మాధవ - శింగరాజు శ్రీనివాసరావు

madhava


కుందన గుడి ఆవరణలో కూర్చుని ఉంది. ఇంకొక అరగంటలో మాధవ అక్కడికి వస్తాడు. ఏలాగైనా సరే ఈ రోజు అతడిని పెళ్ళికి ఒప్పించాలి. రాత్రి ఇంట్లో చెలరేగిన గాలి దుమారం గుర్తుకు వచ్చింది ఆమెకు.

*****

" ఏమిటే అంత మొండిపట్టు నీకు. ఆ గంట కొట్టుకునే వాడు తప్ప నీకు ఎవరూ నచ్చలేదా ఇంత సమాజంలో" గయ్ మన్నది కుందన తల్లి పూర్ణ.

" అబ్బబ్బ. ఎందుకే అలా కేకలేస్తావు. వాడు మాత్రం మనిషి కాదా ఏమిటి. పైగా వాడు దానికి మేనత్త కొడుకు. దాని ఇష్టమది చెప్పింది. మీకు నచ్చితే చెయ్యండి, లేకుంటే లేదు. అంతేగాని దాని మీద చిందులేయకు." పూర్ణ అత్తగారి మధ్యరికం, ఎంతయినా పెద్దావిడ కదా, పేకలో పేక కలిసిపోవాలనే ఆశ.

" మీ సపోర్టు ఒకటి మధ్యలో. మనవడికిచ్చి చేస్తే అక్కడ కూడ చక్రం తిప్పొచ్చని మీ దిక్కుమాలిన ఆలోచన. నేను చచ్చినా ఒప్పుకోను దీనికి" అదే ఊపు పూర్ణలో

" అమ్మా. మొన్న మొన్నటిదాకా బావను చేసుకుంటానంటే నోరు మెదపని వాళ్ళు, ఇప్పుడెందుకు వద్దంటున్నారు. గుడిలో పూజారిగా చేరాడనా. అది కూడా ఉద్యోగం లాంటిదేగా."

" ఆ. అది ఒక కలెక్టరు ఉద్యోగం. పళ్ళెంలో దక్షిణ వేస్తే బ్రతుకు, లేకుంటే లేదు. పిల్లవాడు ఇంజనీరుంగు చదువుకున్నాడు కదా. హాయిగా ఏ కంపెనీలోనో చేరుతాడు ఎంచక్కా నా కూతురినిస్తే అమెరికా కూడ చూస్తుందని ఆశ పడి ఇన్నాళ్ళూ మీ నాన్న నిన్ను వాడికిస్తానని గోకుతుంటే ఊరుకున్నా. ఇప్పుడు వాడు అవన్నీ వదులుకుని, వంశపారంపర్యమనుకుంటూ దేవాలయంలో నీచేత ప్రసాదాలు చేయిస్తానంటే ఊరుకుంటానా. ఒక్కగానొక్క నలుసువి, చస్తే నిన్ను ఆ లొంపలో పడేయను"

" ఏందే మీ గోల రోజు రోజుకూ ముదిరిపోతున్నది. అయినా అది పెద్దదయింది. వాడితో సమానంగా చదువుకున్నది. నీకంటే బాగానే ఆలోచించగలదు. దానికి ఇష్టమయితేనే ఈ పెళ్ళి, లేకుంటే లేదు" వరండాలోనుంచి లోపలకు వస్తూ చెప్పాడు పరమహంస, కుందన తండ్రి

" నాన్న చెప్పాడుగా. ఇహ ఈ రభస ఆపి తిని పడుకో. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. సరేనా. అమ్మా నువ్వు నన్ను అమెరికాకు పంపి, అందరిలో గొప్పగా చెప్పుకోవాలనుకున్నావేమో. అది కాని పని. మిమ్మల్ని వదిలేసి నేను నా సుఖం చూసుకోను. ఈ రోజు పేపరు చూశావా. ఆరోగ్యం బాగోలేని తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వేయి కిలోమీటర్లు తొక్కి వాళ్ళ అమ్మ దగ్గరకు తెచ్చింది. అలాటి ఆడపిల్లలున్న భరతభూమిలో పుట్టాను. వాళ్ళే మాకు ఆదర్శం. నన్ను ఎవరు చేసుకున్నా అతను వాళ్ళ అమ్మ, నాన్నలతో పాటు మిమ్మల్ని సమానంగా చూడాలి. అలాటి వాడినే చేసుకుంటాను. మీకు అందుబాటులో ఉంటానే గాని విదేశాలకు ఎగిరిపోను. గాలిలో మేడలు కట్టక అన్నం తిని పడుకో" పెట్టాల్సిన నాలుగు మెత్తగా పెట్టి తండ్రి మంచం మీద కూర్చొని, అతని కాళ్ళు నొక్కసాగింది కుందన.

" ఈ కొంపలో నా మాటంటే ఎవరికీ లెక్కలేదు. దరిద్రపు గుంపు. అదృష్టం అందలమెక్కిస్తానంటే బుద్ది బురదగుంటలోకి లాగిందట. మీ ఇష్టమొచ్చినట్టు చావండి" తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది పూర్ణ.

మనసులోనే నవ్వుకుంది కుందన.

******
పూర్ణ, పరమహంసలకు పెళ్ళయిన పదేళ్ళ తరువాత పుట్టింది కుందన. తండ్రి నోట్లోనుంచి ఊడిపడ్డట్టుగా ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా చక్కని చుక్క. ఉన్న ఊర్లోనే సబ్ పోస్టుమాస్టరుగా పనిచేస్తూ కాపురాన్ని లాక్కొస్తున్నాడు పరమహంస. పరమహంస తండ్రి ఆ ఊరి ఎలిమెంటరి స్కూలు టీచరు. పూర్ణ వాళ్ళ తండ్రి ఆ చుట్టుపక్కల గ్రామాలలో పేరున్న పురోహితుడు. సినీహీరోలా ఉండే పరమహంస రూపం, పెళ్ళి చూపులరోజే పూర్ణను ప్రేమలో పడేసింది. అలా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి. పరమహంస చెల్లెలిని దగ్గరలో ఉన్న ఊరిలో ప్రముఖ జ్యోతిష్కుడు సదాశివ శాస్త్రి, అమ్మవారి ఆలయ ప్రధాన పూజారి కొడుకుకు ఏరికోరి మరీ చేసుకుని పోయారు. ఆవిడ కొడుకే మాధవ. పోయిన సంవత్సరం యమ్.టెక్ పూర్తి చేశాడు. తండ్రి అకాల మరణం తరువాత, తాత కోరిక మేరకు వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని వృత్తిగా స్వీకరించాడు. వాళ్ళ నాన్నగారు బ్రతికుంటే ఎలా ఉండేదో తెలియదు గాని, ఇప్పుడు మాత్రం తప్పని పరిస్థితి అయింది మాధవకు.

దగ్గర దగ్గర ఊర్లు కావడంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు బాగా ఉండేవి. అలాగే ఆప్యాయతలు కూడ. కుందన, మాధవలకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ఈ రాకపోకల వల్ల. సంబంధం కలుపుకోవాలన్న కోరిక రెండు కుటుంబాలలో ఉండేది. ఈ మధ్య మాధవ తండ్రి గతించిన తరువాత కొంత దూరం ఏర్పడింది వారి మధ్య. కాని కుందన మనసులో మాత్రం ఎలాగైనా మాధవనే చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది. మరి బావ మనసెలా ఉందో తెలుసుకోవాలనే వచ్చింది మేనత్త ఇంటికి. ఇంట్లో మాట్లాడటం కుదరదని గుడికి వచ్చింది.

*****

" ఏంటి కుట్టి ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు గదా. ఇలా ఎందుకు వస్తానన్నావు" ఎర్ర పట్టు పంచలో పచ్చని దేహఛాయతో మెరిసిపోతున్న మాధవను చూస్తున్న కుందనకు అతని మాటలు వినిపించలేదు.

"ఏయ్ కుట్టి. ఏమిటా చూపు" అని మాధవ కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి కొంచెం సిగ్గుపడింది, సహజమైన కన్నెపిల్ల మదితో.

" సారీ బావ. ఈ మధ్యకాలంలో మనం కలవలేదు కదా. నిన్ను చూడగానే కొంచెం మనసు లయ తప్పింది"

" అది సరే, నువ్వు రావడమే మధ్యాహ్నం వచ్చావు కదా. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోకూడదూ. తరువాత మాట్లాడుకోవచ్చు కదా. పద ఇంటికి వెళ్దాం. భోజనాలయిన తరువాత మాట్లాడుకుందాం, అంత అర్జంటయితే" అని లేవబోయాడు

" కాదు బావా. ఇక్కడే మాట్లాడుకుందాం. దేవాలయంలో కూర్చుని మాట్లాడుకుంటే మనసులు అబద్ధాలు మాట్లాడలేవు" అని లాగి కూర్చోబెట్టింది మాధవను.

" బావా, నేనంటే నీకిష్టమేనా"

" అదేం పిచ్చిప్రశ్న. కొత్తగా అడుగుతున్నావు. నీకు తెలియదా?"

" అలాకాదు నిజం చెప్పు. నీలో ఏదో మార్పు. నాకు దూరంగా ఉండాలని చూస్తున్నావు. మనిద్దరం కలసి మాట్లాడుకుని రెండు నెలలయింది తెలుసా. ఫోను చేసినా ముక్తసరిగా మాట్లాడుతున్నావు. నీ అల్లరంతా ఏమయింది బావ. చాలా పెద్దమనిషిలా హుందాగా మారిపోయావు"

" వయసు పెరగడం, కుటుంబ బాధ్యత పెరగడం నన్నిలా మార్చాయేమో నాకు తెలియదు. అయినా రేపో, మాపో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయేదానివి. చిన్నతనంలోలా ఎలా ప్రవర్తిస్తాను చెప్పు. చూసేవారికి కూడ బాగుండదు. వెళ్దాంపద"

" ఎందుకు బావ నాతో మాట్లాడాలని లేదా. అంత పరాయిదాన్నయిపోయానా ఇంతలోనే"

" ఛ.ఛ. అదికాదు కుట్టి. మనం ఇలా ఇంకా చనువుగా ఉండడం అంత బాగుండదు"

" అదే ఎందుకు బాగుండదని. మామయ్య పోయిన తరువాత తాతయ్య కోరిక మీద ఈ వృత్తిలోకి మారిపోయావు. అప్పటినుంచి నాతో అంటీముట్టనట్టుగా ఉంటున్నావు ఎందుకు?"

మాట్లాడలేదు మాధవ.

" చెప్పు బావా. నాన్న ఏమయినా అన్నాడా? మనిద్దరికీ పెళ్ళి చేస్తానన్న తాతయ్య కూడ మౌనంగానే ఉంటున్నాడు. అసలేం జరుగుతున్నది. అందరూ ఒక్కసారి ఇలా మారిపోయారెందుకు?" కుందన కళ్ళు చిప్పిరిల్లాయి.

" కుట్టీ బాధపడకు. అనుకున్నవి అనుకున్నట్లు ఎప్పుడూ జరగవు. జీవితమంటే సర్దుబాటే. ఇప్పుడు నేను ఇంజనీరును కాను, గుడిలో పూజారిని, భక్తుల భిక్ష మీద బ్రతికే అనామకుడిని" మాధవ గొంతులో జీర.

" అయితే అర్చకులు మనుషులు కారా, వారిది ఉద్యోగం కాదా. ఇది నీ వంశపారంపర్యంగా వచ్చిన వృత్తి ధర్మం బావా. అమ్మమ్మను చేసుకున్నపుడు తాతయ్య కూడ పూజారేగా. మరి ఆమె సంతోషంగా బ్రతకలేదా. మరి ఆ వృత్తి మన పెళ్ళికెందుకు అడ్డొచ్చింది"

" రోజులు మారాయి కుట్టి. అందరూ అందలాలు ఎక్కాలనుకుంటుంటే నువ్వు ఈ బురదగుంట లోకి రావాలనుకుంటావెందుకు. ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే చాలా బాధపడుతుంది. అయినా ఎవరైనా ఎదిగిన మెట్టు నుండి పై మెట్టుకు ఎదగాలనుకుంటారు గాని, మరల దిగి మొదటి మెట్టు నుండి సాగాలనుకోరు. మనిద్దరి మధ్య చనువు వల్ల నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు. కానీ తప్పు కుట్టీ, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు"

" ఆవేశంలో నిర్ణయం తీసుకోవడానికి నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు బావా. పైగా మనిద్దరిదీ తొలిచూపు ప్రేమ కాదు. ఒకరికి ఒకరం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం. నిజం చెప్పు. మన పెళ్ళికి మన ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పారా. నాన్న, అత్తయ్య చెప్పరు. బహుశా మా అమ్మే ఏదో అని ఉంటుంది. అంతేనా"

" ప్రతి తల్లి తన బిడ్డ మహరాణిలా ఉండాలనుకుంటుందే గాని, ప్రసాదాలు చేసి గుడికి పంపే వంటలక్కలా కాదు. నేను ఏదో పెద్ద ఉద్యోగం తెచ్చుకుని ఏ అమెరికాకో వెళ్తాననుకున్నది. కానీ నేనిలా గంటలు కొట్టే వృత్తిలో స్థిరపడుతాననుకోలేదు కదా. జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళి సంగతి పక్కన పెట్టి, ఇంకేదైనా మాట్లాడు"

" అది తేలిన తరువాతే ఏ మాటయినా"

" ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. చిన్నతనం నుంచి తాతయ్య దగ్గర నేర్చుకున్న జాతకాల ప్రక్రియను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. పూజా విధానాలను ఆకళింపు చేసుకోవాలి. ఒక సంవత్సరం లోపల తాతకు తగ్గ మనవడిని అనిపించుకోవాలి. అంతేకాదు, ఇప్పటిదాకా దేవాలయ భూములు అన్యాక్రాంతమై అత్తెసరు ఆదాయాన్ని తెస్తున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని స్వంతంగా వ్యవసాయం చేయాలి. గుడి రూపురేఖలు మార్చాలి. జనాలలో తరిగిపోతున్న సంప్రదాయ విలువలకు జీవం పోయాలి
నాకు చాలా ఆశయాలు ఉన్నాయి కుట్టి. ఈ వృత్తిని స్వీకరించక ముందు మాధవ వేరు, ఇప్పుడు మాధవ వేరు. నాకు వచ్చిన కార్టూను విద్యతో సమాజంలో చైతన్యం కలిగించాలి. ఈ కష్టం నీకు వద్దు" ఆపి కుందన వంక చూశాడు మాధవ.

ఆమె గంభీరంగా వింటున్నది.

" ఇవన్నీ అయేటంత వరకూ.."

"పెళ్ళి చేసుకోవు. అంతేగా బావ" మధ్యలోనే త్రుంచి పెద్దగా నవ్వింది కుందన.

" వేళాకోళం కాదు నేను చెప్పేది"

" అని నేనన్నానా. అయినా పెళ్ళికి, దానికి అసలు సంబంధమేమిటి. నా మాట విను. ఆస్తులున్నాయనో, అమెరికా వాడనో, ముక్కుమొహం తెలియని వాడితో తాళి కట్టించుకోను. నాకూ కొన్ని ఆశయాలున్నాయి బావా. మా తాత గారిలా నేనూ టీచరును అవ్వాలనుకొని ట్రైనింగ్ పూర్తి చేశాను. అంతేకాదు నేను ఒక్కగానొక్క కూతురిని. మా అమ్మ, నాన్నలను ఇక్కడ వదిలేసి విదేశాలకు వెళ్ళను. వాళ్ళు నాతోనే ఉంటారు. ఉండాలి. అది నా బాధ్యత. కలసి బ్రతకడానికి కావలసినది అంతస్తులు కాదు బావ, కలసిన మనసులు. నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఏదో పెద్ద త్యాగమూర్తిలాగ ఊహించుకోకు. నువ్వే నా మొగుడు. నువ్వు పూజారి, నేను టీచర్. నువ్వు గుడి సేవ, నేను బడి సేవ. భగవంతుడికీ భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తీ... ఐ లవ్ యూ.." అని ముద్దు పెట్టబోయి " అమ్మో ..గుడి. ఇంటికి పద చెప్తా" అంటూ మాధవ చెయ్యి పట్టుకుని లాగి ముందుకు కదిలింది.

నాలుగు అడుగులు వేశారో లేదో, చీకటిలో నుంచి బయటకు వచ్చాడు మాధవ తాతయ్య. ఉలిక్కిపడ్డారిద్దరూ.

" తాతయ్యా నువ్వెప్పుడొచ్చావు" తడబడ్డాడు కుందన చెయ్యి విడిపించుకుంటూ.

" కుందన వెళ్ళి చాలాసేపయింది మామయ్యా. గుడి కూడ మూసే సమయమయింది. ఎక్కడ వుందో చూసి రమ్మని మీ అమ్మ పంపితే వచ్చానురా. పదండి" అని మాధవ చేయి పట్టుకున్నాడు శాస్త్రి.

ఎంతసేపయిందో వచ్చి, మా మాటలు విన్నాడా? ఏమనుకున్నాడో అని మదనపడసాగింది కుందన.

" కుట్టీ రేపు మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. పెట్టించమంటావా" అంటూ మనవరాలి బుగ్గగిల్లాడు శాస్త్రి.

" తాతయ్యా ..అది...నేను" నాన్చింది కుందన.

" అంతా విన్నానురా. పెద్దవాళ్ళు ఎలా పోతేనేం. నేను సుఖంగా వుంటే చాలు అనుకునే పిల్లలున్న ఈ రోజులలో పౌరోహిత్యాన్ని గౌరవించి మా వాడిని చేసుకుంటానన్నావే, నాకు బాగా నచ్చావమ్మా. దానికంటే తల్లిదండ్రులను చూడడం నా బాధ్యత. వాళ్ళను విడిచి వెళ్ళను అన్న నీ ధృఢసంకల్పం, నీ ఔన్నత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిందమ్మా. మీ ఆశయాలు పల్లెలను వెలిగించే దిశగా సాగుతున్నాయి. దేవుడి మాన్యాలను మనమే సాగు చేద్దామనే మా వాడి పట్టుదల, పదిమందిని అక్షరాశ్యులను చేయాలనే నీ తపన వీటినే ఆయుధాలుగా చేసుకుని ముందుకు సాగండి. కులమతాల అంతరాలను తెంచి అందరికీ భగవంతుడిని దగ్గర చేయండి. నేను పోగు చేసిన డబ్బును పెట్టుబడిగా వాడుకోండి. ఆదర్శ దంపతులుగా నూరేళ్ళు చల్లగా ఉండండి" అని పిల్లలిద్దరినీ గుండెకు హత్తుకున్నాడు సదాశివ శాస్త్రి.

చుట్టూ వున్న లోకాన్ని చూసి ఎక్కడ చేతికందకుండా పోతారోనని కొడుకు పోయినప్పటినుంచి దిగులుగా ఉన్న శాస్త్రి మనసు తేలికపడింది. అనుబంధాలకు విలువ ఇంకా బ్రతికే ఉంది అనుకున్నాడు తృప్తిగా.

" మరి అత్తయ్య ఒప్పుకుంటుందా తాతయ్యా" మనసులోని అనుమానాన్ని వెలిబుచ్చాడు మాధవ.

" అది నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి" అని భరోసా ఇచ్చిన తాతయ్య గుండెల మీద తలబెట్టి
" థాంక్యూ తాతయ్యా" అని మురిసిపోయింది కుట్టి ఉరఫ్ కుందన.

మరిన్ని కథలు

hidden money
గుప్తధనం
- పద్మావతి దివాకర్ల
wedding invitation
పెళ్ళిపిలుపు
- డాక్టర్ చివుకుల పద్మజ
grand sari from mother house
పుట్టింటి పట్టుచీర
- మీగడ.వీరభద్రస్వామి
ashadam sales
ఆషాఢం సేల్స్
- పద్మావతి దివాకర్ల
large line
పెద్ద గీత
- గంగాధర్ వడ్లమన్నాటి
hard working old woman
శ్రమించే ముసలమ్మ
- కృష్ణ చైతన్య ధర్మాన
crow interest
కాకి కుతూహలం
- కృష్ణ చైతన్య ధర్మాన