సీత గీత దాటితే - KANDIKUPPA USHARANI

sita gita datite

వాసంతి కి ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి పువ్వు పలకరింపుకు పులకించిపోతుంది ప్రతి ఆకు నర్తనని ఆస్వాదిస్తుంది. పుట్టుకతోనే స్వతసిద్ధంగా ఏర్పడ్డ మమతాను బంధం అది. ఆ తన్మయత్వం నిత్య నూతనం. ఆ భాష చిర పరిచితం. పచ్చని తోట మధ్యలో పరవసించాలని పచ్చని చెట్ల సాంగత్యం లో సేదదీరాలని ఆకాంక్ష .
హైదరాబాద్ లోని కిటకిటలాడే కూకట్పల్లి ఫ్లాట్స లో ఉండే వాసంతి కి ఇదో కలే. ఏవిషయంలోనూ గొడవలకు పోని వాసంతికి చెట్ల విషయం వచ్చేసరికి తగాదాలే తగాదాలు. చెట్టు కొట్టనివ్వదు. పువ్వు కోయనివ్వదు. చేట్టేకదా కొట్టేదంటే మంది పడుతుంది. పూజకు కదా పువ్వులు అంటేచెట్టు అలాఅని చెప్పిందా ఏం , అని నిలదీస్తుంది . వీధులలో అయినా చెట్లు కొట్టడం చూసిందా, ఎవరితో నయినాసరే పోట్లాటకు దిగిపోతుంది. ఉపన్యాసాలు దంచేసి వాళ్ళకి ఊపిరాడనివ్వదు. పనులు ఆపించేస్తుంది . అదే వాసంతిని ఏంతో మంది శత్రువులను తెచ్చిపెట్టింది . ఓ వనం తన సొంతం కావాలని ఓ వణకన్యలా కలం గడపాలని గట్టి కోరిక.ఈ శతాబ్దంలో అది సాధ్యమా అని ఇంట్లోవాళ్లంతా గెలిచేస్తున్న పట్టించుకోదు. వాసంతి కోరిక పట్టణంలో ఉండేవారికి గొంతెమ్మకోరికే. హైదరాబాద్ నగరంలో అది మరీను. కాసులు గలలాడేవారికి కాదు గాని, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవారికి అది కాలే. అందుకనే వాసంతి నాన్న ఆమె కలలు ఏమాత్రం ప్రాధాన్యత నివ్వక స్కూలు కి , కాలేజీకి దగ్గర గ ఉండే ఇల్లు దగ్గరవుందా లేదా అనే అలోచించి ఇల్లు అద్దెకి దిగేవారుగాని తోట ఉందా లేదా అని ఎన్నడూ ఆలోచించలేదు.ఇంటి చుట్టూ మొక్కమోడు సంగతి అస్స లు పట్టించుకునే వారు కాదు. నాన్నకి వాసంతి అంటే చాలా ప్రేమ. కానీ నాన్నకి మొక్కలంటే అస్సలు పట్టదు. మొక్కలకు ఖర్చుచేసే సమయం, డబ్బు పుస్తకాలకు ఖర్చుచేస్తే ఉపయోగం (?) ఎక్కువని ఆయన నమ్మకం . ఆ విషయంలో చర్చే లేదు. అందువలన తన అందమైన తోట కల ను సాకారం చేసుకునే దారి లేక తప్పని పరిస్థితిలో తాత్కాలికంగా వాయిదా వేసుకుంది వాసంతి.
" ఇంటి చుట్టూ చెట్లు. ముందు పూల మొక్కలు ,వెనక కాయగూరలు;పండ్లు. అసలయితే ఇంటికి వెళ్ళేదారికి రెండు వైపులా పెద్ద చెట్లు ఉండాలని ఆ చెట్ల నుండి రాలిన ఆకుల ఎండి కిందంతా పరుచుకుని ఉండాలని, ఆ వాసనలు ఆస్వాదిస్తూ ,వాటిపై నడుస్తూ ఇంటికెళ్లాలని, ఇంట్లో కెళుతూ చిలకల పలకరింపులు వినాలని. టేకు ఒకవైపు దారికి రెండు వైపులా, వెదురు మరో దారికి రెండు వైపులా వేసుకోవాలి; పనస, సపోటా, మామిడి లో రసాలు, బంగినిపల్లి, వేసుకోవాలి; ఇంకోవైపు నిమ్మ ,దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, నారింజ, కమలా పండ్లు ఉండాలి; కూరగాయల మడులు -వంగ, బెండ, టమాటా, మిరప ,చిక్కుళ్ళు, ఒక వైపు, రకరకాల ఆకుపచ్చలతో మెరిసిపోయే ఆకుకూరల కనుల పండగ చేస్తుంటే ఆ సంబరం సంగతి చెప్పనే అక్కరలేదు కదా!. ఇంతకంటే ఆనందం ఎక్కడుంటుంది ?.. వేసుకోవాలను కునే చిట్టా పెరిగిపోతోంది రోజు రోజుకూ .. ".
ఇరుకయినా బాల్కనీలో నిల్చుని ఉద్యానవన ఊహలలో హాయిగా తేలిపోతుండగా ,

"వాసంతి ! ఏమిటా పరధ్యాన్నం? మేలుకునే నిద్రపోతున్నావా ఏం ? " జగన్నాధరావు గారి హుంకరింపుతో ఈ లోకంలోకి వచ్చింది.
" లేదండీ నాన్నగారు ! రేపటి పరీక్ష లో ఏమొస్తాయో అని ఆలోచిస్తున్నాను. "
" అన్ని పాఠాలు సరిగ్గా చదివితే, టెన్షన్ ఎందుకు ఉంటుంది ? చేసేపనేం లేకపోయినా ,చదవాల్సినవి చదవక, పరీక్షలలో ప్రశ్నల గురించి ఆలోచించడం ఒకటి. సరే, పేపర్లో బ్యాంకు వెకెన్సీస్ పడ్డాయి. అప్లికేషన్ పంపు. " ఆర్డర్ జారీ చేసి తన పనైపోయిందని కదిలారు అక్కడినుండి జగన్నాధరావు గారు.
ఉద్యోగం దరఖాస్తు చేయడం, ఉద్యోగం రావడం హైదరాబాద్ లోనే పోస్టింగ్ కావడంతో,ఉద్యోగంలో చేరిపోవడం కలలాగా జరిగిపోయాయి వాసంతికి . బ్రాంచ్ శ్రీనగర్ కాలనిలో. అక్కడి పెద్ద పెద్ద ఇళ్ళు , ఇళ్ల ముందున్న పూదోటలు ఎక్కడో మూలపడిన తోట కల చిగురించేటట్టు చేసాయి.
" సత్తిబాబు ! ఈ రోజు మేనేజర్ గారు ఇంకా రాలేదేం? డిపాజిట్ రెసిట్స్ సంతకాలు చేయాలి. " బ్యాంకు టెంపోరరిసబ్ స్టాఫ్ సత్తిబాబును అడిగింది ఓ రోజు వాసంతి .

" చెప్పడంమరిచిపోయాను అమ్మగారు, ఈ రోజు సార్ ఇల్లు చూసుకోడానికి వెళుతున్నారట. చుట్టుపక్కల నలభై వేలకు తక్కువలో అద్దె ఇళ్ళు లేవట. బ్యాంకు ఇచ్చే అద్దెలొఇళ్ళ వేటకు వెళ్లారు మేనేజర్ గారు. పొద్దున్నే వచ్చి చెప్పి వెళ్లారు. సాయంత్రం వచ్చి సంతకాలు అవసరమైనవాటికి చేస్తానని చెప్పామన్నారు. "
"నాన్న దగ్గర ఉండబట్టి తెలియలేదు. ఆమ్మో! జీతంలో సగం ఇంటద్దె కిస్తే స్థలం ఎలా కొనుక్కోవాలి? తోట ఎలా పెంచుకోవాలి? తెలియకుండానే చిన్న నిట్టూర్పు వచ్చింది.
కాలం కరిగిపోతుంది. వాసంతి కల అప్పుడప్పుడూ వాసంతిని పలకరించి వెక్కిరిస్తూనే ఉంటుంది.

నాలుగేళ్ళ తరువాత ..
" ఏమిటా పరధ్యాన్నం ? చెప్పినమాట చెవికెక్కిందా ? రేపు అమ్మ, నాన్న వస్తున్నారు. ఆఫీస్ లో కూచుని లేటయిందని సాకులు చెప్పకు. వాళ్ళు ఉన్న నాలుగు రోజులయినా కాస్త టైం కి రావడం, వంట చేయడం చేయి ... "
ఆర్డర్లు ; బెదిరింపులు. స్వరంలో మార్పు ఉంది. భావనలో మార్పు లేదు. హోదాలో మార్పు ఉంది . కానీ అదే అధికారం . అదే దర్పం . ఈ సారి ఆ బాణాలు సంధించింది శ్రీవారు.
'తోట కల' కలలో ఉండగానే ఇలలో 'బాధ్యత గల తండ్రిగా ' తండ్రి వరాన్వేషణ చేయడం, అది ఫలించడం, ఫలితంగా మూడుముళ్లు పడడం , అప్పగింతలు ,పెద్దగా తన ఆమోదాల ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మమ అనడమే తన వంతయింది.
"నాన్నా ! మంచి తోట పెంచుకోవాలనుకుంటున్నాను అటువంటి అభిరుచి ఉన్న వ్యక్తితో పెళ్లి జరిపించండి " అనే పరిస్థితి ఆనాడు లేదు. ప్రాధాన్యతల వరుస - చదువు, ఉద్యోగం,సంపాదన, బాధ్యతలు మధ్య 'తోట కల' నలిగిపోయింది. 'సద్దుకుపోవాలనే 'సిద్ధాంతాన్నిరంగరించి నూరి పోయడం వలన ఆ మాట అనడాన్ని ఉహించును కూడా లేకపోయింది . భర్త ,హరి కూడా బ్యాంకులో ఆఫీసర్. మరి కొన్ని రోజులు 'తోట కల'ను కలల ఇనపపెట్టెలో సేప్ గా భద్ర పరిచింది .
హరి ట్రాన్స్ఫర్లు, తన ట్రాన్స్ఫర్ల మధ్య ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యాలకు,ఇతర కుటుంబ బాధ్యతల కేటాయింపులు జరిగిన తరువాత సొంతగా ఫ్లాట్ కొనుక్కోడమే గగనం అయింది. ఒకరి జీతం కట్టింగులు. మరొకరి జీతం తో ఇల్లు గడవడం, బడ్జెట్ బతుకులు! పర్యవసానంగా ,
మళ్ళీ తోట కల కలల పంజరం లోనే మిగిలిపోయింది. .. . అప్పుడప్పుడు బయటికి వచ్చి వెక్కిరించేది. సర్లే , రిటైర్మెంట్ ఫండ్స్ వస్తాయిగా! అప్పుడిక డిమాండ్స్ ఏమి ఉండవు . .. సద్ది చెప్పుకుంది.
తోట కల పకపకా నవ్వింది.
" నవ్వకు ,నవ్వకు, ఇంకేన్నాళ్లులే. నా అరవైయ్యో వసంతం పుర్తవంగానే నా తోటలో వసంత గానం వినకపోతానా ! చూస్తుండు " వచ్చేనెల రిటైర్ అవగానే కొనేది శంషాబాద్ లో స్థలమే. మంచి ఫార్మ్ హౌస్ నే కట్టుకుంటాను . ఆరునూరయినా నూరు ఆరయినా ఈ సారి ఆగేది లేదు. ఎవరితో నయినా పోట్లాడాల్సిందే. నిర్ణయం ఇప్పుడయినా అమలుచేయాలి. ఇక ఆగేది లేదు. వందసార్లు తనకు తాను చెప్పుకుంది.
తోట కల ఈ సారి ఓ వంకర నవ్వు నవ్వింది.
ముందే చెపితే వద్దంటారని, ప్రపోసల్ స్థాయిలోనే తిరస్కరించబడుతుందని ఎవరితోనూ మాట మాత్రంగా కూడా చెప్పకూడదని నిర్ణయించి కుంది వాసంతి . శ్రీవారి సంగతి తెలిసిందే. తండ్రికన్నా ఓ ఆకు ఎక్కువే ఈ విషయంలో. అందుకని తానే స్వయంగా తెలిసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ తో ధర మాట్లాడి పెట్టుకుంది. రిజిస్ట్రేషన్ తరువాయి. వెయ్యిగజాల స్థలం. తోటకు మంచి ప్లాన్ డిజైన్ చేసుకుంది.
" అమ్మయ్య ! కల వాస్తవ రూపం దాల్చే సమయం దగ్గర పడుతున్నది. " అనుకుంది నెలరోజుల్లో రిటైర్ అవ్వబోతున్న వాసంతి సంతృప్తిగా.
...

హాల్ లో వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని ఆలోచనలలో పడింది. ఎదురుచూడని దుర్ఘటనలు కళ్ళముందు కదిలాయి. వచ్చేది వసంతమా ?శిశిరమా ? మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నది మనసు.
" ఏంటమ్మా అంత పరధ్యాన్నం ! ఇప్పటికి నీముందు అమ్మ, అమ్మ అంటూ పిలుస్తూ పది నిముషాల నుండి నిలుచున్నాను. కళ్ళు మూసుకుని ఏమాలోచిస్తున్నావ్? సరే, ఇప్పుడు నాన్న ఎలాగూ లేరు. నువ్వా రిటైర్ అయిపోయావు. ఇక్కడ ఒంటరిగా నువ్వు ఎలా ఉంటావు? బెంగుళూరులో మా ఆఫీస్ ల దగ్గరే మంచి లొకాలిటీలో డూప్లెస్ ఫ్లాట్ చూసాం. పాపం, నీ కోడలే అంతా చూసుకుంది. బేరాలు వ్యాహారాలలో మంచి దిట్టని అంటుంటారు వాళ్ళ ఆఫీసులో కూడా. ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తనకు తెలిసినట్టు నీకు తెలియనే తెలియదు. ఎలాగూ నీ రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి కదా! మిగిలినవి మేం ఎస్ బి ఐ లో అప్పు తీసుకుంటాం, అందరం ఒకే చోట హాయిగా ఉండవచ్చు. " ఇక రెండో ఆలోచన ఉండే అవకాశం ఉంటుందన్న ధోరణిని కనపరచలేదు శేఖర్ మాటల్లో . తన సమ్మతి అవసరం అన్న భావన కూడా కనపరచలేదు కొడుకు .
అప్రయత్నంగా పెద్దగానే నిట్టూర్పు వచ్చింది , వాసంతి కి. తమాయించుకుంది.
" శేఖర్! నేను ఇక్కడే ఉండాలను కుంటున్నాను రా . నా రిటైర్మెంట్స్ ఫండ్స్ తో ఫార్మ్ హౌస్ కొన్నుక్కో బోతున్నాను. " గొంతులో నుండి మాటలు మెల్లగా వచ్చినా చాలా స్పష్టంగా చెప్పింది వాసంతి .
" నీ ఇష్టమయినట్టు నిర్ణయాలు తీసుకోవడమేనా ? మాతో సంప్రదించవలసిన అవసరం లేదా? పాపం వినీత కి నీ విషయం తెలియక నానా తంటాలు పడి అందరం కలిసి ఉంటామని అనుకుని పెద్ద ఫ్లాట్ చూసింది. నీకు కూడా మానవరాలితో హాయిగా గడుస్తుందనుకున్నాము. హర్షిత తో పొద్దు పోతుందని తాపత్రయ పడింది. సరే. నీఇష్టం . మేం ఎలా కాదంటాం . ఫండ్స్ నీవి కదా ! అయితే ఒక విషయం గుర్తుంచుకో. నీకు అవసరమయినప్పుడు రాలేదని మమల్ని మాత్రం దెప్పకు. మాకు ఉన్న పనులతో వీలవక పోవచ్చు. వినీత కూడా ప్రమోషన్ తీసుకుంటున్నది. అలోచించి నిర్ణయం తీసుకుని రేపు పొద్దున్నకి చెప్పు. మేం రేపు బెంగుళూర్ వెళ్ళిపోతున్నాం. మా ఫ్లైట్ పొద్దున్న అరుకే. "
"డూప్లెక్స్ ఇల్లు తీసుకుంటున్నట్టు తాను చెప్పక పోయినా ఫరవాలేదన్నమాట" !మాటలు పెదవులు దాటలేదు.
శేఖర్వె నుదిరిగి అసహనంతో వేసిన అడుగుల చప్పుడు, నెమ్మిదిగా పలచబడింది. అన్ని బంధాలలాగే.
మర్నాడు సూర్యుడి ప్రయాణం మొదలు పెట్టిన గంటన్నర గడిచిన తరువాత గాని వాసంతికి మెలుకువ రాలేదు. నిర్ణయం కఠినమైనదే. ఆలోచనలు అనుబంధాలు మధ్య ఘర్షణ . బంధాలను నిలుపుకునే బాధ్యత తనదేనా ? తన ఆలోచనలను ఇష్టాలను గౌరవించవలసిన బాధ్యత వాళ్ళకి మాత్రం లేదా? తండ్రి, భర్త,ఈ రోజు కొడుకు, అంతా తామే నిర్ణయాలను తీసుకుంటారు. తాను మాత్రం వాటిని ఖచ్చితంగా అమలు చేయాలను కుంటారు. తన ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోరు . తన కోరికకి విలువే లేదు ! తండ్రికి నచ్చిన చదువు చదివి, ఉద్యోగం చేసి తండ్రి గౌరవం,మాట నిలపాలి; భర్త అయినా అంటే.తన ఇష్టం నా ఇష్టం అయితీరాలి. ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి. ఆ మాట ఆయనగారిదే అయి ఉండాలి. అంటే తన అస్తిత్వం ఎక్కడ? ఎంత విడ్డూరం! తరాలు మారినా అనుబంధాలకు గీటురాళ్ళు తండ్రి భర్త కొడుకుల అడుగుజాడలలో నడవడమేనా ? ఇన్నేళ్లయినా ఇదే వరసా! తనకి కూడా వాళ్ళకి కావలసిందే కావాల్సి ఉండాలి. వాళ్ళ దృష్టిలో, తన కంటూ ప్రత్యేకమైన ఇష్టాలు ఉండవు. ఉంటాయో లేదో తెలుసుకునే ఆసక్తి వాళ్ళకి ఉండదు .. అరిచి చెప్పినా పట్టించుకోరు. అసలా విషయానికి ఏ మాత్రం ప్రాధాన్యత కాదు కదా గుర్తింపు కూడా ఉండదు. అరవై ఏళ్ళు ఇలాగే గడిచాయి. ఇప్పటివరకు ఈ పరంపరను ఎదిరించలేకపోయింది. తానిప్పుడు గట్టి నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. తన కల ను సాకారం చేసుకునే చివరి అవకాశం ఇదే.
ఇల్లంతా నిశ్శబ్దం. కిందకి కిటికీ లోనుంచి తొంగి చూసింది ; పోర్టికోలో శేఖర్ కారు లేదు. వీడికి నాన్న పోలికే. ముక్కుమీద కోపం. మాట చెల్లకపోతే ఇక అంతే . రేపు పాపం, వినీత అయినా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాలి.
" పదింటికి వస్తున్నానండి ! డాకుమెంట్స్ సిద్ధం చేయండి. "డ్రైవింగ్ సీట్ లో కూచోగానే ఫోన్ చేసింది , స్థలాన్ని కుదిర్చి పెట్టిన బ్రోక ర్, రమణ కుమార్ కి.
ముందు రిజిస్ట్రేషన్ పనులు; ఆతరువాత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో స్నేహితుడిని కలిసి ఫార్మ్ప్ల హౌస్ ప్లాన్ గురించి చర్చించాలి. చాలా రోజులకు ఫార్మ్ కల నెరవేర బోతున్నదని వాసంతికి ఏంతో తృప్తిగా ఉంది.
తోటకల, వంకర నవ్వుని వెనక్కు తీసుకు ని, ఓటమిని అంగీకరించింది సంతోషంగా .
వాసంతి చిరునవ్వు తో కార్ ఆక్సిలరేటర్ ని అదిమింది.
వచ్చే ఏడాదికి పూదోట విరగ పూయాలి మరి. అప్పుడు తెలుస్తుంది శేఖర్ కి అమ్మ గురించి. ఈ తరం లో అయినా ఆలోచనలు మారాలిగా!
సీతలు గీతదాటడం వలన ఆ నాడు, నేడు కూడా సమాజానికి ఉపయోగమే. ముందుకు నడవాలంటే గీతాలను చెరిపేసుకుంటూ దాటుకుంటూ పోకతప్పదు. చెయ్యాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది వాసంతి.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు