కలం..ది పెన్ ( మినీ నవల) - సన్నిహిత్

the pen ( mini novel )

నాంది :

టైము అర్థరాత్రి పన్నెండు కావస్తోంది. ..

చిక్కటి చీకటి. కీచురాళ్ళ రొద!

ఊరికి దూరంగా ఒక పాత బంగళా !

ఎన్నో హార్రర్‌ సినిమాల్లో చూపించినట్టుగా .....ఒంటరిగా నిద్రపోతున్న పెద్ద రాక్షసుడిలా ఉంది ! చీకటి పరుచుకున్న సముద్రం లో నడి మధ్యన ఒంటరిగా గాలికి అల్లాడుతున్న పెద్ద ఓడ లా ఉంది.

ఆ బంగళా చుట్టూ అడ్డ దిడ్డంగా పెరిగిన చెట్లు. బంగళా ముఖ ద్వారం చాలా ఎత్తుగా ఉంది. దానికి పాత కాలం నాటి చెక్క తలుపులు బిగించి ఉన్నాయి. బంగళా చుట్టూ ఎత్తైన కాంపౌండ్‌ వాల్‌. బలమైన ఇనప గేటు. బంగళా ముఖ ద్వారాన్ని చేరుకోవాలంటే ఆ ఇనప గేటు దాటి సన్నటి సిమెంట్‌ బాట మీదుగా దాదాపు పావు కిలోమీటర్‌ నడవాలి.

మనిషి అన్నవాడు ఆ బంగళాలో నివసించి కొన్ని దశాబ్దాలు దాటి ఉంటుంది అన్నట్టుగా అస్తవ్యస్తంగా ఉంది వాతావరణం.

అటువంటి నేపథ్యంలో ...

నెమ్మదిగా నడుస్తున్నాడు ఋషి. అతడి మనసంతా ఉద్విగ్నంగా ఉంది. బంగళాను చేరుకోవడం అతని లక్ష్యం. ఎన్నాళ్ళ నుండో తను కంటున్న కల ఈ రోజు తీరబోతోంది. తాను కోరుకున్న వ్యక్తిని అతడు కలవబోతున్నాడు. అంతకంటే కావాల్సిదేముంది !

ఊరికి చివరగా ఉన్న ఆ బంగళా వైపు సాధారణంగా పగలే ఎవరూ రారు. అలాంటిది ఈ అర్థరాత్రి వేళ అతను నడిచి వెళ్తుంటే కొంతమంది ఆశ్చర్యంగా చూడసాగారు. ప్రాణాలమీద ఆశ ఉన్నవాడెవ్వడూ అలా బంగళా వైపు వెళ్ళడు. ఎందుకంటే ...ఎందుకంటే ..అది దెయ్యాల బంగళా !

బంగళా గేటు పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టు ఊడలు చిత్రంగా ఊగడం ప్రారంభించాయి.

జరగబోతున్న పరిణామానికి ముందస్తు సూచన అన్నట్టు గా ఉన్నాయి ఆ కదలికలు.

బంగళా గేటు దగ్గరకి చేరుకున్నాడు ఋషి. అంతలో ఎక్కడి నుండి వచ్చాడో ఒక వ్యక్తి. చూడ్డానికి పిచ్చోడి లా ఉన్నాడు. బాగా పెరిగిన గడ్డం ...లోతైన కళ్ళు. చేతిలో ఒక కర్ర ..చిత్రంగా అది ఒంపులు తిరిగి ఉంది.

" ఆగు ..బాబూ " అంటూ గట్టిగా అరిచాడు. ఆగిపోయాడు ఋషి. ఆగాక ' ఏంటన్నట్టు ' చూసాడు ఆ వ్యక్తిని.

" లోనికి వెళ్ళొద్దు బాబూ ...చాలా ప్రమాదం " అన్నాడు.

" దేనికి ప్రమాదం ? "

" లోపల దయ్యాలు తిరుగుతాయి బాబూ ..ఈ టైములో మరీ ఎక్కువ ..వద్దు బాబూ ..లోనికి వెళ్ళొద్దు " చెబుతున్నాడు

" ఏమీ పర్వాలేదు. ఇక్కడ వచ్చి కలవమని ఒక వ్యక్తి నాకు సందేశం పంపారు " చెప్పాడు ఋషి.

పగలబడి నవ్వాడు ఆ పిచ్చోడు. " నిన్ను... నిన్ను ...వచ్చి కలవమని చెప్పారా ...నీకు సందేశం పంపారా .. హా.. హా.. హా.. " అంటూ నవ్వుతున్నాడు. " పో... పో... ఇక్కడి నుండి పో.. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుండి పో..." నవ్వుతూనే ఉన్నాడు.

ఋషి ఆ పిచ్చోడి మాటలని లెక్క చెయ్యకుండా గేట్‌ మీద చెయ్యి వేసి తెరవడానికి ప్రయత్నించాడు.

ఆ క్షణం.. భూమ్యాకాశాలు ఏకమైనట్టు గట్టిగా నక్కల ఊళలు వినిపించాయి. ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది. గట్టిగా గాలి వీచడం మొదలయ్యింది . వాన రాకడ కు సూచనగా గాలి చల్లగా మారిపోయింది. కాసేపట్లో ..ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు భోరున వాన కురవడం ప్రారంభించింది.

ఒక వికృత కార్యానికి ఆ విధంగా శ్రీకారం చుట్టబడింది.

* * *

ఋషి ఆ బంగళా ను చేరుకోవడానికి గంట ముందు :

నలుగురు వ్యక్తులు నిశ్శబ్దంగా ఆ బంగళా లోకి చేరుకున్నారు. వాళ్ళతో పాటూ చేతులూ కాళ్ళూ కట్టేసి ఉన్న ఒక స్త్రీ ! గింజుకుంటూ అరవడానికి ప్రయత్నిస్తోంది

కానీ నోటికి ప్లాస్టర్‌ వేసి ఉండటం వల్ల చిన్న అరుపు కూడా బయటకు రావడం లేదు. లేతగా ...అందంగా ఉన్న ఆ స్త్రీ ఏం పాపం చేసిందో తెలియదు కానీ రాక్షసుల లాంటి వాళ్ళ చేతుల్లో పడింది ...బందీ అయింది. ఆమెకు ఏ హాని కలిగిస్తారో అని ప్రకృతి కూడా ఆశ్చర్యపోయి చూస్తోంది.

ఆ పాత బంగళాలో ఉన్న ఒక గదిలో పొడవాటి టేబుల్‌ పైన ఆమెను పడుకోబెట్టారు. అందమైన ఆమె శరీరాకృతి వాళ్ళని రెచ్చగొడుతోంది. ఆమెను దారుణంగా చంపాలని అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ముందు ఆమెను అనుభవించడానికి సిద్ధమయ్యారు. . అనుకున్నదే తడవుగా రంగం లోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు ...ఆమె ఆర్తనాదాలు ఆ బంగళా లో ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ చుట్టుపక్కల కిలోమీటర్‌ దాకా మనుషుల జాడ లేని ఆ ప్రాంతంలో ఆమె అరుపులు విని ..వచ్చి ఆమెను రక్షిందేవ్వరు ? రాక్షసానందం తీరాక నిదానంగా ఆమెను చంపడం మొదలెట్టారు. ..అంటే.. కొంచెం కొంచెం గా చంపుతున్నారు. వాళ్ళ మనసుల్లో పేరుకున్న క్రోధం అంతా తీరేలా చంపుతున్నారు. ఆమె చివరి శ్వాశ తీసుకుంటున్న దశలో ..ఎలాగూ చస్తుందిలే అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు…అదే వాళ్ళు చేసిన తప్పు !

టేబుల్‌ పై నుండి కిందపడి ఆమె పొర్లుతోంది. ఎవరినా వచ్చి తనని రక్షిస్తారేమో అని ఆశపడుతోంది...

ఆమె మనసు చదివినట్టు ఎక్కడి నుండో చిన్న శబ్దం వచ్చింది.. ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు ...ఆమె తల అటు తిప్పి చూసింది ..అంతే !

* * *

ప్రారంభం :

" అబ్బ ...ఎంతసేపూ నవలలు చదవడం ..పాటలు పాడుకోవడం....నీ ఆకలి సంగతి పట్టించుకో అన్నయ్యా ... ఇంటికి రా ..భోంచేద్దువు గాని " అంటూ బ్రతిమాలుతోంది సుమతి. పచ్చని మామిడి తోట మధ్య ఉన్న చిన్న పెంకుటింటి లో మడత మంచం మీద పడుకుని నవల చదువుకుంటున్న ఋషి అసహనంగా కదిలాడు.

" వస్తాను ..ఉండు " అంటూ చెల్లిని విసుక్కున్నాడు. అప్పటికే మధ్యాహ్నం కావస్తోంది. దూరంగా కనిపిస్తున్న పొలాల్లో కూలీలు పని కి విరామం ఇచ్చి భోజనాలకు కూర్చున్నారు. ఎక్కడి నుండో మోటార్‌ నడుస్తున్న శబ్దం వినబడుతోంది. చదువుతున్న నవల మూసేసి లేచాడు ఋషి.

ఇద్దరూ నడుస్తూ ఇంటికి వచ్చారు.

" ఏరా ..పొద్దున్ననగా తోటకు వెళ్ళి ఇప్పుడా రావడం " ప్రేమగా అడిగింది తల్లి అనసూయమ్మ .

ఆ మాటలకి సుమతి చురుగ్గా చూసింది. " ఇంకా నయం అమ్మా ..నేనున్నాను కాబట్టి ఊహా ప్రపంచంలో నుండి బయటపడి ఇంటికి వచ్చాడు. లేకపోతే సాయంత్రం అయ్యేది " అంది.

ఋషి " నిన్నూ .." అంటూ చెల్లెల్ని కొట్టబోయాడు. తుర్రున పారిపోయింది సుమతి.

" భోజనానికి కూర్చోరా " అంది అనసూయమ్మ.

చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు ఋషి. ప్రేమగా వడ్డించసాగింది అతని తల్లి. " కడుపు నిండా తినరా .. రేపు కాలేజీ హాస్టల్‌ కి వెళ్ళాక ఏం తింటావో ఏమిటో " అంది.

" అలాగేనమ్మా ..నాన్న ఎక్కడ " అడిగాడు ఋషి.

" ఏదో పని మీద బయటకు వెళ్ళార్రా ...వచ్చేస్తారు " అంది.

భోంచేసాక తన రూములోకి వెళ్ళి బెడ్‌ మీద నడుం వాల్చాడు ఋషి. రెప్ప వాల్చగానే అప్పటి దాకా చదివిన నవల లోని పాత్రలు కళ్ళ ముందు కదిలాయి. ఆ నవల ' వాణి ' అనే కొత్త రచయిత్రి వ్రాసింది. స్త్రీ మనసులోని భావాలను ఎంతో అందంగా వ్రాసింది ఆ రచయిత్రి. . ప్రేమ .. రొమాన్స్ ..ఇవన్నీ ఒక ఎత్తైతే ..నిజాయితీ అన్నది ఇంకో కోణం అని ఆ నవలలో వ్రాయబడింది. నిజాయితీ లేని ప్రేమ విలువ లేనిది అన్న విషయం ఎస్టాబ్లిష్ అయింది అందులో . నవలను చేతిలోనికి తీసుకుని వెనక అట్ట మీద ఉన్న రచయిత్రి ఫోటో చూసాడు. చాలా యంగ్‌ గా... అందంగా ఉంది ఆమె. అందం మాట అటుంచితే ఆమె రచనా శైలి మాత్రం అద్భుతం అనుకున్నాడు ఋషి.

నవలను గుండెల మీద ఉంచుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు.

" హాయ్‌ ఋషీ .." ఎవరో పిలుస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసాడు ఋషి. ఎదురుగా వాణి. రచయిత్రి వాణి. తను ఫోటో లో చూసిన దానికంటే ఎన్నో రెట్లు అందంగా ఉంది. నవ్వుతూ తననే పిలుస్తోంది.

" హాయ్‌ వాణీ " అంటూ దగ్గరకు వెళ్ళాడు ఋషి. " మీ నవల చాలా బాగుంది ..కంగ్రాట్స్‌ " అంటూ నవ్వాడు .

" థాంక్యూ ...అయినా ఈ రోజుల్లో కూడా నవలలు చదివే వాళ్ళు ఉన్నారా " ఆశ్చర్యంగా అడిగింది.

" ఎందుకుండరు ..నా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ..అరుదుగా .." అన్నాడు ఋషి.

" యా ..ఉండొచ్చు .." అంటూ నవ్వింది. ఇంకా ఏదో మాట్లాడుదామని ప్రయత్నించాడు ఋషి. ఎవరో నవ్వుతుండటంతో మెలకువలోకొచ్చాడు. ఇప్పటి దాకా తను వాణితో మాట్లాడింది కలలోనా అనుకుని ఆశ్చర్యపోయాడు.

" అన్నయ్యా ..అప్పుడే నిద్రలోకి జారిపోయావా ? " అంటూ నవ్వుతోంది సుమతి.

" నిద్రా లేదు ... పాడూ లేదు ..చెప్పు " అన్నాడు ఋషి.

" మెడికల్‌ కాలేజీలో జాయిన్‌ అయ్యాక నువ్వు చాలా మారిపోయావు అన్నయ్యా.."

" ఏం మారిపోయానమ్మా ..ఇంతకు ముందు లాగే ఉన్నాను కదా "

" లేదన్నయా ..ఎప్పుడూ నవలలు చదువుతూ ఏవో ఊహా లోకాల్లో విహరిస్తున్నావు..కొంపదీసి ప్రేమలో పడ్డావా ! " నవ్వుతూ అంది.

" అలాంటిదేం లేదమ్మా... ఎప్పటి లానే ఉన్నాను. కాకపోతే మన మధ్య దూరంపెరిగింది కాబట్టి మీకు అలా కనిపిస్తున్నాను ..సరేనా " అన్నాడు ఋషి. కాసేపు అదీ ఇదీ మాట్లాడుకున్నాక -

" సరే అన్నయ్యా .."అంటూ తుర్రున పారిపోయింది.

" పిచ్చి పిల్ల .." అనుకుని నవ్వుకున్నాడు ఋషి.

* * *

జీవితం ఒక లెక్కల టీచర్‌ లాంటిది. మనకు కొత్త కొత్త ప్రోబ్లెంస్‌ ని ఇవ్వడమే దాని పని.

హాయిగా చదువుకుంటున్న ఋషి జీవితంలో రచయిత్రి వాణి అనుకోకుండా ప్రవేశించింది. అంటే ..ఇందులో ఆమె తప్పేమీ లేదు. కేవలం ఆమె నవలలు చదివి విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటున్నాడు ఋషి. ఇందులో ఆమె అందం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆమె అందంగా లేకపోయి ఉంటే బహుశా ఋషి అంతగా ప్రభావితం కాకపోయేవాడేమో !

ఇంటి దగ్గర నుండి మెడికల్‌ కాలేజీకి వచ్చేసాక రొటీన్‌ గా క్లాసులకి వెళుతున్నాడు ఋషి. క్లాసు లో ప్రొఫెసర్స్‌ చెబుతున్న పాఠాలు కూడా చెవికెక్కడం లేదు. ఎప్పుడూ ఒకటే ధ్యాస ..ఆ ధ్యాస పేరు వాణి. !

క్లాసులయ్యాక హాస్టల్‌ రూముకొచ్చి బెడ్‌ మీద వాలిపోయాడు ఋషి . ఆటోమేటిగ్గా అతని మనసు వాణి మీదకు వెళ్ళిపోయింది. అలా ఆలోచనల్లో ఎంతసేపు గడిపాడో తెలీలేదు.

" రేయ్‌ ....మామా బయటకు వెళ్ళి చాయ్‌ తాగొద్దాం రా .." అంటూ లాక్కుపోయాడు రాజు. ఋషి బెస్ట్‌ ఫ్రెండ్‌ అతను. కష్ట సుఖాల్లో తోడుండే టైపు !

ఇద్దరూ బయటకొచ్చి హాస్టల్‌ ఎదురుగా ఉన్న టీ హోటల్‌ లో కూర్చున్నారు.

" ఏరా మామా ..ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు పరధ్యానంగా ఉంటున్నావేంట్రా " గట్టిగా అడిగాడు రాజు.

" అదేం లేదురా...నార్మల్‌ గానే ఉన్నాను "చెప్పాడు ఋషి. ఇంతలో టీ వచ్చింది . ఇద్దరూ సిప్‌ చెయ్యసాగారు. రోడ్డు మీద వాహనాలు రివ్వు రివ్వున సాగిపోతున్నాయి. జనాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హడావుడిగా సాగిపోతున్నారు.

రాజు అన్నాడు " మన మెడిసన్‌ సబ్జెక్ట్స్‌ ఎంతో కాన్‌ సంట్రేట్‌ చేసి చదివితేనే అర్థం కావు .అలాంటిది నువ్విలా అయిపోతే కష్టం రా..కొంచెం చదువు మీద దృష్టి పెట్టు"

" అబ్బ..ఆపరా నీ క్లాసు. చదువుకేమీ ఇబ్బంది రాదులే ! " అన్నాడు ఋషి.

" సరే నీ ఇష్టం పద " అంటూ లేచాడు రాజు. ఇద్దరూ హాస్టల్‌ కి వచ్చేసారు.

రాజు మాటలకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాడు ఋషి. కానీ మనస్సాక్షి నుండి తప్పించుకోలేడు కదా ! అందుకే మౌనంగా ఆలోచనల్లోకి జారిపోయాడు

* * *

వాణి పేపర్లు ముందేసుకుని వ్రాసుకుంటోంది.

మొదటి నవల వ్రాసాక కొంత గేప్‌ తీసుకుని రెండో నవల వ్రాయడం ప్రారంభించింది. చిన్నప్పటి నుండి సాహిత్యాన్ని ఎంతో ఇష్టంగా చదివింది. ఎప్పుడూ మనసు కథల మీదే ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక జాబ్‌ చెయ్యమని చాలా మంది ఎంకరేజ్‌ చేసారు కానీ ఉద్యోగాలకి ట్రై చెయ్యకుండా రచనల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.

దిగాక కానీ లోతు తెలియదంటారు పెద్దలు. సాహిత్యం చదవడం ఈజీ...సృష్టించడం కష్టం !

మొబైల్‌ రింగ్‌ అవడంతో వ్రాసుకుంటున్న వాణి లిఫ్ట్‌ చేసి " హలో.." అంది

అటువైపు నుండి " హలో ..నేను సవ్యసాచి ని..మాట్లాడుతున్నది వాణి గారేనా ? " అని వినబడింది.

కాసేపు మైండ్‌ బ్లాంక్‌ అయింది వాణి కి. సవ్యసాచి అంటే ..ప్రముఖ రచయిత సవ్యసాచి కాదు కదా అని ఆలోచించింది

" అవును సార్‌ ..నమస్కారం " అంది

" నమస్కారం.. మీరు వ్రాసినది చదివాను. బాగా వ్రాస్తున్నారు. మీతో మాట్లాడాలి..ఆఫీసుకు వచ్చి ఒకసారి కలవండి " అని ఫోన్‌ పెట్టేసాడు

అర్థం కాలేదు వాణి కి. సవ్యసాచి కి తనతో ఏం పని ? అతను గొప్ప రచయితే కావచ్చు ..కానీ తన ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆలోచనలో పడింది. అయినా ఒక సారి కలిసి వస్తే మంచిది అనుకుని రడీ అయింది.

సవ్యసాచి ఆఫీసు ముందు ఆటో దిగింది వాణి.

" సవ్యసాచి ..రచయిత " అన్న బోర్డ్‌ చూసి లోనికి వెళ్ళింది. వాణి ని చూడగానే " లోపలికి వెళ్ళండి మేడం " అని చెప్పాడు ఆఫీసు బాయ్‌.

లోపలి రూములోకి వెళ్ళింది వాణి.

చాలా నిశ్శబ్దంగా ఉంది అక్కడ . రైటింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుని వ్రాసుకుంటున్నాడు సవ్యసాచి.

వాణి ని చూడగానే లేచి " కమాన్‌ వాణీ ..రండి " అని ఆహ్వానించాడు. థ్రిల్లయింది వాణి. తను ఎంతగానో ఆరాధించే ఒక గొప్ప రచయితను ప్రత్యక్షంగా చూడటం ఆమెకు కలలా అనిపించింది.

" నమస్కారం సార్‌ " అని కుర్చీలో కూర్చుంది.

అందమైన ఆమె రూపాన్నితన్మయంగా చూడసాగాడు సవ్యసాచి. ఇబ్బంది గా కదిలింది వాణి.

సవ్యసాచి " చూడమ్మా వాణి... నువ్వు వ్రాసినది చదివాను. చాలా గొప్ప శైలి నీది. కాకపోతే దానికి కొంచెం మెరుగులు దిద్దాలి. అప్పుడే నీ రచనలకి మరింత ప్రొఫెషనాలిటీ వస్తుంది. రీడబిలిటీ పెరుగుతుంది. అదెలా సాధించాలో నీకు నేను ట్రైనింగ్‌ ఇస్తాను. ఒక నెల రోజుల పాటు నా దగ్గరకి వస్తూండు " అని చెప్పాడు

వాణి కి మొదట అర్థం కాలేదు. పనిగట్టుకుని ఈయన తననే ఎందుకు ప్రోత్సహించాలి ? అతని మనసులో ఏమైనా దురుద్దేశ్యం లేదు కదా ! అన్న సందేహం వచ్చిందామెకి. కానీ సవ్యసాచి మొహంలో అటువంటి భావాలేవీ కనబడకపోవడంతో " సరే సార్‌ ..తప్పకుండా వస్తాను " అని చెప్పింది.

తను వేస్తున్నది చాలా తప్పటడుగు అని ఆక్షణంలో వాణి కి తెలీదు . అలా తెలిస్తే ఆమె ఒప్పుకొనేది కాదు

* * *

వాణి ...

అందమైన సాహితీ వనంలో చిగురించిన మొక్క !

ఆమె తండ్రి గొప్ప తెలుగు పండితుడు. స్కూల్లో ఆయన తెలుగు పాఠం చెబుతుంటే విద్యార్థులు కదలకుండా వినేవారు... తమ కళ్ళముందు ఆ దృశ్యాలన్నీ కదులుతున్నట్టుగా అనుభూతి చెందే వారు . అందుకే తెలుగు సబ్జెక్ట్‌ లో మంచి మార్కులు వచ్చేవి అందరికీ.

ఇంట్లో కూడా అదే వాతావరణం ఉండేది. గొప్ప గొప్ప రచయితలు వ్రాసిన పుస్తకాలు ఇంటి నుండా ఉండేసరికి అప్రయత్నంగా వాటిని చిన్నప్పటి నుండే చదివింది వాణి. సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకుంది. ఎప్పటికైనా తను కూడా గొప్ప రచయిత్రి కావాలని కలలు కనేది.

చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆమెలోని రచనా తృష్ణ కు తార్కాణం.

ఆమె తండ్రి ప్రతీ రోజు ఇంటికి వచ్చాక వాణి ని కాసేపు చదివిస్తాడు. అందులో భాగంగా ఆమె పుస్తకాలని చెక్‌ చేయ సాగాడు.

ఒక నోటు పుస్తకంలో ఆమె వ్రాసిన కవిత చదివి ఆశ్చర్యపోయాడు ఆయన !

ఆ కవిత ఇలా సాగింది.

" నీ నవ్వుల మాయాజాలం

నా గుండెను కాల్చే మంత్రజాలం

నీ పలుకుల తియ్యదనం

నా నిదురను దోచే ఇంద్రజాలం

నీ తలపుల జడి వానే

నా అలజడి కారాగారం

నీ కరుణ ను ప్రసరిస్తే అది

నా పాలిట అమృత వర్షం ..

నా బ్రతుకున ..కోయిల గానం "

నాలుగు లైన్ల ఆ కవిత చదివి ఆయన ఆలోచనలో పడ్డాడు. ప్రేమ గురించి వ్రాయగలిగేంత వయసు లేదు వాణికి . మరి ఎలా వ్రాసింది?

" ఏమ్మా.. నువ్వు వ్రాసిన ఈ కవిత కు అర్థం నీకు తెలుసా " ప్రేమగా అడిగారు

" ఏమో నాన్నా నాకు తెలీదు. ఏదో అలా వ్రాయాలనిపించింది ..వ్రాసేసాను " అంది.

మనసులోనే ఆమెను మెచ్చుకుని తల పైన ప్రేమగా నిమిరారు. ఆ తర్వాత ఆ కవితను ఒక పత్రికకు పంపించారు. అది ప్రచురింపబడింది. ఆ పత్రికను తీసుకొచ్చి వాణి కి చూపించి సంబరపడ్డారాయన. " నువ్వు తప్పకుండా మంచి రచయిత్రి వి అవుతావమ్మా " అని దీవించారు.

కానీ విధి చాలా చిత్రమైనది. ఆమె చిన్నగా ఉన్నప్పుడే తండ్రి గుండెపోటుతో మరణించాడు. తీరని విషాదాన్ని మిగిల్చాడు.

అసహాయురాలైన ఆమె తల్లి నానా కష్టాలు పడి ఆమెను పెంచింది. వాణి కూడా చదువుపై దృష్టి నిలిపి డిగ్రీ వరకు చదివింది. ఏదో చిన్న జాబ్‌ చేస్తూ తల్లికి చేదోడు వాదోడు గా ఉండేది.

కానీ విధి మళ్ళీ వక్రించడంతో ఆమె తల్లి కూడా అనారోగ్యం పాలై స్వర్గస్తురాలైంది. వాణి ఒంటరి అయింది. !

ఆ ఒంటరి తనం ఆమెను మరింత రాటు దేల్చింది. ఖాళీ సమయాల్లో రచనలు చేయడానికి ప్రయత్నిస్తుండేది. లక్కీ గా ఆమె వ్రాసిన రచన ప్రచురించబడటం ... అది సవ్యసాచి దృష్టి లో పడటం జరిగింది. అక్కడే వాణి జీవితం మలుపు తిరిగింది.

* * *

వాణి ఫొటో చూసిన దగ్గర నుండి ఋషి మనసులో కలిగిన సంచలనం క్రమ క్రమంగా పెరగడం మొదలైంది. బహుశా అది ' లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ ' కావచ్చు . వాణి ని వ్యక్తిగతంగా చూడకపోయినా ఆమె రచనలు చదివి ...ఫోటో చూసి ..ఆమె వ్యక్తిత్వం గురించి ఒక అంచనా కు వచ్చాడు ఋషి. ఆమెను ఆరాధించసాగాడు. మనసు లో కలుగుతున్న స్పందనలకి 'ప్రేమ ' అని పేరుపెట్టుకున్నాడు. చదువు తగ్గించి ఊహల్లో విహరించడం ఎక్కువయింది. ఫ్రెండ్స్‌ వారిస్తున్నా కూడా అదే తీరు ! వాణి తో ఇంటరాక్ట్‌ అవాలనుకున్నాడు. ఫోన్‌ చేసి మాట్లాడేంత ధైర్యం లేదు. లెటర్‌ ద్వారా తన ప్రేమని ఆమెకు తెలియజెయ్యాలనుకున్నాడు. పెన్నూ పేపరూ తీసుకుని వ్రాయడం మొదలు పెట్టాడు. మనసు నిండా ప్రేమ అయితే ఉంది కానీ దాన్ని వ్యక్తపరచడం అంత సులభం కాదు కదా . చాలా సేపు ప్రయత్నించాక ప్రేమ లేఖ తయారయింది.

" ప్రియా ..

కనులు మూసినా ...తెరిచినా .. నీ రూపమే కనిపిస్తోంది.

ప్రేమ అన్నది నా శరీరాన్ని దహిస్తోంది.

నీవు లేని జీవితం వ్యర్థం అనిపిస్తోంది

నీలోనే నా బ్రతుక్కి అర్థం కనిపిస్తోంది

నను చూసుకొనే అద్దం నీవే అనిపిస్తోంది

కరుణిస్తావా నన్ను ...నీ దరికి చేరుతాను

ప్రేమించవా నన్ను ...నీ ముంగిట వాలతాను

కానీ..కానీ ..నా ప్రేమను మాత్రం కాదనకు

ఇంతటితో నా జీవితాన్ని ముగిస్తాను

ఇట్లు

నీ అభిమాని

ఋషి "

తలా తోక లేని ప్రేమలేఖను పూర్తి చేసి సంతృప్తిగా నవ్వుకున్నాడు ఋషి. వాణి తప్పకుండా తన ప్రేమను అంగీకరిస్తుంది అన్న నమ్మకంతో ఆ లెటర్‌ ని పోస్ట్‌ చేసాడు.ఎవడి పిచ్చి వాడికి ఆనందం ఆంటే ఇదే మరి !

* * *

సవ్యసాచి ఆఫీసుకి వెళ్ళడానికి బయలుదేరింది వాణి. కాగితాలు పెన్నూ లాంటి రచనా సామాగ్రి ఒక సారి సరిచూసుకుని స్కూటీ మీద రయ్యన దూసుకుపోయింది. దారి పొడుగునా ఆలోచిస్తూ ఉంది - సవ్యసాచి దగ్గర శిశ్యరికం తనకు కలిసి వస్తుందా అని . తప్పకుండా కలిసివస్తుంది..అలా కాకపోయినా తన పట్టుదలతో మరింత బాగా వ్రాయడం నేర్చుకుంటుంది. అది మాత్రం నిజం !

" రామ్మా.. రా.. " అన్నాడు సవ్యసాచి వాణిని చూడగానే .

అదే ఆఫీసు లో ఒకపక్కగా కుర్చీ టేబుల్‌ ఆమె కోసం కేటాయించబడ్డాయి.

" నువ్వు అనుకున్న సబ్జెక్ట్‌ మీద రెండు పేజీల ప్రారంభ సన్నివేశాన్ని వ్రాసి నాకు చూపించు " చెప్పాడు సవ్యసాచి.

" అలాగే గురూజీ " అని వ్రాయడం స్టార్ట్‌ చేసింది వాణి.

రెండు పేజీల సీన్‌ వ్రాసి సవ్యసాచి కి చూపించింది వాణి. నిశితంగా చదివాడు సవ్యసాచి. ఆయనేం చెబుతాడా అని భయపడసాగింది వాణి .

" అంతా బాగానే వ్రాసావు ..కానీ ప్రతీ ఎపిసోడ్‌ లోనూ కొంచెం రొమాన్స్ వ్రాయాలి. నీలాంటి అందమైన రచయిత్రి రొమాన్స్ వ్రాస్తే చదవడానికి చాలా మంది ఎగబడతారు. నిన్ను సోషల్‌ మీడియాలో ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు...పాపులారిటీ పెరుగుతుంది ... ఓకే నా" అని చెప్పాడు.

" అలాగే గురూజీ " అని చెప్పి వ్రాసుకోవడం లో మునిగిపోయింది.

కొంతసేపటికి " బావా ..." అంటూ వచ్చాడో వ్యక్తి. చూడ్డానికి యంగ్‌ కమెడియన్‌ లా ఉన్నాడు.

" ఏరా.. లంచ్‌ బాక్స్‌ తెచ్చావా " అన్నాడు సవ్యసాచి.

" తెచ్చాను బావా .." అని చెప్పి వాణి వైపు అదోలా చూడసాగాడు .

సవ్యసాచి -

" వాణీ .. వీడు నా బావమరిది . ముద్దుగా మేం బోకు అని పిల్చుకుంటాము. వీడి అక్కకు ... అంటే నా భార్యకు చేదోడు వాదోడు గా ఉంటాడని మా దగ్గరే ఉండమన్నాం. వీడితో కొంచెం జాగ్రత్త " అని బోకు వైపు తిరిగి " వచ్చిన పని అయింది కదా ..నువ్వెళ్ళు రా " అని అరిచాడు . మూలుగుకుంటూ వెళ్ళిపోయాడు బోకు.

లంచ్‌ టైములో వాణి తన బాక్స్‌ ఓపెన్‌ చేసి కొంచెం తింది. తర్వాత ఓ ఫైవ్‌ మినిట్స్‌ రిలాక్స్‌ అయి మళ్ళీ వ్రాసుకోవడం మొదలెట్టింది. వాణి శ్రమ .. సిన్సియారిటీ సవ్యసాచి కి నచ్చాయి. పని తప్ప ఇంకో దృష్టి లేదామెకి అనుకుని సంతృప్తి పడ్డాడు . ' ఈమెకు మంచి భవిష్యత్తు ఉంది ' అనుకుని నవ్వుకున్నాడు . సవ్యసాచి ఊహించినట్టు వాణి భవిష్యత్తు సవ్యంగా ఉంటుందంటారా ? ఏమో ! ఆ దేవుడికే తెలియాలి .

* * *

ఋషి వ్రాసిన ప్రేమలేఖ వాణి ముందు ఉంది. చదివాక కొంచెం కోపం వచ్చిందామెకి. ఫోటో చూసి... తను వ్రాసింది చదివి ప్రేమిస్తున్నానని లెటర్‌ వ్రాసాడంటే ఏ ఎడాలసెంటో అయుంటాడు లేదా ఇన్ ఫేక్చుయేషన్ లో ఉండి ఉంటాడు. ఇలాంటి వాళ్ళ లెటర్స్‌ పట్టించుకోవడం అనవసరం. తను ఎంచుకున్న ఈ రచనా రంగం లో కష్టపడి పైకి రావాలి. అదే తన లక్ష్యం అనుకుంది.

" హాయ్‌ ..వాణీ గారు ..ఎలా ఉన్నారు ? " వస్తూనే విష్ చేసాడు బోకు. చిరాగ్గా మొహం పెట్టింది వాణి.

" సారీ మిమ్మలని డిస్టర్బ్‌ చేసినట్టున్నాను " అనుకుంటూ సవ్యసాచి దగ్గరకు వెళ్ళిపోయాడు. వాణి రాసుకోసాగింది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడకు వచ్చాడు. చూడ్డానికి చిన్న సైజు పొలిటీషియన్‌ లా ఉన్నాడు. వాణి ని చూడగానే అతని కళ్ళు విప్పారాయి. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు ఆమెనే చూడసాగాడు. ఇబ్బందిగా ఫీల్‌ అయింది వాణి.

సవ్యసాచి వచ్చి " రండి రావు గారూ " అంటూ లోనికి తీసుకెళ్ళాడు. చాలా సేపు ఇద్దరూ ఏదో డిస్కషన్స్ లోకి వెళ్ళిపోయారు. కాసేపయ్యాక అతను వెళ్ళిపోతూ వాణి ని అదోలా చూసాడు.

రావు గారు ...ఈ పేరెక్కడో విన్నది వాణి. ఆలోచిస్తే గుర్తుకు వచ్చింది. అతను పెద్ద పేరున్న సినీ నిర్మాత. బహుశా ఏ స్క్రిప్ట్‌ పని మీదో సవ్యసాచి దగ్గరకు వచ్చి ఉంటాడు. కానీ అతని చూపే ఏదో తేడాగా ఉంది. ' ఏంటో ప్రపంచం అంతా వింతగా ఉంది.. ప్రతీ మగాడు ఆడదాన్ని ఎన్నడూ చూడనట్టు గుచ్చి గుచ్చి చూస్తారు. అదేం ఆనందమో ! ' అనుకుని వ్రాసుకోసాగింది.

సవ్యసాచి వచ్చి " చూడమ్మా వాణీ ...ఇప్పుడొచ్చింది నిర్మాత రావు. సినీ ఇండస్ట్రీ లో మంచి పేరుంది. నీ గురించి అడిగాడు. వీలైనప్పుడు నిన్ను పరిచయం చేస్తాను సరేనా. .." అన్నాడు.

ఆయన చెప్పేది అర్థం కాకపోయినా " అలాగే గురూజీ " అంది.

బోకు సవ్యసాచి తో " బావా ...వాణి గారు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు ..నువ్వైనా చెప్పు మాట్లాడమని " అంటూ బ్రతిమాలాడు.

" సిగ్గు లేదు రా నీకు. ఎద్దులా పెరిగావు. బుద్ధి లేదా ..ఆ అమ్మాయి ని చక్కగా వ్రాసుకోనీ ..నీ పిచ్చి వాగుడుతో డిస్టర్బ్‌ చెయ్యకు " అని చీవాట్లేసాడు సవ్యసాచి. మొహం గంటు పెట్టుకుని వెళ్ళిపోయాడు బోకు. ఒక అమ్మాయి ముందు తను అవమానించబడటం చాలా సీరియస్‌ గా తీసుకున్నాడతను. దానికి కారణమైన వాణి పొగరు అణచాలని నిర్ణయించుకున్నాడు

* * *

నిర్మాత రావు చాలా అసహనంగా ఉన్నాడు. సమయం రాత్రి పది దాటింది.

తన గెస్ట్‌ హౌస్‌ ముందు లాన్‌ లో కూర్చుని మందు సేవిస్తున్నాడు రావు. ఎంత తాగినా నిషా ఎక్కడం లేదు. వాణి ని ఎలా అనుభవించాలా అన్న సమస్య బుర్ర లో గిర గిరా తిరుగుతోంది.

వాణి అందం పదే పదే అతని కళ్ళముందు కదిలి చిరాకు పెడుతోంది. తన కెరీర్‌ లో ఎంతో మంది అందగత్తెలని అనుభవించాడు. వేషాలు ఇమ్మని వచ్చే ప్రతీ ఆడదాన్ని వాడుకున్నాడు. కానీ వాణి విషయం వేరు. ఆమె రచయిత్రి ..పైగా చాలా సాధారణమైన మధ్యతరగతి అమ్మాయి. తను తొందరపడి ముందుకెళ్తే ఎలా రియాక్ట్‌ అవుతుందో తెలీదు.

సవ్యసాచి ద్వారా ప్రయత్నించొచ్చు ..కానీ అతనికి ఇవేమీ పట్టవు ..కేవలం తన పని మీదే ధ్యాస. ఎలా ?

మొబైల్‌ తీసి సవ్యసాచి కి కాల్‌ చేసాడు.

" హలో నేను రావు ని " అన్నాడు

" చెప్పండి రావు గారూ " అట్నుండి సవ్యసాచి గొంతు

" సవ్య సాచీ ...నీకు తెలుసుగా.. కొత్త సినిమా ఒకటి తియ్యాలనుకుంటున్నాను. దానికి మంచి స్క్రిప్ట్‌ కావాలి. నీ దగ్గర పనిచేస్తున్న వాణి వ్రాస్తున్న సబ్జెక్ట్‌ నాకు పనికి వస్తుందేమో ! ఒక సారి ఆమెని నన్ను కాంటాక్ట్‌ చెయ్యమను " చెప్పాడు రావు

" ఓహ్‌ ..గ్రేట్‌ ..షి ఈజ్‌ వెరీ లక్కీ ...తప్పకుండా ఆమెకి చెబుతాను " అని పెట్టేసాడు సవ్యసాచి .

తెల్లని వన్నీ పాలు అని నమ్మే సవ్యసాచి కి రావు మనసు లోని దురుద్దేశ్యం తెలీదు.

మరుచటి రోజు వాణి రాగానే " నువ్వు చాలా లక్కీ అమ్మా ...మొదటి నవల పూర్తి కాక ముందే సినిమా అవకాశం వచ్చింది. నిన్న వచ్చిన ప్రొడ్యూసర్‌ రావు గారు నీ స్క్రిప్ట్‌ అడిగారు. అఫ్‌ కోర్స్‌ నీ కథాంశం నేను అతనికి కొంచెం చూచాయగా చెప్పాననుకో ! నువ్వొకసారి ఆయన్ని కలిసి మొత్తం స్టోరీ చెప్పాలి . సరేనా " అని చెప్పాడు . బాగా సంతోషపడింది వాణి. తర్వాత రోజు రావు గారిని కాంటాక్ట్‌ చేసింది. సాయంత్రం ఏడు తర్వాత గెస్ట్‌ హౌస్‌ కి వచ్చి సబ్జెక్ట్‌ చెప్పమన్నాడు రావు. కాసేపు తటపటాయించి " సరే సార్‌ ...వస్తాను " అని చెప్పింది. అదే ఆమె చేసిన తప్పు !

వాణి తనని తనతో మాట్లాడగానే ఒక వ్యక్తి కి ఫోన్‌ చేసాడు రావు.

" పిట్ట బోను లోకి వస్తోంది.. ఏ సమస్యా రాకుండా చూసుకోవాలి. అర్థమైందా ! " అన్నాడు

" అలాగే గురువుగారూ తప్పకుండా ..మీకే సమస్యా రాదు..హాయిగా ఆమెను అనుభవించండి " అని చెప్పాడు అవతలి వ్యక్తి.

ఫోన్‌ కట్‌ అయింది.

రావు గారు మాట్లాడిన వ్యక్తి - బోకు. సవ్యసాచి బామ్మర్ది... మిస్టర్‌ బోకు.

* * *

వాణి కి ప్రేమలేఖ వ్రాసిన తర్వాత ఆమె సమాధానం ఇస్తుంది అన్న ఊహల్లో బ్రతికేస్తున్నాడు ఋషి.

చదువు పట్ల పెద్ద గా శ్రద్ చూపడం లేదు . ఎప్పుడూ ఏదో స్వాప్నికావస్థ లో ఉండసాగాడు.

ఫ్రెండ్‌ రాజు వచ్చి " ఏరా ఋషీ ..ఎప్పుడూ ఇదే ధ్యాసలో ఉంటే ఎలా ...కాలేజీ లో సింగింగ్‌ పోటీ లు జరుగుతున్నాయి. పాటలు బాగా పాడుతుంటావు కదా ...పార్టిసిపేట్‌ చెయ్యరా " అని చెప్పాడు

తనకి కూడా డైవెర్షన్‌ లా ఉంటుందని అంగీకరించాడు ఋషి .

కాలేజీ ఆడిటోరియం స్టూడెంట్స్‌ తో కిక్కిరిసిపోయింది.

డయాస్‌ పైన ఒక పక్కగా వేసిన టేబుల్స్‌ ముందు జడ్జీ లు కూర్చొని ఉన్నారు. గాయకులు పాడటం కోసం మైక్‌ ఏర్పాటు చెయ్యబడింది. ఎనౌన్స్ మెంట్‌ చేసే కుర్రాడు వరుసగా పేర్లు పిలుస్తున్నాడు. మొదట వచ్చిన ఒక అబ్బాయి చక్కటి శాస్త్రీయ గీతాన్ని ఆలపించి అందరినీ అలరించాడు. జడ్జెస్‌ అతనికి మంచి మార్కులే వేసారు. తర్వాత వచ్చిన అమ్మాయి ఒక పాత మెలోడీని పాడింది. సుశీల గారి గొంతు ఇమిటేట్‌ చేస్తూ బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఆమెకు కూడా మంచి మార్కులే పడ్డాయి . తర్వాత ఋషి పేరు ఎనౌన్స్ చెయ్యబడింది. అందరూ చప్పట్లు ఈలలతో హోరెత్తించేసారు. ఆ శబ్దాల మధ్య ఋషి డయాస్‌ మీదకు వచ్చాడు.

గొంతు సవరించుకుని పాట మొదలు పెట్టాడు.

" నా పాట పంచామృతం...నా గానాన గీర్వాణి స్నానాలు సాగింప... " అని అందుకున్నాడు. శ్రోతలంతా మంత్రముగ్దులై వినసాగారు. ఒరిజినల్‌ సినిమా పాటలో ఉన్న సంగతులన్నీ చక్కగా తన గొంతులో పలికించాడు ఋషి. పాట పూర్తయ్యేటప్పటికి శ్రోతలంతా ఆనంద పారవశ్యానికి లోనై తన్మయత్వంతో ఊగిపోయరు. చప్పట్లతో దద్దరిల్లిపోయింది ఆడిటోరియం. జడ్జెస్‌ మొహాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనపడింది. మార్కుల సంగతి చెప్పేదేముంది. తర్వాత వరసగా వచ్చిన స్టూడెంట్స్‌ అంతా పాడి వెళ్ళారు. చివర్లో రిజల్ట్స్‌ ఎనౌన్స్ చేసారు. అందరూ ఊహించినట్టుగానే ఋషికి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది.

" కంగ్రాట్స్‌ మావా ..." " కంగ్రాట్స్‌ భయ్యా.." " కంగ్రాట్స్‌ అండి .." ఇలా ఎన్నో అభినందనలు. అన్నిటినీ ఆస్వాదించి హాస్టల్‌ వైపు వచ్చేస్తున్నాడు.

" హాయ్‌ ..ఋషి గారూ.." వెనకనుండి వినపడిందో తియ్యటి స్వరం.

తిరిగి చూసాడు.

ఒక అమ్మాయి ...చాలా అందంగా ఉంది.

" చెప్పండి " అన్నాడు

" నేను మీ జూనియర్‌ ని. ఇందాక ఆడిటోరియం లో మీరు పాడినది విన్నాను. చాలా బాగా పాడారు. కంగ్రాట్స్‌ ఫర్‌ విన్నింగ్‌ ద ప్రైజ్‌ .." అని చేయి సాచింది.

" థాంక్యూ " అని చేయందించాడు ఋషి.

ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకోసాగారు

. ఆమె తన గురించి చెబుతోంది. ఋషి కి అంత ఆసక్తి లేకపోయినా మర్యాద కోసం వినసాగాడు. అలా నడుస్తూ హాస్టల్‌ దాకా వచ్చేసారు.

ఋషి " బాయ్‌ అండి ..మా హాస్టల్‌ వచ్చింది. ఇక వెళతాను " అన్నాడు

" అప్పుడే హాస్టల్‌ వచ్చేసిందా .." డిజప్పాయెంట్‌ అయింది ఆ అమ్మాయి. " సరే ..అండీ ..మళ్ళీ కలుద్దాం " అని చెప్పి వెళ్ళిపోయింది.

రిలీఫ్‌ గా ఫీలయ్యాడు ఋషి.

హాస్టల్‌ లోపలికి వస్తుంటే ఎవరో చెప్పారు " రేయ్‌ ..ఋషీ ..నీకు ఆ అమ్మాయి తో మాటలేంట్రా ...ఈ సిటీ లో ఉన్న ఒక పెద్ద రౌడీ గాడి చెల్లెలది. దానితో మామూలుగా మట్లాడాలంటేనే భయం. అలాంటిది నువ్వు హాస్టల్‌ దాకా తీసుకొచ్చావు ...జాగ్రత్త " అని హెచ్చరించారు.

" ఇందులో నా తప్పేముంది " అనుకుని లైట్‌ తీసుకున్నాడు ఋషి. అది అతను అనుకున్నంత చిన్నవిషయం కాదని తర్వాత తెలుసుకున్నాడు .

ఆ రాత్రి ఋషి మొబైల్‌ రింగ్‌ అవసాగింది. ఏదో కొత్త నెంబర్‌ !

లిఫ్ట్‌ చేసి " హలో .." అన్నాడు

" హాయ్‌..ఏం చేస్తున్నారు ? " తియ్యటి స్వరం

" తిని నిద్రపోతున్నాను..మీరెవరు ? నాకు ఎందుకు ఫోన్‌ చేసారు ? " కొంచెం సీరియస్‌ గా అన్నాడు

" హేయ్‌..ఎందుకంత కోపం ? ఈ టైములో నా లాంటి అమ్మాయి ఫోన్‌ చేస్తే ఎగిరి గంతేస్తారు తెలుసా " హస్కీగా అంది.

" నాకు నిద్రొస్తోంది. ఇప్పుడు ఎగిరి గంతెయ్యలేను " వెటకారంగా అన్నాడు ఋషి.

" సాయంత్రం మీతో మాట్లాడాను ...అప్పుడే నన్ను మర్చిపోయారా "

" ఓహ్‌ ..సారీ ..మీరా ..ఎవరో అనుకున్నాను ..చెప్పండి " అన్నాడు

" ఏం చెప్పాలి...మీ మీద ప్రేమతో నా మనసు అల్లరి చేస్తోంది. నిద్ర పోదామంటే ..కనురెప్పలు మూసుకోవడం లేదు..అందుకే మీకు కాల్‌ చేసాను " మత్తుగా చెప్పింది

ఋషి కి మేటర్‌ అర్థమయింది. తను ఇంకా ఏదో మాట్లాడి ఆమెను ఊహల్లో ఉంచకూడదని అనుకున్నాడు.

సీరియస్‌ గా -

" చూడండి ...ఇప్పటికే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను .. నా మనసు ఖాళీగా లేదు... దయచేసి నన్ను క్షమించండి " అని ఫోన్‌ కట్‌ చేసేసాడు.

తర్వాత ఆమె ఎన్ని సార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యలేదు. కానీ ...తర్వాత జరగబోయేది తెలిసుంటే కొంచెం జాగ్రత్తపడేవాడు ఋషి.

మంచి నిద్ర లో ఉన్నాడు ఋషి . ఎవరో పట్టి లేపుతున్నట్టు అనిపించింది. నెమ్మది గా కళ్ళు తెరిచాడు. తన రూములో ఎవరో ముగ్గురు అపరచిత వ్యక్తులు. నిద్ర మత్తు వదిలిపోయింది

" ఏయ్‌... ఎవర్రా మీరు " గట్టిగా అరిచాడు.

" నీకు మా బయోడేటా చెప్పాల్రా .." రఫ్‌ గా అన్నాడో వ్యక్తి. ఇంకో వ్యక్తి వచ్చి ఋషి పెడ రెక్కలు విరిచి పట్టుకున్నాడు. గింజుకోసాగాడు ఋషి. మొదటి వ్యక్తి ఆజ్ఞ మేరకు మూడో వ్యక్తి ఋషి మొహం మీద బలంగా గుద్దాడు. ముక్కు దూలం పగిలి రక్తం నెమ్మదిగా కారింది. తర్వాత ఆ వ్యక్తి పొట్టలో బలంగా గుద్దాడు. బాధతో మూలిగాడు ఋషి. ఈ రాత్రి వేళ తనపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి కి కారణం తెలియడం లేదు.

మొదటి వ్యక్తి " ఏరా.. నా చెల్లి లవ్‌ చెయ్యమంటే ఫోజు కొట్టావంట ...తోలు తీస్తా నా కొడకా .. దేన్నో లవ్‌ చేస్తున్నానని చెప్పావంట ...దాన్ని నిన్ను ఇద్దరినీ ఏసేస్తా ..జాగ్రత్త ..." అని ఆగి.." నువ్వు నా చెల్లిని తప్ప ఎవ్వరినీ లవ్‌ చేసినా చంపేస్తా " అని వార్నింగ్‌ ఇచ్చాడు. తర్వాత నిశ్శబ్దంగా వెళ్ళిపోయరు వాళ్ళు.

బెడ్‌ మీద కూలబడిపోయాడు ఋషి. ఒళ్ళంతా నెప్పిగా ఉంది. తన మీద తనకే జాలి వేసింది ఋషి కి. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం అంటే ఇదే !

పొద్దున్న రాజు వచ్చి పరిస్థితి చూసేదాకా ఋషి అలా బెడ్‌ మీద నే పడి ఉన్నాడు. వెంటనే మెడికల్‌ రూము కి తీసుకెళ్ళి ఫస్ట్‌ ఎయిడ్‌ చెయ్యించాడు రాజు.

బాధ గా అనిపించింది రాజుకి. మనసులో ఎటువంటి కల్మషం లేని ఋషి కి ఈ సమస్యలేంటో అనుకుని ఆశ్చర్యపోయాడు. క్లాసు లకి వెళ్ళే మూడ్‌ లేక ఆ రోజు ఇద్దరూ హాస్టల్‌ లోనే ఉండిపోయారు.

* * *

సాయంకాలం దాటి చీకట్లు ముసురుకుంటున్నాయి. నగరమంతా విద్యుత్‌ వెలుగు దుప్పటిని కప్పుకుంటోంది.

వాణి రోడ్డుమీద కొచ్చి " ఆటో .." అని పిలిచింది. ముందుకొచ్చి ఆగిన ఆటో ఎక్కి " జూబ్లీ హిల్స్‌ .." అంది . ఆటో రయ్యన దూసుకుపోయింది.

వాణి మనసంతా ఎక్సైటింగ్‌ గా ఉంది. తను చెప్పే కథ రావు గారికి నచ్చుతుందో లేదో ? ఆయన పెద్ద నిర్మాత. తన కథ ఆయన చేతిలోపడితే ఇక తన కెరీర్‌ కి ఢోకా ఉండదు. చూడాలి ...ఏదో రకంగా తన కథ ను బాగా ప్రెజెంట్‌ చేసి ఆయన్ని మెప్పించాలి అనుకుంది.

రావు గారి గెస్ట్‌ హౌస్‌ ముందు ఆటో దిగి గేటు దగ్గరకి వెళ్ళింది. సెక్యూరిటీ గార్డ్‌ సెల్యూట్‌ చేసి గేటు తెరిచాడు. బహుశా రావు గారు తను వచ్చే సంగతి ముందుగానే చెప్పి ఉంటారు.

లోపల లాన్‌ దాటి గెస్ట్‌ హౌస్‌ లోకి వెళ్ళింది.

" కమాన్‌ వాణీ ..రా " అంటూ ఆహ్వానించాడు రావు . తెల్లటి లాల్చీ పైజామాలో శృంగార పురుషుడి లా ఉన్నాడు. వాణి ని ఆరాధనగా చూడసాగాడు.

వాణి సర్దుకుని కూర్చుని " సార్‌ ..కథ చెప్పమంటారా " అంది. గట్టిగా నవ్వేసాడు రావు.

" ఇలా అయితే ఎలా పైకొస్తావు ..కథ సంగతి తర్వాత ...ముందు ఏదైనా సర్దాగా చెప్పు " అదోలా అన్నాడు.

" ఏంటి సార్‌ మీరు మాట్లాడేది .." చిరాగ్గా అంది వాణి.

" కూల్‌ బేబీ ..కూల్‌ " అంటూ ఫ్రిజ్‌ తెరిచి మందు బాటిల్‌ బయటకు తీసాడు. " విల్‌ యు టేక్‌ వన్‌ పెగ్‌ " అడిగాడు

" వాట్‌ ద నాన్సెన్స్ ఈజ్‌ దిస్‌ .." అరుస్తూ లేచింది వాణి.

" కూల్‌ వాణీ కూల్‌ ... సరే కథ చెప్పు " అంటూ కూర్చున్నాడు రావు. వాణి చెప్పసాగింది. రావు మందు సిప్‌ చేస్తూ వింటున్నట్టు నటిస్తున్నాడు. కానీ అతని దృష్టి అంతా వాణి శరీరం మీదే ఉంది. ఇలాంటి ఆడదాన్ని అనుభవించని జీవితం వృధా ! కానీ వాణి అందుకు ఒప్పుకుంటుందా ...ఆశ నిరాశల మధ్య రావు మనసు ఊగిసలాడుతోంది. నిషా తలకెక్కాక -

" వాణీ ...నా మాట విను. కమాన్‌ ..హగ్‌ మీ ...కిస్‌ మీ ..నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను " ముద్ద ముద్దగా అన్నాడు.

వాణి కి అతడు ఇక్కడికెందుకు రమ్మన్నాడో అన్న దాని మీద ఫుల్‌ క్లారిటీ వచ్చింది. లేచి నిలబడి గుమ్మం వైపు కదిలింది. గబుక్కున వాణి చెయ్యి పట్టుకున్నాడు రావు.

" చూడు వాణీ ..నువ్వు వెర్టికల్‌ గా పైకి ఎదగాలంటే ..హారిజాంటల్‌ గా పడుకోవాలి. ఇక్కడ ఇదే సూత్రం ...నాకు కోపరేట్‌ చెయ్‌... నిన్ను దేవతలా చూసుకుంటాను " ఏదేదో వాగుతున్నాడు.

చేయి విదిలించుకుని గబ గబా పరుగులాంటి నడకతో బయటకొచ్చింది వాణి. సెక్యూరిటీ గార్డ్‌ వింతగా చూస్తున్నాడు. గేటు దాటి బయటకు వచ్చి ఎదురుగా వచ్చిన ఆటో ని ఆపి ఎక్కింది. ఆమె గుండెలు ఇంకా అదురుతూనే ఉన్నాయి. నిజంగా ఈ రోజు తను అదృష్టవంతురాలు. టైము బాగుండి ఆ రావు బారి నుండి బయట పడింది. లేకపోతే ఈ పాటికి తను బలై పోయేది. సీట్లో వెనక్కి వాలింది. ఆటో ఆమె ఇంటి వైపు దూసుకుపోతోంది...

తేరుకున్న రావు ఒక్కసారి చూసాడు. వాణి జాడ లేదు. " మైగాడ్‌ ..ఇది తప్పించుకుందా ! " అనుకుని పళ్ళు పట పటా కొరికాడు. వెంటనే బోకు కి కాల్‌ చేసాడు.

" రేయ్‌ .. అది తప్పించుకుంది... మన విషయం బయటికి రాకుండా చూడు " అని చెప్పి పెట్టేసాడు.

‘ తన కోరిక కాదంటుందా ...ఎంత ధైర్యం ..’ అహం దెబ్బ తింది రావుకి. వాణి ని చాలా గట్టి దెబ్బ కొట్టాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు .

* * *

దెబ్బలు తిన్న ఋషి కొంచెం కోలుకున్నాడు. వాణి మీద ప్రేమ ఇంకాస్త ఎక్కువయింది. ఊహల్లో ఆమె తో మాట్లాడుతున్నట్టు ...నవ్వుతున్నట్టు ...ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు...మనసు ప్రయాణానికి అడ్డు లేదు కదా !

అప్పుడప్పుడు వాణి కి ప్రేమ లేఖలు కూడా వ్రాస్తున్నాడు. కానీ వాణి దగ్గర నుండి ఎటువంటి రిప్లై రావడం లేదు . అయినా నిరాశ చెందకుండా వ్రాస్తూనే ఉన్నాడు.

* * *

పుల్లయ్య- ఒక చిన్నసైజు సినీ నిర్మాత. చిన్న చిన్న సినిమాలు తీస్తూ ...కొత్త వాళ్లని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అతని దృష్టి వాణి మీద పడింది. పత్రికల్లో ఆమె వ్రాస్తున్న వాటికి వస్తున్న మంచి స్పందన చూసి ఆమెకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే వాణి ని సంప్రదించాడు. వాణి అప్పటికే సవ్యసాచి దగ్గర నుండి వచ్చేసింది. స్వతంత్రురాలైంది...ఏ నిర్ణయమైనా తనే తీసుకోవాలి .

మొదట వాణి భయపడింది. రావు చూపించిన అనుభవం ఆమె ఇంకా మర్చిపోలేదు. అందుకే కొంచెం కేర్‌ ఫుల్‌ గా డీల్‌ చేసింది. తన దగ్గరకే వచ్చి కథ తీసుకోమని చెప్పింది. పేమెంట్‌ ..కథా హక్కులు ..మొదలైనవి ...జాగ్రత్తగా చూసుకుంది.

సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. కథా ప్రకారం ఒక పాత బంగళా కావాలి. దానికోసం పుల్లయ్య ఊరి బయట ఉన్న ఒక మంచి పాత బంగళా ని ఎంచుకున్నాడు. షూటింగ్‌ రోజున వాణి ని కూడా స్పాట్‌ కి రమ్మన్నాడు. " సరే సార్‌ ..వస్తాను " అని చెప్పింది.

తర్వాత రోజు షూటింగ్‌ స్పాట్‌ కి వెళుతుందనగా ఋషి వ్రాసిన ఉత్తరం ఆమె చేతిలో పడింది. తెరిచి చదివింది.

" వాణీ ..

ఎన్నో లెటర్స్‌ వ్రాసినప్పటికీ నువ్వు సమాధానం ఇవ్వడం లేదు. నా ప్రేమ నీకు ఇష్టం లేదా ? నా ప్రేమ లో నిజాయితీ నీకు కనపడ్డం లేదా ? ఈ సారి సమాధానం ఇవ్వకపోతే నేను చనిపోతాను.

ఈ లెటర్‌ నా రక్తం తో వ్రాసాను ...బై ..

- ఋషి "

విపరీతమైన కోపం వచ్చింది వాణి కి. ఏమనుకుంటున్నాడు వీడు ? లెటర్స్‌ వ్రాసి ప్రేమిస్తున్నాను అంటే తను ప్రేమ లో పడిపోవాలా ? పిచ్చి బాగా ముదిరింది వీడికి. సరిచెయ్యాలి వీడిని అనుకుంది. తను వెళ్ళబోతున్న షూటింగ్‌ స్పాట్‌ దగ్గరకు వచ్చి కలవమని రిప్లై ఇచ్చింది.

* * *

ఋషి మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది. వాణి తనకు రిప్లై ఇచ్చింది. అంటే తన ప్రేమను అంగీకరించినట్టే కదా ! ఫ్రెండ్స్‌ అందరికీ సంతోషంగా చెప్పుకున్నాడు.

" కంగ్రాట్స్‌ మామా ...నీ ప్రేమ ఫలించింది " అని అందరూ అభినందించారు.

వాణి చెప్పిన ప్రకారం ఆ పాత బంగళా దగ్గరికి చేరుకున్నాడు ఋషి. పగటి పూట చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది ఆ ప్రాంతం. పైగా దెయ్యల కోట లాంటి ఆ బంగళా !

అక్కడికి చేరుకున్నాక వాణి కోసం వెతుక్కున్నాడు. దూరంగా ...కెమేరా లైట్ల దగ్గర పక్కన వేసి ఉన్న కుర్చీలో కూర్చుని ఏవో పేపర్లు చదువుకుంటూ ఉంది వాణి. ఒక్క సారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది ఋషికి. దగ్గరగా వెళ్ళి " వాణీ గారూ ..." అని పిలిచాడు

తలెత్తి చూసింది వాణి.

" నేను ఋషి ని.." చెప్పాడు.

ఒక్కసారి తేరిపార చూసింది వాణి. " ఓహ్‌..నువ్వేనా ఋషి వి.. వెరీగుడ్‌ ..పద నీతో మాట్లాడాలి " అని కదిలింది.

ఋషి ఆమెను అనుసరించాడు. అతనికింకా ఇది కలలాగే ఉంది. తను ఎంతగానో ప్రేమించిన వాణి ...తన స్వప్న సుందరి వాణి... ఇక్కడ.. ఇప్పుడు ...తన కళ్ళ ముందు... నమ్మలేకపోతున్నాడు. దాని కంటే ముఖ్యంగా ...వాణి చాలా అందంగా ఉంది..ఫోటో లో కంటే ఇంకా బాగుంది. ఋషి మనసు ఆశల పల్లకీ లో ఊరేగ సాగింది.

వాణి చెప్పసాగింది -

" చూడండి ఋషి ...మీరు ఒక మెడికో ! రేపటి సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా నా వెనక ప్రేమ దోమా అంటూ తిరగడం ఎంత వరకు సమంజసం ? పైగా నాకు ఈ ప్రేమల పట్ల అంత ఇంట్రెస్ట్‌ లేదు. ఇంకెప్పుడూ నాకు లెటర్స్‌ వ్రాయవద్దు. ప్రేమిస్తున్నాని వెంటపడవద్దు. మంచి గా చెప్పాను ..వినండి. కాదని ఎక్కువ చేస్తే పరిణామాలు సీరియస్‌ గా ఉంటాయి. ...ఇక మీరు వెళ్ళండి ..బై " అని చెప్పింది.

గుండె బద్దలైపోయింది ఋషికి. కన్నీళ్ళు వచ్చాయి. కనబడకుండా చేత్తో తుడిచేసుకున్నాడు . ఫీలింగ్స్‌ ని కంట్రోల్‌ చేసుకుంటూ

" అలాగే వాణీ ..ఇక నిన్నెప్పుడూ డిస్టర్బ్‌ చెయ్యను. నన్ను క్షమించు " అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు.

ఆగకుండా కన్నీరు వస్తూనే ఉంది ఋషికి. ' ప్రేమించడం తన తప్పా ? వాణి ఎంత చులకనగా మాట్లాడింది... తన ప్రేమను ఎంత తక్కువ చేసింది ..పోనీలే... తను ఆకాశాన్ని అందుకోవాలనుకున్నాడు.. తనది అత్యాశే ...తనకి ఆ అర్హత లేదేమో ' అనుకుని సర్దిచెప్పుకున్నాడు.

రూము కి వచ్చాక బెడ మీద వాలిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. తలగడ అతని కన్నీళ్ళతో పూర్తిగా తడిసిపోయింది.

ఋషి ప్రేమ గాధ ఆ విధంగా ముగిసిపోయింది.

* * *

వాణి కథ వ్రాసిన సినిమా చాలా హిట్‌ అయింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ అది. వాణి కి మంచి పేరు వచ్చింది. నిర్మాత పుల్లయ్య ఆనందానికి అయితే హద్దు లేదు. బాగానే సొమ్ము చేసుకున్నాడు.

టీవీ చానెల్స్‌ వాణి తో ఇంటర్వ్యూ లని ప్రసారం చేస్తున్నాయి. ఆనందంతో ' శిఖరం ' మీద ఉన్నట్టు ఫీలవసాగింది వాణి.

ఒక రోజు ...ఏదో వ్రాసుకుంటుంది వాణి. ' మేడం.. ఐ యాం ఫ్రం ‘ చాటింపు ‘ టీవీ చానెల్‌. మీ ఇంటర్వ్యూ కావాలి ' అని ఒక వ్యక్తి ఫోన్‌ చేసాడు. ' సరే ..రండి ' అని అపాయింట్మెంట్‌ ఇచ్చింది.

కాసేపటికి వచ్చాడు ఆ వ్యక్తి.

" మేడం ...దిస్‌ ఈజ్‌ పరమహంస " అని పరిచయం చేసుకున్నాడు. అతన్ని చూసి వాణి తొలిసారిగా డిస్టర్బ్‌ అయింది. ' మగాళ్ళ లో ఇంత అందగాళ్ళు ఉంటారా ' అనుకుని అతన్నే కళ్ళు విప్పార్చి చూడసాగింది. కెమేరా ఏంగిల్స్‌ అవీ సెట్‌ చేసుకున్నాక ' మేడం ...స్టార్ట్‌ చేద్దామా ' అన్నాడు పరమహంస. గబుక్కున తేరుకుని ' అలాగే ' అంది.

అతను ఏదేదో అడుగుతున్నాదు...తను ఏదేదే చెబుతోంది. మనసు మాత్రం గతి తప్పి ఎక్కడికో వెళ్ళి పోయింది. ఇంటర్వ్యూ అయ్యాక థాంక్స్‌ చెప్పి పరమహంస వెళ్ళిపోయాడు.

వాణి మనసు పరమహంస మీద లాక్‌ అయింది. ప్రేమ అంటే ఏమో అనుకుంది కానీ దాని ప్రభావం ఇంత బలంగా ఉంటుందని అనుకోలేదు. అతన్ని మళ్ళీ కలవాలని మనసు తొందర పెడుతోంది.

ఒక నాటి సాయంత్రం ...ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో బుక్‌ ఫెయిర్‌ ఉంటే వెళ్ళింది. చిత్రంగా అక్కడ పరమహంస కనిపించాడు. వాణి ఎక్సైట్‌ అయింది..కానీ బయటపడలేదు.

" హాయ్‌ వాణీ గారూ ...వాటె సర్ప్రైజ్‌ ..." అంటూ అరిచినంత పని చేసాడు పరమహంస.

" హాయ్‌ .." అంది వాణి.

ఇద్దరూ సాహిత్యం గురించి చాలా సేపు మాట్లాడుకుంటూ మొత్తం స్టాల్స్‌ అన్నీ తిరిగారు. వాణి మనసు చాలా హాయిగా ఎగరసాగింది. ఆమె వయసు తంత్రులని మీటే విద్వాంసుడు పరమహంస అయ్యాడు. చాలా సేపు తిరిగాక " వాణీ గారు ...కెన్‌ యు జాయిన్‌ విత్‌ మి ఫర్‌ డిన్నర్‌ " అడిగాడు పరమహంస.

తటపటాయించింది వాణి. మనసు వద్దని చెప్పినా వయసు మాత్రం ' ఒప్పుకో ' అని చెప్పింది.

" ష్యూర్‌ ..వస్తాను " అంది .

ఇద్దరూ ఖరీదైన రెస్టారెంట్‌ లో ఎదురెదురుగా కూర్చున్నారు. మ్యూజిక్‌ సన్నగా వినిపిస్తోంది. లైటింగ్‌ డిం గా ఉంది. వాతావరణం ఇంటిమసీ ని పెంచుతోంది.

వాణి కొంచెం ఓపెన్‌ అయి మనసు విప్పి మాట్లాడసాగింది. పరమహంస ఆమె సౌందర్యాన్ని విభ్రాంతిగా చూస్తూ వింటున్నాడు. ఆర్డర్‌ చేసిన పదార్ధాలు వచ్చాక నెమ్మదిగా తినసాగారు.

డిన్నర్‌ పూర్తయ్యేటప్పటికి వారిద్దరి మధ్య మంచి మానసిక సామీప్యత ఏర్పడింది. డిన్నర్‌ అయ్యాక తన కారు లో వాణి ని ఇంటి దాక డ్రాప్‌ చేసాడు పరమహంస.

' గుడ్‌ నైట్‌ ' చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళిపోతుంటే చాలా లోన్లీ గా ఫీల్‌ అయింది వాణి.

ఇంట్లోకొచ్చి బెడ్‌ మీద వాలిపోతూ - ఇన్నాళ్ళకు తన మనసు కి నచ్చిన ఒక వ్యక్తి లభించాడని మురిసి పోయింది.

ఆ రాత్రి ఆమెకు నిద్దుర కరువయింది...పరమహంస పైన ఆలోచనలు ఎంతకీ తెగకపోవడం దానికి కారణం.

* * *

మెడిసన్‌ ఫైనల్‌ ఇయర్‌ లో కొచ్చాడు ఋషి. గతాన్ని మర్చిపోయి చదువు మీద శ్రద్ధ పెంచాడు. ఒక రోజు హాస్టల్‌ మెస్‌ లో భోంచేస్తుండగా ఫ్రెండ్స్‌ అందరూ మాట్లాడుకుంటున్నారు.

" ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కండక్ట్‌ చేస్తున్న పాడుతా తీయగా ప్రోగ్రాం సెలక్షన్స్ అవుతున్నాయి. మన కాలేజీ నుండి నువ్వు పార్టిసిపేట్‌ చెయ్యొచ్చు కదరా "అన్నారు.

ఆశ్చర్యపోయాడు ఋషి. " నాకంత సీన్‌ లేదురా..ఏదో కాలేజీ లెవెల్లో పడటం వరకు ఓకే గానీ టీవీ షో లో పాడటం అంటే మాటలా !చాలా టేలెంట్‌ ఉండాలి " అన్నాడు.

ఫ్రెండ్స్‌ లో ఒకడు " భలే వాడివి రా... నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు..అందరూ మొదట నీలా చిన్న గాయకులే ..తర్వాత కృషి చేసి పెద్ద స్థాయి కి వెళ్ళారు. ట్రై చెయ్యరా " అన్నాడు

ఇదేదో మంచి సలహానే అనిపించింది ఋషి కి.

ఆడిషన్స్ కోసం టీవీ వాళ్ళు రమ్మన్న చోటికి వెళ్ళాడు ఋషి.

అక్కడికి వచ్చిన ఔత్సాహిక గాయనీ గాయకులని చూడగానే ' బాలూ గారు హోస్ట్‌ చేస్తున్న ' ఆ ప్రోగ్రాం కి ఎంత క్రేజ్‌ ఉందో అర్థమయింది. ప్రతీ ఒక్కరి దగ్గర చిన్నపాటి డైరీ ఉంది. బహుశా అందులో చాలా పాటలు వ్రాసుకుని ఉంటారు. పైగా మొబైల్‌ ఫోన్‌ లో ప్లే అవుతున్న పాటలని హెడ్‌ ఫోన్స్ పెట్టుకుని వింటున్నారు. ఆర్గనైజర్స్‌ తమ పేరు పిలవగానే లోనికి వెళ్ళి పాట పాడి వినిపించి వస్తున్నారు.

ఋషి కొన్ని పాటలని మనసులో అనుకున్నాడు.

చాలా సేపటి తర్వాత అతని టర్న్‌ వచ్చింది. లోనికి వెళ్ళాడు.

లోపల టేబుల్‌ ,కుర్చీ వేసి ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులు జడ్జెస్‌ లా కూర్చున్నారు. ఒక మైకు కూడా ఉంది.

" ఏదీ ..ఒక పాట పాడు " అన్నాడు కళ్ళద్దాన్ని పైకి తోసుకుంటూ అక్కడి ఒక మెంబర్‌.

ఋషి గొంతు సవరించుకున్నాడు. చక్కటి పాత పాట ఒకటి ఆలపించడం మొదలుపెట్టాడు. పిన్‌ డ్రాప్‌ సైలెన్స్ !

పాట అయిన తర్వాత జడ్జెస్‌ నిశ్శబ్దంగా ఏదో వ్రాసుకున్నారు.

" ఇక నువ్వు వెళ్ళొచ్చు.. సెలెక్ట్‌ అయితే తెలియజేస్తాము " అన్నారు. ఋషి బయటకు వచ్చేసాడు.

హాస్టల్‌ కి వచ్చాక " ఏరా..టీవీ వాళ్ళు ఏమన్నారు ...పిలుస్తామన్నారా ?" ఫ్రెండ్స్‌ అడుగుతున్నారు.

" ఏమోరా..నా ప్రయత్నం చేసాను. ఇక వాళ్ళిష్టం " అన్నాడు ఋషి. తర్వాత ఆ సంగతి మర్చిపోయాడు ..రొటీన్‌ లో పడిపోయాడు .

కొన్ని రోజుల తర్వాత టీవీ వాళ్ళ నుండి పిలుపు వచ్చింది. ఆనందంతో ఊగిపోయాడు ఋషి. కానీ ఒక వైపు ద్వైదీభావం.. మెడిసన్‌ కూడా పూర్తవుతోంది. డాక్టర్‌ గా ఎదగాలా ..లేక గాయకుడిగా ప్రయత్నించాలా ? అన్న డైలమా ఋషి కి మొదలయింది.

ఫ్రెండ్స్‌ అంతా " ఏం పర్వాలేదురా ..ముందు గాయకుడిగా ప్రయత్నించు ...క్లిక్‌ అవకపోతే బాక్‌ అప్‌ గా మన డాక్టర్‌ వృత్తి ఎలాగూ ఉంది ...డోంట్‌ వర్రీ " అని ప్రోత్సహించారు.

కొండంత ఉత్సాహంతో పాడుతా తీయగా లో పాడటానికి నిర్ణయించుకున్నాడు.

మొదటి రోజు స్టుడియో లో ' శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ' గారిని చూడగానే వెళ్ళి పాదాభివందనం చేసాడు. ' చిరంజీవ...చిరంజీవ ' అని దీవించారాయన.

పోటీ ప్రారంభం అయింది. మొదటి రౌండ్‌ లో ఋషి నెగ్గుకొచ్చి రెండో రౌండ్‌ కి వెళ్ళాడు. తర్వాత ఫైనల్‌ రౌండ్‌ కి కూడా వచ్చాడు.

ఈ ప్రోగ్రాం టీవీ లో వస్తున్నప్పుడు వాణి దృష్టి లో పడ్డాడు ఋషి. ' ఓహో ...ఇతను గాయకుడు కూడానా ' అనుకుని ఆశ్చర్యపోయింది. ' పోనీలే ప్రేమ మత్తు వదిలి దార్లో పడ్డాడు ' అనుకుంది.

* * *

వాణీ మనసు ఇప్పుడు పూర్తిగా పరమహంస తో నిండిపోయింది. ప్రేమ అన్న పదానికి అర్థం నూరు శాతం తెలిసింది వాణి కి. దానికి కారణం పరమహంస !

స్త్రీ ని ఒక అపురూప మైన వస్తువులా ట్రీట్‌ చేస్తాడు పరమహంస. ' ఈ భూమ్మీద అత్యంత విలువైనది ఏది ?' అని అతన్ని అడిగితే టక్కున ' స్త్రీ ' అని సమాధానమిస్తాడు.

స్త్రీ అంటే అంత గౌరవం ..ఆరాధన అతనికి.

వాణి కథ వ్రాసిన రెండో సినిమా కూడా హిట్‌ అయింది. దాన్ని కూడా పుల్లయ్యే నిర్మించాడు. క్రమంగా వాణి కి సినిమా సర్కిల్స్‌ లో పాపులారిటీ పెరగసాగింది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు నిర్మాత రావుగారి కి చేరుతూనే ఉన్నాయి. అదును చూసి వాణి ని దెబ్బకొట్టాలని కాచుక్కూర్చున్నాడు రావు.

* * *

డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుని భోంచేస్తున్నాడు ' సవ్యసాచి '.

భార్య సుమ అన్నం వడ్డిస్తూ - " మీ శిష్యురాలు వాణి బాగానే పైకి వచ్చిందండీ " అంది.

చిన్నగా నవ్వాడు సవ్యసాచి. " తన కష్టం మీద తను పైకి వచ్చింది...అందులో నేను చేసిందేమీ లేదు " అన్నాడు

" అలా అంటారేంటండీ ...వ్రాయడం లో ఎన్నో మెళకువలను చెప్పారు..ఈ రోజుల్లో ఆ మాత్రం సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు "

" ఎందుకుండరు ...నేను కాకపోతే ఇంకొకరు ..ఎవరో ఒకరు మార్గదర్శకం చేస్తారు..పైగా ఆమెలో మంచి ఇంటెలిజెన్స్ ఉంది..అందుకే పైకి వచ్చింది" మెచ్చుకోలుగా అన్నాడు

మూతి ముప్పై వంకర్లు తిప్పింది సుమ . " నా తమ్ముడితో చాలా చులకనగా మాట్లాదిందట కదా "

" అవును..నీ తమ్ముడేమైనా పెద్ద పోటుగాడా ..మర్యాదగా మాట్లాడటానికి ... "

" అవును లెండి.. మీరే పెద్ద పోటుగాళ్ళు ... అందుకే దగ్గరుండి మరీ అన్నీ నేర్పారు. నా తమ్ముడు ఎందుకూ పనికి రాడనే కదా మీ చిన్న చూపు " చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.

" అబ్బ ...ఆపు నీ సోది ..ప్రతీ చిన్న దానికి కొళాయి విప్పేస్తావు " విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయాడు సవ్యసాచి. ఎంతవాడికైనా ఇంటిపోరు తప్పదు కదా !

ఈ సంభాషణంతా పక్కనుండి వినసాగాడు బోకు. వాడికి గుండెలు మండిపోతున్నాయి. తనని ఒక పురుగులా తీసి పడేసింది వాణి. అందుకే తెలివిగా దాన్ని నిర్మాత రావు దగ్గరకి పంపాడు . కానీ పులి లాంటి వాడి పంజా దెబ్బ నుండి తప్పించుకుంది. ఆ పథకం బెడిసికొట్టింది. కానీ ' ఏనాటికైనా దాని బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చెయ్యడం ఖాయం ! ' అని ప్రతిజ్ఞ పూనాడు. అసలు సవ్యసాచి ద్వారా అమెను ట్రబుల్‌ చేద్దామనుకున్నాడు కానీ అప్పటికే ఆమె సవ్యసాచి పరిధి లో నుండి వెళ్ళిపోయింది.

నిర్మాత రావుగారు ' వాణీ ' కదలికల మీద ఒక కన్నేసి ఉంచమని బోకు కి చెప్పాడు. ప్రస్తుతం బోకు చేస్తున్న ఉద్యోగం అదే ..వాణి ని గమనిస్తూ ఆమెకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నిర్మాత రావు గారి కి చేరవెయ్యడమే

తన గదిలో కూర్చుని సవ్యసాచి ఆలోచించసాగాడు. ...

వాణి ని ఎంకరేజ్‌ చెయ్యడంలో ఉన్న తప్పేమిటో అతనికి అర్థం కాలేదు.

తను ఎంతో ప్రతిభావంతులైన రచయితలని చూసాడు. కానీ వాణి వాళ్ళందరి కంటే భిన్నగా వ్రాస్తుంది.

తను కొత్తగా వ్రాసే రోజుల్లో సరైన మార్గదర్శకత్వం చేసే వారు లేక ఎంతో స్ట్రగుల్‌ అయ్యాడు . కథ వ్రాసి పత్రికకు పంపిస్తే అది పడింది లేనిదీ ఎప్పటికో తెలిసేది.అంతా అగమ్య గోచరం. ఒకప్పటి వర్ధమాన రచయిత గా తను పడిన బాధలన్నీ అతని కళ్ళముందు కదిలాయి. అవన్నీ దాటుకుని వచ్చి ఈనాడు తను పెద్ద రచయిత స్టేజ్‌ లో ఉన్నాడు.

కనీసం ఇప్పుడైనా కొంత మంది కొత్త రచయితలకు సహాయం చెయ్యడంలో తప్పేముంది ?

కాకపోతే ' వాణి ' అనే అందమైన స్త్రీ ని ప్రోత్సహించడం తో అందరికీ అదేదో వింత విషయంలా అనిపిస్తోంది. ఇంతకు ముందు తను ఎంతో మంది కుర్రాళ్ళని ఎంకరేజ్‌ చేసాడు. అందులో చాలా మంది ఇప్పుడు మంచి పొజిషన్‌ లో ఉన్నారు కూడా ..అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు దేనికి ?

సరే.. అవన్నీ అనవసరం. తను అనుకున్నది తాను చేసాడు. ఒక టేలెంట్‌ ని బయటి ప్రపంచానికి పరిచయం చేసాడు..అంతే ..దట్సాల్‌ ! అనుకుని

నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని వెనక్కు వాలాడు సవ్యసాచి .

* * *

ఋషి పాడుతా తీయగా ప్రోగ్రాం లో నెగ్గడానికి మరింత కృషి చేస్తున్నాడు. స్వర మాధుర్యానికి మరింత సాన పెడుతున్నాడు.

ఫైనల్స్‌ లో పాడే గాయనీ గాయకులందరినీ రిహార్సల్స్‌ కోసం అన్నపూర్ణా స్టుడియో కి రమ్మన్నారు టీవీ వాళ్ళు . ఋషి స్టుడియో కి వెళుతూ తన ఫ్రెండ్స్‌ ని కూడా తీసుకెళ్ళాడు.

ఒక చిన్న రూములో ఆర్కెష్ట్రా టీం ఉంది. సౌండ్‌ సిస్టం అదీ చక్కగా అమర్చి ఉంచారు. ఋషి తను పాడ బోయే పాటలని ఆర్కెష్ట్రా తో పాటూ ప్రాక్టీస్‌ చేసి పాడాడు. చిన్న చిన్న తప్పులు వచ్చినా ఓవరాల్‌ గా పాట లు బాగానే వచ్చాయి. తర్వాత వేరే సింగర్స్‌ ప్రాక్టీస్‌ చెయ్యసాగారు. ఋషి తన ఫ్రెండ్స్‌ తో కలిసి ఆ ప్రాక్టీస్‌ రూము నుండి బయటకు వచ్చాడు.

స్టుడియో లో ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. పక్కనే ఉన్న ఒక ఇండోర్‌ సెట్‌ లో సినిమా షూటింగ్‌ జరుగుతుందని ఎవరో చెప్పారు.

ఋషి ఫ్రెండ్స్‌ అంతా ' పదరా ...షూటింగ్‌ చూద్దాం ' అనడంతో అందరూ ఆ సెట్‌ లోనికి వెళ్ళారు. లోపలంతా చీకటి గా ఉంది. మధ్యలో లైట్స్‌ అన్నీ ఫోకస్‌ చెయ్యబడ్డాయి. ఆర్టిస్ట్‌ లు పొజిషన్‌ లో ఉన్నారు

ఎవరో గట్టిగా ' సైలెన్స్ ' అని అరిచారు. డైరెక్టర్‌ ' స్టార్ట్‌ కెమేరా ...ఏక్షన్‌ ' అని మైక్‌ లో అరిచాడు.

సీన్‌ కి అనుగుణంగా ఆర్టిస్ట్‌ లు గొప్పగా నటించసాగారు. ఋషి అలా ఆ నటనను చూస్తూ ఉండిపోయాడు. సినిమా చూస్తున్నప్పుడు తెలీదు కానీ ఇప్పుడు చూస్తుంటే నటన అనేది ఎంత కష్టమో అర్థమయింది ఋషికి. సీన్‌ అవగానే స్టుడియోలో లైట్లు వెలిగాయి. అప్పుడు చూసాడు ఋషి. డైరెక్టర్‌ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంది వాణి. ఏదో డిస్కస్‌ చేస్తోంది. క్షణం పాటు డిస్టర్బ్‌ అయ్యాడు ఋషి. ఈ లోగా వాణి కూడా ఋషి వైపు చూసింది. చూపులు కలుసుకున్నాయి. ఇద్దరి లోనూ చిన్నపాటి కలవరం. తలతిప్పి ఎటో చూస్తున్నట్టు నటించసాగింది వాణి.

' పదండ్రా ..బయటకు పోదాం ' అని వచ్చేసాడు ఋషి. మనసంతా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్టుగా ఉందతనికి. అయినా వాణి ని ప్రేమించింది తను. కేవలం ఒన్‌ సైడ్‌ లవ్‌ !

వాణి మీద ప్రేమ ని మరిచిపోయానని అనుకున్నాడు ఋషి. కానీ అది మనసు పొరల్లో ఇంకా తడిగానే ఉన్నదని ఈ సంఘటన తో తెలిసొచ్చింది.

మూసి ఉన్న తలుపుల వైపు ఎంతకాలం చూస్తే ఏం లాభం ? వాణి కి తన మీద ఎటువంటి ప్రేమ లేదు. ఉండదు కూడా . తనే ఈ మాయ లో నుండి బయటపడాలి. తన్‌ కెరీర్‌ పైన మరింత దృష్టి నిలిపి ఈ బాధ లో నుండి బయటపడాలి. ..గట్టిగా నిశ్చయించుకున్నడు...ఈ క్షణం నుండి వాణి ఎవరో తనకు తెలీదు..అంతే !

తిరిగి ప్రాక్టీస్‌ రూముకి వచ్చేసాడు ఋషి. అప్పటికి మిగతా సింగర్స్‌ ప్రాక్టీస్‌ పూర్తిచేసుకుని రిలాక్స్‌ అవుతున్నారు. ఋషి మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. చిత్రంగా అతని మనసు పాట మీద ఉండటం లేదు. ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్.

కీ బోర్డ్‌ ప్లేయర్‌ జాన్సన్ ఋషి వైపు చూస్తూ " ..ఏం బాబూ ఏమయ్యింది..ఇప్పటి దాకా బాగనే పాడావు కదా ..ఇలా అయితే విన్‌ అవడం కష్టం " అన్నాడు.

" సారీ సార్‌.. మళ్ళీ ట్రై చేస్తాను " అన్నాడు ఋషి. ఇంకోసారి ట్రై చేసాడు . కానీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నాడు. ఇక లాభం లేదని జాన్సన్ సరిచెయ్యడం మానేసాడు. ఆ రోజు ప్రాక్టీస్‌ ముగిసింది.

తన ఎకామిడేషన్‌ కి వచ్చాక ఆలోచనలో పడ్డాడు ఋషి. తను ఎంతో గాఢంగా ప్రేమించిన వాణి ఎటువంటి డిస్టర్బెన్స్ కి లోనవకుండా హాయిగా తన కెరీర్‌ పై దృష్టి పెట్టి ముందుకు సాగిపోతుంటే ...తనెందుకు కెరీర్‌ ని పాడు చేసుకోవాలి ?

తనలోనే తప్పుంది...సరిచేసుకోవాలి ...అనుకున్నాడు.

* * *

నిర్మాత రావు సమక్షంలో కూర్చుని ఉన్నాడు జర్నలిస్ట్‌ పరమహంస.

డ్రింక్స్‌ అప్పటికే గ్లాసుల్లో పోసి ఉన్నాయి. ' ఛీర్స్‌ ' కొట్టి సిప్‌ చెయ్యసాగారు .

రావు ఒక గుక్క వేసి " పరమహంసా ..ఎంతవరకు వచ్చింది నీకు చెప్పిన పని " అడిగాడు

పరమహంస భక్తి గా చూసి " అవుతుంది సార్‌...ఇప్పటికే పిట్ట లైన్‌ లోకి వచ్చింది. మనకు పూర్తిగా లొంగాలంటే ఇంకొంచెం టైము పడుతుంది " అన్నాడు

" పర్వాలేదు ...ఎంత టైము అయినా తీసుకో.. పని మాత్రం సక్సస్‌ ఫుల్‌ గా జరగాలి " అని ఒక నోట్ల కట్ట అతని మొహం మీదకు విసిరాడు.

ఆ కట్ట జేబులో పెట్టుకుని " మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి ...అది వచ్చి మీ కాళ్ళ దగ్గర పడేలా నేను చేస్తాను " అని ఇంకోరౌండ్‌ మందు ఫిక్స్‌ చేసుకున్నాడు.

మనుషుల మనస్తత్వాలు ఎంత చిత్రమైనవో అని అనిపిస్తుంది - రావు గారి ఆరాటం చూస్తున్నప్పుడు.

అతని స్థాయి ముందు వాణి చాలా చిన్న వ్యక్తి. కానీ కేవలం తన అహాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసమే వాణి తో తలపడుతున్నాడు.

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టడానికి తన కాలాన్ని , ధనాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఆమెను దెబ్బ కొట్టే ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఇది అతని మూర్ఖత్వమో లేక శాడిజమో అన్నది అతనికే తెలియాలి.

జిహ్వకో రుచి - పుర్రెకో బుద్ధి అన్నట్టు అతడి మనసులో కలిగిన వాణి పట్ల ద్వేషం ఏ స్థాయి పరిణామాన్ని సృష్టిస్తుందో కాలమే నిర్ణయించాలి.

రావు గారి దగ్గరి నుండి వచ్చేసాక వాణి కి ఫోన్‌ చేసాడు పరమహంస.

అప్పటికి టైము అర్థరాత్రి దాటింది. ఫోన్‌ డిస్ప్లే లో పరమహంస పేరు చూసి ఆనందంగా లిఫ్ట్‌ చేసింది వాణి.

" హాయ్‌ ..చెప్పండి " అంది

" నువ్వే చెప్పాలి డియర్‌..." నెమ్మదిగా అన్నాడు పరం

కిసుక్కున నవ్వింది వాణి. " పొద్దుట నుండి ఒక్కసారి కూడా కాల్‌ చెయ్యలేదు. మర్చిపోయారా " అంది

" నిన్ను మర్చిపోవడమా.. అది కేవలం నా మరణంతోనే సాధ్యం. " నొచ్చుకున్నట్టు అన్నాడు

" ఓహ్‌..సారీ డియర్‌..ఊరికే అన్నాను ..అంతలా ఫీల్ అవకు " అంది

" ఫీల్‌ అవకుండా ఉండగలనా ..." డ్రమెటిక్‌ గా అన్నాడు

" సరే ..సరే..ఎప్పుడు కలుద్దాం .." అంది

" దేవి గారు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు .." ప్రేమగా అన్నాడు

" సరే ..చూద్దాం ..గుడ్‌ నైట్‌ " అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. ఎందుకో ఋషి గుర్తొచ్చాడు ఆమెకి.

* * *

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు పొందిన ఒక టీవీ చానెల్‌ ఆఫీసు !

సీట్లో కూర్చుని అసహనంగా కదులుతున్నాడు ' కరినాగు ' . ఆ చానెల్‌ క్రియేటివ్‌ హెడ్‌ అతను. అసలు పేరు నాగరాజు. కానీ చాలా మంది ముద్దుగా కరినాగు అని పిలుస్తారు. సరిగ్గా అతని స్వభావానికి ఆ పేరు సరిపోతుంది కాబట్టి దాన్ని ఒక బిరుదు లా ఫీల్‌ అవుతాడు అతను.

" సార్‌ ..మీ కోసం ఒక రచయిత్రి వచ్చింది. " చెప్పాడు బోయ్‌.

" పంపించు " అన్నాడు

కాసేపటికి తన రూములోకివస్తున్న ఆమెను చూసి విపరీతమైన సంభ్రమానికి లోనయ్యాడు నాగు. చాలా మంది అందగత్తెలను చూసాడు అతను . కానీ ఇలా మైమరపించే అందాన్ని ఇదే మొదటి సారి చూడటం.

" కూర్చోండి " అన్నాడు.

" థాంక్యూ " అంటూ ఒద్దికగా కూర్చుంది వాణి. ఎవరో ఫ్రెండ్‌ చెప్పడంతో టీవీ చానెల్‌ కి వచ్చిందామె. డైలీ సీరియల్స్‌ కి తన కథలు సరిపోతాయేమో అని తెలుసుకోవడానికి వచ్చింది.

" చెప్పండి మీ పేరేంటి ..వచ్చిన పనేంటి ? " అని సీరియస్‌ గా పాయింట్‌ లోకి వచ్చేసాడు కరి నాగు.

" నాపేరు వాణి ...రచయిత్రి ని. ఇప్పటికే చాలా పత్రికల్లో కథలూ సీరియల్సూ వ్రాసాను. " చెప్పింది.

" ఓహ్‌ ..మీరా ...నాకెందుకు తెలీదు. మీ పేరు పత్రికల్లో చూస్తూనే వుంటాను " అని మహదానందంగా చెప్పాడు. రిలీఫ్‌ గా ఫీల్‌ అయింది వాణి.

" చెప్పండి నేను మీకు చెయ్యగలిగిన సహాయమేంటి " సూటిగా అడిగాడు.

వాణి " నా దగ్గర ఉన్న కథలని సీరియల్స్‌ గా టెలికాస్ట్‌ చేస్తారేమో కనుక్కోవడానికి వచ్చాను " అని చెప్పింది.

" సరే ...దాని దేముంది.. మీ స్క్రిప్ట్‌ ని నాకిచ్చి వెళ్ళండి ..అవి చూసాక మళ్ళీ కాల్‌ చేస్తాను " అని చెప్పాడు నాగు.

" సరే అండీ ...థాంక్యూ " అని చెప్పి అక్కడి నుండి బయటపడింది.

వచ్చేస్తూ " అంతా బాగానే ఉంది కానీ వీడి చూపులేంటి అలా ఉన్నాయి " అని మనసులో అనుకుంది.

వాణి వెళ్ళగానే సీట్లో వెనక్కు వాలి " ఇలాంటి దాన్ని అనుభవిస్తే చాలు.. జన్మ ధన్యం అయిపోతుంది. " అనుకున్నాడు కరినాగు.

బోయ్‌ వచ్చి టేబుల్‌ పైన టీ పెట్టి వెళ్ళాడు. సిప్‌ చేస్తూ వాణి ఇచ్చిన స్క్రిప్ట్‌ ని చదవసాగాడు. చాలా మంచి రచయిత్రి అని కొంచెం చదవగానే తెలుసుకున్నాడు.

కానీ అతని చానెల్‌ లో పని చెయ్యాలంటే టేలెంట్‌ ఒక్కటే సరిపోదు. పక్క వ్యవహారాలు కూడా ఉండాలి. అలా అవసరార్థం దగ్గరికి వచ్చిన ఎంతో మందిని అనుభవించిన చరిత్ర ఉంది అతనికి.

ఏదో రకంగా వాణిని తన దార్లోకి తెచ్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు .

వాణి వెళ్ళి చాలా సేపు అయినా కరి నాగు మనసు లో గందరగోళం తగ్గలేదు . ఆమె అందం రగిల్చిన చిచ్చు ఆరడం లేదు.

బోయ్‌ ని పిలిచి " కావేరి మేడం ఏ షూటింగ్‌ లో ఉందో కనుక్కో " అని చెప్పాడు.

కావేరి కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌. సినిమాల్లో ఫేడవుట్‌ అయ్యాక టీవీ సీరియల్స్‌ లోకి వచ్చింది. సినీ ఫీల్డ్‌ లో ఉన్నప్పుడు కుర్ర హీరోలని ' అల్లుడూ ' అని పిలుస్తూ అవసరాలకి వాడుకొనేది. కానీ మంచి నటిగా గుర్తింపు ఉంది. ఆమె పరిచయం అయిన తొలిరోజే కరినాగు తన వలలోకి ఆమెను లాక్కున్నాడు. ఆమెకు కూడా ఇలాంటి వాటి మీద పెద్ద అభ్యంతరం లేదు కాబట్టి పని ఈజీ అయింది. ఇద్దరూ ఒక అండర్‌ స్టేండింగ్‌ కి వచ్చేసారు. ఆమెకి అవకాశాలకి కొదవ లేకుండా పోయింది.

బోయ్‌ " సార్‌ ..కావేరీ మేడం ' నీకూ నాకూ ఒక్కడే మొగుడు' సీరియల్‌ షూటింగ్‌ లో ఉందంట " అని చెప్పాడు

" సరే " అని చెప్పి ఆమె సెల్‌ కి కాల్‌ చేసాడు కరి నాగు.

" చెప్పండి " అంటూ హస్కీ గా అంది కావేరి.

" రాత్రి కి ఫ్లాట్‌ కి రా.. చాలా గుర్తొస్తున్నావు " ప్రేమగా అన్నాడు కరినాగు.

" ఓకే .." అని చెప్పి కాల్‌ కట్‌ చేసింది ఆమె.

* * *

ఆ రాత్రి ..

కావేరి ఒడిలో సేద తీరుతున్నాడు కరినాగు. వారి మధ్య ప్రణయం ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడి విరిగి పోయింది. ..అలసి సొలసి పోయి.. ఇద్దరూ రిలాక్స్‌ అవుతున్నారు.

విశాలమైన అతడి చాతీ మీద వెంట్రుకలని పట్టి పీకుతూ ఆడు కుంటోంది కావేరి.

కరి నాగు అన్నాడు " రచయిత్రి వాణి గురించి ఎప్పుడైనా విన్నావా ? " అని

కాసేపు ఆలోచించి " ..అవును..పత్రికల్లో ఆ పేరు చూసాను " అంది

" ఆమె ఈ రోజు నా దగ్గరకు వచ్చింది..క్రియేటివ్‌ డిపార్ట్‌ మెంట్‌ లో జాయిన్‌ అవుతానంటుంది. "

" ఇంకేం ..తీసుకోండి. " అంటూ ఆగి .." కొత్త అమ్మాయి ...కొంచెం జాగ్రత్త " అంది

" అందుకేగా ..నీకు చెబుతున్నది. ఏం చేస్తావో ..ఎలా చేస్తావో నీ ఇష్టం ..పని అవ్వాలి. " అన్నాడు

" చూద్దాం...ముందు ఆమెను డైలీ సీరియల్స్‌ లో ఇన్వాల్వ్ చెయ్యండి " అంది

సంతృప్తిగా నవ్వుకుని మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాడు కరినాగు.

* * *

వాణి టీవీ చానెల్‌ ఆఫీసు లో జాయిన్‌ అయింది.

కరినాగు ఆమెను ఇంప్రెస్‌ చేసే పని లో మునిగిపోయాడు.

వాణి కి ఇవన్నీ తెలియవు. కష్టపడి పని చేసి మరింత గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది.

ఒక రోజు పొద్దున్న " వాణీ ...ఈ రోజు మనం సెట్‌ కి వెళ్దాం రా " అన్నాడు కరినాగు.

" నేనెందుకు సార్‌ .." సందిగ్ధంగా అంది వాణి

" అలా అంటావేంటి ? నువ్వు కథ వ్రాసిన సీరియల్‌ ఎలా తీస్తున్నారో తెలుసుకోవా ? "

కాసేపు ఆలోచించి "సరే సార్‌ ..వస్తాను " అంది.

కారులో కూర్చున్నాక " డ్రైవర్‌ ..అన్నపూర్ణా స్టుడియో కి పోనీ " అన్నాడు కరినాగు.

కాసేపట్లో కారు స్టుడియో కి చేరుకుంది.

సెట్‌ లోకి వెళ్ళేటప్పటికి కావేరి , మరో అమ్మాయి కాంబినేషన్‌ సీన్‌ లు తీస్తున్నారు.

కావేరి ది అందులో అత్త కేరెక్టర్‌ .. ఇంకో అమ్మాయి కోడలు.

కావేరి డైలాగ్‌ చెబుతోంది " ఒసేయ్‌..కోడలా ..నీ అంతు చూస్తానే " అని... డైలాగ్‌ ని బాగా సాగదీసి భయంకరమైన ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చింది.

కోడలు గట్టిగా నవ్వి .." ఒసేయ్‌ ..ముసలి దానా ..నువ్వు కాదు నేను..నేను.. నీ అంతు చూస్తాను. నిన్ను తిన్నగా ఆ నరకానికి పంపిస్తాను " అని అదో రకమైన మాడ్యులేషన్‌ లో కళ్ళు భయంకరం గా తిప్పుతూ చెప్పింది.

" కట్‌ .." అన్నాడు డైరెక్టర్‌.

కరినాగు ని చూసి దగ్గరకు వచ్చి " నమస్తే సార్‌ " అన్నాడు

" నమస్తే ..ఎలా వస్తోంది ఔట్‌ పుట్‌ "

" బాగుంది సార్‌..అయినా కావేరి మేడం ఉండగా మనకేంటి సార్‌ " అంటూ పక్కనే ఉన్న వాణి ని చూసి " నమస్తే మేడం ..చాలా బాగా వ్రాసారు " అని ఇంప్రెస్‌ చెయ్యడానికి ట్రై చేసాడు. కరినాగు అదోలా చూడటంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కావేరి వచ్చింది. వాణి వైపు చూస్తూ " ఏమ్మా ..ఎప్పుడూ స్పాట్‌ కి రావు " నిష్టూరంగా అంది.

కరినాగు వాళ్ళిద్దరికీ మాట్లాడుకొనే అవకాశం ఇవ్వడం కోసం అక్కడి నుండి తప్పుకున్నాడు.

వాణి " అలాంటిదేమీ లేదండి..పని వత్తిడి వల్ల రాలేకపోతున్నాను ..అయినా మీరు ఉండగా మాకేం ...అన్నీ చూసుకుంటారు కదా " అంది.

" అబ్బో మాటలు బాగానే నేర్చావే..సరే గానీ సాయంత్రం ఒక సారి ఇంటికి రా " అంటూ మరింత క్లోజ్‌ గా ఫీల్‌ అయ్యేలా చేసింది. వాణి కూడా పరిచయాలు పెంచుకోవాలనే చూస్తోంది. ఒక రంగంలో పైకి రావాలంటే పరిచయాలు తప్పనిసరి కదా !

" అలాగే వస్తానండీ .." అంది.

సాయంత్రం ఆఫీసు అవ్వగానే కావేరి ఇంటికి వెళ్ళింది వాణి .

ఒక ఖరీదైన ఫ్లాట్‌ లో ఉంటోంది కావేరి. రిచ్‌ ఇంటీరియర్‌ డెకరేషన్‌ తో అణువణువు నా గ్రాండ్‌ గా ఉంది ఇల్లు. ఆశ్చర్యంగా చూస్తోంది వాణి.

" నువ్వూ కొందువు గానిలే ఇలాంటి ఫ్లాట్‌ ..." అంటూ ప్రేమగా ఆహ్వానించింది కావేరి.

గెస్ట్‌ ఫార్న్మాలిటీస్‌ అన్నీ అయ్యాక నెమ్మదిగా మాటల్లోకి దించింది కావేరి.

కరినాగు మంచితనం గురించి ..అతని గొప్ప తనం గురించి.. నెమ్మదిగా వాణి బుర్ర లోకి ఇంజెక్ట్‌ చెయ్యసాగింది.

కాసేపటికి డోర్‌ బెల్‌ రింగ్‌ అయింది. కావేరి వెళ్ళి తలుపు తీసింది. లోనికొచ్చిన వ్యక్తి ని చూసి ఆశ్చర్యపోయింది వాణి. అతను కరినాగు.

" సార్‌ ..మీరు ఇక్కడ .." ఆశ్చర్యపోతూ అడిగింది.

" అవునమ్మా ..రిలాక్స్‌ అవ్వడానికి అప్పుడొప్పుడు వస్తుంటాను " అదోలా చెప్పాడు.

ఇలాంటివి మామూలే అన్నట్టు చూస్తోంది కావేరి. సోఫాలో కూలబడ్డాడు కరినాగు. అతని కి తగులుతున్నట్టుగా చాలా దగ్గరగా పక్కనే కూర్చుంది కావేరి. ఇబ్బంది గా ఫీల్‌ అయి వెళ్ళడానికి రడీ అయింది వాణి.

వెంటనే కావేరి " అదేంటమ్మా ..అప్పుడే బయలుదేరావు.. కాసేపు ఆగు " అంది. మర్యాద కోసం ఆగి ...ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కుర్చీ లో ఒక అంచున కూర్చుంది వాణి.

కావేరి లోనికి వెళ్ళి విస్కీ బోటిల్‌ ..స్నాక్స్‌ తెచ్చింది. ఒక గ్లాసులోపోసి కరినాగు కి సర్వ్‌ చేసింది.

" ఇవన్నీ మామూలే ...నువ్వేమీ కంగారు పడకమ్మా " అంది కావేరి.

' అనవసరం గా ఇక్కడికొచ్చాను ' అనుకుని పశ్చాత్తాప్పడింది వాణి.

ఒక్క గుక్కలో విస్కీ గ్లాసు ఖాళీ చేసి వాణి వైపు అదోలా చూసాడు నాగు.

అతని కళ్ళకు వాణీ ఇప్పుడు వెయ్యి రెట్లు అందంగా కనపడసాగింది. అందుబాటు లో ఉన్న అందాన్ని అనుభవించడం అతని హాబీ ! పైగా ఇంత దగ్గరగా ఉంటే తట్టుకోవడం మరీ కష్టం !

" కమాన్‌ వాణీ ..సిట్‌ ఇన్‌ మై లేప్‌ " అని ఆహ్వానించాడు

చురుగ్గా చూసింది వాణి. కావేరి జాడ లేదు.

" నాకు కోపరేట్‌ చెయ్యి ...నిన్ను మహరాణి ని చేస్తాను. ఎలెక్ట్రానిక్‌ మీడియా రంగంలో ఇక నీకు తిరుగు ఉండదు " అని ఊరిస్తున్నాడు.

వాణి కి తన మీద తనకే జాలి వేసింది. ' ఏమనుకుంటున్నాడు ఇతను ? పైకి రావడానికి తన శీలాన్ని ఫణంగా పెడుతుందనుకుంటున్నాడా ? నెవ్వర్‌ ..ప్రాణం పోయినా ఆ పని చెయ్యదు తను. కెరీర్‌ లో తను పైకి రావాలి ..కానీ ఈ మార్గం లో కాదు ' అనుకుని -

" ఏం మాట్లాడుతున్నారు సార్‌ మీరు ? మీడియా ఎంత శక్తి వంతమైనదో మీకు నేను చెప్పక్కర్లేదు కదా ! ఒక్క మాట నేను బయట చెబితే మీ పరువేమవుతుంది ? జాగ్రత్త " అని చెప్పి డోర్‌ తీసుకుని బయటకు వచ్చేసింది. " వాణీ ..వాణీ ..ఆగమ్మా .." అని వెనక నుండి కావేరి పిలుస్తోంది. వాణి వినిపించుకోలేదు.

కరి నాగు రగిలిపోయాడు. " ఎంత ధైర్యం దీనికి .నా కింద పనిచేస్తూ నన్నే కాదంటుందా ? " అని పళ్ళు పట పటా కొరుక్కున్నాడు.

" సారీ డియర్‌ ...చేప జారిపోయింది " అంటూ వగలు పోయింది కావేరి.

" ఇట్స్‌ ఓకే ...దాని సంగతి నేను తర్వాత చూస్తాను " అని వేడెక్కిన ఒంటిని చల్లబర్చుకోవడానికి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కరినాగు. ..పగబట్టిన కరినాగు.

* * *

వెక్కి వెక్కి ఏడ్వసాగింది వాణి.

పక్కనే ఉన్న పరమహంస ఓదార్చసాగాడు.

కన్నీళ్ళు తుడుచుకుంటూ " నేను రచయిత్రి గా పైకి రావాలంటే ఇవన్నీ తప్పవా ? " అంటూ బేలగా అడిగింది.

చిన్నగా నిట్టూర్చాడు పరమహంస. " ఊరుకో వాణీ ..ప్రతీ రంగం లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. దురదృష్టవశాత్తు నీకు ఈ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అన్నీ మర్చిపో .కెరీర్‌ పై మరింత దృష్టి పెట్టు. అంతా మంచే జరుగుతుంది " అని మేక వన్నె పులి మాటలు చెప్పాడు.

సంతోషంగా చూసింది వాణి. కనీసం తను ప్రేమించే పరమహంస తన అభీష్టాన్ని అర్థం చేసుకున్నాడు అని సంబరపడిపోయింది.

పరమహంస ఆలోచనలు వేరే గా సాగుతున్నాయి. వాణి కావేరి ఫ్లాట్‌ నుండి వెళ్ళిపోయిన తర్వాత కరినాగు ఇతనికి ఫోన్‌ చేసాడు. జరిగినది చెప్పాడు. వాణి ని చల్లబర్చమని ఆజ్ఞ వేసాడు. పరమహంస కు కరినాగు కి స్నేహం ఉందని వాణి కి తెలీదు. అసలు పరమహంస మంచి వాడు కాదన్న విషయం వాణి కలలో కూడా ఊహించలేదు. అంత నమ్మకం అతని పైన.

వాణి ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు పరమహంస. ఊహించని ఈ చర్య కు అదిరిపడింది ఆమె.

" ప్లీజ్‌ హంస ...నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనీ ..పెళ్ళికి ముందు నాకు ఇలాంటివి నచ్చవు " అని దూరంగా జరిగింది.

" ఓకే..ఓకే .." అని చెప్పి " ...సరే టేక్‌ రెస్ట్‌ ! మళ్ళీ కలుద్దాం " అని వెళ్ళిపోయాడు పరమహంస.

అతడు ఒక పాము అన్న విషయం త్వరలోనే బయట పడుతుందని వాణి కి తెలీదు.

* * *

పాడుతా తీయగా ఫైనల్స్‌ !

హైదరాబాద్‌ లో ఒక పెద్ద ఆడిటోరియం లో ఏర్పాటు చేసారు. పెద్ద పెద్ద వాళ్ళు అతిథు లు గా వచ్చారు.

లైవ్‌ టీవీ కవరేజ్‌ ఎలాగూ ఉండనే ఉంది. హాలు నిండా కిక్కిరిసిన ప్రేక్షకులు.

స్టేజ్‌ పైన వేసిన అందమైన సెట్‌ లో బాలూ గారి తో పాటూ మరికొంత మంది లబ్దప్రతిష్టులైన జడ్జెస్‌ కూర్చొని ఉన్నారు.

పోటీ ప్రారంభమైంది.

గాయకులందరూ అద్భుతంగా పాడటం మొదలుపెట్టారు. పూర్తిగా లీనమై పాడుతూ ప్రేక్షకులకు వీనుల విందు ని కలిగిస్తున్నారు.

ఋషి కూడా అన్ని రౌండ్స్‌ లో అద్భుతంగా పాడాడు. ప్రేక్షకుల అభినందనలని చూరగొన్నాడు.

చివరి కి వచ్చేటప్పటికి ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ !

బాలూ గారు మైక్‌ తీసుకుని ఫలితాలు ఎనౌన్స్ చేసారు.

" ద ఫస్ట్‌ ప్రైజ్‌ విన్నర్‌ ...మిస్టర్‌ ఋషి " అని గట్టిగా ఎనౌన్స్ చేసారు. చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఋషి కి ఇది కలలా అనిపించసాగింది. ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుని బాలూ గారి పాదాలకు నమస్కరించాడు. తర్వాత మిగతా విన్నర్స్‌ ని కూడా ఆయన ఎనౌన్స్ చేసారు. ప్రైజ్‌ మనీ అందరికీ చెక్కుల రూపంలో ఇవ్వబడింది. ఆ గాయకులు తెచ్చుకున్న కీర్తి తో పోలిస్తే ఆ ప్రైజ్‌ మనీ ఏపాటిది !.

" సర్వేజనా సుఖినో భవంతు " అంటూ ప్రోగ్రాం ముగించారు బాలూ గారు.

ఆనందాంబుధి లో తేలియాడుతూ తన స్నేహ బృందం సాక్షి గా విజయాన్ని ఆస్వాదించాడు ఋషి. ఎందుకో అతనికి ఆ క్షణం వాణి గుర్తుకొచ్చింది. ఆమె తన విజయాన్ని గుర్తిస్తే బాగుండును అనిపించింది. కానీ అది అసంభవం అని తెలుసు కాబట్టి ఆ ఆశను మనసులోనే సమాధి చేసాడు ఋషి.

మే గాడ్‌ బ్లెస్‌ హిం !

* * *

సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌ డోర్‌ కి వెళ్ళింది వాణి. నిర్మాత బలవంతం మీద వెళ్ళక తప్పలేదు.

బయట ఊళ్ళో ఉన్నంత సేపూ పరమహంస బాగా గుర్తుకు రాసాగాడు ఆమెకు. ఈ మధ్య కరి నాగు చూపించిన అనుభవం వల్ల ఆమె మనసు మరింత గాయపడి బలహీనమైంది.

అది నచ్చిన వాళ్ళ తోడు కోరుకుంటోంది. ఎందుకో ఆమెకు పరమహంస ను వెంటనే కలవాలని ..అతని బాహువుల్లో ఒదిగిపోవాలని అనిపించింది. నిర్మాత కు చెప్పి షూటింగ్‌ మధ్యలోనే తిరుగు ప్రయాణం అయింది.

ఇంటికి రాగానే పరమహంస ఉంటున్న ఫ్లాట్‌ కి వెళ్ళింది. ఒక కొత్త అనుభవం ఎదురవబోతోందని ఆమెకు తెలీదు.

ఫ్లాట్‌ లో పరమహంస ...అందమైన ఓ అమ్మాయి ని తనివితీరా అనుభవిస్తున్నాడు. నిర్మాత రావు పంపించిన అమ్మాయి ...పరమహంస ను లొంగదీసుకోవడానికి నిర్మాత రావు వేసిన ఎర !

తమకంగా పరమహంస " నీ లాంటి ఫిగర్‌ ని ఇప్పటి దాకా అనుభవించలేదు నేను. చాలా సుఖాన్ని ఇచ్చావు " అన్నాడు. కిల కిలా నవ్వింది ఆ అమ్మాయి.

" అయినా రావు గారి టేస్ట్‌ నాకు తెలుసు. నీ లాంటి దాన్ని అసలు వదులుకోడు. అప్పుడప్పుడు వస్తూండు " అన్నాడు.

" సరే ..మీరు కూడా కొంచెం నా సంగతి చూసుకోండి. సినీ ఫీల్డ్‌ లో హీరోయిన్‌ గా నేను వెలిగిపోవాలి " అంది .

" తప్పకుండా..నిన్ను ఒదులుకుంటానా ! " అన్నాడు పరమహంస.

ఇంతలో డోర్‌ బెల్‌ మోగింది. ఉలిక్కి పడ్డాడు పరమహంస . ' ఈ టైములో ఎవరు ...వాణి కూడా ఊళ్ళో లేదు కదా ' అనుకున్నాడు.

తలుపు తీసి చూసి వాణి కనపడగానే అదిరిపడ్డాడు.

" వాణీ షూటింగ్‌ నుండి ఎప్పుడొచ్చావు ? " కంగారుగా అడిగాడు.

అతడెందుకు కంగారు పడుతున్నాడో అర్థం కాలేదు వాణికి. తన రాకను చూసి ఎగిరి గంతేస్తాడనుకుంది. కానీ ఏదో తేడాగా ఉంది. లోనికొస్తూ పరిశీలించింది.

ఓరగా వేసి ఉన్న బెడ్రూం తలుపు వెనక అర్థ నగ్నంగా ఉన్న ఓ అమ్మాయి. జరిగింది అర్థమైంది. పరమహంస వైపు చూసింది. అతడేదో చెప్పాలని చూస్తున్నాడు. ఏమీ వినబడటం లేదు ఆమెకి. మెదడు స్తంభించిపోయింది. గుండె ముక్కలయింది. ప్రేమ అన్నది పరమహంస వాడిన ఒక ఆయుధం అని తెలిసిపోయింది.

" ఛీ ...నాదే పొరపాటు ...నీ కంటికి మళ్ళీ కనబడను " అని చెప్పి విసురుగా వచ్చేసింది వాణి. కన్నీళ్ళు ఆమె చెంపలను తడిపేస్తున్నాయి.

ఆమె వెళ్ళిపోయాక అలెర్ట్‌ అయ్యాడు పరమహంస. వాణి ఇక తన చేతి లో నుండి జారిపోయిందని అర్థమైంది. కోపంతో అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

* * *

దుష్ట చతుష్టయం ...మనం పురాణ గాధల్లో లో బాగా విన్న పదం...వాళ్లని తలచుకుంటేనే మనకు ఒళ్ళు జలదరిస్తుంది.

ఇక్కడ కూడా దుష్ట చతుష్టయం ఉన్నారు. వాళ్ళు - కరి నాగు.. నిర్మాత రావు ...పరమహంస...బోకు ! ఈ నలుగురూ కూడా దుష్టచతుష్టయమే !

ఆ దుష్ట చతుష్టయం ఈ రోజు ఒక చోట సమావేశం అయ్యారు. ఒక దుష్ట కార్యానికి పథక రచన చేస్తున్నారు.

వాళ్ళందరి మనసుల్లోనూ ఉన్న ఆలోచన ఒక్కటే ! చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నది.

వాళ్ళు కొడదామనుకుంటున్న చిన్న పాము ...వాణి. ! రచయిత్రి వాణి.

నిజానికి పగ తీర్చుకోవాల్సినంత పెద్ద శత్రువేమీ కాదు వాణి. జస్ట్‌ ..కేవలం ఈగో సంతృప్తి పరుచుకోవడం కోసం ఆమె పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు.

చాలా సేపు డిస్కస్‌ చేసుకున్న తర్వాత ..మందు బాటిల్స్‌ ఓపెన్‌ చేసారు.

రెండు రౌండ్స్‌ అయ్యాక అందరూ ఫాం లోకొచ్చారు. రెచ్చిపోయి వాగుతున్నారు.

పరమహంస అన్నాడు " రావు గారూ ...మీరేమీ వర్రీ కాకండి. ఆ వాణి ని బంగళా కు రప్పించే బాధ్యత నాది. అక్కడే దాన్ని తనివితీరా అనుభవించి ...తర్వాత సమాధి చేసేద్దాం. లేకపోతే ఆఫ్ట్రాల్‌ ..ఒక ఆడది మనల్ని కాదంటుందా ..." వాగుతున్నాడు.

రావు ఆనందంగా చూసాడు. కరినాగు వికృతంగా నవ్వుకున్నాడు. బోకు మాత్రం వాణి ని ముందు తనే ఎలా అనుభవించాలి అని ఆలోచిస్తున్నాడు. అందరిదీ ఒకటే వికృత మనస్తత్వం. పైకి పెద్ద మనుషుల్లా ఉండే వారి అసలు స్వరూపం. వాళ్ళ నీచ మైన ఆలోచనలకి పర్యవసానమేంటో కాలమే నిర్ణయించాలి .

* * *

కాలింగ్‌ బెల్‌ ఆగకుండా మోగుతోంది. వ్రాసుకుంటున్న వాణి విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పరమహంస.

విపరీతమైన కోపంతో డోర్‌ బలంగా వెయ్యబోయింది. అప్పటికే పరమహంస లోనికి వచ్చి " ప్లీజ్‌ వాణీ ...నేను చెప్పేది విను..అదంతా జస్ట్‌ ఫన్‌ ...నీ మీద నా ప్రేమ నిజం " అని కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు.

" ప్లీజ్‌ గెటౌట్‌ ఫ్రం హియర్‌ ..హౌ డేర్‌ యు టు ఎంటర్‌ ! " అని అరిచింది.

" వాణీ ప్లీజ్‌ ..ప్లీజ్‌ " అంటూ దగ్గరగా వచ్చి ఆమె ముక్కు మీద కర్చీఫ్‌ ఉంచాడు. నెమ్మదిగా మత్తులోకి జారిపోయింది వాణి. కాసేపటి తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ఊరి చివరి దెయ్యాల బంగళా వైపు దూసుకు పోతోంది. వాణి ఆ విధంగా కిడ్నాప్‌ అయింది. ఆ దుష్టచతుష్టయం బారిన పడి దారుణంగా రేప్‌ చెయ్యబడింది. తర్వాత కొన ఊపిరి తో కొట్టుకుంటున్న ఆమెను సమీపించిందో ఆకారం !

(ఇంటెర్వల్‌)

సన్నటి నీడ తనవైపు కదిలి వస్తోంటే విభ్రాంతి గా చూస్తోంది వాణి.

క్రమంగా ఆ నీడ ఒక మనిషిదని అర్థమయ్యాక ఆశ కలిగింది. " ప్లీజ్‌ సేవ్‌ మీ ..ప్లీజ్‌ " అని బలవంతం మీద అంది. కానీ ఆ మాటలు వస్తున్న వ్యక్తి కి వినిపించి ఉంటాయన్న నమ్మకం లేదు.

అతను దగ్గరగా వచ్చాడు. వాణి ని చూసి " నన్ను క్షమించమ్మా ...నిన్ను రక్షించేంత శక్తి నా దగ్గర లేదు.ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. " అన్నాడు.

ఆ వచ్చిన వ్యక్తి ....భైరవానంద స్వామి. !

క్షుద్ర దేవతోపాసకుడు. క్షుద్ర విద్యల్లో ఒక లెవెల్‌ వరకూ అన్నీ సాధించాడు. అంటే ..ఆత్మలతో ఇంటెరాక్ట్‌ అవడం.. పరకాయ ప్రవేశం ..లాంటి విద్యలు. ! అంతకంటే పై లెవెల్‌ కి వెళ్ళడం కోసం ...మరిన్ని తాంత్రిక పూజలు చేస్తూ ఆ బంగళా పక్కనే ఉన్న స్మశానం లో ఎవరికీ కనిపించకుండా తిష్ట వేసాడు. పగలు బయట తిరగడు. రాత్రిళ్ళు మాత్రమే సంచరిస్తుంటాడు. వాణి మీద దుష్టచతుష్టయం అత్యాచారం చెయ్యడం అతని చెవులకు సోకింది. కానీ వచ్చేటప్పటికే పరిస్థితి చేజారిపోయింది.

....వాణి నెమ్మదిగా కళ్ళు మూసింది. ఆమె మరణించింది. ఆమె శరీరం నుండి బయటపడిన ఆత్మ అక్కడే తిరుగాడసాగింది.

భైరవానంద స్వామి ని బేలగా చూడసాగింది.

" చెప్పమ్మా.. ఎందుకు ఇక్కడే ఆగిపోయావు. నీ సూక్ష్మ శరీరానికి మోక్షం ప్రసాదించనా ? " అడిగాడు.

" వద్దు స్వామీ ..నన్ను ఇంత దారుణంగా చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ..అప్పుడే నాకు మోక్షం. " పగతో రగిలిపోతూ చెప్పింది వాణి ఆత్మ.

" సరే ..తప్పకుండా చేద్దాం. నా శక్తులను కూడా పరీక్షించుకున్నట్టుగా ఉంటుంది. ఒక మంచి కార్యం చేసినట్టుగా కూడా ఉంటుంది. "

" ధన్యవాదాలు స్వామీ ...ముందుగా నా శ్రేయోభిలాషి అయిన ' ఋషి ' అనే వ్యక్తి ని ఇక్కడికి రప్పించండి ...అతని ద్వారానే నా పగ తీరాలి " బ్రతిమాలుకుంది ఆత్మ.

" అలాగే ..తప్పకుండా " అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు భైరవ.

అదే సమయంలో ఋషి సెల్‌ ఫోన్‌ మోగింది.

లిఫ్ట్‌ చేసి " హలో .." అన్నాడు.

" హలో ...ఋషీ .." ప్రేమగా ఒక తియ్యటి స్వరం.

వెంటనే ఆ వాయిస్‌ గుర్తుపట్టాడు ఋషి. అది వాణి ది. " వాణీ...వాణీ .." ఆనందంతో అరవసాగాడు.

" అవును నేనే.. నిన్ను ఒక్క సారి చూడాలని ఉంది ..మనం ఇంతకు ముందు కలిసిన బంగళా కి వస్తావా ? " అడిగింది.

" తప్పకుండా వాణీ .. తప్పకుండా " అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. ఆ తర్వాత బంగళా వైపు కదిలాడు.

* * *

" ఏంటీ నువ్వు బంగాళాలోకి వెళతావా ...ఈ టైములో ..లోపల దెయ్యాలు తిరుగుతాయి... వద్దు... హహహ ...హహహ..." పిచ్చి వాడిలా ఉన్న వ్యక్తి చేతికర్రను అటూ ఇటూ ఆడిస్తూ చెప్పాడు. ఋషి అతని మాటలను తోసిపుచ్చి గేటుపైన చేతులు వేసి బలంగా తోసాడు. ప్రకృతి విలపిస్తున్నట్టు కుండపోత వర్షం ప్రారంభమయింది.

బంగళా లోపలికి ప్రవేశించి హతాశుడయ్యాడు ఋషి. వాణి శవం చూసి దిగ్భ్రాంతి కి లోనయ్యాడు.

పక్కనే ఉన్న భైరవానంద ను చూస్తూ " ఎందుకు చంపావు రా నా వాణి ని ...ఎందుకు చంపావు " అంటూ ఆవేశంగా ముందుకు దూకాడు.

" ఆగు నాయనా.. ఆవేశపడకు ...చెప్పేది సావధానంగా విను " మంత్రించినట్టు అన్నాడు భైరవ.

టక్కున ఆగిపోయాడు ఋషి.

జరిగినదంతా నిదానంగా చెప్పాడు భైరవ. ఉవ్వెత్తున ఎగిసే అలలా ఆవేశంతో ఊగిపోయాడు ఋషి.

" నా వాణి కి అన్యాయం చేసినవాళ్ళని ఊరికే వదలను ..చంపేస్తాను .." అంటూ ప్రతిధ్వనించేలా అరిచాడు ఋషి.

భైరవ సాలోచనగా చూసాడు. " నిన్ను ఇక్కడికి పిలిపించింది అందుకే నాయనా ...ఆ కార్యం నువ్వే చెయ్యాలి. వాణి అత్మకు శాంతి చేకూర్చాలి. అందుకు నా శక్తియుక్తులు నీకు సహాయపడతాయి " అన్నాడు. వాణి ఆత్మ ' అవును ' అన్నట్టుగా ఒక పిల్ల తెమ్మెర ఋషి చెవులకి సోకింది.

ఋషి అన్నాడు " వాణీ ...నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను. కానీ దురదృష్టవశాత్తు నిన్ను అందుకోలేకపోయాను. కనీసం నీ ఆఖరి కోరికైనా తీర్చి నా ప్రేమ ను నిరూపించుకుంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ ! " .

భైరవ సంతృప్తి గా చూసాడు. తర్వాత చెయ్యవలసిన కార్యక్రమాల గురించి ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.

ఋషి ఆ బంగళా నుండి బయట కొచ్చి నడవసాగాడు. అతడు లోనికి వెళ్తున్నప్పుడు వారించిన పిచ్చివాడు ఇప్పుడు నిదానంగా బయటకు వెళ్తున్న ఋషి ని చూసి నర్మగర్భంగా నవ్వుకున్నాడు. ఏదో మంచి కార్యం జరగబోతోందని అతనికి అర్థమైంది.

* * *

" రచయిత్రి వాణి అదృశ్యం ! "

అన్ని టీవీ చానెళ్ళు ఈ వార్త ను చెప్పి చెప్పి హోరెత్తించేస్తున్నాయి.

ఎవరో దుండగులు ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌ కి వచ్చి కిడ్నాప్‌ చేసారని తమకు అందుబాటులో ఉన్న ఆధారాల బట్టి వార్తలను వండి వార్చేస్తున్నారు.

టీవీ లో ఈ న్యూస్‌ చూస్తున్న ఋషి నిశ్శబ్దంగా రోదించసాగాడు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండసాగాడు. ఫ్రెండ్స్‌ అందరూ ఒకప్పుడు వాణి ని ప్రేమించాడు కాబట్టి ఋషి ఫీల్‌ అవుతున్నాడని అనుకోసాగారు. కానీ వాణీ మరణించిందన్న విషయం తెలిసిన ఋషి ఆ బాధ లో నుండి బయట పడలేక మౌన ముద్ర దాల్చాడు.

కొన్ని రోజుల తర్వాత ఈ వార్త పాతదయిపోవడంతో అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు.

* * *

గాయకుడి గా పేరు రావడంతో ఋషి కి సినిమాల్లో పాడే అవకాశాలు రాసాగాయి. ఒక రోజు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రపాణి దగ్గర నుండి కాల్‌ వచ్చింది. రికార్డింగ్‌ థియేటర్‌ కి రమ్మని కబురు అది.

తర్వాతి రోజే ఆయన దగ్గరికి వెళ్ళాడు ఋషి.

" రావోయ్‌ ...రా " అంటూ ఆహ్వానించారు చక్రపాణి.

వెళ్తూనే ఆయన పాదాలకి నమస్కరించాడు ఋషి.

" దీర్ఘాయుష్మాంభవ " అని దీవించారు ఆయన. తర్వాత పాడవలసిన పాట ట్యూన్‌ ని వినిపించి ప్రాక్టీసు చెయ్యమని చెప్పారు. రెండు మూడు సార్లు ప్రాక్టీసు చేసి ఆయనకు వినిపించాడు . సంతృప్తి గా తలాడించి రికార్డింగ్‌ కి రడీ కమ్మన్నారు.

ఋషి వెళ్ళక ముందే అక్కడ వేరే గాయని వచ్చి ఉంది. ఆమె పేరు ఋషి కి తెలుసు. గాయని గా కొంచెం సీనియర్‌ ఆమె. కానీ వయసు మాత్రం తక్కువే ! అ అమ్మాయి పేరు ' లేఖ ' .

ఋషి , లేఖ ఇద్దరూ కలిసి పాడ వలసిన డ్యూయెట్‌ అది.

అంతా రడీ అవగానే చాంబర్‌ లోకి వెళ్ళి మైక్‌ ముందు నిలబడ్డారు ఇద్దరూ. కాసేపట్లో రికార్డింగ్‌ స్టార్ట్‌ అయింది. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ఇద్దరూ బ్రహ్మాండంగా పాడారు.పాట పూర్తవ్వగానే మ్యుజీషియన్స్ అందరూ చప్పట్లు కొట్టారు. చాలా హేపీ గా ఫీల్‌ అయ్యాడు ఋషి. ఇది ప్లే బ్యాక్‌ సింగర్‌ గా తొలి పాట అతనికి. పని పూర్తయ్యాక ఋషి వచ్చేస్తుంటే

" చాలా చాలా బాగా పాడారు.. మీకు మంచి ఫ్యూచర్‌ ఉంది " అంది లేఖ.

" చాలా థాంక్యూ అండి " అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు. ఋషి తక్కువగా మాట్లాడటంతో కొంచెం ఫీల్‌ అయింది లేఖ. కానీ ఋషి మానసిక పరిస్థితి ఆమెకు తెలీదు కదా !

కొన్ని రోజుల తర్వాత ...

సమయం రాత్రి పన్నెండు దాటింది. అప్పుడే నిద్రపోదామని బెడ్‌ మీద వాలాడు ఋషి. మాగన్నుగా నిద్రపడుతోంది.

" ఋషీ ..ఋషీ .." అని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది. టక్కున లేచి కూర్చున్నాడు. కిటికీ రెక్క టప టపా కొట్టుకోసాగింది. కర్టెన్స్ గాలికి రెప రెప లాడుతున్నాయి. బయట చెట్లు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. తను కాకుండా ఇంకా ఎవరో తన రూములో ఉన్నట్టుగా ఫీల్‌ అయ్యాడు ఋషి.

" ఋషీ .." మళ్ళీ అదే పిలుపు. !

రూమంతా మరింత నిశితంగా చూసాడు ఋషి. నెమ్మదిగా ఒక నల్లటి ఆకారం ప్రత్యక్షమయింది. అదిరిపడ్డాడు అతను. కానీ అంతలోనే సర్దుకున్నాడు. ఎందుకంటే ఆ ఆకారం ...వాణి ది. !

విభ్రాంతిగా అలా చూస్తూ ఉండిపోయాడు.

" ఆశ్చర్యపోతున్నావా ఋషీ ...బ్రతికున్నప్పుడు నిన్ను ఎలాగూ పట్టించుకోలేదు నేను. కనీసం ఇప్పుడైనా నిన్ను చూద్దామని .." చెబుతోంది.

చాలా బాధ గా అనిపించింది ఋషికి. కానీ ఏం చెయ్యగలడు !

అందుకే - " వాణీ ..నీకిచ్చిన మాట గుర్తుంది. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. కానీ ప్రపంచం నీ గురించి పూర్తిగా మరిచిపోయిన తర్వాత నా కార్యాచరణ ఉంటుంది ..అంతవరకు నన్ను క్షమించు " అన్నాడు.

వాణి ఆత్మ చిన్నగా నవ్వింది.

" నీ కర్తవ్యాన్ని గుర్తు చెయ్యడానికి నేను రాలేదు ఋషీ ...నిన్ను చూడాలనిపించింది .అందుకే వచ్చాను. ..ఇక వెళ్తాను " అని మాయమైంది.

చిన్నగా నిట్టూర్చాడు ఋషి. బెడ్‌ మీద వాలి ఆలోచించసాగాడు. ఇంతకు ముందు ఎవరైనా ఆత్మల గురించి చెబితే నమ్మేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్‌ గా జరుగుతున్నది చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. అయినా నమ్మడం ...నమ్మకపోవడం పక్కనపెడితే ..వాణి కి జరిగిన అన్యాయం మాత్రం నిజమే కదా ! ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు.

* * *

ఋషి పాట పాడిన సినిమా బ్రహ్మాండమైన హిట్‌ అయింది. ఋషి కి చాలా మంచి పేరు వచ్చింది. మరిన్ని అవకాశాలు రాసాగాయి అతనికి.

వాణి కథ అందించిన సినిమా కూడా హిట్‌ అయింది. నిర్మాత పుల్లయ్య ఆనందానికి హద్దులేకుండా పోయింది. అయితే ఆ విజయాన్ని ఆస్వాదించడానికి మాత్రం వాణి లేకపోవడం బాధకరం. వాణి తరపు నుండి పోరాడ్డానికి కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేకపోయాడు.

అమెరికా లో తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకి రావాల్సిందిగా ఋషి కి ఆహ్వానం అందింది. అతనితో పాటూ చాలా మంది ఇతర కళాకారులకి కూడా ఆహ్వానం అందింది. అందులో గాయని ' లేఖ' కూడా ఉంది.

అమెరికా వెళ్ళడానికి మనస్కరించలేదు ఋషి కి. కానీ ఫ్రెండ్స్‌ అందరూ ' అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ...వెళ్ళరా ' అని నచ్చజెప్పడంతో ఒప్పుకున్నాడు. వీసా ఎరేంజ్‌ చెయ్యబడింది.

సేఫ్‌ గా అమెరికా లో లేండ్‌ అయ్యారు అందరూ . !

ఒక డాక్టర్‌ గా అమెరికా వద్దామనుకున్నాడు ఋషి. కానీ గాయకుడిగా వచ్చాడు. అదే జీవితమంటే ! కళాకారులందరికీ ఎకామిడేషన్‌ తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఇవ్వబడింది. ఋషి కి, లేఖ కి ఒకే ఇంటిలో ఇచ్చారు. ఈ ఎరేంజ్‌ మెంట్‌ కి లేఖ బాగా సంతోషించింది. ఋషి ని తొలిసారి చూసినప్పుడే అతను ఎంతో నచ్చాడు ఆమెకి. కానీ బయటపడలేదు. అవకాశం వచ్చిన ప్రతీ సారి అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఒకే దగ్గర ఎకామిడేషన్‌ ఇవ్వడంతో బాగా సంతోషించింది.

కల్చరల్‌ ఈవెంట్‌ రోజు అందరినీ పికప్‌ చేసుకుని ఆడిటోరియం కి తీసుకెళ్ళారు. ప్రేక్షకులు గా వచ్చిన తెలుగు వాళ్ళతో ఆడిటోరియం నిండిపోయింది. కళాకారులు తమ కళలని ప్రదర్శించసాగారు. మిమిక్రీ... వెంట్రిలాక్విజం... డేన్స్ ...సాంగ్స్‌ ..ఇలా అన్నీ ప్రదర్శించారు. ఋషి , లేఖ కలిసి ఒక ప్రేమ గీతాన్ని ఆలపించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. లేఖ ఆ పాటని నిజంగానే మనసులో నుండి ఫీల్‌ అయి పాడింది. ఋషి ఆమె బాడీ లాంగ్వేజ్‌ ని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె తనపై ఆశలు పెంచుకుంటోందని అర్థం కాసాగింది. కానీ ఆపడానికి అతనెవ్వడు?

నయాగరా ఫాల్స్‌ !

అద్భుతమైన సుందర ప్రకృతి విన్యాసం. టూరిస్ట్‌ లందరూ కేరింతలు కొడుతూ చూస్తున్నారు. మన తెలుగు కళాకారులు కూడా చూడ్డానికి వచ్చారు.

లేఖ తన మనసులోని మాటను బయటపెట్టడానికి ఇదే సరైన లొకేషన్‌ అని భావించింది.

ఋషి ని సమీపించి " మీతో ఒక విషయం చెప్పాలి " అంది సిగ్గుపడుతూ.

" చెప్పండి " అన్నాడు

" మిమ్మల్ని తొలిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. తర్వాత మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. భావి జీవితాన్ని మీతో గడపాలని ఆశ పడుతున్నాను. " అంది.

ఎలా రియాక్ట్‌ అవ్వాలో అర్థం కాలేదు ఋషికి. క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత స్థిరంగా చెప్పాడు.

" చూడండి లేఖ గారూ ..మీ మనసు లోని ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ ప్రేమను అందుకునే అవకాశం నాకు లేదు. నేనూ మీ లాగే ఒక అమ్మాయి ని ప్రేమించాను. కానీ నా ప్రేమ సఫలం కాకముందే ఆమె అందనంత దూరానికి వెళ్ళిపోయింది. నా మనసు ముక్కలైపోయింది. అది మళ్ళీ అతుక్కోదు. ప్రేమ అనే మాటకు నా జీవితంలో చోటు లేదు ...నన్ను క్షమించండి”

లేఖ మొహం లో నిస్పృహ ! ఋషి నుండి దూరంగా వెళ్ళి మిగతా వాళ్ళ తో కలిసిపోయింది.

విరక్తి గా నవ్వుకున్నాడు ఋషి. !

* * *

" ప్రముఖ నిర్మాత రావు హత్య ! "

ఇదే వార్త ని టీవీ చానెళ్ళు రిపీటెడ్‌ గా చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలంతా విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారు.

మానవతా వాది... సౌమ్యుడు ...అజాతశతృవు అయిన రావు గారి ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది ? బహుశా ఏ అర్థిక కారణాలో అయుంటాయి అని అందరూ చెప్పుకోసాగారు .

కానీ అతని గురించి తెలిసిన చాలా తక్కువ మంది " మంచి పని అయింది ..తగిన శాస్తి జరిగింది ఆ నీచుడికి " అని సంతోషపడ్డారు.

టీవీ లో రావు గారి గెస్ట్‌ హౌస్‌ విజువల్స్‌ చూపిస్తున్నారు. !

అతని భార్య ..పిల్లల మొహాలు మాత్రం అప్రసన్నంగా ఉన్నాయి. ఆస్తి రహస్యాలు చెప్పకుండా చచ్చాడు అని వాళ్ళ బాధ కాబోలు.

టీవీ ఏంకర్ల హడావుడి ఎక్కువగా ఉంది. రావు ని చూడ్డానికి వస్తున్న సినిమా వాళ్ళని పట్టుకుని బైట్స్‌ తీసుకోవడంలో బిజీ గా ఉన్నారు.

" హత్య ఎందుకు జరిగి ఉంటుంది సార్‌ ! " అని ఒక వర్ధమాన నటుడిని అడిగింది ఏంకర్‌ .

ఎన్నో సినిమాలు చేసిన ఏక్టర్‌ లా ఫోజ్‌ పెట్టి " చెప్పలేమండీ ...చాలా కారణాలు ఉండొచ్చు " అని చెప్పి తప్పించుకున్నాడు

ఇంతలో ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. ఎస్సై నింపాదిగా దిగాడు. అతని పేరు బ్రహ్మయ్య ! నల్లగా బలంగా ఉంటాడు. చూపు డేగ చూపు. దద్దమ్మ లా కనిపిస్తాడు కానీ చాలా ఇంటెలిజెంట్‌ . తప్పు చేసిన నేరస్తులని పట్టుకునే దాకా నిద్ర పోడు.

కానిస్టేబుల్‌ వచ్చి " చాలా ఘోరమైన హత్య సార్‌ ! " అని చెప్పాడు

సాలోచనగా తలాడించి " శవాన్ని పోస్ట్‌ మార్టం కి పంపించండి " అన్నాడు." ...

అన్ని క్లూస్‌ సేకరించండి. ఏ ఒక్క ఆధారాన్ని మనం మిస్‌ చేసుకోకూడదు "

" అలాగే సార్‌ " అని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్‌. గెస్ట్‌ హౌస్‌ చుట్టూ పరిశీలనగా చూడసాగాడు బ్రహ్మయ్య. అనుమానించదగ్గ విషయమేమీ కనపడలేదు. సీ సీ టీవీ పుటేజ్‌ చూడాలి అనుకున్నాడు.

ఆ రాత్రి... స్టేషన్‌ లో కూర్చుని సీ సీ టీవీ పుటేజ్‌ ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు.

మొదటి సీన్‌ లో ...కెమేరా ఒన్‌ లో ..ఒక అందమైన అమ్మాయి గెస్ట్‌ హౌస్‌ లోకి వెళ్తున్న దృశ్యం రికార్డ్‌ అయింది. తర్వాత తిరిగి ఆమె బయటకు వచ్చిన దృశ్యాలేమీ రికార్డ్‌ కాలేదు.

లోపలికి వెళ్ళిన అమ్మాయి ఏమయింది ? అసలెందుకు వెళ్ళింది ? అన్నీ ప్రశ్నలే ! సమాధానం లేని ప్రశ్నలు.

సిగరెట్‌ తీసి వెలిగించాడు. పొగను పైకి వదులుతూ సీట్లో వెనక్కు వాలి ఆలోచించసాగాడు. ' నిర్మాత రావు అసలు కేరెక్టర్‌ తెలియాలి. అప్పుడే ఈ కేసు సాల్వ్‌ అవుతుంది ' అనుకున్నాడు.

టీవీ ఆన్‌ చెయ్యమని కానిస్టేబుల్‌ కి చెప్పి ముందున్న పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ఓపెన్‌ చేసాడు . అందులో వ్రాసి ఉన్న రిపోర్ట్‌ చదివి షాక్‌ తగిలినట్టు అదిరి పడ్డాడు బ్రహ్మయ్య .

" గుర్తు తెలియని ఆయుధంతో హత్య జరిగింది ...హతుడి బాడీ మీద పురుషాంగం తొలగించబడి ఉంది "

' మై గాడ్‌ ..ఇంత దారుణంగా చంపారా!

' అనుకుని ఆశ్చర్యపోయాడు. ఏదో బలమైన మోటివ్‌ ఉంటే తప్ప ఇలా చెయ్యరు అనుకుని టీవీ లో వస్తున్న దృశ్యాలను చూసి మరింత షాక్‌ అయ్యాడు .

టీవీ స్టుడియో లో కొంతమంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. ఏంకర్‌ పేపర్లు సర్దుకుంటూ-

" నిర్మాత రావు తమని లైంగికంగా వేధించాడని కొంతమంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ లు స్టుడియో కి వచ్చారు ...వారి వ్యధను వాళ్ళ మాటల్లోనే విందాం " అని స్టార్ట్‌ చేసింది.

మొహం కనబడకుండా చున్నీ కట్టుకున్న ఒక అమ్మాయి చెప్పసాగింది.

" రావు ...పరమ నీచుడండి.. అవకాశాలకోసం మేము ఆయన దగ్గరకి వెళ్ళినప్పుడు రాత్రి కి గెస్ట్‌ హౌస్‌ కి రమ్మనే వాడు. తీరా వెళ్ళిన తర్వాత ఒంటిమీద బట్టలన్నీ తీసేయ్‌ మని అడిగేవాడు. బయటకు చెప్పలేని గలీజు పనులన్నీ మాతో చేయించుకొనేవాడు. మా అవసరాన్ని ఆసరాగా తీసుకుని మమ్మల్ని సెక్సువల్‌ గా వాడుకొనే వాడు. పైకి మాత్రం చాలా మంచి గా కనపడేవాడు. ఇంతచేసినా మాకు గొప్ప అవకాశాలేవీ రాలేదండీ ..పైకి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వచ్చేది " అని కన్నీళ్ళు పెడుతూ చెప్పింది.

వేరే అమ్మాయి లు కూడా అలాగే చెప్పసాగారు.

బ్రహ్మయ్య కి విషయం అర్థమైంది. హత్య జరిగిన రోజు కూడా ఏ జూనియర్‌ ఆర్టిస్ట్‌ నో తన గెస్ట్‌ హౌస్‌ కి రమ్మని ఉంటాడు. అందులో డౌట్‌ లేదు . కానీ హత్య ఎలా జరిగిందో తెలియాలంటే లోపలి సీ సీ కెమేరాల పుటేజ్‌ ని పరిశీలించాలి అనుకున్నాడు.

" ఒక టీ చెప్పరా .." అని కానిస్టేబుల్‌ కి ఆర్డర్‌ వేసి రెండో కెమేరా పుటేజ్‌ ని ఓపెన్‌ చేసాడు.అది గెస్ట్‌ హౌస్‌ లోపలి కెమేరా ..ఆ దృశ్యాలని చూసి మరింత షాక్‌ అయ్యాడు బ్రహ్మయ్య .

సన్నగా వర్షం కురుస్తోంది. ..అప్పుడే సంజె చీకట్లు ముసురుకుంటున్నాయి.

రావు గారి గెస్ట్‌ హౌస్‌ ముందు ఆటో దిగిందామె !

జీన్స్ పేంట్‌ పైన పువ్వుల చొక్కా వేసుకుంది. ఒంటికి బిగుతుగా ఉన్న ఆ డ్రెస్స్‌ ఆమె ఒంపుసొంపులను బహిర్గతం చేస్తోంది. చూడగానే అనుభవించాలని ఎవరికైనా అనిపించే ఫిగర్‌ ఆమె సొంతం.

సినిమాల్లో పెద్ద హీరోయిన్‌ గా వెలిగిపోవాలని కలలు కని ఇంటి నుండి పారిపోయి హైదరాబద్‌ వచ్చింది. నానా పాట్లు పడి జూనియర్‌ ఆర్టిస్ట్‌ కార్డ్‌ సంపాదించింది. క్రిష్ణా నగర్‌ లో అద్దెకు ఉంటూ పెద్ద వేషాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ సరైన అవకాశాలు రావడం లేదు. ఒక రోజు జూనియర్‌ ఆర్టిస్ట్‌ కో-ఆర్డినేటర్‌ కి తన బాధ చెప్పుకుంది. అతను రావు గారితో మీటింగ్‌ ఎరేంజ్‌ చేసాడు. సినిమాల్లో మంచి గుర్తింపు ఉండే పాత్ర దొరకాలంటే ' కమిట్‌ మెంట్‌ ' తప్పని సరి అని చెప్పి ఇక్కడికి పంపించాడు.

ఇదే సమయంలో ..అక్కడ ...ఊరి చివర బంగళా లో ...

భైరవానంద నేలపైన ఆసనం లో కూర్చున్నాడు. అతని ఎదురుగా పెద్ద ముగ్గు వేసి ఉంది . అందులో..రక రకాల ద్రవ్యాలు..క్షుద్ర ఉపాసకులు దేవతకు సమర్పించే పదార్ధాలు.!

కొంచెం దూరంలో ఋషి నిలబడి ఉన్నాడు. భైరవ పిలుపు పై అక్కడికి వచ్చాడు.

భైరవ గొంతు సవరించుకుని చెప్పాడు.

" ఋషీ ...ఇప్పుడు నేను వాణి ఆత్మను పిలుస్తాను. ఆమెతో మాట్లాడతాను. పగతో రగిలిపోతున్న ఆమె ఆత్మ చాలా క్రూరంగా ఉంటుంది. పూజలో ఉన్నప్పుడు నన్ను భంగపరచొద్దు "

" అలాగే గురువు గారూ " అన్నాడు ఋషి.

తర్వాత భైరవ కళ్ళు మూసుకుని మంత్రాలు పఠించసాగాడు.

ఒక సన్నటి పిల్ల తెమ్మెర లా ప్రారంభమై .. ఉధృతంగా మారింది అక్కడి గాలి కదలిక !

సడన్‌ గా వాణి ఆత్మ ప్రత్యక్షమైంది.

అప్పటి దాకా నిబ్బరంగా ఉన్న ఋషి అదిరిపడ్డాడు. చాలా క్రూరంగా ఉంది వాణి ఆకారం.

అది ఋషి కి దగ్గరగా రాసాగింది. క్షణాల్లో వాణి ఆత్మ ఋషిలో ప్రవేశించింది. ఇప్పుడు ఋషి ఋషి కాదు. అతని రూపంలో ఉన్న వాణి.

భైరవ చెప్పాడు -

" వాణీ ..ఋషి శరీరం సాయంతో నీ పగతీర్చుకో ..వెంటనే నీ మొదటి శతృవు దగ్గరికి వెళ్ళు " అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఋషి శరీరం మాయమైంది. రావు గారి గెస్ట్‌ హౌస్‌ లో ప్రత్యక్షమైంది.

" కమాన్‌ బేబీ ..కమాన్‌ " అంటూ గెస్ట్ హౌస్ కి వచ్చిన అందమైన అమ్మాయి ని కౌగలించుకున్నాడు రావు.మెత్తని ఆమె ఒంటి స్పర్శ తగలగానే జివ్వుమంది రావు కి. పొందబోయే సుఖాన్ని తలచుకుని మురిసిపోయాడు.

ఆమెను వదిలి .. కిచెన్‌ లో నుండి విస్కీ బాటిల్‌ ..రెండు గ్లాసులు తెచ్చాడు. విస్కీ ఒక గ్లాసులో పోసి ఆమెకిచ్చి సిప్‌ చెయ్యమన్నాడు. తనో గ్లాసు తీసుకుని ' ఛీర్స్‌..' అని సిప్‌ చేసాడు.

ద్రవం గొంతులోపడేసరికి ఒళ్ళు వేడెక్కింది రావుకి.

నెమ్మదిగా ఆమె ఒంటి మీద బట్టలని ఒలిచేసాడు. పాలరాతి శిల్పం లా మెరిసిపోతోంది ఆమె నగ్న శరీరం !

తను కూడా వివస్త్ర అయ్యాడు. ఆమెను నెమ్మదిగా ఆక్రమించుకున్నాడు. తియ్యటి యుద్ధం మొదలైంది.ఇదే తను పొందుతున్న చివరి సుఖం అని అతని కి తెలీదు. తెలిస్తే గుండె ఎప్పుడో ఆగిపోయేది.

ఏదో చప్పుడైంది. మంచి రసపట్టు లో ఉన్న ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.

నెమ్మదిగా ఋషి రూపంలో ఉన్న వాణి అక్కడ ప్రత్యక్షమైంది.

ముందుగా ఋషి ఆకారాన్నిచూసిన ఆ అమ్మాయి కెవ్వున కేక పెట్టింది. రావు ని పక్కకు తోసేసి బెడ్‌ మీద నుండి కిందికి దూకి బట్టలు వేసుకుంది. రావు అంత తొందరగా రియాక్ట్‌ కాలేకపోయాడు.

" ఏం... మంచి మూడ్‌ లో ఉన్నట్టున్నావు మిస్టర్‌ రావ్‌ ! " భయంకరంగా ప్రతిధ్వనించింది ఋషి గొంతు.

ఆ అమ్మాయి అప్పటికే పారిపోయింది.

" ఏయ్‌ ..ఎవడ్రా నువ్వు ? ఇక్కడి దాకా ఎలా వచ్చావు ? " అరుస్తున్నాడు రావు. కానీ అతని కేకలేవీ చిత్రంగా బయటకు వినపడటం లేదు.

" నేనెవరో తెలుసుకోవాలనుందా ? విను...నీ చేతుల్లో చిత్రవధ అనుభవించి చనిపోయిన వాణి ని ..హహహ ...హహహ ..హహహ ..." భయంకరమైన నవ్వు

రావు మొహంలో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు. స్పష్టంగా కనిపిస్తున్న భీతి.

" ప్లీజ్‌ ..నన్నేమీ చెయ్యకు ...నీకు దండం పెడతాను..వదిలెయ్‌ " బ్రతిమాలుకుంటున్నాడు.

" నిన్ను వదలడమా ...నిన్ను వదలడమా ..నీకు శాశ్వత విముక్తి ప్రసాదిస్తాను...కాసుకో " అని మీదకు ఉరికాడు ఋషి.

తప్పించుకోబోయాడు రావు. కానీ సాధ్యం కాలేదు.

ఋషి చేతిలో ఉన్న కొత్త ఆయుధం ! మంత్ర శక్తి తో మొదట అతని పురుషాంగాన్ని ఛిద్రం చేసాడు ఋషి. గావు కేక పెట్టాడు రావు. అయినా ఋషి వదలలేదు.

తర్వాత ఆ కొత్త ఆయుధం అతని గొంతులో దిగబడింది. గిల గిలాకొట్టుకుని ప్రాణాలు విడిచాడు రావు.

ఋషి రూపంలో ఉన్న వాణి ఆత్మ సంతోషంగా నవ్వింది.

నిశ్శబ్దంగా అక్కడి నుండి మాయమయ్యాడు ఋషి.

* * *

గాఢంగా నిశ్వసించాడు ఎస్సై బ్రహ్మయ్య !

సీ సీ టీవీ పుటేజ్‌ లో రెండో కెమేరా దృశ్యాల్లో చాలా భాగం అతనికి కనిపించలేదు. చాలా చోట్ల వీడియో బ్లర్‌ అయింది. కొన్ని కొన్ని చోట్ల వీడియో ఎందుకు మిస్‌ అయిందో అతనికి అంతుబట్టలేదు. ఏదో జరిగింది ..గెస్ట్‌ హౌస్‌ లోకి ప్రవేశించిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ లోపలి నుండి వెళ్ళిపోవడం రెండో కెమేరా లో రికార్డ్‌ అయింది. కానీ నిర్మాత రావు మీద దాడి చేసింది ఎవరన్నది క్లియర్‌ గా లేదు.రక రకాల రూపాలు కనబడుతున్నాయి. ఒక సారి మగ వ్యక్తి లాగ ..ఇంకోసారి స్త్రీ లాగా కనిపిస్తోంది. ఏమిటిది ? ఏదైనా మానవాతీత శక్తా ? అన్న సందేహం వచ్చింది బ్రహ్మయ్య కి.

కానిస్టేబుల్స్‌ ని పిలిచి సీసీ టీవీ పుటేజ్‌ లో ఉన్న అమ్మాయి ని ట్రేస్‌ చెయ్యమని చెప్పాడు. మిగతా అన్వేషణ తనే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

చివరగా పోస్ట్‌ మార్టం ఫైల్‌ మూసేస్తూ అనుకున్నాడు - ' రావు ఒకకొత్త ఆయుధం తో చంపబడ్డాడు అని ఉంది. ఏమిటా కొత్త ఆయుధం ? ' - ఆలోచనలో పడ్డాడు !

* * *

సవ్యసాచి మౌనంగా బాధపడుతున్నాడు. ఎంతో గొప్ప రచయిత్రి అవుతుందని అనుకున్న వాణి కనపడటం లేదని తెలిసినప్పటి నుండీ అతని మనసు అదోలా అయింది. అంత పెద్ద శతృవు లు ఆమెకు ఎవరున్నారా అని ఆలోచించసాగాడు.

భార్య సుమ వచ్చి " భోంచేద్దురు గాని రండి " అని పిలిచింది. సవ్య సాచి డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చున్నాడు. సుమ వడ్డించసాగింది.

"నీ తమ్ముడు బోకు ఈ మధ్య కనబడటం లేదు.. ఏమైపోయాడు " అన్నాడు

" ఏమోనండీ ...ఏదో పని ఉందని ..వేరే ఊరు వెళ్తున్నానని చెప్పాడు. మళ్ళీ తిరిగి రాలేదు. సెల్‌ కూడా ఆన్సర్ చెయ్యడం లేదు. పోనీ లెండి ..కొంచెం వాడిని ఫ్రీ గా తిరగనివ్వండి " అంది.

అనవసరంగా ఆమెను అడిగానని పశ్చాత్తాప్పడ్డాడు సవ్యసాచి. చిత్రంగా ఈ మధ్య నిర్మాత రావు హత్య చెయ్యబడటం కూడా సవ్యసాచి కి అర్థం కాలేదు.

నిశ్శబ్దంగా భోంచెయ్యసాగాడు సవ్యసాచి. పోలీసు జీప్‌ వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది. ఎస్సై బ్రహ్మయ్య జీపు దిగి లోనికి వచ్చాడు.

" సవ్యసాచి గారు కావాలి " అని చెప్పాడు.

భోంచేస్తున్న సవ్యసాచి వెంటనే లేచి చెయ్యి కడిగేసుకున్నాడు.

హాల్లోకి వచ్చి -

"నమస్కారం ఎస్సై గారూ చెప్పండి ఏమిటి విషయం ? " అన్నాడు

" నమస్తే .." అని చుట్టూ ఉన్న పరిసరాలని ఒకసారి గమనించి " వాణి అనే రచయిత్రి మీకు తెలుసా ? " అని అడిగాడు ఎస్సై

" తెలియకపోవడమేంటి సార్‌ ...ఆమెను రచయిత్రి గా మారమని ఎంకరేజ్‌ చేసిందే నేను " చెప్పాడు సవ్యసాచి

" ఆహా.. కానీ ఆమె కనిపించక చాలా రోజులయింది. కిడ్నాప్‌ అయిందని మీడియాలో వచ్చిన వార్తను చూసి ఆ కేసు నేను టేకప్‌ చేసాను. కొన్ని వివరాలు కావాలి "

" తప్పకుండా సార్‌...అడగండి "

" వాణి కి ..నిర్మాత రావు కి సంబంధం ఏమైనా ఉందా ? "

" సంబంధం అంటే ..ఒక సారి ఆయన మా ఆఫీసుకి వచ్చినప్పుడు పరిచయం చేసాను. తర్వాత వాణి వ్రాసిన కథ వినడానికి ఆమెను గెస్ట్‌ హౌస్‌ కి రమ్మని అడిగాడు రావు. నేనే వాణి ని వెళ్ళి అతన్ని కలవమని చెప్పాను. ఆ తర్వాత ఎమైందో నాకు తెలీదు " అన్నాడు సవ్యసాచి

" ఐ సీ.. " అంటూ తల పంకించాడు బ్రహ్మయ్య. ఏదో లింక్‌ ఆయనకి దొరుకుతోంది.. కానీ ఇంకా స్పష్టత కావాలి .

కుర్చీ లో నుండి లేచి " ఓకే అండి ..అవసరమైతే మళ్ళీ కలుస్తాను " అని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్సై.

సవ్యసాచి కి ఆనందం వేసింది. ' ఫర్వాలేదు ...పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ' అనుకున్నాడు.

కాసేపటికి బోకు వచ్చాడు అక్కడికి. సవ్యసాచి అతడిని చూసి " ఏరా.. ఎక్కడికి పోయావు..ఇంటికి రావడం లేదు " అన్నాడు

" కొంచెం పని ఉండి బయట ఊరు వెళ్ళాను బావా " అని ఏదో అబద్ధం చెప్పాడు.

" సరే ..మన వాణి ఉంది కదా ..ఆమెను ఎవరో కిడ్నాప్‌ చేసారంట.. ఆ కేసు విషయమై ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని కనుక్కోవడానికి ఎస్సై గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. నీకు ఏదైనా ఇన్ ఫర్మేషన్ తెలిస్తే చెప్పు "

గతుక్కు మన్నాడు బోకు.కానీ ఆ ఫీలింగ్స్‌ ని పైకి కనపడకుండా నొక్కి పెట్టి " అలాగే బావా ..తప్పకుండా చెబుతాను " అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

బోకు మొహాన్ని గమనించి ఉంటే సవ్యసాచి కి తప్పకుండా ఒక క్లూ దొరికేది

* * *

పరమహంస చాలా అసహనంగా ఉన్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకరైన రావు చంపబడటం ఏదో తెలియని భయాన్ని కలిగిస్తోంది అతనికి.

ఇంతలో బోకు దగ్గర నుండి అతని సెల్‌ కి కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేసి " హలో .." అన్నాడు.

" హంస ..ఒక ఇంపార్టెంట్‌ మేటర్‌..మా బావ దగ్గరికి నిన్న ఒక ఎస్సై వచ్చాడు. వాడి పేరు బ్రహ్మయ్య. పెర్సనల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకుని వాణి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. జాగ్రత్త " అని చెప్పాడు.

" సరే ..ఎందుకైనా మంచిది ...ఒక సారి మనం కలుద్దాం. నాగు కి కూడా చెబుతాను "అన్నాడు

" సరే ..సరే.. " అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసాడు బోకు.

ఆ సాయంత్రమే ముగ్గురూ కలిసారు. ఊరి చివర ఉన్న ఒక రిసార్ట్‌ లో సిటింగ్‌ వేసారు. నింపాదిగా మందు సేవించసాగారు. రెండు రౌండ్స్‌ అయ్యాక నెమ్మదిగా మనసులో ఉన్నది కక్కసాగారు.

బోకు అన్నాడు " ఎందుకో నాకు భయంగా ఉంది ..రావు చాలా ఘోరంగా చనిపోయాడు ...హత్య ఎవరు చేసారో కూడా కనుక్కోలేకపోతున్నారు పోలీసులు. చంపింది మనిషా ..లేక ఆత్మా అన్న డౌట్‌ కూడా ఉంది "

ఒళ్ళు మండింది కరి నాగు కి. " మూర్ఖుడి వా నువ్వు ..ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ..ఆత్మలు ఉన్నాయా ? నువ్వు భయపడేదే కాకుండా మమ్మల్ని కూడా చంపేస్తున్నావు " అని విసుక్కున్నాడు. బోకు ఇక ఏమీ మాట్లాడలేదు. నిజానికి పరమహంస మనసులో కూడా అవే ఫీలింగ్స్‌ ఉన్నాయి కానీ బయటపెట్టలేదు.

భయాన్ని మరిచిపోవడానికి ఇంకా తాగుతూనే ఉన్నారు.

ఇంతలో...ఎవరో పిలుస్తున్న శబ్దం వినపడింది. అది బోకు మాత్రమే గమనించాడు. మిగతా ఇద్దరి వైపు చూసాడు. వాళ్ళు అది గమనించనట్టు తమ ధ్యాస లో ఉన్నారు.

ఊరికి దూరంగా ఉన్న ఆ రిసార్ట్‌ నిజానికి బంగళా కి దగ్గర్లోనే ఉంది. రిసార్ట్‌ కి బంగళా కి మధ్య చిన్న అడవి లాంటి ప్రాంతం .

బోకు లేచి ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు. " రా..రా..నిన్నే..నిన్నే .." అని వినవస్తోంది ఆ శబ్దం.

నడుస్తూ నడుస్తూ అలా ఆ అడవి ప్రాంతం లోకి వచ్చేసాడు బోకు. దూరంగా ఎవరో వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ చీకట్లో కనిపించి మళ్ళీ మాయమయి మళ్ళీ కనిపించి ... తల విదిలించాడు బోకు. మనసులో ఒక వైపు భయం ..కానీ ఏదో శక్తి అతడిని లాగుతోంది.

అలా అలా నడిచి నడిచి బంగళా ముందుకు వచ్చేసాడు బోకు.

" మై గాడ్‌ ! ఇక్కడికొచ్చానేంటి ? " అనుకుని భయంగా చూసాడు. అప్పటికే ఆలస్యం అయింది. ఋషి రూపం అతని ముందు ప్రత్యక్షమైంది.

" ఏయ్‌..ఎవరు నువ్వు ...! " భయంగా అరిచాడు బోకు.

వికృతంగా నవ్వింది ఆ ఆకారం. " నేను ..నేను ..వాణి ని "

" నో నువ్వు వాణి కాదు...నువ్వు వాణి కాదు " పిచ్చిగా అరుస్తున్నాడు

" నేనే రా ...అంత తొందరగా మర్చి పోయావా .." అంటూ మీదికొచ్చింది ఋషి ఆకారం.

గాల్లో అంతెత్తున లేచాడు బోకు. అతడి శరీరం ఎగురుకుంటూ వెళ్ళి బంగళా గేటుకి తగిలింది. అతని చొక్కా గేటు హుక్కుకి చిక్కుకుని అలా వేలాడసాగాడు బోకు. భయంతో గట్టిగా అరుస్తున్నాడు. కానీ అతని అరుపులు వృధా అయ్యాయి. ఋషి శరీరం పఠించిన మంత్రానికి బోకు మగతనం విచ్ఛిన్నం అయింది. బాధతో మూలిగాడు బోకు. తర్వాత ఋషి చేతిలోని ఆయుధం బలంగా అతని గొంతు లో దిగబడింది. గావు కేక పెట్టి తల వాల్చేసాడు బోకు. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఋషి శరీరం .. లో ఉన్న …వాణి ఆత్మ సంతృప్తిగా నవ్వుకుని అక్కడి నుండి మాయమైంది. ఇదంతా అక్కడికి దగ్గర్లోనే ఉన్న చెట్టు చాటు నుండి చూసిన పిచ్చోడు ఆనందంతో గంతులు వేసాడు.

* * *

తెల్లారేటప్పటికి తమ పక్కన బోకు లేకపోయేసరికి కంగారు పడ్డారు కరి నాగు , పరమహంస.

" ఎక్కడికి వెళ్ళుంటాడు... భయపడి ఇంటికి పోయాడేమో " అనుకుని సర్ది చెప్పుకున్నారు. లేచి రడీ అయి సిటీ కి వచ్చేసారు.

ఆ రోజు మధ్యాహ్నం టీవీ లో చూపిస్తున్న న్యూస్‌ ఇద్దరికీ గుండెలవిసిపోయేలా చేసింది.

" ఊరి చివర బంగళా దగ్గర గుర్తు తెలియని శవం " అని విజువల్స్‌ చూపిస్తున్నారు. ఆ శవం ‘ బోకు ‘దని తెలిసిన వాళ్ళు గుర్తు పడుతున్నారు. కరినాగు పరమహంస కు ఫోన్‌ చేసాడు.

" చూసాను నాగూ..ఇవన్నీ మన కామన్‌ శతృవు ఎవరో చేస్తున్నట్టు ఉంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ..బై " అని ఫోన్‌ పెట్టేసాడు.

టీవీ లో న్యూస్‌ చూసి ఏడ్వసాగింది సవ్యసాచి భార్య సుమ. " నా తమ్ముడిని ఎవరో చంపేసారండీ " అంటూ గుండెలు బాదుకుంది. ఏం చెయ్యాలో తెలియక నిశ్చేష్టుడయ్యాడు సవ్యసాచి.

వెంటనే ఎస్సై బ్రహ్మయ్య కి ఫోన్‌ చేసాడు. " సార్‌..మా బావమరిది బోకు ని ఎవరో హత్య చేసారండీ ...ఇప్పుడు టీవీ లో చూపిస్తున్న న్యూస్‌ అదే " అని చెప్పాడు

" ఓకే ఇప్పుడే నేను అది చూస్తాను..మీకు ఏ ఇంఫర్మేషన్‌ తెలిసినా ఫోన్‌ చెయ్యండి " అని చెప్పి పెట్టేసాడు.

వెంటనే జీపు లో బంగళా వైపు బయలుదేరాడు ఎస్సై. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నాక శవాన్ని పరిశీలించాడు. ఆశ్చర్యంగా ఇక్కడ కూడా రావు ని చంపినట్టే హత్య చేసాడు ఆగంతకుడు. అదే కొత్త ఆయుధం హత్య కోసం వాదబడింది. ' చూస్తుంటే ఈ హత్యలకు ఏదో లింక్‌ ఉన్నట్టు ' అనిపించసాగింది ఎస్సై కి. ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చెయ్యమని కింద వాళ్ళకి చెప్పి వచ్చేసాడు అక్కడినుండి.

ఎస్సై మదిలో ఎన్నో సందేహాలు. మొదట రావు చనిపోయడు. ఇప్పుడు ఈ బోకు. ఇద్దరినీ ఒకరే చంపారని హత్య జరిగిన విధానం బట్టి స్పష్టంగా అర్థమవసాగింది. అయితే వీటి వెనక ఉన్న మోటివ్‌ ఏమిటి ? చనిపోతున్న వాళ్లకి ఉన్న సంబంధమేమిటి ? తెలియాలి..ఈ ప్రశ్నలకు సమాధానం తెలీయాలి. కనబడకుండా పోయిన రచయిత్రి వాణి కి వీళ్ళ మరణాలకి ఏమైనా సంబంధం ఉందా ? ఉందేమో ! వాణి గతాన్ని తవ్వితే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు అనుకున్నాడు. ఆలోచనలకి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.

* * *

కరినాగు మనసు గందరగోళంగా ఉంది. ఇద్దరు మిత్రులు చనిపోవడం ...దాని వెనక ఉన్న కారణం అంతుపట్టకపోవడం అతని ఆందోళనని పెంచుతోంది. ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి కావేరి దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు.

ఆ రాత్రి ..

కావేరి రంభ లా తయారై కరినాగు కోసం ఎదురు చూస్తోంది. వయసు కొంచెం పెరిగినా ఆమె అందం మాత్రం తగ్గలేదు. మరింత పక్వానికి వచ్చినట్టు మిస మిస లాడుతోంది.

కరినాగు రాగానే ఆమెని తమకంగా కౌగలించుకున్నాడు.

" అబ్బ ..కాస్త ఫ్రెష్ అయి రండి " అని అతన్ని దూరంగా తోసేసింది.

" దేవి గారిని ఇలా చూస్తుంటే ఆగడం కష్టంగా ఉంది " అంటూ అయిష్టంగానే బాత్రూము లోకి దూరాడు కరినాగు.

షవర్‌ కింద నిలబడి ఆలోచించసాగాడు. తన మిత్రులిద్దరినీ చంపింది బహుశా రచయిత్రి వాణి కి సంబంధించిన వాళ్ళే అయుంటారు. అందులో సందేహం లేదు. కానీ ఎవరు ఆ వ్యక్తి ? ఆడా..మగా ! మనిషా లేక ..ఆత్మా ? కొంపదీసి వాణి చచ్చాక ఆత్మ కాలేదు కదా ! అయితే ఆ ఆత్మను నిలువరించే మంత్రగాడి ని తీసుకురావాలి ...అదే ఈ సమస్యకు పరిష్కారం ..

" ఎంత సేపండీ స్నానం ..బయటకు రండి " అని కావేరి పిలవడంతో ఆలోచనల నుండి బయటపడి బయటకొచ్చాడు. అప్పటికే డ్రింక్స్‌ ఎరేంజ్మెంట్‌ చేసి పెట్టింది కావేరి. ఆమె బుగ్గపై ముద్దు పెట్టి హుషారుగా సోఫాలో కూర్చున్నాడు కరినాగు.

ట్రాంస్పెరెంట్‌ నైటీ లో ఉంది కావేరి. ఆమె అందాలు లీలగా కనపడుతున్నాయి. ఒక పెగ్‌ ఫిక్స్‌ చేసి కరినాగు పక్కనే సోఫాలో కూర్చుంది. నెమ్మదిగా మందు తాగుతూ కావేరి ని హత్తుకున్నాడు నాగు. మెత్తటి ఆమె ఒంటి స్పర్శ అతడికి మందు కన్నా ఎక్కువ మత్తిస్తోంది. మగాడ్ని ఎలా లొంగదీసుకోవాలో కావేరి కి తెలుసు . ఆ ట్రిక్‌ లన్నీ అతడి మీద ప్రయోగిస్తుంది.వాటికి చిత్తవుతున్నాడు కసినాగు ..ఐ మీన్‌ కరినాగు.

మందు నిషా తలకెక్కగానే ' బెడ్‌ రూం కి వెళదాం పద ' అ

న్నాడు . వయ్యారంగా నడుచుకుంటూ బెడ్రూము లోకి వెళ్ళింది. తూలుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు నాగు.

విశాలమైన బెడ్‌ మీద్‌ నగ్నంగా కావేరి. ఒక గొప్ప శిల్పి చెక్కిన అద్భుత శిల్పం లా మెరిసి పోతోంది .

చక చకా వివస్త్రుడై ఆమె మీదకి దూకాడు కరినాగు. అడవి లాంటి ఆమె అందాల్ని ఆత్రంగా దోచుకోసాగాడు . ఆమె కూడా అతనికి పూర్తిగా సహకరించసాగింది. చాలా సేపు సాగిన ఆ మన్మధ యుద్ధంలో ఓడారు ..గెలిచారు ..ఇద్దరూ. అలాగే సోలిపోయారు.

ఎప్పటికో మెలకువ వచ్చింది కరినాగు కి. టైము చూసాడు ..అర్థరాత్రి దాటింది. బెడ్‌ మీద పక్కన కావేరి లేదు. మసక చీకటి ...ఎవరో ఎదురుగా ఉన్నట్టు ఫీల్‌ అయ్యాడు. కళ్ళు చిట్లించుకుని చూసాడు. అంతే ...భయంతో గుండెలదిరిపోయాయి !

వాణి ...వాణి ..ఆత్మ ...అక్కడ ఎదురుగా ...వికృతంగా ...

భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు... చిత్రంగా ఆ ఆకారం ఒక మగాడి లా మారింది. కరినాగు మీడియా మనిషి. అ వ్యక్తి ని ఎక్కడో చూసాను అనుకున్నాడు అంత భయంలో కూడా . నెమ్మదిగా అతనికి గుర్తొచ్చింది. వర్ధమాన గాయకుడు ఋషి అతను.. అవును ఋషి ...

చేతికందిన సెల్‌ ఫోన్‌ తీసి పరమహంస కి డయల్‌ చేసాడు. అటువైపు నుండి డయల్‌ అవుతున్న శబ్దం !

ఋషి ఆకారం నెమ్మదిగా నాగు ని సమీపించింది. అవతల పరమహంస ఫోన్‌ ఎత్తాడు. " హలో ..హలో.. " అంటున్నాడు.

" వాణి ..వాణి... ఋషి... ఋషి.. " అని చెబుతున్నాడు కరినాగు.

ఋషి పఠించిన మంత్రం కరినాగు పురుషాంగాన్ని ఛిద్రం చేసింది. కెవ్వున కేక పెట్టి ఫోన్‌ దూరంగా విసిరేసాడు.

" వద్దు వద్దు ...నన్ను చంపొద్దు " అని గట్టి గట్టి గా అరుస్తున్నాడు. ఋషి ఆకారం తన ఆయుధంతో కరినాగు గొంతులో గుచ్చింది. అంతే ...అతని ప్రాణాలు గాలో కలిసిపోయాయి. అచేతనంగా పడిపోయింది అతని శరీరం. ఋషి ఆకారం మాయమయింది.

బాత్రూము కి వెళ్ళి వచ్చిన కావేరి ...ఒంటినిండా గాయాలతో... నిర్జీవంగా పడి ఉన్న కరినాగు శరీరాన్ని చూసి ..పిచ్చి గా అరవసాగింది. అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది

* * *

పరమహంస అనుమానం ఇప్పుడు పూర్తిగా తీరిపోయింది. ఇప్పటి దాకా ముగ్గురిని చంపినది.... ' వాణి ఆత్మ ' అన్న విషయం రూఢి అయింది. కాకపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాడు. భయం స్థానే అతనికి మొండి పట్టుదల ఎక్కువైంది. ' ఈ ఋషి ఎవరు ? ' అన్న ప్రశ్న కూడా అతన్ని వేధిస్తోంది.

ఎవరినో కనుక్కుని ఒక మంత్రగాడిని పట్టుకున్నాడు. ...బోలెడంత డబ్బు తీసుకున్న ఆ మంత్రగాడు పూజలు ప్రారంభించాడు.

" ఓం ...హ్రీం...క్లీం...

ఓం...హ్రీం....క్లీం... "

మంత్రగాడి గొంతులోనుండి వెలువడుతున్న పదాలు భయంకరంగా వినిపిస్తున్నాయి. అతని ముందు ... ముగ్గు లో రక రకాల వస్తువులు ..పదార్ధాలు ఉన్నాయి. వాటి పేర్లు చెబితే మనకు వాంతి అవడం గ్యారంటీ. క్షుద్ర దేవత ను మెప్పించడానికి ...ఆత్మలను పిలవడానికి అవన్నీ తప్పనిసరి.

కళ్ళు మూసుకుని సైతాన్‌ కు సంబంధించిన ప్రార్ధనలు చేస్తున్నాడు మాంత్రికుడు. చాలా సేపు ప్రయత్నించాక కళ్ళు తెరిచి చెప్పసాగాడు.

" పరమహంసా .. మీ చేతుల్లో దారుణంగా చంపబడిన స్త్రీ ఆత్మగా మారింది. మీ మీద పగబట్టి ఉంది. ఇప్పటికే ముగ్గురిని చంపింది. ఇక మిగిలింది నీవే "

అసహనంగా చూసాడు పరమహంస. " ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు వాణి ఆత్మ ఎందుకు రాలేదు ..అది చెప్పండి " అన్నాడు

" ఎవరో నా మంత్రానికి అడ్డు పడుతున్నారు. నా కంటే శక్తివంతుడైన మాంత్రికుడు ఆమెకు అండగా ఉన్నాడు. ఆమె పగను తీర్చుకోవడానికి సహకరిస్తున్నాడు "

" సహకరిస్తున్నాడా ! ఎవరు ..ఎవరు ? "

" ఎవరో తెలీదు. నేను కనుక్కోలేను. కాకపోతే ఆ ఆత్మ నుండి నిన్ను నీవు కాపాడుకోవడానికి ఒక తాయెత్తు ఇస్తున్నాను. అది కట్టుకో " అని చెప్పి ఒక తాయెత్తు ఇచ్చాడు మాంత్రికుడు.

పరమహంస దాన్ని భక్తిగా కళ్ళ కద్దుకుని చేతికి కట్టుకున్నాడు. ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది అతనికి.

* * *

పొద్దున్న పది అయింది. పోలీస్‌ స్టేషన్‌ లో ....

ఎస్సై బ్రహ్మయ్య సీట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. వరసగా హత్యలు జరుగుతున్నాయి. ఒకే విధంగా అవుతున్నాయి. చేస్తున్నది కూడా ఒక్కరే అని అర్థం అవుతోంది. కానీ హంతకుడి ని పట్టుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. మీడియా నుండి , పై అధికారుల నుండి వత్తిడి పెరుగుతోంది. ఏం చెయ్యాలో అర్థ కాక తల పట్టుక్కూర్చున్నాడు.

కరినాగు హత్య జరిగిన ప్రదేశంలో లభించిన అతని సెల్‌ ఫోన్‌ లో ఉన్న కాల్‌ డేటా వగైరా పరిశీలించమని ఆర్డర్‌ వేసాడు. కిందవాళ్ళు ఆ పని మీదే ఉన్నారు. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. హంతకుడిని పట్టుకుని వాడి అంతు చూడాలి అని కసిగా అనుకున్నాడు.

కానిస్టేబుల్‌ వచ్చి కొన్ని ఆధారాలని అతని ముందు ఉంచాడు. వాటిని పరిశీలించసాగడు బ్రహ్మయ్య. అందులో సెల్‌ ఫోన్‌ డేటా అతన్ని ఆకర్షించింది.

కరినాగు చనిపోయే ముందు పరమహంస అనే వ్యక్తికి కాల్‌ చేసాడు. చనిపోతూ ' వాణి పేరు తో పాటూ ఋషి అనే పేరు కూడా చెప్పాడు ' .

ఎవరీ పరమహంస ? ఎవరీ ఋషి ? ఆలోచనలో పడ్డాడు బ్రహ్మయ్య.

కానిస్టేబుల్‌ ని పిలిచి " ఈ పరమహంస ..ఋషి ...ఎవరో కనుక్కోండి. ఎందుకైనా మంచిది ఒకసారి మనం వాణి ఫ్లాట్‌ కి వెళదాం. ఏమైనా పనికొచ్చే ఆధారాలు దొరకొచ్చు ! " అని చెప్పాడు.

" అలాగే సార్‌ ! " అని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్‌.

ఆ సాయంత్రం వాణి ఫ్లాట్‌ కి వెళ్ళాడు ఎస్సై. అతనితో పాటూ ఒక కానిస్టేబుల్‌ కూడా ఉన్నాడు.

వీళ్ళని చూడగానే అపార్ట్‌ మెంట్‌ సెక్రటరీ పరుగెత్తుకుంటూ వచ్చి -

" నమస్తే సార్‌ .." అని విష్ చేసాడు.

" నమస్తే ..కిడ్నాప్‌ అయిన వాణి ఫ్లాట్‌ ని ఒకసారి పరిశీలించాలి. కీస్‌ ఇవ్వండి " అన్నాడు ఎస్సై

" అలాగే సార్‌ ...తప్పకుండా ..పాపం ఆ అమ్మాయి ఒంటరిగా ఉండేది... ఎంతో ధైర్యవంతురాలు ...కానీ ..ఏం జరిగిందో ఏమిటో ... " అంటూ తాళాలు ఇచ్చాడు.

" థాంక్యూ .." అని చెప్పి ఫ్లాట్‌ వైపు వెళ్ళాడు ఎస్సై.. అతని వెనగ్గా కానిస్టేబుల్‌ కూడా .

ఫ్లాట్‌ లోపల అణువణువు జాగ్రత్తగా పరిశీలించసాగాడు ఎస్సై. పెద్దగా ఆధారాలేమీ కనపడలేదు. వాణి ఒంటరి పక్షి కాబట్టి వస్తువులు కూడా ఎక్కువగా లేవు. చాలా పుస్తకాలు ఉన్నాయి. అవే ఆమె సంపాదించిన ఆస్తి. చివర్లో వచ్చేస్తుండగా ఒక డైరీ కనపడింది బ్రహ్మయ్య కి. దాన్ని తీసుకుని వచ్చేసాడు. కేసు కి సంబంధించిన కీలక అధారాలు అందులో ఉన్నాయని ఆ క్షణం అతనికి తెలీదు.

* * *

పరమహంస మళ్ళీ తన స్ట్రేటజీ ని ఫాలో అవుతున్నాడు. ఒక గాయని ని ఇంటర్వ్యూ చేద్దామని బయలు దేరాడు. ఆ గాయని ఎవరో కాదు ...ఋషి ని ప్రేమించిన లేఖ. ఋషి చే తిరస్కరింపబడిన లేఖ . అందమైన ఆమె రూపం పరమహంస లో కదలికలను సృష్టించింది. ఎలాగైనా ఆ అమ్మాయిని వలలో వేసుకోవాలని పథకం వేసుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు.

" మే ఐ కమిన్‌ " అందంగా నవ్వుతూ అడిగాడు పరమహంస.

" ప్లీజ్‌ .."అంది లేఖ

లోనికి వచ్చి ఇంటర్వ్యూ మొదలు పెట్టాడు . అతడు అడిగే ప్రశ్నలకు రెచ్చిపోయి ఆన్సర్స్ చెప్పింది లేఖ. ఇంటర్వ్యూ అవుతున్నంతసేపూ ఆమె అందాన్ని తనివి తీరా ఆస్వాదించసాగాడు . ఇంటర్వ్యూ పూర్తయ్యాక " ఇక నాకు సెలవు ఇప్పిస్తారా మేడం " అంటూ కొంటెగా అన్నాడు. చురుగ్గా చూసింది లేఖ.

" వెళ్ళండి " అంది

" మళ్ళీ ఎప్పుడు కలుద్దాం " అడిగాడు

" దేనికి ? " అమాయకంగా అడిగింది

" దేనికో చెబితే గాని కలవరా ?" బాధపడినట్టు మొహం పెట్టి అన్నాడు

" అయ్యయ్యో ...నా ఉద్దేశ్యం అది కాదండీ " అని " రేపు సాయంత్రం కలుద్దాం " అంది.

" థాంక్యూ " అని అక్కడి నుండి వచ్చేసాడు. అతడి పెదవులపై విజయగర్వంతో కూడిన చిరునవ్వు కదలాడింది.

ఇక్కడ గాయని లేఖ గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. ఒక గాయకురాలిగా తను బాగా పాడవచ్చేమో కానీ మానసికంగా చాలా మామూలు అమ్మాయి. ఋషి ని చూసినప్పుడు అతన్ని ఎంతగానో ఇష్టపడింది. తన మనసులోని ప్రేమని అతనికి వ్యక్తపరచింది.కానీ ఋషి ఆల్రెడీ వాణి ని ప్రేమిస్తూ ఉండటం వల్ల ఆమెను తిరస్కరించాడు. మొదట్లోకొంచెం బాధపడింది లేఖ. తర్వాత కాలంతో పాటూ ఆ విషయాన్ని మర్చిపోయింది. కెరీర్‌ లో పైకి రావడం లో మునిగిపోయింది.

పరమహంస లాంటి అందగాడు ఇప్పుడు కనిపించి తనని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని బాగా థ్రిల్‌ ఫీల్‌ అయింది. అతనితో స్నేహం చెయ్యాలని...ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ఆరాటపడుతోంది. అందులో ఆమె తప్పు లేదు. వయసుతో వచ్చే ఆకర్షణ అది. కానీ ఆమెకు తెలియనిది - పరమహంస ఒక పాములాంటి వాడని. అతనితో సాన్నిహిత్యం అత్యంత ప్రమాదకరమని !

సరే ..వర్తమానానికొస్తే ...

పరమహంస లేఖ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. సాయంకాలమైంది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. పరమహంస మనసు కువ కువ లాడుతోంది. లేఖను ఎలాగైనా ముగ్గు లోకి దించి అనుభవించాలని ఆత్రపడుతున్నాడు. కాకపోతే కొంచె జాగ్రత్తగా హేండిల్‌ చెయ్యాలని అనుకున్నాడు.

సమయం రానే వచ్చింది. లేఖ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది.

" థాంక్యూ లేఖ గారూ " అంటూ ఆమెను రిసీవ్‌ చేసుకున్నాడు పరమహంస . " ఇప్పుడు మనం ఒక అద్భుతమైన చోటు కి వెళ్ళబోతున్నాం " అని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. అరగంట ప్రయాణం తర్వాత ఒక సుందర ప్రదేశానికి చేరుకున్నారు ఇద్దరూ.

అక్కడ సన్నటి నది చాలా అందంగా ప్రవహిస్తోంది. నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన వాతవరణం. ఆ నది పక్కనే చిన్న కాటేజ్‌.

" ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు " భయం భయం గా అంది లేఖ.

" నేనుండగా మీకు భయం ఏమిటి ? నా పైన నమ్మకం లేదా ?" నిష్టూరంగా అన్నాడు. నిశ్శబ్దంగా ఉంది లేఖ. ' మౌనం అంగీకారం కదా !' అని హేపీగా ఫీల్‌ అయ్యాడు.

నిజానికి ఆమెకు భయం లేదు. అటువంటిది ఏమైనా ఉంటే ముందే రానని చెప్పేది కదా !

ఆమెను దగ్గరగా తీసుకుని పెదాలపై ముద్దు పెట్టాడు. తన్మయంగా ఫీల్‌ అయింది.

క్రమంగా తన చేతులతో మేజిక్‌ చెయ్యసాగాడు. ఆమె మౌల్డ్‌ అవసాగింది. చిన్నగా ఆమెను నడిపించుకుని కాటేజ్‌ లోనికి తీసుకొచ్చాడు. ఈ హడావుడి లో అతని చేతికి ఉన్న తాయెత్తు ఎక్కడో జారిపోయింది .

అమ్మాయిలను అనుభవించడం అలవాటైన అతని చేతులు ఆమెను వివస్త్రను చెయ్యసాగాయి. కొత్త అనుభవ కోసం ఆమె శరీరం సన్నద్ధం కాసాగింది.

పరమహంస ఆమె లోకి ప్రవేశించబోతున్నాడనగా...

ఒక వింత చప్పుడైంది. ఉలిక్కిపడి ఆమెను వదిలేసాడు. మళ్ళీ ఆ చప్పుడు విన వచ్చింది. ఎవరో నవ్వుతున్న చప్పుడు. కానీ ఆ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. చుట్టూ చూసాడు పరమహంస. ' ఏమైంది ..? ' అడిగింది లేఖ.

" ఏమీ కాలేదు " అని బెడ్‌ దిగి కాటేజీ లోని ముందు రూముకి వచ్చాడు. అదిరి పడ్డాడు.

అక్కడ ..అక్కడ ..ఎవరో అపరచిత వ్యక్తి ...కూర్చుని ఉన్నాడు .....

" ఏయ్‌..ఎవరు నువ్వు ? " గట్టిగా అరిచాడు పరమహంస

" నేనెవరో తెలుసుకోవాలనుందా ..అయితే విను ...నా పేరు ఋషి...నా పేరు వాణి. .."

భయంతో బిగుసుకుపోయాడు హంస.

" ఏయ్‌..ఏంటిది..భయపెట్టాలని చూస్తున్నావా ? ఎవడ్రా నువ్వు...పో ఇక్కడి నుండి " గట్టి గా అరుస్తున్నాడు. " వాణి పేరు చెప్పి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చెయ్యాలని చూస్తున్నావా "

" నిన్ను బ్లాక్మెయిల్‌ చెయ్యల్సిన అవసరం నాకేంట్రా ..నిన్ను చంపాలి..అదే నా కోరిక "

ఋషి అన్న పేరు వినబడి అక్కడికి వచ్చింది లేఖ. ఎదురుగా ఉన్న ఋషి ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే సిగ్గుతో తలదించుకుంది. ఒకప్పుడు ఋషి కి ఐ లవ్యూ చెప్పడం గుర్తొచ్చి " అదీ..అదీ.." అంటూ ఏదో చెప్పబోయింది. కానీ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఋషి ఆకారం నెమ్మదిగా అదృశ్యం అయి వాణి ఆకారం ప్రత్యక్షమయింది. అది చూసి స్పృహ తప్పి పడిపోయింది లేఖ.

వెన్ను లో వణుకు పుట్టింది పరమహంస కు. వాణి ఆత్మ ను చూడగానే తను ఆమెకు చేసిన నయవంచన గుర్తుకొచ్చింది అతనికి.

" వాణీ నన్ను క్షమించు వాణీ ...నన్ను క్షమించు వాణీ " అని వేడుకుంటున్నాడు.

" నిన్ను క్షమించాలా... దేనికి ... " వికటాట్టహాసం చేసింది వాణి ఆత్మ .

తను చావడం గ్యారంటీ అని అర్థమైంది హంసకు. పరుగెత్తుకుంటూ వెళ్ళి సెల్‌ ఫోన్‌ తీసుకున్నాడు. ఎవరికో ఫోన్‌ చేద్దామని ప్రయత్నించాడు. అతని ప్రయత్నం వృధా అయింది. ఎంత ప్రయత్నించినా కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు.

" హ ..హ ..హ.. హ ... .." వాణి ఆత్మ నవ్వుతోంది. అచేతనుడయ్యాడు పరమహంస. మృత్యు భయం అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడసాగింది. వాణి ఆకారం అదృశ్యమయి ఋషి ఆకారం ప్రత్యక్షమయింది. ఏదో మంత్రం చదువుతూ తీక్షణంగా చూడసాగాడు ఋషి. కళ్ళల్లో క్రౌర్యం.

' టప్‌ ' మన్న సౌండ్‌ అయింది. పరమహంస కెవ్వున కేక పెట్టాడు. అతని మగతనం విఛ్చిన్నమయింది.

" నన్నేం చెయ్యకు ..నన్నేం చెయ్యకు " అంటూ అరుస్తున్నాడు.

ఋషి ఆకారం నెమ్మదిగా హంసను సమీపించింది. కళ్ళు బైర్లు కమ్మాయి హంసకు. ఋషి చేతిలోని ఆయుధం హంస గొంతులోకి మెత్తగా దిగింది. చివ్వున రక్తం ఎగజిమ్మింది. హంస ప్రాణాలు నిశ్శబ్దంగా గాల్లో కలిసిపోయాయి. వాణి ఆత్మ తృప్తిగా నవ్వింది.

దుష్టచతుష్టయం ఆ విధంగా అంతమైంది.

* * *

వాణి వ్రాసిన డైరీ ని చదవసాగాడు బ్రహ్మయ్య.

" ఒంటరి తనం ...

నా జీవితాన్ని ఎంతో మార్చిన ఒంటరి తనం.

చిన్నతనం నుండి నాకు తోడు గా నీడ గా ఉన్న ఒంటరి తనం .!

ఎన్నో కలలు కన్నాను..మరెన్నో ఆశలు పెంచుకున్నాను. అవేవీ నన్ను దరి చేరలేదు.

విధి నిర్దాక్షిణ్యం గా నా తల్లిదండ్రులని తీసుకుపోయినప్పుడు ..

నా మనసు ముక్కలై రోదించినప్పుడు ..

నన్ను ఆదుకుంది ఈ ఒంటరితనం.

అందుకే నాకు ఒంటరితనమంటే ఇష్టం.

కానీ .. నా జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించింది ఈ బాహ్య ప్రపంచం . నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది . దానితో ఒంటరి తనం నాకు దూరమైంది ..కానీ అశాంతి నాకు దగ్గరైంది.

ఆ అశాంతి ని పోగొట్టుకోవడానికి రచయిత్రిని అయ్యాను. ఎంతో ఎత్తుకు ఎదగాలన్నది నా అభిలాష.

1

నా అభిమాన రచయిత సవ్యసాచి గారు నన్ను పిలిచి మెచ్చుకున్నారు. తన దగ్గర శిశ్యరికం చెయ్యమన్నారు. ఆనందంగా ఒప్పుకున్నాను.

అతని బావమరిది బోకు నన్ను తినేసాలా చూస్తున్నాడు. మాట కలిపి నన్ను డిస్టర్బ్‌ చెయ్యసాగాడు. సవ్యసాచి గారు అది గమనించి అతన్ని తిట్టి పంపించారు. మొహం మాడ్చుకున్నాడు బోకు

2

ఎవరీ ఋషి ?

ప్రేమ లేఖలు వ్రాస్తున్నాడు. లేఖలు వ్రాసి ..అభిమానిస్తే ప్రేమించెయ్యాలా ?

ఒళ్ళు మండింది నాకు. అందుకే సమాధానం ఇవ్వలేదు నేను.

నా కథని సినిమాగా తీస్తానని నిర్మాత రావు పిలిచాడు ..వెళ్ళాలి

3

ఛీ ..మనుష్యులు ఇంత దరిద్రంగా ఉంటారా ? కూతురు వయసున్న నన్ను బలవంతం చెయ్యాలని చూసాడు రావు. పారిపోయి వచ్చాను. ఏడుపొస్తోంది నాకు. ఏమిటీ ప్రపంచం ? మంచి అనేది ఉందా ? ఒకడు ప్రేమ అని లేఖలు వ్రాస్తాడు. ఇంకొకడు అవకాశం ఇస్తానని వాడుకోవాలని చూస్తాడు. ఎవరిని నమ్మాలి?

4

నిర్మాత పుల్లయ్య గారు నా కథ తీసుకున్నారు. దాని షూటింగ్‌ కి రమ్మని అడుగుతున్నాడు .వెళ్ళాలి.

ఋషి రక్తంతో వ్రాసిన ప్రేమలేఖ అందింది. అతని కి బుద్ధి చెప్పాలి. లేకుంటే ఇంకా దారి తప్పుతాడు. అందుకే అతన్ని షూటింగ్‌ స్పాట్‌ కి వచ్చి కలవమని సందేశం పంపాను.

5

ఋషి షూటింగ్‌ స్పాట్‌ కి వచ్చాడు. లేతగా ..అమాయకంగా ఉన్నాడు. అయినా నా మనసు కరగలేదు. ఇంకెపుడూ నాకు లెటర్స్‌ వ్రాయొద్దని ..బుద్ధిగా చదువుకోమని తిట్టి పంపించాను. ఏడుస్తూ వెళ్ళిపోయాడు. పూర్‌ ఫెలో !

6

పరమహంస నాకు నచ్చాడు. మగాడంటే అలా ఉండాలి. అతనికి నా మనసిచ్చాను.

టీవీ సీరియల్స్‌ కోసం వ్రాయడానికి ఒక ఆఫీసు కి వెళ్ళాను. అక్కడి చీఫ్‌ కరినాగు అట. నన్ను అదోలా చూడసాగాడు. జాబ్‌ ఇచ్చాడు.

అక్కడ జాయిన్‌ అయ్యాను. కావేరీ మేడం చాలా మంచిది. బాగా మాట్లాడుతుంది. కరినాగు ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది.

7

ఛీ ..ఈ మనుషులంతా ఇంతేనా ? కరినాగు కి నన్ను తార్చాలని చూసింది కావేరి మేడం. అది రాక్షసి.

అక్కడి నుండి తప్పించుకుని వచ్చాను. నా పరమహంస తో చెప్పుకుని ఏడ్చాను. అతని ఓదార్పు నాకు మనుషులపట్ల నమ్మకాన్ని ఇచ్చింది.నన్ను మామూలు మనిషిని చేసింది.

8

నా గుండె బద్దలయింది ఈ రోజు.

నా పరమహంస కూడా నన్ను మోసం చేసాడు. నన్ను ప్రేమిస్తూ ఇంకో అమ్మాయి తో ఎలా గడపగలడు ? అంతా మోసం ! కన్నీళ్ళు ఆగడం లేదు నాకు. ఎందుకో ఋషి గుర్తుకొస్తున్నాడు. తొలి రోజుల్లో నన్ను ప్రేమించిన మొదటి వ్యక్తి. నా రచనలను అభిమానించి నన్ను ప్రేమించిన మొదటి అభిమాని. ఎంత చిన్న చూపు చూసాను అతన్ని!

నేను తిట్టినప్పుడు అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడిన బాధ. దెబ్బ తిన్న పక్షి లా చూసాడు. తన ప్రేమను తక్కువ అంచనా వేసానని బాధ పడ్డాడు. కానీ అవన్నీ పైకి చెప్పకుండా ..నా మాటను గౌరవించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. తర్వాత నన్ను ఏనాడూ డిస్టర్బ్‌ చెయ్యలేదు.

ఒక సారి కనిపించాడు.. కానీ నేను కేర్‌ చెయ్యలేదు. అప్పుడు పరమహంస మత్తులో ఉన్నాను. ప్రేమ మైకం నా కళ్ళను మూసింది. ..పోనీ… కనీసం అతడు గాయకుడిగా ఎదుగుతుంటే అభినందించడానికి కూడా నాకు మనసు రాలేదు. అహం ! నా మనసుకి పట్టిన అహం !

నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మడం ...దూరంగా ఉన్న అతన్ని నమ్మకపోవడం ..నేను చేసిన తప్పా ? ఏమో !

నాకు ఋషి ని చూడాలనిపిస్తోంది. ...కానీ ఇప్పటికే సమయం మించిపోయింది.. మా మధ్య దూరం తిరిగి కలవలేనంతగా ...మా బంధం తిరిగి అతుక్కోలేనంతగా...అయిపోయింది.

పరమహంస వల్ల నా గుండెకు గాయం అయింది. ..ఋషి ని దూరం చేసుకుని నా మనసుని గాయం చేసుకున్నాను. ఇంకేం మిగిలింది నాకు ?

నేను విదిలించుకున్న ఒంటరి తనమే నాకు తోడుగా వచ్చి చేరింది. ఇంతే ..ఈ బ్రతుక్కి ఇంతే ! "

* * *

చదవటం పూర్తి చేసి గాఢంగా నిశ్వసించాడు ఎస్సై బ్రహ్మయ్య. వాణి కిడ్నాప్‌ అవ్వడానికి కారణమైన వ్యక్తుల గురించి ఒక క్లారిటీ వచ్చింది అతనికి. ఆమెకు శత్రువులైన ఆ నలుగురే చేసి ఉంటారని చూచాయగా అర్థమయింది.

కానీ కిడ్నాప్‌ చేసి ఎక్కడికి తీసుకెళ్ళారు.. తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద క్లారిటీ లేదు. పైగా అందులో ముగ్గురు హత్య గావింప బడ్డారు. ఇక మిగిలింది పరమహంస ఒక్కడే ! అతన్ని పట్టుకుంటే కథ తెలుస్తుంది.

పాపం ఋషి... వాణి ని ఎంతగానో ప్రేమించాడు. కానీ ఆమె అంగీకారాన్ని పొందలేకపోయాడు.

" సార్‌ .." కానిస్టేబుల్‌ వచ్చి సెల్యూట్‌ చేసాడు.

" చెప్పు " అన్నాడు బ్రహ్మయ్య.

" ఊరి చివర కాటేజీ లో పరమహంస హత్య చెయ్యబడ్డాడు.. అతని సెల్‌ ఫోన్‌ ట్రేక్‌ చేస్తూ వెళితే ఈ విషయం బయటపడింది "

" మై గాడ్‌.. " అని విపరీతంగా ఆశ్చర్యపోతూ కుర్చీ లో నుండి ఒక్క ఉదుటున లేచాడు బ్రహ్మయ్య.

" షిట్ …అనుకున్నదంతా అయింది .. ముందు ఆ ఋషి ఎవరో కనుక్కుని పట్టుకోవాలి ..అతనికి ఈ హత్యలతో సంబంధముందేమో చూడాలి..క్విక్‌ " అన్నాడు

" ఓకే సార్‌ " అని సెల్యూట్‌ కొట్టి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్‌.

' ఋషి వాణి ని ప్రేమించాడు కదా… అందుకే ఆమెను బాధ పెట్టిన ఆ నలుగురినీ అంతమొందించి ఉంటాడు ' అని తనకు తెలిసిన సినిమా నాలెడ్జ్‌ ప్రకారం ఊహించుకున్నాడు బ్రహ్మయ్య.

' ఈ ఋషి అనే వాడిని వదలకూడదు ' అని గట్టిగా నిర్ణయించుకున్నాడు

* * *

" అబ్బ ..ఎన్నాళ్ళకి ఇంటికొచ్చావురా .." అని దిష్టి తీసింది ఋషి తల్లి అనసూయమ్మ

చాలా కాలం తర్వాత సొంత ఊరికి వచ్చాడు ఋషి. జరుగుతున్న సంఘటనలన్నీ అతని మనసు ని కలచివేసాయి. అందుకే మనసు మార్పు కోసం వచ్చాడు.

" టీవీ లో బాగా పాడావు అబ్బాయ్‌ " అని ఊరి వాళ్ళు మెచ్చుకుంటుంటే ఆ స్వఛ్చమైన అభినందనకి పొంగిపోయాడు. అందరూ ఋషి ని పొగుడుతుంటే ' పుత్రోత్సాహం ' తో గర్వపడ్డాడు అతని తండ్రి.

" అన్నయ్యా ..నీ కోసం పోలీసులు వస్తున్నారట " రొప్పుతూ చెప్పింది ఋషి చెల్లి సుమతి.

" పోలీసులా ..నా కోసమా ! " అని ఆశ్చర్యపోలేదు ఋషి. ఎప్పటికైనా వాళ్ళు వస్తారని తెలుసు. జరగబోయే పరిణామాలకి అతను ఎప్పుడో సిద్ధపడే ఉన్నాడు.

పోలీసు జీపు వచ్చి ఆగింది. నిదానంగా జీపు దిగి వచ్చాడు బ్రహ్మయ్య.

" ఏం ఋషీ ...మంచి హేపీ మూడ్‌ లో ఉన్నట్టున్నావు " అన్నాడు. ఋషిని చాలా కాలంగా ఎరుగుదును అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు ఎస్సై. నిజానికి భౌతికంగా కలుసుకోకపోయినా ఋషి గురించి ఎక్కువగా ఆలోచించి అతనికి మానసికంగా దగ్గరయ్యాడు బ్రహ్మయ్య.

" ఏదో మీ దయ సార్‌ " అని నవ్వేసాడు ఋషి.

" వాణి కిడ్నాప్‌ కేసులో మరియు నలుగురి హత్య కేసులో మీ మీద అనుమానాలు ఉన్నాయి. మిమ్మల్ని మా కస్టడీ లోకి తీసుకోవాలి. మీకేమైనా అభ్యంతరమా ? " అన్నాడు ఎస్సై.

" నాకేమీ అభ్యంతరం లేదు.. దానికి ముందు నేను చెప్పేది మీరు వినాలి. పదండి " అన్నాడు. ఇద్దరూ జీప్‌ ఎక్కారు. ఋషి సూచన మేరకు జీపు ఊరి చివర బంగళా వద్దకు చేరుకుంది.

ఋషి చెప్పడం మొదలు పెట్టాడు

" మీరు ఇప్పుడు చూసిన వ్యక్తులే నా కుటుంబం సార్‌. తల్లి , తండ్రి , ఒక చెల్లెలు. చాల సామాన్యమైన కుటుంబం సార్‌ మాది. బాగా చదువుకుని మెడిసన్‌ లో జాయిన్‌ అయ్యాను. చదువే లోకం అనుకునేవాడిని. కానీ చిత్రంగా సాహిత్యం నన్ను ఆకర్షించింది.వాణి ఫోటో ని తొలిసారిగా ఒక పత్రికలో చూసినప్పుడు నా మనసు లో సంచలనం కలిగింది. ఆ తర్వాత ఆమె వ్రాసినది చదివాక అది ప్రేమగా మారింది.

నా ప్రేమను ఆమెకు ఎన్నోసార్లు లెటర్స్‌ ద్వారా చెప్పాను. కానీ స్పందించలేదు. తర్వాత ఒక సారి ఇదే బంగళా దగ్గర నేను వాణి ని కలిసాను.

" నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు " అని చెప్పి వాణి నన్ను వెళ్ళిపొమ్మంది. నిశ్శబ్దంగా వచ్చేసాను. అదే నేను ఆమెను తొలిసారి ..చివరి సారి కలవడం. ఆ తర్వాత జరిగినది నాకు తెలీదు. "

" మరి ..నీ పేరు ని కరినాగు అనే వ్యక్తి పరమహంస అనే వ్యక్తికి ఎందుకు చెప్పాడు ? " సూటిగా అడిగాడు ఎస్సై.

ఆలోచనలో పడ్డాడు ఋషి. జరిగినది చెబితే బ్రహ్మయ్య నమ్మడేమో అన్న అనుమానం అది . అయినా చెప్పాలి...తప్పదు అనుకున్నాడు.

" మీరు చెప్పిన పేర్లు నేను కూడా విన్నాను సార్‌. నాకు అవి వాణి ఆత్మ ద్వారా తెలిసాయి. " అన్నాడు

" ఆత్మా !..ఏంటి ఋషీ ఈ కాలంలో కూడా అలాంటివి ఉన్నాయా...కాక్‌ అండ్‌ బుల్‌ స్టోరీస్‌ చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా ? " కోపంగా అన్నాడు బ్రహ్మయ్య

" మీరు నమ్మినా నమ్మకపోయినా ..కోపగించుకున్నా జరిగిన వాస్తవం ఇదే . నేను చెప్పినది విన్న తర్వాత నన్ను మీరు అరెస్ట్‌ చేసుకోవచ్చు "

" సరే..చెప్పు "

" ఒక రోజు వాణి నాకు ఫోన్‌ చేసి ఇక్కడకు రమ్మంది. ఎంతో సంబరపడిపోయాను. ఆనందంగా ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను. తీరా వచ్చి చూస్తే నా వాణి ...నా వాణి ..విగతజీవురాలై ఉంది. ఎవరో మాంత్రికుడ ట ..నన్ను చూడగానే - వాణి ని నలుగురు దుర్మార్గులు రేప్‌ చేసి చంపేసారని చెప్పాడు. వాణి ఆత్మ అతనితో చెప్పిన విషయం ఇది. వినగానే కోపంతో రగిలిపోయాను. ఎలాగైనా ఆ నలుగురుని చంపి నా వాణి ఆత్మ కు శాంతి చేకూర్చాలని అనుకున్నాను. వాణి చివరి కోరిక కూడా అదే ! కానీ ఆ నలుగురిని ఎదిరించేంత శక్తి సామర్థ్యాలు భౌతికంగా జీవించి ఉన్న నాకు కానీ ..ఆత్మగా మారిన వాణి కి కానీ లేవు. అక్కడే ఆ మాంత్రికుడు మాకు సాయం చేసాడు. అతనికి తెలిసిన విద్యలతో నా శరీరాన్ని , వాణి ఆత్మ ను అనుసంధానం చేసి ప్రయోగించాడు. ఒక అమాయకురాలిని దారుణంగా రేప్‌ చేసి చంపేసిన ఆ దుష్ట చతుష్టయాన్ని అంతమొందించడానికి సాయపడ్డాడు. అయితే ఎప్పుడూ సాత్వికంగా ఉండే నేను వాణి ఆత్మ నాలో ప్రవేశించగానే రాక్షసుడి లా మారిపోయేవాడిని. విపరీతమైన క్రౌర్యం నాలో ప్రవేశించేది. ఎదురుగా ఉన్న శతృవుని దారుణంగా చంపేదాకా ఆ ఆవేశం చల్లారేది కాదు. ఇదే సార్‌ జరిగింది." అని చెప్పడం ముగించాడు ఋషి.

" గుడ్‌ ..బాగుంది కథ ! ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు. వాణి ని గాఢంగా ప్రేమించిన ఒక ప్రేమికుడిగా నీవు ఆడిన డ్రామా అయినా కావొచ్చు. ఏది ఏమైనా వాణి నిర్దాక్షిణ్యంగా చంపబడింది అన్నది నిజం. దానికి కారణమైన దోషులకి మా న్యాయ స్థానాలు ఇంతకంటే గొప్ప శిక్ష లేమీ వెయ్యవు. పైగా వాళ్ళు తప్పించుకొనే అవకాశం కూడా ఉండేది. ఆ రకంగా చూస్తే నువ్వు చేసినది సరైనదే ! " అన్నాడు బ్రహ్మయ్య

" సార్‌ ..ఇప్పుడు నన్ను మీరు అరెస్ట్‌ చేస్తారా ? " అడిగాడు ఋషి.

చిన్నగా నిట్టూర్చాడు బ్రహ్మయ్య " ఈ కేసు లో హంతకుడి కి సంబంధించి సరైన ఆధారాలు ఇంకా దొరకలేదు. అవి దొరికినప్పుడు ఆ హంతకుడిని అరెస్ట్‌ చేస్తాను .డోంట్‌ వర్రీ " అని నర్మ గర్భంగా నవ్వాడు.

ఋషి కి అర్థమైంది. " థాంక్యూ సార్‌ " అన్నాడు

బ్రహ్మయ్య వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ వాణి వ్రాసిన డైరీ ని ఋషి చేతి లో పెట్టాడు. " చదువు ...నీ వాణి మనసు తెలుస్తుంది " అన్నాడు.

సంభ్రమంగా చూసాడు ఋషి.

" సార్‌ నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలి .అది మీకు పనికి వస్తుంది " అని జేబులో నుండి ఒక వస్తువు తీసి ఇచ్చాడు.

నిశితంగా దాన్ని పరిశీలించసాగాడు బ్రహ్మయ్య.

" ఎన్నో గొప్ప కథలని వ్రాసిన కలం సార్‌ అది ..వాణి కథలు వ్రాయడానికి ఉపయోగించిన కలం. " అన్నాడు ఋషి.

" ఆహా ... చాలా బాగుంది …నాకెందుకిది? "

" ఇదే సార్‌... ఆ దుష్టచతుష్టయాన్ని చంపడానికి నేను వాడిన కొత్త ఆయుధం . కలం ..ది పెన్‌ " అన్నాడు ఋషి.

" నిజమా ! " అన్నట్టు విభ్రాంతిగా చూసి దాన్ని జేబులో పెట్టుకున్నాడు బ్రహ్మయ్య . తర్వాత అతనెక్కిన జీపు సిటీ వైపు దూసుకెళ్ళసాగింది.

జేబులో పెన్ను తడుముకుంటూ ' ఇక ఈ కేసు క్లోజ్‌ చేసెయ్యలి ' అని మనసులో అనుకున్నాడు బ్రహ్మయ్య .

తన చేతిలోని డైరీని ప్రేమగా గుండెలకు హత్తుకుని ఊరి వైపు నడుస్తున్నాడు ఋషి ..వర్ధమాన గాయకుడు ఋషి .

---------అయిపోయింది-------------

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం