సుబ్బారావు శోభనం - శ్రీనివాస భారతి

subbarao first night

సుబ్బారావు కు బోలెడు సంతోషమేసింది.
వయసొచ్చిందని తనను కూడా ఇంట్లో వాళ్ళు గుర్తించి కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టడం చూసి.
అవి మొదటి పెళ్లి చూపులు .
పెళ్ళిచూపులకు వెళ్తున్న విషయం వాళ్ళమ్మ గొప్పగా పదూళ్లకూ వెళ్లడానికి వారం ముందే చెప్పేసింది.
అనుకున్న రోజు రానే వచ్చింది.
సుబ్బారావు అచ్చంగా పెళ్లి కొడుకు లాగానే తయారయ్యాడు.....
అమ్మా నాన్నా తో మరొకరు....ఇంకొకరి తో...
కారు బయల్దేరింది..
గంట ప్రయాణం తర్వాత ఆ ఊరు చేరుకొంది.
ఈలోగా త్రోవలోని సుందర దృశ్యాలు ఒక్కొక్కటీ సుబ్బారావు మనసు పొరల మీద నెమ్మదిగా ముద్రలు వేస్తూ.....
వచ్చిన వాళ్ళని చిరునవ్వుతో ఆహ్వానించారు ఆడపిల్ల తల్లిదండ్రులు.
కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక ఎదురుగా ఉన్న ఫలహారాలు నోరూరిస్తున్నా సంబంధం ముఖ్యం గనుక ఎలాంటి ప్లేట్లు అలానే కనీసం కదలకుండా....
మధ్యవర్తులు కూడా మర్యాదగా ఉండదని తినకపోవడంతో...
పేరు అడిగింది సంబంధం కుదిరితే కాబోయే అత్తగారు.
"పావని" మెల్లగా చెప్పింది అమ్మాయి.
"ఎంతవరకు చదువు కున్నావు..?".ఈసారి కాబోయే మామగారి గొంతు నుండి.
డిగ్రీ పూర్తయ్యింది..
"సంగీతం వచ్చా..?".కాబోయే వాళ్ళు ప్రశ్నలు పంచుకొంటూ వేస్తున్నారు...అబ్బాయికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా...
"కొద్దిగా...."
"వంటలు...."
"బాగానే చేస్తుందండి." అంది అమ్మాయి తల్లి.
ప్రశ్నల వర్షం కాస్సేపు కురిసి అలసి తెరపి ఇచ్చింది.
ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒక్క క్షణం ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు.మాట్లాడుకొనేందుకు
వీలుగా వాళ్ళందరూ... వీళ్ళని డాబా మీదకి చల్లటి గాలి నెపంతో పంపారు...
పైన కప్పు, అటుపైన ఆకాశం....ఎదురుగాను, కొంచెం దూరంలోనూ... అలాంటి ఇల్లే..
మాటల్లో ఎక్కడెక్కడ చదువుకున్నారు...ప్రస్తావన వచ్చింది.
హైస్కూలు చదువుల్లో ఇద్దరూ ఒకే సెక్షన్....
కాలేజ్ లెవెల్లో గ్రూప్ ల తేడా...
డిగ్రీ కి మాత్రం ఆమె అమ్మమ్మ గారి ఇల్లు వదిలి తల్లి తండ్రి దగ్గరకొచ్చి చదువుకొంది.
ఆమె కింకా ముగ్గురు చెల్లెల్లు..
వరుసగా ఇంటర్, టెన్త్, సెవెంత్, తరగతుల్లో...
ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రెండుచోట్లా (ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ) తల్లుల డామినేషన్...
అరగంట గడిచింది..
చిన్న చెల్లి రాయబారం....రమ్మన్నట్టు.
అందరు ఒకచోట చేరారు..అమ్మాయిని మాత్రం పంపించేసి...
సంత మొదలైంది....వేలం పాటతో...
"పది కావాలి...."మొదలెట్టింది కాబోయే అత్త.
అట్నుండి "ఐదు "అంది కాబోయే వియ్యంకురాలు.
"కుదరదు..కనీసం తొమ్మిదైనా లేనిదే....మిగతాది అలకలో లాగేయ్యొచ్చు" అనుకొంటూనే. ..
అటూ అలాంటి ఆలోచనలే... ముందు జాగ్రత్తగా
"అలకలో కూడా పెద్దగా ఇచ్చుకోలేం "అంది ఆమె.
"ముందరి కాళ్లకు బంధం వేస్తోంది ఇప్పుడే...ఇదే కుదిరితే ఇకముందు పెట్టుపోతలు చూడక్కర్లేదు" అనుకొంటూ...
"సరేనండి... వెళ్ళాక ఫోన్ చేసి చెబుతాం..."
వెళ్లి వారం గడిచింది. ఏ ఫోన్ కూడా రాలేదు.
పదిహేను రోజులైంది...ఏ కబురూ తెలియలేదు.
వరకట్నం నేరమని అందరికి తెలిసి,బహిరంగంగా ఎవరూ సమర్ధించక పోయినా, లాంఛనాలు పేరిట భారీగా దండుకొనే కార్యక్రమం గా మార్చేశారు.
మొదటి పెళ్లి చూపులు ..అలా అలా తేలిపోయాయి...ఇద్దరిలో ఎవరికీ ఎలాంటి ఆశలు లేక.
వార్తలు కూడా గాల్లో తేలి గబగబా ఆడపిల్లల ఇంటివైపు పాకిపోయాయి.
ఆర్నెల్లు పోయాక మూడు సంబంధాలు ఒక వారంలో వచ్చాయి.
రెండు వెళ్లి తేలిపోతే ...మూడోది వెళ్లక ముందే పేలిపోయింది.
సుబ్బారావుకు మెల్లగా బెంగ మొదలైంది.
ఇరవై ఎనిమిది సరదాగా బెదిరిస్తోంది....ఉండనా వెళ్ళనా అని.
తలమీద ఒక తెల్లవెంట్రుక నన్ను మర్చిపోకు అంటోంది.
తీసేద్దాం అనుకోని కూడా...ఈ సారి రెండు నాలుగు ఔతాయేమో అన్న భయం..దాన్ని నల్ల వెంట్రుకల మధ్య దాచేసింది.
గుమస్తా ఉద్యోగం,సెకండ్ హాండ్ టు వీలర్ ...
ఉదయం వెళ్లి, సాయంత్రం ఆరుకు ఇంటికి చేరింది మొదలు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే సమయం అంతా...
చుట్టుపక్కల అమ్మలక్కలు చెవులు కొనుక్కొన్నారు...
మగాడి లక్షణాలు బాగా తక్కువని.
పాపం రచయితల లోకం వేరని ఎందరికి తెలుస్తుంది?
సుబ్బారావు వాళ్ళమ్మ వాళ్ళని కొన్నాళ్లు తిట్టింది.
అటునుండి రిటార్డ్స్ కూడా వచ్చేసరికి ...సుబ్బారావుని రాత్రి తొమ్మిదిలోపు ఇంటికి రావొద్దంది.
కొంచెం తీవ్రంగా పెళ్లి ప్రయత్నాలు ఇరవై తొమ్మిది కి లాక్కొచ్చాయి.
అంకెలు జీవితం మీద ప్రభావం చూపేసరికి ఆరు మాసాలు అనుకోకుండానే కరిగిపోయాయి.
తగ్గుతున్న అంకెలు కొత్త అనుమానాలు కలిగిస్తే
సుబ్బారావును తెల్ల వెంట్రుకలు మెల్లగా వెక్కిరిస్తున్నాయి.
ఇరవైతొమ్మిది నిద్రపోయి ముప్ఫైని పిలిచింది సుబ్బారావుకు కాస్త తోడుండమని.
"జీవితంలో ఇక పెళ్ళియోగం తనకు లేదేమో" అనుకున్నాడు సుబ్బారావు.
"ఆడపిల్లలకు కరువొచ్చిందేమో "అనుకున్నాడు మొదటిసారి.
కట్నం తీసుకోవడం నేరం అనడం వెనుక ఒక్కో కారణంలో తాను ఎక్కడున్నాడో లెక్కలు వేసుకొంటున్నాడు.
వయసు పెరిగి మహాభారతం గుర్తు చేస్తోంది.
ఊళ్ళో ఉన్న దేవుళ్ళు ఒక రౌండ్ పూర్తి చేసుకున్నారు.
నవగ్రహాలకు అడుగడుగు దండాలు పెట్టాడు.
చెట్లు కూడా అతడి పూజలకు వణికి పోయాయి.
నది నీరు బెంగతో దగ్గరై పోయింది మునకల భయంతో.
పరిమళాల పూలు ముడుచుకొన్నాయి సుబ్బారావు వస్తుంటే.
మరో ఆర్నెల్లు గడిచింది....కొత్త కొలమానంలా..
నాలుగక్షరాల చంద్రకళ భార్య అయింది.
ఆమెది పెద్ద కుటుంబం.
ఇద్దరు బామ్మలు,అమ్మ, పిన్ని, వదినెలు, అక్కలు
పెళ్లి అనగానే విరుద్ధ భావాలు వ్యక్తం చేశారు అందరూ..
"నా చావుకు ముందే మనుమరాలి పెళ్లి...."బామ్మ మాట.
"మంచోడేనా..."అమ్మ అనుమానం.
పిన్ని.."ఏమో పెళ్లయ్యాక తెలుస్తుంది అయ్యగారి భాగోతం...."అంది.
వదినెలు హాస్యంగా...."కొంగున కట్టెయ్యకమ్మా...జాగ్రత్త ఊపిరాడక కొట్టుకొనేను "అంటున్నారు...వాళ్ళకి దొరకని భాగ్యం గుర్తు చేసుకొని.
అక్కలు..."ఏమో అతడు అన్నల్ని మారుస్తాడో అటుదిటు
అవుతుందో..."నవ్వుతూ విసురుతున్నారు చెణుకులు.
కానీ ఆమె ఒకొక్కరిని ప్రత్యేకంగా కదిపితే.... అమ్మో
ఎన్నెన్ని భయాలో....ఇంకెన్ని జాగ్రత్తలో...
నాలుగు రోజులు పోయాక శోభనం...
ప్రపంచం తిరగబడ్డా ఈ ముహుర్తం ఎప్పుడూ రాత్రికే.
ఆరోజు ఉదయం బామ్మ బాల్చీ తన్నేసింది..కోపంగా
తననెవరూ పట్టించుకోవడం లేదని.
కోటి ఆశల శోభనం కొన్నాళ్ళు వాయిదా అనుకున్నారు దంపతులు.
అక్కల మధ్య ఆమె...అక్కడెక్కడో అతడు.
అరుమాసాలు గడిచాయి... దోషం పోయింది.
మంచి ముహూర్తం మరో మూడు నెలలు పోయాక.
కేలండర్ నవ్వుతోంది సుబ్బారావును చూసి.
మూడునెలల పదిరోజులకి ముహూర్తం కుదిరింది.
రెండు రోజుల ముందు నుండి ఈ బామ్మని ఆ బామ్మ పిలుస్తోంది పైనుండి.
"శోభనం కానీయ్... వస్తాలే "అంటోంది ఈమె...
మంచం దిగుతూ....ఎక్కుతూ...
సుబ్బారావుకు శోభన గండం వెక్కిరిస్తోందేమో అన్న భయం పట్టుకొంది.
బైట నుండి దేవుళ్ళని బ్రదిమాలుతున్నాడు..కొబ్బరికాయలు లంచం ఆశచూపిస్తూ...
ముహూర్తం కు గంట ముందు పైన బామ్మతో మాట్లాడుకొనేందుకు వెళ్ళిపోయింది...క్రింద మంచం దిగిన బామ్మ.
రెండో సారి కూడా శోభన గండం ఎదురైంది.
జుట్టు పీక్కున్నాడు. ..అంతకంటే ఇంకేమీ చెయ్యలేక.

ఈ సారి ఎవరి వంతు రావొచ్చో ...లెక్కలు వేస్తున్నారోకరు... ఆరు మాసాలు మింగేసి.
ఆరోగ్య హిస్టరీ...భీమా జీవితం గుర్తు తెచ్చుకొని.
సుబ్బారావూ లెక్కలేసుకొంటున్నాడు.
వాయిదాలు పడ్డ శోభనం ఈ సారైనా సరిగా జరుగుతుందో లేదోనని.
సరిగ్గా ముహూర్తానికి నాలుగు గంటల ముందు లాక్ డౌన్...
వాళ్ల ఊరిలో ముందు జాగ్రత్తగా.వెంటనే కంచె వేసి ఎవర్ని ఇల్లు దాటనివ్వలేదు.
రెండొందల మైళ్ళ దూరంలో....కరోనా వెక్కిరింపుల మధ్య.
సుబ్బారావు శోభనం .....గాల్లో దీపంలా....
**********************************************

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు