ఙానోదయం - పద్మావతి దివాకర్ల

Enlightenment

సాయంకాలం సమయం ఆరుగంటలు దాటినా ఇంకా తన సీట్లోనే కూర్చొని సీరియస్‌గా ఫైల్ చూస్తూ కూర్చున్నాడు రాంబాబు. పనిలో నిమగ్నమై తన స్నేహితుడు కుమార్ వచ్చిన సంగతి కూడా గమనించలేదు రాంబాబు.

"ఏరా! ఆరుగంటలు దాటినా ఇంకా ఏమిటి చేస్తున్నావురా?" అన్న కుమార్ మాటలు వినపడి ఉలిక్కిపడి ఫైల్లోంచి తలెత్తి చూసాడు.

"చాలా అర్జెంట్ ఫైల్‌రా! బాస్ చూడమని ఇచ్చాడు. రేపట్లోగా పూర్తవాలట. నాకు ఇంకో రెండుగంటల సమయం పడుతుంది. నేను తర్వాత వస్తానుగాని, నువ్వెళ్ళు." చెప్పాడు రాంబాబు.

"సాధారణంగా ప్రతీ రోజూ నీవింతేగా! సరే! నేను నీకోసం మరో రెండు గంటలు వేచి ఉండలేను, నేను బయలుదేరతాను." అని చెప్పి బయటకు నడిచాడు కుమార్.

రాంబాబు, కుమార్ ఒకే ఆఫీసులో వేర్వేరు సెక్షన్లలో పని చేస్తున్నారు. ఇద్దరూ ఉందేది ఒకే కాలనీ కావటం వల్ల ఇద్దరూ ఆఫీసుకి కలిసి వస్తారు. కాని ఆఫీస్ వదిలి వెళ్ళేటప్పుడు మాత్రం కుమార్ వెళ్ళిన తర్వాత ఓ రెండుగంటలు దాటాక గానీ రాంబాబు కదలడు. రాంబాబు తనతో వచ్చినా రాకపోయినా వెళ్ళేముందు ఒకసారి పలకరించి వెళ్ళడం పనిగా పెట్టుకున్నాడు కుమార్. ఆ విధంగా రోజూలాగే ఈ రోజూ వచ్చాడు.

రాంబాబు చేతిలో ఉన్నపని పూర్తయ్యేసరికి తొమ్మిది దాటింది. ఆఫీసులో వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. బాస్ చిదంబరం కూడా గంట ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక్క సెక్యూరిటి అతను మాత్రం రాంబాబు ఎప్పుడు వెళ్తాడా, ఎప్పుడు తాళం వేస్తానా అని ఎదురు చూస్తున్నాడు. ఫైళ్ళన్నీ అలమరాలో సర్దేసి ఇంటికి బయలుదేరాడు రాంబాబు.

రాంబాబు ఆ కార్యాలయంలో పద్ధతి ప్రకారం పని చేసే ఉద్యోగి. నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం రాంబాబు. కష్టపడి పనిచేసే ఉద్యోగి కావడంతో పై అధికారులందరూ అతనిపై పూర్తిగా ఆధారపడేవారు. సాధారణంగా ప్రతీ ఆఫీసులోనూ ఉద్యోగుల్లో రెండురకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్టపడి పనిచేసే వారైతే, మరికొంతమంది ఏదో సాకు చెప్పి పని ఎగ్గొట్టడమో లేక మెల్లగా పని చేసే విధానం పాటించే వాళ్ళో ఉంటారు. కార్యాలయాలన్నీ సక్రమంగా నడవాలంటే రాంబాబులాంటి ఉద్యోగులు చాలా అవసరం. అయితే అన్నీ చోట్లా అది సాధ్యం కాదు కదా! ఈ ఆఫీసులో రాంబాబు మినహా మహా అయితే ఇంకో ఇద్దరో ముగ్గురో ఒళ్ళు వంచి పనిచేస్తారు. రాంబాబు మాత్రం ఒంటిచేత్తోనే మొత్తం ఆఫీసు పని చేయగల సమర్థుడు. అందుచేత అధికార్లు రాంబాబు చేతే తమకు కావలసిన పనంతా చేయించుకుంటారు. అలాంటివాళ్ళు ప్రతీ కార్యాలయాల్లోనూ ఒకరో, ఇద్దరో ఉండబట్టే ఆ మాత్రం పనులైనా జరుగుతున్నాయన్నది వాస్తవం.

ఆ మరుసటిరోజు ఆఫీసుకి చేరిన తర్వాత తనకి అప్పగించిన ఫైల్ తీసుకెళ్ళి ఆఫీసరుకి ఇచ్చాడు రాంబాబు.

"రావోయ్ రాంబాబూ! నీలా సమయానికి పని పూర్తిచేసిన వాళ్ళంటే నా కెంతో ఇష్టం. నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ఆఫీసు నడుస్తుందోయ్." అని రాంబాబుని పొగిడాడు చిదంబరం.

ఆ మాటలు రాంబాబులోని ఉత్సాహాన్ని పెంచాయి. రాంబాబులోని ఉత్సాహాన్ని గమనించిన చిదంబరం ఇంకో రెండు ఫైళ్ళు అందించాడు అతనికి.

"చూడు రాంబాబు నీకు పనెక్కువ ఇస్తున్నానని నాకు చాలా బాధగా ఉందోయ్! అయినా తప్పడంలేదు. నీలా సరిగ్గా పని చేసే వాళ్ళెవరూ లేరు మరి! నీవు లేకపోతే మన ఆఫీసే నడవదయ్యా!" అని, "ఇదిగో ఈ రెండు ఫైళ్ళూ కూడా అర్జెంట్‌గా మన హెడ్ ఆఫీసుకి పంపాలి. కాస్త చూడు. ఇంకెవరికీ పని రాక నీకే అప్పగించాల్సి వస్తోందోయ్! ఏమనుకోకు!" చెప్పాడు చిదంబరం.

"ఫర్వాలేదు సార్! మీరేం వర్రీ అవకండి. పని పూర్తిచేసే బాధ్యత నాది." చెప్పాడు రాంబాబు చిదంబరం పొగడ్తలకి ఉబ్బిపోతూ.

ఆ ఫైళ్ళు రెండూ తీసుకొని తన సీటుకి వచ్చి పనిలో మునిగిపోయాడు రాంబాబు. ఆ రోజు కూడా సాయంకాలం అరుగంటలైనా ఇంకా పని పూర్తవలేదు. కుమార్ మళ్ళీ ఠంచనుగా ఆ సమయానికల్లా రాంబాబు వద్దకు వచ్చాడు.

"ఏమిటి రాంబాబు!...ఈ రోజు కూడా నీ పని పూర్తైయేట్లు లేదనుకుంటాను." అని చెప్పాడు.

"అవునురా! ఏం చేయమంటావు? నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? వచ్చేవారం మా చెల్లి పెళ్ళికి సెలవు కావాలి, ఎలా వెళ్తానో ఏమిటో? బాస్ సెలవు ఇస్తాడో లేదో కదా! నేను లేకపోతే అసలు పని జరగదని అంటాడు.” చెప్పాడు రాంబాబు ఫైల్‌నుండి తలెత్తకుండానే.

రాంబాబు మాటలు విని ఫక్కున నవ్వాడు కుమార్.

"ఏమిటీ నువ్వు లేకపోతే ఆఫీస్ సాగదా! ఎవరున్నా, లేకపోయినా పని దానంతట అదే జరుగుతుంది. పనంతా మనవల్లే జరుగుతుందని, మనం లేకపోతే పనే జరగదని భ్రమ పడతాం. అంతే! నువ్వు ఓ పదిహేను రోజులో, నెల రోజులో సెలవుపెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది." చెప్పాడు కుమార్.

"నేనెప్పుడూ మరీ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోలేదు. అదీ ఓ రోజో, రెండురోజులు మాత్రమే. ఈ సారి నాకు వారం రోజులు సెలవు కావాలి. ఆ వారం రోజులకే ఎలా అడగాలా అని మధనపడుతూ ఉంటే ఏకంగా పదిహేను రోజులో, నెలరోజులో అంటే మాటలా! నేనన్ని రోజులు సెలవుపై వెళ్తే ఆఫీసు పని ఎలా జరుగుతుంది?"

"ఒక రోజు సెలవు అడగటానికే నీకు మొహమ్మాటం జాస్తి. ఇన్ని రోజులు సెలవు తీసుకుంటే ఆఫీసు పని ఎలా సాగుతుందోనని బెంగ పెట్టుకోవడం కూడా నీ అమాయకత్వానికి నిదర్శనమే మరి! బహుశా, నువ్వు సెలవులో ఇంట్లో ఉన్నా కూడా ఆఫీసు విషయాలే ఆలోచిస్తూ ఉంటావో ఏమిటో? ఏమైనా మరీ అంత అమాయకత్వం పనికిరాదోయ్! నువ్వు లేకపోతే పని జరగదని అనుకోవడం కూడా ఓ పెద్ద భ్రమే! పోనీ ఇంత కష్టపడుతున్నావని ఎప్పుడైనా పిలిచి ఓ రెండు రోజులు సెలవులో వెళ్ళు అని ఇంతవరకెవరైనా చెప్పారా? అలాగని నేను పని ఎగ్గొట్టమని నీకు సలహా ఇవ్వటం లేదు. నీ సీటు పని చూసుకో! కావాలంటే అర్జెంట్ పనులేవైనా చూడు, ఇతరులకు కావలసివచ్చినప్పుడు పనిలో సహాయపడు, అంతేకానీ మొత్తం ఆఫీసు పనంతా నీ భుజంపై వేసుకొని నేనే మొనగాణ్ణి అని మాత్రం అనుకోకు. దీన్ని ఆధారం చేసుకొని పనులు ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టగా, వాళ్ళ పని కూడా నువ్వే చేస్తున్నావు మరి! నువ్విలా చేసినన్నాళ్ళూ మిగతా వాళ్ళుఎవరూ పని ముట్టుకోరు కూడా! వాళ్ళని పెడదారిన పట్టించిన పాపం కూడా నీదే సుమా! అధికారులు ఎలాగూ తమ పని పూర్తైతే చాలని అనుకుంటారు. కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే అంతా అర్ధమవుతుంది.” అన్నాడు కుమార్.

కుమార్ మాటలు విన్న రాంబాబుకి ముందు కోపం వచ్చింది. కుమార్ వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ఆలోచిస్తే అతను చెప్పిన దానిలో యదార్ధం ఉందని గోచరించింది. అందరూ కావలసినప్పుడు సెలవులపై వెళ్ళగా తనొక్కొడే ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాడు. ఎవరి పని తనకి అప్పగించినా ఎదురు చెప్పకుండా చేయడాన్ని అలుసుగా, అవకాశంగా తీసుకుంటున్నారని అనిపించింది లోతుగా ఆలోచిస్తే. తను అనుకుంటున్నట్లు తను లేకపోతే ఆఫీసు పని సాగదా! మరి తనకి బదిలీ అయి వెళ్ళిపోతేనో? కుమార్ చెప్పినట్లు తను కొద్ది రోజులు సెలవు పెడితేనో? ఎలాగూ చెల్లెలు పెళ్ళి కూడా ఉంది. తండ్రికి సహాయపడినట్లూ ఉంటుంది కూడా అనుకొని అది ఆచరణలో పెట్టాలని భావించాడు రాంబాబు.

ఆ రోజు ఆఫీస్ వదిలేటప్పుడు బాస్ రూముకి వెళ్ళాడు రాంబాబు. తలెత్తి రాంబాబుని చూసి, "ఏమిటి రాంబాబూ! ఏమిటి సంగతి?" అని అడిగాడు చిదంబరం.

"సార్! మా చెల్లిపెళ్ళి ఉంది సార్! నాకో వారం రోజులు సెలవు కావాలి." అడగలేక అడిగాడు రాంబాబు.

రాంబాబు మాట విన్న చిదంబరం వినకూడదనిది వినట్లు తుళ్ళిపడ్డాడు.

"ఏమిటీ? ఏకంగా వారం రోజులు సెలవు కావాలా? నో! నో! నువ్వు కూడా అందరిలాగా అన్నేసి రోజులు ఉండిపోతే మన ఆఫీసు ఏమికాను? నీమీదే పూర్తిగా ఈ ఆఫీసు ఆధారపడి ఉంది. నువ్వు లేకపోతే ఈ ఆఫీస్ ఎలా నడుస్తుంది చెప్పు? చెల్లెలు పెళ్ళి కాబట్టే ఓ రెండు మూడు రోజులు సెలవు పెట్టు. ఇస్తాను." అన్నాడు.

ఈసారి చిదంబరం పొగడ్తలకి రాంబాబు పొంగిపోలేదు. కుమార్ మాటలే గుర్తుకి రాసాగాయి. కుమార్ సలహా కూడా గుర్తుకు వచ్చింది. చేసేదిలేక అలాగేనన్నట్లు ఓ మూడు రోజులకి సెలవు చీటీ ఇచ్చి బాస్ చాంబర్‌నుండి బయటపడ్డాడు రాంబాబు.

రెండు రోజుల తర్వాత సెలవుపై రాంబాబు ఇంటికి వెళ్ళాడేకాని, ప్రతీక్షణం ఆఫీసే గుర్తుకు రాసాగింది. తను లేకపోవడంవల్ల తన బాస్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో, తన సహద్యోగులు ఎంత ఇక్కట్లు పాలవుతున్నారో అన్న ఆలోచనలతోనే సతమతమవసాగాడు. అయితే పెళ్ళి పనుల్లో తలదూర్చి అందులో బిజీ అయిపోయిన తర్వాత ఆఫీసు గురించి ఆలోచించడం తాత్కాలికంగా మానేసాడు. ఆఫీసు నుండి మధ్యమధ్య ఫోన్లు మాత్రం వస్తున్నాయి, వాటికి సమాధానాలు చెప్తూనే ఉన్నాడు.

కుమార్ సలహా అనుసరించి వారం రోజులు సెలవు పొడిగించాడు రాంబాబు తనకు ఒంట్లో బాగులేదన్న సాకు చూపి. అప్పటికీ చిదంబరం ఫోన్ చేసాడు, "ఏంటి రాంబాబూ! చెల్లెలి పెళ్ళి అవగానే నువ్వు వస్తావనుకున్నాను. ఒంట్లో ఎలాగుంది? నయమవగానే వెంటనే వస్తావు కదూ?" అని చిదంబరం ఆదుర్దాగా అడిగినా, అతని ఆదుర్దా అంతా పని గురించేనని, తన గురించి కానే కాదని అతని మాట్లాడే తీరులోనే గోచరించింది రాంబాబుకి. కుమార్ చెప్పిన మాటలు నిజమని అప్పుడు అనిపించింది రాంబాబుకి.

"సార్! పెళ్ళి పనుల్లో ఉండగా వైరల్ ఫీవర్ వచ్చింది సార్! వారం రోజులు సెలవు అడిగాను, కానీ ఇంకా ఎక్కువరోజులు పట్టవచ్చు సార్!" చెప్పాడు రాంబాబు తడబడుతూ. ఎప్పుడూ అబద్ధం ఆడని రాంబాబు అబద్ధం ఆడవలసి వచ్చింది. అయితే పెళ్ళి పనుల్లో అలసిపోయి ఉండటంవల్ల రాంబాబు గొంతు నీరసంగానే ఉంది. అందుకే చిదంబరంకి డౌటేమీ రాలేదు.

"రాంబాబూ, నువ్వు త్వరగా కోలుకొని ఆఫీసుకి రావాలి." అన్నాడు చిదంబరం ఫోన్ పెట్టేస్తూ.

రాంబాబు మీద అమితమైన నమ్మకంగల చిదంబరం ఏమాత్రం అనుమానించలేదు. వారం రోజులు పూర్తవగానే ఇంకా తనకి నయం కాలేదంటూ మరో వారం రోజులు పొడిగించాడు సెలవుని. రాంబాబు మీద సానుభూతితో మళ్ళీ ఆ సెలవు మంజూరు చేసాడు చిదంబరం, మధ్యమధ్య అతని ఆరోగ్య పరిస్థితి కనుక్కుంటూ. చెల్లెలి పెళ్ళై అత్తవారింటికి దిగబెట్టిన తర్వాత కూడా సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్న రాంబాబుని చూసి అతని తల్లితండ్రులు ఆశ్చర్యపోయారు. వాళ్ళెప్పుడు కొడుకు ఇంటికివచ్చినా రాంబాబు ఒకంతట వాళ్ళకి కనపడడు. ఆదివారాలు కూడా ఆఫీసరు ఏదో అత్యవసరమైన పని అప్పచెప్పారంటూ ఆఫీసుకి వెళ్ళిపోయేవాడు. రాంబాబుకి ఉద్యోగంలో ఇబ్బంది ఏమైనా వచ్చిందేమోనని అనుమానపడ్డాడు అతని తండ్రి చలపతిరావు. సరిగ్గా అలాంటి సందేహమే వచ్చింది రాంబాబు తల్లి అన్నపూర్ణమ్మకి కూడా.

రాంబాబు ధ్యాస మళ్ళీ ఆఫీసు మీదకు మళ్ళింది. తను లేకపోవడంవల్ల పనెంత పెండింగ్ పడి ఉంటుందో ఊహించుకోసాగాడు. ఎలాగూ సెలవు నుండి తిరిగి వెళ్ళినతర్వాత మళ్ళీ ఆ పనంతా తనే చేసుకోవాలికదా అన్న భావన కూడా కలిగింది. ఇక ఎంత వేగం వెళ్ళి ఆఫీసు పనిలో పడతానా అని అనికోసాగాడు.

"ఏమండీ! మనవాడికి ఆఫీసులో గొడవలేమైనా అయ్యాయో ఏమో నాకు భయంగా ఉందండీ. ఆఫీసు మాటెత్తడే!" అందామె ఆదుర్దాగా.

"ఏమో నాకూ అనుమానంగా ఉంది. అమ్మాయి శ్రీదేవి పెళ్ళై పదిహేను రోజులైందా, వీడికిక్కడ ఇంకేం పనులు లేవు కదా! మనం సెలవు రోజుల్లో రమన్నా ఊరికి రానివాడు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఉండిపోయాడో అంతుబట్టడం లేదు. వాడి స్నేహితులనెవరినైనా అడగాలి." చెప్పాడు చలపతిరావు. ఇలా వాళ్ళిద్దరూ మల్లాగుల్లాలు పడుతున్నారు. కొడుకుని అడగాలంటే ఎలా అడగాలో తెలియడం లేదు. చివరికి రాంబాబు స్నేహితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఇంకా ఆ మరుసటి రోజు ఫోన్ చేయాలని అనుకుంటూండగానే, ఇన్ని రోజులు పనిపాటా లేక బాగా విసిగిపోయిన రాంబాబు తన బ్యాగ్ సర్దుకోవడం చూసారు వాళ్ళిద్దరూ.

రాంబాబు స్నేహితునికి ఫోన్ చేయబోయిన చలపతిరావు విరమించుకొని, "ఏమిట్రా! అప్పుడే వెళ్ళిపోతావా! మరో వారం రోజులు ఉండకూడదూ?" అన్నాడు కొడుకు ఏమంటాడో అని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో.

"లేదు నాన్నా! ఇప్పటికే నేను వచ్చి చాలా రోజులైంది. మా బాస్ రోజూ రమ్మని పిలుస్తున్నాడు. అక్కడ చాలా పని పెండింగ్‌లో ఉంటుంది నాన్నా! ఇవాళ రాత్రి బస్సుకే నేను బయలుదేరతాను." చెప్పాడు రాంబాబు.

అన్నట్లుగానే రాత్రి బస్‌లో ప్రయాణం చేసి తెల్లారేసరికి తను ఉద్యోగం చేసే ఊరు చేరాడు రాంబాబు. ఇన్నాళ్ళూ తను సెలవులో ఉండటంవల్ల ఆఫీసు పని ఎంత పేరుకుపోయి ఉందోనన్న బెంగ ఒకవైపు ఉంది. ఇంతకమునుపు ఒకటిరెండు రోజులు సెలవు తీసుకున్నప్పుడే తన సీటు పని ఎవరూ ముట్టుకోక తనకోసం అలాగే అట్టిపెట్టి ఉంచారు. అంతేకాక, ఇతరులు సెలవుపెట్టి వెళ్ళినా వాళ్ళపని కూడా తనపైనే పడేది. 'ఇది అతని పని, ఇది నా పని ' అని కాకుండా ప్రతీదీ ఆఫీసుకి సంబంధించే పనే కదా అని ఏది తనకి అప్పచెప్పినా త్రికరణశుద్ధిగా పూర్తి చేసేవాడు. మరి ఇప్పుడు తను ఇన్ని రోజులు సెలవు పెట్టడం వల్ల తన పనే కాక ఇంకా ఇతర అత్యవసర పనులు ఎన్ని తన కోసం ఎదురు చూస్తున్నాయో అని కలవరం కూడా కలిగింది రాంబాబుకి.

సెలవు మరో వారం రోజులు పొడిగించినా మధ్యలోనే హఠాత్తుగా ఊడిపడ్డ రాంబాబుని పలకరించి, అతని ఆరోగ్యం గురించి వాకబు చేసారు తోటి సహోద్యోగులు. వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఆఫీసరుని కలిసాడు.

"రా రాంబాబూ! ఎలా ఉన్నావు? ఒంట్లో బాగుందా? ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందా?" అని పలకరించాడు చిదంబరం.

"ఆఁ...సార్! ఇప్పుడు బాగానే ఉన్నాను." అని జవాబిచ్చి తన సీటువద్దకు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు రాంబాబు.

రాంబాబు టేబులుపై ఫైళ్ళు ఏమీ లేవు. తను ఇప్పుడే వచ్చాడు కదా, ఇక అరగంటలోపు ఫైళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చిపడవా అని వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

గంటసేపు గడిచినా తన సీటుకు సంబంధించిన ఒకటో రెండో ఫైళ్ళేగానీ ఇంకేవీ రాలేదు. అది చూసి ఆశ్చర్యపడిపోయాడు రాంబాబు. తను లేనప్పుడు పెండింగ్ లేకుండా పనంతా ఎలా పూర్తైందని విస్మయం చెందాడు. అంతేకాక ఇప్పుడు సహోద్యోగులందరూ అటూ ఇటూ తిరగకుండా తమ సీట్లోనే కుదురుగా కూర్చొని పని చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత మార్పు ఈ కొద్ది రోజుల్లో ఎలా సంభవమైందో రాంబాబు ఊహకి అందలేదు. తను లేకపోతే ఆఫీసులో పనే జరగదని భావించాడు ఇంతవరకూ కానీ, ఇప్పుడు తను లేకపోయినా పని జరుగుతోంది.

సాయంకాలం ఆరులోపునే యధావిధిగా కుమార్ రాంబాబు వద్దకు వచ్చాడు. ఎప్పుడూ ఏదో ఫైల్ పట్టుకొని సీరియస్‌గా పనిలో మునిగితేలే రాంబాబు ఖాళీగా కనిపించాడు. అలా రాంబాబుని ఖాళీగా చూడటం ఇదే ప్రథమం కుమార్‌కి.

"చూసావా రాంబాబూ!...నువ్వు లేకపోయినా ఆఫీస్ పని ఆగదు. ఇప్పటికైనా గ్రహించావా? వెనకటికి ఒక ముసలమ్మ పెంచుకున్న కోడిపుంజు తను కూయకపోతే తెల్లవారదనుకున్నది నీలాగే. ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఎలాగోలా పని జరిగే తీరుతుంది. మనం లేకపోతే పనే జరగదన్నది మన భ్రమ మాత్రమే." చెప్పాడు కుమార్.

"నువ్వన్నది నిజమే. అయితే నేనున్నన్నాళ్ళూ పనంతా నా మీదనే వేసిన వాళ్ళు ఇప్పుడు ఇంత హఠాత్తుగా బుద్ధిమంతులయ్యారు ఎలా? నా చేతనే బాస్ పూర్తి పనంతా చేయించుకునేవాడు కదా?" ఇంకా సందేహం తీరని రాంబాబు అడిగాడు.

"అదా!...చూడు రాంబాబూ! మన పై అధికార్లకి ఎలాగైనా పని జరగడం అన్నది కావాలి, అది ఎవరి వల్ల అయింది అన్నది అప్రస్తుతం. నీలాంటి వాళ్ళతో ఏ గొడవా లేకుండా శాంతియుతంగా జరిపించుకోవచ్చు. అందుకే అందరూ నీ చేతే పని చేయించుకునేవారు. పని చేయనివాళ్ళూ, రాజకీయంగా అండదండలున్నవారు, యూనియన్లతో సంబంధంగలవాళ్ళూ, ఇతరత్రా ప్రభావితం చేయగలవారితో అనవసరంగా గొడవ పడటమెందుకని వాళ్ళ జోలికి సాధారణంగా వెళ్ళరు. అయితే ఈ సారి నువ్వు ఏకంగా పదిహేను రోజులకుపైగా సెలవులో ఉండటంవల్ల వాళ్ళచేత పని చేయించక తప్పింది కాదు మీ బాస్ చిదంబరానికి. సామ, దాన, భేద, దండోపాయలు ఉపయోగించాడు. మొదట్లో వాళ్ళు నానా గొడవ చేసారు కూడా. అయితే బాస్ వద్ద బ్రహ్మాస్త్రం కూడా ఉంది కదా! అదే మెమోలు, చార్జిషీట్లూ వైగైరాలూ. దెబ్బకి దయ్యం జడుస్తుంది మరి! అంతే అందరూ దారిలోకి వచ్చారు." అన్నాడు కుమార్.

కుమార్ చెప్పినదంతా ఆసక్తిగా, ఆశ్చర్యంగా విన్నాడు రాంబాబు. రాంబాబుకి ఇప్పుడు పూర్తిగా ఙానోదయం అయింది.

"ఇంకో విషయం! అసలు తప్పంతా నీదే! పనంతా నువ్వే కల్పించుకొని చెయ్యడంవల్ల వాళ్ళకి పని ఎగ్గొట్టడానికి అవకాశం దొరికింది. పని నేర్చుకోవడంలో కూడా ఆలసత్వం చూపారు. ఇప్పుడేమో తెలియని పనులు కూడా కష్టపడి నేర్చుకొని మరీ చేస్తున్నారు. మీ సెక్షన్లో జరుగుతున్నదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్క మీ సెక్షన్లోనే కాదు, ప్రతీ ఆఫీసులో జరిగేదిదే! పోనీ, ఇప్పటికైనా నీకు అవగతం అయింది కదా!" చెప్పాడు కుమార్.

"బాగానే తెలిసిందిరా. ఇవాళ నా పనంతా అయిదున్నర అయ్యేసరికే పూర్తైంది. ఇక వెళ్దామా!" అన్నాడు రాంబాబు లేస్తూ.

కుమార్ కూడా లేచాడు. ఇద్దరూ అదే మొదటిసారి ఆఫీసునుండి కలసి బయటపడటం.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి