daanam - సన్నిహిత్

Donate

ఏ.టీ.ఎం లో డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చిన రాఘవ విపరీతమైన కంగారుకి లోనయ్యాడు. దానికి కారణం అక్కడ పార్క్ చేసిన అతని బైక్ కనబడలేదు. అటూ ఇటూ చూసి

" బాబూ ! ఇక్కడ నా బైక్ ఉండాలి...నువ్వు చూసావా ? " అంటూ సెక్యూరిటీ గార్డ్ ని ఆశగా అడిగాడు .

"లేదు సార్ ! చూడలేదు " కేర్లెస్ గా చెప్పాడు ఏటీయం సెంటర్ బయట తన్మయంగా బీడీ కాలుస్తున్న సెక్యూరిటీ గార్డ్ .

అప్పటికే టైము సాయంత్రం ఆరు దాటింది. శీతాకాలం కావడంతో త్వరగా చీకట్లు కమ్ముకుంటున్నాయి.అక్కడే నిలబడి ఆ ఏ.టీ.ఎం సెంటర్ వైపు దిగులుగా చూసాడు రాఘవ!.

పావుగంట క్రితం మనీ డ్రా చేద్దామని వచ్చి బైక్ ఏ.టీ.ఎం సెంటర్ బయట పార్క్ చేసాడు.హడావుడిలో బైక్ లాక్ చేసాక కీస్ తీసుకున్నాడో లేదో గుర్తు లేదు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాక చూసుకుంటే బైక్ లేదు. మైండ్ బ్లాంక్ అయింది రాఘవకు. పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న బైక్ అది. ఎంతో జాగ్రత్తగా చూసుకొనే వాడు. ఈ రోజు నెత్తి మీద ఏదో శని కూర్చున్నట్లు అజాగ్రత్త అయిపోయాడు.

ఆశ చావక అటూ ఇటూ బయట తిరుగుతూ బైక్ కోసం వెదకసాగాడు. ఇంతలో అక్కడికి కొంతమంది కుర్రవాళ్ళ గేంగ్ వచ్చింది.అందరూ ఇరవై లోపు వయసున్న వాళ్ళే ! . చూడ్డానికి అల్లరి చిల్లరగా ఉన్నారు.

" ఏంటి అంకుల్ వెదుకుతున్నారు ? " అమాయకంగా అడిగాడు ఒక అబ్బాయి.

" కాసేపటి క్రితం నా బైక్ ఇక్కడే పార్క్ చేసాను బాబూ...ఇప్పుడేమో లేదు. అందుకే వెదుక్కుంటున్నాను " చెప్పాడు

" ఆహా ...అలాగా ...మేము కూడా వెదుకుతాము ఉండండి " అంటూ కాసేపు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు.

వాళ్ళ ప్రయత్నం కూడా వృధా అయింది.

అసలు రాఘవ ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఆఫీసు కాగానే ఇంటికి వెళుతూ కూరగాయలు కొందామని పర్సు తెరిస్తే పైసా లేదు. అందుకే హడావుడిగా ఏటీయం సెంటర్ కి వచ్చి డబ్బులు డ్రా చేసాడు. కానీ ఎప్పుడూ లేనిది బైక్ ఎలా పోయిందో రాఘవ కి అర్థం కాలేదు.ఒకవేళ బయట దూరంగా కూర్చున్న కొంతమంది వృద్ధులు చూసారేమోనని వాళ్ళని కూడా వాకబు చేసాడు. వాళ్ళు కూడా బ్లాంక్ ఫేస్ పెట్టారు. అన్ని దారులూ మూసుకుపోయినట్లు నిస్సత్తువగా అనిపించింది రాఘవకు.

ఇక బైక్ దొరుకుతుందన్న ఆశ పూర్తిగా చచ్చిపోవడంతో అలాగే కూలబడిపోయాడు. అల్లరి గేంగ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. బైక్ దొరికే మార్గం కనపడక తల పట్టుక్కూర్చున్నాడు. చాలా సేపటి నుండి అతని అవస్థని గమనిస్తున్న సెక్యూరిటీ గార్డ్ " ఎందుకు సార్ అంత పరేశాన్ అవుతావు...చౌరస్తా లో ఉన్న పోలీస్ స్టేషన్ కి పో ! ఒక కంప్లెయింట్ ఇవ్వు. వాళ్ళే చూస్కుంటరు " అంటూ సలహా ఇచ్చాడు . మనసులో ఏదో ఆశ రెప రెప లాడగా వెంటనే కాళ్ళీడ్చుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న చౌరస్తా కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్సై ని కలిసాడు. మొత్తం విషయమంతా ఒక కంప్లెయింట్ కింద వ్రాసి ఇచ్చాడు.

" ఓకే ! మేం చూసుకుంటాము. బైక్ ట్రేస్ కాగానే మీకు ఇంఫార్మ్ చేస్తాం వెళ్ళి రండి " అని చెప్పాడు ఎస్సై.

" థాంక్యూ సార్ ! కొంచెం తొందరగా వెతికి పెట్టండి. మీకు పుణ్యముంటుంది " అని చెప్పి అక్కడనుండి బయట పడ్డాడు.

* * *

" ఏంటండీ బాగా అలసటగా కనిపిస్తున్నారు...పైగా లేట్ అయింది...ఆఫీసులో పని ఎక్కువయిందా ? " ప్రేమగా అడిగింది భార్య రమణి అతని చేతిలోని కూరగాయల సంచి అందుకుంటూ .

" పనీ కాదు...గాడిద గుడ్డూ కాదు. ఏటీయం సెంటర్ దగ్గర బైక్ పోయింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి వచ్చేటప్పటికి ఇంత టైము అయ్యింది " నీరసంగా చెప్పాడు.

" అమ్మో బైక్ పోయిందా ! ఇప్పుడెలాగండీ ? నెల నెలా కడుతున్న చిట్టీ పాడి మరీ కొనుక్కున్నాము. మళ్ళీ కొనాలంటే ఎంత కష్టం " ఏడుపు మొహంతో చెప్పింది రమణి.

" ఏం చేస్తాం ? బైక్ బయట పెట్టి ఏ.టీ.ఎం లోకి వెళ్ళి వచ్చేటప్పటికి పోయింది.లాక్ చెయ్యడం మరిచిపోయి కీస్ దానికే వదిలేసాను. పోనీ... మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన భగవంతుడి దయ ! " వేదాంత ధోరణి తో చెప్పాడు రాఘవ. ఉసూరుమంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది రమణి. అదో రకమైన స్తబ్దత ఆవరించింది అక్కడ. భార్య ఇచ్చిన కాఫీ నిశ్శబ్దంగా త్రాగి బాత్రూం లో దూరాడు రాఘవ.స్నానం చేస్తుండగా ఒకటే ఆలోచనలు. ' ఈ మధ్య తనకి మతి మరుపు ఎక్కువయింది. బహుశా వయసు నలభై దాటుతుండటం వలన కాబోలు. లేకపోతే చేతి లోని బైక్ పోగొట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం ? . ఏది ఏమైనా ఇక మీదట తను చాలా కాన్షియస్ గా ఉండాలి ' అని నిర్ణయించుకున్నాడు

* * *

రాత్రి పది దాటింది... స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ అతిధులతో కళ కళ లాడుతోంది. ఒక టేబిల్ చుట్టూ కూర్చుని మందు కొడుతున్నారు మన అల్లరి గేంగ్ ! అందరూ మంచి జోష్ లో ఉన్నారు.

" రేయ్ ...ఇందాక అంకుల్ కి మస్త్ జలక్ ఇచ్చినాం లే " నవ్వుతూ చెప్పాడు ఒకడు

" అవున్రా... మస్త్ మజా వచ్చింది " మత్తుగా చెప్పాడు ఇంకొకడు.

" బైక్ పోయిందని తెగ పరేశాన్ అయిండు కదా అంకుల్ " చేతిలో ఉన్న బైక్ కీస్ ని స్టైల్ గా తిప్పుతూ అన్నాడొకడు. ఆ కీస్ రాఘవ పోగొట్టుకున్న...కాదు...కాదు... ఈ కుర్రాళ్ళు దొంగిలించిన రాఘవ బైక్ వి. రాఘవ ఏటీయం సెంటర్ లోకి వెళ్ళగానే అటుగా వచ్చిన ఈ గేంగ్ హేండిల్ కి కీస్ తో ఉన్న బైక్ ని గమనించారు. నెమ్మదిగా కొంత దూరం దాన్ని

తోసుకుంటూ వచ్చి అక్కడి నుండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు.

" అవున్రా...మనం కూడా వెతుకుతున్నట్టు ఫోజ్ కొడితే నిజమే అని నమ్మేసిండు...మస్త్ ఏక్టింగ్ రా భాయ్ మనది " తెగ సంతోష పడిపోయాడు ఇంకొకడు. శాడిస్టిక్ ఆనందం అనుభవిస్తూ అందరూ కలిసి మందు కొడుతున్నారు.

ఆ కుర్రాళ్ళందరూ సాయంత్రం కాగానే ఊరి మీద పడి తిరుగుతారు. ఎవడినో ఒకడిని బకరాని చేసి ఈ విధంగా ఏడిపిస్తారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు కొట్టి ఏ అర్థరాత్రి దాటాకో ఇళ్ళకు చేరుతారు. ఇదే వాళ్ళ దిన చర్య.తాము చేసేవి చిన్న చిన్న అల్లరి పనులే అనుకుంటారు. కానీ అవి ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెడతాయన్న స్పృహ వాళ్ళకి లేదు. తప్పు వాళ్ళదో , వారి జీవన విధానాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులదో అన్నది కాలమే నిర్ణయించాలి .

* * *

కాల చక్రంలో నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఒక అందమైన వెన్నెల రాత్రి .....

షిరిడీ నుండి బయలు దేరిన ట్రేవెల్స్ బస్ తెలంగాణ వైపు సాగిపోతోంది. హైదరాబాద్ చేరుకోవడం దాని గమ్యం. టైము రాత్రి పది దాటింది. ప్రయాణికులు టీవీలో ప్లే అవుతున్న ' జులాయి ' సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అదే బస్ లో రాఘవ కూడా ఉన్నాడు. మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్ళి బాబాను దర్శించుకొని వస్తున్నాడు.

కాసేపటికి ఒక ధాబా దగ్గర బస్ ఆగింది. " సార్ ! డిన్నర్ చేసే వాళ్ళు దిగండి...బస్ ఇక్కడ అరగంట మాత్రమే ఆగుగుతుంది " అని డ్రైవర్ గట్టిగా అరిచి చెప్పాడు. నెమ్మదిగా ప్రయాణికులంతా బస్ దిగారు. రాఘవ కూడా బస్ దిగి ధాబాలోకి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు .ఇంతలో వచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు ఒక యువకుడు. అతడు తనతో పాటూ బస్ లో ప్రయాణిస్తున్న యువకుడు. అయితే అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది రాఘవకి. కాసేపు దీర్ఘంగా ఆలోచించాక గుర్తొచ్చింది. గతంలో తన బైక్ పోయినప్పుడు ఏ.టీ.ఎం. సెంటర్ దగ్గరకు వచ్చి వెతికిన కుర్రాళ్ళ గేంగ్ లోని ఒకడు అతను. మనసు చురుక్కు మనిపించింది. అప్పట్లో తన బైక్ దొరకలేదు. పోలీసులు కూడా పెద్దగా సహకరించలేదు. ఆ తర్వాత ఎప్పటికో తెలిసింది ఈ కుర్రాళ్ళ గేంగ్ తన్ బైక్ ని దొంగిలించారని. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి లాభం. అందుకే ఆశ వదిలేసుకున్నాడు. అంతా గుర్తొచ్చి మనసు బాధతో మూలిగింది. ఇంతలో సర్వర్ ఫుడ్ తీసుకు రావడంతో తినడం మీద దృష్టి పెట్టాడు.

కాసేపటి తర్వాత తలెత్తి చూసాడు రాఘవ. ఆ యువకుడు తననే చూస్తుండటంతో మాట కలిపాడు.

" ఏం బాబూ ...హైదరాబాద్ వరకు వస్తున్నావా ? "

" అవునంకుల్ . పూణే లో జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్ లో మా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని చూడటం కోసం వెళుతున్నాను " చెప్పాడు ఆ యువకుడు.

" ఆహా...అలాగా...నీ పేరేంటి ? "

" రవిరాజ్...అందరూ రవి అని పిలుస్తారంకుల్ " చెప్పాడు

" ఆహా...చూడు రవీ నాన్నగారు ఏం చేస్తుంటారు ? " ఆసక్తిగా అడిగాడు.

" నాన్న గారు బి.డి.ఎల్ లో పనిచేస్తారంకుల్. అమ్మ హౌస్ వైఫ్ . నేను ఒక్కడినే కొడుకుని. మన హైదరాబద్ లోనే ఏదో ఒక జాబ్ చూసుకోమంటున్నారు. కానీ నాకు పూణే లోనే చెయ్యాలనుంది. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే చేస్తున్నారు అందుకని " చెప్పాడు రవి.

" సరే దానికేముంది.హైదరాబాద్ లో మంచి జాబ్ వస్తే వచ్చెయ్ " అని చెప్పాడు రాఘవ. ఈ లోగా డిన్నర్ పూర్తవడంతో ఇద్దరూ వచ్చి బస్ లో కూర్చున్నారు. బస్ కదిలింది.

* * *

టైము అర్థరాత్రి దాటింది. బస్ వేగంగా తన గమ్యం వైపు దూసుకుపోతోంది. ప్రయాణికులందరూ మంచి నిద్రలో జోగుతున్నారు. అసలే వోల్వో బస్, పైగా రోడ్డంతా ఖాళీ. డ్రైవర్ హుషారుగా ఏక్సిలిరేటర్ తొక్కుతున్నాడు. గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో బస్ పరుగెడుతోంది. డ్రైవర్ పక్కనే కూర్చున్న క్లీనర్ కం అసిస్టెంట్ నెమ్మదిగా మాటలు కలిపాడు.

" రోడ్డు ఇలాగే ఖాళీగా ఉంటే హైదరాబాద్ తొందరగా చేరుకోవచ్చన్నా "

"అవున్రా ...అయినా మన్ ఓనర్ అసలు నాకు రెస్ట్ ఇవ్వడం లేదురా . డ్యూటీల మీద డ్యూటీలు ఏస్తున్నాడు. పైసలు అడిగితే నకరాలు చేస్తున్నాడు దొంగ నా కొడుకు " కసిగా తిట్టాడు.

" ప్రైవేట్ లో అంతే అన్నా . ఇంతకు ముందు నేను లారీ లో పని చేసాను, అక్కడా అంతే...నరకం చూపించే వాడు ఓనర్ "

" సరేలే ...మన బతుకులే ఇంత " స్వగతంగా అనుకున్నాడు డ్రైవర్.

ఇంతలో వెనక నుండి ఒక ఇండికా కారు వాడు హారన్ కొడుతూ ఓవర్టేక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. రియర్ మిర్రర్ లో అది చూసి దారి ఇచ్చాడు డ్రైవర్. వాడు ముందుకు దూసుకుపోయాడు.

" ఏంటన్నా ...ఇలా అందరికీ మనం దారి ఇస్తూ పోతే హైదరాబాద్ తొందరగా వెళ్ళినట్టే " అంటూ రెచ్చగొట్టాడు అసిస్టెంట్. అది డ్రైవర్ ఇగోని దెబ్బ కొట్టింది. ఏక్సిలిరేటర్ ని బలంగా తొక్కాడు. ఆ ఇండికా వాడిని ఓవర్టేక్ చెయ్యడం ఇప్పుడతని లక్ష్యం. రేసు మొదలైంది. ఇవేమీ తెలియని ప్రయాణికులు హాయిగా నిద్రలో అందమైన కలలు కంటున్నారు.

బస్ డ్రైవర్ కి కనుచూపు మేరలో ఇండికా కనపడలేదు. అయినా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. కొంతసేపయ్యాక ఇండికా కనపడింది.గట్టిగా హారన్ కొడుతూ వాడిని ఛేజ్ చెయ్యసాగాడు. వీడి గోల భరించలేక ఇండికా వాడు దారి ఇచ్చాడు. వెంటనే కుడి వైపు నుండి ఓవర్టేక్ చెయ్యసాగాడు బస్ డ్రైవర్. అసిస్టెంట్ హుషారుగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అప్పుడే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది.ఓవర్టేక్ ఛేస్తుండగా బస్ వెనుకభాగం డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ తాకిడికి స్పార్క్ వచ్చి పక్కనే ఉన్న పెట్రోల్ టేంక్ అంటుకుంది. మంటలు చెలరేగాయి. ఇదంతా రియర్ మిర్రర్ లో చూసి డ్రైవర్ కంగారుకి లోనయ్యాడు . ఆ టెన్షన్ లో స్టీరింగ్ ని పూర్తిగా ఎడమవైపుకి తిప్పేసాడు.కానీ రోడ్డుకి ఎడమ వైపు చిన్న లోయలాంటిది ఉంది. బస్ అందులోకి వేగంగా జారి పోయింది. ఈ హడావుడికి మెలుకవ వచ్చిన ప్రయాణికులు హాహాకారాలు మొదలు పెట్టారు. " రక్షించండి ...రక్షించండి " అంటూ గట్టిగా అరవసాగారు.క్షణాల్లో బస్ పూర్తిగా తగలబడసాగింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి . అలా మండుతూనే బస్ లోయలోనికి జారుతూ చదునుగా ఉన్న ఒక చోట ఆగిపోయింది. ఎవరికి వారు అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

రాఘవ చుట్టూ చూసాడు. దట్టమైన పొగ. ఏమీ కనబడటం లేదు. ఎమర్జెన్సీ విండో పక్కనే ఉన్న ఒక సుత్తి ని తీసుకుని అద్దాన్ని గట్టిగా పగలగొట్టాడు. భళ్ళున అద్దం పగిలింది. చల్లటి గాలి ప్రవేశించడంతో పొగ కొంచెం తగ్గ సాగింది.ఈ లోగా వేరే అద్దాలు కూడా పగలగొట్టారు కొందరు ప్రయాణికులు. అవకాశం ఉన్న వాళ్ళు బస్ లో నుండి బయటకు దూకేస్తున్నారు. రాఘవ కూడా బయటకు దూక బోతుండగా అతని చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. కళ్ళు చిట్లించి చూసాడు. అతడు రవి. తలకు పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. కళ్ళు మూసి తెరుస్తున్నాడు. రాఘవ గబ గబా అతడిని భుజం మీద వేసుకుని బస్ లో నుండి బయటకు దూకేసాడు.

" నీకేం కాదు రవీ . నేనున్నాను. ధైర్యంగా ఉండు " అంటూ రోడ్డు మీద అలా ముందుకు పరుగు తీస్తున్నాడు రాఘవ. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన స్థలానికి కొంచెం దూరంలోనే అహ్మద్ నగర్ సిటీ ఉంది. రాఘవ గబ గబా అక్కడికి చేరుకుని అందుబాటులో ఉన్న ఒక హస్పిటల్ కి వెళ్ళాడు. అప్పటికే అక్కడి స్టాఫ్ కి ప్రమాదం సంగతి తెలియడంతో అప్రమత్తంగా ఉన్నారు. రాఘవ తీసుకొచ్చిన పేషెంట్ రవి ని వెంటనే ఎమెర్జెన్సీ వార్డ్ కి తరలించారు. అవసరమైన వైద్యం ప్రారంభించారు. వార్డు బయట కుర్చీలో అలసటగా కూలబడ్డాడు రాఘవ. కిటికీ లో నుండి వీస్తున్న చల్లటి గాలికి అతడి వంటికి పట్టిన చెమట ఆరసాగింది. ఆ కుర్చీలోనే తల వెనక్కి వాల్చి రిలాక్సింగ్ గా కళ్ళు మూసుకున్నాడు రాఘవ.

ఒక పది నిముషాలు గడిచాక " సార్...సార్ " అని నర్స్ పిలుస్తుండటంతో కళ్ళు తెరిచాడు.

" సార్...రవి గారికి చాలా రక్తం పోయింది. బ్లడ్ కావాలి . కాకపోతే చిన్న ప్రోబ్లెం. రవి గారిది రేర్ బ్లడ్ గ్రూప్. ఓ నెగిటివ్. బ్లడ్ బేంక్ నుండి తేవాలంటే టైం పడుతుంది. " అంటూ హిందీలో చెప్పింది. రాఘవకు అర్థమైంది. పరిస్థితి క్రిటికల్.

"ఫర్వాలేదమ్మా...నాది కూడా ఓ నెగిటివ్ గ్రూపే . నేను బ్లడ్ ఇస్తాను. " అని చెప్పి లేచాడు. ఇద్దరూ లోనికి దారి తీసారు.

రక్తదానానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది డాక్టర్. రక్తం ఇచ్చాక రవి కోలుకున్నంతవరకు అక్కడే ఉన్నాడు రాఘవ. హాస్పిటల్ ఖర్చులన్నీ భరించాడు. రవి పూర్తిగా కోలుకున్నాక టాక్సీ లో హైదరాబాద్ కి బయలుదేరారు ఇద్దరూ.

* * *

కొన్నేళ్ళ తర్వాత...ఒక ఆదివారం...

ఎండ మండిపోతోంది. అసలే వేసవి కాలం , పైగా మధ్యాహ్నం పన్నెండు దాటింది. రోడ్డు మీద జనం పలచగా ఉన్నారు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు రాఘవ.స్కూటర్ స్థాయి దాటి కారు లెవెల్ కి అతడు చేరుకుని సంవత్సరం అయింది. ఏదో బేంక్ వాళ్ళు లోన్ ఇవ్వడంతో కారు కొనుక్కున్నాడు....

పొద్దున్న టిఫిన్ చేసి హైదరాబాద్ నుండి బయలు దేరాడు రాఘవ. హైదరాబాద్ దాటగానే వచ్చే ఒక పల్లెటూళ్ళో ఉన్న మిత్రుడి ఇంటికి వెళ్ళడం అతని లక్ష్యం . చిన్నప్పుడు కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు. ఎప్పటి నుండో రమ్మని పోరు పెడుతుండటంతో కదలక తప్పలేదు రాఘవకు. ఎఫ్.ఎం రేడియో లో వస్తున్న పాటలు వింటూ హుషారుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో సడన్ గా ఏదో సౌండ్ వస్తుండటంతో కారుని రోడ్డు పక్కగా ఆపాడు రాఘవ.దిగి చూస్తే వెనక టైర్ పంక్చర్ అయింది. ప్రాణం ఉసూరు మంది. బండిలో స్టెఫినీ లేదు. ఏం చెయ్యాలో పాలుపోక కారుని లాక్ చేసి చుట్టూ చూసాడు. రోడ్డు ని ఆనుకుని చిన్న కాలిబాట కనబడింది.ఎవరి సహాయం అయినా దొరుకుతుందేమో అన్న ఆశతో ఆ దారి గుండా నడవడం ప్రారంభించాడు. అది ఒక అందమైన మామిడి తోపు లోకి దారి తీసింది. చుట్టూ చూస్తే కొంత దూరంలో మనుషుల అలికిడి వినిపించింది. అటు దారి తీసాడు.

అక్కడొక అందమైన ఆశ్రమం !తపస్సు చేసుకుంటున్న ౠషి పుంగవుడిలా ఉంది. ఆసక్తిగా అటు కదిలాడు రాఘవ !

ఒక పక్కగా కొంతమంది చిన్న పిల్లలు చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్నారు. వాళ్లకి కొంత దూరంలో వృద్ధులైన స్త్రీ పురుషులు కుట్లు , అల్లికలు చేసుకుంటున్నారు. మధురమైన భగవద్గీత పారాయణం ఆశ్రమం లో నుండి వినవస్తోంది. ఏదో ఒక కొత్త ప్రపంచం లోకి వచ్చిన అనుభూతి కలిగింది రాఘవకు. ఇంతలో...

"గురువు గారూ మీరా ! రండి...రండి" అంటూ ఆహ్వానించాడు ఒక కుర్రాడు. అతడు రవి...రవిరాజ్.

" రవీ ...నువ్వేంటి ఇక్కడ ? ఏమిటి ఇదంతా ? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాఘవ.

" ఇదంతా మీ చలవే గురువు గారూ . మీరు నేర్పిన మానవత్వం తో నేను పూర్తిగా మారిపోయాను. ఈ తోట మాదే . నేను పూణే లో జాబ్ మానేసి ఇక్కడికి వచ్చేసాను. ఆ పిల్లలు వృద్ధులు ఎవరూ లేని అనాధలు. వాళ్ళని చేరదీసి ఒక నీడ కల్పించాను " అని చెప్పాడు రవి. ఇంతలో రవి తల్లిదంద్రులు అక్కడికి వచ్చారు. పరిచయ కార్యక్రమాలయ్యాక రవి తండ్రి " చాలా థేంక్స్ బాబూ ! ఆనాడు మా అబ్బాయి ప్రాణాలు కాపాడి మమ్మలని బ్రతికించారు. వాడికేదైనా అయితే మేం ఎప్పుడో చనిపోయేవాళ్ళం " అంటూ రాఘవ చేతులు పట్టుకున్నాడు.

" అయ్యయ్యో ఫర్వాలేదండీ ! ఆ టైములో ఎవరున్నా అలాగే సాయం చేస్తారు . " అంటూ మొహమాటంగా నవ్వేసాడు.

ఇంతలో రవి అందుకుని " నన్ను క్షమించండి అంకుల్. అప్పట్లో మీ బైక్ దొంగిలించింది నేనే . ఆ తర్వాత ఆ బైక్ ని అమ్మేసి నా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాను. బైక్ పోయిందని బాధ పడుతున్న మిమ్మల్ని చూసి శాడిస్టిక్ ఆనందం అనుభవించాము మేమంతా ." అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు.

" అవును బాబూ. నా బైక్ దొంగిలించింది నువ్వు, నీ ఫ్రెండ్స్ అని షిర్డీ నుండి మనం వచ్చే దారిలో కలిసినప్పుడే గుర్తు పట్టాను. కానీ నీ మీద నాకు కోపం రాలేదు. వయసు జోరులో ఇలాంటి సరదాలు సహజమే ! కాకపోతే ఆ సరదా శృతి మించి ఎదుటి వాళ్లని బాధపెట్టకూడదు. మన ఆనందం ఎదుటి వాడి దుఃఖానికి హేతువు కాకూడదు. అయినా ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. ఎంతో ఎత్తుకు ఎదిగావు. పదిమందికి సాయం చేస్తున్నావు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది " అంటూ నవ్వేసాడు.

" నాకు మీ రక్తం దానం చేసి పునర్జన్మనిచ్చారు. ఆ రక్తం తో పాటే ' ఎదుటి వాడికి సాయం చేయాలి ' అన్న మీ దృక్పథం కూడా నా ఒంట్లో చేరింది. మారకుండా ఎలా ఉంటాను ? పూర్తిగా మారిపోయానంకుల్ ! నిజమైన అనందం అనేది తోటి వాళ్లకి సాయపడటం లోనే ఉన్నది అని జరిగిన ప్రమాదంలో చావు దాకా వెళ్ళి తిరిగి బ్రతికాక తెలుసుకున్నాను. స్వానుభవాన్ని మించిన గురువు లేడు కదా ! " అంటూ చేతులు జోడించి నమస్కరించాడు.

" మంచిది బాబూ ...దీర్ఘాయుష్మాంభవ " అంటూ దీవించాడు రాఘవ. ఏదో సాధించిన సంతృప్తి రాఘవ మొహంలో స్పష్టంగా కనపడింది.

--------------0------------------------

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి