అనారోగ్య హేతువు - పద్మావతి దివాకర్ల

the way to un health

"ఒరే పాపారావూ!...మీరందరూ ఎక్కడున్నారురా? నేను ఇక్కడికి వచ్చి చాలాసేపయ్యింది, వేగం రండి!" అని ఫోన్ చేసాడు రాజారావు తన మిత్రుడికి.

"ఇంకో పావుగంటలో వచ్చేస్తున్నారా! వాళ్ళిద్దరూ కూడా అయిదు నిమిషాల్లో బయలుదేరుతున్నారు." జవాబిచ్చాడు పాపారావు.

"సరే!" అన్నాడు రాజారావు.

అదో టౌన్‌కి దూరంగా ఓ మూల ఉన్న పాడుబడిన ఇల్లు. పావుగంట క్రితమే అక్కడికి చేరుకున్న రాజారావు తన స్నేహితుల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పాపారావు, అప్పారావు, రమణారావు, ఈ ముగ్గురూ రాజారావుకి ఆప్త మిత్రలనేకన్నా పేకాట మిత్రులంటే సబబుగా ఉంటుంది. ఆ మిత్రచతుష్టయానికి పేకాట అంటే ప్రాణం. పేకాట ఒక్కరోజు ఆడకపోయినా ప్రాణం గిజగిజ లాడుతుంది. భోజనం లేకపోయినా ఫర్వాలేదు కాని, పేకాట లేకపోతే బతకలేరు ఆ మిత్రులందరూ. అయితే ఈ లాక్డౌన్ వల్ల పేకాట ఆడటానికి సరైన అవకాశం, వేదిక దొరకక చాలా ఇబ్బంది పడ్డారు పాపం. తమ కష్టాలు వలస కార్మికుల కష్టాలకన్నా తీవ్రమైనవని ఆ నలుగురి భావన, ఏకాభిప్రాయం కూడా. అయితే లాక్‌డౌన్ కొంత సడలించిన తర్వాత సందు దొరికిందే చాలని పేకాటకోసం తగిన స్థావరం వెతికే పనిలో పడ్డారు వాళ్ళు. టౌన్‌లో అయితే ఎక్కడ పోలీసులు తరుముకొస్తారోనని భయం మరి. చివరికి వెదకగా వెదకగా ఈ పాడుబడిన కోంప వారి కార్యకలాపాలకి అనువైనదిగా తోచింది.

గత కొన్నిరోజులుగా సమయం చూసుకొని ఆ నలుగురూ అక్కడికి చేరుకొని తమ పేకాట కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో ఇవాళ అందరికన్న ముందు వచ్చిన రాజారావు తన మిగిలిన మిత్రులకోసం ఎదురు చూస్తూ చరవాణి పట్టుకు కూర్చున్నాడు.

ఫేస్‌బుక్, వాట్స్‌ప్ చూస్తూ ఆ తర్వాత కుతూహలం కోలదీ ఆరోగ్యసేతు యాప్ క్లిక్ చేసాడు. అందులో అయిదువందల మీటర్ల దూరం లోపల ఒకరు కరోనా బారిన పడినట్లు చూపించింది. ‘ఆఁ...అందులో వింతేమిటుందిలే’ అని మనసులో అనుకున్నాడు రాజారావు.

ఈ లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తిగా ఎత్తేస్తారో, ఎప్పుడు స్వేచ్చగా పేకాట ఆడుకోగలమో అని మనసులోనే అనుకొని నిట్టూర్చాడు రాజారావు.

ఇంతలో, "నేను వచ్చేసానోచ్!" అని ఓ చిన్న కేక పెట్టి బైక్ ఓ మూలన ఉంచి లోపలికొచ్చాడు పాపారావు.

"ఏమిట్రా ఇంత ఆలస్యం చేసావు. నేనొచ్చి అప్పుడే అరగంటైంది తెలుసా?" అన్నాడు.

"ఏమిటి చేస్తాను చెప్పు, నేను సరిగ్గా బయలుదేరే సమయానికి మా ఆవిడ కూరగాయలు తెమ్మని సంచి చేతిలో పెట్టింది. అవి తెచ్చి ఇంట్లో పడేసి వెంటనే బయలుదేరాను." అన్నాడు పాపారావు తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ తెరిచి అందులోనుండి కావలసిన సరంజామా అంతా తీసి బయటపెడుతూ.

"మరి అప్పారావు, రమణారావుల మాటేంటి?" అడిగాడు రాజారావు.

"వాళ్ళిద్దరూ కూడా వచ్చేస్తారు. నేను బయలు దేరిన తర్వాత వాళ్ళు బయలు దేరినట్లు చెప్పారు నాకు." అని జవాబిచ్చాడు పాపారావు.

"ఇంకా రాలేదు కదా వాళ్ళు, ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తాను వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో?" అని తన సెల్ చేతిలోకి తీసుకున్నాడు రాజారావు.

సెల్ ఇంకా ఆరోగ్య సేతు యాప్‌లోనే ఉండటం వలన అప్రయత్నంగా చూసిన రాజారావుకి ఇప్పుడు అయిదు వందల మీటర్ల దూరంలో ఇద్దరు కరోనా పీడితులు ఉన్నట్లు కనిపించింది.

"అరే!...చిత్రంగా ఉందే ఈ ఆరోగ్య సేతు యాప్! ఇంతవరకూ ఈ దగ్గరదగ్గర ఒక్కరే కరోనా బాధితుడని చూపించిన ఆరోగ్య సేతు ఇప్పుడేమో ఇద్దరు ఉన్నారంటోంది." అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా సెల్‌వంకే చూస్తూ.

అయితే, అప్పుడే అప్పారావుకి ఫోన్ చెయ్యడానికి సెల్ తీసిన పాపారావు కూడా తన సెల్‌లో ఆరోగ్య సేతు యాప్ యధాలాపంగా చూసాడు.

వెంటనే, "నాకు కూడా ఇంతకు ముందు ఒక్కటే చూపించింది. ఇప్పుడేమో ఇద్దరున్నట్లు చూపిస్తోంది." అన్నాడు ఆశ్చర్యంగా పాపారావు.

"అవును! ఆశ్చర్యంగా ఉంది. ఇది చూపించేది నిజంగా కరక్టేనా?" సందేహంగా అడిగాడు రాజారావు.

ఇంతలో బయట బైక్ ఆగిన శబ్దం వినిపించి అటువైపు చూసాడు పాపారావు.

"అదిగో! మాటల్లోనే వచ్చేసారు మన వాళ్ళిద్దరూ. ఇక సామానంతా సర్దు. ఆట మొదలెట్టేదాం." అన్నాడు పాపారావు.

ముందు అప్పారావు, ఆ వెనుక రమణారావు ఇద్దరూ లోపలికి వచ్చారు. తను తెచ్చిన చిప్స్, మిక్చర్ పేకట్లు కింద పెట్టాడు అప్పారావు.

ఆ నలుగురూ కింద ఓ గుడ్డ పరిచి దానిపై సరంజామా అంతా సర్ది అందరూ కూడా కూర్చున్నారు చతుర్ముఖ పారాయణం ప్రారంభించడానికి.

పేక కలిపి ముక్కలు పంచుతున్న రాజారావు చూపు అకస్మాత్తుగా మళ్ళీ తన సెల్‌పై పడింది. ఆశ్చర్యం! ఇప్పుడేమో అది నలుగుర్ని చూపిస్తోంది.

"అరే! ఇప్పటివరకు ఈ ఆరోగ్య సేతు యాప్ ఇద్దర్ని మాత్రమే చూపిస్తుండేది, ఇప్పుడేమో ఇది ఈ దగ్గరేమో నలుగురున్నట్లు చూపిస్తోంది చిత్రంగా." అన్నాడు రాజారావు.

అతని మాట విన్నతర్వాత, మిగతా నలుగురూ కూడా చూసుకుంటే అందరికి కూడా అలాగే కనిపించింది.

"అరే! అవును నిజంగా చిత్రంగా ఉందే! ఇది తప్పు చూపించడంలేదు కదా?" అని పాపారావు కూడా నోరెళ్ళెబెట్టాడు.

ఆ తర్వాత ఆ నలుగురూ ఒకర్నొకరు అనుమానంగా చూసుకున్నారు విషయం పూర్తిగా అర్థమైయ్యాక.

సరిగ్గా అప్పుడే హఠాత్తుగా అక్కడ ఎంట్రీ ఇచ్చాడు ఓ పొలీస్ ఇన్‌స్పెక్టర్. అతని వెనుక మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆ పేకాట మిత్రులకి కాస్త దూరంగా నిలబడ్డారు.

"ఆ ఏమిటీ, చిత్రంగా ఉందా! చిత్రంగా ఉండదూ మరి! నలుగురు కరోనా స్నేహితులూ కలసి ఇక్కడ గుమిగూడి పేకాట ఆడతారా మీ కరోనాని దాచిపెట్టి. నలుగురికీ కరోనా సోకి పేకాట ఆడటానికి ఒకర్నుంచి ఒకరు ఆ విషయం దాస్తారా? ఏమిటీ, మీకు మీ ప్రాణాలకంటే కూడా పేకాట ఎక్కువైపోయిందా? కరోనా ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలియదా? ఇలా ఎంతమందికి మీరు కరోనా అంటిస్తున్నారో? ఆరోగ్యసేతు తప్పు చూపిస్తున్నదని అనుకున్నారు గాని, మీరే ఈ సమాజానికి అనారోగ్య హేతువులు అని మాత్రం గ్రహించడం లేదు. ఇన్ని ఆంక్షలున్నా మీ పేకాట మానరా! పేకాట ఆడటమే ఓ నేరమనుకుంటే, కరోనాని నెత్తికెక్కించుకొనీ మరీ ఆడతారా? ఒకవేళ కరోనా తీవ్రమై మీరు పైకెళిపోతే అక్కడకూడా ఆడేట్టున్నారే! పదండి వెంటనే కోవిడ్ హాస్పిటల్‌కి ముందు. మీమీద పోలీస్ స్టేషన్లో కేస్ కూడా నమోదు అవుతుంది. పదండి బయట ఉన్న అంబులెన్స్ ఎక్కండి త్వరగా." అన్నాడు ఆ ఇన్‌స్పెక్టర్ దూరం నుండే తన లాఠీ ఝులిపిస్తూ.

మిత్రులు నలుగురు అతనితో కడుపారా తిట్లు తిని తలవంచుకొని పోలీసుల వెనుకే బయటకి నడిచారు. ప్రతీ ఒక్కరు మిగతా ముగ్గురూ తమకి కరోనా సోకిందన్న సంగతి దాచినందుకు గుర్రుగా కొరకొరా ఒకరినొకరు చూసుకున్నారు.

అయితే అందరికీ ఒక సందేహం మాత్రం తీరలేదు. ఇక్కడ పేకాడుతున్నామని పోలీసులకెలా తెలిసిందోనని. అయితే వాళ్ళ మొహం చూసి వాళ్ళ సందేహం కనిపెట్టిన ఇన్‌స్పెక్టర్, "మీ సందేహం నాకు అర్థమైంది, నాకు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిందెలా అనా! నేను పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు టౌన్‌కి దూరంగా ఉన్న ఈ పాడుబడిన ఇంటి వైపు రావడం గమనించాను. అయితే అది ఎందుకో మాత్రం ముందు అర్థమవలేదు. మొదట ఇక్కడ ఏదో నేరం జరగబోతుందని భావించి మిమ్మల్ని అనుసరించాను. ఆ తర్వాత పేకాట ఆడటానికని తెలిసిందనుకోండి. అందుకే పోలీస్ బండి దూరంగా ఉంచి ఇక్కడికొచ్చాను. నేను కూడా డ్యూటీలో భాగంగా ఈ ఆరోగ్య సేతు యాప్ చూస్తూండగా కరోనా బాధితులు ఒకటి తర్వాత రెండు, మూడు, నాలుగు ఇలా ఒకటి తర్వాత ఒకటి పెరిగి పోయాయి. దాంతో గ్రహించాను మీరందరూ కరోనా గ్రస్తులని. అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని అంబులెన్స్ ముందే పిలిపించి దూరంగా ఉంచాను. మీ అనారోగ్య హేతువుని నా ఆరోగ్య సేతు యాప్ పట్టిచ్చింది. అయినా ఇదేం పోయేకాలం మీకు, ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలా విచ్ఛలవిడిగా తిరగడమే కాకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేకాట ఆడటానికి సిగ్గుగా లేదూ? ఇప్పుడు హాస్పిటల్లో కూర్చొని తీరిగ్గా ఆడుకుందురులే బతికుంటే!" అని వాళ్ళ సందేహాలు తీర్చి మరీ చీవాట్లు పెట్టాడు మళ్ళీ.

ఆ నలుగురు కరోనా స్నేహితులు తలవంచుకొని కిక్కురుమనకుండా అంబులెన్స్ ఎక్కారు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి