విక్రమసేనుడి విజయం - కందర్ప మూర్తి

Vikramasenudi vijayam

కాళిందీ నగరాధీశుడు జయదేవుడు తన ఏకైక కుమార్తె జగదీశ్వరిదేవికి వివాహం చేయ తలపెట్టి తన పొరుగు రాజ్యాలకు ఆహ్వాన వర్తమానాలు పంపాడు. కాలకేతు మాంత్రికుడు అతీత మంత్ర శక్తులను సాధించ డానికి యుక్త వయసులో ఉన్న కన్యల కోసం వేట ప్రారంభించాడు. ఎత్తుకు వచ్చిన కన్యలను వివాహమాడి తర్వాత వారిని కరాళుడికి బలివ్వాలనే ఆలోచనలో ఉన్నాడు.తనని వివాహ మాడటానికి తిరస్కరించిన ఆడపిల్లలను రామచిలుకలు మైనాలుగా మార్చి పంజరాలలో ఉంచి తన గుహలో బంధిస్తు న్నాడు. ఉజ్జయిని రాజ్యాధిపతి మకరందుడి ఏకైక పుత్రుడు విక్రమసేనుడు ఆశ్రమ విధ్యాబ్యాసంలో అనేక యుద్ధ విద్యలతో పాటు శబ్ధవేధి విలువిద్యను తాంత్రిక శక్తులను అబ్యసించి ఉజ్జయినీ రాజ్యానికి తిరిగి వచ్చాడు. కుమారుడి అస్త్ర శస్త్ర పాటవానికి సంతసించిన మహరాజు కాళిందీ నగరాధీశుని కుమార్తె వివాహ ఆహ్వాన సందేసాన్ని విక్రమసేనుడికి చెప్పి వారి రాజ్యానికి వెళ్లి స్వయంవరంలో పాల్గొన వల్సిందిగా కోరాడు. తండ్రి కోరికను మన్నించి యువరాజు తన పంచ కల్యాణి అశ్వం మీద కాళిందీ నగరానికి బయలుదేరాడు. మార్గమద్యలో అడవులు పర్వతాలు దాటి కొందరు మునీశ్వ రుల సందర్సనలో మంత్ర విద్యలను తెలుసుకుని కాళిందీ పుర సరిహద్దుల్లో ప్రవేశించగా అదే సమయంలో రాకుమార్తె జగదీశ్వరి వారి కులదైవాన్ని దర్సించుకుని మేనాలో అంతఃపురానికి ప్రయాణమవుతూ కంటపడింది. రాకుమారి ముగ్ధమోహన రూపాన్ని చూసి పరవశించి పోయాడు విక్రమసేనుడు.జగదీశ్వరి కూడా తెల్లని పంచకల్యాణి అశ్వం మీదున్న ఆజానభాహుడు స్ఫురద్రూపుడైన రాకుమారుడి అందచందాలకు ఆకర్షితురాలైంది.చూపులు కలిసాయి.మదిలో వలపులు రేగాయి.ఇంతలో చెలికత్తెలు రాజభటుల రక్షణలో ఆమెను మేనాలో కూర్చేబెట్టారు. రాకుమారి జగదీశ్వరి వివాహ వార్త తెలిసిన కాలకేతు మాంత్రికుడు ఆమెని ఎలాగైనా తన వశం చేసుకోవాలను కున్నాడు. తన వద్ద గల మాయాదర్పణంలో కులదేవతను పూజించు కుని మేనాలో కూర్చున్న జగదీశ్వరి కంటపడింది. తక్షణం గండభేరుండ పక్షి రూపంలో వచ్చి రాకుమారిని ఎత్తుకు పోయాడు.చెలికత్తెలు రక్షణగా ఉన్న సైనికులు ఈ హఠాత్ పరిణామానికి ,తమ కళ్లెదుటే రాకుమారి అధృస్య మవడం చూసి భయకంపితులయారు. కుమార్తె అధృస్య వార్త విని మహరాజు నిర్ఘాంత పోయాడు. స్వయంవరం పెట్టి కుమార్తెకు వైభవంగా వివాహం జరపా లను కుంటున్న సమయంలో ఇలా జరగడం తట్టుకోలేక పోయాడు మహరాజు జయదేవుడు. ఎవరైన సాహస వీరుడు రాకుమార్తెను సురక్షితంగా తీసుకు వచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానని చాటింపు వేయించాడు. తన కళ్లెదుటే రాకుమారిని గండభేరుండ పక్షి రూపంలో కాలకేతు మాంత్రికుడు ఎత్తుకుపోవడం చూసిన విక్రమసేనుడు సంబ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాడు. రాజమహలుకు రక్షణ కట్టుదిట్టం చేసారు.రాజభటుల పహారా పెరిగింది. కోట నాలుగు ప్రక్కల ధ్వారాలను మూసి వేసారు. రాకుమారుడు విక్రమసేనుడికి మహరాజును కలిసే అవకాశం కలగలేదు.రాజ వీధుల్లో రాజ ప్రకటన చూసాడు. రాజకుమారిని రక్షించి తెచ్చి మహరాజుకు అప్పగించాలను కున్నాడు. రాకుమారిని ఎవరు అపహరించి ఉంటారని ఆలోచిస్తుండగా గుడికి దక్షిణ దిశలో ఉన్న వృక్షానికి రాకుమారి ధరించిన వస్త్రం వేలాడుతు కంటపడింది. ఆ వస్త్రాన్ని బట్టి రాకుమారిని దక్షిణ దిశగా అపహరించుకుని వెళ్లి నట్టు అర్థమైంది. రాకుమారి జగదీశ్వరిని ఎత్తుకెళ్లిన కాలకేతు మాంత్రికుడు తిన్నగా తన గుహకు తీసుకుపోయాడు. అనుకోని సంఘటనకు స్ప్రుహతప్పి అచేతనంగా పడిఉంది. కాలకేతు తన వద్దనున్న మంత్రజలాన్ని ఆమె ముఖం మీద జల్లగా తెలివిలో కొచ్చింది. అక్కడ పంజరాల్లో బందీలుగా రామచిలుకలు, మైనా పక్షుల రూపాల్లో ఉన్న రాకుమార్తెలు ఒక్క సారిగా అరవడం మొదలెట్టాయి. గండభేరుండ పక్షి రూపం నుంచి అసలు రూపానికి మారిన కాలకేతు వికృతరూపాన్ని చూసి రాకుమారి కెవ్వున కేక వేసింది. తన చుట్టూ ఉన్న పరిశరాల్ని చూసి భయంతో వణికి పోయింది. కా‌లకేతు ఆమె పరిస్థితిని చూసి వికటాట్టహాసం చేయసాగాడు. రాకుమారి కోసం విక్రమసేనుడు పంచకల్యాణి అశ్వం మీద దక్షిణ దిశగా బయలుదేరాడు. వాగులు గుట్టలు దాటి భయంకర దండకారణ్యంలో ప్రవేశించాడు. సుదీర్ఘ ప్రయాణంలో అలసిన విక్రమసేనుడు పంచకల్యాణి దిగి ఒక పెద్ద వట వృక్షం కింద విశ్రమించాడు. నిద్రలో ఉన్న రాకుమారుడికి చెట్టు మీద నుంచి భయంకర మైన అరుపులు వినబడ సాగాయి.ఉలిక్కి పడి లేచి తన శబ్ధవేది విద్యతో ఒక బాణాన్ని సంధించాడు. బాణం తగిలిన ఒక పిశాచి వచ్చి విక్రమసేనుడి పాదాల వద్ద పడింది. దాన్ని చూసిన విక్రమసేనుడు తన కరవాలాన్ని తీసి వేటు వేయ బోగా " ఆగండి, రాకుమారా! నేను మీరు ఊహించిన దుష్టశక్తిని కాను.నేనొక ముని కుమారుణ్ణి.కాలకేతు మాంత్రికుడు తనకు మంత్ర శక్తుల్ని నేర్పలేదని తన దుష్ట శక్తి తో మా తండ్రి గార్ని చంపి బూడిద చేసి నన్ను పిశాచిగా మార్చి ఈ వటవృక్షం మీద వేలాడదీసాడు. ఇక నాకు ముక్తి లేదనుకున్న సమయంలో మీరు వచ్చారు. కాలకేతు దగ్గర అనేక మంత్ర శక్తులున్నాయి.వందమంది కన్నెపిల్లల్ని వివాహమాడి తర్వాత కరాళుడికి బలిస్తే వాడికి అతీత శక్తులు సిద్ధించి భూమండలాన్ని తన గప్పెట్లో ఉంచా లను కుంటున్నాడు. చాలా మంది కన్నెపిల్లల్ని అపహరించి తన స్థావరంలో బంధించాడు.వాడి స్థావరం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మీరు ఆ బాలికల్ని రక్షించండి. మా తండ్రి నేర్పిన ఒక శ్లోకాన్ని మీకు చెబుతాను.అది పఠించిన వెంటనే మీరు అదృస్యరూపం ధరిస్తారు.అదే మంత్రాన్ని వ్యతిరేకంగా పఠిస్తే అసలు రూపం ధరిస్తారు. ఈ మంత్రశ్లోకం ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. నేను మీకు చెప్పినందున ఈ మంత్రశ్లోకం నాకు పని చెయ్యదు. కాలకేతు ప్రాణాలు కరాళుడి ప్రతిమలో దాచాడని మా తండ్రి గారు చెప్పారు.వాడిని ఎదిరించే శక్తి నాకు లేదు.మీరు కాలకేతు మాంత్రికుణ్ణి నాశనం చేసి బంధీలుగా ఉన్న కన్నెపిల్లల్ని కాపాడండి" అని కోరాడు. మునికుమారుని ద్వారా కాలకేతు గుట్టు మట్లు తెలుసు కున్న విక్రమసేనుడు రాకుమారి జగదీశ్వరిని అపహరించి ఉంటాడనుకున్నాడు. పిశాచి రూపంలో ఉన్న మునికుమారుణ్ణి తను అబ్యసించిన పరకాయ ప్రవేశ విద్యతో అసలు శరీరంలో చేర్చి నిజ రూపాన్ని ప్రసాదించాడు. ముని కుమారుడు తన నిజరూపం వచ్చినందుకు రాకుమారునికి ధన్యవాదాలు తెలిపి కుటీరానికి వెళిపోయాడు. విక్రమసేనుడు పంచకల్యాణి ఎక్కి మునికుమారుడు ఉపదేశించిన మంత్ర శ్లోకం పఠించి అదృస్య రూపంలో కాలకేతు మాంత్రికుడి స్థావరానికి చేరుకున్నాడు. అక్కడ రాకుమారిని చూసి ఆనందభరితుడయాడు. తనను వివాహ మాడటానికి నిరాకరించిన రాకుమారిని బంధించి హింసిస్తున్నాడు కాలకేతు.అది చూసిన విక్రమసేనుడు తట్టుకోలేక పోయాడు. అదృశ్య రూపంలోనే తన కరవాలంతో వాడి శిరస్సు నరికాడు.తల తెగి కింద పడింది. ఈ హఠాత్ పరిణామానికి కాలకేతు నిర్ఘాంతపోయాడు.వెంటనే తేరుకుని కనికట్టు విద్యతో శిరస్సును యధాస్థితికి తెచ్చుకున్నాడు. మాయా దర్పణంలో విక్రమసేనుణ్ణి గుర్తించి తన తాంత్రిక విద్యతో అసలు రూపానికి రప్పించాడు.రాకుమారుణ్ణి చూసి జగదీశ్వరి ఆనందానికి అవధులు లేకపోయాయి. కాలకేతు తన వద్దున్న మాయా శక్తులతో విక్రమసేనుణ్ణి జయించడానికి ఎన్ని శక్తి యుక్తులు చేసినప్పటికీ అవేవీ ఫలించ లేదు. మునిపుంగవుల వద్ద అబ్యసించిన విరుగుడు మంత్రాలతో కాలకేతుని అశక్తుణ్ణి చేసాడు. విల్లంబులతో మాయాదర్పణాన్ని ముక్కలు చేసాడు. ఎన్ని మంత్ర తంత్రాలు ప్రయోగించినా విక్రమసేనుణ్ణి జయించడం కష్టసాద్య మనుకుని ప్రాణ భయంతో వెంటనే అక్కడి నుంచి బయట పడాలనుకుని కరాళుడి ప్రతిమ తలలో దాచిన తన ప్రాణాల భరిణను తీసుకోడానికి కరాళుడి వెనక దాగినాడు. విక్రమసేనుడికి మునికుమారుడు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చి తను అబ్యసించిన శబ్ధవేధి విలువిద్యతో కరాళుడి ప్రతిమను ముక్కలుగా చేసాడు. పెద్ద శబ్ధంతో కాలకేతు మాంత్రికుడు అరుస్తూ నేలకూలాడు. రాకుమారి జగదీశ్వరిని బంధ విముక్తురాల్ని చేసాడు. పంజరాలలో వివిధ రూపాల్లో ఉన్న రాకుమార్తెలను కాలకేతు దగ్గరున్న మంత్ర జలంతో వారి అసలు రూపాలుగా మార్చి వారి వారి రాజ్యాలకు అప్పగించాడు. అదృశ్యమైన కుమార్తెను చూసి కాళిందీ రాజ్యాధీశుడు జయదేవుడు ఆనందభరితుడయాడు. రాజ్య ప్రజలంతా పండగ సంభరాలలో మునిగిపోయారు. జగదీశ్వరిదేవి - విక్రమసేనుల వివాహం వారి కులదైవ సన్నిధిలో అంగరంగ వైభవంగా జరిగింది. రాకుమారి జగదీశ్వరిని వివాహ మాడి విజయంతో రాణిగా వెంట తీసుకు వచ్చిన యువరాజు విక్రమసేనుడు సాహస యాత్రకు మురిసిపోయిన మహరాజు మకరంధుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అట్టహాసంగా ఉజ్జయినీ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. * * * *

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి