లోకం తీరు - పద్మావతి దివాకర్ల

The way of the world

"సారీ సార్! చిన్న పొరపాటైంది. క్షమించండి సార్! నేను మళ్ళీ ఈ ప్రాజెక్ట్ రెండురోజుల్లో పూర్తి చేసి ఇస్తాను." అని ప్రాధేయపడ్డాడు వినయ్.

"ఏమిటి వినయ్! పొరపాటైందని, క్షమించమని చెబితే సరిపోతుందా? ఈ ప్రాజెక్ట్ విలువ ఎంతో నీకు అసలు తెలుసా? వంద కోట్లు! ఇలాంటి పొరపాట్లు జరిగితే మన పరువేం కాను? మన కంపెనీ పేరు ప్రతిష్ఠల మాటేమిటి? ఒక చిన్న’సారీ‘తో సరిపోతుందా? ఈ ప్రాజెక్ట్ పోతే మనకి ఎంత నష్టమో తెలుసా? నేను ఇప్పుడు ఏమి జవాబు చెప్పుకోవాలి మన మేనిజింగ్ డైరెక్టర్‌కి, మన క్లైంట్‌కి?" అని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు వినయ్ ప్రాజెక్ట్ హెడ్ జగ్గారావు.

"సార్, ఈ ఒక్కసారికి నా తప్పు కాయండి. రెండు రోజుల్లో నేను అంతా సరి చేసి ఇస్తాను." అన్నాడు మళ్ళీ.

ఏ కళనున్నాడో జగ్గారావు, "ఆల్ రైట్!...ఈ ఒక్కసారికి నీకో అవకాశం ఇస్తున్నాను. రెండంటే రెండురోజుల్లో పని పూర్తి చేసి ఇవ్వు. గుర్తుంచుకో, ఇదే చివరి అవకాశం. మరో సారి ఇలాంటి పొరపాటు చేస్తే పరిణామం తీవ్రంగా ఉంటుంది." అన్నాడు.

బాస్ చాంబర్ నుండి వాడిపోయిన మొహంతో తిరిగి వచ్చిన వినయ్‌ని చూసి అతని అసిస్టెంట్ హరి విషయం గ్రహించాడు. జగ్గారావునుండి చీవాట్లు తిన్న వినయ్ వైపు జాలిగా చూసాడు.

"ఈ బాస్‌లు అందరూ అంతే వినయ్‌గారూ! అసలు ఈ పొరపాటు జరగడానికి ముఖ్య కారకుడు మన హెడ్ జగ్గారావే! అతనే మనకి సరిగ్గా మార్గదర్శనం చేయలేదు సరికదా, మనకి తప్పు తోవ పట్టించాడు. మనమేం చెప్పినా అప్పుడు వినిపించుకోలేదు. ఇప్పుడేమో పొరపాటు జరిగేసరికి తప్పంతా మనమీదకి నెడుతున్నాడు." అని వినయ్‌ని సమాధాన పరిచాడు.

"అవును, ఏం చేస్తాం? అతను చెప్పినట్లే మనం చేసినా పొరపాటు జరగడం వల్ల నింద మనమీద వేసాడు. నెలరోజుల మన కష్టఫలితం బూడిదలో పోసిన పన్నీరయింది. మనకిప్పుడు తప్పదు, మళ్ళీ రెండు రోజులు పూర్తిగా కష్టపడితేగానీ పని పూర్తికాదు." నిట్టూర్చాడు వినయ్. తల పంకించాడు హరి. మళ్ళీ ఇద్దరూ రేయింబవళ్ళూ కష్టపడి అంతా సరిచేసి జగ్గారావుకి ఇచ్చారు.

అయితే ఈ రెండురోజుల్లో కూడా జగ్గారావు మధ్యమధ్యలో వినయ్‌ని పిలుస్తూ పని ఎంత దూరం వచ్చిందో కనుక్కుంటూ మధ్య మధ్యలో చీవాట్లు పెడుతున్నాడు. అలాగే, మేనేజింగ్ డైరెక్టర్‌ శ్రీధర్ నుండి కూడా పిలుపు వచ్చింది ఈ విషయమై. అక్కడకూడా తను సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది, తప్పు తనది కాకపోయినా.

వినయ్, హరి పని చేస్తున్న సంస్థలో భారీ ప్రాజెక్ట్‌లకి సంబంధించిన పని చేపడుతారు. వాళ్ళ వినియోగదారుల్లో చాలా పెద్ద పెద్ద దేశ, విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. జగ్గారావు వాళ్ళ ప్రాజెక్ట్ హెడ్. అతనికి మేనేజింగ్ డైరెక్టెర్‌తో సత్సంబంధం ఉంది. అందుకే ఏ ప్రాజెక్ట్‌లోనైనా లోపాలు ఉంటే తన కిందివారిపై నెట్టడం అలవాటు అతనికి. తనే పొరపాట్లు చేసినా కూడా పై అధికార్ల నుండి జగ్గారావు మెప్పు ఎలా సంపాదిస్తున్నాడో మాత్రం వినయ్‌కి అర్థంకావడం లేదు. ఇక్కడ జగ్గారావు గురించి కొంచెం చెప్పుకోవాలి. కంపెనీ డైరెక్టర్లలో ఒకడైన భుజంగరావుకి స్వయానా బావమరిది అవడంతో సరైన అర్హత లేకపోయినా ఉద్యోగంలో చేరి త్వరలోనే ప్రమోషన్లు సంపాదించి ప్రస్తుతం ఉన్న స్థాయికి ఎదిగాడు. జగ్గారావు పనిలో సరైన సామర్థ్యం లేకపోయినా పై అధికార్లతో సఖ్యంగా ఉంటూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. అతనికి వినయ్‌లాంటి పనిలో నిబద్ధత, నిజాయితీగల వాళ్ళంటే చిన్నచూపు, అసూయ కూడాను. అందుకే వాళ్ళ పనుల్లో తప్పులెన్నడం అతనికి సరదా కూడా. మొత్తం పనంతా తనే చేస్తున్నట్లు గొప్పలు పోవడం అతని నైజం.

మొత్తంమీద అన్నట్లుగానే రెండురోజులు కష్టపడి పని పూర్తిచేసి జగ్గారావుకి అప్పగించి తన తలమీద భారం దించుకున్నాడు వినయ్.

ఇది జరిగిన ఓ అర్నెల్ల తర్వాత, ఇంకో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దాని విలువ మూడు వందల కోట్లు. ఆ క్లైంట్ అంతర్జాతీయంగా పేరుపొందిన కంపెనీ. ఆ పనిని కంపనీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ బాధ్యతలు కూడా జగ్గారావుకి అప్పగించబడింది. ఆ ప్రాజెక్ట్‌పని జాగ్రత్తగా డీల్ చేయమని పై అధికార్ల నుండి ఆదేశాలు కూడా అందాయి. స్వయంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ జగ్గారావుని పిలిపించుకొని ప్రాజెక్ట్ పురోగతి మధ్యమధ్య సమీక్షిస్తున్నాడు.

అడపాదడపా వినయ్‌కి కూడా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ నుండి పిలుపు వస్తోంది. తనని పిలిచినప్పుడల్లా వినయ్ అతనికి అన్నీ వివరిస్తున్నాడు. అయితే ఈ సారి తన హెడ్ జగ్గారావు ఎలాంటి సలహాలు ఇచ్చినా వినదలుచుకోలేదు అతను. పైకి మాత్రం అతను చెప్పిన మార్పులు చేసినట్లు చెప్తూన్నా తన సహాయకుడు హరితో కలసి రేయింబవళ్ళు కష్టపడి నెలా పదిహేను రోజులకల్లా పని పూర్తి చేసాడు.

అనుకున్న సమయంకన్నా ముందే పని పూర్తవడం వినయ్‌కి చాలా తృప్తినిచ్చింది. అంతే కాకుండా ఈ సారి ఎటువంటి పొరపాట్లకూ తావియ్యలేదు వినయ్. ఈ విషయంలో హరి సహకారం బాగానే లభించింది వినయ్‌కి. మధ్యమధ్య జగ్గారావు హెడ్‌గా పర్యవేక్షణ చేస్తూ కొన్ని మార్పులు సూచించినా, క్రితంసారి జరిగిన అనుభవం దృష్ట్యా అవేమీ పట్టించుకోలేదు వినయ్.

అనుకున్న సమయం కన్నా పదిహేను రోజులు ముందే పని పూర్తి చేసినందుకు ఇటు జగ్గారావు, అటు మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరూ కూడా చాలా సంతోషించారు.

ఈ సారి తనని వాళ్ళిద్దరూ తప్పకుండా అభినందిస్తారని అనుకున్నాడు వినయ్. ఆ విషయమే హరితో అంటే అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

వినయ్ అనుకున్నట్లుగానే ఆ మరుసటి రోజు ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసినందుకు సాయంకాలం ఆరు గంటలకి కాన్‌ఫరెన్స్ హాల్‌లో అభినందన సభ ఉంటుందని అందరికీ తెలియజేసాడు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్. ఆ తర్వాత గ్రాండ్ డిన్నర్ కూడా ఉంటుందని అందరికీ తెలియపర్చాడు.

ఈ వార్త వినగానే వినయ్‌కి చాలా ఉత్సాహంగా ఉంది. తన ప్రతిభని శ్రీధర్ గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. తనకి మాత్రమే కాదు, తన అసిస్టెంట్ హరికి కూడా ఈ సభలో తగిన సత్కారం జరుగుతుందని సంతోషించాడు. ఈ సంతోషంలో, ఇంతకు పూర్వం తనకి జరిగిన అవమానం కూడా మరుపుకు వచ్చింది వినయ్‌కి. అతని మొహం వెయ్య క్యాండిల్ బల్బులా వెలిగిపోతోంది.

అదే మాట హరితో అన్నాడు కూడా, "ఇంతకాలానికి మనకి ఈ కంపెనీలో సరైన గుర్తింపు వచ్చింది. మనం ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసినందుకు మనకి మంచి సత్కారం లభించబోతోంది."

అయితే ఈ సారి కూడా హరి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అతని ముఖంలో ఏ భావం వ్యక్తమవలేదు.

సాయంకాలం ఏర్పాటైన అభినందన సభకి ఉత్సాహంగా బయలుదేరాడు వినయ్ హరి వెంట రాగా.

సకాలంలో సభ ఆరంభమైంది. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సభ ప్రారంభిస్తూ ప్రసంగించాడు.

"మనందరికీ, మన కంపెనీకి ఇవాళ చాలా సుదినం. చాలా ప్రతిష్ఠాత్మకమైన మూడు వందల కోట్ల ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో, ఇంకా సరిగ్గా చెప్పాలంటే గడువుకి పదిహేను రోజుల ముందే పూర్తవడం శుభసూచకం. మన క్లైంట్స్‌కూడా చాలా సంతోషం చెందారు. ఈ విషయం బాగా ప్రచారమవడంవల్ల మనకి మున్ముందు చాలా పెద్దపెద్ద ప్రాజెక్ట్‌లు లభించడానికి అవకాశం ఉంది. ఈ విజయం మన అందరిదీ, ముఖ్యంగా ఈ విజయం కోసం అహోరాత్రులు శ్రమ పడిన..."అంటూ ఆగి అందరివైపు ఒకసారి చూసాడు శ్రీధర్.

ఇది వింటున్న వినయ్ ఆనందంతో తబ్బిబ్బయి పోతున్నాడు. ఇప్పుడు తన పేరే శ్రీధర్ చెప్తాడని ఆత్రతతో ఎదురు చూస్తున్నాడు.

అయితే అందరివైపు ఒకసారి చూసిన శ్రీధర్ చూపులు వినయ్‌పై ఆగకుండా ముందుకెళ్ళి అతని హెడ్ అయిన జగ్గారావుపై నిలిచాయి.

"...జగ్గారావుకి నా ప్రత్యేక అభినందనలు. అతను పడిన శ్రమ, చూపించిన శ్రద్ధ నిరుపమానం. కంపెనీకి అతని సేవలు అమోఘం. ఈ సందర్భంగా కంపెనీ అతనికి తగిన సత్కారం చేయలని సంకల్పించింది. కంపెనీ తరఫున అతనికి ఈ చిరుకానుక ఈ సందర్భంగా బహూకరిస్తోంది." అని లేచి నిలబడి చప్పట్లు చరిచి జగ్గారావుని అభినందించి అతనితో కరచాలనం చేసాడు. జగ్గారావు కూడా నిలబడి గర్వంగా తొలుత ఆ అభినందనలు, ఆ తర్వాత బహుమతి స్వీకరించాడు. కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమోగిపోయింది.

అది చూసిన వినయ్ ముఖం తెల్లగా పాలిపోయింది. జగ్గారావుకి సత్కారం చేసిన తర్వాతైనా తనని కూడా అభినందిస్తారని అనుకున్నాడు కాని అతని వూసే ఎత్తలేదు శ్రీధర్. జగ్గారావు కూడా మాట్లాడాక అ సభ ముగిసి అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు.

వినయ్ కూడా నిరుత్సాహంగా అటువైపు కదిలాడు అందరికీ వెనుకగా. అతన్నే గమనిస్తూన్న హరి, "సార్! నిరుత్సాహ పడకండి, ఇది మామూలే! పనిలో పొరపాట్లు, లోపాలు ఉంటే తమ కిందివారిపై తోసి అవమాన పరుస్తారు. అదే, ఏదైనా విజయం సాధిస్తే మాత్రం అది తమ భుజంపై వేసుకొని తనవల్లే అది సాధ్యమైందని ఫోజులు కొడ్తారు మన జగ్గరావులాంటి వారు. మీకిది కొత్తగానీ నాకిది ముందునుండే అనుభంలో ఉంది. లోపాలుంటే బాధ్యత కింది వారిది, విజయం వరిస్తే మాత్రం అది పై వాళ్ళ సమర్థతకి కొలమానం. అందుకే ఈ విషయం పై మీరేమీ బాధపడకండి. లోకం తీరే అంత!" అని వినయ్‌ని ఓదార్చాడు.

నిశితంగా ఆలోచిస్తే హరి మాటల్లోని యదార్ధం గోచరించింది వినయ్‌కి. తప్పులుంటే తమ కింద పని చేసే వారిపై రుద్దడం, అదే ఏ సమస్యా లేకుండా పని విజయవంతంగా, నిర్విఘ్నంగా పూర్తైతే అది తన ప్రతాపమేనని జబ్బలు చరుచుకోవడం ఈ జగ్గారావులాంటి వారి నైజం. అందుకే అతను తన పై అధికార్ల దృష్టిలో సమర్థుడుగా సత్కారాలు, అభినందనలు అందుకుంటున్నాడు. జగ్గారావులాంటి వాళ్ళు ఉన్నంతవరకూ తన శ్రమకి తగిన ఫలితం అందదని తెలుసుకున్నాడు వినయ్. జగ్గారావులాంటి వాళ్ళున్న చాలా సంస్థల్లో ఇది మామూలే. అవును, లోకం తీరే అంత మరి!

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ