నడిచొచ్చిన పుట్ట - Dr. శ్రీదేవి శ్రీకాంత్

నడిచొచ్చిన పుట్ట

"అభి, చిరు, దీప్తి అందరూ రండి.. క్రికెట్ ఆడడానికి మైదానానికి వెళ్దాం" అంటూ బయలు దేరాడు పద్నాలుగేళ్ల రవి. ఆ మైదానంలో చెట్టుపైన చాలా రామ చిలుకలు ఉన్నాయి. "దీప్తి! నీకు రామ చిలుక కావాలా? నేను ఒక చిలుకను కొట్టి ....కింద పడేయినా?...." అన్నాడు రవి.

"వద్దు వద్దు, చిలుకని పంజరంలో పెట్టి బంధించడంవల్లే భక్త రామదాసు కఠిన కారాగార శిక్ష అనుభవించాడని మా నానమ్మ చెప్పింది" అంది దీప్తి. "రవీ! నువ్వు వచ్చి ఆడతావా లేదా?" అని స్నేహితులు...అభిరామ్, చిరంజీవి, పరమేసు, శ్యామ్ అడుగుతుంటే...

"నేను సిక్సర్ల రవీని" అంటూ బ్యాట్ తీసుకుని కొట్టే సరికి....ఆ బంతి వెళ్ళి దూరంగా వున్న పొదలో పడింది. "నే చెప్పలా!".... అంటూ పరుగు పరుగున వెళ్ళి బంతికోసం పొదలో చెయ్యి పెట్టిన రవి చేతికి ఒక గుడ్డు తగిలింది. "ఏమైఉంటుంది?" అనుకుంటూ చెయ్యి బయటికి తీసి చూశాడు.

"ఓహ్! చూడండి చూడండి రామ చిలుక గుడ్డు". అనేసరికి అందరూ ఆ గుడ్డు చుట్టూ మూగారు. రవి ... అభిరామ్ చేతిలో గుడ్డు పెట్టి.... "పట్టుకో నేను బంతి తీస్తాను...." అని మళ్ళీ చేయి పొదలో పెట్టాడు. ఈసారి రవి చేతిలోకి ఒకే సారి మూడు గుడ్లు వచ్చాయి. అందరూ ఆగుడ్ల వైపు చూస్తున్నారు..

"రవీ!... ఆ గుడ్లను నిధానంగా పొదలో పెట్టేయి.... రామచిలుక తన గుడ్లు పోయాయని ఏడ్చి శపిస్తుంది" అంది దీప్తి. "రవన్న నువ్వు దీప్తి మాటలు పట్టించుకోకు... నువ్వు రా! మనం ఆ గుడ్లు ఇంటికి తీసుకు వెళ్దాము" "ఇవి రామ చిలుకలు అవ్వగానే మనం ఆడుకుందాం" అంటూ ఆ గుడ్లను వెదురు బుట్టలో పెట్టి రవి ఇంట్లో పాత సామాను గదిలో పెట్టారు.

రవి అప్పుడప్పుడు బుట్ట మూతతీసి ..పక్షి పిల్లలు బయటికి వస్తాయే మోనని చూస్తున్నాడు. ***** లక్ష్మీ, శ్రీనివాసుల కు కూతురు జ్యోతి పుట్టిన పది సంవత్సరాలకు రవి పుట్టాడు. రవి చాలా దుడుకు స్వభావం గలవాడే కాక తెలివైన వాడు కూడా. తొమ్మిదవ తరగతి కి వచ్చినా చిన్నపిల్లాడి మనస్తత్వం పోలేదు. పిల్లల్ని పోగేసుకుని క్రికెట్ ఆడడం నిత్యకృత్యం. ***** ఆ రోజు దీపావళి పండగ.

దీపావళి పండగంటే అందరికీ చాలా ఇష్టం. "శ్రీవారు మీరు మార్కెట్ నుండి వచ్చేప్పుడు తామర పువ్వులు కనబడితే కొనుక్కురండి" అంది లక్ష్మి. దీపావళి రోజు లక్ష్మీ దేవికి పూజ చేయడం శ్రీనివాస్, లక్ష్మీ దంపతులకు ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లో అందరూ...తలంటి పోసుకుని... కొత్త బట్టలు వేసుకున్నారు.

పిండివంటలు..పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి. లక్ష్మీ భర్తను ఉద్దేశించి... "ఏమండోయ్! వాడు చూడకుండా కొన్ని దీపావళి సామాను దాచెయ్యండి. దీపావళి నాగులచవితి జంట పండగలు. అందరూ నాగుల చవితి రోజూ దీపావళి సామాను కాలుస్తారు.

వీడు చూస్తే అన్నీ ఒకే రోజు కాలుస్తాడు" అంటున్న తల్లికి అడ్డు తగులుతూ...."అమ్మా! వాడ్ని కాల్చుకోని! నువ్వు అడ్డు చెప్పకు" అంది జ్యోతి...దీపావళికి పెట్టిన బొమ్మల దగ్గర దీపాలు సర్దుతూ.... తెలంగాణాలో దీపావళికి బొమ్మలు పెట్టడం ఆచారం.

లక్ష్మీ! ఈ సంవత్సరం కరోనా కారణంగా దీపావళి సామాను కాల్చకూడడు అని ప్రభుత్వ ప్రకటనను గౌరవిస్తూ...దీపావళి సామాను తీసుకురాలేదు" అన్నాడు శ్రీనివాస్. "ఓహో! అలాగా! సరే... గోగు కాడలు కాల్చాలి రండి" అని భర్తను, పిల్లల్ని పిలిచింది లక్ష్మి.

గోగు కాడలకు నూనె గుడ్డ చుట్టి వాటిని వెలిగించి...దక్షిణ ముఖంగా తిరిగి "దిబ్బు దిబ్బూ దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి" అని తిప్పుతూ...నేలకేసి కొట్టారు అంతా. "నాన్నా! కిందటి సంవత్సరం మిగిలిన నాలుగు కాకర పువ్వొత్తు పెట్టెలు, మతాబులు ఉన్నాయి" అంటూ...

స్నేహితులతో కలసి కాలుస్తుంటే.... "ఒరేయ్ రవీ!, సానిటైజరు చేత్తో...దీపావళి సామాను కాల్చకు. సానిటైజరుకు త్వరగా కాలే గుణం ఉంటుంది" అన్నాడు శ్రీనివాస్, కొడుకుకు జాగ్రత్త చెబుతూ. ***** క్రికెట్ బ్యాట్ కోసం...పాత సామాను గదిలోకి వెళ్ళిన రవీకి బుట్ట కదులుతున్నట్లు అనిపించింది.

"రామ చిలుక పిల్లలు వచ్చేశాయి" అనుకుంటూ... .బుట్టలో చేయి పెట్టిన రవీ చేతికి మెత్తగా తగిలింది....ఇంతలో చేతికి ఏదో చుట్టుకున్నట్టు అనిపించింది..చెయ్యి పైకి తీశాడు... చేతికి చుట్టుకున్న పాము పిల్ల బుట్టలో పడిపోతూ కనిపించింది... రవి ఒక్కసారిగా "పాముపిల్ల" అంటూ అరుస్తూ బుట్ట మూత పెట్టేశాడు...పరుగు పరుగున వెళ్ళి స్నేహితులకు ఆ వార్త చెప్పాడు. అందరూ రవీ ఇంట్లో వుండే పాతసామాను గదిలోకి వెళ్ళారు. అభి బుట్ట మూత తీశాడు...

"ఒరేయ్ చిరు... నిజంగానే పాము పిల్లలు" అన్నాడు. " ఏరంగులో వున్నాయి?" అంది దీప్తి. "నల్ల రంగులో వున్నాయి" అన్నాడు రవి. "పాములకు విషముంటుంది గదా... అవికరిస్తే చచ్చిపోతారు... బుట్టతో సహా దూరంగా పడేద్దాం" అంది దీప్తి.

"దీప్తీ! నువ్వు నోరు మూస్తావా?" అన్నాడు రవి. "ఒరేయ్!...అభి, చిరు, శ్యామ్....నాకు ఒక గొప్ప ఐడియా వచ్చిందిరా!"... అని తన కొచ్చిన ఐడియా ముగ్గురికి చెప్పాడు రవి. ***** ఆ రోజు నాగుల చవితి. తెల్లవారు జామున ఐదు గంటలు అయ్యింది. "నాగదేవత మీకోసం వచ్చింది...రండి పూజలు చేసుకోండి.

మీకోరికలు నేర వేరతాయి. మా బాల వాక్కు బ్రహ్మ వాక్కు" అనే మాటలు మైకులో వినబడుతున్నాయి. "నాగ లోకం నుండి నేరుగా వచ్చిన నాగేంద్రుడు." "కైలాసంలో శివుని మెడనుండి. ....జారి మిమ్ము దేవించ వచ్చిన నాగ దేవత" "సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లి, దేవసేనా సమేతంగా మీ ఇంటి దగ్గరకే వచ్చిన నడి చొచ్చిన పుట్ట".... అంటూ పిల్లల మాటలు వినబడు తున్నాయి.

అమ్మయ్య ఈ కరోనా సమయంలో పుట్టలో...పాలు పొయ్యడానికి దూరం వెళ్లక్కరలేదు ఇంటి దగ్గరకే నాగదేవత వచ్చిందన్న మాట " అనుకుంటూ వున్నారు జనం. భక్తులు వచ్చి.... రవీ గ్యాంగ్ ను చూసి "పసిపిల్లలు దైవ స్వరూపాలు. ఈ పిల్లల్ని చూస్తే దేవతలే పిల్లల్లా వచ్చినట్లు వుంది" అనుకుంటూ...

సర్పాలను వుంచిన పుట్టను చూస్తూ ప్రదక్షిణలు చేసి భక్తులు పాలు,గుడ్లు, పండ్లు, డబ్బులు....పిల్లలు చూపిస్తున్న బిందెలలో వేస్తున్నారు. * ఆ నోట.. ఆ నోట "నడిచి వచ్చిన పుట్ట" అనే వార్త చాలా వరకు పాకింది. రద్దీ పెరిగింది. భక్తులు ఎక్కువయ్యారు...

సాయంత్రం అయ్యేసరికి...బాగా పెద్ద మొత్తంలో... డబ్బు, వెండి వస్తువులు బంగారం .....కూడా వచ్చాయి. భక్తులు ఇచ్చిన పాలు, గుడ్లు అనాథ శరణాలయంలో ఇచ్చారు రవీ గ్యాంగ్. దీప్తి వత్తిడి భరించలేక...ఆ పాము పిల్లల్ని...మైదానంలో చెట్టు దగ్గర పొదలో వదిలారు.

"మరి ఈ డబ్బు ఏమి చేద్దాము?" అని చిరంజీవి అడుగుతుంటే... "గుడిలో హుండీలో వేద్దామ"ని దీప్తి సలహా ఇచ్చింది. "భక్త శిఖామణి!... దీప్తీ!...నువ్వు మళ్ళీ నోరు మూసుకుని వుండాల్సిన సమయ మొచ్చింది...."అన్నాడు రవి. "మొన్న వానలకు మన స్కూలు లో లైబ్రరీ, కంప్యూటర్ గది, ఇంకా చాలా గదులు కూలి పోయాయి.....ఈ డబ్బు మన స్కూలు భవంతిని బాగు చేయడానికి ఇద్దాం అన్నాడు రవి".

అభి, చిరు, దీప్తి..."మంచి ఐడియా" అంటూ అందరూ కలసి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లారు.

మరిన్ని కథలు

Samayaspoorthy
సమయస్ఫూర్తి
- కందర్ప మూర్తి
Bhadrakali
భద్రకాళి
- BHADRIRAJU THATAVARTHI
Daivam manusha rupena
దైవం మానుష రూపేణ
- శింగరాజు శ్రీనివాసరావు
Aadavaalaa majaakaa
ఆడవాళ్ళా.. మజాకా..!
- చెన్నూరి సుదర్శన్
The critical match
ద క్రిటికల్ మ్యాచ్
- చింతపెంట వెంకట సత్య సాయి పుల్లంరాజు,
Yenkatalachimi sana manchidi
"ఎంకటలచ్చిమి   సానా   మంచిది"
- నల్లబాటి రాఘవేంద్రరావు