చిన్ని చిన్న ఆనందాలు - రాజ మోహన్ ఇవటూరి

Chinna chinna aanandalu

"ఒరేయ్ చవటాయిల్లారా ! ఇంతసేపూ మనకు పేకాటా మన ఆడాళ్ళకి చీరల చర్చలూ బాగానే జరిగాయి కనుక ఒక పసందైన కార్యక్రమానికి స్వీకారం చుడతాను" అన్నాడు స్ఫూర్తి.

మా మందలో నాటకీయంగా మాటాడే కళ స్ఫూర్తికే ఉంది. వాడు వాళ్ళ అగ్రహారంలో (టౌన్ షిప్ అంటారు కానీ అటువంటి గృహసముదాయాల్లో ఉండే సంకృతి కి దగ్గరగా ఉంటాయని వాటిని నేను అగ్రహారం అనే పిలుస్తాను) సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ నిర్వాహకుడు కనుక ఇక్కడకూడా ఏదో వేడుక చేయబోతున్నాడని అర్ధమయ్యి అందరం మాటలు ఆపి కూర్చున్నాం.

'అంత్యాక్షరి, మూగ సైగలూ వంటి మూస కార్యక్రమాలు కాకుండా ఒక కొత్త వినోదం ప్రారంభిద్దాం' అన్నాడు స్ఫూర్తి.

"ఏమిటా కొత్త వినోదం?" చలపతి కుతూహలంగా అడిగాడు.

"చెప్తానుగా. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనందరికీ ఒక వేడుక లా కన్నా ఒక అవకాశమని మీరంతా త్వరలో గ్రహిస్తారు ..." అని స్ఫూర్తి ఇంకా చెప్పబోతుంటే అప్పలరాజు గొంతు సవరించుకుని 'ఒరేయ్ నీ కళాత్మకమైన నిర్వాహకనైపుణ్యం ఇక్కడ అవసరం లేదు కనుక నేరుగా అసలు విషయానికి వచ్చెయ్. అసలే ఆటలో సరైన ముక్కలు రాలేదని తపించిపోతున్నాం' అన్నాడు.

స్ఫూర్తి ఒకసారి వాడికేసి కోపం నటిస్తూ చూసి 'అలాగే. కానీ ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకూ పేకాట ఆపమని కోరుతున్నాను.' అన్నాడు.

'అన్యాయం అన్యాయం' అంటూ అభ్యంతరం చెప్పినా అందరం వాడి మాటలకి ఒప్పేసుకుని పేకముక్కలు మూసేసాం. ఎందుకంటే వాడు ఏంచేసినా అందరకీ నచ్చేలాగే ఆలోచిస్తాడని అందరికీ తెలుసు. పైగా వాడేమి చేసినా ఆ వేడుకలో ఆడా మగా పిల్లా మేకలందరినీ కలిపేస్తాడు కనుక ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుని విందు జరుపుకుంటున్న మా పాత స్నేహితులందరికీ కలిసి పాల్గొనే అవకాశం ఉంటుంది.

మేమూహించినట్టే వాడు గొంతు సవరించుకుని 'ఒరేయ్ పిల్లలూ మీ ఆటలు కొంచెం సేపు ఆపి ఇలా రండి, అమ్మా మహిళా మణులూ మీరు చీరల చర్చలు చేసుకోవటానికి ఎంత సమయమూ సరిపోదు గానీ కొంచెం సేపు ఇక్కడికి రండి. అందరూ ఇక్కడ గుండ్రంగా అమర్చిన కుర్చీల మీద కూర్చోండి' అన్నాడు.

అందరూ వచ్చారని నిర్దారించుకున్నాక వాడు కొంచెం గంభీరంగా 'మీ అందరి జీవితాలలో ఎన్నో వినోదాలూ కొన్ని విషాదాలూ జరిగి ఉంటాయి. అయితే మీరు మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతిని ఒక్కొక్కరూ ఇక్కడ పంచుకోండి. మీ అందరికీ మన పేర్లతో ఉన్న కాగితాలు అందజేస్తాను ( వాడు మా పేర్లు వ్రాసిన కాగితాలు పంచుతాననగానే 'ఓరి భడవా! ఇదంతా తయారు చేసుకునే నీ ఉపన్యాసం మొదలెట్టావా' అనుకున్నాను) ప్రతివారూ వారి అనుభవం చెప్పగానే మీకు తోచిన అంకెలు వారి పేరు పక్కన వెయ్యండి. మీకు బాగా నచ్చితే పది అంకె అస్సలు నచ్చకపోతే సున్నా కొద్దిగా నచ్చితే పదికీ సున్నాకీ మధ్య అందుకు సరిపోయే అంకె వెయ్యండి' అన్నాడు స్ఫూర్తి.

"అనుకున్నాను. చిన్నప్పటి కళాశాల రోజుల్లో లాగే వీడేదో కొత్త ఆలోచనతో వచ్చాడు తమ జీవితంలో గొప్ప అనుభవం చెప్పుకోవాలనే కోరిక ఎవరికీ ఉండదు? " అన్నాడు సుబ్బారావు.

'ఇందులో పెద్దా చిన్నా ఆడామగా తేడాలేమీ లేవు. ప్రతివాడికీ వారివారి జ్ఞాపకాలు ఉంటాయి కనుక ఇక్కడ పంచుకునే అవకాశం వదులుకోవద్దు' అంటూ కొనసాగించాడు స్ఫూర్తి.

వాడు మాటాడుతుండగానే ఇద్దరు మనుషులు మా పేర్లున్న కాగితాలు ఒక్కొక్కరికీ పంచటం ప్రారంభించారు. మరొకవేపునుంచి ఒక్కొక్క కుర్చీ ముందు ఉన్న బల్ల మీద భోజనాలు వడ్డించటం ప్రారంభమయ్యింది. ఈ అంశంలోనే భోజనాలు అయిపోయేలా ఏర్పాటు చేసిన వాడి నిర్వాహక నైపుణ్యాన్ని మరోసారి అందరం మనసులోనే అభినందించుకున్నాం.

మేమందరం ఒకప్పుడు ఒకే బడిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుకుని ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న అతి సాధారణమైన మిత్రులం. సాధారణమైన అని ఎందుకన్నానంటే ఇప్పటికీ ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకోగల స్నేహం మామధ్య ఇంకా ఉంది కనుక. చిన్నతనంలో ఎవడు బాగా చదువుతున్నాడు ఎవడు ఆఖరు బల్ల మీద కూర్చున్నాడు అనే భేదం లేకుండా ఎలా స్నేహం పెంచుకున్నామో అదే విధంగా ఈరోజు ఎవరు ఎంత సంపాదిస్తున్నాడు ఎవడికి ఎంత మంచి స్థాయి ఉద్యోగం ఉంది లాంటి చిల్లర వ్యవహారాలతో సంబంధం లేకుండా అందరం మేము ఆ రోజు విడిపోయిన మర్నాడే మళ్ళీ కలుసుకున్నంత సులువుగా కలిసిపోయాం.

నేనింకా ఆలోచిస్తుంటే భోజనాలు వడ్డించటం పూర్తయ్యింది.

'మీరందరూ భోజనం ప్రారంభించండి. మనం భోజనం చేస్తూనే ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మనకి సహాయంగా ఈ అతిథి గృహం కాపలాదారు కొడుకు శేఖర్ ఉంటాడు. ఈ అబ్బాయి మన పేర్లున్న కాగితాల కుప్ప లోంచి ఒక్కొక్క కాగితం ముక్కా తీసి మన పేరు చదివినపుడు ఆ పేరు తాలూకు మనిషి తన అనుభవం చెప్పాలి. ఇప్పుడు మనం సుఖంగా ఈ మూడు రోజులూ కలిసి ఉండటానికి సాయం చేసిన వంట వారు, కాపలా వారు, నిర్వాహకులబృందం కూడా మన తర్వాత పాల్గొంటారు ' అన్నాడు స్ఫూర్తి.

అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత భయంకరమైన నిశ్శబ్దం. ఎవరు మొదలు పెడతారో అనే కుతూహలంతో పాటు ఆ వ్యక్తి తనే అయితే ఎలా చెప్తామో అనే కొంత అలజడితో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

'సరే మీ అందరికీ కొంచెం తెరిపిగా ఉండటానికి నేనే ముందు ప్రారంభిస్తాను' అన్నాడు స్ఫూర్తి.

'హమ్మయ్య ఇంకొంచెం సమయం ఉంది' అని ఒక్కొక్కరం ఎంతో నెమ్మదిగా నిట్టూర్చినా అందరి స్పందనా ఒకటే (నిట్టూర్పే) కావటంతో పెద్దగా వినపడింది.

స్ఫూర్తి ఒక బహుళ జాతి సంస్థలో ఉన్నత స్థానంలో లో పని చేస్తున్నాడు. ప్రతినెలా కనీసం రెండు మూడు దేశాలు తిరిగివస్తుంటాడు. శ్రీనివాస్ వాడి ఉద్యోగానికి తిరుగుబోతు ఉద్యోగమని పేరు కూడా పెట్టాడు అన్ని దేశాలు తిరిగినవాడికి చెప్పుకోతగిన ఎన్నో అనుభవాలు తప్పకుండా ఉంటాయి. కానీ మరిచిపోలేని ఒకే ఒక జ్ఞాపకాన్ని చెప్పుకోవటం అంట సులభం కాదు. వాడి ప్రేమ కథ మొత్తం మాకు తెలుసు కనుక వాడు చెప్పబోయేది ఆ విషయానికి సంబంధించినది కాకపోవచ్చనిపించింది.

ఇలా ఆలోచిస్తుండగానే వాడు మొదలు పెట్టాడు.

నేను ఉద్యోగం లో చేరినప్పుడు నా సంస్థకి కొత్త వ్యాపారం తీసుకురావటమే ముఖ్యమైన పని గా ఉండేది. నేను ఓ మోస్తరుగా మా సంస్థకి అమ్మకాలు పెంచి అప్పుడే కొంచెం ఎదుగుతున్నాననే నమ్మకం కుదురుతున్నపుడు మా సంస్థ అధిపతి లెక్కలన్నీ తారుమారు చేసి తన సంస్థకి రాని లాభాలు చూపించాడని అభియోగంతో చెరసాల పాలయ్యాడు. అప్పుడు మా పరిస్థితి ఎలా తయారయ్యిందంటే మాకు ఆ నెల నుంచి జీతాలు వస్తాయోలేదో నమ్మకం లేదు. సంతకాల వరకూ వచ్చిన ఎన్నో వ్యాపార ఒప్పందులు వెనక్కు వెళ్లిపోయాయి. కొంతమంది కొనుగోలు దార్లు వారి వ్యాపారాలలో మాకు అవకాశం ఇవ్వకూడదని తీర్మానించుకుని ఆ విషయాన్ని మాకు లిఖితపూర్వకంగా తెలియజేసేసారు కూడా. నా తోటి ఉద్యోగులు కొంతమందికి పెళ్లి సంబంధాలు రద్దయ్యిపోయాయి. కొంతమందిని ఇళ్ళు ఖాళీ చెయ్యమన్నారు. రుణాలిచ్చిన సంస్థలు వెంటనే మొత్తం డబ్బంతా చెల్లించమని ఉత్తరాలు పంపారు. ఒకటి కాదు గానీ ఆ పరిస్థితిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం కష్టమయిపోయింది.

అటువంటి పరిస్థితిలో ఒక సంస్థ "ప్రగతి కళాశాల" వారి ఆర్థికవ్యవహారాలని చూసుకోవటానికి కొంత మందితో పాటు మా సంస్థని కూడా కొటేషన్ ఇవ్వటానికి పిలిచింది. ఈ అవకాశం కనుక మా సంస్థకి వస్తే మాకు కొన్నాళ్ళు సమస్య ఉండదని నమ్మకంతో ఎంతో కష్టపడి మా ప్రపోసల్ ఇచ్చాను. వారం రోజుల్లోనే వారు మమ్మల్ని పిలిచారు. అక్కడికి వెళ్ళగానే ప్రగతి కళాశాల అందరి ధరఖాస్తులనీ పరిశీలించి ఇద్దరిని మాత్రమే పిలిచారనీ మా ఇద్దరిలో ఎవరు ఈ పోటీలో నెగ్గితే వారితో ఈరోజే సంతకంతో కూడిన ఒప్పందం చేసుకుంటారనీ తెలిసింది. పోటీలో ఉన్న మరొకరు ఎవరో కాదు. మా సంస్థని వదిలి వేరొక సంస్థలో చేరిన శ్రీనివాస్. నిజానికి అతను వదిలి వెళ్లిన స్థానంలోనే నేను పని చేస్తున్నాను.

ప్రగతి కళాశాల ప్రధానాధికారి అజిత్, ముందు శ్రీనివాస్ తో మాట్లాడి తర్వాత నన్ను చర్చలకి పిలిచాడు.

నేను లోపలికి వెళ్ళాక మర్యాదపూర్వక సంభాషణలు ముగియగానే అజిత్ నేరుగా విషయానికి వచ్చాడు.

"స్ఫూర్తిగారూ! మీ ప్రపోసల్ మొత్తం చదివాము. మేము ఆశించినదానికన్నా ఎంతో సంతృప్తికరంగా ఉంది. కానీ ఒక చిత్రమైన పరిస్థితిలో ఉండటం వలన ఆ విషయాలు మీతోనే సంప్రదించాలనుకుంటున్నాను. మీకు తెలుసుకదా మేము మరొక సంస్థని కూడా చర్చలకు పిలిచాం. ఆ సంస్థ ప్రతినిధి మీ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. మాతో ఒప్పందం ప్రమాదకరమని కూడా చెప్పాడు."అన్నాడతను.

వాడు వాడి వృత్తి ధర్మంగా అలా అన్నాడని తెలుసు కనుక నేనేమీ నొచ్చుకోకుండా వెంటనే "అజిత్ గారూ! మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు ముందే తెలుసు. మీకు మా మీద నమ్మకం రావటానికి ఏంచెయ్యాలో చెప్పండి' అన్నాను.

అజిత్ నన్నర్ధం చేస్తుకుంటున్నట్టు తలాడించి 'నా ఒక్కడికే కాదు మీరు వివరించబోయే ప్రతిపాదన నా సహచరులందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి." అని తన పక్కన కూర్చున్న మిగతా అధికారులని చూపించాడు.

నేను రానున్న పది నిముషాలలో చెప్పబోయేవిషయం మీదే ఫలితం ఆధారపడి ఉంటుందనే విషయం తలుచుకోగానే నా శరీరం వేడెక్కి కొద్ది కొద్దిగా చమటలు పట్టాయి.

"మీరు కావాలంటే ప్రతిపాదన తయారుచేసుకోవటానికి ఒక గంట సమయం తీసుకుని మళ్ళీ ఇక్కడికి రావచ్చు" అన్నాడు అజిత్ నా మౌనాన్ని చూసి.

నేను వెంటనే 'లేదండీ. నాకు అదనంగా ఏసమయమూ అవసరమూ లేదు" అని చెప్పి వారి వ్రాత బల్ల దగ్గరికి వెళ్లాను.

"ఎవరైనా ఒక సంస్థకి అవకాశం ఇచ్చేటపుడు పరిశీలించే విషయాలు ఆ సంస్థ ఆర్ధిక పరిస్థితి, ఆ సంస్థ స్థిరత్వం, ఆ సంస్థ ఎంత బాగా మీ పని చేయగలదు ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి పని చేసిందీ" అని ఆ నాలుగు ముక్కలూ బల్ల మీద వ్రాసాను.

'మనకేమైనా ప్రమాదం ఉందా? అనే అవగాహన కోసం ఇప్పుడు ఒక్కొక్క విషయమూ పరిశీలిద్దాం' అని మొదలు పెట్టాను.అజిత్ అవునన్నట్టు తలాడించాడు.

"మీకున్న మొదటి చింత ఆర్ధిక పరిస్థితి - ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థని స్వాధీనంలోకి తీసుకుంది. జరిగిన అవకతవకల వలన మా ఆర్ధికపరిస్తితికి ఏ ఢోకా ఉండదని పత్రికాముఖంగా ప్రకటించింది. అంటే ఇక్క ఏప్రమాదమూ లేదన్నమాట" అంటూ ఆర్థికపరిస్థితి పక్కన "ప్రమాదం లేదు" అని వ్రాసాను.

"స్థిరత్వం - కేవలం ఒక నాయకుడు ఒకరిద్దరి సహాయంతో ఈ తప్పు చేసాడు తప్ప మిగిలిన అధికారులకి ఇందులో జోక్యం లేదు. వారిలో పై స్థాయి అధికారి సంస్థ పగ్గాలని తీసుకోవటం జరిగింది కనుక ఇక్కడ కూడా ఏప్రమాదమూ లేదు అని "స్థిరత్వం పక్కన కూడా "ప్రమాదం లేదు" అని వ్రాసాను.

"మా పనితనం - ఈ వివరాలు నేను మీకు సమర్పించిన దరఖాస్తులో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నత అధికారుల వలన జరిగిన అవకతవకల వలన ఈ విషయంలో వచ్చేమార్పు లేదు. కనుక ..." ఏప్రమాదం లేదు అని అక్కడ కూడా వ్రాసాను.

"మా నైపుణ్యానికి రుజువులు- ఈ వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. వాటిలో కూడా మార్పు లేదు కనుక ...." "ప్రమాదం లేదు" అని నాలుగో చోట కూడా వ్రాసి వారి ముఖ్యమైన చింతలకి చివర పెద్ద అక్షరాలతో "మీకే ప్రమాదమూ లేదు" అని వ్రాసాను.

ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత గదంతా మారుపొంగిపోయేలా కళాశాల అధికారులు చప్పట్లు చరిచారు. ఆ ఒప్పందం మాతోనే జరగటం కాక తర్వాత నాకు సంస్థ నుంచి అతిపెద్ద పురస్కారం లభించింది. ఇది నేనెప్పటికీ మరిచిపోలేని అనుభూతి' అని ముగించాడు స్ఫూర్తి.

నిజంగానే ఇది అపూర్వమైన అనుభవం. వాడు చెప్పిన విధానం కూడా బావుండటంతో అందరం చప్పట్లు చరిచాం.

"చాలా బావుందిరా మూర్తి. పేకాట మానేసినందుకు ఏమాత్రం బాధ పడక్కర్లేదు. ఇంకచీటి తియ్యమను. మిగతావాళ్ళవి కూడా వినాలి" అన్నాడు అప్పలరాజు. అందరికీ వారివారి అనుభవాలు చెపుకోవాలనే ఉత్సాహం మొదలయ్యింది.

మొదటి చీటీ మోహన్ కి వచ్చింది. మోహన్ ఒక క్షణం ఉలిక్కిపడి 'తప్పదా?" అని ఒకసారి నవ్వి "సర్లే స్ఫూర్తి గాడు మొదలెట్టాక ఎలా ఆపుతాం?" అని ప్రారంభించాడు.

"నాది ప్రేమ వివాహమనే మీకందరికీ తెలుసు. కానీ కొద్దీ మందికి తెలియనిది అది పెద్దల సహకారంతోనే జరిగిందని. నేను , రమా చిన్నప్పటినుంచి ఒకే వీధిలో ఆడుకుని ఆ తర్వాత కలిసి చదువుకున్నాక ఒక విషాదకరమైన రోజు నేను తన సమైక్య కుటుంబం ఉండే ఇంటిలోనే రమ తో దొరికిన కొన్నిక్షణాల ఏకాంతంలో నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను. చిన్నప్పటినుంచి ఒకరికొకరం తెలుసు కనుక ఆమె కాదంటుందనే అనుమానమే నాకు లేదు. కానీ నా నెత్తిన పిడుగు పడేలా రమ తనకిష్టం లేదని ఒకే మాటలో చెప్పేసింది. ఆ మాట వినగానే నాకు మరి మాటలు లేక ఆగిపోతే రమ గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది ..." కథని కొంచెం రక్తి కలిగించటానికి కొంచెం ఆగాడు మోహన్. ఏంజరిగిందో అని ఉత్కంఠతో ఉన్న స్నేహితులని తృప్తిగా చూసి కొనసాగించాడు.

"అప్పుడు మా మావగారు అప్పటికి కాబోయే మావగారు లెండి. ఆయన కలగజేసుకుని నా అద్భుతమైన లక్షణాలన్నీ రమకి కధలుకధలుగా చెప్పి ఇటువంటి వాడు మళ్ళీ దొరకడనీ వదులుకోవద్దనీ రమని పాపం వప్పించారు. అంతా అయ్యాక ఆనందంగా రమని కలుసుకున్నప్పుడు రమ కోపంగా 'మా నాన్న వప్పిస్తే వప్పుకున్నాను తప్ప నీలాంటి పనికిమాలిన ప్రేమికుడిని రోడ్డుమీద తన్ని పంపించాలి" అంది. నేను నిర్ఘాంతపోతుంటే " ఆ నున్నగా చేసుకున్న ఆ గడ్డమేమిటి ? బడి పిల్లాడిలా ఆ పాపిడి ఏమిటి? ఎప్పుడైనా ఒక గులాబీ పువ్వు తెచ్చావా? శిల్పారామాలూ గాంధీగారి మ్యూజియం కాకుండా ఒక సినిమాకి తీసుకెళ్ళావా? నా పుట్టినరోజున నాకు వాయులీనమిచ్చి నేర్చుకోమంటావా? మీ అధికారులనీ ఖాతాదారులనీ సంతోషపెట్టటానికి రకరాలు చేస్తావ్? నన్ను ఆకట్టుకోవటానికి నువ్వు ఒక్క పని చేసావా? అసలు నీ ప్రేమ నేను అంగీకరిస్తామని ఎలా అనుకున్నావు? " అంది ఉక్రోషంగా. నేను వెంటనే తల వంచుకుని "నన్ను క్షమించు రమా! నిజంగా ఇది తప్పే. కానీ నేననుకున్న విషయం విను." అన్నాను.

"ఇప్పుడేం చెప్పినా నా మనసులో గాయం మానదు. పైగా మా నాన్న ని వాడుకుని పెళ్ళికి వప్పిస్తావా?" అని అరిచినట్టు చెప్పింది రమ.

"ఇవన్నీ నేను ఆలోచించకపోవటం తప్పే రమా! నా వృత్తిలో ఎంతో మందిని సంతోషపెట్టి నా పనులు జరిపించుకుంటానన్నది నిజమే. కానీ వాళ్లతో నేను కలిసి బతకను రమా. ఇద్దరు ప్రేమికుల మధ్య నిజమైన ప్రేమ ఉండాలంటే నేను నేనుగా నీకు తెలియాలి నువ్వు నువ్వుగా నాకు తెలియాలి. మనలోని లోపాలు తెలిసాక కూడా నచ్చితేనే ఆ పెళ్లి ఫలిస్తుంది అనే భావంతో నేను నీ ముందు ఎప్పుడూ నాటకాలు ఆడలేదు. ఎప్పుడూ నేనుగానే ఉన్నాను. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నాను. కానీ నేను నీకు నచ్చకపోతే మావయ్యకి చెప్పి ఈ సంబంధం రద్దు చేసేస్తాను." అన్నాను.

నేను మాటలు పూర్తిచేసి తలెత్తేసరికి రమ కన్నీళ్లతో నా వైపు చూస్తోంది. మా చూపులు కలవగానే నా చెంప మీద ముద్దుపెట్టుకుని మరేమీ మాటాడకుండా వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఆరోజు నాకు కూడా చలనచిత్ర కథానాయకుడిలా గాలిలో కాసేపు నడవాలనిపించింది" అన్నాడు మోహన్.

అందరూ నవ్వేశారు. స్ఫూర్తి అందుకుని "అప్పుడు నాటకాలు ఆడలేదు కానీ మోహన్ గాడు ఇప్పుడు మా మరదలితో ఆడుతున్నదంతా నాటకమే" అన్నాడు. మళ్ళీ రమతో సహా అందరూ నవ్వేశారు.

తర్వాత చీటీ బలరాం కి వచ్చింది. బలరాం ఎక్కువగా మాటాడడు గానీ ఆరోజులలో వాడు చెప్పిన కొద్దీ కొద్దీ మాటలలో జీవితం గురించి నేనెన్నో నేర్చుకున్నాను. బలరాం కొంచెం ఇబ్బందిగా "అన్నీ చెప్పుకోవటం కష్టంరా" అన్నాడు.

నేను వెంటనే "ఒరేయ్ ఇక్కడ ఎవరూ పరాయివాళ్ళు లేరు నువ్వు చెప్పినవేవీ బైటికి వెళ్లవు" అన్నాను.

"అదేం కాదులే చెప్తాను. ఈరోజు నేను చెప్పచ్చు." అని బలరాం మొదలెట్టాడు.

"చిన్నప్పుడు మనలో చాలామందిలాగానీ మేము కూడా ఒక దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళం. ఇల్లంతా పేదరికం తాండవించేది. నేను పదవతరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో సరైన బోధన లేకపోవటంతో ట్యూషన్ తప్పనిసరి అయ్యింది. రెండు ఉద్యోగాలు చేసి వళ్ళు హూనం చేసుకుని కూడా బొటాబొటీ గా ఇల్లు నడిపిస్తున్న నాన్నపరిస్థితి తెలుసు కనుక అడగటానికి మొహమాట పడినా మా స్నేహితుల మధ్య మాటలు విని నాన్నఏమిటి విషయమని అడిగి నేను చెప్పగానే నిండుగా నవ్వి "రేపటినుంచి వెళ్ళరా" అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఎలా నాన్నా? నెలకి పాతిక రూపాయలు ఎలా అమరుస్తావు? అని అడిగాను. నాన్న మళ్ళీ గట్టిగా నవ్వి "చిన్నపిల్లలు ఇవన్నీ అడగకూడదు. మీ గురువుగారికి డబ్బులు నెలాఖరు నుంచి ఇస్తానని చెప్పు" అన్నాడు. మా గురువు గారు మంచి వారు కనుక నెలాఖరు ఏర్పాటుకి ఆయన వప్పుకున్నారు. కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. 'అప్పు చేస్తావా? చేసినా నెలనెలా ఇంత డబ్బు అప్పు ఎవరిస్తారు?' అని నేనడిగినప్పుడల్లా నాన్న చిరునవ్వే సమాధానమయ్యింది. నెల తర్వాత సమాధానం నాకే దొరికింది. ప్రతిరోజూ సాయంత్రం ఉద్యోగం నుంచి వచ్చాక నాన్న రోడ్డుమీదున్న మా చిన్న ఇంటి బైట తుప్పు పట్టిన ఇనప కుర్చీలో కూర్చుని ఎంతో విశ్రాంతిగా ఒక చుట్ట కాల్చేవాడు. దాదాపు పది నిముషాలు ఆ చుట్టని ఆస్వాదిస్తూ తాగాక రెండో ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఆ దృశ్యం నాకు గత నెల రోజులనుంచీ కనబడటం లేదనీ నాన్న తన జీవితమనే సంకుల సమరంలో తనకంటూ కేటాయించుకున్న ఆ పదినిముషాలలో పాలు పంచుకునే చుట్ట మాయమయ్యిందనీ అదే నా అదనపు చదువుకి ఉపయోగపడిందనీ తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. అందరి బాటలో కాకుండా నేను పాలిటెక్నిక్ కళాశాలలో చేరిపోయాను. మా చదువులగురించి తెలియని నాన్న అది కూడా మంచిదే అనుకున్నాడు. మూడేళ్లు దీక్షగా చదివి ఉద్యోగం తెచ్చుకుని నా మొదటి జీతంతో నాన్నకిష్టమైన చుట్టల పొట్లాలతో పాటు మంచి పడక కుర్చీ కొని ఇంటికి తీసుకెళ్ళాను. నాన్నని నేనే ఇంటి బైటికి తీసువచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి చుట్టలూ అగ్గిపెట్టె చేతికిచ్చి దణ్ణం పెట్టాను. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూస్తున్న నాన్నతో "నాన్నా! ఈ రోజు నుంచి నీ రెండో ఉద్యోగం మానేసి సాయంత్రాలు హాయిగా విశ్రాంతి తీసుకో. భగవంతుడి దయ వలన నాకు ఉద్యోగం దొరికింది. ఇంకొన్ని నెలలలో మీరు అసలు ఉద్యోగమే మానెయ్యచ్చు " అన్నాను.

విషయమంతా మళ్ళీ మళ్ళీ నా దగ్గరనుంచి విని కొడుకు ప్రయోజకుడయ్యాడనే చెప్పలేని సంతోషంతో కించిత్తు గర్వంతో నాన్న ఆరోజు గడిపిన ఆ సాయంత్రం ఆ తర్వాత ఎన్నో అటువంటి సాయంత్రాలు నా జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా ఇప్పటికీ ఉన్నాయి" అని ముగించాడు బలరాం.

ఈసారి ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అందరూ ఒకరకమైన దిగ్బ్రాంతి లో ఉంటే ఎలాంటి వాతావరణాన్ని మార్చగలిగిన స్ఫూర్తి కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

కొంచెం సేపటికి స్ఫూర్తిగాడే తేరుకుని "బలరాం గాడు ఒక నగ్న సత్యాన్ని చెప్పాడు రా. నాకు ఉన్నతపదవి వచ్చిందనో విదేశం పోతున్నాననో ఉద్రేకపడిపోయి అవే మన ఘనకార్యాలు గా చెప్పుకు పోతున్నాం. రోజూ మన చుట్టూ ఎన్నో మధురమైన అనుభూతులు ఉంటూనే ఉంటాయి. మనకందరికీ భోజనం పెట్టి పిల్లలు ఆకలిగా అన్నీ తినేస్తే తన కేమీ మిగలకపోయినా వాళ్ళు తృప్తిగా తిన్నారనే సంతోషంతో పడుకునే అమ్మ లకి రోజూ గొప్ప అనుభూతే. నా పిల్లకి కొత్త రిబ్బన్లు కొన్నపుడు రాత్రి నిద్రమానేసి తెల్లారటం కోసం ఎదురుచూసి మర్నాడు పొద్దున్నే వాళ్ళమ్మని విసిగించి ఆ రిబ్బన్లు జడకి వేసుకుని పిల్ల చిందులేసే దృశ్యం ఎప్పటికీ మరుపురాని అనుభవమే. నీ బిడ్డని ఎత్తుకుని దానికిష్టమైన కాకులు ఎగురుతుంటే చూపించి అది బోసినవ్వులు నవ్వుతుంటే కలిగే పరవశం ఎలా మరిచిపోతావ్? " అన్నాడు.

అప్పుడు చలపతి అందుకుని "సరిగ్గా చెప్పావురా. ఒకరోజు నేను మా ఆఫీస్ కి పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. నా కొడుకు తను ఎంతో కష్టపడి వ్రాసిన పరీక్షలో ఫలితం అనుకున్నంత బాగా రాకపోవటంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాడిని దగ్గరికి తీసుకుని పది నిముషాలు ఓదార్చాలనిపించినా ఆ రోజు పొద్దున్నే ఒక ముఖ్యమైన సమావేశం ఉందని నేను గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయాను. సాయంత్రం నేను వాడి కోసం మంచి మంచి కానుకలు తెచ్చి పరీక్ష ఫలితం వాడనుకున్నంత చెడ్డగా ఏమీ లేదనీ మన దగ్గరలోనే ఉన్న కొన్ని మంచి కళాశాలలో చదువుకోవటానికి ఆ ఫలితం సరిపోతుందనీ వాడిని ఉత్సాహపరిచాను. కానీ వాడు తన మనసుకి ఊరటకోసం ఎదురుచూసిన ఆ క్షణంలో నేను పక్కన లేననీ అప్పుడు లేకపోయాక తర్వాత నేను ఏమిచేసినా ఆ లోటుని భర్తీ చేయలేనని నాకు తెలుసు. ఆ క్షణం మళ్ళీ కావాలంటే వస్తుందా?అటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకూడదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను" అన్నాడు.

అప్పటివరకూ మౌనంగా ఉన్న శ్యాం అందుకున్నాడు.

"నేను నా వంతు వచ్చినపుడు చెప్పాలనుకున్నది బలరాం చలపతి చెప్పేసారు. కానీ స్ఫూర్తి అనుమతితో నేను నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను" అన్నాడు.

స్ఫూర్తి అంగీకారంగా తలాడించి "మిగిలినవారికి అభ్యంతరం లేకపోతే నువ్వు కొనసాగించచ్చు. ఎలాగా విజేత ని మార్కుల ప్రకారం నిర్ణయిస్తాం తప్ప ఒకరు ముందూ ఒకరు వెనకా అయినా పరవాలేదనుకుంటా" అన్నాడు. చాలామంది అంగీకారంగా తలలూపాక శ్యాం మొదలెట్టాడు.

"మా వాడి బడిలో ఒక పోటీ పెట్టారు. క్రీస్తు జన్మదినం రోజు పొద్దున్నే మనమే రకరకాల కానుకలు శాంటా పేరు మీద ఇస్తామని తెలుసు కదా! అలా వారికి వచ్చిన బహుమతులలో అతి గొప్ప కానుక గురించి ఒక్కొక్కడూ చెప్పాలి. వాడి తోటి పిల్లలంతా వాళ్లకి వచ్చిన రకరకాల బహుమతులని వర్ణిస్తే వీడు ఊహించని విషయం చెప్పాడు.

వాడు వేదిక ఎక్కి ఏమీ మాటాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతే న్యాయనిర్ణేతలలో ఒకరు "రాజూ! ఏమయ్యింది? ఇక్కడ భయపడటానికి ఏమీ లేదు. ఇలా చెప్పుకునే అవకాశం మళ్ళీ రాదు. నువ్వేం చెప్పాలనుకున్న నిర్భయంగా చెప్పు" అని ధైర్యం చెప్పింది. రాజు తన గొంతు సవరించుకుని "నేను చెప్పబోయేది మీరనుకున్న లాంటి బహుమతి అవుతుందో లేదో నాకు తెలియదు మాడం. కానీ నాకు చెప్పాలనిపిస్తోంది" అన్నాడు.

"అలాగా. ఏంపరవాలేదు. చెప్పు" అందావిడ.

అప్పటికి రాజు ధైర్యం తెచ్చుకుని కొనసాగించాడు. "కొన్నేళ్ళనుండి నుండి అమ్మా నాన్నా వేరే చోట్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్నపుడు ప్రతి ఏడాదీ నాన్న ఈ పండగ సెలవులకి వచ్చి మర్నాడు మధ్యాహ్నం తాను ఉద్యోగం చేసుకునే చోటికి వెళ్లిపోయేవాడు. వెళ్లిన ప్రతిసారీ చెల్లి వెక్కివెక్కి ఏడిస్తే నేను మనసులోనే బాధ పడుతుండేవాడిని. అలా ఒకరోజూ రెండు రోజులకి వచ్చిన ప్రతి పండగలోనూ మంచి మంచి బహుమతులు నాన్న మాకోసం తెచ్చాడు. ఈసారి మాకు అటువంటి బహుమతులు ఏమీ తేలేకపోయాడు"అని ఒక క్షణం ఆగాడు రాజు.

మళ్ళీ కొనసాగిస్తూ "ఏ బహుమతీ ఎందుకు తేలేదంటే నాన్న ఉద్యోగం విషయం లో కొంచెం రాజీ పడి మేమున్న చోటే మరో ఉద్యోగంలో చేరటం వలన అక్కడ ఇల్లు ఖాళీ చేసి అప్పగింతలు చేసి రావటానికి మరేరోజూ కుదరక పండగ రోజునే రాగలిగాడు. ఆ రోజే ఎన్నో పనులూ లావాదేవీలూ పూర్తి చేసుకోవలసి రావటంతో మాకు ఏమీ తీసుకురాలేకపోయాడు. అయితేనేం? నాకూ నా చెల్లికీ ఈసారి అన్నిటికన్నా అతి పెద్ద బహుమతి వచ్చింది. అమ్మా నాన్న ఇద్దరూ మాతోనే ఉంటారు. ఇప్పటినుంచి మాకు ప్రతిరోజూ పండగే" అన్నాడు.

"ఇక నుంచి నేను నిద్ర లేవగానే నన్ను పలకరించే అమ్మ ముఖంలో కనిపించే నవ్వు ఎంతో కొత్తగా ఉంది. మేము బడి నుంచి రాగానే నాన్న ఇచ్చే కౌగిలి ప్రతి ఏడాది వచ్చినప్పుడు ఇచ్చే ఎంతో గాఢమైన కౌగిలి కంటే ఎంతో బావుంటుంది. నేను పెద్దగా చెప్పలేను గానీ ఇప్పుడు నేను మాటాడుతున్నపుడు నాన్నా అమ్మా మొదటిసారి మా స్కూల్ ఫంక్షన్ కి వచ్చి ఈ వేదిక ముందు కూర్చుని నేను మాట్లాడటం చూస్తుంటే అదేంటో వింతగా కొత్త కొత్తగా చాలా చాలా బావుంది" అన్నాడు రాజు.

మీరు నమ్మరు గానీ వాడు చెప్పిన ఉపన్యాసం విన్న ఎంతో మంది తలిదండ్రులలో తర్వాత మార్పు రావటం నేను చూసాను. జీవితంలో కొన్ని విషయాల్లో రాజే పడితే ముఖ్యమైన విషయాల్లో ఎంత పొందగలమో నాకప్పుడు తెలిసింది." అన్నాడు శ్యాం.

అందరూ ఆ మాటలు విని కొంచెం ఉద్వేగానికి లోనవుతున్న సంగతి గుర్తు పట్టి

"చలపతి చెప్పినట్టు ఎన్నో చిన్న వనుకున్న విషయాలలో మనకు కలిగే ఆనందం ఎంతో పెద్దది. నేను కావాలని "అద్భుత కథలు" బ్రహ్మాండ వంటలు" అని చెప్తే శాంత (నా భార్య) "అది తప్పు. అద్భుతమైన కథలు, బ్రహ్మాండమైన వంటలు అనాలి" అంటూ నన్ను సరి చేస్తుంది. ముఖ్యంగా అందరిముందూ నన్ను సరి చేస్తున్నపుడు దాని ముఖంలో వెలుగు చూస్తే ఎన్నిసార్లయినా అలా తప్పుగానే మాటాడాలని అనిపిస్తుంది. ఎప్పుడో ఆరోగ్యకారణాల వలన కొన్నాళ్ళు నేను కాఫీ తాగటం మానేస్తే మా అత్త ఆ విషయం గుర్తుంచుకుని ఇప్పటికీ ఆవిడ దగ్గర ఇంకెవరైనా నాకు కాఫీ ఇస్తుంటే వాళ్ళని తిట్టి "వాడు తాగకూడదర్రా. వాడి ఆరోగ్యానికి మంచిది కాదు" అని చెప్పి నాకు వేడి పాలే ఇప్పిస్తున్నపుడు ఆవిడ ప్రేమకీ నాపట్ల ఉన్న శ్రద్ద కీ కరిగిపోయిన నేను ఆవిడకి ఎప్పటికీ మళ్ళీ నేను కాఫీ తాగటం మొదలెట్టాననే నిజం చెప్పనేలేదు. ఇరవై ఏళ్ల క్రితం నేనొక 48 గంటల రైలు ప్రయాణం నా మేనత్త ఊరు మీదుగా చేస్తున్నపుడు ఎవరి ద్వారానో తెలుసుకుని నేనే రైల్లో వెళ్తున్నానో తెలియక స్టేషన్ లో ప్రతి రైలూ వెతికి నాకు భోజనం అందించిన నా బావ మరుదుల ప్రేమ నాకొక గొప్ప జ్ఞాపకం, మరి ఇలా నాకెన్నో జ్ఞాపకాలూ అనుభూతులూ ఉన్నాయి. మీకూ ఉంటాయి. వాటిని చాలా ప్రేమగా భద్ర పరుచుకోండి" అని ముగించాడు శ్యాం.

"మనం ఎందుకో మన ఉద్యోగాలకి వ్యాపారాలకీ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాం. ఎందుకంటే వాటికి డబ్బుతో లంకె. తరిచి చూస్తే ఎన్నో చిన్న చిన్న విషయాల మీద మనం సరైన ధ్యాస పెట్టకపోవడం వలన ఎన్నెన్ని అనుభవాలు కోల్పోతున్నామో తెలుస్తుంది. పదవోన్నతులూ, జీతాలు పెరగటం లాంటివి జరిగినా కొన్నిరోజులకి మరిచిపోయి మరో పదవోన్నతి కోసం ఎదురు చూస్తాం. కానీ మనం కోల్పోయే ఈ చిన్న చిన్న అనుభూతులని సేకరించుకుని రోజూ ఎంతో సంతోషంగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకుంటాం." అన్నాడు అప్పలరాజు.

"చదువుకుని బడినుంచి వచ్చిన పిల్లాడిని వళ్ళో కూర్చోబెట్టుకుని వాడు ఆరోజు ఏమేం చేసాడో విని వాడిని అభినందనగా ముద్దు పెట్టుకుని వాడు అమాయకంగా నవ్వే నవ్వు చూడు. నాన్నా మా విహారయాత్రకు రెండు రకాల చిరుతిళ్ళు, ఇంకా ఏవేవో తీసుకెళ్ళాలి అన్న మీ కూతురితో చూదాంలే అనకుండా అది నిద్ర లేచేసరికి దానిపక్కన ఆ వస్తువులు చూపించి దాని కళ్ళల్లో వెలిగే మెరుపు చూడు. రోజూ పొద్దున్నే నాలుగు గంటలకి లేచి గిన్నెలు కడుక్కోవటంతో రోజు ప్రారంభించే నీ శ్రీమతి కన్నా ముందు నిద్రలేచి ఆ పనులన్నీ చేసేసి చాలా పనులయిపోయాయని తెలుసుకుని నిశ్చింతగా మరో రెండు గంటలు పడుకునే నీ భార్యని చూడు. ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పని చేసే మీ పనమ్మాయికి ఒక రోజు ఆమె కాఫీ టిఫిన్ తిన్నాక ఈరోజు సెలవు ఇంటికెళ్ళిపో అని చెప్పి అనుకోకుండా విశ్రాంతి దొరికినపుడు ఆ అమ్మాయి ముఖంలో మెదిలే చిరునవ్వు చూడు. ఎపుడూ ఏమీ అడగకుండా పిల్లలకోసమే జీవితం గడిపిన మీ తలిదండ్రులని తీసుకెళ్లి వారికి నచ్చే మిధునం సినిమా చూపించు. ఇవన్నీ చూపించి చూడండ్రా." అని వాడి శైలిలో అప్పలరాజు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.

"మనం ఈరోజు తెలుసుకున్న ఈ అద్భుతమైన అవగాహనతో మనం పంచరంగులతో మిగిలిన జీవితాన్ని ఆస్వాదిద్దాం" అనుకుంటూ అందరం మా వినోదాలు కొనసాగించాం.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల