ముక్కోణపు జీవితాలు - కొత్తపల్లి ఉదయబాబు

triangle lives

“నాకు ఈవయసులో పెళ్ళేమిటి నాన్న? ఎవరైనా వింటే నవ్వి పోతారు.మళ్ళీ నెలే నా రిటైర్మెంట్. మర్చి పోయారా?”

తండ్రికి టిఫిన్ పెడుతూ అన్నాడు మధుకర్.

ఆయన మాట్లాడ లేదు. టిఫిన్ చేసేటప్పుడు ఆయన ఒక్కమాట మాట్లాడరు. టిఫిన్ అయ్యాక సింక్ దగ్గర చెయ్యి కడిగేసుకుని వచ్చి కుర్చీలో కూర్చుంటూ అన్నారు.”ఒక్క పది నిముషాలు కూర్చో. నేను చెప్పేది ఆఖరి సారి విను. ఇది వరకు చాలా సార్లు చెప్పాను గానీ నువ్ పట్టించుకోలేదు. ప్లీజ్ “ రిక్వెస్ట్ గా అడిగే సరికి కాదన లేక పోయాడు మధుకర్. తండ్రి తిన్న టిఫిన్ ప్లేట్ మోరీ లో పడేసి వచ్చి తండ్రి ఎదురుగ కూర్చుని అన్నాడు “ చెప్పండి “

“నీ భార్య పోయి 8 సంవత్సరాలు అయింది. కోడలు అని చెప్పుకో కూడదు గాని కవిత బతికి ఉన్నంత కాలం తన కుటుంబం కోసం ముఖ్యం గా నీ పిల్లల కోసం బ్రతికింది.దురదృష్టం. నిండు నూరేళ్ళు సుఖం గా బ్రతకాల్సిన ఆమె హటాత్తుగా గుండె పోటుతో మరణించడం నిజంగా మన దురదృష్టం.అప్పటికే తండ్రి గా నీ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ పిల్లలిదరినీ చక్కగా చదివించావు. అమ్మాయికి చక్కని భర్తని చూసి పెళ్లి చేసావ్. మనవరాలిని ఎత్తుకున్నావు. వాళ్ళు ఒక్క మాట గా సుఖం గా ఉన్నారు. తర్వాత స్వయం కృషితో నీ కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. నీ అనుమతి తో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు మగ పిల్లల తండ్రి అయి చక్కగా సంసారం చేసుకుంటున్నాడు. అనారోగ్యం తో బాధ పడుతున్న మీ అమ్మను నన్ను నీ దగ్గర ఉంచుకుని కొడుకుగా నీ బాధ్యత చక్కగా నెరవేర్చుతున్నావు. నా అదృష్టం కొద్దీ మీ అమ్మ ఎక్కువ కాలం మంచం మీద తీసుకోకుండా పోయింది.

కానీ నా బాధ్యత నీకు తప్ప లేదు.పోనీ వృద్ధాశ్రమంలో చేరి పోతానురా అంటే వినవ్. నీకున్న ఖాళీ సమయం లో సాహిత్యాభిలాషతో మంచి కధా రచయితగా గుర్తింపు తెచ్చుకున్నావ్. చాలా సంతోషం.

మనిషి కుటుంబం కోసం బ్రతికే రోజులు పోతున్నాయి నాన్న...కేవలం తన కోసం తాను బతికే రోజులు వచ్చేసాయి. బాధ్యతలు నెరవేర్చే వరకే కుటుంబం. అవి నెరవేర్చాకా భర్తకు భార్య - భార్యకు భర్త. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోక తప్పదు. భర్త పోయిన భార్య అతని జ్ఞాపకాలతో ఎవరో ఒకరి పంచన చేరి హాయిగా బతక గలదు. కానీ మగ వాడు అలా బ్రతక లేడు నాన్న. పురాణాల్లో భారవి కధ గుర్తు తెచ్చుకో. ఇంకొకరి ఇంటికి వెళ్లి తల దాచుకోవడం ఆత్మహత్యా సదృశమే. కొడుకు నీవాడు కాని కోడలు పరాయి ఇంటి బిడ్డే కదా..ఒక నెల బాగా చూస్తుంది..మహా అయితే రెండు నెలలు మర్యాదగా చూస్తుంది. ఆ తరువాత? రచయితగా నువ్వే ఎన్నో కధలు రాశావ్ అలాంటివి. ఉద్యోగ విరమణ అయ్యాక మనిషి మనశాంతి గా ఆరోగ్యంగా బతకాలి. అలా బతకాలంటే నీకు ఒక తోడూ కావాలి. నువ్వు అలా సుఖంగా బ్రతకాలని నా కోరిక. నా మీద నీకు ఏమాత్రం అభిమానమున్నా నా మాట విని పెళ్లి చేసుకో. ప్లీజ్.”

“సరే నాన్న.మీరు చెప్పినట్టే చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకోవాలంటే ఆవిడకి కనీసం 50 ఏళ్ళు ఉండాలి. ఆ వయసుకు కూడా వివాహం కాని ఆడవాళ్ళు ఎక్కడో గాని దొరకరు. ఉన్నా నాకు తెలిసిన మాససిక శాస్త్రం ప్రకారం వయసులో కనీస కోరికలు తీరక ఎదుటి వారిని ఏడిపించి మానసిక ఆనందం పడే మనస్తత్వం ఎక్కువగా ఉన్న వారుగా ఉంటారు.

ఇక రెండో వర్గానికి వస్తే భర్త పోయి పిల్లలున్న వాళ్ళు. ఉన్న పిల్లలు చూడరనే కదా పెళ్లి చేసుకునేది. ఆ పిల్లలూ చిన్నవాళ్లైతే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మళ్ళీ వాళ్ళ బాధ్యతలు...50 ఏళ్ల వయసు వచ్చినావిడకి ఏదో ఒక అనారోగ్య సమస్య వుండి తీరుతుంది. మళ్ళీ నా పని పెనం మీద నుంచి పొయ్యిలోకే.. కానీ పెద్ద వారిగా మీ మాటలు తీసి వేయ లేను.

అదృష్టవంతుడిని పాడు చేయ్యలేరు.దురదృష్టవంతుడిని బాగు చేయ్యలేరు అంటారు. అందుకు ఉదాహరణ కూడా మీ కుటుంబంలోనే ఉంది. మీ బావమరిది అంటే పెదమామయ్య విషయమే తీసుకోండి.పిల్లలు పుట్టక పెద్ద అత్తయ్య పది మంది చేత గొడ్రాలు అనిపించుకుని ఆ మానసిక ఆవేదన తోనే పోయింది, తరువాత మామయ్యకి బోలెడు భవిష్యత్తు ఉందని మీ పెద్దలందరూ రెండో పెళ్లి చేసారు. భగవంతుని దయ వల్ల ఈమెకు నలుగురు పిల్లలు పుట్టారు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాక ఈ అత్తయ్య కూడా పోయింది. ఆడ దక్షత లేని ఆకుటుంబంలో మగ పిల్లలిద్దరూ వెధవల్లా తయారయ్యి మావయ్యని ఏడిపించుకు తింటున్నారు. పెళ్ళిళ్ళు లేని వాళ్ళకు వండి పెడుతూ మావయ్య బతుకీడుస్తున్నాడు.

ఏం వచ్చినా రాక పోయినా మేన మామ పోలికలు వస్తాయంటారు. నేనసలే నష్ట జాతకుడిని. రేపు అలా జరిగిందనుకోండి. ఇలా చూసే పిల్లలు కూడా ఉండరు ఇక నాకు. మేము చూడమన్నామా...ఆయనే ఒళ్ళు కొవ్వెక్కి బలుపు తీరక పెళ్లి చేసుకున్నాడు అంటారు. అవన్నీ అవసరమా చెప్పండి.

బ్రతుకును వెళ్ళ దీసుకో దలుచుకున్నవాడు రాజీ పడక తప్పదండి. “ అన్నాడు లేవ బోతూ.

“ నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తావ్? నీకు పాజిటివ్ జరగచ్చేమో?” అన్నారాయన రాబోతున్న నిరాశను అదిమి పెడుతూ...

“ అదైనా ఫిఫ్టీ – ఫిఫ్టీ చాన్సేస్సే . మీరు నా మంచి కోరి చెప్పారు. తప్పని సరిగా మీరు చెప్పిందీ ఆలోచిస్తాను. భోజనానికి అన్నే టేబుల్ మీద రెడీ చేసి పెట్టాను. కడుపు నిండా తినండి.నేను వెళ్ళొస్తాను మరి..” అన్నాడు మధుకర్ ఆఫీస్ కు బయల్దేరబోతూ..

కొడుకు వెళ్ళి పోయాక వీధి తలుపు వేసి ఆయన తన గది లోకి నిష్క్రమించారు.

* * *

ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి వచ్చి తండ్రికి రాత్రి టిఫిన్ పెట్టాకా అన్నాడు మధుకర్ ...

“మీరు విషయం కదిపిన శుభ ముహూర్తం సంగతేమో గానీ ఈవేళ ఆఫీస్ కి లంచ్ అవర్ లో ఎవరో వచ్చారు నాన్న. ఆయన రాజమండ్రి టెలికాం డిపార్టుమెంటు లో ఎ.ఈ.గా చేస్తున్నారట. పెళ్ళయి భర్త పోయిన చెల్లెలు ఉందట.పిల్లలు లేరట. మనిషి ఆరోగ్యం గానే ఉందట. ఎపుడూ దైవ ధ్యానంలో ఉంటూ దైవ సంబంధ సామాజిక సేవల్లో కార్యకర్తగా చేస్తోందట. ఈ వూరి హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళ పెద్దన్నయ్య దగ్గర ఉంటోందట. ఆయన వచ్చి ముందు మీతో మాట్లాడి వాళ్ళ ఇంటికి తీసుకు వెల్తాడట. మీరు వెళ్తే అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడండి.”

“ అమ్మయ్య. కొంత ఆలోచించాడన్నమాట.” అనుకున్నారాయన.

* * *

మధుకర్ కూతురు ఆమనికి ఫోన్ చేసి “పెళ్లి విషయం లో నీ అభిప్రాయం ఏంటమ్మా? తాత గారు కూడా ఒత్తిడి చేస్తున్నారు.” అని అడిగాడు.

“మీరు పెళ్లి చేసుకో దలుచుకుంటే మాకిద్దామనుకున్న ఆస్తులు మాకిచ్చేసి పెళ్లి చేసుకోండి. మీ పెళ్ళై పోయి అవన్నీ ఆవిడకి చెందితే , ‘మీనాన్న మీకేమిచ్చాడు?’ అని మా అత్త గారు దెప్పి పోస్తుంది జీవితాంతం. మా తరపు బంధువులంతా సూటి పోటీ మాటలతో అవకాశం వచ్చినప్పుడల్లా పొడుస్తూనే ఉంటారు.ఇక నాకు పుట్టిల్లు ఆశ కూడా పూర్తిగా చచ్చి పోయినట్టే. మీరు రిటైర్ అయ్యాక మేము చూడక పోతే మాది తప్పు. మా అమ్మ ఎలాగూ లేదు. మీరు కూడా ఈ వయసులో పెళ్లి చేసుకుని దూరం అయి పోతే మాకు దిక్కెవరు చెప్పండి?” అంది మధుకర్ కూతురు ఆమని తండ్రితో.

“ నేను నా ముసలి వయసులో మీకు భారం కాకూడదని. “ అన్నాడతను.

“మీరు మాకేం భారం? మీరు రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ అన్ని తమ్ముడికి, నాకు చెరో సగం ఇచ్చేయండి.మీ ఆరు నెలలు వాడితో ఆరు నెలలు మాతో ఉండండి. ఎవరింట్లో ఉంటె వాళ్ళకి మీ పింఛనులో సగం ఇవ్వండి. మిగతావి మీ మందు ఖర్చుల నిమిత్తం ఉంచుకోండి.ఇలా చేసే దానికి ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా? ఆవిడ ఎంత మమ్మల్ని ఆప్యాయంగా చూసినా “ మా అమ్మ “ కాలేదుగా...ముఖ్యం గా ఈ వయసులో...” తన భవిష్యత్తుని అయిదు వాక్యాల తీర్పు తో నిర్నయించేసిన కూతురికి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు మధుకర్ కి ఒక్క క్షణం. ‘మొత్తానికి లాయరు గారి భార్యవి అనిపించుకున్నావ్’ అనుకున్నాడు మనసులో..

“రేపు నాకు వచ్చే భరణంలో సగం ఆవిడకు వస్తే ఒక జీవి నా పేరు చెప్పుకుని సుఖం గా జీవిస్తుంది కదమ్మా..” అనునయంగా అన్నడతను.

“ ఓహో...అయితే మీరు పెళ్లి చేసుకోవడానికే నిర్నయించుకున్నారన్న మాట.మీరా నిర్ణయం తీసుకున్నాక ఇక మా అభిప్రాయంతో పని ఏముంది? సరే...నేను చెప్పినట్టు చెయ్యండి.” అని ఫోన్ పెట్టేసింది మరో మాటకు తావివ్వకుండా..

కొడుక్కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి ‘అక్కని అడిగితే అలా అందిరా ఈ విషయం లో నీ అభిప్రాయం కూడా చెప్పు ‘అన్నాడు మధుకర్.

“పనిలో ఉన్నాను నాన్న.సరిగ్గా పది నిముషాలలో ఫోన్ చేస్తాను.” అని ఫోన్ కట్ చేసాడు కొడుకు శ్రావణ్.

ఆ సమయం పని ఉండి కాదని , భార్యతో చర్చించే సమయమని నవ్వుకున్నాడు మధుకర్.

సరిగ్గా పదకొండవ నిముషం లో “ అక్క చెప్పినట్టు చేసెయ్యండి నాన్నా. దాని అభిప్రాయమే నా అభిప్రాయం. తాత గారు ఒప్పుకున్నారా? “ అడిగాడు

“ ఇదంతా ఆయన ప్రయత్నమే...నాకు ఇష్టమో కాదో మీకు తెలుసుగా...” అన్నాడు మధుకర్.

“ ఓహో...ఇదంతా ఆయన పనా? సరే...అలాగే కానివ్వండి అక్క చెప్పినట్టు.” అని ఫోన్ పెట్టేసాడు శ్రావణ్.

* * *

పిల్లలు కోరినట్టుగానే తను వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తిని పెళ్ళికి ముందే రిజిస్ట్రేషన్ చేసేసాడు మధుకర్.

పదిహేను రోజుల్లోనే అరుంధతి తో మధుకర్ వివాహం రిజిస్ట్రార్ ఆఫీస్ లో ముఖ్యుల సమక్షంలో జరిగిపోయింది. ఆమని, శ్రావణ్ కుటుంబాలతో రావడం మధుకర్ కి , తాతగారికి చాలా ఆనందమనిపించింది. వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉండటం చూసి మరీ సంతోషపడ్డారాయన.

అయితే వాళ్ళ సంతోషానికి కారణం తానేనని, మరేనాడు తండ్రిని తమ దగ్గర ఉంచుకోనవసరం లేకుండా చేసి తమ బాధ్యత తగ్గించిన తాలూకు సంతోషమని ఆయనకు తెలీలేదు . పైగా తన కొడుకు తన కష్టార్జితాన్ని తన మనవలకు రిజిస్ట్రేషన్ చేసిన విషయం కూడా తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారన్న విషయం కూడా ఆయనకు తెలీదు పాపం.

అరుంధతి సాహచర్యం లో మధుకర్ జీవితం ఆనందంగానే సాగుతోంది. ఉద్యోగ విరమణ అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ, భద్రాచలం సీతారాములు, తిరుపతి వెంకన్న, అన్నవరం సత్యదేవుడులను దర్శించుకున్నారు.

పిల్లలు ఎపుడో ఒక సారి రావడం రెండురోజులు ఉండి వెళ్ళడం. వచ్చినప్పుడల్లా వాళ్ళ కష్టసుఖాలు ఏకరువు పెట్టడం, ‘నానా ఇబ్బందుల్లోను ఉన్నాం ‘ తోచిన సాయం చేయమని అడగడం అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యం గా కూతురైతే మరీను. ‘’నాలుగు రోజులు వచ్చి వెళ్ళమ్మా ‘ అంటే ‘పిల్లలకి స్కూలు పోతుందనో, మా ఆయనకీ భోజనం కుదరదు ‘అనో వంక పెట్టేస్తుంది.

‘’మేము రావడం కుదరదు గానీ పిల్లల ఫీజు ఇన్ స్టాల్మెంట్ కట్టాలి పదివేలు సాయం చెయ్యండి’’ అని నిర్మొహమాటం గా అడిగేస్తోంది.

మధుకర్ ఆ విషయం లో చాలా బాధ పడ్డాడు.

‘‘నాన్నా. ఆవిడతో మీ జీవితం సుఖం గా సాగించండి. వేళపట్టుకు తిని ఓపిక ఉన్నంతవరకు ఇదివరకు చూడని పుణ్య క్షేత్రాలు దర్శించి రండి.’’ అని అంటారేమో అని చాలా ఆశ పడ్డాడు. తప్పదని కాబోలు కొడుకు కోడలు మాత్రం” మీకు బోర్ కొట్టినప్పుడు మా ఇంట్లో పది రోజులుండి వెళ్ళండి నాన్న.’’ అని చెప్పారు.

‘’ఇద్దరు జంటలూ పిల్లలతో సహా వచ్చి ఉండండర్రా. మనవలు మాకు అలవాటు అవుతారు.’’అన్నాడు మధుకర్.

‘’మాకెక్కడ కుదురుతుంది నాన్నగారు. దసరాకి, సంక్రాంతికి ఇచ్చే సెలవులు ఏడుస్తూ ఆ కాన్వెంట్ వాళ్ళు వారం రోజులు ఇస్తే గొప్ప.మా అత్తవారింటికి వెళ్ళాలా? వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నాలుగు విజిటింగ్ ప్లేసెస్ కి వెళ్ళాలా?వేసవి సెలవులు వస్తే రాబోయే తరగతిలో బాగా చదవడానికి బ్రిడ్జి కోర్సెస్ లో చేర్చాలా? లేదా వాళ్ళ కిష్టమైన హాబీ కి చెందిన కోచింగ్ లో చేర్పించాలా? వీటన్నింటికి బోలెడు డబ్బు కావాలి. మళ్ళీ ఒకరిని చేర్పి ఇంకొకళ్ళని చేర్పించకపోతే కోపాలు..తాపాలు.మాకు రావడం కుదరదు గానీ మీరే చుట్టం చూపుగా వచ్చి వెళ్తుండాలి మరి. మనవలతో మమ్మల్ని కలవనివ్వలేదు అంటే కుదరదు మరి.’’అన్నాడు శ్రావణ్.

ఇక మనవల్ని ఏ పదిహేను రోజులకో ఓసారి వీడియొ చాట్ లో చూపించడం..వాళ్ళకి తాతగారు, మామ్మగారు అలవాటు లేనందువల్ల కనిపించి ఆటలకి పారిపోవడం చేసేవారు.

ఒళ్ళు మండి ‘’మేము వస్తానంటే రావద్డంటారు. మీరు రండర్రా అంటే కుదరదంటారు. ఎలా?’’ అని అడిగేసాడు పిల్లల్ని.

అరుంధతి ఎదురుగానే ‘’ మీరు అమ్మ పోయిన వెంటనే పెళ్లి చేసుకుంటే అప్పటికి మేమూ చిన్న పిల్లలం కాబట్టి పిన్ని గారితో అలవాటైపోయేది. మీరిద్దరూ జంటగా మా పెళ్ళిళ్ళు చేస్తే ఎంతో ఆనందం అనిపించేది మాకు.కానీ ఈవయసులో మీరీ పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలించుకుందామని నిర్ణయించుకున్నారు. మేము మాత్రం ఏం చెయ్యం?మీరు ఒక్కరే ఉంటె మేమెక్కడికి వెళ్ళినా మిమ్మల్నీ మాతో పాటే తీసుకుపోయే వారం. ఇప్పుడు మీ ఇబ్బందులు మీవి మా ఇబ్బందులు మావి.’’ అంది కూతురు ఆమని.

‘’పోనీలెండి. వాళ్ళు సుఖంగా తమ పిల్లలతో ఉన్నారు. మనం ఎందుకండీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం?వాళ్ళకి వీలైనప్పుడే రానివ్వండి.’’ అంది బాధపడుతూ అరుంధతి.

మధుకర్ కి అర్ధమైపోయింది .

ఎట్టి పరిస్తితుల్లోనూ పిల్లలు రాజీ పడరు. ఇక వాళ్ళు కలవారు.మనవల్ని కలవనివ్వరు. మేము రాలిపోయే ఆకులమ్. వాళ్ళు చిగురించిన కొమ్మలు. చిగురించే ఆకులు కొమ్మను పట్టుకున్నశక్తి ఉన్నట్టుగా రాలిపోయే ఆకులకు శక్తి ఉండదు. తోడు కోసం రెండవ పెళ్లి చేసుకుని తప్పు చేశాడా? శారీరక సుఖం కోసం కానే కాదు. మానసిక శాంతి కూడా ఉండదా ఇక? ఉండదన్న జవాబు మూడో కోణం నుంచి వస్తుందని వూహించలేదు మధుకర్.

******

‘’నాకు మనవల్ని చూడాలని వాళ్ళతో ఆడుకోవాలని ఉంది అరుంధతి.’’ ఒక రాత్రి పక్కమీద పడుకుని వుండగా అన్నాడు భార్యతో.

‘’దానిదేముంది? వెళ్ళి చూసి రెండురోజులుండి మీరు ఇవ్వాలనుకున్నది ముట్ట చెప్పి వచ్చేయండి.’’

‘’ అదేంటి నువు రావా?’’

‘’మీ కూతురు ఏం చెప్పిందో గుర్తుందా? వాళ్ళకు నేను తల్లిని కాలేనట. అవును.ఎట్టి పరిస్తితుల్లోనూ కాలేను.

ఈయింటికి ఆ ఇల్లు ఎంతదూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. సమాధానం చెప్పగలరా?’’

‘’నన్ను మనస్ఫూర్తిగా పెళ్లిచేసుకున్నారా?’’

‘’చాలా ఇష్టపడి తోడుకోసం చేసుకున్నాను. ఎందుకు అడిగావ్? ‘’

‘’ ఈ వయసులో మనం ఒకరిమీద ఒకరు మనసుపడితే చూసే వాళ్ళకి శారీరక వాంచలు తీరక వ్యామోహంతో పెళ్లి చేసుకున్నామనే అనుకుంటారు. ఆరోజు మీమీద నమ్మకంతో నేను ఏమీ అడగలేదు.కానీ ఈరోజు మీ పిల్లల వరుస చూసి అడగకుండా వుండలేకపోతున్నాను.’’

‘’మనలో ఎవరు ముందో ఎవరు వెనుకో తెలీదు. కాబట్టి నాకు జీవితం ప్రశాంతంగా వెళ్ళడం కోసం నాకు ఏదైనా స్థిర ఆస్తి యేర్పాటుచేయండి. ఇది నా ఒకే ఒక కోరిక. పిల్లలు నాతో కలిసిపోతే ఇన్నాళ్లకు పెళ్లి అయినందుకు కనకపోయినా ఆలోటు తీరుతుందనుకున్నాను. కానీ వాళ్ళకు కలిసేతత్వం లేనపుడు నేను కూడా కలుపుకోలేను కదా.’’

‘’చిన్నపిల్లలు. వాళ్ళే తెలుసుకుంటారని భావించి క్షమించలేవా..’’

‘’ చూడండి. జీవితంలో ఏసుఖాలు నోచుకోకుండా కష్టపడి పనిచేస్తేనే రోజు వెళ్తుంది అన్న పద్దతిలో బతికిన ఒంటరిదాన్ని.కాస్తంత సుఖం శాంతి మీవల్ల లభించాయి. వాళ్ళు పిన్నీ అంటూ నన్ను ఆదరించిననాడు నేను అంతా ఆప్యాయంగా వాళ్లని ఆదరిస్తాను. నన్ను తేలికభావంతో చూస్తే మాత్రం భరించలేను.’’రుద్ధకంఠంతో అని అటుతిరిగిపోయింది అరుంధతి. బహుశా కన్నీళ్లు వచ్చాయేమో.

మధుకర్ కి ఒక విషయం అర్ధమైంది. ఎవరి జీవిత భాగస్వాములతో వాళ్ళు కష్టమో నష్టమో తను, పిల్లలు సుఖంగా ఉన్నారు. అటువంటప్పుడు పిల్లిమీద ఎలక, ఎలకమీద పిల్లి అన్న చందంగా కాకుండా సాధ్యమైనంత సంతోషంగా కనిపిస్తూ ఓర్పు సహనంతో, సుఖంగా రోజు వెళ్ళబుచ్చుకోవడం కన్నా చేసేది ఏమీ లేదు. మాటలు అనుకుని మనసులు గాయపరుచుకోవడం కన్నా చిరునవ్వుతో వాటిని తోసేస్తూ బతికేస్తే ఈ చివరి పదేళ్ళ జీవితం వెళ్లిపోతుంది.

అరుంధతి నిద్రపోయాకా మధుకర్ అనుకున్నాడు.

తమకే సమస్య వచ్చినా ‘’మీకేం మీరు పెళ్లిచేసుకుని సుఖంగా ఉన్నారు. మాకే కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మాకే అమ్మ లేదు. ‘’ అని పిల్లలు -

‘’మీరు కూడా నన్ను హీనంగా చూస్తే భరించే శక్తి నాకు లేదు.’’ అని అని అరుంధతి –

‘’ ఏవీ మనసులో పెట్టుకోకుండా కాలక్షేపం చెయ్యి నాన్న.చూడు నేను ఎంత సుఖంగా బతుకుతున్నానో.నువు చూడబట్టే అనుకో..’’ అని నాన్నగారు – త్రికోణం లా బతికేస్తున్నాం. యే అవసరం ఉన్నా త్రికోణం మూలల్లా కలుస్తామ్. ముగ్గురి దృష్టికోణాలు మాత్రం వేరువేరు.

సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి