కోతులనడుమ (కామెడీ కథ) - చెన్నూరి సుదర్శన్

Kotula naduma

అది ‘కోతులనడుమ’. పూర్వం ఆ ప్రాంతామంతా చిట్టడవి.. కోతులమయం. అడవి మధ్యలో ఉన్న ఒకే ఒక కాలిబాటన ప్రజలు వారి, వారి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు. వాళ్ళు తెచ్చుకునే తినుబండారాలకు ఆశపడి.. కోతుల సంఖ్య మరింత పెరిగింది. బాటసారులు తినడానికివ్వకుంటే.. కోతులు వారిని అడ్డగించి నానా బాధలు పెట్టేవి. వాని ఆగడాలు భరించలేక వివిధ గ్రామాల ప్రజలు ఏకమై కోతుల బెడద తప్పించుకోడానికి, దారి కిరుప్రక్కలా.. గుడిసెలు నిర్మించుకున్నారు. అలా కోతులనడుమ ఊరు ఏర్పడింది. కాలి బాట రహదారిగా మారి ప్రయాణీకులకు కాస్త కోతుల నుండి ఊరట లభించింది. కాని ఊరు చుట్టూ కోతులు కవాతు చేస్తూ.. అదును చూసి అనువైన ఇంట్లోకి దూరి చేతికి అందినవి ఎత్తుకుపోవడం రివాజుగా మారింది. కోతులు.. విలాసం, వినోదం, దర్పం, మనుష్యులపై ఆధిపత్యంతో తమ వంతు కృషి సలుపుతూ.. కోతులనడుమ జనాభాతో పోటీ పడ్డాయి.

ఈమధ్యనే కోతులనడుమ దరిద్రాబాదు గ్రేటర్ మ్యున్సిపాలిటీలో విలీనమైంది. ప్రజలకు కోతుల బెడద నిర్మూలనం చేయాలని కంకణం కట్టుకుని.. ముందుగానే కమీషన్ కొట్టేసి సదరు కమీషనరు గారు ఓప్రైవేటు ఏజన్సీకి కాంట్రాక్ట్ కిచ్చాడు.

ఏజన్సీ చైర్మన్ మంకేశ్వరుడు సీట్లో కూర్చోగానే పత్రికా ప్రకటన యిచ్చాడు. ఆప్రకటన ఫలితమే.. ఆరోజు ఆదివారం ఆఫీసు ముందు యిసుక పోస్తే రాలనంత జనం. అతని ఆనందానికి అవధులు లేవు. నిరుద్యోగులు పాపం..! ఏంచేస్తారు? అనుకున్నాడు.

తన ప్రారంభోపన్యాసమయ్యాక మంకేశ్వరుడు తన ఆఫీసు గేటు వద్ద అమర్చిన ఒక టోకెన్ యంత్రాన్ని పరిచయం చేశాడు.

“యంత్రంలో కోతులనుంచాలి. అవి కోతులేనని నిర్థారించుకున్న యంత్రంలో గ్రీన్ లైటు వెలుగుతుంది. అవి కోతులు గాకుంటే రెడ్ లైటు వెలుగుతుంది. గ్రీన్ వెలిగినప్పుడు మాత్రమే పిన్ నంబర్ అడుగుతుంది. పిన్ నంబర్ ఎంటర్ చేయగానే యంత్రం కదులుతుంది. కోతులు నేరుగా ఆఫీసు వెనుకాల ఉన్న పెద్ద బోను లాంటి హాల్లోకి వెళ్లి పోతాయి. ఇంతలో ఒక టోకెన్ వస్తుంది. అందులో మీ ఐ.డి నంబరు, కోతుల సంఖ్య, ఆనాటి ఒక కోతి ధర చొప్పున మొత్తం అమౌంట్ నమోదు అవుతుంది. దాన్ని క్యాష్ కౌంటర్లో అందజేస్తే మీకు డబ్బులు చెల్లిస్తారు.

ప్రతీరోజు వాటి ధరలో మార్పు సహజం.’నేటి ధర’ అని ఆఫీసు గేటు ముందర బ్లాక్ బోర్డుపై ప్రకటిస్తాను.

సబ్ ఏజెన్సీ తీసుకునే వారు ముందుగా మూడువేల రూపాయలు ధరావత్తు సొమ్ము చెల్లించి తమ ఐ.డి. కార్డ్స్ మరియు పిన్ నంబర్లు పొందాల్సి ఉంటుంది. దాంతో బాటు మీకు రంగుల చిత్రాలతోగూడిన కోతులను పట్టుకునే అధునాతన టిప్స్ వివరించే ’కోతిని బుట్టలో వేయడం’ అనే పుస్తకం పూర్తిగా ఉచితం” అని ముక్తాయింపు పలుకులు పలికాడు మంకేశ్వరుడు.

జనం సబ్ ఏజెన్సీ కోసం ఎగబడ్డారు.

***

దాదాపు ఒక మాసంలోనే కోతులనడుమ వీధుల్లో హడావుడి తగ్గిపోయింది. అలవాటు ప్రకారం కనీసం రోజుకొక కోతినైనా చూడనిదే ప్రజలకు నిద్ర కరువయ్యింది. కోతులు తరుముతుంటే తమ పనులను వేగవంతంగా పూర్తయ్యేవి. ఇప్పుడు ప్రజల్లో అలర్ట్ నెస్ తగ్గి.. దినం, దినం సోమరిపోతులుగా తయారవుతున్నారు.

కోతుల ధర మొదటి రోజు మూడు వందల నుండి నేటి ధర ’రెండు వేలు’ పలుకుతోంది. కొందరి ఏజంట్స్ ముఖాలలో వంద వాట్ల బల్బులు వెలిగాయి. రాబోయే కరువు కాలంలో రేటు పెరిగాక అమ్ముకోవచ్చుననుకునే కాలాంతకులు వాళ్ళు. వాళ్ళ అంచనాల ప్రకారం ప్రతీ రోజు కోతి ధర ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకే వాళ్ళు దాచి ఉంచుకున్న కోతులనమ్మి సొమ్ము చేసుకున్నారు. రెండు వేల రూపాయల కడక్ నోట్లతో మీసాలు దువ్వుకున్నారు.

కోతులనడుమలో భూతద్దాలు పెట్టుకొని గాలించినా ఒక్క కోతి కనబడితే ఒట్టు.

***

’తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మ.. తెలివి మనది సొమ్ము మనది తెలుసుకోవే.. ముద్దుల గుమ్మా..’ అని ఒక సినీ కవి అన్నట్లు ఒక ఏజెంటు ఎల్లయ్య మస్తిష్కంలో ఒక మెరుపు మెరిసింది. ఉన్న ఫళంగా ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు.

“మంకేశ్వరుడు ఉన్నాడా? సార్” అని ఆఫీసు సహాయకుడు సాంబయ్యను అడిగాడు.

“ఏం ఎందుకు?..” అంటూ ఈసడింపుగా జవాబిచ్చాడు సాంబయ్య. “సార్ ఊరెళ్ళాడు. ఒక్క కోతి గూడా రావడం లేదు గదా.. యిక కోతులన్నింటినీ విదేశాలకు అమ్మే ప్రయత్నంలో చాలా బ్యుజీగా ఉన్నాడు. నాలుగు రోజుల్లో కోతి ధర మూడు వేలని బోర్డు పెట్టమన్నాడు”

“నేనూ అదే విషయం మీతో రహస్యంగా మాట్లాడుదామని వచ్చాను. అంటూ స్వకుచమర్దనుడైన ఎల్లయ్య గుస, గుస లాడడానికి సాంబయ్య చెవిని కొరక బోయాడు.

“ఏం ఫర్లేదు, యిక్కడెవ్వరూ లేరులే.. క్యాషియర్ గూడా మనోడే చెప్పు” అంటూ సాంబయ్య ధైర్యమిచ్చేసరికి “చిన్న అడ్జెస్ట్ మెంట్ సార్” అంటూ గొంతు సవరించు కున్నాడు ఎల్లయ్య.

“మన యంత్రం కోతులు అని అని పసి గడ్తుందే తప్ప వాటికి స్టాంపులు గట్రా మీరేమీ వేయడం లేదు గదా.. అవునా? అందుకే నాకు బోనులోని కోతులు కొన్నింటిని రెండు వేల రూపాయల చొప్పున యిచ్చావంటే నీకు ఒక్కొక్క కోతికి వంద రూపాయల చొప్పున కమీషనిస్తాను. మా ఏజెంట్లంతా నన్ను రాయబారానికి పంపారు”అంటూ.. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా...’ అన్నట్లు ఆశ చూపాడు.

ఇదేదో బాగానే ఉందని కాసేపు బాగా అలోచించి బేరాలాడాడు సాంబయ్య. కమీషను మరింత పెంచి ఒక్కో కోతి రెండువేల రెండువందలకు ఒప్పందం చేసుకున్నాడు.

ఎల్లయ్య చిటికేయగానే బిల. బిల మంటూ గేటు తోసుకొని వ్యాన్లతో బాటు ఏజెంట్లు అందరూ దిగారు. చాలా ఐకమత్యంతో కోతులను సమానంగా పంచుకొని మరో నిముషంలో కోతుల హాలును ఖాళీ చేశారు. డబ్బు లెక్కించుకుంటూ.. “ఈ విషయం పరమ రహస్యం సుమా..!” అని హెచ్చరించాడు సాంబయ్య.

ఎల్లయ్య తన తల్వార్ కటింగ్ మీసాలను ఎడమచేతి చిటికెన వ్రేలుతో కుడి ప్రక్క దర్జాగా దువ్వుకుంటూ, తన మేధశ్శక్తిని గణించే యంత్రంతో లెక్కలు కట్టించుకోవాలని.. గిన్నిసు పుస్తకంలో తన పేరు నమోదు చేయించు కోవాలని.. కలలుగంటూ తన వాటా కోతులను వ్యానులో ఎక్కించుకొని వాయు వేగంతో వెళ్ళి పోయాడు.

అనుకున్నట్లుగానే మరో రెండు రోజుల్లో కోతి నేటి ధర అక్షరాల మూడు వేలని గేటు ముందు ఫలకంపై ప్రత్యక్షమైంది. మరీ అత్యాశకు పోవద్దని.. క్యూపద్దతి పాటిద్దామని ఏజెంట్లంతా కూడ బలుక్కొని ఎల్లయ్య సారధ్యంలో హుషారుగా ఈలలు వేసుకుంటూ వ్యాన్లలో కోతులతో బాటుగా మంకేశ్వరుని కార్యాలయం ముందు దిగారు ఏజెంట్లు.

మేన్ గేటు తెరచుకొని.. వ్యాన్లన్నీ ఆఫీసు ఆవరణ నాక్రమించి టోకెన్ యంత్రం ముందు వయ్యారంగా క్యూ పద్ధతిలో నిలబడ్డాయి. కరెంట్ లేదేమో..! టోకెన్ యంత్రంలో లైట్లు వెలగడం లేదని అనుకున్నారు కాసేపు. మరి కాసేపయాక శ్రద్ధగా చూసేసరికి టోకెన్ యంత్రం కాస్తా బ్రోకెన్ యంత్రంలా కనబడింది. అప్పటికే ఆఫీసు ఖాళీ అయినట్టు అలికిడిలేమితో అర్థమైంది. కోతులతో నిండి పోయిన కార్యాలయ ప్రాంగణం.. వాని కిచ,కిచ ధ్వనులలో ఏజెంట్ల ఏడ్పులు మిళితమై పోయాయి.

మళ్ళీ కోతుల కవాతులతో కళ, కళ లాడింది కోతులనడుమ. *

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు