పగబట్టిన తెలుగు - సరికొండ శ్రీనివాసరాజు

Revenge Telugu

రాజు 9వ తరగతి చదువుతున్నాడు. అన్ని సబ్జెక్టుల్లో చాలా తెలివైన విద్యార్థి. కానీ తెలుగులో చాలా వెనుకబడేవాడు. ఇంగ్లీష్ మీడియం చదువు‌. తెలుగుతో 10వ తరగతి తర్వాత అవసరం లేదు కదా అని చులకన భావం. అసలు ఇంగ్లీషు మీద మోజుతో తెలుగు అంటేనే చాలా చులకన భావం. చిన్నప్పటి నుంచి దానిపై శ్రద్ధ పెట్టలేదు. తెలుగులో రాయడమే కాదు చూసి చదవడంలోనూ దారుణమైన తప్పులు. తల్లిదండ్రులు, గురువులు ఎంత ప్రయత్నించినా ఈ మూర్ఖుని మార్చలేకపోయారు. తోటి స్నేహితులు చెప్పారు మాతృభాష కూడా చదవడం రాకపోతే భవిష్యత్తులో చాలా కష్టాలపాలు కావలసి వస్తుందని. "నేను భవిష్యత్తులో విదేశాలలో ఉద్యోగం చేస్తాను. నాకు ఈ లోకల్ భాషతో పని ఏముంది?" అని అనేవాడు.

వేసవి సెలవులు వచ్చాయి. రాజు 9వ తరగతి పూర్తి అయింది. రాజు వాళ్ళ అమ్మా నాన్నా చెల్లెలితో సహా అమ్మమ్మ ఇంటికి పల్లెటూరికి వెళ్ళారు. రాజు వాళ్ళ పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో అక్కడికి వచ్చారు. రాజు మేనమామ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. ఇంకేం. సెలవుల్లో బోలెడంత కాలక్షేపం. రాజు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి ఒక ముసలావిడ వచ్చింది. ఒక పేపర్ తీసుకుని వచ్చి అదేమిటో చదివి చెప్పమని రాజు వాళ్ళ తాతయ్య రామయ్యను అడిగింది. రామయ్యకు కళ్ళజోడు కనిపించలేదు. రాజు చేతికి ఆ పేపరును ఇచ్చి చదవమన్నాడు. రాజుకు తెలుగు చదివితే అన్నీ తప్పులే కదా! "తాతయ్యా! నాకు అర్జెంట్. ఇప్పుడే వస్తా." అని బాత్రూంలోకి వెళ్ళాడు. మళ్ళీ అరగంట దాకా బయటికి రాలేదు. మధ్యాహ్నం భోజనం వేళ అందరూ కలిసి తింటున్నారు. చికెన్, చేపల కూరలు, సాంబారు. రాజుకు అన్నీ ఇష్టమే. కానీ రాజు వాళ్ళ అమ్మమ్మ "వద్దురా మనవడా! ఈరోజు నీ ఆరోగ్యం బాగాలేదు కదా! ఇప్పుడు రాత్రి రెండు పూటలా మజ్జిగ అన్నమే తిను." అని బలవంతంగా మజ్జిగ అన్నమే తినిపించింది. తోటి పిల్లలు లొట్టలేసుకుంటూ తింటుంటే ఆ వాసనల మధ్య చప్పటి అన్నం తినాల్సి వచ్చింది.

మరొకరోజు రాజు తోటి వాళ్ళతో ఊళ్ళో ఆడుకుంటున్నాడు. ఆ బస్టాప్ వద్దకు ఒక బస్సు వచ్చింది. ఒక ముసలామె అక్కడే ఆడుకుంటున్న రాజుతో "ఈ బస్సు ఎక్కడికి పోతుందో చెప్పు మనవడా." అంది.‌ ఊరి పేరు చేంతాడంత పెద్దగా

ఉంది. రాజు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. "ఇంతకు నువ్వు ఏ ఊరు వెళ్ళాలి అవ్వా?" అన్నాడు రాజు. "సోమవరం" అన్నది అవ్వ. "ఆ బస్సు వెళ్తుంది." అన్నాడు రాజు. అవ్వ ఆ బస్సు ఎక్కి పోయింది. "హమ్మయ్య" అనుకున్నాడు రాజు. తన ఆటల్లో తాను మునిగి ఉండగా హఠాత్తుగా అక్కడ ఆ అవ్వ ప్రత్యక్షం అయింది. "సచ్చినోడా! నీకు తెల్వకుంటే తెల్వదని చెప్పాలి కానీ ఇట్లా మోసం చెయ్యాలని చూస్తావా." అని మొదలు పెట్టి వినరాని తిట్ల దండకం అందుకుంది. తోటి పిల్లల ముందు రాజు పరువు పోయింది. ముఖం చాటేసుకొని రాజు ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం రామయ్యకు తెలిసింది. రామయ్య ఎంతో బాధ పడ్డాడు.

రామయ్య ఒకరోజు తన మనవళ్ళ మనవరాళ్ళ కోసం చాలా కథల పుస్తకాలను తెచ్చాడు. ఆ కథలను అన్నింటినీ అందరూ చదవాలి. ఆ తరువాత తమకు నచ్చిన కథలను రాసి చూపించాలి. అందరి కంటే ఎక్కువ కథలు రాసిన వారికి గొప్ప బహుమతి కొనిస్తానని అన్నాడు. "ఇంకేం మన రాజు కానీ, శివాని కానీ గెలుస్తారు. ఎందుకంటే మనందరిలో వారే కదా పెద్ద. పైగా తెలివైన వారు." అంది గీత. అందరూ కథలు చదువుతుంటే రాజు చదువుతున్నట్లు నటిస్తున్నాడు. "రాజన్నా! నువ్వు చదివిన కథలు నాకు చెప్పవా? కథలు వినడమంటే నాకు చాలా ఇష్టం." అన్నది సిరి. చిట్టి చెల్లెలు అడిగేసరికి ఇక తప్పదు అన్నట్లు ఆ సాయంత్రం "రాజు కుమారులు - ఏడు చేపల కథ." చెప్పాడు. "ఆ కథ చాలా పాతది. ఇంకో కథ చెప్పు." అన్నది సిరి. "కుందేలు తాబేలు" కథ చెప్పాడు రాజు. "నేను తెచ్చిన పుస్తకాలలో ఆ కథలే లేవనుకుంటా." అన్నాడు రామయ్య. "నేనంటే నీకు చులకన. అందుకే కావాలని నాకు పాత కథలు చెబుతున్నావు." అని అలిగి వెళ్ళిపోయింది సిరి. రాజు ఎంత బతిమాలినా సిరి రాజుతో మాట్లాడలేదు. రాజు ఎంతో బాధ పడ్డాడు.

ఒకరోజు రామయ్య రాజును పిలిచి, షాపుకు వెళ్ళి, ఈ సరుకులను తెమ్మని లిస్ట్ ఇచ్చాడు. రాజు తన వెంట రమ్మని తన చెల్లెళ్ళను, తమ్ముళ్ళను ఎంత బతిమాలినా తమకు పని ఉందని తాము రాలేదని అన్నారు. విధిలేక రాజు ఒక్కడే వెళ్ళి, సరుకుల లిస్ట్ షాపు యజమానికి ఇచ్చి, సరుకులను ఇమ్మన్నాడు. యజమాని "నువ్వే చదువు, నేను సరుకులను ఇస్తా, నేనే చదవాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే." అన్నాడు. రాజు కంటే వెనుక వచ్చిన వారందరికీ ఇస్తున్నాడు కానీ రాజును ఎంతకీ పట్టించుకోవడం లేదు. గంటలు గడుస్తున్నాయి. ఇంతలో రాజు పిన్ని కూతురు రెండవ తరగతి చదువుతున్న సరస్వతి అక్కడికి వచ్చింది. జరిగింది తెలుసుకుఃది. రాజు దగ్గర చీటీ తీసుకుని లిస్ట్ తాను చదివింది. సరుకులను తీసుకుని రాజు వెళ్ళిపోతుంటే వెనుక నుంచి షాపు యజమాని పగలబడి నవ్వాడు. రాజు సిగ్గుతో తల దించుకున్నాడు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే జరిగే అవమానాలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. తన తాతయ్య దగ్గర చేరి తన సమస్యను చెప్పుకున్నాడు. తాతయ్య నవ్వి రాజుకు కొద్ది రోజుల్లోనే తెలుగులో తప్పులు లేకుండా చదవడం, రాయడం నేర్పాడు. కథల పుస్తకాలను చదివించాడు. సొంతంగా కథలు రాసేలా తీర్చిదిద్దాడు. పిల్లలూ! మీరు ఏ మీడియంలో చదివినా సరే! మాతృభాషను నిర్లక్ష్యం చేయకండి. దాని తర్వాతే మిగతా భాషలు అని తెలుసుకోండి.

మరిన్ని కథలు

Trikala Vedi - Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
laziness is a sin
సోమరితనం అరిష్టం
- సరికొండ శ్రీనివాసరాజు‌
Toy Stories - Sadgunavathi
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
Laughing Club
నవ్వుల లోకం
- భాస్కర్ కాంటేకార్
Toy Stories - Rudra Bhavani
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Lost Words
చివరి మాటలు
- దార్ల బుజ్జిబాబు
Akshaya Patra - Bommala Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.