పిచ్చిది - చామర్తి భానులింగమూర్తి

pichhidi story

ఉదయం ఇంటిలో కూర్చొని పేపర్ చదువుతున్న నాకు, వీధిలో పిల్లల కేకలు, పెద్దవాళ్ళ అరుపులు వినిపించాయి. ఏమిటా హడావిడని వీధిలోకి వచ్చి చూసిన నాకు ఒక ‘పిచ్చిదాని'పై కొంత మంది పిల్లలు రాళ్లు విసురుతూ వెంట తరుముతూ, పెద్దలు కొంత మంది కసురుతూ పొమ్మని తిడుతూ కనిపించారు. ఆ పిచ్చిదాని ఒంటిపై ఆచ్ఛాదన పేరుకి ఉండాలని ఉన్నట్లుంది. చీర బాగా చిరుగులు పడి జీర్ణావస్థలో ఉంది. ఆ చీర తప్ప ఒంటి మీద మరేమి ఆఛ్ఛాదన లేదు. కాళ్లు బాగా మట్టి కొట్టుకు పోయి, జుట్టంతా తైల సంస్కారం లేకుండా జడలు కట్టి ఉంది. చేతులకి ఎవరు ఇచ్చారో లేక ఎక్కడ దొరికాయో రంగు వెలిసిన గాజులతో ఒక బట్టల మూట పట్టుకొని ఉంది. తిని ఎన్ని రోజులైందో శరీరమంతా శుష్కించి, మనిషి నీరసంగా ఉంది. ఎక్కడనించి వచ్చిందో మరి పాపం. వెంట తరుముతున్న పిల్లలని తిడుతూ, పెద్దగా అరుస్తూ, అర్ధం లేని మాటలు ఏవో మాటలు మాట్లాడుతూ.. పక్క వీధి లోకి పోయింది. అది అరవడం, దాని మాటలు..పిల్లలకి సరదాగా ఉండగా, పెద్దలు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆమెకే కనుక మతి స్థిమితం ఉండి ఉంటే ఆ వయసు పిల్లలు, చోద్యం చూస్తున్న పెద్దల వయసున్న భర్త ఒక చక్కని సంసారం ఉండేది.

వీధిలో నుండి ఇంటిలోకి వచ్చి ఆ పిచ్చి దాని గురించి ఆలోచిస్తూ పేపర్ చదువుతున్న నాకు పేపర్ లో విషయాలు ఏవీ తలకెక్కడం లేదు. మనసంతా అదోలా అయిపోయింది. ఆలోచనలన్నీ ఆ పిచ్చిదాని పైకి పోయాయి. 'పాపం! ఏ పాపం చేసిందని అందరూ ఛీత్కారంగా చూస్తారు.. తను కూడా మనలాంటి మనిషే కదా... దాని ఖర్మ బాగోలేక ఎవరో పెట్టిన కష్టాల వల్లోనో, పరిస్థితుల ప్రభావం వల్లనో ఇలా అయి పోయి ఉంటుంది. తను కూడా ఒక మనిషే కదా... తనకి కూడా ఆకలి, చలి ఉంటాయి కదా...’ అని అనుకొన్నాను .

ఆ పిచ్చిదాని ఆలోచనలు ఒక్కసారి నా బాల్యాన్ని గుర్తు చేశాయి. ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నా బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.

******

నా చిన్నతనం లో మా ఇంటిలో కొద్దిగా మతిస్థిమితం లేని ఒక స్త్రీ పని చేస్తూండేది. దానిని అందరూ 'పిచ్చిదీ అని పిలుస్తూ ఉండేవారు. తాను పేరుకి పిచ్చిదే కానీ మామూలు వ్యక్తుల లాగే ప్రవర్తిస్తూ వుండేది. కానీ అప్పుడప్పుడు మాత్రం తీవ్రంగా ప్రవర్తిస్తూ వుండేది. తను మా ఇంట్లో చేరడం కూడా చాలా చిత్రంగా జరిగింది.

ఎక్కడ నించి వచ్చిందో తెలీదు కానీ, మా వీధిలో తిరుగుతూ ఎవరైనా తిండి పెడితే తింటూ లేకపోతే పస్తులతోనే వీధి లోని రామాలయంలో అరుగుల మీద పడుకునేది. ఎవరికీ ఏ హాని చేసేది కాదు. అయినా కొంత మంది దానిని తిడుతూ ఛీత్కారంగా చూసేవారు. అలా తనని చూస్తున్న మా అమ్మకు జాలి కలిగి రోజూ పిలిచి అన్నం పెట్టడం ప్రారంభించింది. కట్టుకోవడానికి పాత చీరలు ఇచ్చింది. గుడి పక్కన ఖాళీ గా ఉన్న గుడిసెలో తను ఉండడానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళని ఒప్పించింది. అలా మా అమ్మకు చేరికై , రోజూ మా ఇంటి గుమ్మం ముందు వచ్చి కూర్చొనేది. ఎవరినీ ఏమి అనేది కాదు. కానీ ఏవేవో పిచ్చి మాటలు గాలిలో ఎవరితోనో మాట్లాడుతుండేది. చిన్న పిల్లాడినైన నాకు వీధిలో కూర్చున్న తనని చూస్తే భయం వేసేది కాదు కానీ, తన మాటలు, వేషం అదీ తమాషా గా అనిపించేది. అమ్మ తనకి అన్నం పెట్టడానికి వీధి లోకి వెళ్లినప్పుడు నేను అమ్మ కొంగు పట్టుకొని, దాక్కొని తనని చూసేవాడిని.

మెల్ల మెల్ల గా అది మా అమ్మ దగ్గర చేరికై, మా అమ్మని ‘ఏమేవ్ ‘అనో ,’ .. ‘చెల్లనో’ పిలుస్తూ ...' అన్నం పెట్టవే ' .. అని అడుగుతూ ఉండేది. మొదట దాని సంభోదనకి అమ్మ విస్తుపోయినా 'పాపం మంచి మనసు తో పిలుస్తోందని ' అలా ఆ పిలుపికి అలవాటు పడి పోయింది.

అమ్మ మెల్లగా… శుచి శుభ్రత దానికి అర్ధమైనట్లు ఓపికగా చెప్పి కొంత మార్పు తనలో తీసుకొచ్చింది. వీధిలో ఎవరు చెప్పినా వినేది కాదు కానీ .. మా అమ్మ మాటలను మాత్రం వినేది ఏవో పిచ్చి మాటలు మా అమ్మను అంటూ... .

వీధిలో ఇంటి అరుగు మీద కూర్చొని మా అమ్మ చేసే పనులను చూస్తూండేది.

ఒక రోజు ఉదయాన్నే మా అమ్మ లేచి, ఎప్పటి లాగే వీధి వాకిలి తుడుద్దామని చూస్తే... చక్కగా తుడిచేసి ఉంది. అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంటే, పక్క ఇంటి వాళ్ళు, 'ఆ పిచ్చిది తుడిచేసి పోయింది' అని చెప్పారు. అమ్మకి చాలా ఆశ్చర్యం అనిపించింది.

మధ్యాహ్నం ఎప్పటిలాగే పిచ్చిది మా ఇంటికి వచ్చి 'ఒసే అన్నం పెట్టే' అంటూ మా అమ్మని పిలిచింది. అప్పుడు అమ్మ నవ్వుతూ 'ఏమే .. నువ్వే నా వీధి గుమ్మం తుడిచావా.. బాగా తుడిచావే ' అంటూ.. అన్నం పెట్టింది. ఎప్పుడూ దాని మొహం లో కనబడని చిరునవ్వు ఆ రోజు మొదటి సారి చూసాము.

అమ్మ మెల్లగా దానికి ఒకటి రెండు పనులు చేయడం ఓపికగా నేర్పింది. అలా మెల్లగా వీధి గుమ్మం తుడవడం, వీధి చివర్లో ఉన్న మంచి నీళ్ల బావి నుండి నీళ్లు తేవడం, గిన్నెలు కడగడం లాంటి పనులు చేస్తూ వుండేది. మళ్ళీ ఎవరింటిలోనూ పని చేసేది కాదు. అప్పుడప్పుడు పని చేస్తూ.. చీపురు గోడకేసి కొడుతూ ఎవరినో తిడుతూ ఉండేది. అమావాస్యకి, పున్నమికి మాత్రం దాని ప్రవర్తన విపరీతంగా ఉండేది, కానీ ఎవరికీ హాని మాత్రం చేసేది కాదు. మొదట్లో దానికి పనులు చెప్పి చేయించడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు. కానీ అమ్మ “పోనీలెండి పాపం! అదెక్కడికి పోతుంది. ఇంకెక్కడా ఎవరింటిలోనూ పని చేయదు. దానిమానాన దాన్ని వదిలేస్తే అదే శుభ్రంగా పని చేస్తుంది. మధ్యలో మనం ఏదైనా చెప్పామంటే తిట్లు లంకించుకుంటుంది. దానికింత తిండి పెడితే మనకీ పుణ్యమే కదా.." అంటూ సర్ది చెప్పేది.

ఇంటిలో అన్ని పనులూ చేస్తూ... తనదే ఆ ఇల్లు అన్నట్టు ప్రవర్తించేది. చిన్న పిల్లలమైన మాకు స్నానాలు కూడా చేయించి , స్వంత పిల్లలులాగా చూసుకొనేది. మొదట్లో దాని ప్రవర్తన, ఆకారం చూసి దగ్గరకు వెళ్ళడానికి భయపడే మేము... నెమ్మదిగా దాని ప్రవర్తన, మాటలు అలవాటయిపోయేయి. తన చేష్టలు మాకు నవ్వు తెప్పించేవి. తనతో చేరికగా ఉండేవాళ్ళం . ఇంటిలో అందరి కన్నా నేను చిన్నవాడిని అవ్వడం వల్ల నన్ను చంకలో వేసుకొని వీధిలోకో.. బజారుకో తీసుకొని వెళ్లిపోతూ ఉండేది. అమ్మకేమో భయం. 'వాడిని ఎత్తుకోకే.. చిన్న పిల్లాడు.. ఎక్కడైనా వదిలేస్తావ్' అంటే "పరవాలేదులేవే.. వాడు నా కొడుకు. నా కొడుకుని నేను వదిలేస్తానా" అంటూ నన్ను చంక నేసుకొనేది.

అమ్మ తనకి ప్రతి నెలా కొంత డబ్బులు ఇచ్చేది ఏమైనా కొనుక్కోమని. మాకు అప్పుడప్పుడు మిఠాయిలు, బిస్కట్లు కొని ఇచ్చేది. 'వాళ్ళకెందుకే నువ్వు కొంటావు. పిల్లలకి నేను కొంటాను కదా.. నువ్వు జాగ్రత్తగా దాచుకో..' అంటే "డబ్బులతో నాకేంటవసరం?.. అయినా నా పిల్లలకి నేను ఇస్తున్నాను.. నీకేంటి మధ్యలో' అని అంటూ ...

'మేము తన పిల్లలమేనని, మా అమ్మ తననుండి బలవంతంగా లాగేసుకొందని' మాతో చెబుతూ ఉండేది. అమ్మ అది వింటూ 'సరిపోయింది దీని పిచ్చి' అని నవ్వుకొంటూ వెళ్ళిపోయేది.

వీధిలో అందరూ 'మీరు దానిని ఎలా భరిస్తున్నారండి?’ అంటూ …’ అది మీ ఇంటిలో తప్ప ఎవరింటిలోనూ పని చేయదు... ఎవరైనా పని చెప్పినా తిడుతుంది. తనని మీరు చూసినట్టు ఇంక ఎవరూ చూడరు.' అని అంటూ ఉండేవారు.

కానీ తను ఒక్కో సారి ఇంటిలో పని చేస్తూ.. చేస్తూ .. మధ్యలో వదిలేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళి పోతూ ఉండేది. ఎక్కడికి వెళ్లేదో తెలిసేది కాదు. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉండేది. తిరిగి వచ్చిన తరువాత 'ఎక్కడికి వెళ్ళావే?.. ' అని అడిగితే .. ఏవో అర్ధం కాని ఊర్ల పేర్లు చెపుతూ.. ఎవరో ఒక వ్యక్తిని తిడుతూ .. అర్ధం కాని మాటలు మాట్లాడుతుండేది.

అలా మాకు తను మధ్యలో వెళ్లిపోవడం .. తిరిగి రావడం అలవాటై పోయింది. అప్పుడప్పుడు అమ్మ దానిని 'నీ పేరెమిటె ? ఏ ఊరు నీది ? ' అని అడిగితే .. 'నీ పేరే నాపేరు .. నీ ఊరే నా ఊరు ' అనేది. 'మీ ఆయన ' ఎవరంటే మాత్రం దానికి ఎక్కడ లేని కోపం వచ్చేసేది. గట్టిగా ఏదో తిడుతూ.. అరుస్తూ గుడిలోకి వెళ్ళి పోయేది .

అలా చాలా సంవత్సరాలు మా ఇంటిలో పని చేసింది. ఎవరికీ దాని పేరు తెలీక పోవడం వల్ల అందరూ దానిని 'పిచ్చిదనే' పిలిచే వారు. అలా దానికి ఆ పేరే స్థిరం అయి పోయంది. తను కూడా అమాయకత్వం తో అలా ఎవరు పిలిచినా ఏమీ అనేది కాదు. మాకు మాత్రం దానిని అలా పిలుస్తుంటే చాలా బాధ వేసేది. మా ఇంటిలో ఒక సభ్యురాలిగా కలిసి పోయింది.

అలా ఆ 'పిచ్చిది' మా ఇంటిలో పనిచేస్తూ...పనిచేస్తూ....ఎక్కడికో వెళ్లి వస్తుండే ఆ పిచ్చిది, ఒకసారి అలా వెళ్లి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. ఎన్నో రోజులు.. నెలలు.. గడిచి పోయాయి. అయినా తను తిరిగి రాలేదు. అమ్మ నిరంతరం తన కోసమే ఆలోచిస్తూ ఉండేది. 'ఎక్కడికి పోయిందో?.. ఎలా వుందో?...' అని కలవర పడుతూ ఉండేది.

మేము కూడా స్కూల్ వదిలిన తరువాత.. ఎక్కడైనా కనిపిస్తుందేమోనని బస్సు స్టాండ్ లోను.. రైల్వే స్టేషన్ వద్ద ఆశగా వెతుకుతుండేవారం.

ఎన్నో సంవత్సరాలు గడిచి పోయాయి.. కానీ ఆ పిచ్చిదాని జాడ మాత్రం కనిపించ లేదు. అసలు ఈ ప్రపంచం లో ఉందో లేదో కూడా తెలియదు. కాలంతో పాటు మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం. ఇప్పటికీ మా మనసులో ఆ 'పిచ్ఛిది' మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోయింది.

అలా ఆ పిచ్చిదాన్ని గురించి ఆలోచిస్తూ వర్తమానంలోకి వచ్చిన నాకు మనసంతా చేదుగా అయి పోయింది.

నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూంది..అసలు మామూలు మనుషులు పిచ్చివాళ్ళెలా అవుతారు? మనిషిలోని కోపం...కసి...ద్వేషం...ప్రేమ...పంతం....ఉండవలసినవాటికన్నా తారాస్థాయికి చేరినప్పుడు వాటిని తట్టుకోలేని మనసు అదుపు తప్పిపోతుందా? ఏమో....కొంతమంది అలా "పిచ్చివాళ్ళుగా" మారిపోతుంటే, మరికొంతమంది పిచ్చికి వేరేవాళ్ళు బలైపోతున్నారేమో....ప్రతిరోజూ మనం పేపర్లలో, వార్తల్లో చూస్తున్న కిడ్నాపులూ...ప్రేమ హత్యలూ...పరువుహత్యలూ...ఇవన్నీ కూడా రకరకాల పిచ్చికి పరాకాష్టలేమో....కులం పిచ్చి...డబ్బు పిచ్చి...ప్రేమ పిచ్చి....అధికారపిచ్చి....

ఈ రాక్షస పిచ్చి నుంచి సమాజాన్ని రక్షించేవారెవరు భగవంతుడా.....

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల