సన్మానం - చెన్నూరి సుదర్శన్

honor

తెల్లవారుఝామున్నే లేచి తయారై హన్మకొండ బస్ స్టాండు నుండి బస్సులో బచ్చన్నపేటకు బయలు దేరాను.

నా తొమ్మిదేళ్ళ ప్రాయంలో మూడవ తరగతి వరకు చదువుకున్న బచ్చన్నపేట లోని బడిని చూడాలనే, నా చిరకాల కోరిక తీరబోతోందని.. మది ఉవ్విళ్ళూరసాగింది. అప్పట్లో మానాన్న అదే ఊళ్ళో పోలీసు ఉద్యోగం చేసే వాడు. నేను మూడవ తరగతిలో ఉండగా మానాన్నకు బదిలీ అయ్యింది. బచ్చన్నపేటను వీడాల్సి వచ్చింది. నా చదువు దృష్ట్యా హన్మకొండలో ఒక ఇల్లు కొనుక్కొని సెటిలయ్యాం. దాదాపు నలుబది సంవత్సరాల కింది మాట.

అర్థాంతరంగా నాన్న కాలంచెయ్యడం.. నాచదువు మధ్యలోనే ఆపేసి ఉద్యోగంలో చేరడం.. ఉద్యోగరీత్యా.. సర్వీసంతా ఇతర రాష్ట్రాలలోనే తిరగాల్సి రావడం.. మళ్ళీ నాకు నా బడిని చూసే భాగ్యం కలుగలేదు. మా అమ్మ, నా సతీమణి, ఇద్దరు పిల్లలు హన్మకొండలోనే ఉండేవారు. అమ్మ అనారోగ్యం దృష్ట్యా వాలంటరీ రిటైర్ మెంటు తీసుకొని నిన్నటి రోజే స్వస్థలానికి వచ్చాను. రాత్రంతా.. ఎప్పుడు తెల్లవారుతుందా..! ఎప్పుడు బచ్చన్న పేటలో వాలిపోదామా..! అని ఆలోచిస్తూ.. నిద్ర లేమితో గడిపాను.

బచ్చన్నపేటలో నా క్లాస్ మేట్స్ అనే కంటే మంచి మిత్రులని చెప్పాలి. వాళ్ళది అదే ఊరు. ఉన్నారో..! లేదో..! అని ఆలోచిస్తున్న నేను బస్సు ఆగడంతో తేరుకున్నాను. కిటికీ గుండా చూస్తే బచ్చన్నపేట. గాలిలో తేలిపోతూ.. బస్సుదిగాను.

బస్ స్టాఫ్ లో పెద్దగా మార్పు కనిపించలేదు. అదొక ‘వై’ జంక్షన్. బచ్చన్నపేట నుండి జనగాం, ఆలేరు ఇంకా సిద్దిపేట వెళ్ళొచ్చు.

బస్సు దిగి ఆతృతగా మాబడి వైపు దారి తీశాను. రోడ్డు ప్రక్కనే గ్రామ పంచాయితీ కార్యాలయం.. దాని ముందర చిన్న పార్కు.. అందులో గాంధీమహాత్ముని విగ్రహం.. రోడ్డుకిరువైపులా వేపచెట్లు.. అన్నీ అలాగే ఉన్నాయి. అల్లంత దూరంలో కనిపించే మాబడి ముందు విశాలమైన మైదానంలోనూ మార్పు లేదు. ఈకాలంలో గూడా ఆక్రమణకు గురి గాకపోవడం ఆశ్చర్యమేసి..చిన్నగా నాపెదవులపై చిరునవ్వు మొలచింది. ప్రతీ ఆదివారం ఆ మైదానంలో అంగడి(సంత) జరిగేది. అంతా మా బడి ప్రాంతాన్ని ’అంగడి బజారు’ అనే వారు. ఈరోజు ఆదివారమైనప్పటికీ సంత జరుగకపోవడం.. ఒక మార్పు కనిపించింది.

మైదానం చివర ఉన్న మాబడి చేరువైనా కొద్దీ నాలో ఉత్సాహం ఉరకలు వేయసాగింది. నాఅడుగుల వేగం మరింత పెరిగింది. బడి అరుగు ముందు ఆగి పరీక్షగా చూడసాగాను. సంక్రాంతి సెలవులనుకుంటాను.. బడికి తాళాలున్నాయి. దగ్గరకు వెళ్లి గోడలు తడుముతూ మురిసి పోయాను. అది పట్నంపెంకుటిల్లు. అందులో మధ్య హాలును తదకతో రెండు భాగాలు చేసి ఉంటాయి. ఒకటి ప్రధానోపాధ్యాయుని కోసం. మరొకటి ఉపాధ్యాయ బృదం కోసం. తడకకు క్యాలెండరు.. కాలనిర్ణయ పట్టికలు అతికేసి ఉండేవి. హాలుకు ఎడం ప్రక్కన నాల్గవ తరగతి గది.. కుడి ప్రక్కన ఐదవతరగతి గది.

ఐదవతరగతి అనగానే నాకు ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చింది.

రామచంద్రయ్య సారు ఐదవతరగతికి సాంఘీక పాఠం చెబుతూ.. నన్ను పిలిపించు కున్నాడు. నేను సారుకు నమస్కరిస్తూ.. అనుమతి తీసుకొని తరగతి గదిలో అడుగు పెట్టాను. అప్పటికే పిల్లలంతా నిలబడి ఉన్నారు.

“సురేంద్రా..! దిక్కులు ఎన్ని? అవేవో చూపించు అలాగే మూలాలు గూడా..” అని అడిగాడు. నేను వెంటనే తడుముకోకుండా కిటికీ గుండా ప్రసరిస్తున్న సూర్యుని కిరణాల కెదురుగా ముఖంపెట్టి నిలబడ్డాను. నాలుగు దిక్కులు నాలుగు మూలలు చూపించాను.

“భేష్ సురేంద్రా.. నిలబద్దవారి ముక్కు పట్టుకుని లెంప దెబ్బలు వాయించు” కళ్ళద్దాలు సర్దుకుంటూ ఆదేశించాడు. నేను కాస్త తటపటాయించాను. సారు ధైర్యం చెప్పి నాచేత అందరినీ కొట్టించాడు. ఆనాటి నుండి నాలో చదువుమీద మరింత శ్రద్ధ పెరిగింది. అలా చెంపదెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దని.

ఇక మా చిన్నతరగతులు ఒకటి నుండి మూడు వరకు దీని వెనకాల పూరిగుడిసేలో ఉంటాయి. నా మనసు నా ఆధీనంలో లేదు. గబ, గబా వెనుకకు పరుగెత్తాను. అక్కడి దృశ్యం చూడగానే అప్రయత్నంగా నాకళ్ళల్లో నీళ్ళు నిండు కున్నాయి. కళ్ళు తుడ్చుకుంటూ తేరిపారగా చూడసాగాను. ఎదలో నుండి దుఃఖం తన్నుకు రాసాగింది. గుడిసె శిథిలావస్థలో.. మోకాలేత్తు మొండి గోడలే సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. అవి నన్ను చూసి రోదిస్తున్నట్లు గోచరించింది. ఆగలేక పోయాను. దగ్గిరకి వెళ్లి వానిని ప్రేమగా ఒడార్చుతున్నట్టు స్పృశిస్తూ.. అమాంతం హత్తుకున్నాను. నా పిచ్చిగానీ సిమెంటుతో కట్టిన ఇండ్లకే దిక్కు లేదు.. ఇక మట్టిగోడలతో కట్టిన గుడిసె ఎన్నాళ్ళు ఉంటుందని నాకు నేనే ఉపశమన వాక్యాలు చెప్పుకున్నాను.

మా బడి వెనకాల ఖాళీ స్థలంలో కూరగాయలు పండించే వాళ్ళం. తోటపని కోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్ ఉండేది. అన్నీ నా స్మృతిపథంలో కదలాడసాగాయి.

నేను గోడలతో మాట్లాడుతూండడం గమనించాడేమో..! ఒకతను దగ్గరికి వచ్చి నన్ను వీపు తట్టేసరికి ఈలోకానికి వచ్చాను. అతనిదీ సుమారుగా నావయసే. చెలిమల్లో నీళ్ళూరిన చందాన నాకళ్ళను చూస్తూ..

“నాది ఈఊరే.. మేదేఊరు” అంటూ ఆప్యాయంగా పలుకరించాడు. ఊళ్ళల్లో ఇంకా మనుషుల మధ్య హార్దిక సంబధాలు పరిమళిస్తున్నందుకు సంతోషంలో మాట పెకల లేదు.

“నేను ఈబడిలో మూడవ తరగతి వరకు చదువుకున్నాను” గద్గగ స్వరంతో అన్నాను. అతను మరఓ మారు నావీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. కొంచెం సాంత్వన కలిగింది.

అతనికి నామిత్రుల సంగతి తెలిసి ఉంటుందాని గొంతు సవరించుకుని మాటలు కదిపాను.

“నాతోబాటుగా ఈ ఊరి గుర్రం బాలరాజు, కొత్తపల్లి రాజయ్యలు కూడా ఇదే బడిలో చదువుకున్నారు. మీకేమైనా తెలుసా” అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాను.

అతను తెలుసనేసరికి నా మనసు గాలిపటంలా రివ్వున ఎగిరింది.

“బాలరాజు హిందీ పండితుడయ్యాడు. ఇప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. బాలరాజు బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం..తల్లి చేనేత మగ్గం నేస్తూ చదివించడం.. మీకు తెలుసనుకుంటాను. బాలరాజు చెల్లెలు పెళ్ళయి అత్తారింటికి పంపాక, తల్లిని తన వద్దకే తీసుకెళ్ళాడు. ఆమె అప్పుడప్పుడు వచ్చి ఇల్లును చూసుకుని వెళ్ళేది. పాపం..! ఈ మధ్యనే ఆమె అక్కడే పోయిందట, బాలరాజు వచ్చి ఇల్లు కొత్తపల్లి రాజయ్యకు అమ్మేసి వెళ్ళాడు”

ఇల్లు అమ్మడమనే మాట వినగానే నా ఆలోచనలకు చిగుళ్ళు తొడిగాయి. అతను చెప్పుకుంటూ వెళ్తున్నాడు.

“రాజయ్య ఈ ఊళ్ళో పెద్ద షావుకారు. కిరాణం దుకాణముంది. దాన్ని అతని భార్య చూసుకుంటుంది. రాజయ్యేమో.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. పాత ఇండ్లు, ప్లాట్లు కొనడం, అమ్మడం.. ఇండ్లు కట్టివ్వడం..” అంటూ.. నన్ను మైదానంలోకి తీసుకెళ్ళాడు. దూరంగా ఆలేరు రోడ్డుకవతలి వైపు గుమ్మడి పువ్వు రంగున్న పెద్ద భవంతిని చూపిస్తూ అదే రాజయ్య ఇల్లన్నాడు. నాకు ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. అతనికి రెండు చేతులా నమస్కరించి రాజయ్య ఇంటికి కదిలాను.

ఘళ్ళు, ఘళ్ళు మని శబ్దం చేసుకుంటూ ఒక ఎద్దుల బండి ఎదురయ్యింది. ఎద్దుల మెడలోని గంటలు వాటి నడకకు లయబద్దంగా మ్రోగుతున్నాయి. వెంటనే నాకు సంక్రాంతి వైభవం స్ఫురణకు వచ్చింది. సంక్రాంతి పండుగ నాడు ఇదే మైదానంలో ఎడ్లబండ్ల పందాలు జరిగేవి. మొదటగా పోటీలో పాల్గొనే బండ్లన్నీ ఊళ్ళో ఉన్న ఆంజనేయస్వామి గుడివద్దకు చేరేవి. పోటీదారులు బండ్లపై నిలబడి చేర్నాకోలను గాలిలో ఊపుకుంటూ..”జై ఆంజనేయా.. వీరాంజనేయా,.” అంటూ నినాదాలిచ్చుకుం

టూ.. ఐదు ప్రదక్షిణలు చేసి మైదానం చేరుకునేవారు.. ఆ తరువాత ఊరి సర్పంచ్ పోటీలను ప్రారంభించే వాడు. ఆరాత్రి ‘వందే మాతరం’ ప్రార్థనతో ప్రారంభమయ్యే కార్యక్రమాలలో ముందుగా డప్పు కళాకారుల వాయిద్యాల హోరు మిన్నంటేది. ఆతరువాత ఏకాంకిక నాటికల పోటీలు ప్రదర్శించే వారు. చివరన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు పంచడంతో.. కార్యక్రమాలన్నీ ‘జనగణ మణ’ జాతీయగీతంతో ముగిసేవి,

ఒకసారి రామచంద్రయ్య సారు నన్ను తెనాలి రామలింగ కవి వేషం వేయించాడు. నా క్లాసు మేట్ శాంత కాళికాదేవి వేషం వేసింది. రామచంద్రయ్య సారు సొంతూరు బచ్చన్నపేట కావడం.. ఎక్కువ సమయం బడికే వెచ్చించే వాడు. అందుకే అతనంటే అందరికీ వల్లమానిన అభిమానం. అవన్నీ గుర్తుకు వచ్చి నా మనసు దూది పింజంలా గాలిలో తేలి ఆడసాగింది. ఎడ్లబండి మరీ దగ్గరకు రావడంతో తెప్పరిల్లి బండిని ఆపుమంటూ సైగజేసి.. విషయం ఆరాతీశాను.

అతను పకాలున నవ్వుతూ నన్ను ముందుగా ఆశ్చర్యంగా చూశాడు. “అవన్నీ ఆపాత సర్పంచి జమానాలో నడ్చినై సారూ. ఆయన పోయిండు. ఆయనతోనే అన్నీ పోయినై. అంగడి, ఎడ్ల పందాలు గంగల కల్సినై” అనుకుంటూ ఎడ్లను అదిలించుకుని ముందుకు సాగి పోయాడు. నా మనసు చివుక్కుమంది. వెనకకు తిరిగి, తిరిగి ఎడ్ల బండిని చూసుకుంటూ, చూసుకుంటూ.. రాజయ్య ఇంటికి చేరుకున్నాను.

రాజయ్యది పెద్ద డాబా ఇల్లు. రోడ్డు చూపుకు కిరాణా దుకాణం.. దానికానుకుని చిన్న గేటు. ఇంట్లోకి దారి అనుకుంటాను. నేను దుకాణం ముందుకు వెళ్ళగానే..”ఏం కావాలి సారూ” అంటూ అడిగింది. రాజయ్య భార్య అనుకున్నాను.

“నమస్కారమమ్మా.. రాజయ్య కోసం వచ్చాను” అంటూ వినయంగా చెప్పాను.

“మీపేరు”ప్రశ్నించింది.చెప్పాను. అది వినగానే.. ”నమస్తే సురేంద్రా.. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకూ” అంటూ ఒక్క అంగలో బయటికి వచ్చాడు రాజయ్య. నేను సులభంగానే పోల్చుకున్నాను. అతనికి అప్పుడు జానెడు పిలక, పిలక చివర ముడి ఉండేది. ఇప్పుడది లేదు.

నన్ను చూడకుండానే ఎలా గుర్తు పట్టావు రాజయ్యా..! “ అంటూ ఆశ్చర్యంగా అడిగాను. అతని సమాధానం నన్ను మరింత విస్మయానికి గురి చేసింది.

“సురేంద్ర అనే పేరు గలిగిన ఒకే ఒక స్నేహితుడివి.నువ్వు. పోలీసైన కొడుకువి. నిన్నూ,, నీ పేరును ఈ జన్మలో మర్చిపోతానా..!”

అప్రయత్నంగా మా ఇరువురి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంగా హత్తుకున్నాము.

“రామచంద్రయ్య సారు ఎలా ఉన్నాడు? మన బాలరాజు ముంబాయిలో ఉంటున్నట్లు తెలిసింది. ఫోన్ నంబరివ్వు ” అంటూ ఆత్రుతగా ప్రశ్నల వర్షం కురిపించాను.

“నేను చెప్పడమెందుకు.. మనమే వెళ్లి సారును చూసొద్దాం” అంటూ తన సతీమణికి నన్ను పరిచయం చేశాడు. ఆమె సవినయంగా నమస్కరించింది. నేనూ ప్రతినమస్కారం చేశాను.

బాలరాజు కాంటాక్ట్ నంబరు నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను.

ఇరువురం కబుర్లు చెప్పుకుంటూ తేనీరు సేవించి బయటపడ్డాం.

“రామచంద్రయ్య సారు ఇల్లు ఊరి చివర శివాలయం దగ్గర.. గుర్తుందా..నేరుగా అక్కడికే వెళ్దాం“ అంటూ టూ వీలర్ బండి తీయబోయాడు. నేను వారించాను.

“ఊరంతా నడుచుకుంటూ తిరిగితే కలిగే ఆనందం బండి మీద తిరిగితే రాదు రాజయ్యా”

“నిజమే.. నీ ఇష్టం” అంటూ నాతొ ఏకీభవించాడు.

మేము వెళ్లేసరికి రామచంద్రయ్య సారు ఇంట్లోనే ఉన్నాడు. అవే రూపు రేఖలు.. కాకపొతే వృద్ధాప్యం మూలాన ముఖంమ్మీద ముడుతలు. నుదుటి ముదతల్లో తీర్చి దిద్దిన నామం.. కళ్ళజోడు.. తెల్లని ధోవతీ.. లాల్చీ.. సులభంగా పోల్చుకున్నాను.

“నమస్కారం సార్” అంటూ రాజయ్యా, నేను ఒకే సారి నమస్కరించే సరికి సారు తలెత్తి, కళ్ళజోడు సర్దుకుంటూ.. రాజయ్యను గుర్తుపట్టాడు. కాని నావంక ఆశ్చర్యంగా చూదసాగాడు.

నేను పరిచయం చేసుకున్నాను. ఆనాడు నేను పిల్లలను కొట్టిన లెంపదెబ్బలు గుర్తు చేశాను. సారు చిరునవ్వు నన్ను గుర్తించినట్లుగా కనబడింది.వెంటనే నేను సారు పాదాలను తాకి కళ్ళకద్దుకున్నాను.

నావివరాలన్నీ అడిగి తెలుసుకుని చాలా సంతోషించాడు. తన ఒక్కగానొక్క కొడుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ.. తన దారి తాను చూసుకున్నాడని చెబుతుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. తన కథ అంతా తెలుసన్నట్లుగా రాజయ్యను చూపించాడు. అయినా ‘గదప లోపలి సుఖం కాశికి పోయినా దొరకద’ నే సామెత వివరిస్తుంటే సారు నాకు గతంలో చెప్పిన పాఠాలే గుర్తుకు రాసాగాయి. కాసేపు మనసు విప్పి మాట్లాడుకుని మళ్ళీ కలుస్తామని శెలవు తీసుకున్నాము.

అక్కడి నుండి గ్రామ సర్పంచి ఇంటికి వెళ్లాం. అతను ఊరెళ్ళాడని తెలుసుకొని కాస్త నిరుత్సాహపడ్డాను. ఊరంతా తిరుగుతూ.. గత జ్ఞాపకాలను వల్లె వేసుకుంటూ.. రాజయ్య ఇంటికి చేరుకున్నాం.

భోజన సమయంలో నాముందు విస్తరి వేయగానే నాకు గతం గుర్తుకు వచ్చింది. ఒక సారి రాజయ్య ఇంట్లో భోజనం చేశాను. లేచి చెయ్యి కడుక్కోబోతుంటే.. రాజయ్య నాన్న “తిన్న విస్తరి తీసి ఇంటి వెనకాల చెత్తకుప్పలో వేయి బాబు “ అని పురమాయించాడు. ఈ రోజు కూడా భోజనం కాగానే విస్తరి తీయబోయాను. రాజయ్య వద్దని వారిస్తూ “నీకు ఇంకా గుర్తుందా సురేందర్. ఆ రోజు మానాన్న చాదస్తంతో విస్తరి తియ్యమన్నాడు. ఇప్పుదు అటువంటి పట్టింపులేవీ లేవు” అంటూ నవ్వాడు. నేనూ అతని నవ్వులో శృతికలిపాను.

వాలు కుర్చీలో సేద తీర్చుకుంటూ బాలరాజుకు ఫోన్ చెయ్యమన్నాను. నేను ఫోన్ చేస్తే తీస్తాడో లేదో..! అనే అనుమానంతో..

రాజయ్య నాకెదురుగా మరో కుర్చీలో కూర్చొని బాలరాజుకు ఫోన్ చేసి నా గురించి చెప్తుంటే నన్ను గుర్తుపట్టినట్లు వారి సంభాషణ రాజయ్య ముఖకవళికలద్వారా అర్థం చేసుకున్నాను. రాజయ్య ఫోన్ నాకిచ్చాడు. నేను ఉద్వేగభరితంగా మాట్లాదసాగాను. అవతల బాలరాజు పరిస్థితీ అదే. నా మదిలో స్థిరపడ్డ ఆనాటి అతని ముఖమే ఫోనులో కనబడసాగింది. దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నాం. నా ఆనంద భాష్పాలు చూసి రాజయ్య నా వీపు నిమురసాగాడు. ఫోను పెట్టేసినా నా మనసు చాలా సేపటి గాని స్థిమిత పడలేదు.

కాసిన్ని మంచినీళ్ళు త్రాగి నామనసులోని రెండు కోరికలను రాజయ్య ముందుంచాను. రాజయ్య విని నిర్ఘాంత పోయాడు. నాలాంటి పిచ్చివాణ్ణి ఇంతవరకు చూడలేదనుకున్నాడో..! ఏమో..! మొదట నమ్మలేదు. నేను వెంటనే చెక్కు బుక్ తీసి పది లక్షలకు రాజయ్య పేర వ్రాసి చెక్కు చేతికిస్తూ..

“రాజయ్యా.. మొదట మనం చదివిన బడి గుడిసె స్థానంలో యోగ్యమైన భవనం కట్టించు. ఇది కేవలం అడ్వాన్సు మాత్రమే. ఇక రెండవ కోరిక .. రాబోయే సంక్రాంతి పండుగ ఎడ్ల పందాలతో పూర్వ వైభావం తెప్పించే బాధ్యత నీ మీద మోపుతున్నాను. సర్పంచ్ ను కలిసి ఏర్పాట్లు చేయించు. దానికయ్యే ఖర్చులు గూడా నేనే భరిస్తాను” అంటూ భరోసా ఇచ్చాను.

చెక్కు కండ్లకద్దుకున్నాడు రాజయ్య. రాబోయే సంక్రాంతి వరకు రెండు కోరికలూ తీరుస్తాను” అని నా చేతిలో చెయ్యేసి చెప్పాడు. నామనసు కాస్త తెలిక పడింది.

***

రాజయ్య మాట తప్పలేదు.

బడి భవనం పూర్తయ్యిందని.. నేను చెప్పినట్లుగానే అదనంగా మరొక హాలో గ్రంధాలయం కోసం కట్టించానని.. సంక్రాంతి వేడుకలకు రావాలంటూ.. గ్రామ సర్పంచి ద్వారా ఆహ్వాన పత్రికను వాట్సాప్ లో పోస్ట్ చేయించాడు రాజయ్య.

రాజయ్య ప్రత్యేకఆహ్వానం మేరకు ఒక రోజు ముందుగానే వెళ్లాం. మా అమ్మ శాంతమ్మను చూసి ఇంటిల్లిపాది చాలా సంతోషించారు, నా సతీమణి సరోజను.. ఇద్దరు పిల్లలతో రాజయ్య ఇల్లంతా సందడి.. నిజమైన సంక్రాంతి పందుగా వేడుక అని రాజయ్య దంపతులిరువురు ఎంతగానో పొంగి పోయారు.

అకస్మాత్తుగా బాలరాజు కనబడి నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేశాడు.

“సర్ ప్రైజ్ ఇద్దామని నీకు బాలరాజు వచ్చినట్లు చెప్పలేదు” అన్నాడు రాజయ్య చిరునవ్వు నవ్వుతూ. ముగ్గురం కలిసి పెనవేసుకున్నాం. మా స్నేహబంధాన్ని చూసి అమ్మ ఎంతగానో మురిసిపోయింది.

రాజయ్య, బాలరాజు, నేను కలిసి ముందుగా మాబడి నూతన భవనానం, గ్రంధాలయం చూడ్డానికి బయలు దేరాం.

వాడి, వాడిగా నడవడంలో.. నా నడకలో మార్పు గమనించి ఆశ్చర్యపోతూ అడిగాడు రాజయ్య.

అప్పుడు నిజం చెప్పక తప్పింది కాదు. విని నిర్ఘాంత పోయారిద్దరూ.. బాలరాజు అమాంతం నన్ను కౌగిలింకుంటూ..”నీలాంటి స్నేహితుడున్నందుకు చాలా గర్వంగా వుంది సురేంద్రా..” అంటూ కంటనీరు పెట్టుకున్నాడు బాలరాజు. రాజయ్య కళ్ళూ చెమ్మగిల్లాయి.

రాజయ్య పనితనం నన్ను అబ్బురపర్చింది. భవన నిర్మాణాలు నా ఊహకందకుండా మహా అద్భుతంగా ఉన్నాయి. రాజయ్యను ప్రశంసలతో ముంచెత్తాను.

రాజయ్యను, సర్పంచిని ఇంకా రామచంద్రయ్య సారును రేపు వేదికపై సన్మానించాలని మనసులో అనుకున్నాను.

***

ఆమరునాడు సంక్రాంతి పండుగ.

ఊరి నిండా తోరణాలు.. ఊరి జనం మదిలోని ఉత్సాహ తరంగాల్లా ఊగుతున్నాయి.

ఉదయం.. ఊరి పెద్దల కరతాళధ్వనుల మధ్య రామచంద్రయ్య సారు మాబడిని, సర్పంచి గ్రంధాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు.

సాయంత్రం ఎడ్లబండి పోటీలు కన్నుల పండువగా జరిగాయి.

మైదానంలో వేదికను అత్యంత సుందరంగా అలంకరించారు. మైదానమంతా జనంతో నిండి పోయింది. ఇసుక జల్లితే కింద రాలనంత జనం.. జనం..

ముందుగా సాంస్కృతిక కార్యకరమాలు ఆరంభమయ్యాయి. కళాకారుల డప్పులు.. వాయిద్యాలు వీనుల విందుగా మ్రోగాయి. ఆ తరువాత రెండు ఏకాంకిక నాటికల ప్రదర్శనలు నేటి యువతరాన్ని తట్టి లేపాయి. తిలకిస్తున్న జనుల కళ్ళల్లో పూర్వం నేను చూసిన ఆనంద రేఖలు, మిన్నంటే వారి కరతాళ ధ్వనులు నా మనసుకు కాస్త తృప్తినిచ్చాయి.

సర్పంచి అద్యక్షతన సభ ఆరంభమయ్యింది. రాజ్య, బాలరాజులతో సహా పెద్దలంతా వేదికనలంక రించారు. ముందుగా బహుమతుల ప్రదానం జరిగింది. ప్రతీ సంవత్సరం ఇలాగే ఈ వైభవం కొనసాగిస్తానని సర్పంచితో ప్రకటన చేయించాను. జనంలో హర్షాతి రేఖలు వెల్లి విరిశాయి.

రామచంద్రయ్య సారు ముఖ్య అతిధిగా మాట్లాడుతూ.. “నిద్రావస్థలో ఉన్న మన గ్రామాన్ని నేటి ఉత్సవాలతో తట్టి లేపిన సురేంద్ర నాశిష్యుడు అయినందుకు నేనెంతగానో గర్విస్తున్నాను” అనగానే సభలో చప్పట్లు మారుమ్రోగాయి. సురేంద్రకు నేను మూడో తరగతి వరకు పాఠాలు చెప్పిన భాగ్యానికి నన్ను సన్మానిస్తాడని తెలిసింది. శిష్యుడు ఒక గురువును సన్మానించడం సాధారణ విషయం. కాని సురేంద్ర మామూలు మనిషి కాదు. అపర భగీరధుడు. కార్యం సిద్ధించే వరకు వదలదు. భగీరథుడు నీళ్ళ కోసమైతే మన సురేంద్ర మనబడి కోసం.

కన్నతల్లిడంద్రులను కాలదన్ని పోయే కొడుకులున్న ఈకాలంలో తాను చదువుకున్న బడిగుడిసె కూలిపోవడం చూసి తల్లడిల్లాడు. తాను పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులన్నీ బడికే ఖర్చు చేశాడు. అయితే మధ్యలో ఒక ఊహించని సంఘటన జరిగింది” అనగానే సభ యావత్తు నిశ్శబ్దమయమయ్యింది. సారూ కాసేపాగి తిరిగి చెప్పసాగాడు.

“సురేంద్ర గత సంవత్సరం మన ఊరికి వచ్చి బడి నిర్మాణ పనులు రాజయ్యకప్పగింఛి వెళ్తుంటే బస్సు ప్రమాదానికి గురయ్యాడు. కొన్నాళ్ళు కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. అయినా మాబడి నిర్మాణం ఆగిపోకుండా.. డబ్బులు పంపడం ఆపలేదు. ఎలా పంపగలిగాడో..! ఆ భగవంతునికే తెలియాలి. అలాంటి మహాను భావున్ని గన్న శాంతమ్మ ధన్యురాలు” సభలో మరో మారు చప్పట్లు మ్రోగాయి. రామచంద్రయ్య సారు ప్రసంగం ఆపలేదు. చప్పట్ల మధ్యలో ఒక ప్రకటన చేశాడు.

“ఇలాంటి సందర్భంలో నేను గురువుగా.. నా శిష్యుడైన సురేంద్రను సన్మానిస్తాను” అనగానే సభలో మళ్ళీ చప్పట్లు దద్దరిల్లాయి.

సురేంద్ర స్పందిస్తూ..”వాస్తవానికి ఈ యజ్ఞంలో అజ్ఞాతంగా మా అమ్మ శాంతమ్మగారు కూడా పాలుపంచుకున్నారు. ఇంతకుముందు రామచంద్రయ్య సారు ఎలా డబ్బు సర్దాడో ఆభగవంతునికే తెలియాలి అన్నారు. ఆభగవంతుడు ఎవరో కాదు. ఆరూపంలో ఉన్న మా అమ్మ. నేను మంచానికి పరిమితమై బాధపడుతుంటే నన్ను ఓదార్చుతూ నా బాధను అడిగి తెలుసుకుంది. ఆ పనిని ఇక నాకు వదిలేయి.. నేను చూసుకుంటాను అంది. ఆమె నాకు తెలియకుండా తన ఒంటి మీది నగలన్నీ అమ్మి బడికి, గ్రంధాలయానికి డబ్బు సర్దుబాటు చేసింది. అలాంటి మాతృమూర్తిని సన్మానించుకుందాం” అంటుంటే సురేంద్ర కళ్ళు చెమర్చాయి.

సభ కరతాళ ధ్వనులమధ్య, శాంతమ్మ సన్మాన కార్యక్రమం ఆరంభమయ్యింది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి