ఉభయ కుశలోపరి - అయ్యగారి శ్రీనివాస్

forever

"నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నాను అంటే, నాకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు లేవని కాదు, వాటినన్నిటిని నవ్వుతో గెలుస్తున్నానని అర్ధం "
(నాకు చాలా నచ్చే వాక్యాలు గుర్తు చేస్తూ ఉంటాయి నన్ను ఎప్పుడూ నవ్వుతూ ఉండమని)
****************

ఒరేయ్ రామం, 
ఉభయ కుశలోపరి. 
దాదాపు సంవత్సరం దాటుతోంది నిన్ను, చెల్లెమ్మని చూసి. నాకు ఫోనుల్లో మాట్లాడటం ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. అందులోనూ, ఉత్తరంలో నా మనసు లోని భావాలు పంచుకున్నట్టు, ఫోనుల్లో కుదరదు. అందుకే, ప్రతీ నెలకి సరిపడా పోస్ట్ కార్డులు ఒకేసారి కొనుక్కుని పడేస్తా అల్మైరాలో. మా పోస్టుమాన్ వెంకటస్వామి, వీధిలోంచే రాఘవయ్య గారు పోస్ట్ అంటూ ఇంటికి వచ్చి, 'ఇదిగోండి మీ మిత్రుడు ఉత్తరం రాశారు' అంటూ ఆప్యాయంగా నువ్వు రాసిన ఉత్తరం చేతిలో పెడతాడు. పనిలోపని మా ఇద్దరి ఆరోగ్యం ఎలావుందీ తెలుసుకుని, మీ చెల్లమ్మ ఇచ్చిన చల్లని మజ్జిగ తాగి వస్తాను సార్ అంటూ వీడ్కోలు తీసుకుంటాడు. నిజానికి మా పోస్టుమాన్ వెంకటస్వామిని చూస్తే ఎవరో ఆప్తుడ్ని చూసినట్లు అనిపిస్తుంది మా ఇద్దరికీ. వారానికి ఒకసారయినా  వెంకటస్వామి తొ మాట్లాడందే ఏదో మిస్ అయినట్లు ఉంటుంది రా. అతని ద్వారానే, మన దానవాయిపేట్లో జరిగిన వింతలు విశేషాలు, అన్నీ తెలుస్తుంటాయి. ఈ ఆత్మీయతలు, అనుబంధాలు అనుభవించే ఆఖరి తరం బహుశా మనదే ఏమో అనిపిస్తూవుంటుంది, ప్రస్తుత సమాజం లోని మనుషుల్ని చూస్తూ వుంటే. 

నువ్వు నాకు రాసిన  ఉత్తరాలన్నీ  ఇప్పటికి నా దగ్గర జాగ్రత్తగా అట్టేపెట్టాను. 
నాకు ఇప్పటికి ఎప్పుడైనా తోచక పోతే, మనం  చిన్నతనం నుంచి రాసుకున్న ఉత్తరాలు చదువుకుంటూ వుంటా. ఏంటోరా, ఒక డైరీ చదివినట్లు, మన జీవితం మొత్తం ఆలా కళ్ల ముందు కనిపిస్తుంది అవి చదువుతుంటే. 
సమయం కన్నా వేగం గా పరిగెతోందిరా కాలం. దానితో పాటే వయసు, ఇక దిగే గమ్యాన్ని శరవేగం చేరిపోయేటట్లు.
దిగే స్టేషన్ వచ్చాక వాళ్లే, నేను కష్టపడకుండా  దింపుకుంటారని, నిశ్చింతగా వున్నా. సుబ్బరంగా రైల్లోని తోటి ప్రయాణికులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ. 
మన స్నేహితులు అంటూ వుంటారు ఇక్కడ  పార్క్ లొ రోజూ సాయంత్రం కలుసుకున్నప్పుడు, "నువ్వు వస్తే చాలురా, ఒక్క నిమిషం లొ వాతావరణం మార్చేసి మమ్మల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తావు" అని. 
ఏంటో రా చిన్నతనం నుంచి కష్టాలు నా వెనకాలే పడి నన్ను ఏడిపిద్దామని చూశాయి. "హత్తెరీ నీ పనిపడతా" అంటూ, కష్టం వచిన్నపుడల్లా  నవ్వడం మొదలుపెట్టాను.  అంతే, ఆ తరువాత ఎప్పుడూ కంట నీరు రాలేదు, ఎంత కష్టం వచ్చినా. ఆలా అలవాటు అయిపోయింది నవ్వడం.  

నేను  పార్కు లొ కూర్చున్నప్పుడు , అక్కడున్న  నేరేడు చెట్టు మీద మనతో కోతి కొమ్మచ్చి ఆడుకున్న మిత్రులు ఎక్కడున్నారో అని ఆలోచన వచ్చిన  వెంటనే , "అదేంటి, నేను  లేనా  తోడుగా నీకు,  జారిపోతున్న లాగుల్ని, పైకి పైకి లాక్కుంటూ, నేరేడు పళ్ళ కోసం మీరు నా మీద విసిరిన రాళ్లు,  నా మీదకి ఎక్కి వేసిన, పిల్లి గంతులు నాకు ఇంకా గుర్తే",  అంటూ  చిన్నతనం లొ మనం  ఆడుకున్న ఆ నేరేడు చెట్టు,  గాలికి తన తల అటూ ఇటూ ఊపుతూ నన్ను  ఎగతాళి చేస్తున్నట్లు ఫీల్ అవుతాను,అంతే, అప్రయత్నం గా నవ్వు వచ్చేస్తుంది నాకు. 

మంచి సరదాగా గడచిన చిన్నతనం, ఏదో జీవనం గడపడానికి ఒక ఉద్యోగం, వున్న ఇద్దరు పిల్లలకి చదువులు, పెళ్లిళ్లు, వారి వారి ఉద్యోగాలు, సంసారాలు, ఎప్పుడైనా చూడాలనుకుంటే, ఏడాదికో, రెండేళ్లకో ఒక నాలుగు రోజులుండి వెళ్లడం, నాకు తోడుగా మీ కష్టాలు అన్నీ నావి, నా సుఖాలు అన్నీ మీవి అంటూ, ఇప్పటికి చిన్న పిల్లాడ్నిలా సాకే, నీ చెల్లి, నాకు, నా మనసు కు తోడుగా  వున్నానంటూ,   ఎప్పుడూ నా మనసు కి స్వాంతన ఇచ్చేందుకు నువ్వు. ఇంకేం కావాలిరా  ఈ జీవితానికి.  అందుకే  అనుకుంటూ వుంటారా  భగవంతుడు చాలా అందమైన జీవితం ఇచ్చాడు నాకు అని.

జీవితానికి  ఆనందం ఇంత ఈజీ గా, చవగ్గా దొరికేస్తుంటే,  మనిషి కి వేరే కోరికలు పుడతాయంటావా చెప్పు.

తెలిసిన వాళ్ళు అంటూ వుంటారు,  పెళ్లి అయి అయిదు  దశాబ్దాలు దాటినా, ఒక యువ జంటగా,సరదాగా వుంటూ,  మా  లాంటి వయసు మళ్ళిన వాళ్ళ దగ్గరనుంచి, నేటి యువతరం వరకు,  మిమ్మల్ని, మీ చురుకుదనం  చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంటుంది, మీ ఆనందానికి కారణం చెప్పండి ప్లీజ్ అంటూ. 

 "సార్  మీలాంటి పెద్దలు ఏడు పదుల వయసొచ్చినా, ఇంత ఆనందం గా, హుషారుగా ఎలా ఉండగలుగుతున్నారు.    చాలా మంది ఈ నవతరం పిల్లలు , అప్పుడే తమ జీవితం లొ ఏదో కోల్పోయినట్లు, విచారంగా, విషాదంతొ, ఎక్కడో వుంది ఆనందం అంటూ, తెలిసి తెలియని, తప్పటడుగులు వేస్తున్నారు. మా కాలేజీ పిల్లలికి మోటివేషన్ గా చెప్తా,మీ గురించి,  ఆ రహస్యం చెప్పండి సార్"అంటాడు మా ఇంట్లో అద్దెకి వుండే యువ లెక్చరర్.  దానికి నేను నవ్వుతూ సమాధానమిస్తా, ఓకే వాక్యం లొ. "మనిషి ఆనందానికి అసలైన రహస్యం, మనం అనుభవించే మానసిక సంతృప్తేనయ్యా" అని. నేను చెప్పింది అర్ధం అవుతుందో  లేదో తెలియదు కానీ, ఒకవైపు  తలూపుతూ , వేరే చేత్తో నెత్తిమీద గోక్కుంటూ నిష్క్రమిస్తూ ఉంటాడు. 

మనతో  చదువుకుని అమెరికా లొ స్థిరబడ్డ సుబ్బారావు ,వాడి  భార్య తొ కలిసి, ఇండియాకి వచ్చేసాడు. మనవీధి లోనే వుంటున్నారు ఇల్లు కొనుక్కుని. ఏదో వ్యాపకంగా  ఉంటుందని, పాండురంగస్వామి గుళ్లో అర్చకుడి గా పనిచేస్తున్నాడు. అదేదో పెద్ద అమెరికా కంపెనీకి  డైరెక్టర్ హోదా లొ పనిచేసిన, కోట్లు సంపాదించిన  వ్యక్తి, ఈరోజు ఇంత సింపుల్ గా జీవించడం, ఒకింత ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది నాకు. తను సంపాదించిన డబ్బుతో, ఇక్కడ వృద్ధాశ్రమం స్టార్ట్ చేస్తారుట. ఎంత గొప్ప ఆలోచనో కదా. బతుకుతెరువు కోసం వేరే దేశాల్లో ఇంతకాలం గడిపేసిన మనవాళ్ళు ఒక్కొక్కరు, గోదావరి తీరానికి చేరుకుంటున్నారు, జీవిత చరమాంకం లో. 

అన్నట్లు, చెప్పడం మర్చిపోయా,  ఈ మధ్యే, మన పరాంకుశం మాస్టారు, వెళ్ళిపోయాడు.    "నిన్ననే మా కోడలు అమెరికా నుంచి ఫోన్ చేసింది రా ! మీ గోల భరించలేక మీ అబ్బాయి ఉద్యోగం కూడా సరిగ్గా చెయ్యలేక  పోతున్నారు. మీరు ఇద్దరూ ఛస్తే గాని మాకు శాంతి  రాదు  అని  నోటికొచ్చినట్లు  మాట్లాడిందిరా. చివరి దాకా ఎంతో జాగ్రత్తగా జీవితం గడిపేసిన నేను , ఆలోచించకుండానే ఇల్లు మా వాడి పేరు మీద రాసేశా. అంతే ఎప్పుడు పోతామా అంటూ ఇప్పుడు  గోతికాడ నక్క లాగా కాపు కాసుక్కూర్చున్నారు.నామీద నాకు బాధ లేదురా రాఘవ.  కానీ నేను వెళ్ళిపోయాక  పాపం ఈ ముసల్ది ఎలా నెట్టుకొస్తుందా అనేరా నా బెంగ. కూతురి మీద, కొడుకు మీద ప్రాణం పెట్టుకుని బతికాంరా, కానీ ఇద్దరూ మంచి గుణపాఠం చెప్పారు. అదీ ఈ ముసలి వయసు లో. మేము ఏమీ చేయలేని స్థితిలో.జీవితపు చరమాంకం లో మా సొంత ఇంట్లో మేం బయటివాళ్లమై పోయాంరా" అంటూ కళ్ల నీళ్లు పెట్టుకొని చెప్పారు మాస్టారు మొన్న ఈ మధ్య పార్కు లో కలిసినప్పుడు.

 అదే ఆఖరి సారి ఆయనతో మాట్లాడడం. మర్నాడు ఉదయం ఇక నిద్ర లేవకుండా శాశ్వత నిద్ర లోకి వెళ్ళిపోయారు. "రావడానికి కుదరడం లేదు అంకుల్,  కొంచెం దగ్గరుండి అన్నీ జరిపించేయండి, ఎంత ఖర్చు అయినా పరవాలేదు, నేను డబ్బులు  పంపుతా" అంటూ   మాస్టారి  కొడుకు  నాకు ఫోన్ చేసాడు. "ఎదురుగుండా లేడు కాబట్టి బతికిపోయాడు లేకపోతే నేనే వాడ్ని చంపేసేవాడ్ని ఏమో అన్నంత కోపం వచ్చిందిరా" నాకు. "

ప్రపంచంలో పిల్లల మీద ప్రేమతో, తమ చరమ జీవితాల్ని అంధకారం చేసుకుంటున్న  ఇన్ని కుటుంబాల్ని చూసి కూడా, మిగిలిన వాళ్ళు జ్ఞానోదయం తెచ్చుకోవడం లేదు. ఏదో పక్కవాడికి జరిగింది.. నాకు జరగదు అనే పిచ్చి ప్రేమే, పిల్లల్ని నమ్మేలా చేస్తుందేమో. తమ పిల్లల్ని  ప్రేమించడం ఏ తల్లిదండ్రులకైనా అత్యంత సహజం.  తాము దాచుకున్న కష్టార్జితం, ప్రేమ పేరుతో, వాళ్ళకి ముందే ధారాదత్తం చేయడం లోనే వస్తోంది అసలు సమస్య. ఎంతో క్రమశిక్షణ తొ జీవితాన్ని గడిపిన మాష్టారు, తన జీవిత చరమాంకం లో కేవలం  పిల్లల మీద ప్రేమ అనే బలహీనత తొ అష్టకష్టాలు, అవమానాలకి గురై, బతికుండగానే చనిపోయిన మనిషిలా బతికాడురా. 

చెప్తునుకదా, ఇంత వేదాంతం చెప్పే నాకే కళ్ళు చెమర్చాయి పరాంకుశం  భార్యని చూసి ఆ సమయం లొ. కట్టుకున్న ముతక నూలు చీర కొంగుతో, కళ్ళు తుడుచుకుంటూ అలాగే పిచ్చిదానిలా కూర్చొని వుంది, మాస్టారి శరీరం పక్కనే.  నేనే, తెలిసిన నలుగురిని పిలిచి, మాస్టారి మహా ప్రస్థానానికి ముగింపు పలికాను. "ఒక్కద్దానివీ  అక్కడ ఎందుకు వొదినా" అంటూ, నీ చెల్లి, ఆవిడ ని మన ఇంటికి తీసుకువచ్చేసింది. నాకూ మంచిదే అన్పించింది నలుగురు మధ్యలో ఉంటే, విషాదం కొంచెం మరుగున పడుతుందేమోనని.  చెప్పొద్దూ, మనం ముసలి వయసు వచ్చేదాకా బతికిన బతుకు ఒకటైతే, వయసు మళ్ళి, ప్రపంచానికి వీడుకోలు చెప్పేదాకా గడపాల్సిన బతుకులు ఎలా వుంటాయో అనిపిస్తుంటుంది.నిజానికి   మనిషి జీవితం లో ఎదుర్కొనే అతి పెద్ద పరీక్ష, జీవితపు చివరి రోజుల్ని ఎదుర్కోవడమే అని నా నమ్మకం.  బహుశా మన సుబ్బారావు స్టార్ట్ చేసే వృద్ధాశ్రమం లో చేరే మొట్టమొదటి వ్యక్తి, మాస్టారి భార్యేనెమో. 

అన్నట్లు చెప్పడం మర్చిపోయారా, చాలా కాలం తరువాత చూసా, మన గోదావరి గట్టున, కర్మ భూమి ని, మాస్టారు కి వీడ్కోలు చెప్పే టైమ్ లొ. చాలా పరిశుభ్రంగా, మనం స్వర్గానికి వెళ్లకుండానే, చూసినట్లు భూతల స్వర్గం లా చేశారు మంచి పూల తోటలు, చెట్లు, ఇక మనకి తోడుగా మన ఘంటసాల మాస్టారి భగవత్గీత.  చెప్పొద్దూ, అక్కడ ఉన్నంత సేపు చాలా ప్రశాంతత అనుభవిస్తూ, ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను, ఇక మీరు వెళ్ళొచ్చండీ  అయ్యగోరు అంటూ కాటికాపరి, నన్ను మేలుకొలిపేదాకా. 

ఈ మధ్య ఏదో వెతుకుతుంటే, నా పాత టేప్ రికార్డు కాస్సెట్  కనపడింది. అందులో చూస్తే, ఎప్పుడో, వయసులొ నేను  సరదాగా పాడిన పాటలు దొరికాయి. అప్పుడప్పుడు, మీ చెల్లి ని ఏడిపిస్తూవుంటాను ఆ పాటలు గట్టి సౌండ్ లొ పెట్టి. ఈ వయసు లొ ఇలాంటి పాటలేంటండీ అంటూనే , ముసి ముసి నవ్వుల్తో వింటూ ఉంటుంది. 

వీలు చేసుకొని మీరు ఇద్దరు ఒకసారి రాజమండ్రి రండిరా. అందరం సరదాగా గోదావరి వొడ్డున కూర్చొని, ఆ నది తల్లిని చూస్తూ కబుర్లు చెప్పుకోవాలని వుంది నాకు.  అసలే ఈ రైలు సూపర్ ఫాస్ట్ స్పీడ్ తొ   ఆఖరి స్టేషన్ కి  తొందరగా చేరిపోయేలా వుంది. 

అందుకేరా, గమ్యం రాక ముందే చక్కగా కొన్ని రోజులు మన నలుగురం, హాయ్ గా , ఆనందం గా, నేను పాడిన పాటలు పెట్టుకుని, నవ్వుకుంటూ,  గడుపుదామని వుంది. అన్నట్టు, మా చెల్లెమ్మ చేత, ఆవిడ స్పెషల్ వంకాయ బండ పచ్చడి చేయించుకోవాలి.  మార్కెట్లో మంచి వంకాయలు దొరుకుతున్నాయి కూడా. 

మీ చెల్లెలు  మిమ్మల్ని ఇద్దరినీ అడిగినట్లు చెప్పమంది. 

వెంటనే బయలు దేరి రండి మరి. వస్తారుగా. 

వుంటాను.. 

రాఘవ 

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి