భలే మందు - బుద్ధవరపు కామేశ్వరరావు

Good medicine

"ఏమే, నాంచారీ? మొద్దు మొహమా ? రాత్రి తిన్న కంచాలు కడగకుండా అలా వదిలేసావ్? ఆ ఎంగిలి కంచాలు మీ ఎంకట్రావు వచ్చి తోముతాడా?" అది తన తల్లి గొంతు. "అలాగే తోముతాడు కానీ, ఇంతకీ ఆ ఎంకట్రావు ఎవడే రామలక్ష్మీ?" అది తన భార్య అంజని గొంతు. "ఇంకెవడు ? మీ బాబు, అదే మీ నాన్న!" "ఔనా? అయినా మా బాబు ఎందుకు తోముతాడే? అవసరమైతే ఆ అంజిబాబు వచ్చి తోముతాడు" "అంజిబాబా ? ఆడెవడు??" "ఇంకెవడు? మీ బాబు. అదే నా మొగుడు" కరాఖండీగా చెప్పింది అంజని. వంటింట్లో మొదలైన ఉరుములు... పిడుగుల రూపంలో దారి మళ్ళి, తన వైపు దూసుకు రావడంతో, చెవుల్లో తువ్వాలు కుక్కుకుని, ఏమీ ఎరగనట్టు మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు అంజిబాబు. ఎవరికైనా అమ్మవారి అష్టోత్తరాలతో, ప్రతిదినం తెలవారుతుంది. కానీ పాపం అంజిబాబుకు మాత్రం అత్తా కోడళ్ళ దుష్టోత్తరాలతో మెలకువ వస్తుంది.

***** ***** ***** *****

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో, కొడుకు అంజి బాబు ను చాలా గారాబంగా పెంచింది రామలక్ష్మి. తన అన్న గారి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంది, కానీ అంజిబాబు మటుకు తల్లిని ఎదిరించి ఆమె మాట వినకుండా తన క్లాసు మేట్ అంజని ని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. తన మేన కోడలు బదులుగా ఈ ఇంటి కోడలిగా అంజని వచ్చిందన్న దుగ్ధతో, కోడలి మీద చెలరేగి పోతూ ఉంటుంది రామలక్ష్మి. కాపురానికి వచ్చిన మొదటి రోజుల్లో, "అంజీ! మీ అమ్మేంటి నన్ను నా పేరుతో కాకుండా నాంచారీ అని తిడుతుంది?" అమాయకంగా అడిగింది అంజని. "ఓహ్ అదా ? టూ బర్డ్స్ ఎట్ ఒన్ షాట్ అన్న మాట. అంటే, మా నాన్నమ్మ పేరు నాంచారమ్మ. ఆవిడ మా అమ్మని రాచి రంపాన పెట్టేదట. అదిగో ఆవిడ మీద, నీ మీద ఉన్న కోపాన్ని ఒకే సారి ఇలా ఆ పేరెట్టి సాధించడం ద్వారా తీర్చుకుంటోందన్న మాట" తల్లి తిట్ల వెనుక ఉన్న రహస్యం చెప్పాడు అంజిబాబు. మొదట్లో కొన్నాళ్ళు మౌనంగా ఉండి భరించినా, అత్తగారు తగ్గక పోవడంతో తను కూడా మాటలకు పదును పెట్టింది అంజని. అటు ఎంతో గారాబంగా పెంచిన తల్లి, ఇటు ఎంతో ప్రేమతో చేసుకున్న భార్య.

ఇద్దరినీ సముదాయించ లేక రైలు చక్రానికీ, రైలు పట్టాకు మధ్య పడి పచ్చడయి పోయిన పావలా బిళ్ళలా అయి పోయింది పాపం, అంజిబాబు పరిస్థితి, గడచిన మూడేళ్లుగా.

***** ***** ***** *****

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన అంజిబాబుకు, తల్లి, పెళ్లాం మద్య మొదలైన "రామాంజనీయ యుద్ధం" సాయంత్రం ఆట సాదర స్వాగతం పలికింది. "ఏమే నంగనాచి నాంచారీ! నేను గుడికి వెళ్లగా చూసి, మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆ సందువా పెట్టె రోడ్డు మీద పడేస్తావా?" అంటూ కోడలు మీద యుద్ధం ప్రకటించింది రామలక్ష్మి.

"ఏం చేసుకుంటావ్, పాత బడిపోయిన ఆ పల్లవుల కాలం నాటి పాడు పెట్టె? అందుకే బయట పడేసాను. హాయిగా ఉందిప్పుడు!" కయ్యానికి కాలు దువ్వింది అంజని. "అంటే పాత బడిపోయినవి అన్నీ బయట పడేస్తావా?"

రెచ్చగొట్టింది అత్తగారు. "ఏం డౌటా ? అవసరమైతే నిన్ను కూడా" రెచ్చిపోయింది కోడలు. "ఔనా ? సరే ఏం చేస్తానో చూడు" అంటూ, అంజని పుట్టింటి వారిచ్చిన టీవీని ఓ పెద్ద పహిల్వాన్ లా రెండు చేతులతో ఎత్తి, "ఐదేళ్లు మీ నాన్న వాడుకుని మనకిచ్చిన ఇక్ష్వాకుల కాలం నాటి ఈ దిక్కు మాలిన టీవీ ఇక్కడెందుకే?" అంటూ బయట పడేయడానికి సంసిద్ధమౌతున్న తల్లి, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్న భార్యల మధ్యలోకి దూకిన అంజిబాబు, గంజి పెట్టిన బట్టలా అణిగి పోయాడు. ఇక ఈ యుద్ధ విరమణ సంధులు, రాయబారాల ద్వారా జరిగే పని కాదనీ, ఇక నువ్వే దీనికి పరిష్కారం చూపాలని ఆ భగవంతునికి భక్తితో విన్నవించుకున్నాడు అంజిబాబు. ఈ లోగా తన బాల్య మిత్రుడు బికారా ఫోన్ చేయడంతో, యుద్ధ విరమణ వ్యూహాలకు తాత్కాలిక విరామం ప్రకటించి, ఫోన్ ఎత్తాడు అంజి.

***** ***** ***** *****

ఓ నాలుగు రోజుల తరువాత, ఉదయాన్నే గుమ్మ ముందు నిలబడ్డ ఇద్దరు వ్యక్తులను చూసి ఆశ్చర్య పోయాడు అంజిబాబు. వారు తమ గురించి పరిచయం చేసుకోగానే, లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోపెట్టాడు. అప్పటికే రామాంజనీయ యుద్ధం ఉదయం ఆట మొదలై పోయింది వంటింట్లో. బిక్కుబిక్కుమంటూ వింటున్నారు ఆ మిత్ర ద్వయం. నాకు ఇది మాములే అన్నట్టు పేపరు తిరగేస్తున్నాడు అంజిబాబు. "ఏమే నాంచారీ, నిన్ను తగలెట్టా, ఇది అట్టా? ఇందులో అట్టేదే ? అన్నీ కన్నాలే. కుక్కలు కూడా ముట్టవు ఈ అట్టుని" కయ్యిమంది రామలక్ష్మి. "ఒసేయ్ రాముడూ! ఆ అట్టు కుక్కలకు కాదు, నీకే. డాక్టర్ నిన్ను చేయమన్నది డైటింగ్ కానీ నాతో ఫైటింగ్ కాదు. తిని తగలడు" సర్రుమని జవాబు ఇచ్చింది అంజని. "డాక్టర్ చెప్పకేం? ఎన్నయినా చెప్తాడు. నేను ఓ పది రూపాయలు ఎక్కువ ఇస్తే, నీకు అన్నం కాకుండా మేకలా నమలేలా ఆకు కూరలే పెట్టమని చెప్తాడు. ఏం అలా చెప్పించమంటావా? అసలు బొక్కలుతో ఉన్న ఇలాంటి దిక్కు మాలిన అట్లు తినే బెంజి బండిలా ఉండే మా అంజి గాడు కన్నాలు పడిన కంజీరా మల్లే అయి పోయాడు" దుమ్మెత్తి పోసింది రామలక్ష్మి. "ఔనా! అందుకే మరి, నీ వంట తిని బతుకు మీద విరక్తి చెందిన నీ మొగుడు కాస్తా సన్నాసుల్లో కలిసి కాశీ పోయాడు" అత్త పోసిన దుమ్మును సమాధానంతో దులిపేసింది కోడలు. "ఒసే, సన్నాసీ! నా మొగుడు సన్నాసుల్లో కలిసి కాశీకి పోలేదే ! హాయిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని స్వర్గానికి పోయాడే" గొప్పగా చెప్పింది అత్త. హాలులో కూర్చుని ఈ సంభాషణలు విన్న మిత్ర ద్వయం ఇక వినే ఓపిక లేక, వాచి పోయిన చెవులను రుద్దకుంటూ, కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, అంజి బాబు భుజం తడుతూ ఒక్క అంగలో గదిలోంచి రోడ్డు మీదకు వచ్చి పడ్డారు.

***** ***** ***** *****

రెండు సంవత్సరాలు గిర్రున తిరిగాయి. ఆ రోజు సాయంత్రం, ఈ మధ్యనే కొనుక్కున్న కొత్త ఇంట్లో, నలభై అంగుళాల స్మార్ట్ టీవీలో, జీడి పప్పు నములుతూ ఛీఛీ టీవీ ఛానల్లో వస్తున్న "గయ్యాళి అత్త వయ్యారి కోడలు" టీవీ సీరియల్ ఐదు వందల ఒకటో ఎపిసోడ్ చూస్తున్నాడు అంజిబాబు. "ఏయ్.. కిట్టప్పా! " అరిచింది టీవీ సీరియల్లో అత్త గారి పాత్రధారి. "వస్తున్నా తల్లీ" గుండు గోక్కుంటూ వచ్చాడు ఆ పాత్రధారి. "నా బిడ్డ పిండం నా కోడలు గర్భంలో ఉండకూడదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అండ పిండబ్రహ్మాండాలు బద్దలైనా సరే నాకు దాని పిండం, దాని గర్భం లోని పిండం కూడా నాకు కావాలి." "అమ్మా, ఆ పిండాలు తేక పోతే మీరు నాకు పిండం పెట్టేస్తారని తెలుసు. దానికి ఒకటే మార్గం ఉంది. ఆ చెవి ఇలా పడేయండి" "చెవి ఎలా పడేస్తాను, నీ పిండం పెట్టా! నువ్వే చెవిలోకి వచ్చి తగలడు" చెప్పింది అత్తగారు. "పుచుక్ పుచుక్......" రహస్యంగా చెవిలో దూరాడు. "నువ్వు గట్టిపిండానివే కిట్టప్పా! సరే, అలాగే కానీ" చెప్పింది అత్త గారు. సీరియల్లో అత్త పాత్రలో తన తల్లి రామలక్ష్మి జీవిస్తున్న తీరు చూసి ముచ్చట పడి పోయాడు అంజిబాబు, జీడిపప్పు నములుతూ.

***** ***** ***** *****

"ఏయ్.. కిట్టప్పా! " అరిచింది కోడలు పాత్ర వేస్తున్న అంజని. "చెప్పు బిడ్డా!" గుండు బరుక్కుంటూ వచ్చాడు ఆ పాత్ర వేస్తున్న గోవర్థనం. "నా కడుపులో పెరుగుతున్న పిండం తీసేయాలని నా అత్త ఎవరితోనో మంతనాలు చేస్తోందని తెలిసింది. అందుకే, నాకు ఎలాగైనా దాని తల, ఆలాగే దాని తల లోని జేజమ్మ రెండూ కూడా కావాలి" కళ్లూ, పళ్లూ రెండూ బయట పెడుతూ చెప్పింది. "ఒకటి తెస్తే, రెండోది ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది బిడ్డా! కానీ దానికి ఓ ఉపాయం ఉంది. ఆ చెవి ఇలా పడేయ్" అని గోవర్థనం చెప్పగానే, తన చెవిని అతని నోట్లో పెట్టింది కోడలు. "పుచుక్ పుచుక్......" రహస్యంగా చెవిలో ఊదేడు గుండు గోవర్థనం. "అదే నీ తక్షణ కర్తవ్యము" అంటూ పొంగి పోయింది కోడలు. కోడలు పాత్రలో తన భార్య అంజని చెలరేగి పోవడం చూసి, ఉబ్బితబ్బిబ్బయ్యాడు అంజిబాబు.

***** ***** ***** *****

ఇన్నాళ్లూ ఇంట్లోనే ఉండి, కోడిపుంజుల్లా దెబ్బలాడుకున్న తన భార్య, తల్లి ఈ రెండు సంవత్సరాలుగా బుల్లి తెరకెక్కి నిజమైన అత్తా కోడళ్ళలా దెబ్బలాడుకుంటూ తనతో పాటు అందరికీ వినోదం పంచుతూ, నాలుగు చేతులా సంపాదిస్తూంటే హాయిగా సాగి పోతోంది అంజిబాబు జీవితం. లేచింది మొదలు రోజంతా దెప్పకోవడాలతో సాగి పోయే ఆ అత్త కోడళ్లకు ఇప్పుడు కష్టాలు చెప్పకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. రోజకు మూడు సీరియల్స్ లో నటిస్తూ, ముప్పై సీరియల్స్ ఆరు వేల ఎపిసోడ్స్ లా సాగి పోతోంది ఆ అత్తా కోడళ్ల దినచర్య. సీరియల్ చూస్తూ, జీడి పప్పు, ఆలోచనలు రెండూ కూడా నెమరేసుకుంటున్న అంజి బాబుకు సడెన్ గా ఏదో జ్ఞాపకం వచ్చి, ఒక్క ఉదుటున లేచాడు, ఈ అ.కో. సమస్య నివారణకు భలే మందు పంపించిన, తన స్నేహితుడు మరియు టీవీ సీరియల్స్ సంభాషణల రచయిత అయిన బికారాకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పడానికి. ఎందుకంటే... సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున, బికారా ఫోన్ చేయగానే, అత్తా కోడళ్ల మాటలు, చేష్టలు మద్య ఎలా నలిగి పోతున్నాడో అంజిబాబు చెప్పగానే, అంతా ఆనందంతో విని, నాలుగు రోజులు తిరక్కుండానే , ఆ యుద్ధకాండ ప్రత్యక్ష ప్రసారం చూడడానికి, అత్తాకోడళ్ళ మీద ఓ సీరియల్ తీసే ఆలోచనలో ఉన్న తనకు తెలిసిన ఓ టీవీ సీరియల్ నిర్మాత, దర్శకుడిని వీళ్ల ఇంటికి పంపి, వీరి జీవితంలో వెలుగులు నింపేలా చేసింది, అతడే కదా మరి !!

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ