వామ్మో ...సినిమావోళ్లు! - బి.నర్సన్

vaammo sinimaavollu

ఇంట్లోకి దోమలు చొరబడకుండా అన్ని బందోబస్తుల్ని మరోసారి తనిఖీ చేసి వచ్చి ముఖద్వారానికి అదనంగా బిగించిన జాలీ తలుపును మూసివేస్తూ బయటి సందడి ఏంటాని తొంగి చూశాడు నారాయణ.

తమ ఇంటి కాంపౌండ్ గోడనానుకొని ఉన్న రోడ్డు మీద ఓ ఐదుగురుఏదో వస్తువు పోగొట్టుకొన్నట్లు పైకి కిందికి చుట్టుపక్కల శ్రద్ధగా చూస్తూ ఆయనకు కనబడ్డారు.

భూమి ధరలు భగ్గుమంటున్నా నారాయణ భార్య సులోచన హైదరాబాదులో ఇండిపెండెంట్ ఇల్లే కావాలని పట్టుపట్టడంతో నగర శివారులో రెండు వందల గజాల జాగా కొని ఈ ఇల్లు కట్టుకోక తప్పలేదు.

వర్షాకాలంలో జాజు పానకంలాంటి బురద , ఎండాకాలం ఇల్లంతా ఎరుపెక్కే దుమ్ము. అగ్గిపెట్టె కోసమైనా అర కిలోమీటర్ పోక తప్పని పరిస్థితిలోంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. ఏడాది క్రితం వేసిన సిమెంట్ రోడ్డు ఒక్క వర్షానికే కంకర తేలి ప్రయాణాన్ని మరింత కష్టతరం చేసినా దుమ్ము బాధ మాత్రం తప్పింది.

కోరి ఈ దారెంట ఎవరు పోరు కానీ పొద్దట్టేలా స్కూల్ వ్యాన్లు, అప్పుడప్పుడు ఆటో రిక్షాలు తప్పదన్నట్లు వస్తాయి.
అరగంటైనా బయటివాళ్ల వెతుకులాట ముగియకపోవడంతో అసలు వీళ్లకిక్కడేం పని అనుకుంటూ వరండాలో లైట్ వేశాడు.
దీపపుపురుగుల్లా గేటు తీసుకొని లోపలికివచ్చారు వాళ్ళు.

నారాయణ జాలీ తలుపు తీసి బయటకు వచ్చి వేంటనే మూసి బయట దోమల బాధ పడలేక వారిని కూడా లోపలి రండని పిలిచాడు. నింపాదిగా లోనికి వచ్చి వాళ్ళు ముందుగదిలోని సోఫాల్లో ఆసీనులయ్యారు.

ఈ సీనంతా కిచెన్ లోంచి చూస్తున్న సులోచన- ఎవరీ కొత్త ముఖాలూ..ఎంత దర్జాగా కూచున్నారు..అనుకుని కిచెన్ లోంచే ఎవరీ శాల్తీలు అన్నట్లు భర్త వైపు చేయి ఊపింది.

ఎవరో తెలియదన్నట్లు కింది పెదవి విరుస్తు సమాధానమిచ్చాడాయన. చూస్తూ ఉండలేక సులోచన అందరికి గ్లాసుల్లో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆబగా నీళ్లు తాగి వాళ్ళు సంతృప్తిగా ముఖాలు పెట్టి ఆలూమగల్ని కృతాజ్ఞతాపూర్వకంగా మార్చి మార్చి చూసారు.

ఖాళీగ్లాసును కింద పెడుతూ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నట్లు ఒకాయన - 'మేం సినిమావాళ్ళం' అన్నాడు.
సినిమాలు బాగానే చూసే సులోచన యాక్టర్లేమో అనుకోని వాళ్ళ ముఖాల్ని గుచ్చి గుచ్చి చూడసాగింది. అటువంటి దాఖలేవి ఆమెకు కనిపించలేదు. వారి మాట అర్థమై కానట్లు నారాయణ తల ఎటో ఓ దిక్కు ఊపాడు.

'మా సినిమా పేరు వాల్ ఆఫ్ లవ్ ..అంటే ఓ యువ జంటకు పిట్ట గోడ దగ్గర ప్రేమ పుట్టి కథ అలా ముందుకు సాగుతుందన్నమాట. మీ ప్రహారీ గోడ మా కథకు తగ్గట్టుగా ఉంది. కెమెరా మూవ్ మెంట్ కు సరిపోయే జాగా షూటింగ్ కి తగిన డే లైట్ ..లొకాలిటీ బాగుంది.స్పెషల్లీ గోడ మరి ఎత్తుగా లేకుండా పాతబడి నేచురల్ గా ఉంది.' అన్నారు వారిలో ఒకాయన డైరెక్టర్ గా చేతులూపుతూ.

'మేం ఎత్తే కట్టుకున్నాం..ఈ మధ్య రోడ్ వేయడంతో పొట్టిదయింది. రోడ్ పనుల వల్ల దుమ్ము కొట్టుకుపోయింది. నీళ్లు కొట్టినా పోలేదు.' అన్నాడు నారాయణ.

'నో నో నో ..దాన్ని ముట్టకండి.. అలాగే మాక్కావాలి ..అవసరమైతే మేం దాన్నిమరింత డర్టీ చేస్తాం.' అన్నాడు మరొకాయన. ఆయన కెమెరామెన్ ఏమో.

'ఆర్నెల్లలో మా అబ్బాయి పెళ్లి ఉంది. ఇంటికి రంగులేయిస్తాం.' అంది సులోచన.

'నెల రోజుల్లో మా పని పూర్తి చేసుకుంటాం.. ప్లీజ్ కోఆపరేట్ చేయండి..' ఈ మాట అన్న మనిషి బహుశ ప్రొడ్యూసరేమో .
'చాల లొకేషన్లు స్టడీ చేశాం..ఇంత కన్వీనియెంట్ గా ఎక్కడా లేదు..' అన్నాడు డైరెక్టర్ తీరు చేతులూపినాయన.
ఆలుమగలకు ఏమి అర్థం కావడం లేదు.

'మా అబ్బాయినడగాలి..వాడు బయటికెళ్ళాడు' అంది సులోచన లంగరేస్తున్నట్లు.

'ఫోన్ నెంబర్ ఈయండి..ఇప్పుడే మాట్లాడుదాం,,' అని ఫోన్ బయటికి తీశాడొకాయన.

'వాడు ట్రాఫిక్ లో ఉంటాడు..మేం చెబుతాం లెండి' అంది ప్రవాహాన్ని ఆపుతున్నట్లు.

'సరే..రేప్పొద్దునే వస్తాం!' అంటూ వినయంగా నమస్కరించి వెళ్లిపోయారు.

రేపు, ఎల్లుండి, ఇలా రోజులు, నెలలు గడిచిపోయినయి. సినిమావాళ్ళ జాడలేదు. చూసి చూసి -'సినిమావాళ్ళే ఇంత..' అని సులోచన వాళ్ళ గురించి ఎంతో తెలిసినట్లు అనడంతో అంతా మన మంచికే అనుకున్నాడు నారాయణ. అబ్బాయి పెళ్ళికి ఇంకా నెల రోజులుంది. ముందుగా ఇంటికి రంగులేయాలి అని పనివాళ్ళతో బేరం కుదుర్చుకున్నారు.

' రేప్పొద్దునే వచ్చి పని మొదలు పెట్టాలి' అని కొంత బయానా వారి చేతిలో పెట్టాడు నారాయణ. తెల్లవారుతూనే ఇంటిముందు అలికిడి వినరావడంతో- 'రంగులవాళ్ళు వచ్చినట్లున్నారు సులోచనా!' అంటూ బయటికి వచ్చాడు నారాయణ.
తమ గేటు ముందు రోడ్డుపైన ఇరువై మంది దాకా లోకంతో తమకు పనిలేనట్లుగా ఎవరి పనుల్లో వారున్నారు. పెద్ద కెమెరా, మెరుపు కాగితాల పలకలు, ఓ వ్యాను కనబడ్డాయి. అంతా కొత్త కొత్తగా ఉందాయనకు.

నారాయణను చూడగానే ఆనాడు సినిమావాళ్ళం అంటూ వచ్చినవారిలో ఒకాయన -'గుడ్ మార్నింగ్ సార్! ఇవాళ మంచి ముహుర్తముంది..షూటింగ్ మొదలు పెట్టేశాం..' అంటూ ఎదురుగా వచ్చాడు.

'ఒక్క మాటైనా చెప్పకుండా..' అన్న నారాయణ మాట పూర్తికాకుండానే - 'యాక్టర్ల, టెక్నీషియన్ల డేట్ల కోసం నానా యాతన పడ్డాం' అని మాటకు అడ్డం పడ్డాడాయన.

'మావాళ్లు కుర్చీలు తేవడం మరిచారు. నాలుగు కుర్చీలు ఇస్తే హీరో హీరోయిన్లు కూచుంటారు' అంటూ ఆయన ఇంట్లోకి పదమన్నట్లు నారాయణపై చేయి వేశాడు.

అసలు రంగులేసేవాళ్ళు ఏమయ్యారు అని ఆలోచించుకుంటూ నిద్రలో నడిచినట్లు ఇంటి లోపలికి వెళ్ళాడు నారాయణ.
బయట జరుగుతున్నదాన్నిఅయోమయంగా కిటికీలోంచి చూస్తున్న సులోచనతో -'వారికీ నాలుగు కుర్చీలు కావాలట' అన్నాడు.

సులోచన తల తిప్పకముందే- నారాయణ వెనుకాలే ఇంట్లోకి వచ్చేసిన సినిమాయన- 'యాక్టర్లను ఇంట్లోనే కూచోబెడదామండీ..వాళ్ళను బయట ఉంచితే మీకే న్యూసెన్స్ గా ఉంటుంది' అన్నాడు.

మన ఇంట్లో ఈయన పెత్తనమేందీ అని ఆలుమగలిద్దరు ముఖాలు చూసుకుంటూ కోలుకోకముందే ఆరుగురు వర్ధమాన తారలైన నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు నడి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.

వాళ్ళను సోఫాల్లో కూచోబెట్టినాయన- 'నాలుగు వాటర్ బాటిళ్లు ఫ్రిజ్ లో పెట్టండమ్మా' అంటూ వెళ్ళిపోయాడు.
ఎడారిలో తిరిగి తిరిగి వచ్చినట్లున్న వారి ముఖాలు చూడగానే సులోచన ఫ్రిజ్ లో నీళ్ల బాటిళ్లను బయట పెట్టింది. క్షణాల్లో ఖాళీ అయినా వాటిని నింపి ఫ్రిజ్ లో పెట్టింది. ఈలోగా స్టవ్ మీద కూర మాడిపోయింది. ఆ ఘాటుకు దగ్గులు, తుమ్ములు ఆపుకోలేక ఇద్దరమ్మాయిలు బెడ్ రూములోకెళ్ళి తలుపేసుకున్నారు.

'బెడ్ రూములో మా అబ్బాయి పడుకున్నాడు' అంటూ పరుగున వచ్చి సులోచన తలుపు కొట్టింది.

'ఎవరూ లేరు ఆంటీ! ' అని జవాబు వచ్చింది కానీ తలుపు తెరుచుకోలేదు.

'బాత్ రూములో ఉన్నాడేమో..ముందు తలుపు తీయండి ..' అని మరింత గట్టిగా కొట్టడంతో తలుపు తెరుచుకుంది. అప్పుడే బాత్ రూము లోంచి బయటికి వచ్చిన సురేష్ కు పరిస్థితి అర్థం కాకా -' ఇది మానిల్లేనా మమ్మీ ' అన్నాడు మయోఅయంగా.
'ఎప్పుడో సినిమావాళ్లు వచ్చారు అన్నాం కదా..వాళ్ళు ఇవాళ వచ్చి ఏకంగా షూటింగ్ మొదలు పెట్టుకున్నారు. బయటికిరా..అంతా అర్థమైతది.' అంటూనే ఆమె కిచెన్ లోకి పరుగు తీసింది.

ఇంతలో 'షాట్ రెడీ ..షాట్ రెడీ..' అంటూ అరుపులు వినిపించాయి. గంతులు వేసుకుంటూ నటీనటులు లొకేషన్ వైపు పరుగులు తీశారు.

తెరిచి ఉన్న తలుపు మూసేసి నారాయణ రంగుల టీం లీడర్ కు ఫోన్ చేశాడు. చేయగా చేయగా కాల్ ఎత్తిన ఆయన నారాయణ మాట మొదలుపెట్టకముందే -'సార్..మేం పొద్దున్నే మీ ఇంటికి వచ్చినం..అక్కడున్నవాళ్ళు మమ్ముల్ని లోపలికి పోనీయలేదు. మాకు ఈ ఇంట్లో నెల రోజుల పని ఉంది. ఆ తర్వాతే మీ పని అన్నారు' అన్నాడు.

బయటనుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. నారాయణ తలుపు తెరవగానే వచ్చినాయన డోర్ స్టాపర్ ను కాలుతో నొక్కి-' కంటిన్యుటీ దెబ్బ తింటుంది ..మూయకండి..' అంటూ హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడు.

ఆయన వెనుకాలే వెళ్లి నారాయణ -'రంగులవాళ్ళు వచ్చారట...' అని అడగబోతుంటే- 'కట్' అన్న అరుపు వినిపించి ఆగి పోయాడు. 'ఆయనెవరండీ బాబూ..ఫ్రెమ్ లోకి వచ్చాడు' అంటూ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అసిస్టెంట్ల వైపు చూస్తూ విసుక్కున్నారు.

'అయ్యా ! మీరు బయటి రాకండి..' అంటూ నారాయణను తోసినట్లు ఇంట్లోకి పంపాడాయన. అప్పటికే సినిమావాళ్లలో కలిసిపోయిన సురేష్ లోపలికి వెళ్ళమన్నట్లు సైగ చేస్తున్నాడు. ఏమనలేక నారాయణ ఇంటి వెనుకాల కుర్చీ వేసుకొని కూలబడ్డాడు. అక్కడికే టిఫిన్ తెచ్చింది సులోచన.

కొంతసేపటికి సినిమా సందడి కాంపౌండ్ లోపల మొదలైంది. అక్కడక్కడా ఉన్న పూలకుండీలను వెనుక గోడవారగా పెడుతున్నారు. వారి వేగిరపాటుకు పాతకుండీలు పగిలిపోతున్నాయి.

'బయట షూటింగ్ అని లోపలి రావడమేమిటి..కుండీలను చెడగొట్టడమేమిటి.'.అని విసుగుపడుతున్న నారాయణకు ఎన్నడూ రాని కోపం పొంగి వస్తోంది. 'మీరు ఉండండి .. అబ్బాయిని పిలుస్తాను' అంటూ ఆమె సురేష్ వైపు చేయి ఊపుతూ రమ్మంది.
దగ్గరికొచ్చిన కొడుకు- 'ఏమిటేమిటి?' త్వరగా చెప్పండన్నట్లు ఉరుకులాట మీదున్నాడు.

'బయటే షూటింగ్ అన్నారు ..లోపల ఈ గొడవేమిట్రా ..' అన్నారిద్దరు యుగళగీతంలా.

'ఒకటే షాట్ అంట..హీరోహీరోయిన్ల కిస్సింగ్ షాట్ గోడచాటుగానట... అందుకే లోపలి వచ్చారు' అని మాట్లాడుతూనే వెళ్ళిపోయాడు.

వాకిట్లో రైలు పట్టాల్లాంటివి వేశారు. దాని మీద కెమెరాను పెట్టి అటు ఇటు తిప్పుతున్నారు. హీరోహీరోయిన్లు తప్ప మిగితా వారంతా గోడకు ఆవలివైపే ఉన్నారు. ఆ తతంగమంతా చూస్తున్న దంపతులకు అంతా వింతగా ఉంది.

బయట దండెంపై ఆరేసిన దుప్పటిని షూట్ లో వాడుకుంటూ దుప్పటిపైనుండి కెమెరా పాన్ అయి గోడచాటుగా కూచున్న నాయకీనాయకుల సరస సల్లాపాలు చిత్రించాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే షాట్ ఓకే అయింది.

వెంటనే దండెంపై దుప్పటిని మడతపెట్టి పక్కనే ఉన్న రేకుపెట్టె లో వేసుకున్నాడు ఓ అసిస్టెంటు. అది చూసి పరుగున వచ్చిన సులోచన -'మా దుప్పటి కదా..'అంది ఈయమన్నట్లు.

కంటిన్యుటీ మేడం ..అటువైపు నుండి తీసే షాట్ కు బ్యాక్ గ్రౌండ్ లో దండెంపై ఇదే దుప్పటి కనబడాలి అన్నారు మా డైరెక్టర్ గారు. షూటింగ్ అయిపోగానే ఇస్తాం..' అంటూ యూనిట్ వైపు పరుగుతీశాడాయన లొకేషన్ రెంట్ కు తీసుకున్న లెవల్లో షూటింగ్ సాగిపోతోంది. కొడుకు సినిమావాళ్లవైపే ఉండడంతో దంపతులిద్దరూ ఎదురు ప్రశ్నలు మానేశారు.

తమ ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి మిత్రులందరికీ చేరవేశారు సురేష్. సినిమా చాన్సు కోసం తంటాలు పడుతున్నవాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కొందరు యూనిట్ సభ్యులకు టిఫిన్లను, స్వీట్లను తెచ్చిస్తున్నారు. స్తొమత ఉన్నవాళ్లు వాహనాలను ఆరెంజ్ చేస్తున్నారు. ప్రసన్నం చేసుకున్నవాళ్లలో ఒకరిద్దరు ఆటో డ్రైవరుగానో, డెలివరీ బాయ్ గానో కెమెరా ముందుకొస్తున్నారు.

పెళ్ళికి ఇంకా పదిహేను రోజులే ఉంది. నారాయణ, సులోచనలు బయటికి వెళ్లి అవసరమైన పనులు చూసుకుంటున్నారు. రంగులు వేయడం ఇప్పుడైనా మొదలుపెట్టాలని వారు సురేష్ తో ఖచ్చితంగా చెప్పారు. వారి బాధ చూడలేక సరేనన్నాడు డైరెక్టర్. మర్నాడు కలర్స్ వేయడానికి వచ్చిన వారిలో ఇద్దరిని లోపలి అనుమతించి డైరెక్టర్ స్వయంగా ఇల్లంతా వారి చూయించి ఎక్కడ ఏయే రంగు వేయాలో వివరిస్తున్నాడు. వారి వెనుకాలే నారాయణ ఇదేం గతిరా నాయన అనుకుంటూ తిరిగాడు.

రంగులు ఫైనల్ చేసి డైరెక్టరు షూటింగ్ వైపు వెళ్ళగానే రంగుల పెద్ద నారాయణతో -'ఆయన చెప్పినట్లు కలర్స్ వేస్తే ఖర్చు మరో ఇరువై వేలు పెరుగుతుంది' అన్నాడు.

తన బాధ ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక పెళ్ళికి అందితే చాలు అనుకోని -'సరే..కానీయండి,' అని చేయి ఊపుతూ కుర్చీలో కూలబడ్డాడు.

రంగులు వేయడం పూర్తయ్యాక చూస్తే హాల్ కోర్టు రూము లాగా, ఒక బెడ్ రూము హాస్పిటల్ వార్డ్ లాగా , మరోటి పోలీస్ స్టేషన్ లాకప్ గదిలాగా తయారయ్యాయి. ఇంకా పది రోజుల్లో పెళ్లి. షూటింగ్ ఇంట్లోకి వచ్చింది. మూడు రోజుల్లో సినిమావాళ్లు తమ పని ముగించుకొని వెళ్లిపోయారు. మార్పు చేర్పులకు సమయం లేనందువల్ల ఉన్న రీతిలోనే పెళ్లి కానిచ్చారు. పెళ్ళికి తప్పక వస్తామన్న సినిమావాళ్లు మళ్ళీ కనబడలేదు. సురేష్ చేసే ఫోన్ కాల్స్ కు కూడా జవాబు లేదు. 'ఈ సినిమావాళ్ళే ఇంత!' అని చాల రోజుల తర్వాత మరోసారి అంది సులోచన. లవ్ ఆఫ్ వాల్ సినిమా రిలీజయింది. వెండి తెరపై తమ రూపాన్ని చూసుకునేందుకు

ఫస్ట్ డే మార్నింగ్ షోకే సురేష్, అతని మిత్రబృందం వెళ్లారు. ఎక్కడో లాంగ్ షాట్ లో 'అదిగో నేను..ఇదిగో నీవు ..' అని అరిచే లోపే బొమ్మ మారిపోతోంది. మరో వ్యక్తి గుర్తుపట్టే స్థాయిలో ఎవరూ కనబడలేదు. విచిత్రంగా నారాయణ, సులోచనలు మిడ్ షాట్ లో తెరపైకి వచ్చారు.

హీరోహీరోయిన్ల ముద్దుల సీనును విచిత్రంగా చూస్తున్న వాళ్ళ ఎక్స్ ప్రెషన్స్ కి హాలంతా నవ్వుల్తో నిండిపోయింది. అటువైపు నుండి డైరెక్టర్ తెలివిగా తీసిన ట్రాలీ షాట్ లో వీరిని కవర్ చేసిన సంగతి బయట పెట్టలేదు.

నాలుగు నెలలయ్యాక నారాయణకు ప్రొడ్యూసర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఎత్తగానే-' బాగున్నారా సార్! మా బొమ్మ బాగా ఆడుతోంది..మంచి లాభాలొచ్చాయి..ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా తీద్దామనుకుంటున్నాం..మీ గోడ మళ్ళీ మాక్కావాలి..ఈసారి రెంట్ పే చేస్తాం .మీ పిల్లలకు మంచి రోల్స్ ఇస్తాం. ' అని అటు వైపు నుండి వినిపించింది.
వెంటనే నారాయణ -' మా గోడా వద్దు.. మీ పీడా వద్దు ' అనేశాడు.

'సార్! అంతా మాట అనకండి..సిన్సియర్ గా చెబుతున్నా.. సినిమావాళ్లెవరూ ప్రిప్లాన్ గా ఎవరిని ఇబ్బంది పెట్టరు. సినిమా తీయడమంటేనే ఆక్సిడెంట్ అయినవారిని హాస్పిటల్లో చేర్పించినంత హడావుడి..గాయపడ్డవారిని ఒకరు కారులో వేసుకొని వెళ్తారు..ఒకరిద్దరు పని వదిలేసి తోడు వెళ్తారు.ఓ అమ్మ చీర కొంగు చించి గాయాలకు కట్టుకడుతుంది. గాయపడ్డవారు వీరిని ఇలా ఇబ్బంది పెట్టాలని ముందే అనుకుంటారా..సాయపడ్డవాళ్లు ఫలితాన్ని చూస్తారు గాని కష్టాన్ని లెక్కచేస్తారా..ఇదీ అంతే అనుకోండి..'

'మీ కథలకేం గాని మా వాళ్ళ కాదు నాయనా!' అంటూ నారాయణ కాల్ కట్ చేశాడు. మళ్ళీ రింగ్ అయినా ఎత్తలేదు.
రోజులు గడుస్తున్నాకొద్దీ చెప్పాపెట్టకుండా వాళ్ళు ఏ క్షణమైనా మళ్ళీ మీద పడుతారేమోననే బెంగ నారాయణను పెరుగుతోంది.. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేసినట్లు కలలు కూడా వస్తున్నాయి. సినిమావాళ్ళు మరి.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల