అయ్యకేటైనాదో...! - రాము కోలా.దెందుకూరు

Ayyaketainado

గుడిసెలో సాలీసాలని బొంత కప్పుకు పడుకున్న నాకు మాయమ్మ ముఖముల కించిత్తు దిగులుగా కనపడతాంది. ఎప్పుడూ చిరునవ్వు పులుముకున్న మాయమ్మను గెప్పుడూ అట్టాగ దిగాలుగా జూడలే నేను . ఏటి జరగకుంటే మాయమ్మ అట్టా దిగాలుగా ఉండదని నాకెరుకే. సందెపోద్దు గూకెటేల కసువూడిసేసి దీపాలెట్టి మంచి హుషారుగా పనులు చేసెడి మాయమ్మ దిగులుగున్నది ఎందుకో సమజగాలే. చెంగు చెంగున గెంతెటి లేగదూడతో సరదాలడేటి మాయమ్మ గమ్ముగా గడపకు చారగిలపడి కూకుంది గూడు చేరని పిల్లలకోసం ఎదురుసూసెడి తల్లికోడిలా.. ఏటి జరిగినాదో ఏటో అనుకుంటా, ముసుగు దీసి సుట్టసుట్టి పక్కనెట్టి మాయమ్మ పంచన సేరినా. ఏటమ్మా! ఏటైనాది.అట్టా దిగాలుగా గూకున్నవేటి. నిన్ను జూతావుంటే మనసు బాదగున్నాదే మాయమ్మ! ఏటైనాదో ఏటో సెప్పరాదేటి... నాకు గాక మరెవరికి చెప్పుకుంటావేటి" అని మాయమ్మను లాలనగా అడిగినా! "జెప్పనికి ఏటున్నది కొడకా! పంట భూముల వరి పొట్ట మీద కొచ్చే.. నీరు గడదామంటే కరెంటు వచ్చుడూ పోవుడు సరిపోయే! ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతదొ గాభగవంతుడుకే తెలియదాయే." "పొద్దు పొద్దుగాల పొలం గట్టుకు పోయిన అయ్య తిరిగిరాలే.... ఏటి సేత్తున్నడో ఏటో..ఒక్కడే ఎంతగా కష్టపడుతున్నడో ఏటో." "నే తోడెలదామంటే ఒకటే ములుకుల నెప్పులాయే" "పట్నం మందులు మింగుడే కానీ తగ్గుడు లేదాయే! దవాఖానా మెట్లు కూడా ఎక్కలేక పోతి కొడుకా! ఏటి బతుకులో ఏటో.. రూపాయాలు గుమ్మరించ్చుడు.గోలీలు తెచ్చుకు మింగుడే కానీ తగ్గిన దాఖలాలు కనపడకపోయే "ఏటి డాక్టర్ సాబ్ తగ్గలేదంటే.." "ఇది మంత్రాలకు చింతకాయలు రాలినట్లు కాదు. ఒంటికి పట్టాల. అప్పుడు కదా ఫలితం కనపడతది. నువ్వు లొల్లి చేస్తావని పారిపోతదా ఏటి"అని పక్కున ఒకటే నవ్వుడాయే. ఏటి చేయలేక గమ్మునుంటి కొడకా." "ఒకటే గుబులౌతాంది పదే పదే గుమ్మం వైపు చూడకుండా మనసు . కుదురుగా ఉండలేక పోతాంది. ఎన్ని అనుకున్న పొద్దుగూకెటేలకు పెనిమిటి ఇంట ఉంటేనే భార్య మనసు కుదురుగుంటది." "ఉరుములు మెరుపుల్తో సీకట్లు కమ్ముకొస్తూ, కొరివి దెయ్యం లెక్క ఆకాశం బయపెడుతుంటే. గుండె దిటవు చేసుకోలేక పోతున్నా" చెప్పలేక చెపుతున్న గొంతులో ఏదో తెలియని భయం ధ్వనిస్తుంది. "అయితే ఏటి సేత్తం!చెప్పు "అని అడిగేసరికి గుడ్లలో దాగిన కన్నీటిని తూడ్చుకుంటూ. బిడ్డా! ఒకపరి సాగిపోతవా ? అయ్య ఎట్టున్నడో!ఏటో...!పొద్దుగల కాస్త గంజి కూడు తిని పొలంలో నీళ్ళు కట్టబోయిండు.. ఆకలితో ఎట్టున్నడో ఏంటో...గతకనికి కాస్త బువ్వ ... ముంతలో యేసి,కాసిని మజ్జిగ.. నంజునికి ఉల్లిగడ్డ ...రెండు పచ్చి మిరపకాయలుతో మూటకట్టిస్తా...కాస్త ఓపిక సేసుకు ఆడకెళ్ళి....అయ్యకిచ్చి... అయ్య ఎట్టున్నడో !తెలుసు రారాదా బిడ్డా? అంటున్న అమ్మ మాటల్లో ఆదుర్దా... కంటి రెప్పలు నుండి జారాలేక జారుతున్న కన్నీటి సుక్క సూసి కాదనలేక నేల మీద పరిసిన తుండు గుడ్డ తీసి దులిపి భుజాన యేసుకుని. గొడ్ల చావిడిలో గోడకు యేలాడుతున్న పాత లాంతరు తీసుకుని. దీపంకున్న అద్దం పొయిలోని బూడిదేసి , సుబ్బరంగా తుడిసేసి. లాంతరు నిండుగా చమురు నూనే పోసుకుని. అయ్యకు చిన్నతనంలో తాత కొనిపెట్టిన సైకిల్ తీసుకుని ఆమ్మవైపు సూసినా...! నే ఉన్నాగందా!గాభరాపడకు అన్నట్లుగా.. చిన్న భరోసాతో అమ్మ ముఖం నిండు చందమామలా వెలిగిపోతాంది. *** చుట్టూ చీకటి!మీదకు దుముకుతూ భయపెడుతుంది"నా దగ్గర లాంతరు ఉంది తెలుసా" నేనెందుకు భయపడతా" అంటూనే అడుగులో అడుగు వేస్తూ, సేను గట్టు మీద జాగ్రత్తగా నడుస్తున్నా! అయ్య పడుకునే దిక్కు వైపు. అయ్యను గొంతెత్తి పిలుస్తూ.. చిన్నగా చినుకులు మొదలైన శబ్దం, చీకటిలో కలిసి పోతుంది. ఆకాశం బద్దలౌతుందా అన్నంతగా శబ్దం చేస్తూ దూరంగా పిడుగు పడింది.. ఒక్కసారిగా కన్నులు జిగేల్ మనిపించేలా యెలుగు చూట్టూ పరుచుకుంది. గట్టు మీద సైకిలు ఒక చేత్తో పట్టుకుని నడుస్తున్న నాకు .ఆ యెలుతురికి కన్నుకు కనిపించిన అయ్యను సూసి నోట మాట అట్టాగే ఆగిపోనాది. మాకోసం పొద్దు పోద్దుగలనే చేనుకు వచ్చిన అయ్య,రెక్కలు ముక్కలు చేసుకుని, కుటుంబంను పోశించుకునే మా అయ్య.గంజి నీళ్ళతో డొక్కా నింపుకుంటూ..నలుగురు కడుపులకు పిడికేడు మెతుకులు అందించాలని .చీకటిలోనే నిద్రలేచి పోలం చేరిన మా అయ్య, మోటార్ షెడ్డులో .... కరెంటు బోర్డు దగ్గర... చూపులు నింగి వైపు..నా ఉపిరి తీసుకున్నావుగా! ఇక చినుకులు చిలకరించు, మా వాళ్ళ ఆకలి కేకలు తీర్చు ".. అనేలా.. ముగిసిన గుప్పెట్లో నేలతల్లి... బురద.. రేపటి రోజు ఆశలు సజీవం కావాలనే చూపులు నింగివైపు..... కాటేసిన కరెంటుకు విగత జీవుడుగా మా అయ్య నీటి కాలువలో నేలతల్లికి ప్రణమిల్లుతూ.. ఎప్పుడు ఊపిరి వదిలినాడో తెలియదు. *కన్నీటితో శుభం కాని ముగింపు*

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల