కరుణాకర్ అంకుల్ ఇంటికి వెళ్లి కొంత డబ్బు తీసుకు రమ్మన్నారు. నాన్నగారు, కరుణాకర్ అంకుల్ చిన్నప్పటినుంచీ స్నేహితులు. అవసరమయినప్పుడు ఆయన దగ్గర డబ్బు తీసుకోవడం మళ్ళీ ఇచ్చేయడం నాన్నగారికి పరిపాటే.

నాన్నగారు చెప్పగానే కరుణాకర్ అంకుల్ ఇంటికి వెళ్లాను. ఆయన నన్ను కూర్చోమని ఆంటీ ని కాఫీ తెమ్మన్నారు. నేను వచ్చిన పని చెప్పి డబ్బు ఇస్తే వెడతానన్నాను.

" వెడుదువు గాని లేవోయి అర్జెంట్ ఏమిటి" అని న జాబ్ వివరాలూ అవీ అడిగి, కొంచం సేపు తరువాత ఆంటీ తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ అడిగారు " ఏమిటి ఈ మధ్యన నువ్వు చాలా వర్రీ గా ఉంటున్నావట. తప్పిపోయిన సంబంధం గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమోనని మీ వాళ్ళు అనుకుంటున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పు అన్నారు"

చిన్నప్పటినుంచీ ఆయన తో ఉన్న చనువు, ఆయన అడిగిన పద్ధతీ అన్నీ కలిపి ఆయన తో మనసు విప్పి మాట్లాడాను. కల్యాణిని మరిచిపోలేక పోతున్నాననీ ఆయనకి చెప్పాను

" అది తప్పి పోవడం లో మన ప్రమేయం ఏమీ లేదుగదా, మనం చేయ గలిగింది ఏమీ లేనప్పుడు ఇంకా దాని గురించి ఇది అవడం అనవసరమేమో " అన్నారు నేను వర్రీ అవడంలో హేతు బద్ధత ఏమీ లేదని సూచిస్తూ

" నిజమే మన చేతిలో ఏమీ లేదని తెలిసినా, నాన్నగారు మా ఇష్టాన్ని తెలిపిన తరువాత కూడా వాళ్ళు ఆగకుండా ఇంకో సంబంధం చూసుకోవడం గుర్తు వచ్చినప్పుడల్లా చాలా బాధ గా ఉంటోంది "

" నిజమే నేను అర్థం చేసుకో గలను అన్నారు " ఎదో ఆలోచిస్తూ. మళ్ళీ ఆయనే అన్నారు

" ఒక కథ లాంటిది చెబుతాను జాగ్రత్త గా విను" అని మొదలు పెట్టారు కరుణాకర్ గారు
ఒక సన్యాసి నివసించే ఇంటి దగ్గర చాలా కోతులు ఉండేవి. ఏమరుపాటుగ ఉంటే ఇంట్లో ప్రవేశించి పండ్లనూ వాటినీ పట్టుకు పోతూ ఉండేవి. ఒక మాటు ఆయన ఒక పండుని ఒక సీసా లో పెట్టి ఉంచాడు. ఆయన పని లో ఉండగా ఎప్పటి లాగే కోతి ఒకటి వచ్చింది. సీసాలో చెయ్యి పెట్టి పండు తీసుకు వెళ్లి పోయింది. అది గమనించి ఆ మరునాడు ఆయన పండుని కొంచెం మూతి సన్నంగా ఉన్న సీసాలో పెట్టాడు. ఆవేళ కూడా కోతి వచ్చి సీసాలో చెయ్ పెట్టి పండుని పట్టుకుంది. కానీ పండుని పట్టుకుని ఉండగా చెయ్యి ఇవతలికి రాలేదు. పండుని వదిలేస్తే చెయ్యి ఇవతలికి వచ్చేసును. ఇది గమనించిన ఆ సన్యాసి ఒక కర్ర తీసుకుని దాని నడ్డీ మీద కొట్టడం మొదలెట్టాడు. పండు తో సహా చెయ్యి వెనక్కి తీసుకోవడం కుదరటం లేదు కానీ పండు వదిలేస్తే చెయ్యి వెనక్కి తీసుకుని దెబ్బలు తప్పించుకోవచ్చు. కానీ పండు మీద దృష్టి తో దానిని కోతి వదలక పోవడం వల్ల దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దీనిని నువ్వు అన్వయించు కో. నువ్వు అనుకున్నట్టు జరగలేదు. ఆమె పదే పదే గుర్తుకువచ్చి మనసుమీద దెబ్బలు పడుతున్నాయి. వదిలేయి. దెబ్బలు పడవు. ఒక్కమాటు విచారణ చేసుకో. అలా జరగడం లో నీ ప్రమేయం లేదు. ఆ విషయాన్ని వదిలేస్తున్నానని మనసు లో నిశ్చయించు కో మనసు తేలిక పడుతుంది." అన్నారు ఆయన నాకేసి చూసి నవ్వుతూ

"ప్రయత్నిస్తాను అన్నాను " అప్పటికి

ఇక్కడ కోతిని గుర్తు పెట్టుకుని దెబ్బలు తప్పించుకోవడం మనచేతులో పని మాత్రమే నని గుర్తించి వదిలేయడం అలవాటు అయితే అందులో సుళువు నీకు తెలుస్తుంది " అన్నారు మళ్ళీ నొక్కి చెబుతూ చెయ్యమన్న పని ఛాలా చిన్నదయినా, మనసు వెనక్కి వెళ్ళినప్పుడల్లా ఆయన చెప్పిన కోతి విషయం గుర్తు ఉంచుకుని, ఒక్క మాటు విశ్లేషించుకుని వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. వెంఠనే మనసు తేలిక పడింది. ఏ పరిస్థితి లో నయినా జరిగిపోయిన దానిని అనవసరం గా పట్టుకుని ఉండడం వల్ల బాధ పడడం తప్ప, దానిని వదిలేయడం లో ఉన్న సుఖం అవగాహన అయింది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల