మా'నవ' కర్మాగారం - భాగ్యలక్ష్మి ఆప్పికొండ

Human factory

జన్మ, జన్మాంతర పాపాలన్నీ గుర్తుకు వచ్చి నను చిత్రవధ చేస్తున్నాయ్. ప్రాణానికి ఆప్యాయంగా పలకరింపు లేదు. కనీసం ప్రేమతో కూడిన స్పర్శ లేదు. నాకు నేనే, నాతో నేనే ఇలా ఎన్ని రోజులని కొట్టుకుంటూ, తన్నుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండాలి. నేను దిక్కులు పెక్కటిల్లెలా అరిచినా ఎవరూ వినిపించుకోరు. నా రొధ ఎవరూ పట్టించుకోరు. ఛీ! నామీద నాకే అసహ్యం వేస్తుంది. కాళరాత్రి సావాసం ఇంకెన్నిన్నాళ్ళు. ఒక్కసారికి నా యందు దయుంచి చీకటి గది నుంచి బయటికి పంపించు. ఇంకెప్పుడూ పాపం చేయను" అని యశోద కడుపులోని బిడ్డ దేవుడికి మొర పెట్టుకుంది.


ఎవరో తలుపు తట్టిన శబ్దం. యశోద తలుపు తీసి "మీరాబాబు! రండి,రండి" అని చిరునవ్వుతో ఆహ్వానించింది.
‌‌ ఇంట్లోకి వెళ్ళే అగత్యం తనకు లేదనే అహంకారమే తప్ప వచ్చిన మనిషికి చిరు నవ్వుకి బదులు నవ్వే సంస్కారం లేదు. అందుకే,‌ ఇంటి బయటే నిల్చొని " ఏమ్మా! ఆరోగ్యం బాగుందా?!. నిన్ను, నీ అవస్థను చూసి... జాలి పడి పని అప్ప జెప్పాను. ఎండలు మండి పోతున్నాయి. మీ ఇంట్లో .సి పెట్టిస్తాను. కానుపు అయిన తరువాత తీసెస్తాను. సారు వాళ్ళు వచ్చి అడిగితే మూడు నెలల క్రితమే పెట్టామని చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, విషయాలేవి బయటికి చెప్ప కూడదు" అని మధ్యవర్తి మోహన్ రావు పెద్ద సంచి నిండా పళ్ళు యశోద చేతిలో పెట్టాడు.

"అలాగే బాబూ. ఎవరికీ సెప్పనేదు, సెప్పను" అంది యశోద. ఎవరు చూడట్లేదని నిర్ధారించుకొన్న తరువాత బ్యాగులో నుంచి డబ్బులు తీసి యశోద చేతిలో పెట్టి మోహన రావు వెళ్ళి పోయాడు.

‌‌ యశోద తలుపేసి ఇంటి లోపలికెళ్తూ "ఇప్పుడు ఏడో నెల ఇంకో రెండు నెలలు భరిస్తే మా అప్పులు తీరి పోయి ఇల్లు మిగిల్చుకోవచ్చు" అని తనలో తానే ఆలోచించుకుంటూ పని చేసుకుంటుంది.

"మా అమ్మా, నాన్నలకి నా మీద ఎంత ప్రేమో!! కుదరక కాని ఈమె కడుపులో కూడా .సి పెట్టే వాళ్ళేమొ " అని నలుసు నవ్వుతుంది.

" ముద్ధ తిను తల్లి" అని తన ఎనిమిదేళ్ళ కూతురికి కొసరి కొసరి తినిపిస్తుంది యశోధ.

"నాతో కూడా ప్రేమగా ఉండవా? కాస్త పొట్టని నిమిరి నాతో మాట్లాడవా"అని అర్థిస్తుంది చిన్ని ప్రాణం

పాపం! యశోద ప్రేమ ఎలా చూపిస్తుంది? పిండాన్ని కడుపులో పెడుతున్నప్పుడే " పుట్టే బిడ్డకు, నీకు ఎటువంటి సంబంధం ఉండదు, ఉండ కూడదు" అని గట్టిగా చెప్పారు అసలు తల్లిదండ్రులు.

*******

విశాఖ సముద్ర తీరంలో ఉన్న పోష్ ఏరియాలో ఖరీదైన బంగ్లా ముందు ఆఢి. , బి.యమ్. డబల్యు కార్లు ఆగాయి. వాటి లోంచి విహార్ , ఆశ దిగారు. భార్యా భర్తలకిద్ధరికి పేరు మోసిన కంపేనీల్లో పెద్ద ఉద్యోగాలు. వారికి ఇద్ధరు ఆడపిల్లలు. పిల్లల చదువులు ఇంటర్నేషనల్ స్కూల్లు చూసుకుంటున్నాయి.

నడమంత్రపు సిరి అవ్వచ్చు. కష్టపడి సంపాదించినదైనా కావచ్చు ఏదైనా డబ్బు మనిషికి మహ చిత్రమైన ఆలోచనలని, ఆశలని పుట్టిస్తుంది. అలాగే వారికి కూడా ఇప్పుడు మగబిడ్డ కావాలి, వంశం నిలబెట్టాలి అనే పాత కాలపు ఆశ చిగురించింది. బిడ్డల్ని కనే వయసున్నా వారికి ఓపిక, తీరిక లేదు, ఒక మగ బిడ్డ కావాలనే గొంతెమ్మ కోరిక తప్ప.

ఒకరి దగ్గర డబ్బులున్నాయి. వేరొకరికి డబ్బుతో అవసరం ఉంది. ధనం ఉన్న వాడి అలవి కాని ఆశలకి ఆధునీకత రెక్కలని అమరుస్తుంది ఆయువు పోస్తుంది. ఒకరి డబ్బుని, వేరొకరి అవసరాన్ని తమకు అవకాశంగా మార్చుకునే మధ్యవర్తి మోహన్రావులకి లోకంలో కొదవే లేదు. చట్టాలు గట్టివయ్యే కొలది వీరికి ముట్ట చెప్పె సొమ్ము పెరుగుతుంది. అందుకే వాళ్ళు అందమైన బొమ్మని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెచ్చుకున్నట్టుగా రక్త సంబంధాన్ని కూడా కస్ట మైజ్డ్ స్పెసిఫికేషన్స్ తో ఆర్డర్ పెట్టారు.

ముబైల్ రింగ్ అవుతోంది "హలో" అంది ఆశ.
"మేడమ్ డెలివరి అయింది, బాబుని తీసుకుని వెళ్లండి" అన్నాడు అవతలి నుంచి మోహన్ రావు.
ఆశ అంతే త్వరగా అత్యంత ఆనందంతో విహార్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.
ఆశ "లక్ష్మి, లక్ష్మి" అని సంబరంగా అరిచినట్టుగా పిలుస్తుంది
"ఏంటమ్మా!" లోపలి నుంచి హాడివుడిగా వచ్చింది లక్ష్మి.
"అయ్య గారు హాస్పిటల్ లో వుంటానన్నారు. రా! మనం హాస్పిటల్ కెళ్ళి బాబుని తీసుకొద్ధాం. నువ్వే వాడిని చూసుకోవాలి" అని క్షణంలో బిడ్డ బాధ్యత లక్ష్మికి అప్పజెప్పేసింది ఆశ
"మీ బిడ్డ" అని డాక్టర్ పసికందుని జాగ్రత్తగా ఆశ చేతిలో పెట్టింది.
ఆశ సంతోషంతో మురిసి పోయి తన బిడ్డపై ముద్ధుల వర్షం కురిపించి ఐదు నిమిషాల తరువాత పక్కనే వున్న లక్ష్మికి బిడ్డని అందించింది
"ఒక ఆయమ్మ కడుపులో పుట్టి, మరో ఆయమ్మ చేతిలో పెరుగుతానా?" అని అనిపించిందో ఏమో! బిడ్డ ఒక్క సారిగా గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
లక్ష్మి కి ఏం చెయ్యాలో పాలుపోక యశోద పక్కనే పడుకో బెట్టి "పాలు ఇవ్వమ్మా!" అంది అనునయంగా.
అప్పటి వరకు ఏదో బరువు మోసాననుకున్న యశోద, తొమ్మిది నెలలు తాను మోసిన భారం రూపు దాల్చి తన చనుబాలు తాగుతుంటే ఏదో తెలియని ఉద్వేగానికి గురైంది. అందుకే తన ప్రమేయం లేకుండానే కన్నీరు కారుస్తుంది. అమ్మకానికి అయినా సరే అమ్మతనం లో కమ్మదనాన్ని కాదన లేక కళ్ళు వర్షిస్తున్నాయి.
ఇదంతా గమనించి గమనించనట్టుగా ఉన్న ఆశ "బేబి కి పాలు పట్టమంటారు ఫార్ములా రాసివ్వండి"

ఆర్తిగా అడిగింది డాక్టర్ ని.
‌‌ "తల్లి పాలే మంచిది. ఫార్ములా రాసివ్వమంటే రాసిస్తాను" సంశయంగా చెప్పింది డాక్టర్.
"తల్లి పాలు మంచివే కాని ఈమె దగ్గరే బిడ్డని వదిలేస్తే వీళ్ళమధ్య బంధం పెరుగుతుందేమో కదా!" అని తన సందేహాన్ని బయట పెట్టింది ఆశ.
" కాలంలో ఉన్నారండి!?. కావాలంటే ఇప్పుడు తల్లి పాలు కూడా లభిస్తున్నాయి. ఖరీదెక్కువ అంతే" అంది డాక్టర్.
అవును! కాలం మారి పరుగులు తీస్తుంది. భూమాత ఇచ్చే నీటిని కొంటుంది. తల్లి పాలను కూడా వెల కట్టి కొన గలుగుతుంది.
"అవునా, డాక్టర్! అలా అయితే తల్లి పాలే కావాలి. కొంచెం డిటైల్స్ చెప్తారా?" అని ఉత్సాహంగా అడిగింది ఆశ.
ప్రశ్న ముందే ఊహించిన డాక్టర్ " విషయాలన్నీ మా నర్స్ మీకు చెప్తుంది" అని వడి వడిగా ముందుకు కదిలింది.
మాటలన్నీ వింటున్న మోహన రావు బుర్ర పాదరసంలా పని చేయడం ఆరంభించింది. వెంటనే యశోద దగ్గరకెళ్ళి " తల్లి పాలు కూడా నువ్వే ఇస్తానని చెప్పి అమ్మ గారిని బ్రతిమాలాడు. నీకు డబ్బులు ఎక్కువగా ముట్టేటట్టు నేను చూసుకుంటాను" అని ఆమెకే వినిపించేటట్టు వివరించాడు.
యశోదమోహన్ రావు చెప్పినట్టే అర్థించింది. ఏదో పెద్ద సాయం తానే చేస్తున్నట్టుగా "అలాగే" అని ఒప్పుకుంది ఆశ .
మోహన్ రావు నర్స్ ని అడిగి అక్కడే వున్న ఫార్మసిలో "మాన్యువల్ బ్రెస్ట్ పంప్" ని తీసుకుని వచ్చి యశోదకిచ్చాడు. "ఇది ఎలా వాడాలో నర్సమ్మ నీకొచ్చి చెప్తుంది. నువ్వు పాలు నింపి ఉంచు చాలు. నేనొక కుర్రాణ్ణి పంపిస్తాను, వాడికిచ్చి పంపించు" అని యశోద పొత్తిళ్ళలో వెచ్చగా నిదుర పోతున్న బిడ్డని తీసి ఆశ చేతిలో పెట్టాడు. అప్పుడు యశోద ముభావంగా వుంది. ఎందుకంటే తనకి ముందే తెలుసు ఇది వాణిజ్య ఒప్పందంలో చివరి ఘట్టం అని.
అమ్మ పంట పండింది. మోహన్ రావు డబ్బులు ఇచ్చాడు. ఇక్కడ కూడా గిట్టుబాటు ధర రాలేదు. ఎక్కడైనా దళారులదే పైచేయి.
ఆశ, లక్ష్మి బిడ్డని పట్టుకుని కారెక్కి వెనుక సీట్ లో కూర్చున్నారు. విహార్ కారు ముందు సీట్లో కూర్చున్నా డు. "లక్ష్మి ! మీ ఆయన రెండు రోజులని సెలవు పెట్టాడు మూడు రోజులవుతుంది. ఏంటి విషయం? ఇంకా రాలేదు." తల కాస్త వెనక్కి తిప్పి అడిగాడు విహార్
"సారు, మీకు తెలుసు కదా! మా ఆడ బిడ్డ చచ్చి పోయింది. ఆలాయన పెద్ద తాగుబోతు. ఉన్న ఒక్క బిడ్డని సరిగ్గా సాకెట్లేదు అలాగని మాకాడ వదిలేయ్యమంటేమా సెడ్డ ఇదయ్ పోతున్నాడు. ఆడు యాల ఊళ్లో గొడవ కూడా పెట్టాడంట. మా ఆయన ఆడి సంగతి తేల్చి రేపు మా మేన కోడలిని తీసుకుని వచ్చెత్తాడు" అంది లక్ష్మి నెమ్మదిగా.
"ఇంతకీ మీ మేనకోడలి వయసెంత" అని అడిగింది తన బిడ్డకి ముద్దుపెడుతూ ఆశ
"మూడేళ్ళు ఉంటాయమ్మా!" అంది లక్ష్మి తన బుర్ర గోక్కుంటూ.
"మీకే గడవట్లేదంటున్నావు కదా! పిల్లని ఎలా పెంచుతావే?" కాస్త గద్ధించినట్టుగా అడిగింది ఆశ.
‌‌ "ఎవరి పిల్లలైనా అయినా మనం సేరదీత్తే మన పిల్లలే కదమ్మా! పైగా మా ఆడబిడ్డ బిడ్డాయే. అందులోను ఆడపిల్ల. మీరే సెప్పండమ్మా! తాగుబోతు సచ్చినోడు ఏం సాకగలడు? .అందుకే తీసుకురమ్మన్నా. మా పిల్లలతో పాటు దానికి ముద్ద పెడితే అదే పెరిగిపోద్ది" అంది లక్ష్మి కాస్త దైన్యంగా, కాస్త ధైర్యం గా
లక్ష్మి మాటలు ఆశ, విహర్ గుండెని కదిలిస్తున్నాయి, ఋద్దిని ఆలోచించమంటున్నాయి, ఆత్మని పరిశీలన చేసుకోమంటున్నాయి.

"నీ సుఖం, స్వార్థం కోసం కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చే నేను, నీ ఆశలకు, ఆలోచనలకు ఆలంబన ఇచ్చే ఆధునిక టెక్నాలజీ అండగా ఉండగా...ఇంకా ఎందుకు అర్థం, పర్థం లేని విషయాల గురించి వ్యర్థంగా ఆలోచించాలనుకుంటున్నారు?" అని వారి దగ్గర ఉన్న డబ్బు హెచ్చరించినట్టుగా అనిపించింది‌. వెంటనే ఆశ, విహార్ లు తేరుకున్నారు. లక్ష్మి మాటలకు సమాధానంగా

కనిపించని మూతి విరుపుతో అసహనంగా ఏక కంఠంతో "అవునా!" అన్నారు.
బాణాల నుంచి తప్పించుకోవచ్చు మరి సరాసరి గుండెలోతుల్లో గుచ్చుకుని అంతరాత్మకు గాయం చేసే మాటలనుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం

సూర్యుడు కోటికాంతుల ఆశలను చూపించి అలసి అస్తమించాడు. ఆకాశంలో కటిక చీకటి ముసురుతుండగా చల్లని వెన్నెల కిరణాలతో పున్నమి చంద్రుడుదయించాడు. బంగ్లా బాల్కనిలో ఖరీదైన వెండి మువ్వల ఉయ్యాలలో బాబునూపుతుంది ఆశ. చంద్రుడి తో బాబు మాట్లాడుతూ ఆడుకుంటున్నాడు. ఆశ మోహంలో తప్పు చేసానేమొ అన్న అపరాధ భావన స్పష్టంగా కనిపిస్తుంది.

"ఆశా! ఏంటలా వున్నావ్ ?" బాబు బుగ్గలను పుణుకుతూ అడిగాడు విహార్.
‌‌మనసులోని ఆర్థ్రత మాట కోసమే ఆగిందా! లేక ఇన్నాళ్లు తనకే తెలియని అంతర్యుద్ధం మనసులో జరుగుతుంటే దానికి ముసుగేసి మెటీరియలిస్టిక్ గా బ్రతికిందా? ఏమో మరి ! ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది ఆశ.
ఆనంద క్షణాల్లో అనుకోని ఏడుపేంటో అర్థం కాని విహార్ " ఎందుకలా ఏడుస్తున్నావు!" అని అడిగాడు విస్మయంగా.
"ఎవరో బిడ్డ తన పిల్లల్లా పెంచుకుంటానని, తీసుకురమ్మని వాళ్ళయన్ని పంపించి తీసుకురమ్మంది లక్ష్మి. మరి నేను, నా కడుపులో ఆనందంగా పెరగవలసిన బిడ్డని అందులోను అబ్బాయే కావాలని మరో అమ్మ కడుపులో పెట్టించాను" విహార్ వైపు చూస్తూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంది.

"ఆశా! ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు. మనం ఆశ పడిందే కదా! అయినా లక్ష్మి వాళ్ళ స్టేటస్, లైఫ్ స్టైల్ వేరు వాళ్ళతో నిన్ను పోల్చుకుని అనవసరంగా బాధపడుతున్నావు" అని ఆశని దగ్గరగా తీసుకున్నాడు.

"అవును! ఆశపడ్డాం కాని ఆలోచించలేదు. మన లైఫ్ లో స్టైల్ ఉంది. లైఫేది?. పగలు, రాత్రి తేడా లేకుండా తెచ్చి పెట్టుకున్న నవ్వు మొహాలతో సామాజిక మాధ్యమాల స్టేటస్ చుట్టే తిరుగుతున్నాం. ఒక్కసారైనా మన మానసిక స్టేటస్ ఏంటి అని మనకి మనం ప్రశ్నించుకోలేదు. విహార్, లక్ష్మి ఆడిన మాటలు నాకు చిన్నప్పుడు పొలంలో వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన గుర్తుకు తెచ్చాయి. అప్పుడు నేను మా తాతని అడిగేదాన్ని "ఎందుకు తాత అంత కష్టపడతావు అని మా తాత ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు. "మన కష్టాన్ని మనమే భరించాలి. మన ఇష్టాన్ని మనమే సాధించుకోవాలి" అని.
మాటకర్ధం కష్టాన్ని భరించైనా సరే ఇష్టాన్ని సాధించుకోవాలని .వయసు పెరిగినా నాకు బుద్ధి రాలేదు. అందుకే నా కోరిక తప్ప, ఒప్పా అనే విచక్షణ కూడా లేకుండా బాధ పడకుండా బిడ్డని తెచ్చుకున్నాను" అని విహార్ భుజాన్ని ఆసరా చేసుకుని మనసు పడే వేదనని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఆశ.

"ఆశా! ఎందుకంత మధన పడుతున్నావు. నువ్వే కాదు కదా! చాలా మంది చేయించుకుంటున్నారు. ఇందులో తప్పేం ఉంది మనం డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు" తల నిమురుతూ అన్నాడు విహార్.
‌‌ "నిజం చెప్పు విహార్ మనకు తెలీదా సరొగసీ, బిడ్డలు లేక తల్లడిల్లే తల్లిదండ్రుల కోసమని అది కూడా లింగ నిర్ధారణ పరీక్ష లేకుండా అని. వాణిజ్య అద్దె గర్భాలు పూర్తిగా నిషిద్ధం. నిస్వార్థ అద్దె గర్భాలకి మాత్రమే అనుమతి ఉందని. అందరూ చేస్తున్నారని మనము చేస్తే తప్పు ఒప్పై పోతుందా. ఇది చట్టపరంగా అయితే నేరం, నైతికంగా ఆలోచిస్తే పాపం. విహార్ నీకు తెలుసా! ఉదయం డాక్టర్ బిడ్డని నా చేతిలో పెట్టినప్పుడు ఐదు నిమిషాలు పట్టుకొని వెంటనే లక్ష్మి కి ఇచ్చాను పట్టుకోమని. అదే నేను తొమ్మిది నెలలు మోసిన బిడ్డ అయితే బంధంగా ఉండేది గాని నాకు బరువుగా అనిపించేదా!? నువ్వే చెప్పు" అని ఆత్రంగా విహార్ ని అడుగుతూ ఏడుస్తుంది ఆశ.

విహార్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆశ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.
"అంతా అయిపోయిన తరువాత ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు అనకు విహార్ కనీసం నా మనసుతోనైనా నేను నిజాయితీగా చెప్పుకోవాలి, పశ్చాత్తపడాలి కదా! అందుకే నీకు చెప్తున్నా " అని విహార్ ని గట్టిగా హత్తుకుంది.
"అమ్మా! అయిందేదో అయిపోయింది ఇప్పటినుంచి నన్ను వదిలిపెట్టకు, బాగా చూసుకో" అని అంటున్నట్టు గా ఏడవడం ఆరంభించింది ఉయ్యాల లోని బిడ్డ. వెంటనే బాబుని తన ఒళ్ళోకి తీసుకుని యశోద పంపిన తల్లిపాలను వాడి బోసినోటికి అందించింది ఆశ. నెమ్మదిగా తల్లి, బిడ్డ నిద్రలో కి జారుకున్నారు.

టైం రాత్రి రెండు, ఫోన్ రింగ్ అవుతుంది. " ..మోహాన్రావు చెప్పు" అన్నాడు విహార్
"అది...అది" అని కొంచెం బాధ గా కొంచెం నీల్లు నములుతున్నట్టుగా ఉంది మోహన్రావు స్వరం.
"విషయం ఏంటో చెప్పు" విసుగ్గా అన్నాడు విహార్.
" అది... యశోద చనిపోయిందండి" గద్గద స్వరంతో
"అవునా!? నిజంగానా!? ఉదయం బాగానే ఉంది కదా!? ఏమైంది!?" ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాడు విహార్. అతని మనసుకి తెలియక పోయినా ఒంటికి తెలిసినట్టుంది తప్పు చేశానని అది నీరు కారిపోతుంది.
"డాక్టర్ గారు B.P. , రక్త స్రావం ఎక్కువవడం వలన చనిపోయింది అంటున్నారు" అన్నాడు మోహన్రావు
"అయ్యో! అయితే ఇప్పుడు రమ్మంటావా?" నేనిప్పుడు అక్కడికి రావడం మంచిది కాదేమో? అనే ప్రశ్న ధ్వనించేట్టుగా అడిగాడు విహార్.
"సార్ మీరస్సలు రావద్దు.మీరిక్కడకి రావడం మంచిది కాదు. జరగాల్సినవన్నీ నేను చూసుకుంటాను. తల్లి పాలకి వచ్చే అబ్బాయికి చెప్పండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువైపు రావద్ధని. నా నెంబర్ కి డబ్బులు పంపించండి" జాగ్రత్తలు చెప్తున్నట్టుగా చెప్పి మోహాన్ రావు ఫోన్ కట్ చేసేసాడు.
విహార్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగాడు. కాస్త గుండె వేగం నెమ్మదించి ఫోన్ లో డబ్బులు పంపిస్తుండగా బిడ్డ గుక్కపెట్టి ఏడవడం ఆరంభించింది. ఆశ లేచి బిడ్డకి పాలివ్వబోతుండగా డబ్బాలో పాలు అయిపోయాయి.
అవసరం పడుతుందేమో! అని తెచ్చిన ఫార్ములా పాలు కలిపి పాలడబ్బాలో పోసి పడుతుంటే బిడ్డ మరికాస్తా గట్టిగా ఏడుస్తుంది తప్ప పాలు తాగట్లేదు. తల్లి ముర్రి పాల తియ్యదనానికి అలవాటు పడ్డ పసిబిడ్డ పొడి పాలు తాగుతుందా?. తనను మోసిన తల్లి లేదని తెలిసిందేమో బిడ్డ ఎంతపైనా ఏడుపాపట్లేదు.
"విహార్! ఉదయాన్నే వెళ్ళి వాడిని పాలు తీసుకురమ్మను....వీడీ పాలు తాగట్లేదు, ఏడుపాపట్లేదు" అని నిద్ర చెదిరిన విసుగుతో చెప్తుంది ఆశ.
‌ ‌ "అసలే ఒక రకమైన ఎమోషన్ లో ఉంది . ఇప్పుడీ విషయం చెబితే మరింత ఎమోషన్ అయి అక్కడకి వెళదాం అనోచ్చు. లేకపోతే ఏదో పెద్ద సాయం చేద్దాం అని అనొచ్చు. సమయంలో మనం మంచి చేసినా అది మనకే చెడు అవుతుంది అని చెబీతే అర్థం చేసుకునేంత మానసిక పరిణతిగాని, ప్రాక్టీకాలిటిగాని ఆశకి లేవు" అని విహార్ మనసులో అనుకుంటుండగా
. "విహార్! నీకే చెప్తున్నా! నిద్రపోతున్నావా, ఆలోచిస్తున్నావా!?" అని గట్టిగా అరిచినట్టుగా అడుగుతుంది బిడ్డ ఏడుపుతో నిద్రమత్తు వదిలిన ఆశ.
‌"...... అదే యశోద వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారట.....బ్యాంకులో డబ్బులు వేయమని చెప్పారు... పనే చేస్తున్నా ముబైల్ లో " అని మాట మాట కూడబలుక్కుని చెబుతున్నాడు విహార్.
"అదేంటి? ఉదయం నేనే తల్లి పాలు పంపిస్తాను అని తెగ బ్రతిమలాడింది....ఇప్పుడేంటి ఉన్నట్టుండి వెళ్ళిపోవడం. డబ్బులు బాగానే అడుగుతారు....బిడ్డ పాలుకి ఇబ్బంది పడతాడని తెలియదా ఆవిడకి" అంది ఆశ ఉక్రోషంగా.
బిడ్డ డబ్బా పాలు తాగకుండా ఒకటే ఏడుస్తుంటే వాడిని ఆపలేక లక్ష్మి కి ఫోన్ చేసి రమ్మంది.
********
ఉదయం ఏడు అవుతుంది. మోహన్ రావు బైక్ మీద వెలుతున్నాడు. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వర్షం వల్లనేమో వీధిలో నీచు వాసన మరింత ఎక్కువైంది. మోహన్ రావు భృకుటి ముడి పడింది వాసన భరించలేక. దూరంగా ఒకడు "ఓరై పొద్దు కాడ పెద్ద ఎర ఏస్తే కాని సేప పడనేదురా! పడిన ఎంటనే సచ్చినాది" అని తన చేతిలో ఉన్న చేపని బీడి కాల్చుకుంటూ పక్కవాడికి చూపిస్తున్నాడు.
టెంట్ దగ్గర కొచ్చాడు మోహన్ రావు. ఒక సగం మనిషి తూలుతూ వచ్చాడు మిగిలిన సగం అతని ఒంటి మీద స్పృహ లేదు...."మా ఇంటిది ఇలా అయిపోనాది బిడ్డ" అని అతను అంటుండగానే మోహన్ రావు "సారు వాళ్ళు ఊర్లో లేరు ఇదిగో డబ్బులు ఉంచుకో. జరగవలసిన కార్యక్రమం నేను చూసుకుంటానులే " అని అతని జేబులో ఎవరు చూడకుండా డబ్బులు, సీసా పెట్టి అతనికి దూరంగా జరిగాడు. మోహన్ రావు మనసులో " శవానికి త్వరగా అంత్యక్రియలు జరిపించాలి. రాత్రి నుంచి వీడికి మందిచ్చి మరిపిస్తున్నాను. వీడికి తెలివొచ్చి ఏమైనా తప్పుగా మాట్లాడితే పని చేసినందుకు.. నేను, డాక్టర్, సార్ అందరం ఇబ్బంది పడాలి . మళ్ళీ పోలిసోళ్ళకి డబ్బులివ్వాలి." అని అనుకుంటూ బయటికి మట్టుకు విచారంగా మొహం పెట్టాడు.
యశోద బరువుని, భాధ్యతల్ని మోసి మోసి అలసి సొలసి అన్ని మరచి ఆత్మని విడిచి నిర్జీవంగా చాపపై పడి ఉంది. ఇల్లు నిలబడి వెర్రిగా నువ్వుతుంది నా కోసమేనా నువ్వు పడిపోయింది అన్నట్టుగా. ఆధునీకత, సాంకేతికత వాటి అవససరానికి ఊపయోగపడక అర్థం, పర్థం లేని ఆశల పాలు పడి ఒక ఆయువు తీసింది. "అమ్మా! అమ్మా! అమ్మా! ఆకలేత్తుందే లేవ్వే అమ్మా!, ఏదుంటే అదే తింటానే, ఏదెడితే అదే తింటానే, లేచి పెట్టవే" అని యశోద గుండె మీద పడి పడి "అమ్మ లేవట్లేదంటూ" వెర్రిగా చూస్తూ చిన్న ప్రాణం ఏడుస్తుంటే చూట్టూ ఉన్న వారి గుండెలు ఏడుస్తున్నాయి " వయసులో నీకెదేం కష్టం అమ్మా!" అని. మోహన్ రావుకి అలానే అనిపించి "అయ్యో! పాపం" అనుకున్నాడు. మళ్ళీ తన కర్మను కడిగేసుకోవడం కోసం చేయవలసిన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పాపను పక్కకి తీసాడు "పట్టుకొండమ్మా!" అంటూ పక్కనే ఉన్న ఒక అమ్మ చేతి లో పెట్టాడు.
మత్తులో ఉన్న యశోద మొగుడు మతి లేక ములుగుతున్నట్టు ఏడుస్తున్నాడు. యశోదని పాడె మీదకి ఎక్కిస్తున్నప్పుడు ఆమె గుండెలపై తడి ఇంకా తగులుతుంది పాలకి ఇప్పుడు విలువలేదు. పేద ముత్తైదువ అలంకరణలో చివరి యాత్రా రథం ముందుకి కదులుతుంటే మోహన్ రావు లో లోపల ఉన్న భయం తగ్గుతూ వస్తూంది, "అమ్మ" తప్ప వేరే లోకం తెలియని పాలబుగ్గల చిట్టి తల్లి గుండెల్లో భయం పెరుగుతూ పోయి, బాధను మోయలేక కుప్పకూలిపోయింది . ఒక వేలం వెర్రి ఆశకు బలైన కథ ఉనికిని తన కడుపులో మోసుకుంటూ రథం ఊరేగుతూ కనుమరుగైపోయింది..కాల గర్భంలో కలిసిపోతున్నది... యథావిధిగా.....ఎప్పట్లానే

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల