కరోనా లో అమెరికా ప్రయాణం - లలిత గరిమెళ్ళ

Travel to America in Corona

ఇది కథ కాదు. నిజమైన అనుభవం.

అమెరికా లో కరోనా కేసులు ఆకాశానికి అంటుతున్న రోజుల్లో జరిగింది.

మా ప్రయాణం కరోనా దాడికి ముందే నిశ్చయం అయింది, సరే పరిస్థితులు కొంచం మెరుగయిన తర్వాత వెళ్ళడానికి తయారయ్యాము. అయితే తేడా ఏమిటంటే అక్కడ బాగుపడలేదు కానీ మన దేశం లో కేసు లు ఇంకా పెరిగిపోయాయి.

ఇక ఎక్కడి కి వెళ్ళినా వైరస్ తప్పదులే అని చికాగో ప్రయాణానికి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాము.

ఇక అప్పుడు మొదలయింది గాభరా. ఇది మామూలు ప్రయాణం కాదు. కరోనా మహమ్మారి లో ఖండోతర ప్రయాణం. మామూలుగా అయితే అమెరికా వెళ్ళేముందు ఎంత సరదా, ఎంత హడావిడి. వారాల ముందు డ్రెస్సులు, ఊరగాయలు, స్నాక్స్ లిస్ట్స్, వాటికోసం షాపింగు లు, టైలర్ చుట్టు ప్రదక్షిణాలు. ఇప్పుడు అంతా సందిగ్ధంలో వ్యవహారం.

ఈసారి ఎటువంటి ప్రయాణాలు, విహార యాత్రలు వుండవు. చీరలు అవి మానేసి తేలిగ్గా వుండే లెగ్గింగ్స్, కుర్తిలు తెచ్చుకోమని అమ్మాయి సలహా ఇచ్చింది. భారమైన హృదయంతో పట్టు చీర లు పక్కన పడేసాను. అమెజాన్ లో ఆన్లైన్ లో ఆ లెగింగ్స్ అవన్నీ కొన్నాను. మామూలు జలుబు, దగ్గు వస్తె అందరూ అనుమానం గా చూసే పరిస్థితి కదా ఇప్పుడు. ప్రయాణం లో ఇలాంటి అవాంతరాలు రాకుండా మందులు సర్దుకున్నా ను అతి జాగ్రత్త గా.

అమ్మాయికి, పిల్లలకూ ఏదయినా తీసుకెళ్లాలి కదా! ఇంటి నుండి వెళుతూ ఖాళీ గా ఎలా వెళ్తాము? ప్రతి సారి ఊరగాయలు, గుమ్మడి వడియాలు, అరిసెలు లాంటి స్వీట్స్ పాక్ చేసేవాళ్లం.

ఇప్పుడు షాపింగ్ లే చేయలేదు కదా ! వైరటి గా అనఘా నుండి డిజైనర్ మాస్క్స్ , సనిటైజర్స్ అమ్మాయికి, ఆక్సీ మీటర్ అల్లుడికి, పిల్లలకూ దెట్టూల్ సీసాలు, సోప్స్ తీసుకున్నాము.

విమానం టికెట్ కొన్నప్పుడే వేడి భోజనాలు, కాఫీలు, టీ ఉండవు అని చెప్పారు. అంతే కాకుండా టీవీ వుండదు, బ్లాంకెట్ , తలగడలు ఇవ్వము అని కూడా రాశారు.

ఇక రైలు ప్రయాణం లాగే చపాతీలు, కూరలు, ఏవో చిన్న చిన్న తినుబండరాలు బాక్స్ లో కట్టాను. హ్యాండ్ బ్యాగ్ బదులు ఫుడ్ బ్యాగ్ తయారయింది. లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి

రకరకాల మాస్క్స్ N 95, N 75, లాంటి వి, యూట్యూబ్ నుంచి నేర్చుకుని కుట్టిన కాటన్ మాస్క్స్ , ఇలా ఎన్నో రకాల మాస్క్స్ పోగు చేసాము. వాటి కి ఒక బ్యాగ్ నిండింది. మేకప్ బ్యాగ్ బదులు మాస్క్ బ్యాగ్ అన్నమాట. టీవీ లేదు కాబట్టి టైమ్ పాస్ కి చాగంటి , సామవేదం వారి ప్రవచనాలు, వెరైటీ కి అన్నమయ్య కీర్తనలు ఫోన్ లో పెట్టుకున్నాను.

ఇలా హైదరాబాద్ ఏర్పోర్టు కి బయలుదేరాము. మా టాక్సీ డ్రైవర్ మాముందే కారు సనిటైజ్ చేశాడు. వెనక సీట్ తో కాంటాక్ట్ లేకుండా చుట్టు పోలుతిన్ తో గుడారం లా కట్టుకున్నాడు.

మేము 5 గంటల ముందు ఏర్పొర్ట్ చేరాము. అప్పటి కే కొంత మంది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదటి భయం టెంపరేచర్ 98 డిగ్రీల కన్నా ఎక్కువ వుంటుదేమో అని. లేకపోతే చిన్న దగ్గు, తుమ్ములు రావడం జరిగితే ఎలా ? కానీ మేము బాగానే వున్నాము గాని , మమ్మల్ని పరీక్షించిన హెల్త్ ఆఫీసర్ పని ఒత్తిడి వల్లనో , ఇంత మంది దగ్గిరగా వస్తున్నారని భయం వల్లనో, ఏదో 102 డిగ్రీలు జ్వరం తో వున్నాడని అనిపించింది.

ఇక చెక్ ఇన్ దగ్గిర 5-6 కాగితాలు మీద సంతకం చేయించుకున్నారు. ప్రయాణం మధ్యలో మా ఆరోగ్యం పాడయినా, కరోనా సంక్రమించిన , భాద్యత మాదే, ఎయిర్ లైన్ ది కాదు అన్న మాట.

బోర్డింగ్ పాస్ తో పాటు సానిటైజర్స్, మాస్క్ లు, ముఖానికి అడ్డంగా ప్లాస్టిక్ కవర్ ( వైజర్) ఇచ్చారు.

మిగతా లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము. జన సందోహం తో నిండి, రకా రకాల దుకాణాలు తో కళ కళ లాడే ఏర్పొర్టు , కళా విహీనంగా, నిర్జీవంగా వుంది. అన్ని దుకాణాలు మూతబడి, కుర్చీలు తిరగ బెట్టి అయ్యయ్యో అనిపించింది.

అందరూ భయం భయం గా దూర దూరంగా కూర్చున్నాము. సహజంగా మనకి పక్క ప్రయాణీకులు తో పిచ్చా పాటి అలవాటు గదా. ఎక్కడికి వెళుతున్నారు, ఎన్నో సారి వెళుతున్నారు, పిల్లలు ఎక్కడ వున్నారు అనీ, ఒక వేళ వాళ్ళు మొదటి సారి వెళుతుంటే అక్కర లేని సలహాలు ఇచ్చి టైమ్ పాస్ చేసేవాళ్లం. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా ఎక్కడ కరోనా అంటుకుంటుదేమో అన్నట్లు భయం. ఇంత నిశబ్దం పబ్లిక్ స్థలాల్లో ఎప్పుడు చూడలేదు.

ఏర్ పోర్ట్ క్షేమంగా చేరమని కావాల్సిన వాళ్ల కు ఫోన్లు చేసి , తెచ్చుకున్న చద్ది మూట, సారీ చపాతీ ప్యాకెట్ ఇప్పి డిన్నర్ కానిచ్చాము. ఇక బోర్డింగ్ ప్రారంభం అయ్యేవరకు ఎదురు చూస్తూ కూర్చున్నాము. బోర్డింగ్ కు ముందు మధ్య సీట్ వచ్చిన వాళ్లకు ఒక తెల్ల గౌన్ , పూర్తి శరీరం మునిగేలా వుండేది ఇచ్చారు. మేము కూడా అలవాటు లేని గ్లోవ్స్, మాస్క్, ముఖానికి వైజర్ పెట్టుకుని అంగారక గ్రహ వాసుళ్ళా నడుచుకుంటూ బయలుదేరాము.

మర్చి పోయా, నేను హనుమాన్ చాలీసా పారాయణము కూడా చేసుకున్నా. విమానం లోపలికి వెళ్ళేముందు మళ్ళీ టెంపరేచర్ చూశారు. మళ్ళీ భయం. టెంపరేచర్ బదులు బీపీ చూస్తే సగం మంది ఎక్కేవారు కాదేమో.

ద్వారం దగ్గిర ఏర్ హోస్టెస్ రంగు రంగుల చీర మీద పి పి ఈ సూట్ వేసుకుని, మాస్క్ పెట్టుకుని నమస్కారం పెడుతున్నారు. నవ్వుతూ వున్నారో లేదో తెలీలేదు, మాస్క్ వల్ల.

లోపల మా సీట్ లో ముందే సంచిల్లో కొన్ని రకాల తినుబండరాలు, మంచి నీళ్లు, జూ సేస్ పెట్టి ఉన్నాయి. అంతే కాకుండా ముందు చూపుతో చెత్త పారేయ డా నికి ఒక బ్యాగ్ వుంచారు.

పాసెంజర్స్ కి ఇచ్చిన తెల్ల గౌన్లు మాత్రం దిగిన తర్వాత చికాగో ఏర్ పోర్ట్ లో ప్రత్యేక మైన గార్బేజ్ ఏరియా లో వేయాలని చెప్పారు.

ఇలాంటి కష్ట కాలం లో ఎవరు అమెరికా వెళతారు అనుకున్న మా ఆలోచనలు భిన్నం గా అన్ని సీట్స్ నిండి పోయి వున్నాయి. ప్రయాణీకులను అనవసరం గా తమ తమ సీట్స్ నుండి లేవరాదు అని చెప్పారు. అందువల్ల అంతా నిశ్శబ్దం.

14 గంటల ప్రయాణం లో బాత్రూమ్ తప్పదు కదా., ఆ ఏర్పాటు కూడా బాగానే చేశారు. చాలా సార్లు సనిటిజర్ స్ప్రే తో శుభ్రపరిచారు. ఎక్కువగా చేతి సబ్బులు, సనిటిజర్, నెప్కిన్స్ పెట్టారు.

నిద్రపోతూ, లేస్తూ మొత్తనికి అన్ని గంటలు గడిపాము. చికాగోలో విమానం దిగేసరికి నా ఫోన్లో వున్న ప్రవచనాలు, పాటలు అన్నీ పూర్తి అయ్యాయి.

దిగే సమయం లో మళ్ళీ ఏర్ హోస్టెస్ పాటించవలసిన అన్ని నిభందనలు చెప్పారు. మళ్ళీ రంగు రంగుల చీర మీద పి పి ఈ సూట్ వేసుకుని నమస్కారం పెట్టారు.

అయితే టెంపరేచర్ మాత్రం చూడలేదు. ఇంత మంది ప్రయాణీకుల భారాన్ని అమెరికా దేశం లో పడేసి ఊపిరపీల్చుకున్నారు.

మళ్ళీ మాస్క్ , వైజర్ , గ్లోవ్స్ ధరించి క్రిందకి దిగాము. తర్వాత అంతా సంతోషం తో కొంచం కొంచం మాటలు మొదలు పెట్టాము.

అనేక దేశాల, నుండి వచ్చే వందల కొద్దీ ప్రయాణీకుల తో రద్దీ గా వుండే విమానాశ్రయము లో కేవలం 250 ప్రయాణికులు మాత్రమే వున్నారు.

ఇమ్మిగ్రేషన్ లో ఆఫీసర్స్ మా వేపు కొంచం జాలిగా, కొంచం కోపం గా చూసినట్లు అనిపించింది. మా సమస్యల తో మేం సతమమవుతున్నా ము, మళ్ళీ మీరంతా ఎందుకు అని ఒక రకం గా, ఇండియా లో ఏదో సుఖం గా వున్నారు కదా, పెనం మీంచి పొయ్యి లో పడినట్లు అని ఇంకొంక రకం గా చూసినట్లు అనిపించింది.

అమ్మాయి, అల్లుడు కనిపించేసరికి అన్ని భాధలు మరిచి పోయాము. సనిటిజర్స్ తో చేతులు కడిగి క్షేమంగా ఇంటికి తీసకెళ్లారు.

( ఇంటికి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ మాత్రం చూడలేదు )

తుది మాట : మా మనవరాలు అడిగింది - కరోనా పూర్తిగా తగ్గిన తరువాత మీరు ఏమి కోరుకుంటారు అని. నావి చాలా చిన్న కోరికలు. మేహదిపట్నం రైతు బజార్ కి వెళ్లి జనం మధ్యలో కూరలు కొనాలని, వెంకట రమణ మూర్తి గుడిలో ప్రదక్షిణలు చేయాలని, చట్నేస్ రెస్టారెంట్ లో రవ్వ దోశలు తినాలని, ముఖ్యం గా ఈ మాస్క్స్ తీసేసి పక్కింటి రమ్య తో ఖ బుర్లు చెప్పాలని.


మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి