బ్రతికించిన స్నేహం - శింగరాజు శ్రీనివాసరావు

Bratikinchina sneham

బాలకృష్ణకు నిద్రపట్టడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా వాసు రూపమే కనులముందు కదలాడుతున్నది. నిన్నటివరకు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినవాడు తెల్లవారేసరికి లోకాన్ని విడిచిపోయాడు. ప్రతిరోజూ ఉషోదయగేయంతో పలుకరించే మిత్రుని నుంచి పదిగంటలయినా ముఖపుస్తకంలో కవిత రాకపోయేసరికి ఫోను చేశాడు. అంతే 'వాసు కాలం చేశాడన్న' పిడుగులాంటి వార్త. ఉన్నపళంగా వెళ్ళి చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉన్నది వాసు పార్ధివదేహం. మనసు బాధతో మూలిగింది. మరణవార్తను ముఖపుస్తకంలో పెట్టడంతో వచ్చేవారికి, పోయేవారికి ఎడతెరిపి లేకుండాపోయింది. కొడుకు రావడంతో అంత్యక్రియలకు సిద్ధంచేశారు. అందుబాటులో వున్న అందరూ వచ్చారు. అందరి నోటినుంచి ఒకటే మాట. రేపటి నుంచి ఉషోదయ కవితతో మమ్మల్ని నిద్రలేపేది ఎవరని. నిజమే లేటు వయసులో మొదలుపెట్టినా మేటి గేయాలు వ్రాశాడు వాసు. ప్రతి గేయంలోను ఎన్నో కోణాలు. నవరసాలను అద్భుతంగా పలికించేవాడు. అందరినోట ఇదే మాట. యాంత్రికంగా దహనసంస్కారాల క్రియకు హాజరై ఇంటికి వచ్చాడు. అన్నం రుచించలేదు. కన్ను మూతపడడం లేదు. ఏదో చేయాలి. వాసుకోసం ఏదైనా చేయాలి అనే ఆలోచనలు అతడిని ఏడు సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్ళాయి. ******** "బాలకృష్ణా. ఇతను నా క్లాస్ మేట్. ఏలూరు కాలేజిలో జంతుశాస్త్రం లెక్చరర్ గా పనిచేసి ఈ సంవత్సరమే పదవీవిరమణ చేశాడు. వారం క్రితమే తట్టాబుట్టా సర్దుకుని వచ్చి సొంత ఊరిలో స్ధిరపడిపోయాడు. పేరు వాసుదేవమూర్తి" అంటూ ఒక వ్యక్తిని బాలకృష్ణకు పరిచయం చేశాడు రత్నం. "ఓ. అయితే మన సంఘంలోకి మరొక వ్యక్తి వచ్చి చేరాడన్న మాట. స్వాగతం సర్. నా పేరు బాలకృష్ణమూర్తి. నేను కూడ మీ జాతి పక్షినే. కడప కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ పోయిన సంవత్సరమే పదవీ విరమణ చేశాను. మాది ఒంగోలుకు దగ్గరలో ఉండే మద్దిపాడు. అందుకే ఇక్కడ స్ధిరపడిపోయాం. ప్రతిరోజు ఈ చెరువు గట్టుకు నడకపేరుతో రావడంతో రత్నం లాంటి మిత్రులు పరిచయమయ్యారు" అని తనను తానే పరిచయం చేసుకున్నాడు బాలకృష్ణ. " చాలా సంతోషం సర్. ఈ వయసులో మనకు నడకే వ్యాయామం కదా. మా రత్నం పరిచయం చేశాడంటే మీరు కూడ మంచి అభిరుచి కలవారే అయి ఉంటారు" బాలకృష్ణతో చేయికలిపాడు వాసు. "ఒరేయ్ వాసు, నీకో విషయం చెప్పాలి. బాలకృష్ణ తెలుగు అధ్యాపకుడే కాదు. మంచి కవి, విమర్శకుడు కూడ. ఇప్పటికే ఓ పది కవితాసంపుటిలు వెలువరించారు. నువ్వు నా కవితా పైత్యానికే ఉబ్బితబ్బిబవుతావు కదా. ఇక ఈయన కవితలు చదివితే వదిలిపెట్టవు" అని బాలకృష్ణ ప్రవృత్తిని కూడ బయటపెట్టాడు రత్నం. " అద్భుతం సర్. నాకు కవితలంటే చాలా ఇష్టం. వ్రాయడం చేతకాదు కానీ, చదవడం, ఆనందించడం చాలా ఇష్టం. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. ముందుగానే చెబుతున్నాను సర్. ఈ కవితల విషయంలో నన్ను మీరు భరించవలసిందే" చాలా ఉత్సాహంగా అన్నాడు వాసు. " అంతలేదులెండి సర్. రత్నంగారు మాత్రం తక్కువ కవినా. చక్కగా వ్రాస్తారు. అయిదు కవితా సంపుటాలు వెలువరించారు. బహుశా మీరు చదివే ఉంటారు" బదులు పలికాడు బాలకృష్ణ. " చదవడమూ అయింది. అక్కడక్కడ నా పొరపాట్లను ఎత్తిచూపడమూ అయింది బాలకృష్ణా. మనవాడు మంచి విమర్శకుడు. ఇక కవిగా మారాలి అంతే. ఏదో మీరూ ఒక చేయివేస్తే, వీడిని మనం కవిని చేద్దాం" చలాకీగా అన్నాడు రత్నం. "విమర్శకులే మనకంటే అత్యుత్తమ కవులు. మొదలుపెట్టండి వాసు గారు సంవత్సరం తిరిగేకల్లా మమ్మల్ని మించిన కవులయిపోతారు" ప్రోత్సహించాడు బాలకృష్ణ. "వేళాకోళాలు చాలులెండి సర్. మొదటిరోజే నన్ను ఇలా భయపెట్టేస్తున్నారు" అన్నాడు వాసు. అలా సరదా సరదాగా గడిపేశారు ఆరోజు. ****** బాలకృష్ణ నోటివాక్కో, వాసులో అంతర్గతంగా దాగిన ఉత్సాహమో, సరస్వతీ కటాక్షమో గాని, అనుకున్నట్టుగానే వాసు కవితలు వ్రాయడం మొదలుపెట్టాడు. క్రమంగా వాటిని ముఖపుస్తకములో ఉంచడం, వాటికి అతని పూర్వ స్నేహితులు, అభిమానులు లైకులు కొట్టడం, కామెంట్లు ఇవ్వడం లాంటివి జరుగుతుండడంతో వాసుకు కూడ కవితలు వ్రాయడానికి ఇష్టం పెరిగింది. అతను వ్రాసిన కవితలలో ఏవైనా లోపాలుంటే, వాటిని బాలకృష్ణ సరిదిద్దేవాడు. అలా వారిమధ్య సాహితీబంధం పెనవేసుకుపోయింది. వారి మధ్య అనుబంధం పెరిగి పేర్లు పెట్టి పిలుచుకునే స్థాయికి వెళ్ళింది. రెండు సంవత్సరాలు పూర్తయేసరికి వాసులో ఊహించని పరిణతి వచ్చింది కవితలు వ్రాయడంలో. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గేయం వ్రాయడం, దాన్ని ముఖపుస్తకంలో పెట్టడం నిత్యకృత్యమయింది. ఈ మధ్యకాలంలో అయితే ఒక అపురూప చిత్రాన్ని ఎంచుకుని, దానికొక అనుబంధ గేయాన్ని వ్రాసి ముఖపుస్తకంలో ఉంచడం మొదలుపెట్టాడు. అది గమనించిన రత్నం వాసును ప్రభాతకవిగా పిలవడం మొదలుపెట్టాడు. ****** ఒకరోజు నడుస్తూ నడుస్తూ వాసును అడిగాడు రత్నం. " ఒరేయ్ వాసు ఇంత చక్కగా గేయాలు వ్రాస్తున్నావు కదా. వాటన్నింటినీ ఒక పుస్తకరూపంలోకి తేకూడదా, చిరస్ధాయిగా ఉండిపోతాయి" " నేనేదో ఉబుసుపోక వ్రాసుకుంటున్నానురా. అయినా పుస్తకం వేసినా, వాటిని మీరు తప్ప ఏవరూ చదవరు. పెద్దపెద్ద పత్రికలే అదృశ్యమైపోతున్న రోజులివి, ఈ చోచో గాడి గేయాలెవరు చదువుతారు. ఏ మాటకామాట చెప్పుకోవాలి కదురా. నేను మీ అంత కవిని కాను. ఆ మాటకొస్తే అసలు కవినే కాను" సమాధానమిచ్చాడు వాసు. "లోగడ నేను కూడ చాలా సార్లు ఇదేమాట అడిగాను, ససేమిరా కుదరదన్నాడు రత్నం. ఎలాగైనా సరే వాసు రచనలను పదిమందిలోకి తీసుకువెళ్ళాలి. ఇదిగో వాసు ఇప్పుడే చెబుతున్నా. నువ్వు పుస్తకం వేయిస్తావా? మమ్మల్ని వేయించమంటావా?" నిలదీశాడు బాలకృష్ణ. "అయ్యా బాలయ్యా. ఎంతయినా తమరు నాకు గురతుల్యులు. మీ మాట కాదనలేను. చూద్దాం ఇంకా కొంచెం సాధన చేయనివ్వండి. అప్పుడు ఆలోచిద్దాం" తప్పేటట్టులేదని అంగీకరించినట్టు మాట వేశాడు వాసు. "అదికాదు వాసు. మన రచనలు అచ్చురూపంలో వెలువడితే, మనం పోయినా మన జ్ఞాపకాలుగా తరువాత తరాలకు మిగిలివుంటాయి. మనం మరణించినా ఆ అక్షరాలలో మనం బ్రతికేవుంటాం" బాలకృష్ణ మాటలు గంభీరతను సంతరించుకున్నాయి. "బాలు చెప్పింది అక్షరసత్యంరా వాసు. ఆలోచించు" రత్నం వంతపాడాడు. "అలాగే బాబు. ఒప్పుకోకుంటే వదిలేలా లేరు. మీ ఇష్టప్రకారమే చేస్తాను. నాకు కొంచెం సమయమివ్వండి" అని వాసు అనేసరికి అందరికీ నవ్వు వచ్చింది. ***** భార్య పిలుపుతో ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు బాలకృష్ణ. ఈ సంఘటన జరిగి నెల కూడ కాకముందే గగనానికి ఎగిరిపోయాడు వాసు. బరువెక్కిన గుండెతోటే మంచం మీదనుంచి లేచాడు. వాసు కోసం ఏదైనా చేయాలనే తపన బాలకృష్ణను వెంటాడుతూనే ఉంది. వెళ్ళి రత్నాన్ని కలిస్తే గాని ఒక నిర్ణయానికి రాలేనని నిర్ధారించుకున్నాడు. ***** వాసు కాలం చేసి పన్నెండవ రోజున అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు, విద్యార్థులు అందరూ హాజరయ్యారు. భోజనాల అనంతరం చిన్న సంతాపసభను ఏర్పాటుచేశారు రత్నం వాళ్ళు. అక్కడకు విచ్చేసిన అందరినీ ఉద్దేశించి రత్నం మాట్లాడాడు. " వాసుదేవమూర్తి మీద అభిమానంతో విచ్చేసిన అందరికీ నమస్కారం. మనందరికీ ప్రియమైన వ్యక్తిని ఒక్కసారి స్మరించుకుందామని ఈ సభను ఏర్పాటుచేశాము. మీ అందరికీ ఉపాధ్యాయుడుగా పరిచయమైన వాసు ఒక మంచి కవియని మీలో కొందరికి మాత్రమే తెలుసు. అతనిలో భావుకుడున్నాడు, సమాజ ప్రేమికుడు ఉన్నాడు. అతను మన కళ్ళముందు లేకపోయినా, అతని రచనలలో మనకు అతను కనిపించాలనే సదుద్దేశంతో మా మిత్రుడు బాలకృష్ణమూర్తి, వాసు గేయాలలోని కొన్ని గేయాలను ఎంచుకుని వాటిని పుస్తక రూపంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆ పుస్తకాలను మీకు పంచుతారు. వీలున్నప్పుడు ఒక్కసారి వాటిని చదవండి. అప్పుడు మీకు వాసులోని మరొక కోణం కూడ కనిపిస్తుంది" అని చెప్పి బాలకృష్ణ వైపు చూశాడు. వెంటనే బాలకృష్ణ లేచి తన చేతిలోని పుస్తకాలను అందరికీ పంచి వేదిక మీదకు వచ్చాడు. "నాకు వాసుదేవమూర్తి గారితో పరిచయం కొన్ని సంవత్సరాల నుంచే. కాని ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నంతగా మా మనసుల మధ్య బంధం పెనవేసుకు పోయింది. అతను లేని లోటు ఎవరూ తీర్చలేనిది. అటువంటి సాహితీమిత్రుని జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అతను ఎన్నో రచనలు చేశాడు. కాని వాటిని కవితా సంపుటిగా వెలువరించ లేదు. అది మాకు తీరని కోరికగానే ఉండిపోయింది. మా మిత్రుడి విద్వత్తు అతనితోనే ఆగిపోకూడదు. పదిమందికి అది చేరువకావాలి. అందరి గుండెలలో అతనొక కవిగా చిరంజీవి కావాలి అనే ఆశయంతో, అతని రచనలలో ముఖ్యమైన వాటిని ఏరి కూర్చి గేయమాలికగా పుస్తకరూపంలో మీకు అందించాము. ఇందులో రత్నం చేసిన కృషి నిరుపమానం. ఇదే మేము మా స్నేహితునికి మేమిచ్చే అక్షరనీరాజనం. మా ఈ సాహసాన్ని వాసు కుటుంబంలో వారంతా సహృదయతతో అర్థం చేసుకుంటారని ఆశిస్తాను" అని అనడంతో అక్కడి వారంతా చప్పట్లతో బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. కొందరైతే బాలకృష్ణను ఆలింగనం చేసుకుని 'స్నేహమంటే మీదేనయ్యా' అని తమ మనసులోని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాసు కొడుకైతే రత్నాన్ని, బాలకృష్ణ పాదాలను కన్నీటితో అభిషేకించి 'మీలాంటి స్నేహితులున్న మానాన్న చాలా అదృష్టవంతులు' అని పొగిడాడు. ఇంతలో ఎవరో తనను పిలిచినట్లు వినిపించింది బాలకృష్ణకు, చుట్టూచూశాడు కానీ ఎవరూ కనిపించలేదు. షామియానా దాటి బయటకు వచ్చి పైకిచూశాడు. లీలగా వాసు రూపం ఆకాశంలో కనిపించింది. " బాలూ, మరణించిన నన్ను మీ స్నేహం మరల బ్రతికించింది. అక్షరాన్ని చేసి అందరి కనులముందు నిలిపింది" అన్న మాటలు అస్పష్టంగా వినిపించాయి బాలకృష్ణకు. "వాసు నీ స్నేహం అమరం. నేను నీకు చేసింది స్వల్పం. నువ్వు నాలో చిరంజీవం" అని మనసును నిబ్బరం చేసుకుని నడిచాడు బాలకృష్ణ. ********* అయిపోయింది **********

మరిన్ని కథలు

Peddarikam munduku vaste
పెద్దరికం ముందుకువస్తే
- శింగరాజు శ్రీనివాసరావు
Sayodhya
సయోధ్య
- కందర్ప మూర్తి
Karona kaatu
కరోనా కాటు
- సోమవరపు రఘుబాబు
Chillara Sevalu
చిల్లర శవాలు
- అఖిలాశ
Tel malisha majaka
తేల్ మాలీషా ! మజాకా!?
- జి.యస్. కె. సాయిబాబా
Sivayya tarimina deyyam-Story picture
శివయ్య తరిమిన దెయ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.