సర్వే జనా: సుఖినో భవంతు - అయలసోమయాజుల చక్రపాణి.

sarvejanaa sukhinobhavantu

హడావిడిగా స్టేషన్ చేరుకున్న ముఖేష్ టికెట్ తీసుకుని ప్లాట్ ఫాం పై వున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కి కిటికీ ప్రక్కనున్న సీటులో కూలబడ్డాడు. ఖేష్ బరంపురం యింజనీరింగు కాలేజిలో మూడో సంవత్సరం "ట్రిపుల్ ఇ " చేస్తున్నాడు. సీటులో కూలబడ్డ ముఖేష్ కి ఏవేవో ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా వుంది.

"మీ నాన్నకి ఏక్సిడెంటయ్యింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ క్రింద పడిపోయాడు. నువ్వు త్వరగా బయల్దేరి రా" అని స్టేషన్ మాష్టర్ ప్రకాశం గారు ఫోనులో చెప్పిన మాటలు చెవిలో మారుమ్రోగుతూనే వున్నాయి.

గురవమ్మ, అప్పలకొండలు ముఖేష్ తల్లితండ్రులు. వారికి ముగ్గరు సంతానం. ఇద్దరాడపిల్లల తర్వాత ముఖేష్. అప్పలకొండ రైల్వేలో లైసెన్సు పోర్టర్. చదువులు అబ్బక, ఆస్తిపాస్తులేవీ లేకపోడంతో కాయకష్టంతో సంసారాన్ని లాక్కొచ్చెవారు గురవమ్మ,అప్పలకొండలు.

అప్పలకొండ "ఖుర్ధారోడ్ " రైల్వే స్టేషన్ లో లైసెన్సు పోర్టరు. స్టేషన్ లో కూలిగా మూటలు మోస్తే, గురవమ్మ రైల్వే కాలనీలో నాలుగిళ్ళలో పాచి పని చేసి తమ సంసారాన్ని పోషించేవారు. ఆర్భాటంగా కాకపోయినా వున్న దాంట్లోనే యిద్దరాడపిల్లలకు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపేరు. చిన్నప్పట్నించి మఖేష్ ని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. చేసేది కూలి పనైనా ఏది కావాలంటే అది కొనిచ్చేవారు గురవమ్మ, అప్పలకొండలు ముఖేష్ కి. ముఖేష్ కూడా బాగా చదివేవాడు. అన్నీ క్లాసుల్లో ఫస్టే. టెన్త్ చదవుతున్నప్పుడు ఓ రోజు ముఖేష్ స్కూల్ నుంచి రాగానే బ్యాగుని విసురుగా పడేసి గది తలుపులేసుకుని యెంత పిలిచినా పలక్కపోవడంతో కంగారుగా అప్పలకొండకి కబురుపెట్టింది గరవమ్మ. వెంటనే యింటికి చేరుకున్న అప్పలకొండ ముఖేష్ ని సముదాయించి తలుపులు తీసాక సంగతిని తెలుసుకున్నాడు. కొడుకు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు అప్పలకొండ తనో లైసెన్సు పోర్టరు కొడుకనీ, మిగిలిన క్లాసు పిల్లలంతా తనను "కూలీ..కూలీ.." అంటూ ఎగతాళి చేస్తున్నారని ఏడుస్తూ చెప్పాడు.

అప్పలకొండకి మతిపోయినంత పనయ్యింది. కొడుక్కి ఎలా సముదాయించాలో తెలియక, పెల్లుబుకుతున్న దు:ఖాన్ని దిగమింగి తమాయించుకొని...

"చూడు.. నాన్నా... నేను కూలీ గాడినే కానీ ఖూనీలు చేసే వాడిని కాదురా... ఒకళ్ళ బరువుని మోసి డబ్బు సంపాయిస్తున్నాను కానీ మోసం చేసి కాదురా... ఇంకొరి బరువుని నేను మోస్తే నా బతుకు బరువుని ఆ భగవంతుడు మోస్తాడనే నమ్మకం నాకుందిరా... అన్యాయంగా గడించి మేడల్లో మిద్దెల్లో వుండే కన్నా కాయకష్టం చేస్తూ పూరిగుడిసెలో వుంటేనే మేలురా... అక్రమార్జనతో పప్పన్నం తినే కన్నా కూలీ నాలి చేసుకు గంజినీళ్ళు త్రాగడం గొప్పరా... తల వంచి మూటలు మోస్తేనేం... సంఘంలో తలెత్తుకు తిరుగుతున్నారా... ఎంత సంపాదించామన్నది కాదురా ముఖ్యం... ఎలా బతికామన్నదిరా ముఖ్యం.. మనిషి జన్మెత్తాక పది మందికి ఉపయోగపడాలిరా... మొరిగే వీధి కుక్కలు కొండంత ఏనుగునేమీ చెయ్యలేవురా..."అని సముదాయించి, లే..లేచి ముఖం కడుక్కురా" అని కొడుకు భుజం తట్టాడు అప్పల కొండ.

ఈ మాటల్తోతన తల్లితండ్రులపై మరింత గౌరవం పెరిగింది మఖేష్ కు. ఆలోచనల నుండి తేరుకున్న ముఖేష్ ట్రైన్ ఖుర్ధారోడ్ లో ఆగడం గమనించి ట్రైన్ దిగాడు. అప్పటికే ప్లాట్ ఫాం పై ప్రకాశంగారు ముఖేష్ కోసం యెదురు చూస్తున్నారు. ప్రకాశం మాష్టార్ని చూడగానే తన తండ్రికేమయ్యిందో అడుగుదామనుకున్న ముఖేష్ కి దు:ఖంతో గొంతు పెగల్లేదు.

గ్రహించిన ప్రకాశంగారు "ప్రాణాపాయమేమీ లేదులే హాస్పటల్ లో వున్నాడు పద" అంటూ రిక్షాపై రైల్వే హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు . అప్పటికే తెగిన రెండు కాళ్ళకి ఫస్టెయిడ్ చేసిన డాక్టర్లు సరైన వైద్యం కోసం కటక్ "ఎస్ సి బి మెడికల్ కాలేజి హాస్పిటల్ " కి రిఫరెన్సు కాగితాలు రెడీ చేసి మఖేష్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్ చేరాక తండ్రి బెడ్ దగ్గరికి తీసుకెళ్ళారు ముఖేష్ ని. బెడ్ పైనున్న తండ్రిని చూసాక దు:ఖాన్ని ఆపుకోలేక భోరున విలపించాడు. గమనించిన అప్పలకొండ

"ఛా..యిదేంట్రా నాన్నా.. నాకిప్పుడేమయ్యిందని? మరేం పర్లేదురా.. కటకం పంపిస్తున్నారు కదా? మంచి మందులిస్తారు నయమవుతుందిలే నాన్నా...లేనిపోనివి మనసులో పెట్టుకుని నీ చదువు పాడుచేసుకోకు.."

ఈ పరిస్ధితిలో కూడా తన చదువుకై తన బాగోగులపై శ్రద్ధ చూపుతున్న తండ్రి పై మరింత గౌరవం పెరిగింది ముఖేష్ కు. ఎస్ సి బి మెడికల్ కాలేజి హాస్పిటల్ చేరగానే అప్పలకొండను అడ్మిట్ చేసుకొని పరీక్షించాక రెండు కాళ్ళ పాదాలు ట్రైన్ చక్రాల కింద నలిగిపోయాయని వాటిని తొలగించాలని ఏం పుటేషన్ డిక్లరేషన్ ఫాం పై సంతకం చెయ్యమన్నారు ముఖేష్ ని డాక్టర్లు. వణుకుతున్న చేతుల్తో,దు:ఖంతో కళ్ళనీరు నిండగా ఆ పని కానిచ్చాడు.

వెంఠనే ఆపరేషన్ ధియేటర్ కి తీసుకెళ్ళారు అప్పలకొండని. ఆపరేషన్ ధియేటర్ బైట బెంచిపై కూర్చున్న ముఖేష్ కి గతం గుర్తుకొచ్చింది. ఇంటర్ ఫస్టుక్లాస్ లో పాసయ్యాకా"ఏం చేస్తావురా నాన్నా..?" అన్న తండ్రితో "ఇంజనేరింగ్ చదువుదామనుకుంటున్నా" అన్నాడు తండ్రి స్ధోమత తెలిసికూడా.

"సర్లే నువ్వు నీ ప్రయత్నాల్లోవుండు నా ప్రయత్నం నేచేస్తా" అన్నాడు అప్పలకొండ. రాత్రనక పగలనక కష్టపడ్తూ అడిగినంత ఏనాడూ లేదనక యిస్తూనే వున్నాడు. కడుపు కట్టుకొని కాలేజి ఫీజులే కాక ప్రాక్టికల్స్ కీ,ప్రాజక్ట్ లకి, స్టడీ టూర్లకీ పంపుతూనే వున్నారు గురవమ్మ,అప్పలకొండలు. తల్లితండ్రులను మరింత కష్టపెట్టడం యిష్టంలేక అప్పుడప్పుడు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పుస్తకాలవీ కొనుక్కొనేవాడు ముఖేష్.

ఎంత సేపు గడిచిందో తెలియని ముఖేష్ స్టేషన్ మాష్టర్ ప్రకాశం వచ్చి "ఆపరేషన్ పూర్తయ్యింది పద" అంటూ భుజం తట్టగా వాస్తవాని కొచ్చాడు.

***

స్పృహ లేక బెడ్ పైనున్న అప్పలకొండ దగ్గరికి చేరారిద్దరూ. రెండు కాళ్ళూ పాదాల పైన మూడించీల వరకూ తొలగించి కట్టుకట్టారు. తండ్రి పరిస్ధితిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్న ముఖేష్ ని సముదాయించి ధైర్యం చెప్పారు ప్రకాశం మాష్టారు.

"నీతికీ, నిజాయితీకి మరో పేరే మీ నాన్నోయ్.....అందుకే తనంటే నాకు యెంతో యిష్టం.

విధి విలాసాన్ని తప్పించలేం...ఇలా జరిగిందని కృంగిపోయి నీ చదువును పాడుచేసుకోకు. ఎలాగూ పై యేటితో చదువు ముగుస్తుంది. కష్టపడి శ్రద్ధతో పూర్తి చెయ్యి. గాయాలు మానడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. ఎలాంటి సహాయానికైనా నేను నీకు, మీ నాన్నకూ తోడుగా వుంటానన్న మాట మర్చిపోకు...ధైర్యం తెచ్చుకో" అన్నాడు ముఖేష్ తో.

"అలాగే సర్" అందామనుకున్న ముఖేష్ కి దు:ఖంతో గొంతుపెగలక పోడంతో కళ్ళతో కృతజ్ఞతలు తెల్పాడు. పది రోజులు హాస్పిటల్ లో తండ్రి దగ్గరున్నాడు ముఖేష్ .చదువు పోతుందని తండ్రి బలవంతంతో బరువెక్కిన మనస్సుతో హాస్టల్ కి తిరుగు ప్రయాణమయ్యాడు ముఖేష్.

***

సెమిస్టర్లూ, ప్రాజక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడిచి పోయాయి. ఈ మద్య కాలంలో తల్లితండ్రులను కలవడమే కుదర్లేదు ముఖేష్ కి. అడపాదడపా ప్రకాశం మాష్టరే వాళ్ళ బాగోగులు ఫోనులో తెలియపర్చి అవసరమయినప్పుడల్లా ఆర్ధకంగా సహాయపడేవాడు.

***

ముఖేష్ కి బిటెక్ పూర్తయ్యాక కేంపస్ సెలెక్షన్ లో వోపేరున్న కంపెనీ లో సం।। 9 లక్షల పేకేజి తో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తయ్యాక బెంగుళూర్లో ఉద్యోగంలో జాయనయ్యేడు.

"ఫ్యామిలీ షిఫ్టింగ్" కి కంపెనీ పెర్మిషన్ తో ఖుర్ధారోడ్ చేరుకున్నాడు ముఖేష్. ట్రైన్ దిగగానే పరుగులాంటి నడకతో యిల్లు చేరి తలుపులు తట్టాడు. తలుపు తీసిన తల్లిని పట్టించుకోకుండా తండ్రికై అతని కళ్ళు వెతుకులాడాయి.రెండు కాళ్ళూ పోయి మంచానికే పరిమితమయిన తండ్రిని చూడగానే మనస్సు చివుక్కుమంది ముఖేష్ కి.

తననో మనిషిని చేయాలనే తపనతో రాత్రనక, పగలనక కూలీగా యెందరెందరివో మూటలు మోసి తన్నింతటి వాణ్ణి చేయడానికి యెన్నో పరుగులు పెట్టి చివరకు తన రెండు కాళ్లు పోగొట్టుకున్న తండ్రి యిలా నిస్సహాయంగా మంచం కే పరిమితమవడం జీర్ణించుకోలేకపోయాడు.

స్నానం ముగించి కంపెనీ వారిచ్చిన లేప్ టాప్ తీసి వెదకడం మొదలెట్టాడు. దగ్గర్లోనే కటక్ జిల్లాలో "ఫుల్ నకరా" దగ్గరున్న "ఒలట్ పూర్ బొయిరాయి" అనే వూర్లో "స్వామివివేకానంద ఇనిష్టిట్యూట్ ఆఫ్ రిహాబిలేషన్ ట్రైనింగ్ & రిసెర్చ్ " సెంటర్ లో "డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎంపవర్ మెంట్ ఆఫ్ పెర్సన్స్ విత్ డిసెబిలిటీస్" లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని గుర్తించాడు.

తండ్రిని అక్కడికి తీసుకెళ్తే ప్రయోజనముంటుందనుకున్నాడు. ఆలస్యం చెయ్యక తండ్రితో పాటూ తల్లిని తీసుకొని "ఒలట్ పూర్ బొయిరాయ్" చేరాడు.

పరీక్ష చేసిన డాక్టర్లు అప్పలకొండకి కృత్రిమకాళ్ళు అమర్చడానికి అంగీకించారు. కొలతలకూ,ట్రైనింగ్ కీ నాలుగైదు నెలలవుతాయని జాయిన్ చేసుకున్నారు. ట్రైనింగ్ పూర్తవ్వగానే తెలియపర్చమని తల్లిని దగ్గరుంచి శలవులు ముగియడంతో బెంగుళూరు చేరాడు ముఖేష్.

***

ఆరునెలలు గడిచాయి.

ఓ రోజు "శిక్షణ పూర్తయ్యిందనీ, తన తండ్రికి కృత్రిమ కాళ్ళమర్చడం పూర్తయ్యిందనీ, వాటితో తను సవ్యంగా నడవగలుస్తున్నాడనీ" వచ్చిన మెసేజ్ చూసిన ముఖేష్ ఆనందానికి అవధుల్లేవు. కంపెనీ లో పర్మిషన్ తీసుకుని ఖుర్ధా వెళ్ళడానికి దగ్గర్లో వున్న భువనేశ్వర్ కి బెంగుళూరు నుంచి ఫ్లైట్ లో రానూపోనూ టిక్కెట్ట్లు బుక్ చేస్కొని బయల్దేరాడు ముఖేష్.

భువనేశ్వర్ చేరగానే టాక్సీ చేయించుకుని ఒలట్ పూర్ చేరి డాక్టర్ల పర్మిషన్ తో తండ్రిని కలిసాడు. అల్లంత దూరాన్నుంచి కొడుకుని చూసిన అప్పలకొండ అమర్చిన కృత్రిమకాళ్ళతో కొడుకుని చేరి వాటేసుకున్నాడు. పట్టలేని ఆనందంతో. డిస్చార్జ్ చేసాక యింటికి తీసుకొచ్చి తండ్రికి నచ్చచెప్పి తనతో పాటూ బెంగుళూరు ప్రయాణానికి సిద్ధమవమనీ తల్లికి చెప్పాడు

"అలాగేరా" అనంటే యెంతో హ్యేపీగా ఫీలయ్యాడు ముఖేష్.

***

మూడ్రోజుల తర్వాత...

తల్లిని, తండ్రిని తీసుకుని టేక్సీలో భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు ముఖేష్ బెంగుళూరు వెళ్ళడానికి.

ఎయిర్ పోర్ట్ లో పోర్టర్ని పిలిచి వీల్ ఛెయిర్ తెమ్మన్నాడు తండ్రిని తీసుకెళ్ళడానికి.రైల్వే పోర్టరయిన తనను ఎయిర్ పోర్టు పోర్టరు వీల్ ఛెయిర్ సహాయంతో ఫ్లైటెక్కి స్తే గర్వంగా ఫీలయ్యి బెంగుళూరు చేరుకున్నారు అప్పలకొండ గురవమ్మలు.

***

బెంగుళూరు వాతావరణానికి అలవాటు పడ్డారు అప్పలకొండ,గురవమ్మలిద్దరూ. మంచి సంబంధం చూసి పెళ్లికూడా చేసారు మఖేష్ కి.కొడుక్కి తగ్గట్టుగా సంస్కారవంతురాలు కోడలు పిల్ల. చూస్తుండగానే ఐదేళ్ళు యిట్టే గడిచిపోయాయి.ఇప్పుడు అప్పలకొండ,గురవమ్మ యిప్పుడు తాత,నాయనమ్మలు.

***

రోజూ మనవడ్ని స్కూల్ కి దిగబెట్టాక స్నానం చేసి కాసేపు పూజ చేసుకోడం అలవాటు అప్పలకొండకి. పూజలంటే పెద్దగా యేమి తెలియకపోయినా యెప్పుడో పుట్టపర్తి వెళ్ళొచ్చాక రిటాంగ్ కోలనీ" సత్యసాయి సమితి" లో నేర్చుకున్న "సర్వేజనాం సుఖినో భవంతు...లోకా సమస్తా సుఖినో భవంతూ" అని మనస్సులో దేవుణ్ణి ప్రార్ధిస్తాడు అలా ప్రార్ధన ముగిసాక కళ్ళు మూసుకొని కూర్చున్న తను ఆలోచనా వలయాల్లో చిక్కుకున్నాడు.పెంచీపెద్దజేసి, విద్యాబుధ్ధులు నేర్పిన తల్లితండ్రులను పెరిగి పెద్దవారయి మంచి ఉద్యోగస్తులయ్యాక వారు పడ్డ కష్టాల్ని మరిచి నిర్దాక్షిణ్యంగా వృధ్ధ్రాశ్రమాలకు చేర్చే నేటి యీ సమాజంలో, పాచిపన్లు చేసే భార్యనూ, రైల్వేకూలీగా మూటలుమోసే తనను "అమ్మానాన్నలు" గా స్నేహితులకు పరిచయం చేస్తున్న కోడలు,కొడుకులను తల్చుకొని తన అదృష్టానికి మరిసిపోసాగాడు.

"మామయ్యగారూ టిఫిన్ కి రండి" అన్న కోడలు ఆప్యాయపు పిలుపుతో ఆలోచన్లకు బ్రేక్ వేసి లేచాడు.

తనతో పాటుగా టిఫిన్ కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కొడుకు,కోడల్ని చూస్తూ "మేమెంతో అదృష్టవంతులంరా...ఈ జన్మకి మాకిది చాలురా.." అన్నాడు.

"అదేంటి మామయ్యగారూ.. అలా మూడీగా మాట్లాడుతున్నారు..?"

కోడలి ప్రశ్నకి "అది కాదమ్మా..రెక్కలొచ్చిన పక్షలు గూటిని వీడి యెగిరిపోడం ప్రకృతి సహజం"

పిల్లల్నికని , తాము తిన్నా తినక పోయినా పెంచిపెద్దజేసి,విద్యాబుద్దులు నేర్పి మంచి ఉద్యోగస్ధులవ్వాలని అహోరాత్రాలు శ్రమించి వారి భవిష్యత్తుకై పునాదులు వేస్తున్న కన్నవారి కష్టాల్ని మరచి పదిమందిలో తల్లితండ్రులుగా పరిచయం చెయ్యడం చిన్నతనంగా భావిస్తూ వృధ్దాశ్రమాలకో, అనాధాశ్రమాల్లోనో వదిలేసే నేటి యువతరం మిమ్మల్ని చూసి బుద్ది తెచ్చుకోవాలమ్మా"

"కూలీగా మూటలు మోస్తూ అవిటివాణ్ణయిన నన్నూ,పనిమనిషి లా పాచిపన్లు చేసే నా భార్యని అత్తామామలుగా కాక అమ్మానాన్నలు లా ఆదరిస్తూ మీ సుఖసంతోషాలకు మేము గుదిబండలం కాదనుకునే నీలాంటి పిల్లని భార్యగా పొందిన ముఖేష్ అదృష్టవంతుడమ్మా"

"నిన్నింత సంస్కారవంతురాలిగా పెంచి పెద్దజేసిన నీ తల్లితండ్రులకు శతకోటి వందనాలమ్మా"

నీలాగే ప్రతీ తల్లితండ్రులు వారి పిల్లలకి చదువుసంధ్యల్తో పాటూ పెద్దల్నిగౌరవించాలనే మంచి సంస్కారాన్ని కూడా నేర్పితే...

"లోకాన్ సమస్తా సుఖినో..భవంతు..!"

"సర్వేజనాం సుఖినో..భవంతు...!" అన్నాడు అప్పలకొండ చెమ్మగిల్లిన కళ్ళతో...

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల