కరోనా దెబ్బ! - పద్మావతి దివాకర్ల

corona blow!

ఉదయం ఆరుగంటలకే పాలవాడు రంగన్న వచ్చి పాలపేకట్లు ఇంటిగుమ్మం వద్ద ఉంచి అక్కడే నిలబడ్డాడు. పాలపేకట్లు తీసుకెళ్ళడానికి బయటకు వచ్చిన భార్గవికి గుర్తు వచ్చింది గత నెల డబ్బులింకా అతనికి ఇవ్వలేదని.

"కొద్దిసేపు ఉండు రంగన్నా! గతనెల డబ్బులు తీసుకుందువుగాని." అని లోపలికి వెళ్ళబోయిందామె.

"వద్దు అమ్మగారూ! డబ్బులు ఇవ్వద్దు. గూగుల్‌పే ద్వారా కాని, ఫోన్‌పే ద్వారా కాని డబ్బులు పంపండి. నా నంబర్ మీకు ఇస్తాను. అది చెప్పడానికే నిలబడ్డాను." అన్నాడు రంగన్న.

"ఆఁ.." ఆశ్చర్యంగా అందామె. క్రితం నెలవరకూ ఇంటికి వచ్చి తనకి రావలసిన డబ్బులు నగదు రూపంలో వసూలు చేసుకునే రంగన్నఇప్పుడు ఇలా అనేసరికి భార్గవి కొంత ఆశ్చర్యానికి లోనయ్యింది. నోట్లు, చిల్లరవల్ల కరోనా సోకుతుందేమోనన్న కారణాన రంగన్న నగదు తీసుకోవడానికి జంకాడని గ్రహించిందామె. పాలపేకట్లు అందిస్తూ అందరింటికి వెళ్తాడాయె! అంతమంది ఇంటికి నిత్యం వెళ్ళే అతనికి ఎవరి నుండైనా కరోనా సోకవచ్చేమోనన్న భయం అతనిది. అంతేకాక, ఏ ఒక్కరినుండి అతనికి కరోనా సోకినా అది పదిమందికీ పాకుతుందన్న జాగ్రత్త కూడా అందులో ఉంది. చేతిలో ఉన్న నగదు ఖర్చైపోతే మళ్ళీ ఏటిఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలన్న భయం భార్గవిది! ఏటిఎంకి వెళ్ళాలంటే అదో పెద్ద తతంగం. ఏటిఎం ద్వారా కూడా కరోనా ఒకరినుండొకరికి సోకవచ్చుకూడా. అక్కడికి వెళ్ళినప్పుడల్లా శానిటైజర్ తీసుకెళ్ళడం, దానితో చేతులు కడుక్కోవడం తప్పనిసరి. అందుకే ఇదీ ఒకందుకు మంచిదేనని భావించి రంగన్నకి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపింది.

తర్వాత పాలపేకట్లను ఇంటి గుమ్మం వద్ద ఉంచిన బకెట్‌లోని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆనక శానిటైజర్‌తో చేతులు కడుక్కొని అవి ఇంట్లోకి తీసుకు వచ్చింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఆ మాత్రం జాగ్రత్త కావాలి మరి! పూర్వంకన్నా ఇప్పుడు కరోనా చాలా త్వరిత గతిన వ్యాపిస్తున్నందువల్ల అందర్లోనూ జాగ్రత్త ఎక్కువైంది.

వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగైతే చూసింది. ఇంటి యజమాని‌ పరంధామయ్యది. ఫోన్ భర్తకి ఇచ్చింది. ఆనంద్ ఫోనెత్తి, "నమస్కారమండీ, ఇంటి అద్దె ఇవ్వాలని మీ ఇంటికి ఇప్పుడే బయలుదేరుతున్నానండీ. ఇంతలోనే మీరు ఫోన్ చేసారు." అన్నాడు.

"వద్దు వద్దు!..." కంగారుగా అన్నాడు పరంధామయ్య, "ఇంటికి రావద్దు. అందుకే మీకు ఫోన్ చేసాను. నా బ్యాంక్ అకౌంట్‌నంబర్ మీకు పంపుతాను. నెట్‌బ్యాంకింగ్ ద్వారా పంపండి డబ్బుల్ని. అసలే కరోనా కాలం కదా! మీరు కూడా బయటకు రావద్దు." అన్నాడు.

"అలాగేనండీ!" అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు ఆనంద్ మనసులో. తను వాళ్ళింటికి వెళ్తే ఏం ప్రమాదం తెస్తాడో అని ఒకవైపు, నగదు తీసుకుంటే దానిద్వారా కరోనా ఎక్కడ సోకుతుందోనని భయం మరోవైపు అతన్ని ఆ మాటలనిపించిందని భావించాడు. ఇంటి అద్దెపై ఆదాయపు పన్ను తప్పించుకోవడానికి ఇంట్లో దిగుతున్నప్పుడు అద్దె నగదు రూపంలో మాత్రమే ఇవ్వాలన్న నిబంధన పెట్టిన పరంధామయ్య ఇప్పుడు ఇలా మాట్లాడటం విడ్డూరంగా తోచింది ఆనంద్‌కి. అవును మరి, కరోనా అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు? పరంధామయ్యకూడా అందుకు మినహాయింపు కాదు మరి! కరెన్సీ, కరోనా రెండూ ఒకటైతే ఇంక చెప్పేదేముంది? ప్రాణం కంటే నల్లడబ్బు ఎక్కువేం కాదుకదా! కరోనా దెబ్బకి కరెన్సీ విలవిల లాడుతోంది మరి!

భార్యతో విషయం చెప్పి ఇంటద్దె డబ్బులు పరంధామయ్యకి పంపాడు.

"అమ్మయ్య! పరంధామయ్య ఇంటికెళ్ళే పని తప్పింది. కూరలు తేవడం కోసం మాత్రం బజారుకెళ్ళక తప్పదు కదా! సంచి, డబ్బులు ఇవ్వు, బయలుదేరుతాను." అన్నాడు ఆనంద్.

"కరోనా విజృంభిస్తున్న వేళ, మళ్ళీ ఎప్పుడు లాక్‌డౌన్ ప్రకటిస్తారో ఏమో, ఎందుకైనా మంచిది కాస్త ఎక్కువ కూరలే తెండి." అంది భార్గవి సంచి, డబ్బులు అందిస్తూ.

ముఖానికి మాస్క్ కట్టుకొని, భౌతికదూరాన్ని పాటించేందుకు గొడుగు చేతపట్టుకొని, శానిటైజర్ జేబులో వేసుకొని బయలుదేరాడు. కూరల బజారుకెళ్ళి తనకు తెలిసిన కూరల దుకాణంలో కూరలు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి పర్సు తీసాడు. అప్పుడే కూరలు కొన్న ఒకతను డబ్బులు ఇవ్వబోతుంటే నిరాకరించి పేటిఎం ద్వారా పంపమన్నాడు కూరల షాపతను. ఆ కూరలు కొన్నతను అలా చేయలేక తను కొన్న కూరగాయలు అక్కడే వదిలి వెనుదిరిగాడు. అది చూసి పర్సు మళ్ళీ జేబులో పెట్టేసి డబ్బులు పేటిఎం ద్వారా చెల్లించాడు ఆనంద్.

'కూరలతను కూడా ఈ కరోనా భయంతో నగదు స్వీకరించడం లేదు. మొత్తం మీద ఈ కరోనా భయం ప్రజలను నగదు వాడకుండా నిరోధిస్తోందన్నమాట. పోనీ ఇదో శుభ పరిణామం.' మనసులోనే అనుకున్నాడు ఆనంద్.

కూరలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్గవి పనిమనిషి మంగికి నెలజీతం ఫోన్‌పేలో చెల్లిస్తోంది.

తెచ్చిన కూరగాయలు అవీ ఎండలో పెట్టి, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని వరండాలోనే ఉన్న బాత్రూంలోకెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వచ్చాడు.

టీపాయ్‌పైన ఉంచిన పర్సు తీసి చూసి "ఏమిటీ తీసుకెళ్ళిన డబ్బులన్నీ అలాగే ఉన్నాయి మీ మతిమరుపు వల్ల కూరలతనికి డబ్బులు ఇయ్యలేదా ఏమిటి?" అడిగింది భార్గవి.

"నేనేమీ మర్చిపోలేదే! కూరలతను ఎవ్వరివద్దా నగదు తీసుకోవడంలేదు. పీటీఎం ద్వారా చెల్లించాను." అన్నాడు బట్టలు మార్చుకొని సోఫాలో కూర్చుంటూ.

"అవునండీ! అన్ని జాగ్రత్తలతోపాటు ఇది కూడా ఒకటి. కరోనా సోకకుండా మాస్క్ ధరించినట్లే, భౌతిక దూరం పాటించినట్లే, నగదు వల్ల కూడా ముప్పు పొంచి ఉన్నందువల్ల ఇప్పుడు అందరూ జాగ్రత్త వహిస్తున్నారు. ఈ మధ్య బ్యాంకు సిబ్బందికి కూడా కొంతమందికి కరోనా సోకిందటగా! అందుకే నగదంటే అందరికీ భయం పట్టుకుంది. ఆఖరికి మన పాలవాడు, పనిమనిషి కూడా నగదు తీసుకోకుండా ఫోన్‌పే ద్వారానే డబ్బులు తీసుకుంటున్నారు. అవును, ఇంతకీ ఈ నెల చెల్లించవలసిన కరెంట్‌బిల్లు, కట్టవలసిన ఇన్సూరెన్స్ పాలసీ సంగతేం చేసారు? కట్టారా!" అడిగింది భార్గవి.

"అయ్యో! మర్చిపోయాను. సమయానికి గుర్తుచేసావు." అని కరెంట్ బిల్లు, ఇన్సూరెన్స్ డబ్బులు నెట్‌లో కట్టేసాడు ఆనంద్.

"చూసారా! ఇప్పుడు వేటికీ నగదు అవసరం పడటం లేదు, లావాదేవిలన్నీ నగదు లేకుండానే జరుగుతున్నాయి కరోనా వల్ల. ఇంతకుపూర్వం ఏటిఎంలో డబ్బులు దొరికేవికాదు, అలాంటిది ఇప్పుడు వరస బ్యాంక్ సెలవులున్నా డబ్బులు దొరుకుతున్నాయి. పదిహేను రోజుల క్రితం తెచ్చిన డబ్బులు అలానే ఇంట్లో ఉన్నాయి, ఖర్చు కావడం లేదు. ఇదీ ఒకందుకు మంచిదే, మాటిమాటికీ ఏటిఎంకి వెళ్ళనవసరం లేదు." అందామె.

"అవును ఇప్పుడు లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరుగుతున్నాయి. నల్లధనం నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్నెన్నో చర్యలు చేపట్టినా ఏవీ పెద్దగా సత్ఫలితాలివ్వలేదు. పెద్దనోట్ల రద్దు కూడా సాధించలేనిది ఈ కరోనా సాధించింది. గుర్తుందా! పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా నగదు రహిత లావాదేవీలకి వ్యాపార సంస్థలు రెండు శాతం ఎక్కువ వసూలు చేస్తూండేవారు. ఇప్పుడు కరోనా దెబ్బకి అందరూ దిగివచ్చారు. అంతటా నగదు రహిత లావాదేవీలే. ఇదో శుభ పరిణామమే అయినా కరోనాతో ఎల్లకాలమూ సహజీవనం చేయలేము కదా! పూర్తిగా కరోనా రహిత, నగదు రహిత సమాజం ఎన్నడు రానున్నదో ఎమో?" అన్నాడు ఆనంద్.

అతని అభిప్రాయాలకి ఏకీభవించింది భార్గవి.

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు