సూర్యకాంతం దిగి వచ్చినవేళ - శ్రీమతి పత్రి అంతర్వేది

Suryakantham digi vachchina vela

సాయంకాలం బీచ్ రోడ్ లో అని రాస్తూ ఉంటే, చాలా ఆనందంగా ఉంటుంది,కాని నడుస్తుంటే ఆ ఉక్కపోత , జనం హడావిడి చాలా ఇబ్బంది అనిపించక మానదు. ఇలా తలా తోక లేని ఆలోచనలతో ముందుకు నడుస్తున్నాను. ఇంతలో ఏదో కలకలం, చూస్తే ఏదో సభ, చూద్దామని దగ్గరికి వెళ్తే బ్యానర్ మీద శ్రీమతి సూర్యకాంతమ్మ గారి సన్మానం అని ఉంది. ఏమీ బోధపడలేదు. తీరా దగ్గరికి వెళ్తే సాక్షాత్దూ మన సూర్యకాంతం గారు,ఆవిడ ఎడమచేత్తో విసినకర్ర తో విసురుకుంటూ గలగలా మాట్లాడుతూ కనిపించేరు.ఏమీ అర్థం కాలేదు. ఆవిడ ఇప్పుడు లేరు కదా అనే అయోమయం. దగ్గరగా వెళ్లి చూద్దామని వెళ్ళేను,కాని ఇంతలో సూర్యకాంతం గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్న మాటలు మైక్ లో వినిపించింది.ఎటూ సభ ప్రారంభం అయ్యింది కదా అని ఒక కుర్చీ లో కూలబడ్డాను.ఇక సూర్యకాంతమ్మ గారి ప్రసంగం మొదలయింది.'మీ అందరికి నన్ను చూస్తే ఆశ్చర్యం, ఆనందము వాటన్నిటితో పాటు కాస్త భయం అని నాకు తెలుస్తోంది. స్వర్గం లో నేనూ మన భానుమతి గారు కలిసే ఉంటాము. పాత రోజులు తల్చుకుంటూ, మా పాత్రల లో ఆమె గడసరితనము, నా గయ్యాళి తనము మాకు చాలా సరదాగా ఉంటుంది. అయితే యీ మధ్య భూలోకము నుండీ కొత్త గా వచ్చిన ఒక అమాయకపు అత్త కనిపించింది. ఆవిడ తను పడిన బాధలు చెపుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఇదేమిటని అడిగితే నారదులవారు క్లుప్తంగా అమ్మా భూలోకము లో అత్తల తరం పోయి కోడళ్ల తరం వచ్చిందిప్పుడు అన్నారు. యీ మార్పేమిటో కళ్లారా చూడాలనిపించింది. నేను యమధర్మ రాజు గారిని నా ధోరణిలో కాస్త గడగడ లాడిస్తే నన్ను చిత్రపుగుప్తుల వారి వద్దకు పంపేరు. ఆయన తన లెక్కలు తిరగతోడుకుని నాకు ఆయుష్షు ఇంకా 24గంటలు ఉన్నాయని తేల్చేరు. ఉన్న సమయం కొంచెము కాబట్టీ కొందరి అత్తలతో మాట్లాడి నాకు తోచిన సలహాలు యివ్వాలనే నా యీ ప్రసంగం. మే ము ఇన్నాళ్లు భూలోకం లో లేము, అత్త పేరు చెప్తే భయపడా ల్సిన కోడళ్ళు యింత గా మారటము నా అవగాహన ను మించివుంది. అందుకని కొందరు అత్తగార్లను మాట్లాడమని కోరుతున్నాను ' అంటూ ఆమె తమ తొలి పలుకులని ముగించారు. మొదటగా ఒక ఆవిడ ఉత్సాహం గా వేదిక పైకి వచ్చింది. సుమారు ఏడు పదులు దాటి ఉండాలి, అమరిక గా ఉన్నారు చీర, చక్కని తలకట్టు తో ముచ్చట గా ఉన్న ఆమెని చూసి యీవిడ కష్టాలు పడుతున్న అత్త అయి ఉండదు అని పించింది. ఆమె ప్రసంగం ఇలా సాగింది.'మేము పాత తరం వాళ్ళము కాము, కోడళ్ళని సాధించటము మా దృష్టి లో అనాగరికము. అందుకని మేము కొడుకు కోడళ్ల విషయాల్లో కలుగజేసుకోము, ఒకప్పుడు మేమూ ఉద్యోగస్థులం కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అర్ధం చేసుకోగలము. పైగా ఆర్ధిక స్వావ లంబానతో యీ వయసులోకూడా స్వతంత్రముగా మెలుగుతున్నాము. అయితే ఇప్పుడు మా సమస్య ఒంటరితనం. కొడుకులు కోడళ్ళు వాళ్ళ ప్రపంచము వేరే అయ్యింది. వాళ్ళ జీవితపు నిర్ణయాలు వారివే, మా సలహాలు అనవసరం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో లో మా కు స్థానం లేదని చెప్పాలి. ఒకే ఇంటిలో ఉన్నా కోడలు మాట్లాడటములో పొదుపుని పాటిస్తుంది. భార్య ని అనుసరించక పోతే వచ్చే ఇబ్బంది కలగకుండా కొడుకు తన జాగత్ర లో ఉంటాడు. ఇక మనుమలు వాళ్ళ చదువులు, వ్యాపకాలు, విడియో గేమ్స్ ప్రపంచము లో ఉంటారు. వాళ్ళకి తాత, మా మామ్మల తో కొంచెం సేపు కాలం గడపాలని వాళ్ళ తల్లితండ్రులు చెప్పరు. ఇక అనారోగ్యం అయితే పనివాళ్ళు, అవుసరం అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండనే ఉన్నాయి ' అంటూ ముగించింది. సంప్రదాయం గా కట్టుబొట్టు ఉన్న మరొక మహిళ మాట్లాడానికి ముందుకు వచ్చింది. 'మేము మధ్య తరగతి వాళ్ళము, భర్త సంపాదిస్తూ ఉంటే, పిల్లల్ని, అత్తా మామల్ని చూడటం మా బాధ్యత గా అనుకునే వాళ్ళము. పిల్లల్ని శ్రద్ధ గా చదివించటం, వారికీ ఏ లోటు రాకూడదని ఎన్నో సర్దుబాట్లు. వాళ్ళు బాగా చదవాలని, అభివృద్ధి చెందాలని, విదేశాల్లో వెళ్లి స్థిరపడాలని, ఎన్నో ఆశలు. అలాగే అన్ని సవ్యం గా జరిగేయి. వారిని చూస్తే మా శ్రమ ఫలించిందనే తృప్తి. కాని కొడుకు ఇంటిలో తమ స్థానము అతిధి పాత్రకి పరిమితమయ్యిందా అని అసంతృప్తి. కోడలు తల్లి తండ్రులున్నంత స్వతంత్రంగా తో ఉండలేక పోతున్నామా అనే వెలితి మమ్మల్ని బాధిస్తుంది. ఆదరణ లేక కాదు కాని అతిధులమా అనుకుని బాధపడుతూ ఉంటున్నాము పాత సినిమా లలో మీ గయ్యాళి పాత్ర లని హర్షించము కాని గుర్తింపు కావాలనుకోవటము అత్యాశ కాదు కదా 'అని ముగించింది. సభలో చెప్పట్ల సద్దు మణిగేక మరొక మహిళ వేదిక పైకి వచ్చింది. చూడటానికి ఆధునికంగా కనిపించింది. 'ఉత్తమురాలు, గుణవంతురాలు అనే బిరుదులు కొట్టగలిగే అవకాశము ఉన్నవాళ్ళము. సమిష్టి కుటుంబ వ్యవస్థకి అతి దూరముగా ఉంటూ పెద్దవాళ్ళమైనవాళ్ళము. ఉద్యోగపు ఊళ్ల లో ఒంటరి కాపరాలు వెలగబెడుతూ, ఏడాది కి ఒకసారి లేక రెండు సార్లు అత్తవారింటి కి,పుట్టింటి కి రాగలిగిన వాళ్ళము. మా తక్కువ సమయం లో అందరి తో సరదాగా గడపగలిగిన వాళ్ళము. మా వలన ఏదయినా అసంతృప్తి కాలిగినా,మా అత్త గారు ఆడపడచులకి, దానిని బహిర్గతము చేయటానికి సమయం ఇవ్వని వాళ్ళము. యీ మా తరము లో కోడళ్ళు మాకు అందనంత దూరము లో ఉంటూ computerలో మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళ కి మా పై అనుగ్రహం కలిగి మాట్లాడితే వరము అనుకోగలిగిన వాళ్ళము. మరి మేము గుణవంతురాళ్ళమే కదా.' యిలా తనలోని అసంతృప్తిని వంగ్యముగా ప్రకటించింది లా ఉంది అనిపించింది. ఇక అధ్యక్షుల వారి సందేశం ప్రారంభమైంది. ' నేను సూర్యకాంతం గా కంటే గయ్యాళి అత్తగానే మీ అందరికి పరిచయం, కాని నేను నా నా నిజ జీవితం లో ఒక ఆదర్శ అత్త గా కాని, నా పాత్రలలో ఉన్నట్టు గయ్యాళి అత్త గా కాని, అవకాశం పొందలేకపోయాను. నేను నటించే టప్పుడు కొత్తగా కాలేజీ లో చేరిన స్టూడెంట్స్ ని రేగింగ్ చేస్తే కలిగే ఆనందం కలిగినట్టు, సరదాగా ఉండేది. కాని మీ మీ సమస్య లను వింటుంటే, యీ అత్తకోడల్లా వర్గ పోరాటాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే, నాకు ఏమనిపిస్తున్నదంటే, నా మనసుకి తోచిన కారణమూ ఒకటే, అది ఆడవాళ్లలో ఉండే అతిగా ప్రేమించే గుణమనిపిస్తోంది. భార్యగా తల్లిగా, చెల్లిగా మగవాళ్ల పట్ల మనఅతి ప్రేమ ఒక possesive నేచర్ కలుగజేస్తుంది, ఫలితం గా, మనం ప్రేమించే వ్యక్తి దగ్గరనుకుంటే ఒక తృప్తి, దూరం గా ఉన్నాడనుకుంటే కలిగే అసంతృప్తి కలిసి అత్త కోడళ్ల మధ్య ఒకరకమయిన దూరం పెరగటమే యీ సామజిక పరిస్థితిని సృష్టించేయని అనుకోవాలి. అన్నము పెట్టని కోడళ్ళని, కిరసనాయిలు డబ్బావెతుకున్నే, దుర్మార్గపు అత్త లని మార్చాగలిగే తాయిత్తు ఎక్కడ ఉండదు. కాని యీ పురుషధిక్యపు వ్యవస్థలో, స్వంతంత్ర భావాలున్నాయి, అనుకుంటూ విద్యాధికూలైన మహిళ్లలో కూడా కొంత ఆత్మ నూన్యత ఉందేమో ఆలోచించండి. పురుషుడే కేంద్రము గా అనుకుంటూ అతనిని మెప్పించే విషయము లో మనదే పై చేయి అనుకోవటం లోనే కదా అత్త కోడళ్ల యీ వర్గ పోరాటం కలుగుతుందని, గుర్తుంచుకోండి. అత్తలూ భారతము లో ఉన్న 'ఒ రులయవి ఒనరించిన 'అన్న పద్యాన్ని అర్థము చేసుకొని గుర్తుపెట్టుకోండి, మనకి అత్తవారింటిలో కలిగిన అసంతృప్తిని మన కోడళ్లలో కలుగజేయకండి. కోడళ్ళు,మీ తల్లిపట్ల మీ వదినల ప్రవర్తన విమర్శించే ముందు మీరు మీ అత్తల తో ఎలా ఉంటున్నాము అని ఆలోచించాలి కదా. మా అల్లుడు బంగారం, అమ్మయి మాట వింటాడు,కాని కొడుకే చవట పెళ్ళాం కొంగు వదలడు, అనే చవుకబారు ఆలోచనల్ని మానండి.'అంటూ మన సూర్యకాంతమ్మ గారు తమ సుదీర్ఘ ప్రసంగం ముగించేరు. చప్పట్ల హోరు తో నాకు మెలకువయింది. కాసేపు అయోమయం, కాని యీ కలని మర్చిపోకూడదని కాగితం పై పెట్టాలనిపించింది. యీ అసంబంధ్ధమయిన, లేదా అర్ధవంతమైన కలకి కారణం తెలిసింది. నిన్న సాయంత్రము మా అబ్బాయి వాళ్ళ ఇండియా ప్రోగ్రాం తెలిసింది. కుటుంబం అంతా ముందు కోడలి పుట్టింటిలో దిగి అత్తా మామలతో కలిసి టూర్ ప్రోగ్రాం నిర్ణయించుకొన్నారని, మాతో చివరగా ఒక వారము రోజులు మాత్రమే ఉంటారని తెలియగానే వినగానే, నాకు కలిగిన ఆశభంగము, బాధ ఫలితం యీ కల, కాని సూర్యకాంతమ్మ గారి సలహా పాటిస్తూ కొడుకు కోడళ్ళ బిజీ జీవితాల్లో కాస్త మార్పు గా యీ టూర్ ప్రోగ్రాం వాళ్ళని రిలాక్స్ చేస్తుంది అని అనుకోగానే నా మనసు తేలిక పడింది.

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ