తప్పు చేసావు భార్యామణీ! - పద్మావతి దివాకర్ల

you done mistake darling

"తప్పు చేసావు భార్యామణీ!' అని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న బాలరాజు అన్న మాటలు విన్న బాలామణి ఒక్కసారి ఉలిక్కిపడింది. కట్టుకున్న భర్త కట్టప్పలా ఇలా డైలాగ్ వదిలేసరికి డైలామాలో పడింది బాలమణి. బాలరాజు కట్టుకున్న మొగుడే కానీ కట్టుబానిస కాడే! మరి ఈ మాటలకి అర్ధమేమిటో దేవుడా అని ఆందోళనతో ఆలోచనలో పడింది. తనేం తప్పు చేసిందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు బాలామణికి.

కొంపదీసి తన వాట్సప్ సందేశాలు గానీ చూసాడా? అయినా సందేహం కలిగించే విషయాలేవీ లేవే అందులో! తను, తన స్నేహితురాళ్ళందరూ ముద్దుగా 'మధు ' అని పిల్చుకొనే మాధురితో తన చాటింగ్‌గానీ కొంపదీసి చూసి అనుమానం పడ్డాడా? పొరపాటున అత్తగారి గురించి ఏమైనా తెలియక వాగిందా? భర్త తరఫు వాళ్ళపైన తెలియక ఎమైనా చాడీలు గానీ చెప్పిందా? తన తల్లితో మాట్లాడేటప్పుడు చాటుగా విన్నాడేమో? అలా అనాలోచితంగా ఏమీ అనలేదే? మరి తను తప్పేం చేసిందో అర్ధం కాలేదు. ఏం పొరపాటు చేసిందో ఎంత ఆలోచించినా..చించినా గుర్తు రాలేదు.

ఆఖరికి భయపడుతూ, "నేను తెలిసి ఏ తప్పు చేయలేదండీ! పొరపాటు ఏమైనా జరిగితే చెప్పండి వెంటనే సరిదిద్దుకుంటాను." అందామె.

ఎంతైనా కొత్త పెళ్ళికూతురు! పెళ్ళై ఇంకా నెలరోజులు కూడా కాలేదు. తన అమ్మమ్మ చెప్పినదానిబట్టి కనీసం ఆరునెలలైనా భర్తవద్ద అణుకువగా ఉండాలి. ఆ తర్వాత, ప్రొబేషన్ తీరిపోయిన తర్వాత ఎలాగూ జీవితాంతం బాలరాజే తనకి అనుగుణంగా నడుచుకోవాలి. అంతవరకూ అతనికి భయపడటం తప్పదు. ఆ తర్వాతెలాగూ అతను తనని చూసి భయపడవలసిందే మరి!

ముందుంది ముసళ్ళపండగ అని తెలియని బాలరాజుకి పాపం బాలామణి తనకి భయపడి అణుకువగా మాట్లాడటం చూసి చాలా ముచ్చటేసింది.

ఇన్నాళ్ళుగా తనకెవరూ భయపడలేదు, అందరూ భయపెట్టేవారే మరి! ఇంట్లో తండ్రి దగ్గరనుండి ఆఫీసులో బాస్‌దాకా అందరూ తనని భయపెట్టేవారే! స్కూల్లో, కాలేజీలో సీనియర్లకి, టీచర్లకి, లెక్చరర్లకి ఎలాగూ భయపడక తప్పలేదు. ఇన్నాళ్ళకి తనకి భయపడే జీవి దొరికినందుకు చాలా సంతోషమనిపించింది బాలరాజుకి.

"ఏంలేదు బాలామణీ! కాఫీలో పంచదార బదులు ఉప్పు వేసినట్లున్నావు." చెప్పాడు.

ఏం తప్పు చేసిందో, ఏం పొరపాటు చేసిందోనని ఏవేవో ఊహించుకున్న బాలామణి వెంటనే నాలిక్కరుచుకుంది. పెళ్ళికాకముందు ఎప్పుడూ వంటిల్లు మొహం చూడని బాలామణి తెల్లనివన్నీ పంచదారే అని నమ్మింది. ఇప్పుడు ఉప్పుది కూడా అదే రంగని గుర్తుకువచ్చింది.

'ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు ' అన్న వేమన శతకం చిన్నప్పుడు చదివి మర్చిపోయింది. కర్పూరం వాసన రాలేదు కనుక అది కచ్చితంగా పంచదారేనని భావించి కాఫీలో కలిపింది. అయితే ఇప్పుడే ఉప్పు, పంచదార ఒక్క పోలికలో ఉంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. వెంటనే నిజాయితీగా తన తప్పు ఒప్పుకొని, "పొరపాటు అయిందండీ! తప్పు చేసానండీ! మళ్ళీ కాఫీ సరిగ్గా కలుపుకొస్తాను" అని చెప్పి వంటిట్లోకి వెళ్ళింది.

ఆమె తన పొరపాటు తెలుసుకుందని గ్రహించి ఆనందంతో పొంగిపోయాడు బాలరాజు. తన తాత చెప్పినవన్నీ మరోసారి గుర్తు చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలోనే భార్య చేసే పొరపాట్లని, తప్పుల్ని ఎత్తి చూపుతూ భార్యని గుప్పిట్లో పెట్టుకోవాలని అనుభవపూర్వకంగా తెలుసుకొని మనవడికి బోధించాడాయన. ఆయన చెప్పిన సూత్రాలనే ఇప్పుడు తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు బాలరాజు. ఈ మధ్యనే చూసిన బాహుబలి రెండవభాగం ప్రభావం నుండి ఇంకా బయటపడని బాలరాజు పెళ్ళాం చేసే పొరపాటు గమనించినప్పుడల్లా 'తప్పు చేసావు బాలామణి!' అనో 'తప్పు చేసావు భార్యామణీ!' అని అనడమో పరిపాటి అయింది.

బాలరాజు అలా అన్నప్పుడల్లా ఉలిక్కిపడటం పరిపాటైంది బాలామణికి. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు తనేమేమి పొరపాట్లు చేసానో అని ఒకొక్కటి గుర్తుకు తెచ్చుకుంటోందామె.

అలా మరో రోజు భోజనం చేస్తున్నప్పుడు, "మళ్ళీ తప్పు చేసావు బాలామణీ!" అని బాలరాజు గట్టిగా అనేసరికి నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న బాలామణికి ఒక్కసారి పొలమారింది. నెత్తిమీద కొట్టుకుంటూ మంచినీళ్ళు తాగి భర్తవైపు భయం భయంగా చూసింది ఏమిటన్నట్లు.

బాలరాజుకి తెలియకుండా పక్కింటావిడతో మాట్నీ షోకి చెక్కేయడంగాని అతను గమనించాడా అని ఓ క్షణం ఆలోచించిందామె. బాలరాజు తన పాత షర్టులు, ప్యాంట్లు ఇచ్చి బదులుగా స్టీలు సామాన్లు తీసుకున్న విషయంగాని తెలుసుకున్నాడా, లేక అతనికి తెలియకుండా ఇంటి ఖర్చులకిచ్చిన డబ్బుల్లో కొంత మిగుల్చుకొని ఎదురింటి ఆవిడతో మాల్‌కి వెళ్ళి తనకోసం చీర కొనుక్కున్న వైనంగాని తెలుసుకున్నాడా కొంపతీసి అని ఆందోళన చెందిందామె. ఎంతైనా ఆర్నెల్ల ప్రొబేషన్ తీరడానికి ఇంకా ఓ నెలరోజులు ఓపిక పట్టాలని ఆమె ఆంతర్యం.

అయితే ఆమె ఊహించినవేమీ అసలు బాలరాజుకి తెలియవు.

"పప్పులో ఉప్పెక్కువైంది." అని ఆమె తప్పిదాన్ని మరోసారి ఎత్తిచూపాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది బాలామణి.

"సారీ అండీ! తప్పు చేసానండీ! కూరలో వేయాల్సిన ఉప్పు మర్చిపోయి పప్పులో వేసాను." సంజాయిషీ ఇచ్చిందామె.

"అయితే డబుల్ తప్పు చేసావు బాలామణీ! ఇంకా నేను కూర రుచి చూడనే లేదు." అన్నాడు.

ప్రతీసారి బాలమణికి ఇలా అనడం, ఆమె తనేం తప్పు చేసిందో గుర్తుచేసుకోవడం అలవాటైంది ఇద్దరికీ.

బాలామణి చేసిన తప్పు ఎత్తిచూపినప్పుడల్లా ఆమె చిగురుటాకులా వణికిపోతున్న దృశ్యం బాలరాజుకి కడు కమనీయంగా తోచసాగింది.

ఓ (అ)శుభ ముహూర్తాన సాయంకాలం స్నేహితులతో మందు పార్టీ చేసుకొని, ఆ వాసన బయటకి రాకుండా కిళ్ళీ బిగించి ఇంటికి తిరిగి వచ్చాడు బాలరాజు. అమ్మమ్మ ట్రైనింగ్‌లో బాగా ఆరితేరిన బాలామణి ఆ విషయం వెంటనే పసిగట్టేసింది. కిళ్ళీ బిగించి ఇంటికి తిరిగి వచ్చినట్లైతే ముందే మందు కొట్టి ఉండొచ్చని స్వానుభవంతో అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయామెకి.

వెంటనే. "తప్పు చేసావు బాలరాజూ!" అంది సరిగ్గా బాలరాజు అన్న స్టైల్లో.

ఆ మాటలు విన్న బాలరాజు ఒక్కసారి ఖంగుతిన్నాడు. అతను విస్తుపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. తను మందుకొట్టినట్లు తెలిసిపోయిందన్న కారణం ఒకటైతే, ఇన్నాళ్ళూ భయంభయంగా తన అడుగులకు మడుగులొత్తుతూ "తప్పు చేసానండీ!" అని మెల్లగా అన్న బాలామణి ఇప్పుడు తన డైలాగ్‌తోనే రివెర్సులో నిలదీసిందన్నది రెండో కారణం. అమ్మమ్మ చెప్పిన మొదటి సలహాగా ఆర్నెల్ల కాలం బాలరాజు ఆగడాల్ని భరించింది బాలామణి ఇప్పటివరకూ.

అయితే, బాలామణి ఆర్నెల్ల ప్రొబేషన్ ఆ ముందు రోజే పూర్తైన విషయం పాపం బాలరాజుకి తెలియదు. సమయానికి వాళ్ళ తాతగారు కూడా ఆ ఊళ్ళో లేరు బాలరాజుకి ఆ విషయం చెప్పడానికి.

ఊహించని విధంగా భార్యామణి అయిన బాలామణికి దొరికిపోయి నీళ్ళు నమిలాడు పాపం బాలరాజు. అయినా బింకంగా, "తప్పు చేసావు, బాలామణీ! భర్తని అలా నిలదీయకూడదు!" అన్నాడు ధైర్యం కూడగట్టుకొని.

"ఆ డైలాగు ఇప్పుడు నాది! తప్పు చేసింది నేను కాదు మీరు! తాగేవాళ్ళంటే నాకు అసహ్యం అని మీకు ముందే చెప్పానుగా!" అంది బాలామణి.

మరి కిక్కురుమనలేదు బాలరాజు. ఆ తరువాత మూతిబిగించి మాటామంతీ లేకుండా మూడంకెవేసి అలకపానుపు ఎక్కేసింది. భర్తని గుప్పెట్లో పెట్టుకోవడానికి తన అమ్మమ్మ చెప్పిన ఈ రెండో సలహాని అమల్లో పెట్టింది.

పెళ్ళిలో పెళ్ళికొడుకుకి అలకచెందే అవకాశం ఒక్కసారే వస్తుంది కాని, పెళ్ళైన తర్వాత పెళ్ళానికి ఆ అదృష్టం ఎల్లవేళలా వచ్చే అవకాశం ఉందని బాలరాజుకి పాపం తెలియదు. 'అలక ' అనేది భార్యామణి యొక్క జన్మహక్కని, వాటి పేటెంట్ రైట్సు ఆమెకి మాత్రమే ఉన్నాయని, తనకి పెళ్ళిరోజు ఒక్కరోజు మాత్రమే ఆ హక్కుని వినియోగించే వెసలబాటు ఉందని అప్పుడు గాని తెలియలేదు బాలరాజుకి! పాపం అతనేం చేస్తాడు! ఈ విషయం తాతయ్య తనకి చెప్పలేదు మరి! తాతయ్య మీద కోపం వచ్చి పళ్ళు నూరుకున్నాడు బాలరాజు. వారం రోజుల వరకూ ఆ అవతారం కొనసాగించిందామె.

అలాగే ఒకసారి సిగరెట్లు తాగుతూ, మరోసారి స్నేహితుడింట్లో పేకాడుతూ దొరికిపోయాడు. ప్రతీసారి అదే డైలాగ్‌తో చితక్కొట్టేది బాలామణి. అలకపానుపు అవతారం సరేసరి!

ఏం చేయాలో అర్ధం కాక తాతయ్య సలహా తీసుకోవాలని అనుకున్నాడు బాలరాజు. సమయానికి సలహా ఇవ్వడానికి ఊళ్ళో లేకపోతేనేం, ఫోన్ ఉందిగా! వెంటనే తాతకి ఫోన్ చేసి అతని సహాయ సహకారాలు అర్ధించాడు. బాలరాజు తాతయ్య మనవడు మొర పెట్టుకున్నదంతా విని, "ఒరే బాలరాజూ! అమ్మాయి తప్పులు ముందునుండే ఎత్తి చూపి గుప్పిట్లో పెట్టుకోవాలన్న నా సలాహా కరక్టే! అయితే ఇలా ఎన్ని సార్లు చేసేవేమిటి మనవడా!" అడిగాడు అతను.

"ఓఁ...చాలా సార్లు చేసాను తాతయ్యా! కాఫీలో చక్కెర బదులు ఉప్పేసిందని, పప్పులో ఉప్పెయలేదని, కూరలో కారం ఎక్కువైందనీ ఇలా రోజూ చాలా సార్లే ఆమె చేసిన తప్పులు, పొరపాట్లు గుర్తు చేస్తునే ఉన్నాను తాతయ్యా!" చెప్పాడు బాలరాజు.

"తప్పు చేసావు మనవడా! నీ కొంప నువ్వే ముంచుకున్నావు కదరా మనవడా!" అన్న తాతయ్య మాటలు విని బాలరాజు విస్తుపోయాడు.

"అదేంటి తాతయ్యా అలాగనేసావు?" అన్నాడు విషయం అర్ధంకాక.

"అవును బాలరాజూ! నువ్వు అప్పుడప్పుడూ భార్య మూడ్ చూసుకొని తప్పులు ఎత్తి చూపాలేకాని, రోజస్తమానూ అదే పని మీద ఉండకూడదు. అంతేకాక, కొన్ని తప్పుల వరకూ నువ్వు కాయాల్సింది, సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ముడే శిశుపాలుడి వంద తప్పులవరకూ కాసాడు. నువ్వు ఈ ఆర్నెలలో బాలామణి తప్పుల్ని వెతికి పట్టుకొని మరీ కొన్ని వేలసార్లు వేధించి ఉంటావు! ఇప్పుడు అనుభవించు తప్పుతుందా!" అన్నాడు తాతయ్య.

"అదేంటి తాతయ్యా! నువ్వు ఇచ్చిన సలహాయే కదా నేను పాటించింది." ఆక్రోశంతో చెప్పాడు బాలరాజు.

"నిజమే! నేను చెప్పానుగాని, నువ్వు లిమిట్ దాటిపోయావు మరి! అంతే కాక నా మాటల్ని సగం వరకే విన్నావు నువ్వు అభిమన్యుడిలా! నీ భార్యకి ఎవరి సలహాలు, అండదండలూ ఉన్నాయో కూడా నువ్వు గుర్తించాలి మరి! నీ భార్యేమో అర్నెల్లు వరకూ ఓపికపట్టి ఆ తర్వాత విరుచుకుపడిందంటే ఆమెకి కూడా కచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ సలహానో, బామ్మ సలహానో అంది ఉంటుంది. నాకు స్వానుభవమైన ఆ హెచ్చరికే నీకు చేద్దామనుకుంటే నువ్వు సగమే విని పద్మవ్యూహంలోకి జొరబడిపోయావు. మీ బామ్మ నన్నెంత హడలెత్తించిందో వేరే చెప్పాలా? ఇక నీ సంగతేమిటో నువ్వే చూసుకో? మరి నన్నిక అడగకు. ఇదిగో బామ్మ పిలుస్తోంది నన్ను, త్వరగా వెళ్ళకపోతే చీల్చి చెండాతుంది." అని బాలరాజుని అతని ఖర్మానికి వదిలి పోన్ పెట్టేసాడు తాతయ్య.

బామ్మ, తాతయ్య సంగతి తెలిసి కూడా తాతయ్య సలహా విన్నందుకు తనని తానే నిందించుకొని బాలామణి ముందు తల వంచాడు పాపం మన బాలరాజు. అవును మరి, రోట్లో తలపెట్టి రోకలిపోటుకి వెరుస్తే అవుతుందా!

ఆ మరుసటి రోజు బాలామణి సంతోషంగా అమ్మమ్మకి ఫోన్ చేసింది, "అమ్మమ్మా! నువ్వు చెప్పినట్లే చేసానే! ఇప్పుడు బాలరాజు మందు, సిగరెట్లు, స్నేహితులు అన్నీ మానేసి నా కొంగు పట్టుకొనే తిరుగుతున్నాడు! నీ రెండో సలహా బాగానే పని చేసిందే! ఇక మూడో సలహా అవసరం ఉండదనుకుంటాను" అంది.

"జాగ్రత్త! అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే అ మూడో సలహా అయిన ఆయుధ ప్రయోగం చెయ్యాలి సుమా!" అంది అమె మనవరాలి ప్రజ్ఙకి ఉబ్బిపోతూ.

"ఆయుధ ప్రయోగం చేసే అవసరం రానే రాదులే అమ్మమ్మా! బాలరాజు నీ రెండో సలహాకే చిత్తైపోయాడు." అంది బాలామణి.

తాతయ్య చెప్పబోయేదాన్ని పూర్తిగా వినకుండా తను చేసిన తప్పుకి తానే పోయిన బాలరాజు జీవితాంతం బాలామణికి కట్టుబానిసైపోయాడు.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి