తెగులు - సన్నిహిత్‌

pest

పొద్దున్న తొమ్మిది కావస్తోంది. శ్రమజీవులు బ్రతుకుతెరువు కోసం ఆఫీసులకి పరుగెత్తే సమయం !

నేను కూడా నా సొంత ఫేక్టరీ కి వెళ్ళే హడావుడిలో ఉన్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే నా భార్య వెళ్ళి తలుపు తీసింది. నిముషం తర్వాత వచ్చి " నీ కోసమే… ఎవరో వచ్చారు...మీ ఊరి నుండి అనుకుంటా ! " అని చెప్పి కిచెన్ లోకి విసవిసా వెళ్ళిపోయింది. ఆ చెప్పడంలో చిన్న విసురు ఉంది.దానికి కారణం -  నేను ప్రస్తుతం నివసిస్తున్న  సిటీ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నా సొంత ఊరు . బాగా వెనుకబడిన పల్లెటూరు. ఆ ఊరి నుండి చదువుకొని పైకొచ్చిన అతి కొద్ది మంది వాళ్ళలో నేనొకడిని.  సాధారణంగా మా ఊరి నుండి ఎవరు వచ్చినా ఏదో సహాయార్థం వస్తారని నా భార్యకు  తెలుసు.

హాల్లోకి వచ్చి చూసాను. ఒక పల్లెటూరి వ్యక్తి , అతని పక్కనే ఒక యువకుడు ఉన్నారు. నన్ను చూడగానే " దండాలు బాబూ ! బాగున్నారా ! " నమస్కారం పెడుతూ అన్నాడు పెద్దాయన.యువకుడు మాత్రం అతి వినయంతో ఒదిగి పోయి ఉన్నాడు. 

" ఆ ...బాగున్నాను ...ఎవరు మీరు ? " ప్రశ్నార్థకంగా అడిగాను

" నా పేరు అప్పలస్వామి బాబూ ! మీ నాన్న గారు , నేను , ఊళ్ళో మంచి స్నేహితులం . తమరు నన్నెప్పుడూ చూసుండరు లెండి. వీడు నా కొడుకు . పదోక్లాసు పూర్తి చేసి ఖాళీ గా తిరుగుతున్నాడు. నాన్నగారి కి చెబితే తమరి దగ్గరకు వెళ్ళమన్నారు. వీడికి తమరే ఒక దారి చూపించాలి బాబూ " అభ్యర్థనగా అడిగాడు.

" ఇప్పటికిప్పుడంటే ఎలా ? వచ్చే వారం మీ అబ్బాయిని రమ్మనండి...అప్పటికి ఏదో ఒకటి చూస్తాను " అని చెప్పాను. నాన్న గారి రికమెండేషన్  కదా  ఎలా కాదనగలను ? .

"అలాగే బాబూ...వారం తర్వాత మా వాడిని మీ దగ్గరకు పంపిస్తాను...వెళ్ళొస్తాము బాబూ  " అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నగా నిట్టూర్చాను…

చాలా ఏళ్ళ క్రితం… ఇంజనీరింగ్ చదువు కోసం  ఈ సిటీకి వచ్చాను నేను. చదువు పూర్తవ్వగానే మొదట్లో ఇక్కడే  ఒక కంపెనీ లో జాబ్ చేసేవాడిని. కొంచెం అనుభవం వచ్చాక అందులో నుండి బయటపడి ఇంకో ఫ్రెండ్ తో కలిసి సొంతంగా ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే ఒక కంపెనీ స్టార్ట్ చేసాను. కొంతకాలం తర్వాత పార్టనర్ వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయాను . మొక్కవోని ధైర్యంతో , నిరంతర కష్టంతో ఆ కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చాను. చిన్న కంపెనీని పెద్ద ఫేక్టరీ గా అభివృద్ధి చేసాను . బోలెడంత జీవితానుభవాన్ని చూసాను . ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా అమెరికాలో స్థిరపడ్డారు. లంకంత ఇల్లు , బోలెడంత ఆస్థి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు నా సహాయార్థం ఊరి నుండి వస్తుంటారు....  అదీ విషయం !

బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చాను. డ్రైవర్ రడీగా ఉన్నాడు. కార్లో కూర్చుని  ఫేక్టరీ దారి పట్టాను.

                  *                          *                          *   

నేను చాంబర్ లోకి వెళ్ళగానే ప్యూన్ వచ్చి నా బ్రీఫ్ కేసు తీసుకొని టేబుల్ మీద పెట్టాడు. గ్లాసుడు నీళ్ళు గట గటా త్రాగి కుర్చీలో సెటిల్ అయ్యాను. కాసేపటికి పనిలో పడ్డాను. ఒక్కసారి పనిలో పడితే చుట్టూ ఉన్న పరిసరాలని మరిచిపోతాను నేను. మళ్ళీ మధ్యాహ్నం వేళకి ప్యూన్ వచ్చి " భోజనం వడ్డించాను సార్ " అని చెప్పటంతో లంచ్ ముందు కూర్చున్నాను. భోంచేస్తుండగా పొద్దున్న ఇంటికొచ్చిన మా ఊరివాళ్ళు గుర్తుకొచ్చారు.' ఏం చేద్దామా '  అని ఆలోచించాను. ఆ అబ్బాయికి ఏదో ఒక దారి చూపించాలి. లేకపోతే ఊళ్ళో ఉంటున్న  మా నాన్నగారికి తలవంపులు. అయినా నేను తలచుకుంటే  మా ఆఫీసులోనే  ఏదో ఒక చిన్న పోస్ట్ ఇప్పించగలను.కానీ ఆ కుర్రాడు నా నుండి ఇంకా పెద్ద జాబ్ ఆశిస్తున్నాడేమో ! ఏదైతేనేం బాగా ఆలోచించాక అతనికి మా ఫ్రంట్ ఆఫీసులో అసిస్టెంట్ పియ్యే జాబ్ ఇద్దామని నిర్ణయించుకున్నాను. అంటే పియ్యే కి సహాయంగా కంప్యూటర్లో లెటెర్స్ అవీ టైప్ చెయ్యడం అన్న మాట .  ఇప్పుడు మనశ్శాంతి గా ఉంది. ఇంటికెళ్ళాక నా భార్యకి ఈ విషయం చెప్పాను. మూతి ముప్పై వంకర్లు తిప్పి  -

" ఎందుకు పెట్టుకోవు.తప్పకుండా పెట్టుకుంటావు...మీ ఊరి వాడు కదా. అయినా వాడు ఎలాంటి వాడో తెలీకుండా నీ దగ్గర ఎలా ఉద్యోగమిస్తావు ...కొంచెం ఆలోచించు " అని చెప్పింది. ఆవిడ మనస్తత్వం నాకు తెలుసు. ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడుతుంది. అందుకే అంతగా పట్టించుకోలేదు .అదే నేను చేసిన తప్పు ! . 

                   *                      *                        *

వారం తర్వాత...పొద్దున్నే ఆఫీసుకి రడీ అవుతున్నాను.

" ఏమండీ ...ఇలా రండి " అంటూ నా భార్య గట్టిగా పిలిచింది. ' ఏమైందో ' అనుకుంటూ గబగబా బయటకు వచ్చాను. మా ఇంటి ముందు కాంపౌండ్ వాల్ దగ్గర ఉంది నా భార్య . 

" చూడండి...ఇక్కడ వేప మొక్క వచ్చింది " అంటూ నాకు చూపించి సంతోష పడిపోయింది. నాకూ నా భార్యకు మొక్కలంటే ప్రాణం. వాటిని చిన్న పిల్లల్లా సాకి పెంచుతాము.  ఆ మొక్కను చూడగానే అప్పుడే పుట్టిన బేబీ లా అనిపించింది నాకు.

" కొంచెం పాదు చెయ్యి " అని నా భార్యకు చెప్పి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చాను. పాదు కట్టగానే నెమ్మదిగా నీళ్ళు పోసాను. సన్నగా వీస్తున్న చిరుగాలికి , ఆనందంగా తల ఊపుతున్నట్లు ఆ మొక్క నెమ్మదిగా ఊగసాగింది. ఆ తర్వాత నా భార్యకు టాటా చెప్పి నేను ఆఫీసు దారి పట్టాను.

ఆఫీసుకి వెళ్ళే సరికి నా కోసం రడీగా వెయిట్ చేస్తున్నాడు మా ఊరి అబ్బాయి. ఈ రోజు రమ్మని నేనే కబురు పంపించాను. నన్ను చూడగానే బాగా ముందుకు వంగి అతి వినయంగా " నమస్కారం సార్ ! " అని విష్ చేసాడు. " నమస్కారం ...నాతో రా " అని చెప్పి నా కేబిన్ లోకి తీసుకెళ్ళాను.

" అవును...నీ పేరేంటన్నావు ? " అడిగాను

" నా పేరు శ్రీను సార్ "  చెప్పాడు. అతడిని పరిశీలించాను. సన్నగా రివటలా సరైన తిండి పుష్టి లేనట్లు బలహీనంగా ఉన్నాడు. అక్కడక్కడ చిరుగులున్న చొక్కా తొడుక్కున్నాడు.  పేదరికానికి ప్రతిరూపంలా ఉన్నాడు.  సూటిగా విషయానికి వచ్చేసాను.

" చూడు శ్రీనూ... నువ్వు మా ఊరి వాడివని, పైగా మా నాన్న గారి రికమెండేషన్ అని ఒప్పుకుని నీకు నీ చదువుకి తగిన ఉద్యోగం ఇస్తున్నాను. జాగ్రత్తగా పని చేసుకో  " అని చెప్పి ప్యూన్ ని పిలిచి " ఇతను శ్రీను. మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. పియ్యే కింద వేసాను. ఇతన్ని పియ్యే దగ్గరకి తీసుకుళ్ళి పని నేర్పించమని చెప్పు " అంటూ ఆర్డర్ వేసాను.  ప్యూన్ తో పాటూ ఫ్రంట్ ఆఫీసు వైపు వెళ్ళాడు శ్రీను. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను పుట్టి పెరిగిన మా ఈరి కుర్రాడికి ఒక బ్రతుకు తెరువు చూపించానన్న ఆనందం వల్ల వచ్చిన సంతృప్తి అది.

 ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి నా భార్య చాలా ఆనందంగా కనిపించింది.

"ఏంటండీ విషయాలు " అంటూ హుషారుగా అడిగింది కాఫీ ఇస్తూ.

 " ఆ...ఏముంది. మా ఊరి అబ్బాయి శ్రీను ఈ రోజే ఆఫీసులో జాయిన్ అయ్యాడు. అసిస్టెంట్ పియ్యే జాబ్ ఇచ్చాను "  అని చెప్పాను.

" ఆహా...మన ఇంటి తోట లోకి వేప మొక్క వచ్చి నట్లు మీ ఆఫీసులోకి శ్రీను వచ్చాడన్నమాట "  అంటూ జోక్ చేసింది.

" బాగానే ఉంది పోలిక " అంటూ గట్టిగా నవ్వేసాను నేను.

                     *                  *                   *  

" సార్ " అని ఎవరో పిలుస్తుండటంతో తలెత్తి చూసాను. ఎదురుగా శ్రీను. చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు.

" చెప్పు శ్రీనూ " అన్నాను.

కాసేపు తటపటాయించి  " సార్!  ఉండటానికి సరైన రూము దొరకడం లేదు. మీరే ఎక్కడో ఒక దగ్గర నన్ను ఎడ్జస్ట్ చేయండి " అని అడిగాడు.

కాసేపు ఆలోచించాను. మా ఔట్ హౌస్ ఎలాగూ ఖాళీ గా ఉంది . ఇతనికి ఇస్తే సరిపోతుంది. అతడే దాన్ని శుభ్రంగా చూసుకుంటాడు.

" సరే శ్రీనూ...మా ఔట్ హౌస్ లో ఉందువు గాని... డోంట్ వర్రీ ! మాకూ నువ్వు చేదోడు వాదోడు గా ఉంటావు. అవునూ నువ్వు ఏమైనా పరీక్షలకి కట్టి ప్రైవేట్ గా చదువుకోవచ్చు కదా ...క్వాలిఫికేషన్ కూడా పెరుగుతుంది " అని సలహా ఇచ్చాను.

" చూస్తాను సార్ ! తప్పకుండా...కాకపోతే కొంచెం మనీ ప్రోబ్లెం సార్ ! " అంటూ నసిగాడు. నాకు అర్థమైంది. అతడు నా సహాయం అర్థించడానికి ఇబ్బంది పడుతున్నాడని.

" సరే ! నేను హెల్ప్ చేస్తాలే " అంటూ భరోసా ఇచ్చాను. ఆనందంగా వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత రోజే పెట్టే బేడా తో మా ఔట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు.  కొంచెం సర్దుకున్నాక ఎక్కడో పార్ట్ టైము కాలేజీలో జాయిన్ అయ్యాడు. రోజూ సాయంత్రాలు కాలేజీకి వెళ్ళి వస్తుండే వాడు. " పోనీలే ! ఒక దారిలో పడ్డాడు " అనుకొని సంతోషపడే వాడిని.

అప్పుడప్పుడు మా వేప మొక్కకు నీళ్ళుపోస్తూ దాన్ని గమనిస్తూ ఉండేవాడిని. అదిప్పుడు కొంచెం పెరిగి పెద్దదవుతోంది. ఆరోగ్యంగా పెరుగుతోంది. నేను దాని అభివృద్ధి చూసి సంతోష పడేవాడిని.

ఒక రోజు  నా భార్య గట్టి గా అరుస్తూ " ఏమండీ ! మీ పల్లెటూరి బంధువు మళ్ళీ వచ్చాడు " అని చెప్పింది. ' ఆహా... ఊరి నుండి అప్పలస్వామి వచ్చాడన్న మాట అనుకుంటూ ' ఎదురెళ్ళి అతనిని ఆహ్వానించాను.

" దండాలు బాబూ ...మీ ఋణం  ఎలా తీర్చుకోవాలి బాబూ...మీ దయవల్ల నా కొడుకు ఒక గాడిలో పడ్డాడు " అంటూ సంతోష పడిపోయాడు.

" నాదేముంది అప్పలస్వామీ ...అంతా అతడి శ్రద్ధ. పైకి రావాలన్న అతని తపన. చెప్పడం వరకే నేను చేసింది. కష్టం అంతా అతనిదే కదా ! " అంటూ నవ్వేసాను. ఇంతలో శ్రీను వచ్చాడు. తండ్రిని చూసి చిరాగ్గా మొహం పెట్టి " ఇక్కడికి ఎందుకొచ్చావు నాన్నా ? " అంటూ గట్టిగా అరిచాడు. అప్పలస్వామి కళ్ళల్లో నీళ్ళు తిరగడం నాకు స్పష్టంగా కనపడింది. బహుశా నా ముందు కొడుకు తిట్టడంతో అతని అహం దెబ్బ తిని ఉంటుంది.

నేను కోపంగా " అదేంటయ్యా అలా అంటావు. కన్న తండ్రి , నిన్ను చూడటానికి రాకూడదా ?నీ పర్మిషన్ తీసుకోవాలా ?  "  అరిచాను.

" అది కాదు సార్!అర్థం పర్థం లేని సెంటిమెంట్లతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు...నన్ను చదువు మీద దృష్టి పెట్టకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు ..అందుకే అలా అన్నాను " అంటూ నసిగాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఔట్ హౌస్ కి వెళ్ళారు. కొంతసేపటి తర్వాత మొహం వేలాడేసుకుని వెళ్ళిపోయాడు అప్పలస్వామి. మొదటి సారి నాకు అనిపించింది - శ్రీను నేను అనుకున్నంత అమాయకుడు కాదని. 

                       *                 *              *       

కాలం ఎవ్వరికోసం ఆగకుండా సాగిపోతోంది . శ్రీను ఇప్పుడు డిగ్రీ కూడా పూర్తి చేసాడు. అతడి చదువుకి తగ్గట్టు గానే మా ఆఫీసులో అతన్ని మేనేజర్ గా నియమించాను. శ్రీను నా దగ్గరికి వచ్చి " చాలా థాంక్యూ సార్ " అంటూ చేతులు జోడించాడు.

" ఫర్వాలేదు శ్రీనూ. కష్టపడి డిగ్రీ పూర్తిచేసావు. అందుకే నిన్ను మేనేజర్ ని చేసాను.ఇందులో నాదేమీ లేదు  " అంటూ సింపుల్ గా తేల్చేసాను. మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

దిన దిన ప్రవర్థమానమవుతున్న అతడిని చూస్తుంటే నాకు మా వేప మొక్క గుర్తుకు వచ్చింది. అదిప్పుడు ఆరోగ్యంగా పెరిగి వేపచెట్టు గా మారింది. చల్లటి నీడని ఇస్తోంది. ఆరోగ్యమైన గాలిని ప్రసాదిస్తోంది. పండగలకి పబ్బాలకి మా చుట్టుపక్కలవాళ్ళు వచ్చి దాని కొమ్మలు కావాలని అడుగుతుంటారు.చిన్న చిన్నవి విరిచి ఇస్తుంటాను. అవసరం ఉన్న వాళ్ళకి వేప పువ్వు ఇస్తుంటాను.  ఇంట్లో వేప చెట్టు ఉంటే మంచిది అని అందరూ చెబుతుంటే సంతోషపడతాను. పది మందికి మేలు చేసే మొక్కను పెంచినందుకు గర్వ పడతాను. 

ఒక రోజు నేను ఆఫీసుకి వెళ్ళేటప్పటికి మా  ప్యూను , శ్రీను తో గొడవ పడుతున్నాడు. నన్ను చూడగానే కొంచెం తడబడి

" చూడండి సార్ ! రాగానే మంచి నీళ్ళు ఇవ్వడం లేదని , విష్ చెయ్యడం లేదని , టేబుల్ క్లీన్ చెయ్యడం లేదని శ్రీను నన్ను తిడుతున్నాడు సార్  " కంప్లెయింటింగ్ గా చెప్పాడు ప్యూను. కొత్తగా అనిపించింది నాకు. శ్రీనులో నాకు తెలియని కొత్త కోణం ఇది. " శ్రీనూ...నా కేబిన్ కి రా " అని చెప్పి వెళ్ళిపోయాను.

శ్రీను కేబిన్ లోకి రాగానే " ఏంటి శ్రీనూ ఇది? వాళ్ళంతా నీ కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు. ఎప్పటి నుండో నా దగ్గర నమ్మకంగా పని చేస్తున్నారు. ఒద్దికగా ఉంటారు. వాళ్ళని నువ్వు కంట్రోల్ చెయ్యడం ఏంటి ? " గద్దింపుగా అడిగాను.

"అదేంటి సార్ ! అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు నా కంటే సీనియర్లు కావచ్చు కానీ చదువులో హోదాలో నేనే ఎక్కువ కదా . నన్ను గౌరవించాలి అన్న కనీస జ్ఞానం వాడికి లేదా ? " కొంచెం స్వరం పెంచి అన్నాడు. విస్మయంగా చూసాను నేను. ఎంతో అనుభవం ఉన్న నాకే పాఠాలు చెబుతున్నాడు. 

" కావచ్చు ....కానీ ఆఫీసు స్మూత్ గా రన్ అవాలంటే మనం కొంచెం సర్దుకుపోవాలి. నెమ్మదిగా చెప్పి పని చేయించుకోవాలి. మన కింద పని చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద అరిస్తే మొదటికే మోసం వస్తుంది " నచ్చజెబుతున్నట్లు చెప్పాను.

" ఏమో సార్ ...నాకవన్నీ తెలీవు...నాకు అంత అవసరం లేదు కూడా " అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు.

అదోలా అనిపించింది నాకు. అయినా ఆఫీసులో ఇలాంటివన్నీ మామూలే అనుకొని పని చేసుకోవడంలో నిమగ్నమయ్యాను. ఏదో ఆవేశం మీద ఉన్నాడు. కాసేపట్లో నార్మల్ అవుతాడులే అనుకున్నాను. కానీ నేను ఊహించని మలుపు ముందుందని నాకు తెలీదు.

                   *                 *                *        

పొద్దున్నే వేప చెట్టు దగ్గర నిలబడి తదేకంగా చూస్తోంది నా భార్య.నేను వెళ్ళి చూసాను.

 " చూడండి ...ఆకులన్నీ అదో రంగులోకి మారిపోతున్నాయి. నెమ్మదిగా రాలిపోతున్నాయి కూడా. ఇది ఆకు రాలే సీజన్ కూడా కాదు. చెట్టుకి ఏదో అవుతుందండీ "  " అంటూ బాధ పడిపోతోంది. నేను చెట్టుని తేరిపార చూసాను. అవున్నిజమే ! చెట్టులో ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ' కొంపదీసి ఏ తెగులు లాంటిదో సోకలేదు కదా ' అని నాలో నేనే గొణుక్కున్నాను. ఆ మాటలు నా భార్య చెవిన పడ్డాయి.

" తెగులు కాదండీ ! ఎవరో చేతబడి చేసుంటారు. అలా చేస్తేనే పచ్చని చెట్టు ఇలా అయిపోతుందని మా బామ్మ చెప్పింది. పైగా ఇలా జరిగితే ఆ ఇంటి లోని పెద్ద దిక్కు కి ప్రాణ హాని కూడా కలుగుతుందట " అని భయంగా చెప్పింది.

" అబ్బ ...నీవన్నీ మూఢ నమ్మకాలు. అలాంటివేమీ ఉండవు. ఊరికే భయపడకు . సరేలే...నేను ఆఫీసుకి వెళతాను " అని చెప్పి బయట పడ్డాను.

" ఈయనొకడు ...పొద్దున్న లేస్తే ఆఫీసు ఆఫీసు అంటూ కలవరిస్తారు " అని విసుక్కుంటూ నా భార్య వేప చెట్టు వైపు దిగులుగా చూడటం నా దృష్టి నుండి దాటిపోలేదు .

 

ఆఫీసు కేబిన్ లో కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకో సాగాను. ఇంతలో బయట ఏదో హడావుడి. సీట్లోంచి లేచి బయటకు వచ్చాను. శ్రీను మళ్ళీ మా ప్యూనుతో గొడవ పడుతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. ప్యూను కూడా తక్కువ తినలేదు.

" ఏంది సార్ నువు చెప్పేది ? నీ లాంటోళ్లని మస్తుమందిని చూసిన " అంటూ తిరగబడ్డాడు. నా రాకను చూసి ఇద్దరూ సైలెంట్ అయ్యారు.శ్రీను నా వైపు తిరిగి ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. గుప్పుమని ఒకటే వాసన. ఆల్కహాల్ వాసన. ఆశ్చర్యంతో షాకయ్యాను.

" ఛీఛీ ...ఏంటిది ? అన్నం పెట్టే ఆఫీసుకి తాగి వచ్చాడా ? అసలు ఎందుకిలా మారిపోతున్నాడు ? " అనుకొని బాధపడి శ్రీను వైపు తిరిగి " ఏంటి శ్రీనూ ఇది ? ఆఫీసుకు తాగి వచ్చావా?  ఇదే పని ఇంకెవడైనా చేసుంటే వెంటనే పీకేసేవాడిని. నువ్వు కాబట్టి వదిలేస్తున్నాను. డోంట్ రిపీట్ దిస్ " అని వార్నింగ్ ఇచ్చి నా కేబిన్ కి వచ్చేసాను. మనసులో ముళ్ళు దిగినట్టు కలుక్కు మనిపించింది. 

                                         *                 *                    *        

" సార్ ! హెచ్ . ఆర్ మేనేజర్ మిమ్మలని కలవాలనుకుంటున్నారు " అని చెప్పాడు పియ్యే.

" రమ్మను " అని చెప్పాను. " గుడ్మాణింగ్ సార్ " అని విష్ చేస్తూ లోనికొచ్చాడు మేనేజర్.వస్తూనే  నా ముందు ఒక కాగితాన్ని ఉంచాడు. అది శ్రీను రిజిగ్నేషన్ లెటెర్.షాకయ్యాను నేను. బహుశా నేను నిన్న తిట్టిన దానికి హర్ట్ అయ్యి ఇలా చేసాడేమో అనుకుని కొంచెం బాధపడ్డాను. 

" సరే ! శ్రీను ని పంపించండి నేను మాట్లాడుతాను " అని చెప్పాను. హెచ్. ఆర్ మేనేజర్ వెళ్ళిపోయాడు. కాసేపటికి శ్రీను వచ్చాడు.

" ఏంటి శ్రీనూ ఇది? . ఇక్కడ నీకు ఏం కష్టం వచ్చిందని రిజైన్ చేసావు " నెమ్మదిగా అడిగాను.

" రాఘవ ఇండస్ట్రీస్ వాళ్ళు నాకు ఎక్కువ జీతం ఆఫర్ చేసారు సార్. అందుకే ఇక్కడ మానేసి అందులో జాయిన్ అవుతున్నాను." కేర్లెస్ గా చెప్పాడు. హతాశుడనయ్యాను నేను. ఎందుకంటే రాఘవ ఇండస్ట్రీస్ కి మా కంపెనీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. మాకు ప్రధాన పోటీదారు ఆ కంపెనీ. శ్రీను పోయి పోయి అందులో జాయిన్ అవుతున్నాడు. ఏమనాలి?

" నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను...ఉండటానికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నీవు ఇంకా పైకి రావాలని ఉన్నత చదువుకోసం ఆర్ధిక సహాయం చేసాను. ఇప్పుడు పని నేర్చుకుని , నా నీడన పెరిగి పెద్దవాడవై బాగా పైకొచ్చాక నా కంపెనీ వదిలి నా శతృవులకి సహాయం చెయ్యడానికి వెళుతూ నన్ను డిచ్ చేయడం నీకు న్యాయంగా ఉందా ? " ఉద్వేగంగా అడిగాను.

నా వైపు తేరిపార చూసి చిన్నగా నవ్వాడు శ్రీను. తర్వాత అతను చెప్పిన ఆర్గ్యుమెంట్ విని నాకు మైండ్ బ్లాంక్ అయింది. నా ఇన్నేళ్ళ సర్వీసులో ఎవడూ నాకు అంత జ్ఞానోపదేశం చేయలేదు. కళ్ళు తెరుచుకున్నాయి నాకు.  ఇక ఆఫీసులో ఉండబుద్ధి కాలేదు. డ్రైవర్ ని పిలిచి ' ఇంటికి పోదాం..బండి తియ్  ' అని చెప్పాను. 

                   *                        *                            *            

కారు మా ఇంటి దిశగా స్మూత్ గా సాగిపోతోంది .. నా జీవితం లాగ. కానీ రోడ్డు మీద ట్రాఫిక్ చిరాకుపెడుతోంది …నా మనసు లోని అలజడి లాగ. ! ఎంత మర్చిపోదామనుకున్నా శ్రీను అన్న మాటలే నా చెవుల్లో మారు మోగు తున్నాయి . ఆ మాటలు -

" ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు . నాకు ఉద్యోగమిచ్చి, ఆశ్రయమిచ్చి , ఆర్థిక సహాయం చేసి పైకి తీసుకొచ్చానంటున్నారు. అవన్నీ నిజమే ! కాదని ఎవరన్నారు ? కానీ అవన్నీ ఎందుకు చేసారు , మీ స్వార్థం కోసం చేసారు. నా లాంటి తెలివైన కుర్రాడు ఉంటే మీ కంపెనీకి లాభం అని నాకు అన్ని విధాల సాయం చేసి నన్ను కట్టి పడేసారు. నా కాళ్ళకు బంధనాలు వెయ్యాలని ప్రయత్నించారు. అయినా జీవితాంతం మీ దగ్గరే పని చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా ?నేను జీవితం లో ఇంకా పైకి రాకూడదా ?  మీ దగ్గర ఉంటే ఏముంది . మహా అయితే కొంచెం పెద్ద జీతగాడిని అవుతాను. అంతేగానీ మీ కంపెనీకి యజమాని కాలేను కదా ! అయినా నాకు ఎక్కడ లాభం అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను. ఆపడానికి మీరెవ్వరు ?వెళ్ళొస్తాను సార్! " అన్నాడు . నిజమే...ఆపడానికి నేనెవ్వడిని ? 

" సార్...ఇల్లొచ్చింది ! " అని డ్రైవర్ చెప్పడంతో ఆలోచనల నుండి తేరుకున్నాను. ఇంట్లోకి వెళ్ళగానే నా భార్య ఎదురొచ్చి   " ఏమండీ ! మన శ్రీను ఔట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడంట ...ఏమైంది ? " అని అడిగింది.

" ఏమైంది...మన అవసరం తీరిపోయింది.మన సహాయాన్ని పూర్తిగా పొంది, ఇప్పుడు ఆ రాఘవ ఇండస్ట్రీ లో జాయిన్ అవుతున్నాడు . అందుకే వెళ్ళిపోతున్నాడు. అయినా కంపెనీ అన్నాక వచ్చేవాళ్ళు వస్తారు,పోయేవాళ్ళు పోతారు. పోనీ " చిరాగ్గా అన్నాను.

" అదేంటండీ ! ఎంత చేసాం ? దిక్కులేనివాడిని చేరదీసాం…సొంత కొడుకులా చూసుకున్నాం. ఈ రోజు నాలుగు డబ్బులు ఎక్కువొస్తాయని వేరే చోటికి వెళ్ళిపోతాడా? కృతజ్ఞత అన్నది లేదా ?  " విస్మయంగా అంది.

" లేదు... ఉండదు కూడా ! ఎందుకంటే వాడి బుద్ధికి తెగులు పట్టింది. వాడి మనసుకి చేతబడి జరిగింది. అది ఆ రాఘవ ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిన చేతబడి. అందుకే వాడిని నేను ఆపలేదు.వదులుకోవడానికి సిద్ధపడ్డాను. " అంటూ వేపచెట్టు వైపు వెళ్ళాను. చెట్టు ఆకులన్నీ పూర్తిగా రాలిపోయాయి. బాగా ఎండి పోయి దెయ్యం చెట్టులా తయారయి ఇంటి ముందు దిష్టిబొమ్మలా ఉంది.ఎవరో చేసిన చేతబడి బాగానే పనిచేసింది.

మనిషి అయినా , మొక్క అయినా ప్రకృతి ముందు ' ససెప్టబుల్ ' గా ఉండాల్సిందే !  అంటే ... ప్రకృతి కలుగజేసే మార్పులకి లొంగాల్సిందే ! తెగులు సోకి వేపచెట్టు ఎండిపోయింది...జీవం కోల్పోయింది. శ్రీను కూడా అంతే ! చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లొంగి తన దారి తాను చూసుకున్నాడు . దానికి ' అభివృద్ధి కోసం కోరుకున్న  మార్పు ' అని సర్ది చెప్పుకున్నాడు . పోనీ .. కడుపున పుట్టిన నా పిల్లలే నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోయారు. తమ దారి తాము చూసుకున్నారు. ఇక ఏ సంబంధమూ లేని శ్రీను మాత్రం నా దగ్గర ఎందుకుంటాడు ?  అందుకే మొదట కొంచెం బాధపడినా తర్వాత లైట్ తీసుకున్నాను.

ఇంట్లోకి వచ్చేస్తూ నా భార్యతో చెప్పాను " వేపచెట్టు బాగా ఎండిపోయింది. రేపు ఆదివారం కూలీలని పిలిపిస్తాను. చెట్టు కొట్టించేద్దాం. ఇంటి యజమానికి.. అంటే నాకు.. హాని జరక్కూడదు కదా  " అని .

" హమ్మయ్య ...ఇప్పుడు నాకు దిగుల్లేదు " అంటూ మంగళ సూత్రాలని కళ్ళకద్దుకుంది నా భార్య.  

                     -----------------------0--------------------

 

 

 

మరిన్ని కథలు

hidden money
గుప్తధనం
- పద్మావతి దివాకర్ల
wedding invitation
పెళ్ళిపిలుపు
- డాక్టర్ చివుకుల పద్మజ
grand sari from mother house
పుట్టింటి పట్టుచీర
- మీగడ.వీరభద్రస్వామి
ashadam sales
ఆషాఢం సేల్స్
- పద్మావతి దివాకర్ల
large line
పెద్ద గీత
- గంగాధర్ వడ్లమన్నాటి
hard working old woman
శ్రమించే ముసలమ్మ
- కృష్ణ చైతన్య ధర్మాన
crow interest
కాకి కుతూహలం
- కృష్ణ చైతన్య ధర్మాన