‘శాంతి కుటీరం’ లో జరిగే దీపావళి పండుగ కార్యక్రమానికి ఆవరణంతా ఎప్పటిలా జనసంద్రమైంది. సూర్యోదయంతో మొదలైన గణపతి హోమం ముగిసాక, సందీప్ వర్మ పేరిట ‘అక్షరదానం’, ‘పుస్తకపంపిణీ’ జరిపించాము. ఈ సారి ఆశ్రమ విద్యాలయంలో పంతులుగారి చేతులమీదుగా యాభై యొక్క మంది చిన్నారులకి అక్షరాభ్యాసం జరగడం విశేషం.
పండుగ కార్యక్రమాల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు నారాయణ శాస్త్రి, శారదమ్మ దంపతులు. శారదమ్మని ‘మామ్మగారు’ అని సంభోదించడం అలవాటునాకు. శాస్త్రిగారిని మాత్రం ‘పంతులుగారు’ అనే అంటాను. వారు కుటుంబానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు. మాఇంట అన్ని శుభకార్యాలకి పంతులుగారే పౌరోహిత్యం వహించారు. ఆశ్రమ నిర్మాణదశ నుండి నాకు చేదోడువాదోడుగా ఉంటూ ఇక్కడే తమ నివాసాన్ని ఏర్పరుచుకున్నారు.
విద్యాలయం నుండి అన్నదానం జరుగుతున్న ‘సేవా శిబిరం’ దిశగా నడిచాము నేను, పంతులుగారు.
“మన స్వచ్చంద సేవా కార్యక్రమాలకి ఈయేడు కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుండి వచ్చినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది తల్లీ. నీ ఆశయం, శ్రమ ఫలించినట్టేనమ్మా కళ్యాణీ,” అన్నారు పెద్దాయన నాతో.
“అంతా మీ దీవెనలతోనే కదా పంతులుగారు,” అన్నాను చేతులు జోడించి. ‘సందీప్ వర్మ ఆశయాలకి నిర్దిష్టమైన స్వరూపాన్నిచ్చి, ఆయన ఆదర్శాలని ఆచరణ సాధ్యంగా మలచడానికి మీరందించిన సహాయం మరువలేనిది,’ అని ఆయనకి గుర్తు చేసాను.
ఒకింత దగ్గరలో గాజుల సవ్వడి, మట్టెల చప్పుడు విని అటుగా చూశాము. నుదుట ఎర్రని బొట్టుతో, జారవిడిచిన పొడవాటి వెండిజుత్తుతో నడిచి వస్తున్న పార్వతీదేవిలా అనిపించింది శారదమ్మ. ఆశ్రమ ఆలయంలో చండీహోమం నిర్వహించారు ఆమె. దగ్గరగా వచ్చి హోమం విభూతి నా నుదుటన పెట్టారావిడ.
మంచితనం, మానవత్వం మూర్తీభవించిన శారదమ్మగారు ఆశ్రమంలోని గాయపడ్డ పశువులని, పక్షులని కంటికి రెప్పలా చూసుకుంటారు. ‘అనాధాశ్రమ’ శిశువుల ప్రాపకాన్ని కూడా అంతే ఓర్పుగా పర్యవేక్షిస్తారు.
***
పండుగ కార్యక్రమానికి వచ్చిన జనమంతా ‘శాంతికుటీరం’ పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి, మా ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పి మరీ వెళ్ళారు.
“ఓ ఐదు నిముషాలు తోటలో అరుగుల మీద కూర్చోండమ్మా. మన చెట్లవే, లేత కొబ్బరినీళ్ళు పుచ్చుకొని వెళుదురుగాని,” అంటూ తోటమాలి గోవింద మమ్మల్ని కూర్చోబెట్టేశాడు.
“ఏమ్మా కళ్యాణీ, ఎప్పటిలా పండుగ జరుపుకోడానికి పిల్లలు వస్తారుగా! ఈసారి వరుణ్ బాబుకి పెరుగువడలు, క్రాంతికి కాజాలు చేయిస్తున్నానని చెప్పు,” అంది శారదమ్మ.
“అయితే కళ్యాణీ, వచ్చేవారం మీ కవలలకి పద్దెనిమిదేళ్ళు నిండుతాయి కదూ! పై చదువులకి ఢిల్లీ వెళతారని మీ అన్నయ్య శ్రీకాంత్ అన్నాడు. చాలా సంతోషం తల్లీ. మీ పుట్టింటివారి చల్లనినీడలో పెరిగి పెద్దయి, మేనమామ అండదండలతో చదువుకుంటున్నారు,” అన్నారు పంతులుగారు, గోవింద తెచ్చిన కొబ్బరినీళ్ళలోటాని అందుకుంటూ.
“నిన్నమొన్నటి పసివాళ్ళగా గుర్తు నాకు. ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యేనాటికి కవలలకి ఆరేళ్ళు. వాళ్ళ చదువుల దృష్ట్యానే, అమ్మానాన్నగారు పట్నంలో ఉన్నారుగాని, లేదంటే వారి చరమదశలో నైనా నీతోపాటు ఇక్కడే ఉండేవారు,” అన్నారు మామ్మగారు గతాన్ని గుర్తుచేస్తూ.
ఒక్కక్షణం అమ్మావాళ్ళ ఆలోచనతో మౌనం వహించాను...
“అవును. దగ్గరుండి నిర్మించుకున్న ఈ ఆశ్రమ నిర్వహణ కోసం నేనిక్కడికి వచ్చేయడాన్ని అమ్మావాళ్ళు పూర్తిగా సమర్ధించారు. పిల్లల సంరక్షణ బాధ్యత వారికిచ్చి, మనశ్శాంతి కోసం నా జీవన ప్రస్థానంలో పెనుమార్పు తేగలిగాను. క్రాంతి, వరుణ్ ల చదువుల బాధ్యతలు తీసుకొని, అన్నావదిన కూడా నాకెంతో ఉపకారం చేసారు. ఇక్కడ స్థిరపడి ఈ దీపావళికి పన్నెండేళ్ళు. మీకూ తెలుసుగా,” అన్నాను.
“మీ వదిన, వైదేహి ఉత్తమురాలు. మీ అమ్మనాన్నలు పరమపదించే వరకు వారిని ప్రేమగా గౌరవించింది. మరి తన కూతురితోపాటు నీ పిల్లల్ని కూడా దగ్గిరుండి శ్రద్ధగా చదివిస్తుంది,” అన్నారు పంతులుగారు.
“అంతా దేవుని దయ,” అంటూ ఖాళీ అయిన కొబ్బరినీళ్ళ లోట గోవిందకిచ్చి, వారిరువురి వద్ద శెలవు తీసుకొని వెనుతిరిగాను.
***
‘శాంతి కుటీరం’ ని ఆశ్రమం అని పిలుస్తారు జనం. ప్రతియేడు సందీప్ వర్మ స్మృతికి నివాళిగా, అన్న- వస్త్ర - అక్షరదానాలు జరిపించడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. పుష్కరకాలంగా జరుగుతున్న ఈ సేవాకార్యక్రమం గురించి ఆలోచిస్తూ నా నివాసంవైపు అడుగులు వేసాను.
కాస్త దూరంగా నిర్మించుకున్న నివాస కుటీరం వరకు దారికిరువైపులా నా భర్త, సందీప్ వర్మకి ఇష్టమైన మొగలి - నందివర్ధనం - మరువం - సంపంగి - మందారాలతో పాటు మరెన్నో మొక్కలు - చెట్లు అతని జ్ఞాపకార్ధంగా నాటించాను. నిండుగా విరబూసిన రంగురంగుల పుష్పాలు అరుణోదయపు వెలుగులలో వసంతోదయపు పరిమళాలను వెదజల్లే ఆ బాటన నడవడం నాకెంతో ఇష్టం.
నాభర్తలోని సేవాదక్షత గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాను.
శిశు, పశు సంక్షేమార్ధం ఓ ఆశ్రమం స్థాపించి, అనాధులకి - అన్నార్తులకి - వృద్ధులకి - వికలాంగులకే కాక మూగజీవులకి కూడా సేవచేయాలన్న అతని ఆశయమే ‘శాంతి కుటీరం’ గా రూపుదిద్దుకొంది. నాకు ఆయన ఆశయం పట్ల అవగహన, అది నెరవేర్చగల ఆత్మస్థైర్యం కూడా అతని సాహచర్యం వల్లనే సాధ్యమైంది. నా అదృష్టంగానే భావిస్తాను.
పండుగ వేడుకలకి వరుణ్, క్రాంతిలతోపాటు వాళ్ళమ్మాయి నీలని తీసుకొని అన్నయ్యావాళ్ళు రావడంకూడా పరిపాటే. అమ్మనాన్నలు కూడా స్వర్గస్తులయ్యేంత వరకు క్రమం తప్పకుండా వారాంతరాలు, పండుగలు నావద్దనే కుటీరంలో గడిపేవారు.
***
ఆలోచిస్తూ నా నివాసం చేరాను. బంట్రోతు లేచి తలుపులు తాళం తీశాడు. నా చేతిలో ఉన్న స్వీట్ పాకెట్ అతినికిచ్చి లైబ్రరీలోకి నడిచాను.
కిటికీనుండి వస్తున్న ఎండపొడకి బల్లమీదున్న వెండివ్యాసపట్టికతో పాటు, అందున్న పుస్తకంపై ‘జీవ సందీప్తి’ అన్న బంగారురంగు అక్షరాలు వెలిగిపోతున్నాయి. ప్రతియేడు ఆశ్రమంలో దీపావళి కార్యక్రమం ముగిసాక తప్పనిసరిగా పండుగ రెండురోజులూ, ఆ నెమలి రంగు పుస్తకం ‘జీవ సందీప్తి’ చదవుతూ గడపడం నాకు సంతృప్తినిచ్చే ఏకైక కార్యం.
***
జీవితకాలంపాటి నా జ్ఞాపకాలకి అక్షరరూపమే ‘జీవ సందీప్తి’ పుస్తకం. భర్తగా, స్నేహితుడిగా, ఓ గురువులా కూడా నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సందీప్ బావ ఊసులతో నిండినదే ఆ పుస్తకం. ఎన్నిసార్లు చదివినా అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాను. ఆ పుస్తకంలోని వాస్తవాల జ్ఞాపకాల్లో మునిగి తేలడం నా విధిగా భావిస్తాను కూడా. నా భావాలని - అనుభవాలని, సంఘటనలని సూటిగా నా మనస్సుకి తోచినట్టుగా పొందుపరిచాను ‘జీవ సందీప్తి’ లో.
ఆశ్రమ నిర్మాణానికి పునాది పడిన రోజే, ‘జీవ సందీప్తి’ మొదటి పేజీలోని మొదటివాక్యం రూపుదిద్దుకుంది. నా జీవితంలోని వెలుగునీడల్ని, సుఖదుఃఖాలని ఆద్యంతం ప్రతిఫలిస్తుంది.
నా చిన్ననాటి జ్ఞాపకాలతో మొదలయ్యే పేజీతిప్పి చదవనారంభించాను.
***
అమ్మచేతి గోరుముద్దలు తినే వయస్సులో, అమ్మ క్షణం దూరమయితే, కన్నీరైన బాధ. నడక నేర్చాక, అమ్మ వెచ్చని ఒడి వదిలి బడికి వెళ్ళాలన్నా అదే గుబులు. అమ్మ ఆప్యాయత ఇప్పటికీ మరువలేని మమకారంగా తోస్తుంది...
నడకలు నేర్చి, నాన్న చేయూతతో సాగిన పరుగుల పయనం సైతం అంతటి మధురానుభూతే... “నీ రాకతో నట్టిల్లంతా బంగారం అయ్యిందమ్మా” అంటూ నాన్నగారు అల్లారుముద్దుగా చూసుకోనేవారనీ గుర్తే.
ఊహతెలిసాక అమ్మ, అన్నయ్యలతో మామిడితోటలకి విహారాలు,చల్లనివెన్నెట్లో ఆటలు, కేరింతలు ఇంకా గుర్తే.
ప్రతిపండక్కి అయినవాళ్ళతో వనభోజనాలు తప్పనిసరిగా జరిపించేవారు నాన్న. నా పసితనపు రుచులు - జున్ను మీగడలు, తేట కొబ్బరి నీళ్ళు, నాకిష్టమైన పాలకోవాలు. మరువలేని షడ్రుచులు!!...
***
అన్నయ్యని ‘శ్రీకాంత్’ అని పిలవడం మొదలెట్టినప్పుడు ‘అన్నయ్యా’ అనే పిలవమని పట్టుబట్టాడు. అయితే నన్ను ‘కల్యాణి’ బదులు ‘చెల్లీ’ అని పిలవమని నేనూ పేచీపెట్టిన జ్ఞాపకం...
వెలుగు నింపుకుంటున్న నెలవంకలా, ప్రేమనిండిన లోగిలిలో, అందంగా ఆనందంగా ఎదుగుతున్న ఇంపైన జ్ఞాపకాలు...
***
పండుగలకి ఢిల్లీ నుండి వచ్చేవారు మేజర్ మామయ్య, అత్తయ్య, సందీప్. మా అమ్మ రాజ్యలక్ష్మికి ఒక్కగానొక్క తోబుట్టువు శ్రీధర్ మామయ్య. ఆయన ఏకైక సంతానం సందీప్.
ఢిల్లీ నుండి హైదరాబాదు వచ్చాక మా గడీ చేరడానికి, నాలుగ్గంటల కారుప్రయాణం ఉండేది వాళ్లకి.
“అమ్మా రాజీ, ఈ వ్యాపారాలన్నీ అమ్మేసి హైదరాబాదుకి వచ్చేయండి,” అనేవాడు మామయ్య.
“పూర్వుల ఆస్తుల్నివృద్దిచేశాకే ఈ ఊరినుండి కదిలేదని గట్టిగా చెప్పేసారు మీ బావగారు,” అంటూ నవ్వేసేది అమ్మ. ఆప్యాయతలు నిండిన వారి వైరం నాకు గుర్తే.
***
సందీప్ ని ‘బావ’ అని పిలవమంది అమ్మ. నా కోసం వాళ్ళు తెచ్చిన బొమ్మలు, ఆటలు ఎలా ఆడాలో సందీప్ బావ చూపించేవాడు. “నీకు ఎంత నేర్పినా చేతకాదు. ఒట్టి మొద్దు,” అని విసుక్కొనేవాడు బావ.
***
ఊరంత పందిరి వేసి, పదకొండవయేట నాకు వోణి వేయించినప్పుడు వచ్చారు మామయ్యకుటుంబం. నాలుగేళ్ళ తరువాత వచ్చిన వాళ్ళని చూసి సంతోషమనిపించింది.
అత్తయ్యవాళ్ళు ఆశీర్వదించారు. సందీప్ బావ బంగారు కాళ్ళపట్టాలు బహుమానంగా అందించాడు. సంకోచించాను.
“పట్టాలు పెట్టుకో, దాచుకోడానికి కాదు నీకిచ్చింది, ఇప్పుడే పెట్టుకో,” పురమాయించాడు బావ. అమ్మ నాచేతిలోని బంగారురంగు పెట్టి నుండి పట్టాలు తీసి నా కాళ్ళకి పెట్టింది. చాలా చక్కగా ఉన్నాయి. మరుపే రాని మధురమైన రోజు. యువరాణిలా వెలిగిపోయిన రోజు. ఓ తీయనిజ్ఞాపకమే...
***
ఆ రోజు అతిధులంతా వెళ్ళాక గదిలోవస్తువులు సర్దుతున్నారు అమ్మ, అత్తయ్య.
“సందీప్ చాలా పొడవయ్యాడు. శ్రీకాంత్ కంటే ఏడాదే పెద్ద. బాగా చదువుతాడా? అడిగింది అమ్మ అత్తయ్యని.
“పదవక్లాసు కదా, కష్టపడి చదువుతున్నాడు. వాళ్ళ డాడీ లాగా ఆర్మీ, లేదా ఎయిర్-ఫోర్స్ ఉద్యోగమే చేస్తాడట,” అన్నది అత్తయ్య.
వాళ్ళమాటలు వింటూ పడుకున్నాను. కదిలినప్పుడల్లా కాళ్ళపట్టాలకి ఉన్న మువ్వలచప్పుడు బాగనిపించింది. బావ బహుకరించిన బంగారు మువ్వలచప్పుళ్ళు వింటూ, బావగురించి ఆలోచిస్తూ నిద్రపోయిన జ్ఞాపకం.
***
మళ్ళీ రెండేళ్ళకి నేను, అన్నయ్య మా వేసవి సెలువలు ఢిల్లీలో మామయ్య వాళ్ళింట గడిపాము. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఆగ్రా సరదాగా తిరిగేసిన మరువలేని జ్ఞాపకాలే.
ఢిల్లీలోని ఓ స్వచ్చంద ధార్మికసంస్థ వారి ‘మీల్స్ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమం ద్వారా వృద్దాశ్రమాలకి, బీదవారికి భోజనాలు, కంబళ్ళు, నిత్యావసర వస్తువులు అందించేవాడు సందీప్ బావ. ఆ పనిమీద ప్రత్యేకంగా నాలుగు రోజులకోసారి బావతో బస్సుల్లో తిరిగేవాళ్ళం. బ్లూక్రాస్ వారు నిర్వహించే ‘పశు సంక్షేమ సంస్థ’ క్కూడా వెళ్ళాము.
సందీప్ బావతో నేనొక కొత్తప్రపంచాన్నే చూశాను. ఆదరణలేని వృద్ధులని, కుక్కపిల్లల్ని, దెబ్బతిన్న పశువులని చూశాను. బావకి వృద్ధులపట్ల, నోరులేని జీవులపట్ల ఉన్న ప్రేమ, ఆపేక్ష గ్రహించాను. సందీప్ బావ జాలిగుండెచప్పుళ్ళు వినగలిగాను. నా మనసులో బావపట్ల సద్భావం కలగడానికి అది కూడా ఓ కారణమే.
తిరుగుప్రయాణమయ్యే ముందురోజు అందరం కబుర్లాడుతూ భోజనం చేస్తుంటే, మామయ్య మాత్రం గంభీరంగా ఉన్నారు. “ఊళ్ళోని సంక్షేమ సంస్థలకి ఈయేడు కూడా విరాళం ఇస్తామని సందీప్ రాజావారు, మాటఇచ్చారంట. ఇవ్వాళే తెలిసింది,” అన్నారు ఉన్నట్టుండి మామయ్య. “నీ కొడుకు ఉన్నదంతా దానధర్మాలు చేసేలాఉన్నాడు,” అన్నారు అత్తయ్యని ఉద్దేశించి ఆయన మళ్ళీ. అత్తయ్య మాత్రం సందీప్ వంక మెచ్చుకోలుగానే చూసినట్టు గుర్తు.
ఏమైనా బావ మనస్సుని, మనిషిని అర్ధం చేసుకుంటూ గడిపిన ఆ నెలరోజులు మరువలేని జ్ఞాపకాలే.
***
మరో మూడేళ్ళకి, నాన్నగారు హైదరాబాదులో చేపట్టిన 'కళ్యాణి షాపింగ్ మాల్' తో పాటు మా నూతన గృహ నిర్మాణం కూడా పూర్తయిన వేడుకలకి వచ్చారు సందీప్, అత్తయ్య, మామయ్య. వాళ్ళతో నాలుగురోజుల పాటు హైదరాబాద్ నగరమంతా ఆనందంగా తిరిగేసాము.
నేను బొద్దుగా లడ్డూలా అయ్యానని బావ నన్నాట పట్టించినప్పుడు నేను అమ్మదగ్గర ఏడ్చాను కూడా. అప్పట్లో ఉపవాసాలతో సన్నబడ్డానికి ప్రయత్నించాను. బావ వెక్కిరింతకి నేనెంత ఉడుక్కున్నానో నాకు బాగా గుర్తు.
***
“అన్ని విధాలా సందీప్ మన కళ్యాణికి తగినవాడు,” అని అమ్మ ఓ రోజు నాన్నతో అన్నప్పుడు, “నాకు మేనరికాలు నచ్చవని చెప్పానుగా,” అని నాన్న విసుకున్నారు. నాన్న అభిప్రాయం విన్నా, బావంటే నాకు ఇష్టమేగా అని మాత్రం అనుకున్న జ్ఞాపకం...
***
ఆ తరువాత మూడేళ్ళల్లో అత్తయ్య, మామయ్య రెండుసార్లు వచ్చివెళ్ళినా,సందీప్ బావ మాత్రం పరీక్షల వల్ల ఓ సారి, తాను పాల్గొనే చారిటీ కార్యక్రమాల వల్ల మరోసారి రాలేకపోయాడు. బావని చూడాలని, మాట్లాడాలని నా మనస్సు ఆరాటపడ్డం నాకు జ్ఞాపకమే.
***
ఐ.ఐ.టి ఇంజినీరింగ్ లో చేరేముందు వచ్చాడు సందీప్ బావ. ఉన్న రెండురోజులు ఎక్కువ సమయం నాన్నగారితో, అన్నయ్యతో మా షాపింగ్ మాల్ లో గడిపాడు.
తిరిగివెళ్ళే ముందురోజు భోజనసమయంలో కబుర్లు చెబుతూ నిశితంగా నావంక చూసాడు బావ.
“మీ అన్నయ్య ఎం.బి.యే చదవడానికి అమెరికా వెళుతున్నాడు, సరే. నీ విషయం ఏమిటి? ఏమన్నా పై చదువుల కెళతావా? లేక ఫ్యాషన్ మాడల్ అవుతావాకళ్యాణీ? అన్నాడు నన్నుద్దేశించి బావ. ఏమని జవాబివ్వాలో తెలియక తడబడ్డాను. అమ్మా, అన్నయ్య గొల్లున నవ్వారు.
“అహ, ఏంలేదు. మరీ సన్నగా గాలికి ఎగిరిపోయేలా ఉన్నావని అలా అడిగాను. మాములుగా మన ఫ్యాషన్ మోడల్స్ మాత్రమే ఇలా అతినాజూగ్గా ఉంటారు కదా!” అంటూ తనూ నవ్వాడు బావ. చదువు మీద నాకు అంతగా శ్రద్ధలేదని తెలిసి పోయిందేమోనని అనుమానం వచ్చింది.
కాస్త అభిమాన పడ్డా, బావ మీద చిరుకోపం వచ్చినా, ఆరోజు - బావకి కూడా నేనంటే ఇష్టమేమో! అనుకున్న జ్ఞాపకం.
***
అమ్మ ఆరోగ్యం సున్నితమే అయినా, తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినప్పుడు తెలిసింది. హృద్రోగం, రక్తపోటు, డైబిటిస్, హైపోథైరాయిడ్ వ్యాధుల వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని. అమ్మ ఆరోగ్యం గురించి భయంతో భవిష్యత్తు శూన్యంలా తోచిన జ్ఞాపకం.
***
తరువాత మూడేళ్ళకి అన్నయ్య యూ.ఎస్.ఏ నుండి తిరిగివచ్చి ‘శ్రీకాంత్ ఇంపోర్ట్స్’ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే సందీప్ బావ చదువుపూర్తిచేసి ఆర్మీలో పైలట్ గా సెలెక్ట్ అయ్యాడు.
***
తీవ్రమైన కీళ్ళనొప్పులతో కదలలేని స్థితికి చేరిన అమ్మకు ఇంట్లోనే వైద్యసహాయం, కాయకల్ప చికిత్స కూడా చేయించవలసి వచ్చింది. తన ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా కూడా వీలయినంత త్వరలో ముందుగా నా పెళ్ళి జరగాలని నాన్న దగ్గర అమ్మ పట్టుబట్టడం నాకు గుర్తు.
***
‘పెళ్ళి’ అన్న అక్షరాలు చదవగానే, ఎప్పటిలా నా గుండెలు ఓ క్షణం గతితప్పాయి.
చటక్కున ‘జీవ సందీప్తి’ పుస్తకం మూసేసి మంచినీళ్ళు తాగి కాసేపు పక్కమీద వాలాను.
ఇన్నేళ్ళయినా నా గుండె చప్పుళ్ళకి ప్రతీకగా నిలిచిన ఆ పుస్తకంలో, అప్పటి నా పెళ్ళిప్రస్తావన దగ్గర మాత్రం అలా కాస్త తాత్సర్యం పరిపాటే.
***
చదువుతున్న పేజీమధ్యగా బుక్ మార్క్ ఉంచి, ఆగకుండా మ్రోగుతున్న ఫోన్ తీశాను.
అవతల నుండి అన్నయ్య.
“హలో కళ్యాణీ, పిల్లల్ని తీసుకొని రేపు మధ్యాహ్నం భోజనసమయానికి వచ్చేస్తాము. సరేనా?” అనడిగాడు.
ఇంతలో అన్నయ్య నుండి ఫోన్ లాక్కొన్నట్టుంది క్రాంతి.
“అమ్మా, మాకు ఇష్టమైనవి వండిస్తున్నావా? పైనాపిల్ కేక్ కూడా కావాలి,” భోజనం విషయం గుర్తు చేసింది. ‘సందీప్ లాగా కేకులు, ఐస్క్రీములు ఇష్టం కూతురికి’ అని నవ్వొచ్చింది. “అన్నీ గుర్తే. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రండి,” ఫోన్ పెట్టేసి వంటింటివైపు నడిచాను. పిల్లలున్న రెండురోజులు చేయవలసిన వంటకాలు జానకితో ప్రస్తావించి తిరిగి నాగదికి చేరాను.
***
మళ్ళీ పుస్తకం చేతబట్టి చదవనారంభించాను.
***
నా ఇరవయ్యొకటవ పుట్టినరోజు పండుగతో పాటు శ్రీధర్ మామయ్య షష్టిపూర్తి వేడుకలు మాఇంటఘనంగా జరపించారు నాన్నావాళ్ళు. సందీప్ బావ వైమానిక శిక్షణ నిమిత్తం ముంబాయిలో ఉండడంతో షష్టిపూర్తి కార్యక్రమ సమయానికి మాత్రం వచ్చి, ఓగంట ఉండి, వెళ్ళిపోయాడు.
అతిధులు కూడా వెళ్ళాక - మరోసారి ఐస్క్రీం తింటూ కబుర్లు చెప్పుకుంటుండగా,“త్వరగా కళ్యాణి పెళ్ళితో పాటు శ్రీకాంత్ పెళ్ళి కూడా జరిపించండి,” అంది నాన్నని ఉద్దేశించి, అమ్మ. ఉన్నట్టుండి అమ్మ అలా నా పెళ్లిప్రస్తావన తేవడం మాఅందరికీ ఆశ్చర్యమనిపించింది.
“చూడండి బావ, సందీప్ కూడా కళ్యాణి అంటే ఇష్టపడుతున్నాడు. మీరు అలోచించి ఓమంచి నిర్ణయం తీసుకుంటే త్వరలోనే వారిద్దరికీ పెళ్లిచేసేయవచ్చు”, అని వెంటనే అందుకొని తన మనసులోని మాట బయటపెట్టారు శ్రీధర్ మామయ్య.
సంశయంలేని మామయ్య సూచనకి అమ్మముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మేనరికమంటే నాన్నగారి అభిప్రాయం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాను.
“ఉన్నట్టుండి పెళ్లి అంటే ఎలా? పిల్లల అభిప్రాయలు, ఇష్టాయిష్టాలు మాట్లాడుకోనిదే ఎటువంటి నిర్ణయాలు, అనుకోవడాలు సాధ్యపడదు కదా,” అని నాన్న నిర్మొహమాటంగా అనడంతో అమ్మ, మామయ్య కూడా కాస్త నిరుత్సాహ పడ్డం గమనించాను. విషయమెలా తేలుతుందోనని ఆదుర్దాగా వేచిచూసిన సమయమది...
***
మరునాడు పొద్దున్నేకాఫీకప్పుతో వెళ్ళి నాన్నగారి పక్కన కూర్చున్నాడు అన్నయ్య.
“నాన్నగారు, నిన్న మామయ్య ప్రస్తావించిన పెళ్ళిసంబంధం గురించి ఓసారి ఆలోచించండి. కళ్యాణికి సందీప్ తో పెళ్ళయితే, అయినవాళ్ళు కాబట్టి మనజీవనం సజావుగా, సంతోషంగా ఉంటుందని నా నమ్మకం. కుటుంబాల నడుమ సఖ్యత ఉంటుంది. పైగా కళ్యాణి ఈ సంబంధం ఇష్టపడుతుందేమో అడగవలసిన బాధ్యత మనపై ఉంది,” అన్నాడు అన్నయ్యసౌమ్యంగా. వాళ్ళ సంభాషణ వింటూ, ‘వేచిచూద్దాం’ అన్నట్టుగా చూసింది అమ్మ నావంక.
***
మళ్ళీవారం తిరిగేలోగా, అన్నయ్యకి రవాణశాఖ అధికారి కృష్ణమూర్తిగారి అమ్మాయి వైదేహితో, నాకు సందీప్ బావతోవివాహం నిశ్చయించారునాన్న.
మరోనెలకి రంగరంగ వైభవంగా, రెండురోజుల తేడాతో మా పెళ్ళిళ్ళు జరిపించారు అమ్మావాళ్ళు.
తాను ఆరాధించే దేవుని పెళ్ళంతటి స్థాయిలోనే జరిపించింది అమ్మ, సందీప్ బావతో నా పెళ్ళివేడుకనాకే ఓ కలలా తోచింది. మరువలేని మురిపాల జీవితానుభవమది... అంతటి పండగ ఏనాడు చూడలేదు.
***
హైదరాబాద్ శివారుల్లోని తమ ఆస్థులని పెళ్ళికానుకగా మాకందించారు అత్తయ్యావాళ్ళు. నాకు తోచినట్టుగా అభివృద్ధి పరచాలని కోరారు. ఆసందర్భంగా నాన్నగారు కూడా భారీగా కట్నకానుకలు మాకందించారు.
***
తరువాత నెలరోజులు - అమ్మింట, అత్తవారింట కూడా సంతోషాల్లో గడిచింది కాలం. పువ్వులమీద నడిపించారు, నవ్వుల్లో ముంచెత్తారు. సందీప్ బావ ప్రేమలో, మధురానుభూతులతో గడిచింది సమయం.
***
అమ్మ ఆరోగ్యం అస్తవ్యస్తమై ఆసుపత్రిలో చేరడంతో, కాశ్మీరులో ఉన్న మేము, పారిస్ ట్రిప్ లో ఉన్న అన్నయ్యావాళ్ళు హైదరాబాద్ వచ్చేసాము. గుండెపోటుకి గురయిన ఆమె కదలికలో కూడా తీవ్రమైన పరిమితి ఏర్పడింది. ఆక్లిష్టసమయంలో, అత్తయ్యవాళ్ళు నన్ను అమ్మకి తోడుగా ఉండమన్నప్పుడు నాన్నగారి మనస్సు కృతజ్ఞతతో నిండింది. బావతో నా వివాహం, తాము చేసిన సరైన కార్యాల్లో ఒకటని ఆయన అనడం నాకు మరువలేని విషయమే.
***
అమ్మ కాస్త కోలుకొని, ఆషాడం ముగిసి, వదిన ఇంటికి వచ్చాకే నేను ఢిల్లీ వెళ్లాను.
***
ఆ తరువాత ఆరునెల్లకి నేను తల్లినవ్వబోతున్నాననితెలిసినప్
***
ఐదవనెలలో అమ్మని చూడ్డానికి వచ్చిన నన్ను ప్రయాణాలు మానేసి ప్రసవం అయ్యేంతవరకు అమ్మదగ్గరే ఉండమన్నారు అత్తయ్యావాళ్ళు. పుట్టబోయే నాబిడ్డ మీదే తమ వాత్సల్యాన్ని, ఆప్యాయతలని సారించారు అమ్మావాళ్ళు. కంటికి రెప్పలా చూసుకుంది నన్ను వదిన. ప్రశాంతంగా అనిపించిన సమయం...
***
కలలో కూడా ఊహించని విధంగా నాకు పుట్టబోయేది కవలలన్నవార్త, అందరితో పాటు నన్నూ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంటిల్లిపాదీ మరింత సంబరపడ్డారు.
కబురు తెలుసుకున్న బావ సిమ్లా నుండి ఫోన్ చేసాడు. “రేపటితో నా శిక్షణ కూడా పూర్తవుతుంది. వెంటనే బయలుదేరుతాను. పోస్టింగ్ వచ్చేవరకు ప్రతినిముషం నీతోనే గడుపుతానురా,” అన్న ఆనాటి బావ మాటల్లో ఉత్సాహం మరువలేనిది. నాలోనూ వెల్లువిరిసిన ఆనందం, అనుభూతి గుర్తే...
“సిమ్లానుండి ఢిల్లీ వెళ్ళి నింపాదిగానే రండి బావ. పదిరోజులుగా అంతటా భారీవర్షాలు. వాతావరణం బాగోక హైదరాబాదు ఫ్లైట్ లు రద్దవుతుండడంతో నాన్నగారు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చేవారమంతా తుఫానులా ఉంటుందట. చూసుకొని బయలుదేరు,” అంటూ నేను వారించిడం బాగా గుర్తు.
రాబోయే వారసుల కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తుండగా, మరునాడు పొద్దున్నే తాను హైదరాబాదుకి బయలుదేరుతున్నట్టు తెలియజేసాడుబావ.
***
ఆ రాత్రి కూడా పుట్టబోయే మా బిడ్డల గురించి, ఎన్నోఊహలతో ‘జీవితంలో ఓ నూతన అధ్యాయం’ అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్న జ్ఞాపకం.
***
మళ్ళీ ఓ పర్యాయం చదవడం అక్కడికి ఆపి, రెండు నిముషాలు కళ్ళు మూసుకున్నాను. మాభావిజీవితాన్ని తలుచుకుంటూ నిద్రలోకి ఒదిగిన ఆరాత్రే నా పాలిట కాళరాత్రి అయిందన్న జ్ఞాపకం మాత్రం నా మనస్సుని మరిగిస్తుంది. ఆ రాత్రి సంఘటన నా జీవితాన్ని, నన్ను, నా వ్యక్తిత్వాన్ని ఎంతలా మార్చిందో తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యాను...
...కాసేపటికి తేరుకుని, మళ్ళీ చదవనారంభించాను.
***
అందమైన భవిష్యత్తుని తలుచుకుంటూ నిద్రించిన నేను, గది తలుపుల మీద గట్టిగా బాదుతున్న శబ్దానికి గబుక్కున కళ్ళు తెరిచాను... నన్ను పిలుస్తున్న వదిన గొంతు అసహనంగా ఉంది. సమయం చూస్తే ఎనిమిదయ్యింది. నీరసంగా, బడలికగా అనిపించింది. లేచి తలుపు తీశాను. ఎదురుగా అమ్మ, వదిన... నాచేయి పట్టుకొని అమ్మ గదిలోకి తీసుకువెళ్ళింది వదిన. బద్దకంగా అమ్మ పక్కమీదకి ఒరిగాను.
“ఏంటి వదినా?... సందీప్ బావ రావడానికి ఇంకా సమయముందిగా. పదినిముషాలు ఆగు. లేస్తానులే”, అంటున్న నాతల నిమురుతూ అమ్మ నాకు సంగతి వివరించింది.
ఆర్మీవాళ్ళ ప్రత్యేక శిక్షణా విమానంతీసుకొని, సందీప్ హైదరాబాదు బయలుదేరాడని అత్తయ్య ఫోన్ చేసిందట.
“తెల్లారుజామున బయలుదేరిన వాడు, ఏడున్నర దాటినామరి ఇల్లు చేరలేదు. విచారిస్తే, విమానాశ్రయం వారు సమాచారం ఇవ్వలేకపోతున్నారు. అందుకే అన్నయ్య, నాన్న ఇప్పుడు అక్కడికే వెళ్లారు,” అంది అమ్మ.
అప్పటివరకు మౌనంగా వింటున్న నేను, ఎవరో చరిచినట్టుగా ఉలిక్కిపడి లేచాను. 'తెల్లారుజామున బయలుదేరిన సందీప్ ఇంకా ఇల్లు చేరలేదు’ అన్న మాటకి నవనాడులూ కుంగిపోయాయి. వొళ్ళంతా చల్లబడి పోతునట్టుగా అయింది. గదిలో భరించలేనంత నిశ్శబ్దం అలుముకుంది.
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దు:ఖం, ఆందోళనలతో కళ్ళు తిరిగినట్టయ్యి మంచంమీద వాలిపోయాను.
***
తల బరువుగా తోచింది. నీరసంగా ఉంది. కళ్ళు మెల్లగా తెరిచేప్పటికి నాగదిలోనే పడకపై ఉన్నాను. చుట్టూ చూస్తే అమ్మ, నాన్న, అన్నయ్య కూర్చుని ఉన్నారు. నా చేతికి సెలైన్ ట్యూబ్ ఉంది. పక్కనే నర్స్ కూడా.
గుండె దిటవు చేసుకొని, లేచి కూర్చున్నాను. నర్స్ వారించింది. అమ్మా, నాన్నగారు లేచి దగ్గరగా వచ్చారు. అమ్మ ఎదురుగా కూర్చుని నాచేతిని తన చేతిలోకి తీసుకొంది.
“ఎలా ఉందమ్మా నీకిప్పుడు? రెండు రోజులు నుండి మాటపలుకు లేకుండా పడున్నావు,” కంటనీరు పెట్టుకుంది అమ్మ. రెండురోజుల నుంచి నేను స్పృహలో లేననీ, అందుకే ఇంట్లోనే నర్సు ఉండి చూసుకుంటుందని అర్ధమయింది.
తలుపులు తీసుకొని, అత్తయ్య మామయ్య గదిలోకి వచ్చారు. బయటనుంచి గీతాపారాయణం సన్నగా వినబడుతోంది. అది విని ఒక్కసారి నిస్సతువైపోయి కళ్ళు మూసుకుపోయాయి. నాతల మీద వేసిన నాన్నగారి చేయి వణుకుతుంది.
“ధైర్యంగా ఉండాలమ్మా, అలా నీరసపడిపోకూడదు,” అన్నారు నాన్న. సందీప్ కోసం ఆశగా ద్వారం వైపు చూశాను. తడారిపోతున్న గొంతుతో, “మరి బావ... ఫ్లైట్ విషయం,” అన్నాను శక్తినంతా కూడదీసుకొని. కాసేపు గదిలో నిశ్శబ్దం...
“హైదరాబాద్ పరిసరాల్లో వాతావరణం ఉధృతంగా ఉండడంవల్ల, సందీప్ నడుపుతున్న చిన్నవిమానం ప్రమాదానికి గురై చెట్లల్లోకి కూలిందట. తుఫానులాంటి వాతావరణం మూలంగానే సమయానికి సహాయం అందకపోవడంతో, జరగకూడనిది జరిగిందమ్మా,” అంటూ భోరున ఏడ్చేశారు నాన్న.
నవనాడులు తెగిపోయిన్నట్టయింది. ఆలోచన స్థంబించిపోయింది.
మామయ్య దగ్గరగా వచ్చి, 'అమ్మా! కళ్యాణి, మనస్సుని దిటవు చేసుకొని, ధైర్యం తెచ్చుకొని పుట్టబోయే పసివాళ్ళని తలుచుకోనైనా, నువ్వు'... అంటూ ఆపై మాట్లాడలేకపోయారు. అమ్మ, అత్తయ్య అంతకన్నా ఎక్కువగా కన్నీరుమున్నీరుగా ఉన్నారు...
మనస్సు చల్లగా మొద్దైపోయింది. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోవడం గుర్తుంది.
***
వదిన గొంతు సన్నగా వినబడుతుంది. నన్ను తట్టి లేపుతుంది. ఎదురుగా అన్నయ్య, వదిన మసగ్గా కనబడ్డారు. అన్నయ్య నా కాళ్ళ వైపు మంచం పైన కూర్చోగా, వదిన నా ఎదురుగా కూర్చుని నా చేతిని తన చేతుల్లోకి తీసుకొంది. “చూడమ్మా కళ్యాణీ, ఇటు అమ్మావాళ్లకి, అటు మీ అత్తయ్యావాళ్ళకి కూడా ధైర్యాన్నివ్వగలిగింది నువ్వే. నీకు పుట్టబోయేకవలలకి నువ్వే ఆసరా అనిగ్రహించుకో. అంతా నీచేతుల్లోనే ఉందన్న నిజాన్ని నీవు తెలుసుకోవడం ఎంతైనా అవసరం,” అని నా బాధ్యతని వదిన గుర్తుచేసింది...
మనస్సులో ధైర్యం నింపుకొంటూ వదిన ఆసరాతో పడక మీదనుండి లేచాను.
***
‘నిజమే, బావ వారసులకి తల్లీతండ్రీ నేనే అయి, బావకి నచ్చేలా వాళ్ళని తీర్చిదిద్దాలి.
‘కాబట్టి నాకున్న శక్తిని అధిగమించి జీవించాలి, బాధ్యతలని స్వీకరించాలి’, అన్న ధృడసంకల్పంతో నాగదినుండి బయటికి కదిలాను.
‘నాలోని బాధని మరిపించగలిగింది భవిష్యత్తు మీద ఆశ ఒక్కటే’, అనుకుంటూ అడుగులు వేశాను. నా భర్త జ్ఞాపకాలని ఆలంబన చేసుకొని, ఆత్మస్థైర్యాన్ని పుంజుకొని, భావిజీవితాన్ని మలుచుకోవాలని నిశ్చయంతో అడుగులు వేసాను... ఆరోజున...
***
కన్నీళ్ళని తుడుచుకొని ‘జీవ సందీప్తి’ పుస్తకాన్ని మూసి వెనక్కి వాలాను.
అంతటి ఉహించని దుస్సంఘటనకి గురై సందీప్ బావ నాకు దూరమయిపోవడం న్యాయమా? చిగురిస్తున్న నా జీవితం విధి ఆడిన క్రూరమైన ఆటకి బలైపోవడం ధర్మమా?
సందేహాలు నావే, సమాధానాలు నావే. పదేపదే నన్ను తొలిచివేసేవే.
మనస్సు ఆక్రోశ్రించిన ప్రతిసారి, ఆందోళన పడిన మలిసారి గుండె దిటవు చేసుకోనేదాన్ని. సందీప్ బావ స్పూర్తి నాకు మార్గదర్శకమయింది.
అంతేకాదు. అర్ధంతరంగా ముగిసిపోయిన బావ జీవితం తలుచుకొని కృంగిపోకుండా, ఆయన కలలని నా గుండెల్లో నింపుకున్నాను. బావ బౌతికంగా ఈ భూమ్మీద లేకపోయినా, ఆయన ఆశయసిద్ధికి నేను బాధ్యత తీసుకోవాలని నిశ్చయించుకున్నాను.
***
ఈనాడు ‘శాంతి కుటీరం’ ద్వారా - సందీప్ వర్మ స్పూర్తి, మాకే కాదు - ఈ సమాజంలోని ఎందరో జీవులకి, మూగజీవులకి సైతం - చల్లని కాంతిని, శాంతిని, విశ్రాంతిని అందించే ‘జీవ సందీప్తి’ అయ్యింది.