ఆ కొందరి వలన - గంగాధర్ వడ్లమన్నాటి

Aa kondari valana

జడ్జి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక చూసి “మొదలు పెట్టండి” అన్నారు.

“థాంక్ యు యువరానర్, ఈ ముద్దాయి వంక ఓ సారి పరీక్షగా చూడండి”.

“ఏం, అతనేవన్నా సల్మాన్ ఖానా”.

“కాదు, స్మగ్లర్ మేన్” .

“అలాగా! అయితే మాత్రం అతని ముఖంలో ఏమైనా సాక్ష్యం కనబడుతుందా ఏమిటి! ,నేను అతని ముఖం వంక తీక్షణంగా చూడటానికి. పైగా వీడి మొహం చూసి వీడు నేరం చేసాడో లేదో చెప్పడానికి నాకు ఫేస్ రీడింగ్ కూడా తెలీదు” చెప్పారు జడ్జి గారు

“అది కాదు యువరానర్, ఇతను ఇది వరకు కూడా ఇలాగే నేర చరిత్ర కలిగినవాడు. కొద్ది నెలల క్రితం, ఇతను ఓ జ్యూలరీ షాపులో దొంగతనం చేసిన దొంగ బంగారం, దొంగతనంగా అమ్మబోతుండగా, పోలీసులు కూడా దొంగల్లా వెళ్ళి ఈ దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, దొంగ సొమ్ముని పంచుకున్నారు” అని నాలుక కరుచుకుని “అదే పట్టుకున్నారు .అప్పుడు మీరు ఇతనికి మూడు నెలలు జైలు శిక్ష కూడా విధించారు. కానీ దొంగకి దొంగ బుద్దులు ఎక్కడికి పోతాయి ,అందుకే మళ్ళీ పోలీసులకి పట్టుబడ్డాడు”.

ఆ మాటలు విన్న జడ్జిగారు “అంటే, నాడు వీడు చెప్పిన మాటలు విని, వీడు ఓ మంచి గాడిలో పడి మారతాడని నేను కూడా ఎంతో నమ్మాను .కానీ మళ్ళీ ఇలా దొంగతనం చేసి పట్టుబడతాడనుకోలేదు. పప్పీ షేమ్ .ఇంతకీ ఈ సారి ఏం దొంగతనం చేసావ్ చెప్పు” అడిగారు జడ్జిగారు కోపంతో ఊగిపోతూ.

“నేను దొంగతనం చేయలేదండీ”.అమాయకంగా చెప్పాడు ముద్దాయి

“అలాగా” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక చూస్తూ “ఇతను చెప్పింది నిజమేనా” అడిగారు.

“అవును సార్ ఇతను చెప్పింది నిజమే. ఇతను దొంగతనం చేయలేదు. కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు” చెప్పారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు .

ఆ మాటలు విన్న జడ్జిగారు ఇంకా ఎర్రగా చూస్తూ , “అంటే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు , దొంగ ముదిరి స్మగ్లర్ అయ్యావన్నమాట. సిగ్గు లేదూ ,అయినా నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరా” అడిగారు జడ్జి గారు .

ఆ మాట వింటూనే ఆ ముద్దాయి గజ గాజా వణికి పోతూ, “వద్దు మహా ప్రభో వద్దు, నేను ఇక జీవితంలో నా తరపు వాదించడానికి లాయర్ ని పెట్టుకోను గాక పెట్టుకోను.ఈ నేరం నేనే చేశాను .నాకు శిక్ష విధించండి చాలు.ఆనందంగా గడిపేస్తాను. అలా కాదు అంటే, నాదో విన్నపం ” చెప్పాడు బిక్క మొహంతో

“ఏవిటది! .కొంపదీసి నీ కేస్ నువ్వే వాదించుకుంటానంటావా ఏవిటి ఖర్మ” అడిగారు జడ్జిగారు అతని వంక అసహనంగా చూస్తూ.

“అవును సార్, అదే చేస్తాను” చెప్పాడు

“ఏం! ఎందుకలాగా?” .

“ఆ విషయం మీకు తెలియాలంటే, నేను కొంచెం వెనక్కి వెళ్ళాలి”.అంటూ మూడు అడుగులు వెనక్కి వేసి బోను దిగిపోయి, “అది మే మాసం. ఎండలు బాగా మండుతున్నాయి.మావిడి పళ్ళు దొరికే కాలం. ఆవకాయ్ పెట్టుకోవడం కోసం అతివలు ఆబగా ఎదురు చూసే కాలం”. అని ముద్దాయి ఇంకా ఏదో చెప్పేంతలో

“వద్దు, వర్ణనలు వద్దు. సూటిగా చెప్పు చాలు. అలాగే, నీ గతం చెప్పాలంటే నువ్వు వెనక్కి వెళ్లక్కరలేదు.నీ ఆలోచనలు వెళితే చాలు” చెప్పారు జడ్జిగారు

“సారీ సార్”,అని బోనులోకి వచ్చి “ పోయిన సారి, నా దొంగతనం కేస్ వాదించడానికి గాను ఓ లాయర్ ని పెట్టుకున్నాను. అతను అత్యాశతో, నా దగ్గర నుండి కొంచెం కొంచెంగా, మొత్తం నా డబ్బంతా లాగేసాడు.అయినా అతని ఫీజు తీరలేదు.ఇక ఆయన ఫీజు చెల్లించలేక ,అతని హింస భరించలేక, స్మగ్లింగ్ చేసి అతని బాకీ తీర్చేద్దామనుకున్నాను .అది చేస్తూ ఇలా పట్టుబడిపోయాను.ఆ లాయర్ ని ఓ సారి పెట్టుకున్నందుకే దొంగని స్మగ్లర్ ని అయ్యాను .మళ్ళీ ఈ కేస్ కి కూడా మరో లాయర్ ని పెట్టుకుంటే ,ఈ సారి స్మగ్లర్ ని కాస్తా ఖూనీకోరు గా మారిపోవాల్సి రావొచ్చునేమో! .అందుకే నేను లాయర్ ని పెట్టుకోను” చెప్పాడు ముద్దాయి ఏడుపు మొహంతో.

జడ్జి గారు కొంచెం సేపు ఆలోచించి , “ఛ ఛ , ఇలాంటి కొందరి వల్ల, అందరి లాయర్లకీ చెడ్డ పేరు”అనుకున్నాడాయన మనసులో

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి