అవతారం అప్పు - పద్మావతి దివాకర్ల

Incarnation debt

ఊళ్ళో అందరివద్దా అందినంతమేరా అప్పు చేసిన అవతారం కరోనాతో చనిపోయాడన్న వార్త దావానలంలా వ్యాపించింది.  ఎప్పుడైనా తమ అప్పులు వసూలవుతాయేమోనని ఎదురుచుస్తూన్న వాళ్ళందరికీ ఇది ఓ ఆశనిపాతంలా తోచింది.  ఇన్నాళ్ళూ ఈ కారోనావల్ల, లాక్‌డౌన్‌వల్ల ఎవరూ అవతారంని కలవలేకపోయారు.  అవతారంకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటినుండి అందరికీ మనసులో గుబులుగానే ఉంది.  అవతారంకి తొందరగా నయమవ్వాలని, అతను త్వరగా కోలుకోవాలని వాళ్ళు ప్రార్థించని దేవుడు లేడు.  ఇప్పుడు అవతారం అర్ధాంతరంగా చనిపోవడంతో తమ అప్పులు ఇక గంగపాలేనని భావించి దిగులు చెందారు అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ.  తమ బాకీలెలా వసూలవుతాయో తెలియక బెంగ పెట్టుకున్నారు వాళ్ళందరూ.  అవతారంకి వివాహమైనా ఇంటిమీదకి తరచూ దాడికి వచ్చే అప్పులాళ్ళని చూసి, అవతారంకి పేకాట పాపారావుతో ఉన్న పేకాట అనుబంధంవల్లనూ, మందుబాబు మధుబాబుతో గల దోస్తీవల్లా జీవితంలో విరక్తి చెందింది అవతారం భార్య.  ఓ శుభ (అశుభ) ముహూర్తాన భర్తకి విడాకులిచ్చి తన పుట్టింటికి చేరింది. ఆ తర్వాత ఆమె కూడా కాలం చేసింది.   ఇక తమ అప్పు తీర్చగలిగే అవతారం వారసులు ఎంకెవరైనా ఉన్నారా అని పరిశోధనకి దిగారు ఆ అప్పుబృందం.  అయితే వాళ్ళకి కూడా ముందు అవతారం వారసుల ఆచూకీ ఏమాత్రం లభ్యం కాలేదు.  ఇక తమ అప్పులు పూర్తిగా మునిగిపోయాయని భావిస్తున్న తరుణంలో అవతారంకి అప్పల్రాజు అనే కొడుకు ఉన్నట్లు తెలిసింది క్రిష్ణమూర్తికి. వెంటనే ఈ వార్త సుందరంకి చేరవేసాడు క్రిష్ణమూర్తి.  ఇద్దరూ కలిసి  అప్పల్రాజు గురించి ఆరా తీసారు.  ఆ తర్వాత వాళ్ళిద్దరూ కష్టపడి అప్పల్రాజు ఆచూకి కనిపెట్టారు.  అప్పల్రాజు తండ్రి అంత్యక్రియలకి వచ్చినట్లు తెలుసుకున్నారు.

అప్పల్రాజు హైదరాబాద్‌లో ఉంటాడు. టివి చానెళ్ళలో సీరియళ్ళకి కథలు, సినిమాలకి కథలు, స్క్రీన్‌ప్లే రాస్తూంటాడు.  దర్శకత్వం కూడా ఈ మధ్యే మొదలెట్టాడు.  ఈ మధ్య కరోనా వల్ల షూటింగులన్నీ మూతపడ్డాయి కానీ ఓ మోస్తరుగా పేరున్నవాడే అప్పల్రాజు.

అవతారంకి అప్పులిచ్చిన వాళ్ళందరూ క్రిష్ణమూర్తి ఇంట్లో సమావేశమయ్యారు ఆ సాయంకాలం.  తోటి అప్పులాళ్ళందరికీ పరిస్థితి అంతా తెలియపర్చాడు క్రిష్ణమూర్తి.

"అవతారం మన అందరి దగ్గర అప్పులు చేసి మనల్ని నిలువునా ముంచాడు.  ఇవాళా, రేపు మన బాకీ తీరుస్తానన్నవాడు హఠాత్తుగా బాల్చీ తన్నేసాడు.  ఇప్పుడు నిండా మునిగిన మనం పైకి తేలాలంటే ఒకటే ఉపాయం!  అవతారంకి ఉన్న ఒక్కగానొక్క వారసుడు అప్పల్రాజు అటు సినిమాలకి, ఇటు సీరియల్సుకి కూడా కథలూ అవి రాస్తూంటాడు.  అడపదడపా దర్శకత్వం కూడా వహిస్తూ ఉంటాడు.  నేను చెప్పొచ్చేదేమిటంటే మనం అందరం కలిసి అతని వద్దకు వెళ్ళి మన కష్టాలు ఏకరవు పెట్టాలి.  దేవుడి దయవల్ల అతనికి దయ కలిగితే మన కష్టాలు గట్టెక్కినట్లే.  ఎంతైనా అతను అవతారంకి కొడుకు, వారసుడు కదా!  మన అప్పులు తీరిస్తే, తన తండ్రి ఋణం తీర్చుకున్నట్లే అని అతనికి నచ్చచెబుదాం.  హైదరాబాదులో బాగానే ఆర్జించి ఉంటాడు.  మనకి తన తండ్రితాలుకు బాకీ తీర్చుతాడనే ఆశిద్దాం!" అన్నాడు. క్రిష్ణమూర్తి మాటలకి అందరూ సమ్మతించారు.

"సరే!  అయితే ఎప్పుడు వెళ్దాం అప్పల్రాజుని కలవడానికి?" అడిగాడు సుందరం.

"తండ్రి అంత్యక్రియలకి వచ్చిన అప్పల్రాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు.  ఇంకా హైదరాబాద్ తిరిగి వెళ్ళలేదు.  ఇంకో పది పదిహేను రోజులు ఇక్కడే ఉంటాడని తెలిసింది.  ఇప్పుడెలాగూ అతను క్వారంటైన్లో ఉన్నాడు.  మరో రెండు రోజులు పోతే అతన్ని మనం కలుసుకోవచ్చు.  ఈ బుధవారం నాడు మనం అతన్ని కలవడానికి వెళ్దాం." అని సమాధానం ఇచ్చాడు క్రిష్ణమూర్తి.  అలాగేనన్నారు అందరూ.

వాళ్ళు అనుకున్న రోజు రానే వచ్చింది.  అందరూ మూకుమ్మడిగా అప్పల్రాజుని కలుసుకోవడానికి వెళ్ళారు.  అంతమందిని చూసి అప్పల్రాజు ఆశ్చర్యపోయాడు. బహుశా తమకి సినిమాలోనో, సీరియల్సులోనో అవకాశం కోసం సిఫార్సు చేయమని అడగడానికి వచ్చారేమో అనుకున్నాడు.  ఆ తర్వాత వాళ్ళ నుండి తన  తండ్రి చేసిన అప్పు గురించి విని నిర్ఘాంతపోయాడు.

తమ అప్పు సంగతి అంతా వివరించి చెప్పిన క్రిష్ణమూర్తి అప్పల్రాజుకి అందరి అప్పుల వివరాలు ఉన్న కాగితం ఒకటి అందించాడు.

"అప్పల్రాజుగారూ!...మీ నాన్నగార్ని నమ్మి మేము అతనికి బోలెడంత అప్పు ఇచ్చాం.  ఇప్పుడాయన మమ్మల్ని అనాథలు చేసి అర్ధాంతరంగా పైలోకానికి వెళ్ళిపోయారు.  దేవుని దయవల్ల మీలాంటి గొప్పవారు అతనికి వారసుడుగా లభించాడు.  మీరు మీ నాన్నగారి ఋణం తీర్చుకుంటే ఆయన ఆత్మకి శాంతి లభిస్తుంది.  మా అప్పులు తీరకపోతే మా అందరి మనసులు క్షోభిస్తాయి.  ఇప్పుడు మీరే మాకు దిక్కు.  మమ్మల్ని నీట ముంచుతారో, లేక పాలలో తేల్చుతారో అంతా మీదే భారం."  అన్నాడు క్రిష్ణమూర్తి లౌక్యంగా.

"మీ సీరియల్సన్నీ కూడా క్రమం తప్పకుండా చూసే మమ్మల్ని, మా కుటుంబాల్నీ కూడా మీరే కాపాడాలి." అన్నాడు సుందరం మరో అడుగు ముందుకేసి.

“మాయందు దయ ఉంచి మీరే మాకు ఏదో ఒక మార్గం చూపెట్టాలి." అని ప్రాధేయపడ్డాడు ముకుందరావు.

కొద్దిసేపు తర్వాత, "నన్ను కొద్దిగా ఆలోచించుకోనివ్వండి.  రేపీపాటికి రండి.  ఏ సంగతీ చెప్తాను." అన్నాడు.  అప్పల్రాజు నుండి ఆ మాత్రం స్పందన వచ్చినందుకు సంతోషించి ఇంటిదారి పట్టారందరూ.

ఆ మరుసటిరోజు మళ్ళీ అందరూ అక్కడ హాజరయ్యారు.  వాళ్ళందర్నీ ఆహ్వానించిన అప్పల్రాజు, "రోజంతా ఆలోచించగా నా తండ్రి అప్పులన్నీ తీర్చడం కొడుకుగా నా బాధ్యత అని అనిపించింది.  మీకందరికీ పూర్తిగా బాకీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను." చెప్పాడు.

అప్పల్రాజు నిర్ణయం పట్ల క్రిష్ణమూర్తి అండ్ కో హర్షం వెలిబుచ్చారు.

"అయితే నా వద్ద మీకు చెల్లించడానికి నగదు ఏమీ లేదు.  బ్యాంక్ ఖాతాలో కూడా నిల్వలు లేవు.  అయితే మీరేమీ నిరాశ పడవలసిన పని లేదు.  నా వద్ద ఓ రెండు డజన్ల ప్లాట్లున్నాయి.  మీరందరూ కూడా సరిగ్గా అంతమందే ఉన్నారు.  ఒక్కోళ్ళకి ఒక ప్లాట్ చొప్పున ఇస్తాను, మీ బాకి కింద జమ కట్టుకొండి.  ఇంతకు మించి నేనింకేం ఇవ్వలేను.  ఇష్టముంటే చెప్పండి.  వారం రోజుల్లో ఆ ప్లాట్లన్నీ మీకు రాసిచ్చేస్తాను." చెప్పాడు వాళ్ళతో.

అప్పల్రాజు నుండి ఈ మాటలు విన్న వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు కాసేపు కూడబలుక్కున్నారు.

"ఒకొక్కరికి ఒక్కో ప్లాట్!  అప్పల్రాజు హైదారాబాద్‌లో ఉంటున్నాడు కాబట్టి అన్నీ అక్కడి ప్లాట్లే అయి ఉంటాయి.  ఆ ప్లాట్‌లో మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అవి అమ్ముకున్నా మనకి చాలా డబ్బులు వస్తాయి.  ఒప్పేసుకుందాం.  నగలు బదులు ప్లాట్లు ఇంకా లాభసాటికదా!" అన్నాడు క్రిష్ణమూర్తి.  అందుకు ఒప్పుకున్నారందరూ.

"సరే!  నగదు రూపంలో కాకుండా ప్లాట్ రూపంలో ఇచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు, ఎలాగోలా సర్దుకుంటాం.  ఎలాగైనా మీ నాన్నగారి అప్పులు తీరితే అంతే చాలు." ఉదారంగా చెప్పాడు క్రిష్ణమూర్తి అందరి తరఫునా వకాల్తా తీసుకొని.

"అలాగే!  అయితే వచ్చే వారం ఇదేరోజు ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి." అన్నాడు అప్పల్రాజు.

అందరూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి వారం రోజుల తర్వాత అప్పల్రాజుని కలుసుకున్నారు.

ఇంటి వరండాలోనే కూర్చున్న అప్పల్రాజు వాళ్ళని అహ్వానించాడు. వాళ్ళందర్నీ చూసి, "అందరూ వచ్చినట్లేనా!  నేను కూడా ప్లాట్లు రెడీ చేసి ఉంచాను.  రండి ఒకొక్కరూ వచ్చి మీ మీ ప్లాట్లు తీసుకోండి." చెప్పాడు అప్పల్రాజు.

'అబ్బ!  ఇన్నాళ్ళకి అవతారం అప్పు తీరబోతోంది.' అని అందరూ చాలా సంతోషించి అప్పల్రాజు నుండి ప్లాట్సుకి సంబంధించిన కాగితాలు అందుకున్నారు.

క్రిష్ణమూర్తి తనకి అందిన ప్లాట్లకి సంబంధించిన కాగితాలు చదివాడు.

అందులో ఇలా రాసి ఉంది.

‘భార్గవ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భావనని ప్రేమిస్తాడు.  అయితే భావన ఆ ఊళ్ళోకెల్లా ధనవంతుడు, రాజకీయ నాయకుడైన గుర్నాధం కొడుకైన గంగాధరంని ప్రేమిస్తుంది.  గంగాధరం దుర్గుణాలు పుట్ట.  భార్గవ భావనకి ఎంత నచ్చ చెప్పినా వినదు.  భావన తండ్రి శంకార్రావు పక్కా తాగుబోతు.  అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదు.  అతనికి తాగుడు ఆశ చూపెట్టి గంగాధరం భావనని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పిస్తాడు.  గంగాధరంని నమ్మిన భావనకి అతని నిజ స్వరూపం తెలుస్తుంది.  అప్పుడు ఆమె భార్గవని కలిసి తనని రక్షించమని వేడుకుంటుంది.‘ ....ఇలా సాగుతోంది.  అది చదివిన క్రిష్ణమూర్తికి ఏం బోధపడలేదు.

అలాగే సుందరం అందుకున్న ప్లాట్ కాగితాల్లో, 'తన కొడుకు సంతోష్ సరోజని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అతని తల్లి చంద్రకాంతంకి ఇష్టం లేదు.  సంతోష్‌కి తన మేనకోడలైన శ్యామలని చేసుకోవాలని ఆమెకి ఉండేది.  కొడుకు ఇలా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమె సరోజపై కక్ష పెంచుకుంది.  ఆమెని రాచి రంపాన పెట్టడమే కాక, తన మేనకోడల్ని కూడా రంగంలోకి దింపింది.  సరోజకి విషప్రయోగం చేసి ఎలాగైనా ఆమెని చంపాలని ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారు.  ఈ బాధలు భరించలేక సరోజ ఇంటినుండి పారిపోతుంది’....ఇలా సాగుతోంది ఆ కాగితాల్లో.  అది చదివిన సుందరంకి కూడా ఏమీ అర్ధం కాలేదు.

అందరికీ అందిన కాగితాల్లో ఇలానే ఏవో రాసి ఉన్నాయి.  ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు ఈ గోల ఏమిటో!

"ఏమిటండీ ఇది అప్పల్రాజుగారూ?  పొరపాట్న మాకు ఇవేవో ఇచ్చినట్లు ఉన్నారు.  ఇందులోనివి మీ సీరియల్సుకో, సినిమాలకో సంబంధించిన కథల్లా ఉన్నాయి, అంతేకాని మాకు ఇవ్వదలచిన ప్లాట్లకి సంబంధించిన కాగితాలు కానే కావు." అన్నాడు క్రిష్ణమూర్తి.

"మీకు నేను ఇవ్వదల్చినవి ఇవే!  ఇవే నేను రాసిన సీరియల్సుకి, సినిమా కథలకి  సంబంధించిన ప్లాట్లు.  ఒకొక్కటి లక్షలరూపాయలకిపైగా విలువ చేసే ప్లాట్లు.  ఇంతకుమించి మీ అప్పు తీర్చడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. ఇక వెళ్ళి రండి." అని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అప్పల్రాజు.

తమ చేతిలో ఉన్న ప్లాట్ల కాగితాలతో ఏం చేయాలో తెలియక అప్పల్రాజు వెళ్ళినవైపే అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఆ అప్పు బృందమంతా.

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు