పరువు కోసం! - పద్మావతి దివాకర్ల

paruvukosam

‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాడు మాధవరావు తన కూతురు కమల పెళ్ళి కుదరడంతో. అప్పుడే కలసిన మధ్యవర్తి ఈ శుభవార్త తేవడంతో అనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మాధవరావు. ఇప్పటికే మగపెళ్ళివారు కోరే కట్నమిచ్చుకోలేక, వాళ్ళ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక చాలా సంబంధాలు వదులుకున్నారు వాళ్ళు.

చాలా సంబంధాలు అన్నివిధాల కుదిరి చివరికి కట్నకానుకల వద్ద తప్పిపోయేవి. అందమూ, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాకూడా తగిన డబ్బు లేకపోవడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కూతురి పెళ్ళి చేయగలనో లేదో అని కూడా బెంగ పెట్టుకున్నాడు మాధవరావు. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. చివరికి మంచి సంబంధమే కుదిరింది. పెళ్ళికొడుకు మహేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. పైగా అతని తల్లితండ్రులకి కట్నంపై ఆశలు కూడా లేవు. వాళ్ళు మంచి స్థితిమంతులు కూడా. పెళ్ళికొడుకు మహేష్‌కి కమల బాగా నచ్చి, కానీ కట్నం లేకుండా పెళ్ళికి ఒప్పుకోవడంతో కూతురి అదృష్టానికి పొంగిపోయాడు.

మాధవరావు ఇంటికి చేరగానే ఈ వార్త భార్య శారదమ్మకి తెలుపగా ఆమెకూడా చాలా సంతోషించింది."పోనీలెండి. ఇన్నాళ్ళు వేచి ఉన్నందుకు ఇప్పటికైనా మంచి సంబంధం దొరికింది. బంగారంలాంటి పెళ్ళికొడుకు. కాబోయే అత్తమామలు కూడా చాలా మంచివారు. అంతా దాని అదృష్ఠం." అని తన సంతోషాన్ని వెలిబుచ్చిందామె.కమల కూడా చాలా సంతోషించింది. తను కోరుకున్నట్లుగా మంచి అద్భుదయ భావాలు కల వ్యక్తి తన భర్త కావడం ఆమె తన అదృష్టంగా భావించి పొంగిపోయింది.పెళ్ళి రోజు రానే వచ్చింది. పెళ్ళికి తరలి వచ్చిన బంధుమిత్రులతో పెళ్ళి పందిరి చాలా సందడిగా ఉంది. కట్నం ఖర్చు లేకపోవటంవల్ల పెళ్ళి ఏర్పాట్లు తనకు వీలైనంత ఘనంగానే చేసాడు మాధవరావు. పెళ్ళి పందిరిలో మాధవరావు హడావుడిగా తిరుగుతున్నాడు. ఏర్పాట్లన్నీ చూస్తూ ఆజమాయిషీ చేస్తున్నాడు. మగపెళ్ళివారు వచ్చేసారు. వాళ్ళకి విడిది ఏర్పాటు చేసి మాధవరావు, శారదమ్మ పెళ్ళివారికి తగు మర్యాదలు చేసారు. మహేష్ తల్లితండ్రులిద్దరూ కూడా చాలా కలుపుగోరుతనం కలవాళ్ళు. పెళ్ళితంతు జరుగుతోంది.

పెళ్ళిపందిట్లో మహేష్, కమల జంట చూడ ముచ్చటగా ఉంది. పెళ్ళికి వచ్చిన పెద్దవారు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ అక్షతలు వేస్తున్నారు.ఇంతలో భోజనం వేళవడంతో ఒకొక్కరూ డైనింగ్ హాల్‌వైపు వెళ్ళసాగారు. మాధవరావు కూడా అక్కడికి వెళ్ళి దగ్గరవుండి అన్నీ చూసుకుంటున్నాడు. మధ్యమధ్య 'వంటలెలా ఉన్నాయని ' ఆరా తీస్తున్నాడు. శారదమ్మ కూడా దగ్గర ఉండి వడ్డింపులు అవీ చూసుకుంటోంది. వాళ్ళ మర్యాదలకి మగపెళ్ళివారు మెచ్చుకుంటున్నారు.

ఇంతలో తన పేరు ప్రస్తావనకి రాగానే ఎవరా అని తలతిప్పి చూసాడు. మగపెళ్లివారు తరఫువాళ్ళెవరో ఒకరు ఇంకొకరితో చెప్పుకోవడం వినిపించింది."చూసావా... మాధవరావుగారు,… అదే రంగనాధం బాబాయిగారి వియ్యంకుడి మర్యాద! పెళ్ళి ఎంత ఘనంగా జరిపిస్తున్నాడో! పాతిక లక్షల కట్నంతో పాటు బైక్, టివి, ఫ్రిజ్‌లాంటి బోలెడన్ని వస్తువులు కూడా కానుకగా ఇచ్చాడతను." అన్నాడు ఒకతను తన పక్కనున్న అతనితో.

"అవును! నేనూ విన్నాను ఆ సంగతి. కట్నమేకాక ఘనంగా లాంచనాలు కూడా ఇచ్చాడట. స్వయంగా రంగనాధంగారే నాకు బైక్ కూడా చూపించారు." అన్నాడు ఆ వ్యక్తి.

ఆ మాటలు తన చెవిన పడటంతో ఉలిక్కిపడ్డాడు మాధవరావు. అతనికి ఆశ్చర్యం కలిగింది. 'అదేంటి! తనసలు కట్నమే ఇయ్యలేదు, పైగా బైక్, ఇతర కానుకలు పెద్దగా ఇవ్వలేనని ముందుగానే చెప్పాడే! పెళ్ళి మాత్రం ఘనంగా చేస్తానని ఒప్పుకున్నాడే! మరి కట్నం పాతిక లక్షలు ఇచ్చాడని వియ్యంకుడు స్వయంగా చెప్పడమేమిటి?’ అని మాధవరావుకి ఒకపట్టాన ఏమీ అర్ధం కాలేదు. ఒక్కసారిగా అతన్ని అనేక సందేహాలు చుట్టుముట్టాయి. ఇదే మాట ఇంతకుముందు పెళ్ళికొడుకు మేనమామ ఇంకెవరితోనో మాట్లాడినప్పుడు కూడా మాధవరావు విన్నాడు. అయితే ఆ విషయం సరిగ్గా అర్థంకాక అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. తరవాత తనని కట్నం డబ్బులు అడిగితేనో? తనవద్ద ఇవ్వడానికేమీ మిగలలేదే?

అప్పుడే సరిగ్గా రంగనాధం కూడా భోజనం చేసే అతిథులని పలకరించడానికి అటువైపు వచ్చాడు. అతిథులందరూ మాధవరావు మర్యాదలని, వంటకాల గొప్పతనాన్ని అతనికి చెప్తున్నారు.

మాధవరావు ఇంక ఉండబట్టలేకపోయాడు. రంగనాధం దగ్గరికి వెళ్ళి, "బావాగారూ! ఓ చిన్న మాట! అలా ఈ పక్కకి వస్తారా!" అన్నాడు వినయంగా.

"ఆఁ..." ఏమిటన్నట్లు మాధవరావు వైపు చూసి అతని వైపు వెళ్ళాడు రంగనాధం.

"పెళ్ళి ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయని మా వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు బావగారూ!" అన్నాడు రంగనాధం.

"అదికాదు బావగారూ!..." అని ఎలాగడగాలో తెలియక సందేహపడ్డాడు మాధవరావు.

"ఆఁ...చెప్పండి బావగారూ! ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్లున్నారు" అన్నాడు రంగనాధం.

"ఏంలేదు బావగారూ! కట్నం ప్రసక్తిలేదని అన్నారు కదా..."ఎలా చెప్పాలో తెలియక ఆగాడు మాధవరావు.

"అవును! నేను కట్నమేమీ ఆశించలేదు కదా! నాకే బోలెడంత ఆస్తిపాస్తులున్నాయి. మా వాడిది కూడా మంచి ఉద్యోగమే! మాకు మంచి సంప్రదాయమైన కుటుంబం ముఖ్యం కాని కట్న కానుకలు ముఖ్యం కాదు. ఇంతకీ మీకెందుకొచ్చిందా సందేహం?" అన్నాడు రంగనాధం.

"అవును గానీ, ఇక్కడ పెళ్ళికి వచ్చినవాళ్ళు చెప్పుకోగా నేను విన్నదేమిటంటే నేను మీకు పాతిక లక్షలు కట్నమిచ్చానని, బైకు, ఇంకా బోలడన్ని కానుకలు ఇచ్చానని. అందుకే ఉండబట్టలేక అడిగాను." అన్నాడు మాధవరావు.

"ఒహో! అదా సంగతి! చూడండి బావగారూ, నేను కట్నం వద్దన్న మాట, కట్నం తీసుకోనన్న మాట వాస్తవం. అందులో సందేహాలకు ఎలాంటి తావులేదు. అయితే ఇవాళరేపు ఎంత కట్నం పుచ్చుకుంటే అంత గొప్ప బంధువుల మధ్య. పైగా కట్నం పుచ్చుకోవడం పరువు మర్యాదలకి సంబంధించిన విషయమైపొయింది. అదో స్టేటస్ సింబలై కూర్చుంది. కట్నం పుచ్చుకోలేదంటే అబ్బాయికేదో లోపముంది, అందుకే కట్నం పుచ్చుకోలేదనో, లేక ఇంకే ఇతర కారణాలు అయినా ఊహించుకుని చులకన చేస్తారు. మనల్ని అవమానించి హేళన చేస్తారు. అందుకే మన పరువుకోసం నేనే అలాగ మా బంధువులకి చెప్పాను. మీ డబ్బైతేనేంటి, నా డబ్బైతేనేంటి? అబ్బాయి, అమ్మాయి సుఖంగా ఉంటే అంతే చాలు మనకి. అంతే కదా బావగారు!" అన్నాడు రంగనాధం.

అతని సమాధానం విని మాధవరావు నివ్వెరపోయాడు. అతని సందేహాలన్నీ తీరిపోయి మనసు తేలికపడింది.

అతను ఆనందంగా రంగనాధం చేతులు పట్టుకొని, "బావగారూ, మీకు నా కృతఙతలు ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు" అన్నాడు మాధవరావు ఆర్ద్రమైన గొంతుతో.

"ఛ! బావగారు, మనలో మనకి కృతఙతలేంటి?" అన్నాడు రంగనాధం మాధవరావు భుజం తడుతూ.

"వియ్యంకులిద్దరూ ఇక్కడ చేరి ఏంటి తీరిగ్గా కబుర్లాడుకుంటున్నారు? రండి అక్కడ మంటపంలో పంతులుగారు పిలుస్తున్నారు!" అంటూ అప్పుడే వాళ్ళని పిలవడానికి వచ్చిన రంగనా ధం భార్య రాధమ్మ అంది.

వియ్యంకులిద్దరూ పెళ్ళిమంటపంవైపు నడిచారు.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల