ఆత్మీయ బంధం - కందర్ప మూర్తి

ఆత్మీయ బంధం

సబ్బవరం వ్యాపార కేంద్ర నాలుగు రోడ్లకూడలిలో శేషయ్య శెట్టికి మిఠాయిల దుకాణముంది. స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు , నాణ్యతకు పేరున్నందున చుట్టు ప్రాంతాల చిల్లర వర్తకులు వచ్చి సరుకు కొనుక్కు వెల్తూంటారు. ముఖ్యంగా గోధుమ నేతి హల్వాకు ప్రత్యేకత ఉంది. శేషయ్య ఇంటి దగ్గర తనే రకరకాల స్వీట్లు తయారుచేసి అద్దాల తోపుడుబండి మీద పెట్టి నాలుగు రోడ్ల వద్ద కూడలి వద్ద దుకాణంలో అమ్ముతాడు.

క్రమేపి గిరాకీ పెరగడంతో మరొక గది అద్దెకు తీసుకుని వ్యాపారం అభివృద్ధి చేసాడు. తన వ్యాపార అభివృద్ధికి కారణమైన అద్దాల బండిని భద్రంగా ఇంటి వద్ద ఉంచి రోజూ పూజ చేస్తూంటాడు శేషయ్య. పాత ఇంటిని పడగొట్టి అన్ని ఆధునిక వసతులతో కొత్త భవంతి కట్టించాడు. క్రమంగా స్వీటు షాపు పెద్దదై శెట్టి ' శేఠ్ ' అయ్యాడు. సంతానం లేదని బాధ పడుతున్న సమయంలో దేవుడు కరుణించి కొడుకు పుట్టాడు.కొడుక్కి ఐదు సంవత్సరాల వయసప్పుడు శేఠ్ భార్య పక్షవాతంతో మంచం పట్టి తర్వాత చనిపోయింది. శేఠ్ వంటరి పక్షిగా మిగిలాడు.

లేకలేక కలిగినందున శేఠ్ కొడుకును గారాబం చేసాడు. వయసుతో పాటు అల్లరి , పెంకితనం అలవడ్డాయి కొడుక్కి. దుకాణం దగ్గరకొచ్చే కొనుగోలుదార్లతో మొరటుగా ప్రవర్తించేవాడు కస్టమర్లు శేఠ్ మంచితనం, ఉదార గుణంచూసి ఏమీ అనేవారు కాదు. శేషయ్య మాత్రం కొడుకును అదుపులో ఉంచలేక పోయాడు. కొడుక్కి వయసు పెరుగుతున్న కొద్దీ నిర్లక్ష్యం, తిరుగుబాటు తనం స్నేహితులతో తిరుగుతు డబ్బు దూబరా చెయ్యడం అలవడ్డాయి. శేఠ్ కి కొడుకు ప్రవర్తన చూసి బాధ కలిగేది

* * *

గతంలో కెళితే , శేషయ్య శెట్టి బజార్లో అద్దాల బండి మీద స్వీట్సు అమ్మే టప్పుడు ఒకరోజు చిన్న పిల్లాడు తన కెవరూ లేరని, తినడానికి పెడితే పని చేస్తూంటానని ప్రాధేయ పడ్డాడు. శెట్టికి గిరాకీ పెరిగి పని వత్తిడి వల్ల తనకీ సహాయంగా ఉంటాడని ఆ కుర్రాడిని చేరదీసాడు. ఆ అబ్బాయి కూడా పని చేస్తు నమ్మకం గా ఉంటు శెట్టి వ్యాపారాభి వృద్ధికి కారణ మయాడు. శేషయ్య శెట్టి వాడికి ' రాము ' పేరు పెట్టి పిలిచేవాడు. రాము శెట్టి దంపతులు పెట్టిన తిండి తిని రాత్రిళ్లు దుకాణం దగ్గిరే పడుకునే వాడు. వ్యాపారం బాగా పుంజుకోడానికి రాము శ్రమ , నిజాయితీలే కారణ మంటాడు శెట్టి.

రాము వచ్చిన తర్వాతే తనకి పుత్ర ప్రాప్తి కలిగిందని పని వాడిలా కాకుండా కొడుకులా భావించే వాడు. రాము కూడా వినయ విధేయతలు కనబరుస్తూ శెట్టికి, షాపు కొచ్చే కొనుదార్లకు విశ్వాస పాత్రుడయాడు. కొత్త కొనుగోలుదార్లు రామూని చూసి శేషయ్య కొడుకే అను కునేవారు. కాలంతో పాటు శేఠ్ వృద్ధాప్యంలో పడ్డాడు. స్వీటు షాపు బిజినెస్ పెరిగి కొత్త బ్రాంచీలు తెరిచారు. శేఠ్ కొడుకుతో పాటు రామూ పెరిగి పెద్ద వాడయ్యాడు. తన ప్రవర్తన , వినయ విధేయతలతో కస్టమర్ల మనసు దోచుకుంటే, శేఠ్ కొడుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు అందరిచేత ' ఛీ ' అనిపించుకుంటు శేఠ్ కడుపున చెడ పుట్టాడను కునేవారు.

రామూని అందరు గౌరవించడం చూసి శేఠ్ కొడుక్కి ఈర్ష్య కలిగేది. ఎలాగైనా రాముని అక్కడి నుంచి తరిమెయ్యాలని అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు శేషయ్య శేఠ్ బిజినెస్ నిమిత్తం ఉంచిన డబ్బున్న కేష్ బేగ్ కనబడటం లేదని కంగారుగా ఇల్లంతా వెతక సాగాడు. ఇల్లు నాలుగు మూలలా వెతికినా కేష్ బేగ్ కనబడలేదు.కొడుకు నడిగితే తనకి తెలియదన్నాడు.కేష్ బేగ్ లో లక్ష రూపాయలున్నాయని శేఠ్ గాబరా పడుతున్నాడు. ఆ రోజు ఉదయం రాము శేఠ్ తో పనుండి వచ్చి మాట్లాడి వాకిట్లోంచే వెళిపోయాడు. తర్వాత ఎవరు ఇంటికి రాలేదని తెల్సింది. సమయంకోసం ఎదురు చూస్తున్న శేఠ్ కొడుకు ఉదయం వచ్చిన రామూనే ఆ కేష్ బేగ్ పట్టుకెళ్లి ఉంటాడని ఆరోపణ చెయ్యగా రాము అటువంటి వ్యక్తి కాదని తండ్రి అంటే, మరెవరు ఆ కేష్ బేగ్ ని తీస్తారని చెప్పగా శేషయ్యకి కూడా రాము మీద చిన్న అనుమానం ప్రారంభమైంది.

డబ్బు మనిషి చేత ఏ పనైనా చేయిస్తుందని నిర్దారణ కొచ్చాడు. శేషయ్య వెంటనే షాపుకి చేరుకుని రామూని పిలిచి " లక్ష రూపాయల కేష్ బేగ్ కనబడటం లేదనీ, నువ్వు తీసావా ? " అని అడిగాడు. ఆ మాట విన్న రాము దిగ్బ్రాంతికి గురయ్యాడు. " శేఠ్ , నాకు డబ్బెందుకు ? మీరు పెట్టే భోజనం , చూపించే ప్రేమాభిమానాలే నాకు చాలు , వేరే డబ్బుతో నాకు పనేంటి ? నన్ను చేరదీసి పెద్ద చేసిన మీకు ద్రోహం చేస్తానా? " తన ఆవేదన కనబర్చాడు. " మరి కేష్ బేగ్ ఏమైనట్టు? నువ్వే ఉదయం ఇంటి కొచ్చావు. తర్వాత మరెవ్వరు ఇంటికి రాలేదు. నిజం చెప్పు ? నీ కెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిన్ను నా పెద్ద కొడుకులా ఆదరించాను. నువ్వు ఇంత మోసం చేస్తావనుకో లేదు ." శేఠ్ ఆరోపిస్తున్నాడు.

శేఠ్ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి రామూకి. 'శేఠ్ తన నిజాయితీ ని శంకిస్తున్నాడు.తన మీద దొంగ ముద్ర వేస్తున్నాడు ' అని బాధ పడుతుంటే దుకాణాని కొచ్చిన కస్టమర్లు కూడా విషయం తెల్సి ' ఇన్నాళ్లు శేఠ్ దగ్గర నమ్మకంగా ఉండి ఇంత మోసం చేస్తావా? ' పోలీసుల కప్పగించమని సలహా ఇచ్చారు. ఇన్నాళ్లు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపిన కస్టమర్లే దుర్భాష లాడుతుంటే తట్టుకో లేక పోయాడు రాము. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇంతలో శేఠ్ కొడుకు పోలీసుల్నీ వెంట బెట్టుకొచ్చి రామూని చూపి " ఇతనే మా నాన్న కేష్ బేగ్ దొంగిలించాడు. ఎక్కడ దాచాడో చెప్పడం లేదు. మీరే నాలుగు పీకితే నిజం కక్కుతాడు. తీసు కెళ్లండి" అన్నాడు. పోలీసులు శేషయ్య శేఠ్ వద్ద ఫిర్యాదు తీసుకుని రాము చేతికి సంకెళ్లు వేసి పోలీసు జీపులో స్టేషనుకు తీసుకు పోయారు. రాము ఏడుస్తూ ' ఇంత కాలం నా నిజాయితీ , నమ్మకానికి ఇదా మూల్యం ' అనుకున్నాడు. పోలీసు స్టేషన్లో రామూని ఎన్ని విధాల విచారించినా కేష్ బేగ్ విషయం తెలియ లేదు.

బేగ్ ఏమైందని అందరు తర్జన బర్జన పడుతున్నారు. తర్వాత అసలు దొంగ బయట పడ్డాడు. రాము ముందు రోజు ఒక స్వీటుపేకెట్టు శేఠ్ కిచ్చి రుచి చూసి సంతృప్తిగా ఉందంటే కస్టమర్ కి డెలివరీ చేస్తానన్నాడు. రాము బయటి ప్రాంతాలకు ఎక్కువ సరుకు పంపేటప్పుడు శేఠ్ కి రుచి రూపించి ' సరే ' అన్నాకే పేక్ చేయిస్తాడు. ఎప్పటిలా స్వీటు బాక్సు టెస్టింగుకి శేఠ్ కివ్వగా దాన్ని డబ్బున్న కేష్ బాక్సుతో పాటు తన పడక గదిలో టేబిల్ మీద ఉంచాడు. గది కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. చాలా కాలం నుంచి కిటికీ అవతల పెద్ద వేప చెట్టు మీద నివాసం ఉంటున్న కోతి కిటికీ తెరిచి ఉన్నందున పడక గదిలో కొచ్చి కేష్ బేగ్ పక్కన ఉంచిన స్వీటు బాక్సుతో పాటు కేష్ బేగ్ ని కూడా తీసుకు పోయి స్వీట్లు తిన్న తర్వాత కేష్ బేగ్ లో ఏమున్నాయోనని దాని జిప్ లాగి తను తినే వస్తువులు లేవని విసిరేసింది. బేగ్ కొమ్మల్లో చిక్కుకుని గాలికి అందులో ఉన్న కరెన్సీ నోట్లు కొన్ని బయట పడ్డాయి. నేల శుభ్రం చేస్తున్న పనివాళ్లు విషయం శేఠ్ కి తెలియ చేసారు.

శేషయ్య శేఠ్ , ఆయన కొడుకు ఇంటికి చేరుకుని వేప చెట్టు పైకి మనుషుల్ని పంపగా మిగతా డబ్బు తో కేష్ బేగ్ , కాళీ స్వీటు బాక్సు దొరికాయి. తండ్రీ కొడుకు లిద్దరికీ అసలు విషయం అర్థమైంది. తామెంత పొరపాటు చేసామో నని తెలుసుకుని బాధ పడసాగారు. ఒక అమాయకుడు, నిస్వార్థ పరుడు, నమ్మకస్తుణ్ణి అన్యాయంగా అరెస్టు చేయించి జైలుకి పంపి పెద్ద తప్పు చేసామని దుఃఖ పడ్డారు. వెంటనే పోలీస్ స్టేషను కెళ్లి జరిగిన పొరపాటుకీ , అపోహలకు క్షమాపణ అడిగి ఫిర్యాదు వాపసు తీసుకుని రామూని సాదరంగా ఇంటికి తీసుకు వచ్చారు. తన మీద పడిన అపనిందకు తిండి తినని కారణంగా నీర్సంగా ఉన్న రామూని చూసి శేఠ్ మనసు తల్లడిల్లిపోయింది. జరిగిన పొరపాటుకి క్షమించమని ఆప్యాయంగా కౌగిలించుకుని ఏడ్చేసాడు.

" నువ్వు నా అసలైన పెద్ద కొడుకువి. ఇటుపైన వ్యాపార భాద్యత నీకు అప్ప గిస్తున్నాను.తమ్ముణ్ణి కూడా నీ అంత ఉన్నతంగా తీర్చి దిద్దు " అని కొడుకును అప్పగించాడు. విషయం తెలియక దుర్భాష లాడిన కస్టమర్లు రామూని షాపు మీద చూసి తల వంచుకున్నారు.

** ** **

మరిన్ని కథలు

Kreeda sphoorthi
క్రీడాస్ఫూర్తి
- డి.కె.చదువులబాబు
Bhale alochana
భలే ఆలోచన
- సరికొండ శ్రీనివాసరాజు
Naanna maripoyadu
నాన్న!మారిపోయాడు
- కె.వి.వి.లక్ష్మీ కుమారి
Veedhi arugulu
వీధి అరుగులు
- రాముకోలా.దెందుకూరు.
Vennamuddala kalyanam
"వెన్నముద్దల కళ్యాణం"
- కొత్తపల్లి ఉదయబాబు
Mantri yukthi
మంత్రి యుక్తి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Chandrudi salaha
చంద్రుడిసలహా
- డి.కె.చదువులబాబు