సైడ్ బిజినెస్ - జి.యస్. కె. సాయిబాబా

Side business

మొబైల్ ఫోన్ రింగయింది. బాత్రూంకి బయలు దేరుతున్న రచయిత సాయిబాబా వెనక్కి వచ్చి టేబుల్ మీదున్న ఫోన్ అందుకుని " హలో!" అన్నాడు. " హలో , సాహిత్య రచయిత సాయిబాబా గారా?" అటునుంచి ఒక పురుష కంఠం అడుగుతోంది. " ఔనండీ! నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? " " నమస్తే సార్! నా పేరు మతలబు రావు.శ్రీకాకుళం మందసా నుంచి మాట్లాడుతున్నా." " మీరు క్రిష్టియనా?" "లేదండీ, పదహారణాల హిందువుని" " మరి పేరేంటి విచిత్రంగా ఉంది" " అదాండీ! నేను చిన్నగా ఉండేటప్పుడు మా నాన్న 'భజగోవిందం' పేరుతో చిట్ ఫండ్ నడిపే వాడట.చిట్టీలు బాగా పెరిగి లక్షలు జమవగానే మా అమ్మని ఒగ్గేసి మా ఊరి టైలర్ సాయిబు కూతుర్ని తీసుకుని మద్రాస్ పారిపోయాడట.మా నాన్న పేరు మహీపాల్ రావట.నా పేరు మతలబు అని పెట్టేడట అప్పడ్నుంచి నా పేరు మతలబు గానే ఉండిపోయింది." "సర్లెండి ,ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసారు?" " ఆ ... అక్కడికే వస్తున్నా. నేను ఇక్కడ అపార్టుమెంట్లో సెక్యూరిటి గార్డుగా జాబ్ చేస్తున్నాను. ఎక్కువగా చదువు కోక పోయినా తెలుగు సాహిత్య మంటే ఎంతో ఇష్టం.మా అపార్టుమెంట్లో చాలమంది సార్లు సాహిత్య మాస పత్రికలు, వార పత్రికలు తెప్పించుకుంటారు. వారు చదివేసిన తర్వాత నా దగ్గర పడేస్తారు. అవి చదువుతూ కాలక్షేపం చేస్తూంటాను. అందులో బాలబాట, భావతరంగిణి , సాహితీ కిరణం , రమ్యభారతి , విశాఖ సంస్కృతి , భక్తి సమాచారం వంటి తెలుగు సాహిత్య పత్రికలు ఉంటాయి. .మీ లాంటి ఎందరో చెయ్యి తిరిగిన రచయితల కవితలు కధలు చదివే అవకాశం ఉంటోంది. పోయిన సాహితీ కిరణం మాసపత్రిక లో మీరు రాసిన " నాన్నా, నీ మనసే వెన్న" కవిత చదివి మా నాన్న గుర్తుకు వచ్చాడు. చాలా చక్కగా సహజంగా హృదయానికి హత్తకునేలా రాసారు. మీ రచనలు ఇదివరకు కూడా చాలా చదివాను. నేను అభిమానించే తెలుగు రచయితలలో మీరు ఒకరు. మీలాంటి వారి కృషి ఫలితంగానే తెలుగుసాహిత్యం నిలబడింది." డబ్బా కొడుతున్నాడు. రచయిత సాయిబాబాకు టాయలెట్ జోరు ఎక్కువగా ఉన్నా అభిమాని పొగడ్తలకు తబ్బిబై "అంతా మీ అభిమానం" అన్నాడు. " లేదు సార్ , నేను నిజమే చెబుతున్నాను. చాలా రోజుల్నుంచి మీకు ఫోన్ చేద్దామనే అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నా వల్ల మీకేమీ డిస్ట్రబ్ అవడం లేదు కదా!" మరింత పంపు కొడుతున్నాడు అవతలి వ్యక్తి. వెనక జోరు ఎక్కువైనా ఆపుకుంటూ " అబ్బే , అదేం లేదు. నీ సాహిత్యాభి మానానికి , రచయితల పట్ల గౌరవానికి అభినందిస్తున్నాను." తన సంతోషం తెలియచేసాడు సాయిబాబా. " సార్ , ఒక రిక్వెష్టు" వినయంగా అడిగాడు. " ఏమిటి?" ప్రశ్నించాడు. " మీ దగ్గర ఏవైనా పాత పత్రికలు , సాహిత్య పుస్తకాలు ఉంటే నాకు పంపండి సార్. కరోన వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇది వరకటిలా దిన పత్రికలు, మేగజైన్లు అందుబాటులో ఉండటం లేదు." మనసులో మాట చెప్పేడు అభిమాని. అతని నిజాయితీ, సాహిత్యం పట్ల ఉన్న అభిమానానికీ ముగ్ధుడయాడు సాయిబాబా. "అలాగే రెండు మూడు రోజుల్లో అలమరాలోని పాత పత్రికలు పైకి తీసి పోస్టు చేస్తాను " ఆపుకోలేక బాత్రూమ్ పక్క పరుగులు తీసాడు. " థేంక్యూ సార్" అవతలి వైపు ఫోన్ కట్టయింది. తీరిక చేసుకుని తన రచనల పట్ల అభిమానం చూపుతున్న ఆ తెలుగు సాహిత్యాభిమాని కోరిక తీర్చడం తన ధర్మ మని తన రచనలే కాకుండా సహ రచయితల పుస్తకాలు కూడా కలెక్టు చేసి చక్కగా అభిమాని ఇచ్చిన అడ్రసుకు పోస్టు చేసాడు రచయిత సాయిబాబా. * * * "పది కే.జీ లు ఉన్నాయి. కే.జీ పది రూపాయలు చొప్పున వంద రూపాయలు వస్తాయి. ఇంద తీస్కో" అని పార్సిల్ విప్పి తూకం వేసి వంద రూపాయలు చేతిలో పెట్టాడు పాత పేపర్లు కొనే అప్పల స్వామి. " అవును, నాకు తెలవక అడుగుతున్నా! ఈ కరోనా టైములో పుస్తకాలు పేపర్లు అమ్మేవోళ్లు లేక గిరాకీల కోసం ఈదులంట తిరుగుతుంటే నీకు పుస్తకాల పేకెట్లు ఎట్టా వత్తున్నాయని" అని మనసులోని అనుమానం బయట పెట్టాడు అప్పలస్వామి. " దానికి ఒక చిట్కా ఉపయోగించేను లే. తెలుగు మాస పత్రికలు , వారపత్రికలకు కథలు , కవితలు ,గేయాలు రాసే రచయితల పేర్లు , ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని ఒక్కొరి ఫోన్ నంబర్లకు వారి రచనల్లో కొన్నిటిని ఎంచుకుని పొగడ్తలతో గేస్ కొడతాను. కొంతమంది పొంగిపోయి నేను చెప్పిన అడ్రసుకు పుస్తకాలు పోస్టులో పంపుతారు. నేను చదివేదీ చేసేదీ ఏమీ లేదు.పెద్ద పార్సెల్ ఐతే బరువు ఎక్కువ తూగి పైసలు దండిగా వస్తాయి. ఈ కరోనా కరువు రోజుల్లో ఇదొక సైడ్ బిజినెస్ గా ఉపయోగ పడుతోందని" చిదంబర రహస్యం చెప్పాడు సాహిత్యాభిమాని మతలబు రావు. కడుపు కోసం కోటి విధ్యల్లో ఇదొకటి కాబోసు అనుకున్నాడు అమాయక అప్పలస్వామి. * * *

మరిన్ని కథలు

Kreeda sphoorthi
క్రీడాస్ఫూర్తి
- డి.కె.చదువులబాబు
Bhale alochana
భలే ఆలోచన
- సరికొండ శ్రీనివాసరాజు
Naanna maripoyadu
నాన్న!మారిపోయాడు
- కె.వి.వి.లక్ష్మీ కుమారి
Veedhi arugulu
వీధి అరుగులు
- రాముకోలా.దెందుకూరు.
Vennamuddala kalyanam
"వెన్నముద్దల కళ్యాణం"
- కొత్తపల్లి ఉదయబాబు
Mantri yukthi
మంత్రి యుక్తి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Chandrudi salaha
చంద్రుడిసలహా
- డి.కె.చదువులబాబు