పరాయివాళ్ళు - పద్మావతి దివాకర్ల

out siders

  "ఏమండీ!  ఇవాళ సాయంకాలం శారదమ్మ పిన్నిగారింటికి   వెళ్దామండి.  మళ్ళీ మనకి రేపు  ప్రయాణం ఉంది కదా!  పదిరోజులపాటు ఊళ్ళో కూడా ఉండమాయె!  అందుకే  ఒకసారి పిన్నిగారిని,  బాబాయిగారిని చూసివస్తే బాగుంటుంది." అంది సరోజ అప్పుడే ఉదయంవేళ వాకింగ్ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన రామారావుతో.

"సరే! అలాగే వెళ్దాం.  ఈ లోపున మన రేపటి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకో, ఎందుకంటే వాళ్ళింటినుండి తిరిగివచ్చేసరికి చాలా రాత్రవుతుంది కదా! అప్పుడు మళ్ళీ నీకు బ్యాగులు సర్దడానికి ఓపిక ఉండకపోవచ్చు.  అంతేకాక, రేపు నీకు సమయం సరిపోకపోవచ్చు."  అన్నాడు రామారావు.

చాలా రోజుల తరవాత సరోజ అక్కయ్య ముంబాయి నుండి పుట్టింటికి విశాఖపట్నం రావడంతో సరోజ తనుకూడా అక్కడకి వెళ్ళడానికి ప్రయాణం పెట్టుకుంది.  రామారావుకి ఆ సమయంలో సెలవు దొరకడానికి వెసలుబాటు ఉండడంతో తను కూడా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. 

శారదమ్మ, మాధవరావు దంపతులు రామారావుకి దగ్గర చుట్టాలేమీ కారు.  అయితే ఒకే ఊరిలో ఉండటంవల్ల పరిచయాలేర్పడి చుట్టరికాలు కలబోసుకుంటే ఎక్కడో దూరపు బంధుత్వం తగిలింది.  అసలే సరోజకి బంధుప్రీతెక్కువ.  దానికి తోడు శారదమ్మ, మాధవరావు దంపతుల ఆప్యాయతవల్ల దూరం చుట్టరికమైనా ఆ బంధం బాగా గట్టిపడింది.  ఆ ఆదర్శ దంపతులంటే సరోజకేకాదు, రామారావుకి కూడా చాలా ఇష్టం.  ఆ దంపతులు సరోజని తమ కన్నకూతురిలానే భావిస్తారు.

మాధవరావుగారు హైస్కూల్ టీచర్‌గా పనిచేసి రిటైరైయ్యి పదిహేనేళ్ళు దాటింది. శారదమ్మగారికి కూడా వయస్సు డభైలోకొచ్చింది.  ఉద్యోగవిరమణ తర్వాత ఊరికి దూరంగా ఉండే నీలకంఠనగర్‌లో ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారు.  వాళ్లకొక్కడే అబ్బాయి శేఖర్.  ఉద్యోగంలో ఉండగా అప్పుచేసి మరీ కొడుకుని పై చదువులు చదివించారు.   శేఖర్ చదువుపూర్తైన తర్వాత ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం సంపాదించాడు.  ముందునుండి శేఖర్ మనస్తత్వం భిన్నంగా ఉండేది.  ఎప్పుడూ గొప్పగా, ఆడంబరంగా జీవించాలని కోరిక ఉండేది.  అతనికి తగ్గ మనస్తత్వమే భార్య సురేఖది కూడా.  శేఖర్ తన సహోద్యోగిని అయిన సురేఖని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానంటే కాదనలేకపోయారు మాధవరావు దంపతులు.  శేఖర్ తన పెళ్ళైనవరకూ తల్లీతండ్రితోనే కలసి ఉండేవాడు.  అయితే పెళ్ళైన తర్వాత భార్య ప్రొద్బలంవల్ల ఆ ఊళ్ళోనే వేరేకాపురం పెట్టాడు.  శేఖర్ కిప్పుడు ఓ అబ్బాయి, అమ్మాయి. మొదట వారానికొకసారైనా ఇంటికివచ్చి తల్లితండ్రులను చూసేవాడు.  శని, ఆదివారాలు భార్యాపిల్లలతో అక్కడే గడిపేవాడు.  ఓ ఖరీదైన ఫ్లాట్ కొనదలచిన శేఖర్ ఒకరోజు స్వంత ఇల్లు అమ్మి తనతో బాటు వచ్చి ఉండమని తల్లితండ్రులకి చెప్పాడు.  అయితే స్వంత ఇల్లు అమ్మి ఆ తర్వాత ఇబ్బందులపాలవడం మాధవరావుకి ఇష్టం లేదు.  కొడుకు మనస్తత్వం తెలిసిన మాధవరావుకి వాళ్ళమీద ఆధారపడి బతకడం కూడా ఇష్టంలేదు.   ఇల్లు తనపేర మీద రాయమని మరోసారి వత్తిడి తెచ్చాడు.  తమ తదనంతరం మీకే చెందుతుందన్నా వినలేదు.  అలా చేయడంకూడా మాధవరావు సమ్మతించలేదు, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకి భయపడి.  రానురాను మనస్పర్థలు బాగా పెరిగి వాళ్ళింటికి రావడమే మానేసాడు.  తల్లితండ్రుల బాగోగులు కూడా చూసుకోవడం మానేసాడు.  తల్లికి ఒకసారి ఒంట్లో బాగులేనప్పుడు ఊళ్ళోనే ఉండి కూడా రాలేదు.  పొడిపొడిగా తల్లి ఆరోగ్యం గురించి ఆరాతీసాడు అంతే!

సరిగ్గా అలాంటి సమయంలోనే ఆ వృద్ధదంపతులకు సరోజతో పరిచయం ఏర్పడింది.  ఓ రోజు సాయంకాలం షాపింగ్‌మాల్‌లో కలిసారు వాళ్ళు.  ఆ రోజు వాళ్ళు షాపింగ్‌మాల్‌లో కొన్న సామాన్లు రిక్షావరకు తీసుకెళ్ళడానికి  అవస్థపడుతుంటే సహాయపడింది సరోజ.  అలా ప్రారంభమైన వాళ్ళ పరిచయం ఆ తర్వాత ఒకళ్ళ ఇంటికి ఇంకొకరు వెళ్ళేంత వరకూ వచ్చింది.  ఆ తర్వాత మాటల్లో తెలిసింది వాళ్ళు రెండు కుటుంబాలమధ్య ఏదో దూరపు బంధుత్వం ఉన్నట్లు.  అసలే సరోజకి బంధుప్రీతి జాస్తి. సరోజ, రామారావులు ఉండే గజపతినగర్‌కి మాధవరావు దంపతులుండే నీలకంఠనగర్‌కి దాదాపు పదికిలోమీటర్ల దూరం ఉన్నా, రోజూ ఫోన్‌లో మాట్లాడుతునేవున్నా వారానికొక్కసారైనా వాళ్ళని కలవనిదే తోచదు సరోజకి.  శారదమ్మగారి ఆప్యాయత, కలుపుగోరుతనం బాగా నచ్చాయి సరోజకి.  వాళ్ళు వయసులో పెద్దవారవడంతో  సాధారణంగా సరోజ, రామారావులే ఎక్కువసార్లు వాళ్ళింటివైపు వెళుతుంటారు.

ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసిన తర్వాత ఊరికి తీసికెళ్ళడానికి ఇంట్లో చేసిన స్వీట్స్, కారంపూసలోంచి కొంత తీసి ఓ బాక్స్‌లో సర్దిందామె.  మాధవయ్యగారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం.  అలాగే శారదమ్మగారికి కారంపూస అంటే చాలా ఇష్టం, అదీ సరోజ చేసిన కారంపూస అంటే ఇంకా చాలా ఇష్టం. అవిడకి స్వీట్సన్నా ఇష్టమే కాకపోతే షుగర్ కాస్త ఎక్కువ ఉండడంతో ఈ మధ్య స్వీట్స్ తినడం మానేసారావిడ.  తనెప్పుడు వాళ్ళింటికి వెళ్ళినా ఇలా ఎదో ఒకటి తీసుకొని వెళ్తూనే ఉంటుంది.  అనుకున్నట్లుగానే సాయంకాలం నాలుగున్నర అవగానే రామారావు, సరోజ వాళ్ళింటివైపు బయలుదేరారు.  వాళ్ళింటికి చేరేసరికి దగ్గరదగ్గర ఐదుగంటలైంది. 

బైక్‌ని ఇంటివరండాలో ఉంచాడు రామారావు.  మాధవరావుగారు వాళ్ళకి ఇంటి వరండాలోనే ఎదురయ్యారు.  ఎవరికోసమో ఎదురుచూస్తూ ఆందోళనగా ఉన్నారు.  

"నమస్కారం అంకుల్!  ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు?" అన్నాడు రామారావు.

"రావయ్యా, నువ్వు ఇవాళ తప్పకుండా వస్తావని అనుకున్నాననుకో!  మొన్న రాత్రి నుండి మీ ఆంటికి ఎందుకో ఒంట్లో బాగులేదు.  ఇప్పుడే డాక్టర్‌కి కబురుచేసాను.  అతని కోసమే ఎదురుచూస్తున్నాను." అన్నారు మాధవయ్యగారు.

"పిన్నిగారికేమయింది బాబాయిగారు?" ఆదుర్దాగా అడిగింది సరోజ.

"ఎంటోనమ్మా! రెండుమూడు రోజులనుండి కొద్దిగా జ్వరం ఉండి నిన్ననే తగ్గింది.  అయితే ఏకాదశి అని ఇవాళ  ఉపవాసం కూడా ఉంది.  నేను వద్దన్నా వినలేదు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా జ్వరం వచ్చినట్లుంది.  నీరసంగా ఉందని అంది. అందుకే డాక్టర్ని రమ్మన్నాను." అన్నారు మాధవరావుగారు.

"అయ్యో!  అలానా!   అసలే పిన్నిగారికి డైబటీస్ ఉందికదా!  ఉపవాసం చేయకుడదు కదా బాబాయిగారూ, అలా చేస్తే షుగర్‌తగ్గిపోయి చాలా ప్రమాదం ఏర్పడుతుందికదా!" అంటూ కంగారుగా ఇంట్లోపలికి వెళ్ళింది సరోజ.

మాధవరావుగారు, రామారావు వీధిలోనే డాక్టర్‌కోసం ఎదురు చూస్తున్నారు. మాధవరావుగారు మరోసారి డాక్టర్‌కి  ఫోన్ చేసారు.

ఈ లోపున ఇంట్లోకెళ్ళిన సరోజ శారదమ్మగారి వద్దకు వెళ్ళింది.  మంచంమీద  మగతగా పడుకున్న శారదమ్మగారు సరోజ వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచారు.  ఆమెని చూస్తూనే దిగ్గున లేవబోయారు. 

"పిన్నిగారు!  లేవకండి, మీరు చాలా నీరసంగా ఉన్నారు.  మీకిలా ఒంట్లో బాగులేదని మాటవరసకైనా ఫోన్ చేసి చెప్పలేదే?" సరోజ ఆమె నుదిటిమీద చెయ్యవేసి జ్వరం ఎంతుందో అని చూడబోయింది.

"అమ్మాయీ...సరోజా! జ్వరం కాస్త తగ్గినట్లు ఉంది.  నీరసం మాత్రం ఎక్కువగా ఉంది." అంది మళ్ళీ లేవబోతూ.

"పిన్నిగారూ!  ఇవాళ మీరు ఉపవాసం ఉన్నారట, బాబాయిగారు చెప్పారు.  జ్వరం ఉన్నప్పటి నుండి భోజనం సరిగ్గా చేసి ఉండరు కూడా.  మీకసలే షుగర్.  మీరసలు ఉపవాసం ఉండకూడదు.  శరీరంలో చక్కెరతగ్గితే చాలా ప్రమాదం.  ఈ స్వీట్ కొద్దిగా తీసుకోండి, మీకు నీరసం కాస్త తగ్గుతుంది." అంది సరోజ తను తెచ్చిన బాక్స్‌నుండి స్వీట్స్ తీస్తూ.

"వద్దు!  అసలే నాకు డయబిటీస్!  అసలు స్వీట్స్ తినకూడదని డాక్టర్ చెప్పాడు.  అంతేకాక ఇవాళ ఉపవాసం కూడా!"  అన్నారావిడ ఆయాసపడిపోతూ.  అప్పటికే ఆమెకి చాలా నీరసంగా ఉంది, కళ్ళు మసకబారుతున్నాయి.

"ఉపవాసం ఉండటంవల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి.   అందులోనూ మీకు డైబటిస్ ఉంది.  పోనీ!  కొంచెం నిమ్మకాయరసం కలిపిన పంచదార నీళ్ళిస్తాను, కాదనకుండా తాగండి, లేకపోతే షుగర్‌లెవెల్ బాగా తగ్గిపోతుంది." అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళిందామె.  ఏ కళనున్నారో ఆమె పేచి పెట్టకుండా తాగారా నీళ్ళు. 

ఈ లోపున డాక్టర్ రావడంతో రామారావు, మాధవరావు కూడా ఇంట్లోకి వచ్చారు.  డాక్టర్ రఘురాం ఇంకా శారదమ్మని పరీక్షిస్తూండగానే ఆమెకి స్పృహ తప్పింది.   అప్పటివరకూ కూర్చున్న ఆమె మొదలు నరికిన చెట్టులా మంచంమీద కూలిపోయింది.  రఘురాం వెంటనే మాధవరావుతో, "ఆమె నాడి చాలా నీరసంగా కొట్టుకుంటోంది.  వెంటనే సరైన వైద్యం అందకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదముంది.  నా క్లినిక్‌లో సరైన సదుపాయంలేదు, అందుకే మీరు వెంటనే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి." అని సలహా ఇచ్చాడు.

అసలు ప్రాణాపాయ స్థితిలో కనబడ్డ శారదమ్మకి వైద్యం చేయడానికి రిస్క్ తీసుకోలేకే అతనా విధంగా చెప్పాడన్న సంగతి గ్రహించాడు రామారావు.

అతనలా అనగానే ఏం చేయాలో తోచక అందోళనతో సోఫాలో కూలబడిపోయారు మాధవరావుగారు. వెంటనే జరిగిన ఆ సంఘటనకి కలవర పడ్డారు రామారావు, సరోజ దంపతులు.  వాళ్ళిద్దర్నీ చూస్తూండమని సరోజకి చెప్పి గబగబ వీధిలోకి వెళ్ళి ఆటోని పిల్చాడు రామారావు.

ఆటో రాగానే ముందు శారదమ్మని పొరుగింటి అబ్బాయి సహాయం చేయగా వాళ్ళిద్దరూ ఆటోలో చేర్చారు.  మాధవరావుగారిని ఇంట్లోనే ఉండమని చెప్పి, అతన్ని పక్కింటి అబ్బాయికి చూస్తూండమని అప్పచెప్పి, ఆటోని త్వరగా హాస్పిటల్ వైపు పోనిమ్మని చెప్పాడు.  శారదమ్మ పరిస్థితి చూసి రామారావు, సరోజకి కూడా భయం కలిగింది.  ఆటో వెళ్తూనంతసేపూ ఆమె ఊపిరి ఆడుతుందో లేదోనని సరోజ భయపడసాగింది.  పైకి చెప్పలేదు కానీ, రామారావూకీ సందేహంగానే ఉంది.  మాటిమాటికీ ఆమె నాడి చూస్తున్నాడు.

శారదమ్మ పరిస్థితి చూడగానే కాజువాల్టీలోని డాక్టర్ వెంటనే స్పందించి ఆమెకి బెడ్ ఏర్పాటు చేసాడు.  శారదమ్మగారి ఫామిలీ డాక్టర్ ఇంతకు పూర్వం వాడమని ఇచ్చిన కాగితాలు, రిపోర్టులు కూడా డాక్టర్‌కి చూపించాడు రామారావు. 

కాజువాల్టీ డాక్టర్ ఆమెకి డ్రిప్ ఇచ్చి చికిత్స మొదలెట్టాడు.   శారదమ్మ ఊపిరి భారంగా తీస్తోంది.  కోమాలోకి వెళ్ళిపోయినట్లుంది. నాడి కూడా నీరసంగా కొట్టుకుంటోంది.  సరోజ అక్కడే ఆ బెడ్‌వద్దే నిలబడింది.  శారదమ్మ పరిస్థితి చూస్తూంటే ఆమెకి ఆందోళనగా ఉంది.  ఈ లోపు తన అక్కకి ఫోన్‌చేసి పరిస్థితి వివరించి తను రాలేనని చెప్పింది సరోజ.

ఈ లోపు బ్లడ్ టెస్ట్ చేసారు కూడా.  రిపోర్ట్ ఇంకా రావలసి ఉంది.  ప్రస్తుతం డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ చూస్తున్నాడు.  సరోజ ఆమెకి ఎలా ఉందని అడిగితే, "సమయానికి తీసుకువచ్చారు, కొంచెం ఆలస్యమయి ఉంటే మాత్రం పరిస్థితి మించిపోయి ఉండేది. రేపు ఉదయం బ్లడ్‌టెస్ట్ రిపోర్ట్ వస్తే ఏ విషయం తెలిసేది.  అప్పటికి సీనియర్ డాక్టర్ వస్తారు.  అయితే ప్రస్తుతం పరిస్థితి ఏం చెప్పలేం.  పేషంట్ కండీషన్ సీరియస్‌గానే ఉంది." అన్నాడు.

రామారావు కూడా డాక్టర్‌తో మాట్లాడి మాధవరావుకి ఫోన్ చేసాడు, "అంకుల్, మీరేం కంగారు పడకండి.  మేమిద్దరమూ ఈ రాత్రి ఇక్కడే హాస్పిటల్‌లోనే ఉంటాము.  ప్రస్తుతం ఆంటీకి బాగానే ఉంది.  మీరు రేపు ఉదయం వస్తే ఇక్కడికి సరిపోతుంది.  మీ ఆరోగ్యం జాగ్రత్త!" అని అతనికి ధైర్యం చెప్పాడు.  శారదమ్మ పరిస్థితి బాగులేదని అంటే కంగారు పడతారని వాస్తవం దాచిపెట్టి అతనికి ధైర్యం చెప్పాడు రామారావు.

"ఆ భగవంతుడే మిమ్మల్ని సమయానికి పంపించాడు.  మీ ఋణం ఎలా తీరుతుందో ఏమో! నేనొకణ్ణీ అయితే ఏం చేయాలో తెలియక భయపడేవాడిని." అన్నారు మాధవరావు గారు.

"మీరు మా తండ్రిలాంటివారు అంకుల్, అది మా బాధ్యత.  మీ అబ్బాయి శేఖరానికి కబురు చేసారా?" అడిగాడు రామారావు.

"ఆ దౌర్భా గ్యుడికి మా గురించి ఆలోచించే తీరికే లేదు.  ఇంతకు ముందోసారి ఇలా జరిగితే ఇంటికి రానేలేదు. ఇప్పుడు వాడిగురించి ఎందుకులే?" ఆవేశపడ్డారు మాధవరావుగారు.

"అంకుల్!  మీరు మరేం ఆలోచించకండి.  మేమున్నాం.  అంటీ త్వరలోనే మామూలు మనిషై ఇంటికి తిరిగి వస్తారు." మాట మార్చి అతనికి ధైర్యం చెప్పాడు రామారావు.

ఆ మరుసటి రోజు పది గంటలకి రౌండ్స్ మీద వచ్చిన డ్యూటీ డాక్టర్ చక్రధరరావు ఆమె రిపోర్ట్స్ చూసాడు.  అప్పటికే రక్త పరీక్ష రిపోర్టులు వచ్చాయి. అప్పటికింకా శారదమ్మకి తెలివి రాలేదు.  రాత్రంతా ఆమె మంచం పక్కనే జాగరణ చేసిన సరోజ డాక్టర్‌ని చూస్తూనే లేచి నిలబడింది.  అప్పటివరకూ రాత్రంతా నిద్రలేకుండా అక్కడే ఉన్న రామారావు అప్పుడే టీ తాగడానికి బయటకు వెళ్ళాడు.

శారదమ్మ బెడ్‌వద్దకు వచ్చిన డాక్టర్ ఆమెని పరీక్షించి, ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ చూసాడు.  అవి చూస్తూనే కంగారుపడి వెంటనే పక్కనున్న నర్సుని పిల్చాడు.

"ఓఁ మై గాడ్!...  ఈ పేషంట్‌కి సుగర్ బాగా డౌన్ అయిపోయింది.  ఆశ్చర్యం!  ఇంత తక్కువ ఉన్నా ఆమె ఇంకా బతికి ఉండటమే చాలా ఆశ్చర్యం.  వెంటనే ఆమెకి గ్లూకోజ్ ఎక్కించే ఏర్పాటు చేయండి, లేకపోతే చాలా ప్రమాదం." అని గబగబ ఆమెతో చెప్పి, "ఈ పేషంట్ తరఫు వాళ్ళెవరు?  ఏరీ?" అని ఆరా తీసాడు.

అది వింటూనే సరోజ ముందుకు వచ్చి డాక్టర్‌కి నమస్కరించింది.  బయటకు వెళ్ళిన రామారావు కూడా అప్పుడే తిరిగివచ్చాడు.

రామారావు డాక్టర్‌ని పలకరించగానే, "మీరేనా ఈ పేషంట్ తాలూకా?" అని అడిగాడు అతను.

రామారావు, సరోజ అవునని తల ఊపడంతో, "పేషంట్ బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్‌కన్నా చాలా తక్కువగా ఉంది.  ఆమె డైబటిస్ పేషంట్ కదా, షుగర్ లెవెల్ అంత తక్కువైతే ప్రాణానికే ముప్పని మీకు తెలియదా?  సరిగ్గా భోజనం లేకపోతేనే ఇలాంటి పరిస్థితి వస్తుంది.  ఈ సంగతి మీరు గమనించలేదా ఏమిటి?  గమనించినా పట్టించుకోలేదా! అసలు ఆమె మీతో కలసి ఉంటున్నారా, లేదా?"  అని ప్రశ్నించాడు.

"ఆమె మా వద్ద ఉండటం లేదు..." అని ఇంకా ఏదో అనబోయేంతలో,  డాక్టర్ చక్రధరరావు కోపంతో మండిపడ్డాడు, "ఏం మనుష్యులయ్యా మీరు?  చూస్తే బాగా చదువుకున్నవాళ్ళా, ఉద్యోగం చేస్తున్నవాళ్ళలా ఉన్నారు, పెద్దవాళ్ళని, అందునా తల్లిని ఎలా చూసుకోవాలో ఆ మాత్రం తెలియదటయ్యా?  వాళ్ళు సరిగ్గా తింటున్నారో, తాగుతున్నారో పట్టించుకోరా అసలు.  మనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని కని పెంచిన తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలయ్యా!  ఇప్పుడు చూడండి, ఆమెకి షుగర్ లెవల్ చాలా తగ్గిపోయింది, దానికి కారణం సరైన తిండి లేకపోవడమే! ఇంకా నయం ప్రాణం ఉంది, ఇలాంటి స్థితిలో అసలు ఎప్పుడో ప్రాణం పోవలసింది,  ఇలాంటి స్థితిలో హాస్పిటల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం నెపమంతా మా వైద్య సిబ్బంది మీదకి తోస్తారు.  ఆవిడ అదృష్టం బాగుండి మృత్యుముఖం నుండి బయటపడింది.   ఇకనైనా జాగ్రత్తగా చూడండి." అంటూ కోపంతో మండిపడ్డాడు, రామారావు చెప్పేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.  సరోజకి ఏమనాలో తెలియక డాక్టర్‌వైపే అలా చూస్తూ ఉండిపోయింది.

డాక్టర్ మళ్ళీ నర్స్‌ని పిలిచి ఏవో సూచనలిచ్చి ఇంకో బెడ్‌వైపు కదిలాడు.

కొద్ది సేపు తర్వాత రామారావు వెళ్ళి మాధవరావుగారిని తన బైక్‌పై తీసుకువచ్చేసరికి అప్పుడే తెలివి వచ్చింది శారదమ్మకి.  ఆమెకి తెలివి రాగానే రిలీఫ్‌గా నిట్టూర్చారు సరోజ, రామారావు. నీరసంగా కళ్ళు తెరిచిన ఆమెకి తనెక్కడున్నాదో తెలియలేదు ఒక్క క్షణం.  భార్యని ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్ళు ఉబికాయి మాధవరావుకి. "ఎలా ఉన్నావు శారదా?" అని కన్నీళ్ళు పెట్టుకొని ఆమె తలమీద తన చెయ్య వేసి నిమిరారు మాధవరావుగారు.  ఒక్కసారి పరిసరాలు చూసి, తన బెడ్ నాలుగువైపులా నిలబడిఉన్న భర్తని, రామారావు, సరోజని చూసి లేవబోతూ, "నేను...నేను ఎక్కడున్నాను?" అందామె కంగారుగా లేవబోతూ.

ఆమెని వారిస్తూ, "మీరు లేవకండి పిన్నిగారూ, మీకు ఒంట్లో బాగులేకపోవడం వల్ల ఆస్పత్రిలో ఉన్నారు." అంది సరోజ.

"లేదు, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను.  కాస్త నీరసంగా ఉందంతే!" అని మళ్ళీ లేవడానికి ప్రయత్నించి లేవలేక, "అమ్మా!" అంటూ మూలిగిందామె.

"మీరు లేవకండి.  విశ్రాంతి తీసుకోండి పిన్నిగారు.  రెండురోజుల్లో నయమైపోతే ఇంటికి తిరిగి వెళ్దాం. " అంది సరోజ.

ఈ లోపున అక్కడకి నర్స్ వచ్చి, "పేషంట్‌కి తెలివి వచ్చింది కదా!  ఇప్పుడు ఓ ఇంజెక్షన్ ఇవ్వాలి.  ఆమెకి విశ్రాంతి కూడా కావాలి.  మీరందరూ కొద్దిసేపు ఆమెని వదిలి బయటకి వెళ్ళండి." అంది.

ముగ్గురూ బయటకి వచ్చి కారిడర్లో కూర్చున్నారు.  రామారావు దంపతులు సరిగ్గా సమయానికి ఇంటికి వచ్చి చేసిన సహాయానికి మాధవరావు గారి గుండె కరిగిపోయింది.

"మీరిద్దరూ సమయానికి మా ఇంటికి దేవుళ్ళా వచ్చారు, లేకపోతే నా శారదా నాకు దక్కకపోను.  మీ ఋణం నెనెలా తీర్చుకోను?" అన్నారు మాధవరావుగారు గాద్గికంగా రామారావు చేతులు పట్టుకొని.

"ఛ!...అవేం మాటలు.  మీరు మాకు ఏవైనా పరాయివాళ్ళా ఏమిటి?  మీరు మా తల్లి తండ్రులవంటి వారు.  మనలో మనకి ఋణాలేంటి?" అంది సరోజ.

"అవును అంకుల్, మమ్మల్ని పరాయి వాళ్ళని భావించకండి." అన్నాడు మాధవరావుని అనునయిస్తూ.

"అవును, మీరు పరాయివాళ్ళెలా అవుతారు.  హుఁ...మా అబ్బాయి శేఖరూ ఉన్నాడు, కానీ వాడికి తల్లిని చూడటానికి ఈ పరిస్థితిలో కూడా తీరుబాటు లేదట!  స్వంత కొడుకైనా వాడే పరాయివాడి కింద లెక్క.  ఏం చేస్తాం?  మా తలరాత అలా ఉంది!" అన్నారు మాధవరావు గారు బాధపడుతూ.

"బాధపడకండి అంకుల్!  మీ అబ్బాయి మనసుకూడా ఏదో ఓ రోజున మారుతుంది." అన్నాడు ఓదారుస్తూ.

**** **** **** **** ****

రెండురోజుల్లో శారదమ్మగారు పూర్తిగా కోలుకున్నారు.  ఆ రోజు డిస్చార్జ్ చేస్తారనగా, పక్కింటివాళ్ళ నుండి కబురు అంది తల్లికి సీరియస్‌గా ఉందని తెలిసి  మాధవరావుగారి అబ్బాయి శేఖర్, కోడలు సురేఖ వచ్చారు ఆమెని చూడటానికి.  డిస్చార్జ్ చేసే సమయంలో మళ్ళీ ఆ డాక్టర్ చక్రధరరావే ఉన్నాడు.  అతను రామారావు, సరోజ వైపు చూస్తూ, "ఇకనైనా ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి.  ఆహారం, మందులు సరిగ్గా వేసుకునేట్లు చూడండి.  మనం ఎంత ఎదిగినా మన తల్లితండ్రులని దగ్గరుండి చూసుకోవాలి.  వాళ్ళ దీవెనలే మనకి శ్రీరామ రక్ష, ఏం తెలిసిందా!" అన్నాడు.

రామారావు దంపతులు ఏమీ మాట్లాడలేదు, కాని అక్కడే ఉన్న మాధవరావుగారు, "డాక్టర్ బాబూ!  వాళ్ళు మాకు చాలా దూరపు బంధువులు, తెలిసిన వాళ్ళు అంతే!  వాళ్ళు ఆ రోజు సరిగ్గా సమయానికి మా ఇంటికి రావడం వల్లనే నా భార్య ప్రాణాలు నిలబడ్డాయి.  నా కూతురులాంటి అమ్మాయి సరోజ, ఆ రోజు ఆమెకి బలవంతాన చక్కెర కలిపిన నీళ్ళు తాగించక పోయుంటే ఏమి జరిగిఉండేదో మరి ఆలోచించడానికే భయం వేస్తోంది! ఇదిగో వీడే మా అబ్బాయి శేఖర్, కోడలు." అని వాళ్ళని చూపించారు మాధవరావుగారు.

అది వినడంతో నివ్వెరపోయిన డాక్టర్ చక్రధరరావు రామారావు, సరోజవైపు తిరిగి, "సారీ, మీరు ఆవిడకి కొడుకు కోడలు అని అనుకున్నాను.  తల్లి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మందలించాను.  బహుశా, పేషంట్‌కి చక్కెర కలిపిన నీళ్ళు ఇవ్వడం వలన ఆ రోజు ఆమె ప్రాణం నిలిచి ఉండి ఉంటుంది.  అసలు నేను అన్న మాటలు ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది." అని అక్కడే నిలబడ్డ మాధవరావు కొడుకు కోడలు అయిన శేఖర్, సురేఖ వైపు చూసాడు.  అదివిని వాళ్ళిద్దరూ సిగ్గుతో తల వంచుకున్నారు.  రామారావు, సరోజ నిశ్శబ్దంగా చేతులు జోడించి డాక్టర్ చక్రధర్‌కి నమస్కరించారు.

మరిన్ని కథలు

sudhamudu
సుధాముడు
- యు.విజయశేఖర రెడ్డి
Crime - Punishment
నేరము - శిక్ష
- శ్రీమతి దినవహి సత్యవతి
Unworthy, unchangeable
అయోగ్యరావూ, మారేటట్టులేవు
- బుద్ధవరపు కామేశ్వరరావు
anna danam
అన్నదానం
- చెన్నూరి సుదర్శన్
The frog in the nut ...
నూతిలోని కప్పకి...!
- మీగడ.వీరభద్రస్వామి
Over time
' కాలంతో బాటు '
- మీనాక్షి శ్రీనివాస్
memory
మెమొరి
- ఎనుగంటి వేణుగోపాల్
Punishment for pride
గర్వా నికి శిక్ష
- నంద త్రి నా ధ రావు