పంతం పద్మజ - రాజేష్.యాళ్ల

pantam padmaja

"పద్దూ డియర్... ఇప్పుడు మనం మున్నార్ టూర్ వేయడం అవసరం అంటావా?" భార్య చుబుకాన్ని పట్టుకుని అడిగాడు ప్రీతమ్. "ఎన్నోసార్లన్నారు మున్నార్ తీసుకెళ్తానని! కన్నీరే మిగిలింది నాకు!" పద్మజ కనులు జలజలా కన్నీరు రాల్చాయి. "ఆహాహా పద్దూ! హద్దే లేని పంచ్‌లతో భలే చంపేస్తావు సుమీ!" బుట్టలో వేసే ప్రయత్నం చేశాడు ప్రితమ్. "నన్ను బుట్టలో వెయ్యాలని చూడకు ప్రీతమ్! నేను బుట్టలోకి దూరని పాముని!" కస్సుమంది పద్మజ. "నువ్ పగపట్టిన పామువి కావు. నే తాళి కట్టిన భామవి!" రెండు చేతులూ వేసి పద్మిజను దగ్గరగా లాక్కోబోయాడు ప్రీతమ్. "చూడు ప్రీతమ్... నీ ఓవరేక్షన్ ఆపితే బావుంటుంది!" అంటూ అతని రెండు చేతులనూ మధ్యలోనే తన చేతులతో అందుకుని విసరికొట్టింది పద్మజ.. "పోనీ వచ్చే ఏడాది చూద్దామా? ఈ ఏడాది కేరళలో వరదలట!" బ్రతిమాలాడు ప్రీతమ్. "ఆహాహా! నామీద వరదలై పొంగుతోంది నీకు ప్రేమ. వరదలు కేరళలో కాదు బీహార్లో!" మొబైల్ తీసి చూపిస్తూ చెప్పింది. "నీ దగ్గర వెదర్ రిపోర్ట్ కూడా ఉందా పద్దూ?!" తెల్లబోతూ అడిగాడు ప్రీతమ్. "నీ ఫ్యూచర్ రిపోర్ట్ కూడా ఉంది!" గుడ్లురిమింది పద్మజ. "అలా అనకు గానీ ఇప్పటికిప్పుడు కేరళ అంటే కుదరదు. మనకు దగ్గర్లోనే ఉందిగా... చాపరాయి దగ్గరకెళ్లొచ్చేద్దాం!" "చాపరాయీ నాపరాయీ నాకొద్దు. మున్నారే తీసుకెళ్లు. మూడేళ్లనుంచీ అడుగుతున్న ముచ్చట!" మూతి బిడాయించింది పద్మజ. ఈ పేచీలన్నీ ఎప్పుడూ ఉండేవేలే అనుకుంటూ పెళ్లైన మూడేళ్లనుంచీ మున్నార్ టూర్ వాయిదా వేస్తున్నాడు ప్రీతమ్. ఉన్నచోటునే సుఖంగా ఉండాలనే మనస్తత్వం ప్రీతమ్‌ది. ప్రయాణాలంటే అసలు గిట్టదు. మిగతా విషయాలలో బావున్నా కానీ మున్నార్ విషయంలో మాత్రం ఇంత మొండిగా ఎందుకుంటుందో అని ప్రీతమ్ ఎప్పటికప్పుడు బెంగపడుతూ భార్యకు సర్దిచెప్పబోయి భంగపడుతూ ఉండటం ఆ ఇంట్లో రివాజు. "నేనేమైనా నగదడిగానా? నగలడిగానా? మున్నార్‌కేగా ముచ్చట పడ్డానూ?!" ముక్కు చీదింది పద్మజ. 'ఇది అంతకంటే పెద్దరాయే పళ్లన్నీ ఊడగొట్టడానికి' పైకి అనబోయిన మాటల్ని నోట్లోనే వెనక్కు కుక్కేసుకుని, "అయినా మనం ఉండే ఈ అరకు కూడా అందమైన ప్రదేశమే కదా పద్దూ? పైగా నా ఉద్యోగమే ఇక్కడ కూడానూ! అదీ ఓ అదృష్టం అనుకోవాలి మనం!" సర్జిచెప్పబోయాడు ప్రీతమ్. "ఆ ఈ జన్మ ముగిసే వరకూ అరకులోనే తీరీతీరని అరకొర కోరికలతో బతికేద్దాం! ఇంతేగా నువ్ చెప్పేదీ?!" కోపంగా అడిగింది పద్మజ. వేసవిలో చూద్దాం!" వాగ్దానం చేశాడు ప్రీతమ్. "చూద్దాం... చేద్దాం... ఆలోచిద్దాం అని దాటేస్తూ రాజకీయనాయకుడి అవతారం ఇంకా ఎన్నాళ్లు కొనసాగిస్తావ్?!" నిలదీసింది పద్మజ. "వచ్చే మేలో నిన్ను తీసుకెళ్లకపోతే నాకు విడాకులిచ్చేయ్!" శపథమైతే చేసేశాడు కానీ గుండెల్లో గుబులుగానే ఉంది ప్రీతమ్‌కి. "అంత తేలిగ్గా వదలను నిన్ను! జీవితభాగస్వామితో మున్నార్ చూడాలన్నది నా జీవితాశయం!" చెప్పింది "విడాకులిచ్చాక్కూడా జీవితభాగస్వాములు దొరుకుతారు పద్దూ!" అల్లరిగా అన్నాడు ప్రీతమ్. "అలాంటి కలలు కనకు! నేనే నీకో పీడకలను! పీక నొక్కేయగలను!" కోపంగా చెప్పింది పద్మజ. *** దిగాలు ముఖం పెట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు ప్రీతమ్. "చూశావా పద్దూ ఏమైందో?! అన్నట్టుగానే నిన్ను మున్నార్ తీసుకెళదామంటే లాక్‌డౌన్!" "ఔను ప్రీతమ్. చూద్దాం లాక్‌డౌన్ ఎత్తేశాక!" "అవును. తప్పకుండా!" అని పైకి దిగులుగానూ మనసులో దిలాసాగానూ ద్విపాత్రాభినయం చేసేస్తూ 'ఇంకేమెత్తుతారూ... కరోనా వీరంగం చేసేస్తోంటే?!' అనుకున్నాడు ప్రీతమ్. మరో నెల గడిచింది. లాక్‌డౌన్ ఎత్తలేదు. "ఏంచేస్తాం పద్దూ! నీ చిరకాలకోరిక తీర్చలేకపోతున్నా!" ముఖం నిండి బాధను కోటింగ్ వేసేశాడు ప్రీతమ్. "చూద్దాం. ఇంతకూ అన్‌లాక్ అయ్యాకైనా నిజంగా తీసుకెళతావా?!" అనుమానంలో ఆశను కూడా కలిపి అడిగింది పద్మజ. "తప్పకుండా డియర్! నేనుండగా నో ఫియర్!" తిరుపతి వెంకన్నస్వామిలా అభయముద్ర దాల్చాడు ప్రీతమ్. "ఎంత త్వరగా ఈ కరోనా పోతే అంత మంచిదందరికీ!" చెప్పింది పద్మజ. "అవును... ముఖ్యంగా మనకి!" అన్నాడు ప్రీతమ్. అతని మనసులో ఆలోచనలు మాత్రం గుర్రాల్లా పరుగు పెడుతున్నాయ్... 'ఆ ఫుల్ అన్‌లాకింగ్ ఎప్పటికి రావాలీ, ఈ కరోనా ఎప్పటికి పోవాలీ' అంటూ ఆనందంగా! *** మరో నెల గడిచింది. ఆఫీసునుంచి ఇంటికొచ్చి నీరసంగా సోఫాలో కూలబడ్డాడు ప్రీతమ్. "హాయ్ ప్రీతమ్...ఏంటి నీరసంగా ఉన్నావ్!" పలకరించింది పద్మజ. "అయిపోయింది. హాయిగా ఉన్నచోటనే ఉందామంటే మా వాళ్లు ఉండనివ్వడంలేదు పద్దూ!" ఏడుపొకటే తక్కువగా ఉంది ప్రీతమ్ ముఖంలో. "ఏడవకబ్బాయ్! నమ్మకూడదట అలా మగవాడేడిస్తే! ఇంతకూ విషయం ఏమిటీ?!" అడిగింది పద్మజ. "మొన్న ప్రమోషన్ టెస్ట్ పాసయ్యాను కదా! ప్రమోషన్ వచ్చింది పద్దూ!" "అయితే ఇంకేం? ప్రమోషన్ వస్తే ఎగిరి గంతేయాలి గానీ మోషన్ రానట్టుగా పెట్టావేంటీ మొహం?! "ఇక్కడే ఇస్తారనుకున్నా పద్దూ! కానీ మా కాఫీబోర్డ్ ఇంకెక్కడో కూడా తగలడింది కదా! అక్కడికేశారు!!" ప్రీతమ్ ముఖంలో గంటు మరింత పెద్దదైంది! "ఇంకెక్కడో అంటే ఎక్కడకి?!" అడిగింది పద్మజ. "అడిమలి." "అదెక్కడుందీ?!" "కేరళలో పద్దూ! చిన్నప్పటినుంచీ జిల్లాయే దాటలేదు పద్దూ? నాకెందుకీ శిక్ష చెప్పు?!" వాపోయాడు ప్రీతమ్. "అయ్యో పిచ్చిమొద్దూ... చిన్నపిల్లాడివా ఏంటి? మంచి ప్రదేశానికే వెళతాంగా!" నవ్వు దాచుకుంటూ అడిగింది పద్మజ. "ఏం మంచి ప్రదేశం?! కేరళంటే ఎంత దూరమో నీకు తెలుసుగా?!" ఉడుక్కుంటూ అన్నాడు ప్రీతమ్. "అడిమలి అంటే అక్కడినుంచి మున్నార్‌కి ఇరవై కిలోమీటర్లేగా దూరం?!" ఈసారి ముఖంలో సంబరాన్ని దాచుకోలేకపోయింది పద్మజ. "ఓసినీ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకెవడో వచ్చి చుట్టకి నిప్పడిగినట్టుంది నీ సంబరం! కొంపదీసి నీ హ్యాండ్ గానీ ఉందా?!" అనుమానంగా చూశాడు ప్రీతమ్. "మరి మున్నార్‌కి నువ్ మామూలుగా తీసుకెళ్లేలా లేవుగా?! శబరిమలై స్వామి అయ్యప్పకు మొక్కుకున్నా!" నవ్వింది పద్మజ "కొంప ముంచాడు నీ స్వామి అయ్యప్ప!?" హతాశుడైపోయాడు ప్రీతమ్. "అయ్యయ్యో అపచారం అయ్యప్పనేమీ అనకూడదు." లెంపలేసుకుంది పద్మజ. "ఇప్పుడేదీ దారి?!" అన్నాడు దీనంగా ప్రీతమ్. "మన దారి రహదారి. సామాన్లు సర్దుదాం పదండి!" కొంగు బిగించింది పద్మజ. "అవున్లే నీ పంతం నెరవేరుతోందిగా!" పటపటా పళ్లు నూరాడు ప్రీతమ్. "మళ్లీ వెనక్కు తెచ్చేయమని ఆ అయ్యప్పనే అడుగుదాంలే ప్రీతమ్." కాఫీబోర్డ్ డైరెక్టర్‌గా ఉన్న తన గాఢ స్నేహితురాలి చిన్నాన్న కొడుకు అయ్యప్పకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రీతమ్‌ను ఓదార్చింది పంతం పద్మజ. ***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి