జీనా యహా... మర్నా యహా... - వెంకట్ ఈశ్వర్

live here. Die here.

   బస్సు రాములోరి గుండు దగ్గర నన్ను దింపేసి, రయ్యిమంటూ ముందుకు దూసుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి అడవి మార్గం గుండా రెండు కిలోమీటర్లు నడిస్తే మా ఊరు నారాయణ పురం వస్తుంది. అడవంటే అదేదో కీకరారణ్యం కాదు. దాన్నిండా చాలా వరకు చిన్న చిన్న పొదలూ, అక్కడక్కడా కొన్ని కొన్ని పెద్ద చెట్లూ మాత్రమే ఉంటాయి.
   నేను నా సంచీని, ఎక్కడికెళ్ళినా నాతో పాటూ తీసుకెళ్ళే సరిగమ కార్వాన్ రేడియోని భుజానికి తగిలించుకుని నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను.
   దూరంగా పడమటి కొండలు సూర్యుడ్ని మింగడానికి సిద్ధమవుతున్నాయి. ఎండ ఏటవాలుగా ముఖానికి కొడుతోంది.
   నాకెందుకో ఇవాళ నిద్ర లేచినప్పటి నుండి బలే బేజారుగా ఉంది. విశ్రాంతి తీసుకోవాలనిపించినా, వేరే ఊరిలో తద్దిన కార్యక్రమాన్ని జరిపించడానికి వెళ్ళక తప్పింది కాదు. పొద్దుననగా బయల్దేరి, అక్కడంతా సవ్యంగా జరిపించి, తిరిగొచ్చేసరికి ఈ వేళయింది. తల ఒకటే పీకుతోంది. ఇలాంటప్పుడు ఏ సిగరెట్టో, కాఫీనో తాగితే తప్ప లోపల ఉత్సాహం మళ్ళీ పుంజుకునేలా లేదు. అందుకే కాలి బాట పక్కనే ఉన్న మర్రిచెట్టు కింద కాసేపు కూర్చోవాలనుకున్నాను.
   ఆ మర్రిచెట్టు ఇప్పటిది కాదు. ఎప్పుడో మా తాతల తాతల కాలం నాటిదట. ఆ విషయం దాని చుట్టూ జడదారి జడల్లా వేలాడుతున్న ఊడలూ, నేలలోంచి సుడులు తిరుగుతూ బయటికొచ్చి, మళ్ళీ అదే నేలలోకి చొచ్చుకుపోయున్న దాని వేర్లూ చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.
   ఆ వేర్లలో ఒకదాని మీద తీరిగ్గా కూర్చుని, నా సంచీలోంచి సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె బయటికి తీసి చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. ఇక నిరంతరాయంగా ధూమపానం చెయ్యొచ్చని నిర్ధారించుకుని, ఓ సిగరెట్టు ముట్టించి పొగని గుండెల నిండా పీల్చి గుప్పున బయటికొదిలాను. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగొచ్చినట్టనిపించింది.
   ఇలా చాటుమాటుగా సిగరెట్ కాల్చడం నాకూ ఇష్టం లేదు. బహిరంగంగా అందరూ చూస్తుండగానే స్టైలుగా కాల్చాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం. బ్రాహ్మణ పుట్టక పుట్టిన  తర్వాత నమ్మినా, నమ్మకపోయినా ఎన్నో ఆచారాల్ని, కట్టుబాట్లను పాటించక తప్పదు. మరీ ముఖ్యంగా ఏ ఉద్యోగం దొరక్క పొట్టకూటి కోసం పౌరోహిత్యం చేసుకునే నాలాంటి వాడికి తప్పదుగాక తప్పదు. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తూ చేస్తూ పొరపాటున దొరికిపోయానే అనుకో, మళ్ళీ ఎవరూ ఎటువంటి కార్యానికీ నన్ను పిలవరు. ఒకవేళ పిలిచినా ముందున్నంత మర్యాదా ఉండదు. అందుకే ఇలా చాటుగా ధూమం, మధ్యం పానం చెయ్యడం.
   సిగరెట్ చివరి దమ్ము లాగి, పీకని కింద పడేసి కాలితో నలిపేశాను. అయినా కూడా నాలో తగినంత ఉత్సాహం చోటు చేసుకోలేదు. ఇంకా ఏదో కావాలనిపించింది. ఏదైనా ఓ మంచి పాట వినాలనిపించింది. వెంటనే సరిగమ కార్వాన్ ఎఫ్.యం ఆన్ చేశాను. ముఖేష్ పాడిన "జీనా యహా... మర్‌నా యహా..." అనే పాట ప్రసారమవుతోంది. ముఖేష్ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఎంత తీయటి గొంతాయనది. ఆ గొంతే నన్ను కదలనీయకుండా ఓ ఐదు నిమిషాల పాటూ అక్కడే కూర్చోబెట్టింది.
   పాట మొత్తం పూర్తవగానే రేడియో ఆపేసి, వాసన రాకుండా ఓ వక్కపొడి పొట్లం చించి నోట్లో పోసుకుని, లేచి బయల్దేరబోతుంటే సరిగ్గా అప్పుడు కనిపించాడతను.
   రోడ్డు మీద వడి వడిగా నడుచుకుంటూ ఊరి వైపుగా వెళ్తూ.
   వయసు దాదాపు అరవై ఏళ్ళుంటుంది. జుట్టు నెరసిపోయి తెల్లగా ఉంది. ఆకారం పొట్టిగా, లావుగా చూడ్డానికి పాత సినిమాల్లో పద్మనాభంలా ఉన్నాడతను.
   నా వైపు కనీసం చూడనైనా చూడకుండా తన దారి తనదేననట్టు దారిలో గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని,
   "ఓ... పెద్దాయనా!" అని కేకేశాను.
   నా కేక విని ఆగి, నన్ను కింద నుంచీ పైదాకా వింతగా చూడటం మొదలుపెట్టాడాయన.
   "ఎంతదూరం వెళుతున్నారు?" అన్నాను .
   "శ్రీనివాసా పురం వెళ్ళాలి." అంటూ బదులిచ్చాడా వృద్దుడు. ముఖంలో ఎటువంటి భావం లేకుండా.
   "శ్రీనివాసా పురమా! అది మా పక్క ఊరే. ఈ దార్లోనే కొంచెం ముందుకెళితే రెండు ఊర్లకీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చే‌సిన శ్మశానం ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఇదే దారి రెండుగా చీలిపోతుంది. ఆ చీలిన దారుల్లో ఎడమ వైపుగా వెళ్ళే దారి నేరుగా శ్రీనివాసా పురానికీ, ఇంకో దారి నారాయణ పురానికి, అంటే మావూరికి పోతుందన్నమాట." అని ఆగి,
   "మిమ్మల్నెప్పుడు ఆ ఊళ్ళో చూడలేదే! మీది ఏ ఊరు?" అనడిగాను.
   దానికాయన, "మాదీ ప్రాంతం కాదులే బాబూ." అనేసి, ఇంకేమీ మాట్లాడటం ఇష్టం లేదన్నట్టు ముందుకు నడిచాడు.
   నేనూ ఆయనతో పాటే నడవసాగాను.
   ఇద్దరం పక్కపక్కనే సమాంతరంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. పైన ఆకాశంలో గూళ్ళకు బయల్దేరిన పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ వెళ్తున్నాయి. సంధ్యా సమయం కావడంతో మెల్ల మెల్లగా వాతావరణం చల్లబడుతోంది.
   తిరిగే కాలూ, వాగే నోరు కుదురుగా వుండవన్నట్టు, నాకు ముసలాయనతో ఏదైనా మాట్లాడితేగానీ కాస్తంత కాలక్షేపంగా ఉండదనిపించించింది.
   "ఇంతకీ ఏం పని మీద వెళుతున్నారా ఊరికి?" నడుస్తూనే అడిగాను.
   ఆయన ఓసారి నాకేసి చూసి, చిరునవ్వు చిందిస్తూ "అది ఎవరికీ చెప్పకూడదు. దేవ రహస్యం" అననన్నాడు.
   నేను ఆయన చేసిన చమత్కారాన్ని అర్థం చేసుకుని "తమాషాలు చాలు చెప్పండి గురువుగారు." అన్నాను కొంచెం చనువుగా.
  "అది చెప్పాలంటే ముందు నా కథంతా నీకు చెప్పాలి. చెప్పినా నువ్వు నమ్మవనుకో" అంటూ మొదలుపెట్టి,      "మా ఊరి పేరు కైలాసగిరి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఆ ఊళ్ళో ఎవరు కట్టించారో కూడా తెలియని ఓ పురాతన శివాలయం ఉంది. అందులో వెలసిన పరమేశ్వరుడు చాలా మహిమలు గల దేవుడు. ఆయనకి ఎన్నో శతాబ్దాల కాలం నుంచీ మా వంశలోని వాళ్ళే పూజారులుగా ఉంటూ సేవ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మా నాన్నగారు కూడా నా పదమూడవ ఏట వరకూ గుడికి పూజారిగా వ్యవహరించి, ఆకస్మాత్తుగా పరమపదించారు. అప్పటి నుంచీ ఆ కైలాసవాసుని బాగోగులు చూసుకునే భాధ్యత వారసత్వంగా నా మీద పడింది. అంత చిన్న వయసులో పూజారిగా ఉండి అన్నీ చూసుకోవాలంటే నాకు చాలా పెద్ద భారం మోస్తున్నట్టనిపించేది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నాలోని భక్తి కూడా పెరిగి, నేను అనునిత్యం శివ నామస్మరణలోనే గడపసాగాను. నాకెప్పుడు పెళ్ళి జరిగిందో, ఎప్పుడు పిల్లలు కలిగారో, ఎప్పుడు అమ్మ చనిపోయిందో ఏవీ గుర్తులేదు. నా ఆలోచనలన్నీ ఎప్పుడూ ఆయన గురించే. పగలూ, రాత్రి ఆయన మీదే నా ధ్యాసంతా.
   ఓ రోజు ఎప్పటిలాగే రాత్రి పది గంటల వరకూ గుళ్ళోనే ఉండీ, అన్ని కార్యక్రమాలూ ముగించుకుని అలసటతో కాసేపు మంటపంలో నడుం వాల్చాను. అంతే. ఎలా పట్టేసిందో నాకు తెలియకుండానే గాఢమైన నిద్ర పట్టేసింది! కొంత సమయం గడిచాక ఎవరో నా పేరును పదే పదే పిలుస్తున్నట్టుగా అనిపించి దిగ్గున లేచి చూశాను. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. సాక్షాత్తూ ఆ పరమశివుడే నా ముందు సాక్షాత్కరించి ఉన్నాడు.
   ‘స్వామీ...!’ అన్నాను ఆర్తీ, ఆశ్చర్యం కలగలిసిన గొంతుకతో, ఆనందభాష్పాలతో.
   ఆయన నిశ్చలంగా చూస్తూ, నిర్మలంగా నవ్వాడు.
   ‘ఇన్నాళ్ళకి ఈ భక్తున్ని కనికరించావా స్వామీ?’ అంటూ రెండు చేతులు జోడించి, మోకాళ్ళ మీద కూర్చున్నాను.
   ‘అవును నాయన. ఇన్నేళ్ళూ నీవు చేసిన సేవకు ప్రతిఫలంగా ఏదైనా వరం ఇవ్వాలని వచ్చాను. ఏం వరం కావాలో కోరుకో.’ మృదువుగా అన్నాడాయన.
   నా మనసు పులకించిపోయిందా మాట వినగానే.
   ‘నీ సాక్షాత్కారామే సర్వం అనుకున్న నాకు వరమివ్వాలని వచ్చావా స్వామీ! నాకెటువంటి వరాలూ వద్దు తండ్రీ. స్వర్గసుఖాలూ, కైవల్యాది అనుగ్రహాలు అసలే వద్దు. నాకు ఏదైనా కోరిక ఉందంటే అది ఒకటే స్వామీ. ఇన్నాళ్ళు ఈ భవబంధాల సంసార సాగరం ఈదీ, ఈదీ అలసిపోయాను. ఇక నన్ను నీలో ఐక్యం చేసుకొని, నన్నీ జరామరణ చక్రంలోంచి బయట పడేలా కరుణించు. అది తప్ప నాకింకేమి వద్దు సర్వేశ్వరా.’ నా తలను ఆ పురాణ పురుషుడి పాదాలకు ఆన్చి వేడుకున్నాను.
   దానికి ‘కుదరదు. అది సాధ్యపడదు.’ అన్నాడాయన కటువుగా.
   ‘ఎందుకు స్వామీ. ఆ అదృష్టానికి నోచుకోనంత పాపం నేనేం చేశాను.’ అర్థం కానట్టు ముఖం పెట్టి అడిగాను నేను.
   ‘పాపమే. నీవు ఇన్ని సంవత్సరాలూ నా భక్తిలో పడి, నా కంటే గొప్పదైన నీ తల్లినీ, నీ పైనే ఆధారపడి బతుకుతున్న నీ భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేశావు. అది నువ్వు తెలియక చేసినా సరే తప్పు తప్పే. కాబట్టి నువ్వు నాలో ఐక్యం కావడానికి అనర్హుడవు.’
   ‘స్వామీ!’
   ‘భయపడకు. నీ తప్పు సరిదిద్దుకునే మార్గం చెబుతాను. దిద్దుకున్న తర్వాత నేనే స్వయంగా వచ్చి నిన్ను నాలో కలుపుకుంటాను.’
   ‘అలాగే స్వామీ. ఏమి చేయాలో సెలవివ్వండి.’
   ‘తపస్సు చేయాలి.’
   ‘తపస్సా!’
   ‘అవును. తపస్సే. పద్దెనిమిది పక్షముల పాటూ తలక్రిందులుగా, ఎవ్వరికీ కనిపించని కటిక చీకటి ప్రదేశంలో కఠోర తపమాచరించి, పిమ్మట నిష్కల్మష హృదయంతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. అక్కడి నుంచీ సద్బుద్దితో మెలుగుతూ నీవు చేసిన పాపములన్నింటినీ సరిదిద్దుకోవాలి.’ అని, అటువంటి తపస్సునకు అనువైన ప్రదేశం ఎక్కడుందో సవివరంగా తెలియజేసి నా కళ్ళముందే అంతర్థానమైపోయాడా శశిధరుడు. ఇప్పుడు నేను వెళుతున్నది ఆయన చెప్పిన చోటుకే." అని ముగించాడా ముదుసలి.
   ఆయన చెప్పిందంతా విన్న తర్వాత తెరలు తెరలుగా నవ్వొచ్చింది నాకు. ఆపుకోలేక బిగ్గరగా నవ్వసాగాను.
   "అందుకే అన్నాను. చెప్పినా నువ్వు నమ్మవని." అన్నాడాయన చిన్నబుచ్చుకుంటూ.
   నేను అంతలా నవ్వుతున్నా ఆయనకి కోపం రాకపోవడం నాకెందుకో చిత్రంగా అనిపించింది.
   "లేకపోతే ఏంటి గురువుగారూ. ఈ కాలంలో కూడా దేవుడూ, దెయ్యాలు అంటూ మీరూ మీ కబుర్లూనూ. మీరేదో భ్రమపడి ఇంత దూరం వచ్చేసినట్టున్నారు. దయచేసి మీరింతకు ముందు చెప్పినట్టు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది. చెప్తే పిచ్చోడ్ని చూసినట్టు చూస్తారు." ఎగతాళిగా అన్నాను.
   నేను చెప్పేది ఆయన వింటునన్నాడో లేదో తెలీలేదు. ఏదీ పట్టించుకోనట్టు తనలో తాను ఏవేవో గొణుక్కుంటూ ముందుకు నడుస్తూనే ఉన్నాడు.
   "ఇదిగో గురూజీ... ఇంతకీ ఎవరింటికి వెళ్తున్నారు. నారాయణ పురంలో?" అంత గుచ్చి గుచ్చి అడగడం ఇష్టం లేక పోయినా మరోసారి ప్రశ్నించాను.
   నెమ్మదిగా నా వైపు తల తిప్పి "సోమయాజులు  గారింటికి." అని జవాబిచ్చాడాయన.
   "ఓహో సోమయాజుల గారింటికా! ఆయన కూతురుకి ఈరోజు రాత్రికే కదా పెళ్ళి. వాళ్ళింట్లో ఏ కార్యమైనా ఎప్పుడూ నన్నే పురోహితుడిగా పిలుస్తుంటారు. ఈ పెళ్ళి కూడా నేనే జరిపించాల్సింది. కానీ నాకు కుదర్లేదు. ఏం చేస్తాం. అదే ముహూర్తానికి మా ఊరిలో వేరే పెళ్ళి ఒకటి జరిపించడానికి ముందుగానే ఒప్పేసుకున్నాను. అవునూ ఇంతకీ మీరు వాళ్ళకి ఏమవుతారు?"
   "కావల్సినవాడిని."
   "అదీ సంగతి. మరి అది చెప్పకుండా హరకథలు చెప్తారేం. అప్పుడే అనుకున్నా. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా వచ్చారంటే, ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటారని. ఇప్పుడర్థమైంది నాకు. మీరు సోమయాజుల గారి అమ్మాయి పెళ్ళికొచ్చారన్నమాట!"
   "కాదు."
   ఆ మాట ఆయన నోటి నుంచి రాగానే అర్థం గాక గిరుక్కున పక్కకి తిరిగి చూశాను. ఆయన పెదాల మీద నవ్వు చెరగకుండా నడుస్తూనే ఉన్నాడు.
   'ఈయనకి పిచ్చైతే కాదుగదా.' అనుకున్నాను మనసులో.
   "మరి దేనికి వెళుతున్నట్టూ... తపస్సు చేయడానికా? మీకు దేవుడు చెప్పిన ఎవ్వరికీ కనిపించని ఆ చీకటి ప్రదేశం వాళ్ళ ఇల్లేనా?" అన్నాను వ్యంగ్యంగా.
   "అదే అని ఎవరన్నారు? కేవలం అదొక మజిలీ మాత్రమే. నిజానికి అక్కడ్నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. రహస్య మార్గం గుండా." ఎక్కడో శూన్యంలోకి చూస్తూ చెప్పాడా మాట.
   'అనుమానం లేదు ఇది పిచ్చే.' అనుకున్నాను మళ్ళీ.
   "గురువుగారూ... ఇంతకీ ఏవంటారు? మీరు చెప్పే కథంతా నిజమేనంటారు! అంతేనా?"
   "నా కథ సరే. నీ కథేంటి. నుదుట నిలువు నామాలు దిద్దుకున్నావ్. ఒంటి నిండా గంధపు బొట్లు పెట్టుకున్నావ్. మెడలో దేవుడి మాల వేసుకుని అసలు దేవుడే లేడంటున్నావ్. ఏవిటి విషయం." కళ్ళెగరేస్తూ అడిగాడా పెద్ద మనిషి.
   ఆయనలా అడగ్గానే ఒకసారి నన్ను నేను చూసుకుని " నా కథ మీ కథంతా పెద్దదయితే కాదులెండి. చాలా చిన్నదే." అన్నాను నిరాసక్తంగా.
   "అయితే చెప్పు మరి వింటాను."
   "ఏం చెప్పమంటారు గురూజీ. నా జీవితం ఇలా తయారవుతుందని కలలో కూడా అనుకోలేదు నేను. ఇంతకీ నా పేరేవిటో చెప్పలేదు కదూ. నా పేరు రాఘవాచారి. ఇక్కడే నారాయణపురంలో ఉంటాను. మాదొక వైదిక బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పుడే అమ్మ పోయింది. అప్పట్నించీ నాన్నగారే కష్టపడి నన్ను పెంచారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను బియస్సీ దాకా చదువుకున్నాను. అయినా ఏం లాభం. సరిగ్గా ఉద్యోగం కోసం నేను ఏ హైదరాబాదో, బెంగుళూరో బయల్దేరే సమయానికి ఆయన పక్షవాతంతో మంచాన పడ్డాడు. దాంతో ఆయన్ని చూసుకోవడానికి ఇక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఉండడమంటే ఊరికే కాళ్ళు చాపుకుని కూర్చుంటే కడుపు నిండదుగా. పైగా నాన్నని ప్రతి నెలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి డబ్బులు చాలా అవసరం. అందుకే ఇక్కడే ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందనిపించింది. రెండు మూడు చోట్ల గుమాస్తాగా చేరాను. కానీ వాళ్ళు జీతం సరిగ్గా ఇవ్వకపోయే సరికి మానేసి పౌరోహిత్యం మొదలెట్టాను. ఒక రకంగా చూస్తే ఇదే బావుందిలెండి. ఎందుకంటారా? ఆ గుమాస్తాగిరి కంటే తల నొప్పి ఇంకోటి ఉండదండీ బాబూ. నెల మొత్తం అడ్డవైన చాకిరీ చేయించుకుని నెలాఖర్లో జీతాలు ఎగొట్టేస్తారు వెదవలు. అదే ఇదనుకోండి. నెలలో ఓ మూడు పిండాలు, నాలుగు పెళ్ళిళ్ళు చేస్తే చాలు. అక్కడ వచ్చే దానికంటే రెండు రెట్లు ఎక్కువే సంపాదించుకోవచ్చు. అందుకే ఈ వేషం. అంతేగానీ నాకు దేవుడు మీద ఎటువంటి నమ్మకం లేదండోయ్."
   "అయితే దేవుడ్ని నమ్మకుండానే ఆయన మీదపడి బతికేస్తున్నావన్న మాట."
   "అసలు ఎందుకు నమ్మాలండీ. ఆయన ఎవరికైనా కనిపించాడా? సరే కనిపించకపోతే పోయాడు. ఆయన్ని నమ్మే వాళ్ళంతా బాగుపడిపోయారా? లేదే. ఇంకా చెప్పాలంటే మా నాన్నగారు తను ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆ భగవంతుడికి చేయని పూజంటూ లేదు. ఇప్పుడు అనారోగ్యంతో మంచాపపడి ఉన్నాడు. ఆ దేవుడు వచ్చి ఆదుకోవచ్చుగా. రాడూ. ఎందుకంటే అసలు ఉంటే కదా రావడానికి."
   నేను అంతలా వాదిస్తున్నా ముసలాయన ముఖంలో మందహాసం తప్ప మరో భావం లేదు. అతను నవ్వే కొద్దీ నాకు కోపం ఇంకా పెరిగిపోతోంది.
   "మరో విధంగా చెప్పాలంటే, మీకు మార్స్ తెలుసు కదా! అదేనండీ కుజుడు. ఆ గ్రహం మీదకి వెళ్ళగలిగేంత టెక్నాలజీ వచ్చేసిందిప్పుడు. అయినా మనం మాత్రం ఇంకా కుజ దోషం, శని ప్రభావం అని పంచాంగం లెక్కబెట్టుకుంటూ కూర్చుంటున్నాం. ఎంత అమాయకత్వమండీ మనది."
   "అయితే దేవుడూ, ఈ పూజలూ, కట్టుబాట్లు అన్నీ కట్టుకథలేనంటావ్."
   "మరి కాక ఇంకేవిటండీ. అంతా బూటకపు మాటలు. అయితే ఒకటి మటుకు నిజమండి. ఏదో అంతుచిక్కని అయస్కాంత శక్తి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ సకల చరాచర సృష్టి ఇనుప రజనులాగా నిత్యం దాని ఆకర్ష, వికర్షణలకు లోనవుతూ ముందుకు సాగుతోంది. తొందర్లోనే ఆ మర్మం కూడా మనుషులు కనిపెట్టేస్తారులే." అంటూ ఆయన వైపు చూశాను. ఆయనలో మళ్ళీ అదే మౌనం. నేను ఇక వాదించడం బాగోదనిపించి అక్కడితో ఆ విషయం పక్కన పెట్టేశాను.
   ఎక్కడ్నించో ఏదో పక్షి ఒకటి వింతగా కూస్తోంది. గాలి సుతారంగా వీస్తుంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. కొంతసేపు ఇరువురం తలలు వొంచుకుని నిదానంగా బాటెమ్మటే నడిచాం. ఆయన నాకంటే మరీ మెల్లగా నడుస్తూ వెనకబడుతున్నాడు అప్పుడప్పుడు. రాను రాను వెలుగు తగ్గుతోంది.
   "గురువుగారు తొందరగా నడవండి." అన్నాను కొంచెం అసహనంగా.
  "ఏం ఎందుకు?" అన్నట్టు చూశాడాయన.
   "ఏం లేదు. పొద్దు పోతోంది. చీకటి పడ్డాక ఈ దారిన నడవడం అంత మంచిది కాదు. దారిలో పురుగుపుట్రా ఉండొచ్చు. పైగా ఈ చోట దెయ్యాలు కూడా తిరుగుతుంటాయని అంటుంటారు ఊళ్ళో జనం."
   నేను దెయ్యం అన్న వెంటనే చటుక్కున చూశాడాయన నా వైపు.
   "కొంపదీసి మీరు దేవుడ్ని నమ్మినట్టు దెయ్యాన్ని కూడా నమ్ముతున్నారా ఏంటి? అయినా నమ్మకుండా ఎలా ఉంటార్లెండి. దెయ్యమంటే గుర్తొచ్చింది. ఒకసారి నా ఫ్రెండుకి నాకూ ఇదే విషయం మీద తగాదా వచ్చింది. దెయ్యాలుంటాయా? ఉండవా? అని వాడూ, నేను చాలా సేపు వాదించుకున్నాక నేనడిగాను 'ఒకవేళ దెయ్యా... సారీ., నువ్వు అన్నట్టు ఆత్మలనేవే ఉంటే అవి శరీరాన్ని వదిలేశాక భగవద్గీతలో చెప్పినట్టు నిరాకారంగా ఉండాలి కానీ, సినిమాల్లో చూపించినట్టు మనిషిలానే ఉండటమేంటోయ్? అంతా వొట్టి ట్రాష్ కాకపోతేనూ!' అని.
దానికి వాడు 'అవును నిజమే నిరాకారంగానే ఉండాలి. అయితే అలా నిరాకారంగా మారడానికి కొంచెం టైం పడుతుందేమో! అప్పటిదాకా అవి ఏ జీవి శరీరంలోంచి బయటికొచ్చాయో ఆ జీవి ఆకారంలోనే ఉంటాయేమో!' అన్నాడు భుజాలెగరేసి.
   నేను'అర్థం కాలేదు. కొంచెం వివరంగా చెప్పు' అన్నాను.
  దానికి వాడు పెద్ద సైంటిస్టులా ఫోజు కొడుతూ. 'లెట్ మి ఎక్స్ ప్లెయన్.' అని ఓ చిన్న గ్యాప్ ఇచ్చి, నా చేతిలోంచి సిగరెట్ లాక్కుని ఓ దమ్ము లాగి,
   'నీటికి ఓ ఆకారం అంటూ ఉండదు. అది ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు అదే నీటిని ఓ పాత్రలో పోసి కొంతసేపు డీప్ ఫ్రీజ్ లో పెట్టి బయటికి తీశామనుకో. నీరు గడ్డకట్టి మంచులా మారి పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడా పాత్ర ఆకారంలోని మంచు కరిగి మళ్ళీ నీరుగా మారడానికి కొంచెం సమయం పడుతుంది కదా. నేను చెప్పేది కూడా అలాంటిదే. జీవి శరీరంలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించిన ఆత్మ కొన్ని సంవత్సరాలపాటూ అందులోనే ఉండటం మూలాన బయటికి వచ్చిన తర్వాత కూడా కొంత సమయం ఆ జీవి ఆకారంలోనే ఉండి మళ్ళీ సూక్ష్మ రూపంలోకి మారి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందన్నమాట!' అన్నాడు.
   వాడి వివరణ విన్నాక నాకు ఎదురు వాదించడానికి నోట మాట రాలేదంటే నమ్మండి." అని నేను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనని ఒకదాని గురించి చెప్పాను.
మొత్తం విని, "బాగా చెప్పాడు." అంటూ నర్మగర్భంగా నవ్వాడే కానీ అంతకు మించి ఇంకొక్కటి మాట్లాడలేదా ముసలాయన.
   అల్లంత దూరంలో భయంకరంగా కనిపిస్తోంది సమాధులమయమైన రుద్రభూమి.
   "అదిగో గురూజీ అదే నేను చెప్పిన శ్మశానం." అన్నాను నేను చూపుడు వేలు ముందుకు పెట్టి చూపిస్తూ.
   ఆయన అటువైపు చూసి తన్మయత్వంతో తల ఊపాడు.
   "మీకు ఆ శ్మశానాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది గురువుగారు? భయమేయట్లేదా?" అడిగాను.
   "లేదు." క్లుప్తంగా చెప్పాడాయన.
   "ఏం ఎందుకు?"
   "భయం ఎందుకు నాయనా? వల్లకాడు లయకారుడి నివాసం. దేవాలయంతో సమానం. నిజం చెప్పాలంటే మాతృ గర్భమంత పవిత్రమైనదది. మనిషి పుట్టేంత వరకూ ఆ తల్లి కడుపులో... చనిపోయిన తర్వాత ఈ తల్లి కడుపులో..."
   చివరి వాక్యం అంటునపుడు ఆయన కళ్ళలో ఏదో వింత కాంతి గోచరించింది నాకు. కాసేపు హిప్నటైజ్ అయిన వాడిలా ఆ కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు గానీ నేను గమనించలేదు ఆయన కుడి కనుబొమ్మ పైనున్న శంఖాకారపు పుట్టుమచ్చని. గోధుమ రంగులో ఉందది. మలిపొద్దు కాంతిలో చిన్నగా మెరుస్తూ.
   "అయితే మీరు చావుకి, శ్మశానానికి భయపడరన్నమాట!?" ఆశ్చర్యంతో అడిగాను ఆయన ముఖంలోకి తీక్షణంగా చూస్తూ.
   "చావు కంటే సుఖాంతమైన ముగింపూ, శ్మశానం కంటే ప్రశాంతమైన ప్రదేశం ఇంకోటి ఉంటుందా చెప్పూ." అంతే తీక్షణంగా చూస్తూ చెప్పాడాయన. విన్న నాకు వొళ్ళెందుకో జలదరించింది.
   ఇంతలో మేము నడుస్తున్న దారి రెండుగా చీలే చోటు వచ్చింది.
   "సరే గురూజీ. మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. నేనూ, మీరూ ఒంటరిగా నడవాలి ఇక్కడినించి." అని ఆయన దగ్గర సెలవు తీసుకుని నారాయణపురం వెళ్ళే దారిలో కొంచెం దూరం నడిచి మళ్ళీ ఏదో మరచిపోయిన వాడిలా వెనక్కి తిరిగి, ఇంకో దారిలో నడుస్తున్న ఆయన్ని "గురువుగారూ..." అంటూ గట్టిగా కేకేశాను. ఆయన తిరిగి చూశాడు.
   "మీ పేరు అడగడం మరిచేపోయాను?" అన్నాను.
   "విశ్వనాథం." అన్నాడాయన గంభీరమైన గొంతుతో.
   సరే అన్నట్టు చేయి ఊపాను.
   నేను అలా చూస్తుండగానే ఆయనా కాలిబాటలో కాస్త దూరం నడిచుకుంటూ వెళ్ళి, అప్పుడప్పుడే చిక్కబడుతున్న చీకట్లో కలిసిపోయాడు.
   నా దారిన నేను ఇంటికొచ్చేశాను.
   ఆ తర్వాత నేను రెండు మూడు సార్లు శ్రీనివాసాపురం వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారీ సోమయాజుల గారిని కలిసి, ఆ పెద్దమనిషి గురించి తెలుసుకుందామని విచారించాను. కానీ అతను ఎవరో ఏమిటో నాకు అంతు పట్టలేదు.
   దాదాపు సంవత్సరం గడిచింది.
   నాన్నగారు చనిపోయి రెండు నెలలు కావొస్తోంది.
   ఆయన పోయినప్పటి నుంచీ నన్నేదో నిర్లిప్తత ఆవరించింది. సిగరెట్టూ, మందు పూర్తిగా మానేశాను. ఆ బాధలోంచి తేరుకోవడానికి ఇంట్లో ఇంగ్లీషు పుస్తకాలేవో ఉంటే వాటిని చదువుతూ, రేడియోలో రోజంతా కాలక్షేపం చేసేవాడిని.
   ఒకనాటి ఉదయం రోజూలాగే ఏదో పుస్తకం చదువుకుంటుండగా సోమయాజుల గారి పాలేరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూశాక గానీ నాకు గుర్తు రాలేదు. ఆ రోజు వాళ్ళింటికి నామకరణం జరిపించడానికి వెళ్ళాలనే విషయం. వెంటనే అతని వెంట బయల్దేరాను.
   నేను వెళ్ళగానే స్వయంగా సోమయాజులు గారే ఎదురొచ్చి "ఎలా ఉన్నావయ్యా?" అంటూ కుశల ప్రశ్నలడిగి, "మనవడు పుట్టేశాడు. ఇక నాకు కొడుకులు లేరనే దిగులు లేదోయ్." అనన్నాడు మీసం మెలేస్తూ. అవును. సోమయాజులు గారికి ఒక్కర్తే కూతురు. తరువాత పిల్లలు కలగలేదు. ఎప్పటి నుంచో ఊరి పెద్దగా వ్యవహరిస్తున్న ఆయనకి, ఆ వారసత్వం పుచ్చుకోవడానికి వారసుడు లేడనే చింత ఎప్పట్నించో ఉంది. ఈ మధ్యే తన కూతురు కొడుకుని కనడంతో ఆ మనిషి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. అతని సంతోషానికి పట్ట పగ్గాల్లేకుండా ఉంది. అందుకే నామకరణానికి ఊరి మొత్తాన్ని పిలిచి, కార్యాన్ని ఘనంగా జరిపిస్తున్నాడు.
   నేను వాళ్ళింటి బయటే అరుగు మీద కూర్చుని పిల్లవాడి జాతకం చూసి, కొన్ని అక్షరాలు చెప్పాను. వాటితో మొదలయ్యే పేరు ఏదైనా ఉంటే పెట్టమన్నాను. దానికి ఆయన నా మీద ఉన్న అభిమానంతో నన్నే ఏదో ఒక మంచి పేరు పెట్టమని అభ్యర్థించాడు. నేను కాదనలేకపోయాను. అయితే అప్పటి వరకూ నేను పిల్లాడ్ని దూరం నుంచే చూశాను కానీ సరిగా గమనించలేదు. సరే ఒకసారి మఖకవలికలు చూసి తగిన పేరు పెడదామని లేచి పిల్లవాడ్ని పడుకోబెట్టిన ఊయల దగ్గరకు వెళ్ళాను. ఊయల చుట్టూ బంధువులంతా మూగి గోలగోలగా ఉంది. సోమయాజులు గారూ, నేనూ వెళ్ళడంతో వాళ్ళంతా తప్పుకుని మాకు దారినిచ్చారు. నేను ఊయల పట్టుకుని పిల్లాడి ముఖంలోకి తొంగి చూశాను. అమాయకంగా నవ్వుతూ, కాళ్ళూ, చేతులు ఆడిస్తున్నాడా పసికందు.
   "ఎలా ఉన్నాడు?" సోమయాజులు గారు అడిగారు.
   నేను ఆయనతో "అంతా మీ పోలికే..." అనబోయి ఆశ్చర్యంతో మళ్ళీ పిల్లవాడి కళ్ళ వైపు చూశాను. తర్వాత నా కళ్ళను మెల్లగా పైకెత్తి చూపు ఆ బాలుడి కుడి కంటి పై భాగాన నిలిపాను.
   అదే శంఖాకారపు మచ్చ!
   గోధుమ రంగులో!
   దాన్ని చూడగానే ఒక్క క్షణం నా ఒంట్లోకి వెయ్యి ఓల్టుల కరెంటు ప్రవహించినట్టు అనిపించింది. శరీరంలోని నాడులన్నీ ఒక్కసారిగా కంపించి, కళ్ళ ముందు నేను సంవత్సరం క్రితం కలిసిన ముసలాయన ముఖం కనిపించింది.
   "విశ్వనాథం!" అని మనసులో అనుకోబోయి పైకే అనేశాను.
   "విశ్వనాథం. పేరు అద్భుతంగా ఉంది." అంటూ మూడు సార్లు పిల్లాడిని అదే పేరుతో పిలిచారు నా పక్కనే ఉన్నటువంటి సోమయాజులు గారు. నేను ఆయన వైపు అయోమయంగా చూశాను. ఆయన వెనకాలే బాబు తల్లిదండ్రులు, బంధువులు ఒకరి వెంట ఒకరు నన్ను తోసుకుంటూ ముందుకొచ్చి ఊయల్ని ఊపుతూ అదే పేరుతో పిల్లాడిని మూడేసి సార్లు పిలవడం మొదలు పెట్టారు. వింటున్న నాకు మెదడు మొద్దుబారి, నీరసంగా అనిపించింది. నేను చూసింది కటిక నిజమో, కాకతాళీయమో అంతు చిక్కలేదు. మరికొంతసేపు అక్కడ ఉండబుద్ది కాలేదు. అందుకే ఎలాగోలా వాళ్ళింట్లోంచి బయటపడి రోడ్డు మీదకు వచ్చి, ఎటు వెళ్ళాలో తెలియని తికమకలో బిరబిరా నడవసాగాను.
   అడుగులతో పాటూ ఆలోచనలు కూడా తడబడుతున్నాయి. నడుస్తున్నంత సేపు ఆ ముసలతను చెప్పిన మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయి. నాకెందుకో మొదటి నుంచి వాటిలో ఏదో గూఢార్థం దాగి ఉందనిపిస్తూండేది. జ్ఞాపకశక్తినంతటినీ కూడదీసుకుని ఆయన మాట్లాడిన ఒక్కో మాటను గుర్తు చేసుకోసాగాను.
   గాఢనిద్ర - చావు కంటే గాఢనిద్ర ఇంకోటి ఏముంటుంది.
   ఎవ్వరికీ కనిపించని కటిక చీకటి ప్రదేశం - తల్లి గర్భం.
   తలక్రిందులుగా - కడుపులో ఉన్నప్పుడు బిడ్డ యొక్క స్థితి.
   పద్దెనిమిది పక్షములు - నవమాసాలు. పిండం శిశువుగా మారడానికి పెట్టే కాలం.
   అంత వేగంగా నడుస్తున్న వాడినల్లా ఎందుకో చప్పున ఆగిపోయాను.
   అంటే నాకు కనిపించిన వృద్ధుడు ఆత్మా!? అతనే సోమయాజులు గారి మనవడిగా పునర్జన్మించాడా!? పునర్జన్మ అనేది నిజంగానే ఉందా!? లేకపోతే లేనిపోనివి ఊహించుకుని, చిన్న విషయాన్ని నేనే భూతద్దంలోంచి చూస్తున్నానా? ఏమో ఏమీ అర్థం కావడం లేదు. ఇదంతా నమ్మాలో, నమ్మకూడదో తెలియట్లేదు. ఒకవైపు జరిగిన సంఘటనలు సాక్ష్యాలుగా మారి నన్ను నమ్మమంటున్నాయి. మరో వైపు నేను చదివిన సైన్స్ అంతా మూడ నమ్మకాలని హెచ్చరిస్తోంది. నాకు నిస్సత్తువతో ఒళ్ళు కంట్రోల్ తప్పుతోంది. నిలబడలేక పోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. రోడ్డు పక్కనే కాస్తంత దూరంలో కానుగ చెట్టొకటి కనిపించే సరికి వెళ్ళి దాని మొదట్లో కూలబడి, తలను దాని కాండానికి ఆన్చి నిస్త్రాణంగా కూర్చున్నాను.
   నాన్న గుర్తొచ్చాడు. తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. మొట్ట మొదటిసారిగా ఈ ఆచారాల్ని, కట్టుబాట్లనీ అన్నింటినీ నమ్మాలనిపించింది. పునర్జన్మ నిజంగా ఉండి మా నాన్న మళ్ళీ నాకు కొడుకుగా పుడితే బాగుణ్ణనిపించింది. అలాగైనా ఆయన రుణం తీర్చుకోవచ్చనిపించింది. కానీ అలా జరిగే అవకాశం ఉందా? చచ్చిన ప్రతి మనిషి మళ్ళీ పుడతాడా? నిజంగానే ఆత్మలున్నాయా? ఉంటే అవి మనుషులకు కనిపిస్తాయా?
బుర్ర నిండా ఏవేవో ప్రశ్నలు గొంగళి పురుగుళ్ళా తొలిచేస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి నాతో ఎప్పుడూ ఉండే రేడియోని యథాలాపంగా ఆన్ చేశాను. ఆ ప్రశ్నలంటికీ సమాధానం ఎఫ్. ఎమ్ లో మళ్ళీ అదే ముఖేష్ పాట. 

‘’జీనా యహా… మర్‌నా యహా… ఇస్‌కే సివా జానా కహా...’’

మరిన్ని కథలు

this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి