శృతి తప్పిన రాగం - దువ్వి రాజేష్

sruti tappina ragam

ప్రియమైన మీకు,

ఈ ఉత్తరం మీరు చదువుతున్నారు అంటే నేను మీకు, ఈ లోకానికి అందనంత దూరంలో ఉన్నాను అన్న మాట. జీవితం అంటే కోటి ఆశలు అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయిని. కానీ ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులు మనలోని మంచిని చూసి వంచన చేయాలనుకునే వారే ఎక్కువ. ఏది నిజం ఏది భ్రమ అని తెలుసుకునే లోగా ౩౦ ఏళ్ళ నా జీవితానికి నూరేళ్లు నిండిపోయాయి. నేను నీ దగ్గర నుండి వెళ్లిన తరవాత ఏమి జరిగిందో నీకు చెప్పాలని,నీ పాదాలని నా కన్నీటితో కడగాలి అని ఎంతో ట్రై చేశాను, కానీ భగవంతునికి నా మీద దయ కలగలేదు.

ఆ రోజు నీతో గొడవపడి నన్ను నీవు అర్ధం చేసుకోవడం లేదని ఇంట్లో నుండి బయటికి వచ్చిన నాకు ఎంతో ఇష్టమైన నా చిన్న నాటి ఫ్రెండ్ గౌతమ్ కనిపించాడు, తన ఇంటికి తీసుకువెళ్లి మర్యాదలు అవి చేసి నా గురించి అన్ని వివరాలు కనుక్కుని, నన్ను తన తోనే ఉండమని, కాలేజీ డేస్ నుండి నేను అంటే ఒక రకమైన ఇష్టమని, దేవుడు మనలని ఇలా కలిపినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. మనసులో నేను ఉన్నందున ఎవరిని పెళ్లి చేసుకోలేదని నాకు తోడు నీడగ ఉంటానని మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేసి నేను అక్కడే ఉండేలా చేసాడు. గౌతమ్ తో కొంత కాలం బాగానే ఉంది, పెళ్లి చేసుకుందాం సంప్రదాయం ప్రకారం అడిగే సరికి అతని నిజ స్వరూపం బయట పడసాగింది. పెళ్లి ఎందుకు సహజీవనం సరిపోతుంది కదా అనేవాడు. నేను ఎవరితో మాట్లాడినా అనుమానమే, నా మీద కంటే నా సంపాదన మీదే తనకి ఎక్కువ ప్రేమ. అకౌంట్స్, కార్డ్స్ అన్ని తాను మేనేజ్ చేస్తానని నా దగ్గర ఏమి లేకుండా చేసాడు. నేను తప్పు చేసానని తెలిసేసరికి అది సరిదిద్దుకోలేని తప్పు అయింది.

అమ్మ నాన్న లేని నాకు అన్నయ్యవి అయిన నువ్వు కష్టపడి నన్ను పెంచితే చివరికి నీకు కూడా గౌరవం ఇవ్వకుండా, నీ మాట వినకుండా ఇలా చేసిన నా మీద నాకే అసహ్యం వేసింది. ప్రేమ, ఆకర్షణ ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి సృష్టించినవే గాని వారిని సరి అయిన దారిలో పెట్టేవి మాత్రం కాదు. తల్లితండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటే కష్టకాలం లో మనలని ఆదుకొని ధైర్యం చెప్తారు. గౌతమ్ ఒకరోజు బాగా తాగి ఇంటికి వచ్చాడు ఇదేమి కొత్త అలవాటు అని అడిగిన నాకు షాక్ తగిలే సమాధానాలు చెప్పాడు. నేను తన లైఫ్ లోనికి వచ్చినప్పటి నుండి తనకి దరిద్రం పట్టుకుందని, మనఃశాంతి కరువు అయిందని, తాను పైకి ఎదగక పోవడానికి నేనే కారణం అని చాలా రకాలుగా నన్ను నిందించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పుకోవాలో తెలియదు, బ్రతుకు, భవిష్యత్తు సూన్యం అనిపించింది. రోజూ పేపర్లో చదువుతున్నాను మహిళా సంఘాలు, మహిళా పోలీస్ స్టేషన్స్, విమెన్ సెంటర్స్ నాలాంటి వారిని చేరదీసి ఆదుకుంటారని. ఏదో తెలియని పిరికితనం, నాకు అండగా ఎవరు లేరని భయం నాలో నేనే కుమిలిపోయాను. రోజులు గడిచే కొలది జీవితం మీద ఒక రకమైన విరక్తి, చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గిపోయింది. గౌతమ్ తో సహజీవనం చేయాలని లేదు ఇక బయటికి వెళ్లి ఒంటరిగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను.

ఆ రోజు 18-08-2018, సాయింత్రం ఆఫీస్ నుండి రాగానే గౌతమ్ తో 'ఇంకా మనం కలిసి బతకలేము రోజూ గొడవపడుతూ బాధపడుతూ జీవితాలని నరకం చేసుకునే బదులు విడిపోయి హ్యాపీగ ఎవరి బ్రతుకు వారు బ్రతుకుదాం’ అనగానే వాడి ముఖములో రంగులు మారడం గమనించాను. ఇంతవరకు నేను చూసిన గౌతమ్ ఒక ఎత్తు అయితే ఈ రోజు నేను చూసిన గౌతమ్ మరొక ఎత్తు. నా డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. పైగా నేను బయటికి వెళ్తే నాకే ప్రమాదమని వార్నింగ్ ఇచ్చాడు, ఇంట్లోంచి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. కాదని తెగించి వెళ్తే మొబైల్ లో ఉన్న పర్సనల్ ఫొటోస్ ని అస్లీల వెబ్సైట్ లో upload చేస్తానని బెదిరించాడు. అంతే ఒక్కసారిగా అతని వికృత చేస్టలుకి కుప్ప కూలిపోయాను.

ఆడపిల్ల ఆకాశమంత ఎత్తు ఎదగాలని చదివించిన తల్లితండ్రులు గుర్తు వచ్చారు, స్త్రీకి స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పోరాడిన వనితలు గుర్తు వచ్చారు, కానీ ఏమి లాభం మనకి బుద్ధి ఉండాలి కదా. నేను చదివిన చదువు, నాకు ఉన్న స్వేచ్ఛ, అభివృద్ధి చెందిన టెక్నాలజీ నా పతనం వైపు అడుగులు వేసేలా చేసాయి. తప్పు ఎవరిది? ఆలోచించడానికి అవకాశం లేదు, బ్రతకడానికి దారి లేదు, బ్రతకాలని ఆశ లేదు. జీవన రాగం శృతి తప్పింది, మరణమే శరణం. అందుకే శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నా. నా కథ, నా వ్యధ కొంత మంది అమ్మాయిల్లోనైనా మార్పు తీసుకు వస్తుందని ఆశతో నీకు చివరిసారిగా ఈ ఉత్తరం రాసాను.

ప్రేమ జీవితం లో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాకూడదు.

ప్రేమతో
నీ చెల్లెలు
వీణ

రచయిత మనవి: నేటి అమ్మాయిలకి చదువుతో పాటుగా పరిస్థితులను ఎదుర్కోగలిగే ఆత్మస్థయిర్యం, ధైర్యం ఉండాలన్నదే ఈ కథ ఉద్దేశ్యం. ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati