అందం - అబద్దం - మోహనరావు దురికి

beauty-lie

జవహర్ గంట ఆలస్యంగా బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు ముందు పాతిక మంది ఆడవాళ్లు పడిగాపులు కాస్తున్నారు. అందులో బక్కగా, పొడవుగా, అందానికే వన్నె తెచ్చేలా వెన్నెలలా వెలిగిపోతున్న అమ్మాయిని పొరపాటున చూశాడు. ఒక్కసారి చుస్తే మరిచిపోలేని అందం. ముగ్దమనోహర రూపం. ఒక్కసారి చుస్తే జీవితాంతం గుండెలో స్కానింగ్ చేసేనట్లు ఉండిపోతుంది.

చీఫ్ మెనేజర్ ఛాంబర్లోకి వెళ్లి తన సీట్లో కూర్చున్న జవహర్ ఇంటర్ కామ్ లో హెడ్ క్లార్క్ చారిని పిలిచాడు.

50 ఏళ్ల చారి గబగబా వచ్చి వినయంతో నిలుచున్నాడు. అతను ఆ బ్యాంకు లో నిజాయితీకి మారుపేరు.

''ఆ ఆడవాళ్లు ఎందుకు వచ్చారు?" జవహర్ ఆత్రుతతో అడిగాడు.

''వాళ్లు డ్వాక్రా మహిళలు సర్. రెండు లక్షల రూపాయల లోన్ కోసం దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు. మేనేజర్ రామూ గారికోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు అయన కూడా లేటయ్యారు'' వినయంతో చెప్పాడు.

ఇక ఆ దేవకన్య గురించి తెలుసుకోవడం చాలా తేలికని బిగపట్టిన ఊపిరి వదిలి ''వాళ్ళ దరఖాస్తు ఫైల్ తీసుకుని వెంటనే రండి'' ఆదేశించాడు.

వెంటనే ఆ ఫైల్ వచ్చింది. ఆత్రుతారో ఫైల్ వెతికాడు. చివర్లో ఆ దేవకన్య దరఖాస్తు కనిపించింది. ఆ చిన్న పాస్ పోర్ట్ లో కూడా ఆమె చందమామలా వెలిగిపోతోంది. ఆమె అందమంతా ఆ కళ్ళల్లో క్వింటాలల్లో ఉంది.

గబగబా వివరాలు చదివాడు. ఆమె పేరు కీర్తన. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి పేరు ఉంది. బి. కామ్ పాసయ్యింది. వయసు 28 ఏళ్ళు. గాంధీ బొమ్మ ఎదుగా ఇల్లు. తూప్రాన్ ఊరు. అంటే బ్యాంకు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం. బ్యాంకులో డబ్బులేదు. ఐనా ఆమెను పిలిచి లోన్ ఇచ్చి , ఆ వంకతో పరిచయం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ అందరికి అనుమానం వస్తుంది. అందుకే అదే ఊళ్ళో ఉంటున్న మరో నలుగురు మహిళల దరఖాస్తులు ఎన్నుకున్నాడు.

ఆ ఐదుగురిని మాత్రం పిలవమని చారికి చెప్పాడు.

రెండు నిముషాలలో కీర్తనతో పాటు మరో నలుగురు ఆంటీలు ఛాంబర్లోకి వచ్చాడు.

జవహర్ ఎంతో వినయంతో వాళ్ళను కూర్చోమని చెప్పి టి తెప్పించాడు. నిజానికి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లతో చీఫ్ మేనేజర్ అసలు మాట్లాడడు. తన ఛాంబర్లోకి రానివ్వడు. వచ్చినా కూర్చోపెట్టి రాచమర్యాదలు చేయడు. కానీ అదంతా కీర్తన కోసం. ఆమెను తొలిచూపులోనే ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నాడు. అందరి వివరాలు ‘నామ్ కే వాస్తే’ అడిగాడు. చివర్లో కీర్తనను కన్నుఆర్పకుండా చూస్తూ ''మీరేంచేయాలి అనుకుంటున్నారు?" అడిగాడు.

కీర్తన టి తాగుతూ ''పిల్లల రెడీ మెడ్టై, టైలరింగ్, ఎంబ్రాయిడరీ షాప్ పెట్టాలని అనుకుంటున్నాను సార్'' అన్నది. కీర్తన గొంతు త్యాగయ్య కీర్తనలా కమ్మగా ఉన్నది. ఆమె పెదాలను వయ్యారంగా కదిలిస్తూ మాట్లాడుతుంటే - ఆమె పెదవుల్లోని ఎరుపుని లాక్కోవాలి అనిపించింది.

''మీవారు ఏం చేస్తుంటారు?'' కావాలనే అడిగాడు - ఆమె గురించి తెలుసుకోవాలని.

ఆమె చిన్నగా నిట్టూర్చి ''నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్'' అన్నది.

అతనికి లోలోన సంతోషంగా ఉంది. కానీ బయటపడకుండా ''ఇంకా ఎందుకు కాలేదు? ఐ మీన్, ఊళ్ళల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు అవుతాయి కదా?'' అడిగాడు.

ఆమె చిన్నాగా నవ్వి ''కట్నం సమస్య సార్. నా పెళ్లి జరగాలంటే కనీసం పది లక్షలు కావలి. అది లోన్ గా మీరు ఇస్తారా?'' చలాకీగా అడిగింది.

అందరితో పాటు అతను కూడా నవ్వాడు. అతని మనసు కుదుటపడింది. వరకట్నమే ఆమె సమస్య ఐతే ఆ పెళ్లి కి అడ్డంకులు లేవు. అతనికి కట్నం మీద ఆశ లేదు. బంగారం లాంటి అమ్మాయి కావాలని నాలుగేళ్లుగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె తగిలింది.

జవహర్ వాళ్లకు అప్రూవల్ ఫారం ఇస్తూ ''అందరిలోంచి కేవలం మీరు దరఖాస్తులను మా వాళ్ళు సెలక్ట్ చేశారు. చాలా తక్కువ డబ్బు ఉన్నది. మొదటి విడతగా మీకు మాత్రం లోన్ ఇస్తాను. వీటిని నింపి రెడీగా ఉంచండి. త్వరలో మా మేనేజర్ మీ ఇళ్లకు వచ్చి మీ వ్యాపారాలను చెక్ చేసి లోన్ ఇస్తాడు'' అన్నాడు.

కీర్తనతో పాటు మిగతా నలుగురు సంతోషంతో నమస్కారం చేసి వెళ్లబోతుంటే, జవహర్ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ పర పురుషుడిని తాకను అన్నట్లు కీర్తన నమస్కారం పెట్టి వెళ్ళింది.

జవహర్ వెంటనే హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి మంత్రి రికమండేషన్ కేసులనీ అబద్దం చెప్పి పది లక్షలు పంపమని చెప్పాడు.

000

జవహర్ అన్ని పనులు మానుకుని కీర్తన కోసం, ఆమె ఇంటిని, ఆమె తల్లిదండ్రులను చూడాలనే ఆత్రుతతో తూప్రాన్ గ్రామానికి వచ్చాడు. ఆ పని చేయాల్సింది కిందిస్థాయి ఉద్యోగులు.

జవహర్ రాగానే ఓ ప్రధాన మంత్రి వచ్చినట్లు మహిళలు బ్రమ్మరథం పట్టారు. అందులో కీర్తన కూడా ఉంది. అతని చూపు ఆమె మీదే ఉంది. కానీ పైకి మాత్రం అందరితో సమానంగా, చాలా హుందాగా మాట్లాడుతున్నాడు. ‘నామ్ కే వాస్తే’ అందరి వ్యాపారాలు చెక్ చేసి చివరికి కీర్తన ఇంటికి వచ్చాడు.

చాలా చిన్నా ఇల్లు. కానీ ప్యాలెస్ లా అందంగా ఉంది. నీటుగా ఉంది. రెండు కుట్టు మిషన్లతో కీర్తన, ఆమె తల్లి బట్టలు కుడుతున్నారు. ఓ పది మిషన్లు, మెటీరియల్ ఇస్తే పది మందికి ఉపాధి కల్పించేలా ఉన్నారు. ఎవ్వరి ఇంట్లో టి తాగని జవహర్ ఆమె కాచిన టి తాగాడు. అమృతం ఎలా ఉంటుందో తెలిసింది.

ఆ ఊరు చాలా ఇరుకుగా ఉంది. ఐనా కీర్తనతో ''మీ ఊరు చాలా అందంగా ఉంది. మేము నందికొండలో ఉంటున్నాము. ఆ ఊరు బ్యాంకుకు చాలా దూరం. మీ ఊళ్ళో ఇల్లు అద్దెకు ఉందా?" అడిగాడు.

''నందికొండ మీ బ్యాంకుకి రెండు కిలో మీటర్లే కదండీ. మా ఊరు ఆరు కిలోమీటర్ల దూరం'' కీర్తన ఆశ్చర్యంగా అడిగింది.

అతను తడబడి ''అంటే మీ ఊరు చాలా బాగుంది. ఇక్కడే ఉంటాము. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను మా అమ్మా, తమ్ముడితో ఉంటున్నాను'' అన్నాడు.

ఆమె చిన్నగా నవ్వి అలాగే అన్నట్లు తలా ఊపింది.

ఆమె తల్లి వెంటనే ''మా పక్క వాటా పది నెలలుగా ఖాళీగా పడుంది సార్. మీరు వెంటనే దిగండి. పైగా ఫామిలీ అంటున్నారు'' అన్నది.

అతను ఆ రెండు గదుల వాటా చూశాడు. ఛండాలంగా ఉంది. కానీ కీర్తన కోసం చాలా బాగుందని ఆ వారం లోనే అందులోకి దిగాడు.

జవహర్ తల్లికి, తమ్ముడికి ఆ వాటా, ఆ ఊరు అస్సలు నచ్చలేదు. కానీ జవహర్ పట్టు పట్టాడని వచ్చారు. కీర్తనకు లోన్ ఇచ్చాడు. ఆమె పది కుట్టు మిషన్లు కొని పది మంది ఆడ టైలర్లతో చాలా బిజీగా మారింది.

జవహర్ వెయ్యి కళ్ళతో ఆమెనే గమనిస్తున్నాడు. ఎదో ఒక వంకతో ఆమెతో మాట్లాడు తున్నాడు. కిస్తీలు కట్టమని మాటలు కలుపుతున్నారు. ఆమె మాత్రం చాలా పొడిపొడిగా మాట్లాడుతోంది. ఓ ఆఫీసర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తోంది. కానీ ఆమె తన హద్దుల్లోనే ఉంది.

మూడు నెల్ కీర్తనను పొల్లు పోకుండా చదివాక ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ రోజు తల్లి ముత్యాలమ్మతో ''కీర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా?'' అడిగాడు.

''పిల్ల బంగారం. చాలా పద్దతి గలది. కుందనపు బొమ్మలా ఉంది. నాకు కూడా కోడలిగా చేసుకోవాలని ఉంది. కానీ నీ హోదాకు సరితూగే కట్నం ఇవ్వలేరు '' పెదవి విరిచింది.

ఆమె చేతులుపట్టుకుని ''నాకు కట్నం ఎందుకమ్మా? పేదింటి పిల్లయినా లక్షణంగా ఉండాలని నువ్వే అనే దానివిగా?" అన్నాడు.

అది కూడా నిజమే అని ఆమె తల ఆడించింది.

''అమ్మ. నువ్వు కీర్తన తల్లిని కదిలించి చూడు'' బతిమాలాడు.

''మొన్న ఆమెనే నన్ను కదిలించింది. మా కీర్తనను మీ ఇంటి కోడలిగా చేసుకుంటావా వదినా అని అడిగింది. ఆ పిల్లకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని తెలిసింది. కానీ నేనే కుంటిసాకు చెప్పి తప్పించుకున్నాను'' అన్నది.

ఇక ఆ పెళ్లి జరిగినట్లే అని అతను మురిసిపోయాడు.

000

కీర్తన గుడిలోంచి బయటికి రాగానే జవహర్ కనిపించాడు. అప్పటికే ఆమె 'సర్' అని పిలవడం మానుకుంది. పేరు పెట్టి పిలిచే స్థాయికి దగ్గరయ్యింది.

ఇద్దరు గుడి మెట్ల మీద గువ్వల్లా కూర్చున్నారు. ఆమె ఇచ్చిన ప్రసాదం తింటూ అతను ''మీ అమ్మగారు మా అమ్మ గారిని వదినా అని పిలిచిందంటా. దాని అర్థం తెలుసా?'' చిలిపిగా అడిగాడు.

ఆమె సిగ్గుపడుతూ ''తెలుసు. మీరు నా కోసమే ఆ నలుగురికి లోన్ ఇచ్చారని తెలుసు. నా కోసమే మా ఊళ్ళో ఇల్లు తీసుకున్నారనీ తెలుసు'' అన్నది.

''ఇన్ని తెలిసిన నీకు నా మనసులో ఏముందో తెలియదా?"

'' తెలుసు. నన్ను ప్రేమిస్తున్నారనీ తెలుసు. కానీ మన పెళ్లి జరగదని నీకు తెలియదు.''

''ఏ?'' భయంగా అడిగాడు.

''గుడిలో అబద్దం చెప్పకూడదు. కానీ నీకు ఖచ్చితంగా నేను నిజం చెప్పాలి. మా ఊరి ఎమ్మెల్లే కొడుకు ఉత్తమ్ అనే ఎదవ ఉండేవాడు. తండ్రిని మించిన నీచుడు. పేరుకే బి.టెక్ చదువుతున్నాడు. వాడికి లేని వ్యసనం లేదు. పక్కా స్త్రీ లోలుడు. వాడి కన్ను నా మీద పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంటపడ్డాడు. అలాంటి నీచుడిని పెళ్లి చేసుకోనని చెప్పుతో కొట్టాను. వాడు నా మీద పగపట్టాడు. చివరికి నన్ను వాళ్ళ గెస్టు హౌస్ కి తీసుకెళ్లి, మూడు రోజులపాటు నన్ను బంధించి పశువులా ఎనిమిది సార్లు మానభంగం చేశాడు. అలా చేస్తే నేను గత్యంతరం లేక వాడిని పెళ్లి చేసుకుంటాయని దురాశ.

కానీ నేను వాడిని ససేమిరా పెళ్లి చేసుకోనని మొండికేశాను. వాడిమీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను. వాడు భయపడి అమెరికా పారిపోయాడు. వాడి నాన్న తనకున్న పలుకుబడితో ఎఫ్.ఐ ఆర్ కూడా రాయకుండా చేశాడు. పైగా పోలీసులు నాకే నీతులు చెప్పారు. ‘వాడిని ఉరితీసినప్పటికీ పోయిన నీ శీలం తిరిగిరాదు. ఇప్పటికే ఊరు మొత్తం తెలిసింది. పెళ్లి కావలసిన అమ్మాయివి, ఇంకా అల్లరిపాలు కాకని’ నన్ను సముదాయించారు. మా అమ్మానాన్నలకు ఆ మాటలు రుచించాయి. ఆ దేవుడే శిక్ష విదిస్తాడు అని నా నోరు మూశారు. నా గురించి అందరికి తెలిసింది. అందుకే పెళ్లి సంబంధాలు రాలేదు. ఇప్పుడు చెప్పండి. చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకుంటావా?'' బాధతో నిలదీసింది.

జవహర్ గుండెలో డైనమెట్స్ పేలాయి. అది అతను ఊహించని మలుపు.

గంటవరకు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆలోచిస్తున్నాడు. జరిగినదాంట్లో ఆమె తప్పు లేదని తెలుస్తోంది.

అతను ముచ్చెమటలు తుడుచుకుంటూ ''మరి ఈ విషయం మీ అమ్మగారు మా అమ్మకు ఎందుకు చెప్పలేదు'' ఆందోళనగా అడిగాడు.

ఆమె నిట్టూర్చి ''అదే కన్నతల్లి ప్రేమ. వంద అబద్ధాలు ఆడయినా పెళ్లి చేయాలని చూస్తుంది?"

''మరి ఊరివాళ్ళు కూడా చెప్పలేదే?"

''ఇప్పుడే చెప్పరు. పెళ్లి కుదిరాక చెపుతారు - ఆ పెళ్లి ఆపాలని.''

''మరి నువ్వు ఎందుకు చెప్పావు?''

''అది నా బాధ్యత. మన పెళ్లి తరువాత నీకు నిజం తెలిస్తే నేను మోసం చేసినట్లు. ముందుగా చెపితే నేను జాగ్రత్త పడినట్లు'' నిర్మొహమాటంగా అన్నది.

ఆమెనే కాదు, ఆమె నిజాయితీ ఇంకా బాగా నచ్చింది. ఏ అమ్మాయికూడా ఇంత పచ్చిగా నిజం చెప్పి తన పెళ్లి తానే ఆపుకోదు.

ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ''తప్పు జరిగింది. కానీ ఆ తప్పు నీవల్ల జరగలేదు. వాడు చేసిన తప్పుకు నువ్వు ఎందుకు బలికావాలి? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను'' మాట ఇచ్చాడు.

ఆమె అప్పుడు అతని కళ్ళలోకి చూసి ''తొందరపడకు. మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకోరు. ముందు వాళ్ళను ఒప్పించూ'' ప్రేమతో అన్నది.

అతను ఆమెను ప్రేమతో చూస్తూ ''కామం మురికి కూపం. కానీ ప్రేమకు మలినం లేదు. అది ఆత్మలా అంటరానితనంతో మనసులో పవిత్రగా ఉంటుంది. నాకు ఆ మనసు కావాలి. అందం పువ్వులా వాడిపోయి రాలిపోతుంది. ఇది ప్రకృతి. కానీ మనిషి సృష్టించే అబద్దం వికృతమైనది. నేను దానిని అసహ్యించుకుంటాను. నువ్వు అబద్దం చెప్పకుండా నిజం చెప్పి నీ విలువను పెంచుకున్నావు. ఇంటి కెళ్ళి గోరింటాకు పెట్టుకుని పెళ్ళికి సిద్ధంగా ఉండు'' అని ఆమె బుగ్గలు నిమిరాడు.

ఆమె సంతోషంతో పులకించింది.

000

జవహర్ ఇంటికి వచ్చాడు. ఆ విషయం ఆ తల్లికి చెప్పకూడదు అనుకున్నాడు. చెపితే ఆమెనే కాదు - ఏ తల్లి కూడా ఒప్పుకోదని తెలుసు. కానీ ఈలోగా ముత్యాలమ్మ గుండె బాదుకుంటూ ''వొరేయ్ నాయనా. ఆ పిల్లను ఎమ్మెల్లే కొడుకు ఎత్తుకెళ్ళి మానభంగం చేశాడని ఊరు ఊరంతా కోడయ్యి కూస్తోందిరా అయ్యా'' అన్నది.

అతను నింపాదిగా భోజనానికి కూర్చుంటూ ''తెలుసు'' అన్నాడు.

''ఎవరు చెప్పారు?"

''కీర్తనే స్వయంగా చెప్పింది.''

''నేను నమ్మనురా. ఇలాంటి దిక్కుమాలిన విషయాలల్లో ఆడది ఎప్పటికీ నిజం చెప్పదు. నిజం మనం బయట తెలుసుకోవాలి" హెచ్చరించింది.

‘’అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?’’

‘’ఎందుకంటే నేను కూడా ఓ ఆడదానినే కాబట్టి.’’

''నువ్వు తప్పమ్మా. ఆమె శీలాన్ని చూడకు అమ్మ. ఆమె నిజాయితీని చూడు. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నేను మోసాన్ని క్షమించను. మోసపోయిన ఆమెను చేరదీసి కొత్త జీవితాన్ని ఇస్తాను'' గంభీరంగా అన్నాడు.

''చేడిపోయిన దానిని పెళ్లి చేసుకుని మన వంశం పరువు తీస్తావా? నా కంఠంలో ప్రాణముందా ఈ పెళ్లి జరగనివ్వను. నీ మరదలు మహా లక్ష్మిని చేసుకోరా'' ఆదేశించింది.

''ఐతే... నేను ఆమెను గుడిలో పెళ్లి చేసుకుని మరో ఊళ్ళో కాపురం పెడతాము. నువ్వు నా ఇంటికి రాకు'' ఎదురు చెప్పాడు.

ఆమె నానా రభస చేసినా అతను తన నిర్ణయం మార్చుకోలేదు. అతను ఓ నిర్ణయానికి వస్తే ఎవరిమాటా వినడని ఆమెకు తెలుసు. ఏడుస్తూ తల బాదుకుంది.

000

జవహర్ తన పెళ్లిని చాలా సింపుల్ గా గుడిలో చేసుకోవాలని వంద పత్రికలు మాత్రమే అచ్చు వేయించాడు. వాటిని సహాఉద్యోగులకు, చాలా దగ్గరి బందువులకు మాత్రమే పంచుతున్నారు. ఆ రోజు చారి, క్యాషియర్ చందు, హెడ్ క్లర్క్ ఉషకు పత్రికలు ఇచ్చాడు. వాళ్లు ఆ తాలూకా వాళ్లే. ఆ చుట్టుపక్కల గ్రామాల గురించి వాళ్లకు తెలుసు. ఆ పెళ్లి పత్రికలూ తీసుకున్న వాళ్ళు సంతోషంగా లేరు. ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇబ్బందిగా వెళ్లారు. వాళ్ళు ఎందుకు అలా ఎడముఖం - పెడముఖం పెట్టారో జవహర్కు అర్థమయ్యింది.

మధ్యాహ్నం ఛాంబర్లోకి చారి వచ్చాడు. అతను ఉండబట్టలేక ''కీర్తన నాకు చాలా దగ్గరి బంధువు సార్. మీరు తొందర పడకుండా ఆమె గురించి ఓసారి తెలుసుకుంటే మంచిది'' ఓ పెద్దమనిషిలా అన్నాడు.

''తెలుసు చారిగారు. ఆమెనే తనకు జరిగిన అన్యాయం గురించి స్వయంగా చెప్పింది" అని ఆమె చెప్పింది మక్కికి మక్కిగా చెప్పాడు.

ఓపికగా అంతావిన్నాకా చారికి ''మీకు అలా చెప్పిందా?" అన్నాడు.

''అంటే...?''

''ఆమె చెప్పినట్లే ఎమ్మెలే నీచుడు. కానీ వాడి కొడుకు ఉత్తమ్ ఉత్తముడు. నా కొడుకుకు ప్రాణమిత్రుడు. ఉత్తమ్ చదువులో మేధావి. ఇంటర్ లో స్టేట్ ర్యాంకర్. బి.టెక్ లో గోల్డ్ మెదిలిస్ట్. కావాలంటే గూగుల్ లో చూడండి. అతని చదువు చూసి ‘నాసా’ పిలిచి పైచదువులు ఉచితంగా చదివిస్తున్నారు. ఏడాదికి పది లక్షల ఫెల్లోషిప్ పొందుతున్న మేధావి. ఆవారాగాడు పాస్ కాగలుగుతాడు. కానీ ర్యాంకులు సాధించలేడు. కీర్తన కన్ను ఉత్తమ్ మీద, అతని ఆస్తి మీద పడింది. అతనికి వల్లో వేసుకోవాలని రెండు ఏళ్ళు వేటపడింది. కావాలంటే ఆమె రాసిన ప్రేమలేఖలు చదవండి'' అని కొన్నింటిని టేబుల్ మీద విసిరాడు.

జవహర్ ఆ మాటలు నమ్మలేదు. అందుకే కీర్తన లోన్ కోసం నింపిన దరఖాస్తుతో ఆమె చేతిరాత పోల్చి చూశాడు. దొంగ చేతిరాత, దొంగ సంతకాలను పట్టుకోవడంలో జవహారకు ఎంతో అనుభవం ఉంది. నిజమే. ఆమె దస్తూరి, సంతకం ఆమెదే.

ఉలిక్కిపడిన జవహర్ ఆసక్తిగా వింటున్నాడు.

చారి కోపంతో ''ఉత్తమ్ ఆమె వలలో పడలేదు. ‘నేను అమెరికా వెళుతున్నాను, ఈ ప్రేమ, పెళ్లి నా కెరియర్ని పాడుచేస్తాయి మొర్రో’ అని మొత్తుకున్నాడు. ‘పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. నా కోరిక తీర్చి అమెరికాకు వెళ్ళు’ అని వేడుకుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉత్తరం రాసింది'' అని మరో ఉత్తరం ఇచ్చాడు.

చారి చెప్పినట్లు ఆ ఉత్తరంలో రాసుంది. అది కూడా ఆమె చేతి రాతే. జవహర్ కు ముచ్చెమటలు పట్టాయి.

చారి పళ్ళు పటపటా కొరుకుతూ ''ఉత్తమ్ భయపడి ఆమెను తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. కుర్రాడు కాబట్టి ఆమెతో మూడు రోజులు కీర్తనతో గడిపాడు. చివరి కి ఆమె ఒక్కసారిగా తన విశ్వరూపం చూపిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకో - లేకపోతే రేప్ కెసిపెట్టి నిన్ను జైలుకు పంపుతా’ అని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ కుర్రాడి తండ్రి అసలే ఎమ్మెల్లే, పలుకుబడి ఉన్నోడు. ఆమె బెదిరింపులను లెక్క చేయలేదు.

కీర్తన తన బట్టలు తానే చించుకుని ఉత్తమ్ రేప్ చేశాడని నానా రభస చేసింది. పెద్దలతో పంచాయితీ పెట్టించి కనీసం పాతిక లక్షలు నష్ట పరిహారం కావాలని పట్టు పట్టింది. ఆ ఎమ్మెల్లేకు చెడ్డ పేరు ఉంది. కాబట్టి కుర్రాడు కూడా ఆ తప్పు చేసి ఉంటాడని పెద్దమనుషులు, ఆ ఊరు కూడా నమ్మింది. ఆమెకు అండగా నిలబడింది. కానీ ఎమ్మెల్లే చాలా తెలివిగా దానికి ఒప్పుకుని, ముందుగా కొడుకుని అమెరికా పంపాడు. ఆ తరువాత కీర్తన మీదా తిరగబడ్డాడు. కీర్తన రెంటికి చెడిన రేవడిలా మారింది. అటు ఉత్తమ్ ప్రేమ పొందలేక పోయింది - ఇటు డబ్బు సంపాదించలేక పోయింది. పైగా చెడిపోయిన ఆడదానిగా ముద్రపడింది. ఇది ఆమె స్వయంకృపరాధం. అలాంటి దానిని పెళ్లి చేసుకుని మీరు ఏం సుఖపడతారు సార్?" నిలదీశాడు.

ఆ షాక్ లోంచి కోలుకోడానికి జవహర్ కు మూడు రోజులు పట్టింది.

000

జవహర్ తన పెళ్లి పత్రికను కీర్తనకు ఇస్తూ ''నా పెళ్ళికి తప్పక రావాలి'' అన్నాడు.

ఆమె ఆ పత్రికను తీసుకుని నవ్వుతు ''మన పెళ్ళికి నేను రాకపోవడం ఏమిటి?" అన్నది.

''మన పెళ్లి కాదు. నా పెళ్లి'' చిరునవ్వుతో అన్నాడు.

ఆమె అనుమానంతో పత్రికను చదివింది. అంతకుముందు నిర్ణయించిన తేదీకే పెళ్లి ఉంది. కానీ పెళ్లి కూతురు స్థానంలో నీ మరదలు మహా లక్ష్మి పేరు ఉంది.

ఆమె ఉలిక్కిపడి ''అంటే ఆ చారి నా గురించి పచ్చి అబద్దాలు చెప్పాడన్న మాట'' అని ఆమె మరోసారి తాను ఎలా మోసపోయానో చెప్పబోయింది.

ఆమె ఉత్తమ్ కు రాసిన ప్రేమలేఖలు చూపాడు. ఆమె ముఖంలో రక్తం చుక్కలేదు. భయపడింది. ఇక మాట్లాడడానికి ఏమి లేనట్లు తలవంచుకుని.

అతను ఆమెను అసహ్యంగా చూస్తూ ''నువ్వు ఉత్తమ్ లాంటి ఉత్తముడి వెంటపడడం తప్పు కాదు. అతని ఆస్తిని ఆశించడం తప్పు కాదు. అతనితో నీకుగా నువ్వు కులకడం తప్పు కాదు. నీ శీలానికి పాతిక లక్షలు కావాలని అడగడం కూడా తప్పు కాదు. కానీ ఓ నిజాన్ని అబద్దంగా మలిచి - ఆ అబద్దాన్ని నిజంగా నమ్మించాలిని చేసిన ప్రయత్నమే తప్పు. మా అమ్మ సాటిస్త్రీ గా ఓ నిజం చెప్పింది. 'ఇలాంటి దిక్కుమాలిన విషయాలలో ఆడది ఎప్పటికీ నిజం చెప్పాదు, అది మనం బయట తెలుసుకోవాలి' అని. నేను మొన్న నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది.’’

మరోసారి తప్పు చేసి ఓడిపోయినా కీర్తన ఏడవడం మొదలుపెట్టింది.

ఈసారి ఆమెను జాలిగా చూడలేదు. కోపంగా చూస్తూ ''నువ్వు రేప్ చేయబడ్డావని చెప్పగానే నీ మీద జాలివేసింది. కానీ నువ్వు ఎలాంటి దానివో తెలిశాక జుగుప్సగా ఉంది. నేను నీకు ముందే చెప్పాను. అప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. మరోసారి చెపుతాను. ఇప్పుడు అర్థంకావచ్చు. కామం మురికి కూపం. కానీ ప్రేమకు మలినం లేదు. అది ఆత్మలా అంటరానితనంతో మనసులో పవిత్రగా ఉంటుంది. నాకు ఆ మనసు కావాలి. అందం పువ్వులా వాడిపోయి రాలిపోతుంది. ఇది ప్రకృతి. కానీ మనిషి సృష్టించే అబద్దం వికృతమైనది. నేను దానిని అసహ్యించుకుంటాను. నువ్వు అబద్దం చెప్పి నీ విలువను నువ్వే పోగొట్టుకున్నావు'' అన్నాడు.

ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇప్పుడు ఆ కళ్ళు అందంగా లేవు. ఆమె దేవకన్యలా లేదు. ఆమె అందవికారంగా కనిపిస్తోంది. అందం శరీరంలో లేదు. క్యారెక్టర్ లో ఉంటుంది. ఆ క్యారెక్టర్ లేని అందమైనవాళ్లు అందవిహీనంగా కనిపిస్తారు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి