చావంటే భయమా! (పిల్లల కథ) - చెన్నూరి సుదర్శన్

Chavante bhayama

పూర్వం బండారుపల్లి అనే ఒక చిన్న పల్లెటూరుకు ఆనుకుని ఉన్న చిట్టడవిలో ఒక ఎలుగు బంటి ఉండేది. అందులో మరే ఇతర క్రూరమృగాలు లేకపోవడంతో అడవి అంతటికి తనే మహారాజనని ప్రకటించుకుని.. దర్పంతో విర్రవీగేది. దినం, దినం దాని ఆగడాలు మరింత మితిమీరి పోసాగాయి. ఈ మధ్య దాని ప్రవర్తనలో ఒక వింత ధోరణి కనబడసాగింది. అది అల్పజీవులపై దాడి చేసినప్పుడు వాని ముఖంలోని చావుభయం చూసి మురిసి పోయేది. “చావంటే భయమా!” అని వెక్కిరిస్తూ.. వాని ముఖంలోని భయాన్ని అనుకరించేది. అలా వాని ప్రాణాలతో కాసేపు చెలగాటాలాడి ఆ తరువాత చంపి తినేది.

ఒక రోజు అల్పజీవులన్నీ సమావేశమై వాని ప్రాణరక్షణ కోసం ఒక పథకం పన్నాయి. ఆ పథకాన్ని ఎలుగుబంటికి చేరవేసే పనిని కుందేలుకు అప్పగించాయి. కుందేలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు, బిక్కు మంటూ ఎలుగుబంటి వద్దకు వెళ్ళింది.

“మహారాజా..!” అని సంబోధించగానే బూరెలా ఉబ్బిపోయింది ఎలుగుబంటి.

‘ఊ..! చెప్పుకో..!’ అన్నట్టు రాజసంగా చూసింది.

“మహారాజా తమరు దాడి చేసినప్పుడు మాలాంటి అల్పజీవులముఖాలాలో భయం అతి స్వల్పంగా కనబడుతుంది. అదే మనుషుల మీద దాడి సలిపితే వారి చావుభయంతో మీకు పదింతల ఆనందం కలుగుతుంది” అని వివరించింది.

“నువ్వు అన్నది ఎంత వరకు నిజమో!. ఒక సారి భయపెట్టి చూస్తాను. నిజం కాలేదనుకో నీ భరతం పడతాను “ అని బెదిరించింది ఎలుగుబంటి.

బండారుపల్లిలో నివసించే ప్రజలు ప్రతి వస్తువుకూ.. కాస్త పెద్ద గ్రామమైన ములుగు వెళ్తూండడం ఎలుగుబంటి రోజూ చూస్తూనే ఉంటుంది. కాని మనుషుల జోలికి ఎన్నడూ వెళ్ళేది కాదు. ఇప్పుడు కుందేలు చెప్పాక మనుషులను భయపెట్టి వారి చావు భయాన్ని కళ్ళారా చూడాలనుకుని నిర్ణయించుకుంది.

మరునాడు కనుమసక సమయంలో ఒక చెట్టు చాటుకు నక్కి ఒంటరిగా వచ్చే వాని కోసం ఎదురి చూడసాగింది. ఇంతలో ఒకడు తల మీద మూటతో రావడం గమనించి ఒక్కసారిగా వానిపై దూకింది. వాడు గజ, గజా వణకుతుంటే నృత్యం చేసింది. వాని ముఖకవలికలను ఎకెసక్కెములాడుతూ.. తను ఎన్నడూ పొందని సంతోషాన్ని పొందింది. వాడు భయంతో వాని మూటలో ఉన్న తినుబండారాలిచ్చి తనను విడిచి పెట్టాల్సిందిగా వేడుకున్నాడు. వాటిని చూసి ముచ్చట పడింది. అవి కొత్తగా కనబడ్డాయి రుచికరంగానూ ఉన్నాయి. అతణ్ణి విడిచి పెట్టింది. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అని మనసులో నవ్వుకుంది. మనుషుల్లోని చావుభయం చూడొచ్చు.. వారిచ్చే రక రకాల తిండీ తినవచ్చని సంబర పడింది.

ఇక అల్పజీవుఅల వెంట పడకుండా మనుషులపై దాడి చెయ్యసాగింది. దాంతో ప్రజలు ఎలుగుబంటి కోసం ఏదైనా వంటకం చేసుకుని ఇచ్చి తమ పనులు చక్కబెట్టుకునే వారు. కాని అందరికీ అది సాధ్యం కాదు కదా..! ఎలుగుబంటి ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమయ్యే వారు.

బండారుపల్లిలో భద్రమ్మ అనే ఒక ముసలమ్మ బూరెలు చేసి ములుగు వెళ్లి అమ్ముకొని జీవించేది. ఆమెకు ఎలుగుబంటి విషయం తెలిసి ఆమె వ్యాపారం కుంటుపడకుండా ఒక ఉపాయం పన్నింది.

ఒక రోజు భద్రమ్మ ఖాళీ గంప నెత్తిమీద పెట్టుకుని ములుగుకు బయలుదేరింది. అదను చూసి భద్రమ్మపై ఎలుగుబంటి లంఘించి భయపెట్టింది.

“ఏం ముసలవ్వా? చావు అంటే అంత భయమా?” అంటూ ఎగతాళి చేసింది.

భద్రమ్మ కాస్త ధైర్యం తెచ్చుకుని.. “ఈ రోజు నేను మర్చి పోయి నీకోసం ఏమీ తీసుకు రాలేదు. ఇంట్లో సరకులు నిండుకున్నాయి. ఈరోజు ములుగు వెళ్లి సరుకులు తెచ్చి బూరెలు చేసి నామనుమనితో పంపిస్తాను” అని నమ్మపలికింది.

బూరెలు అని కొత్త పదం వినగానే ఎలుగుబంటికి నోరూరింది.

“బూరెలు తప్పకుండా పంపాలి. లేదా నీ అంటు చూస్తాను” అని బెదిరించి భద్రమ్మను విడిచి పెట్టింది.

భద్రమ్మ మనసు భగ్గుమన్నది. ఇంటికి వచ్చి.. ఎలుగుబంటికి చావుభయంతో బాటు ఎలా బుద్ధి వచ్చేలా చెయ్యాలో.. తన మనుమడు మనోహరుకు వివరించింది.

ఆ మరునాడు మనోహరు ఒక నులుక మంచం తీసుకుని అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు నీడన వాల్చుకుని పడుకున్నాడు. నిద్రపోతున్నట్టు నటిస్తుండగా ఎలుగుబంటి వచ్చింది. భద్రమ్మ చెప్పిన ఆనవాలు ప్రకారం వచ్చిన వాడు ఆమె మనుమడే అని గుర్తించింది. కాని అలా నిర్భయంగా పడుకోవడం పైగా బూరెలు తేకపోవడం.. దానికి చెప్పలేనంత కోపం వచ్చింది. వీనికి చావుభయం చూపించాలని మంచం కిందకు దూరి వీపుతో లేపి.. ఒక పాడుబడ్డ బావి వద్దకు పరుగు తీసింది. బలాన్నంతా పుంజుకొని మంచాన్ని బావిలోకి తోసేసింది. అప్పటికే ఎలుగుబంటి జూలును మంచానికి ముళ్ళు వేసి.. బావిగోడలపై వేళ్ళాడుతున్న మర్రిచెట్టు ఊడలను పట్టుకొని మనోహరు తప్పించు కున్నాడు.

ఎలుగుబంటి మంచంతో సహా బావిలో పడిపోయింది. ఈ హఠాత్పరిణామానికి ఎలుగుబంటి భయంతో కంపించి పోయింది. నీళ్లలో మునుగుతూ ఇక చావు తప్పదు అనే ఆలోచన మదిలోకి రాగానే.. చావు అంటే ఎంత భయంకరమో! తెలిసి వచ్చింది. బావి నీళ్లలో తన చావుకళ ముఖాన్ని చూసి కన్నీరు కార్చింది. ‘మనుషులకయినా జంతువులకయినా ఒకటే ప్రాణము.. దానిని కాపాడుకోవాలే గాని ఒకరి ప్రాణాలు తీయవద్దు.. భగవంతుడా నన్ను మన్నించు..’ అంటూ భగవన్నామస్మరణ చేయసాగింది.

మనోహరుకు పాపమనిపించింది. భద్రమ్మ చెప్పినట్టు జంతువులను చంపడమూ నేరమే. సాహసించి మర్రిఊడల సాయంతో బావి అంచుల గుండా వెళ్లి మంచాన్ని ఒడిసిపట్టాడు. కష్టపడి ఎలుగుబంటిని కాపాడాడు.

ఎలుగుబంటి వెనుక కాళ్లపై నిలబడి ముందు కాళ్లతో దండం పెట్టింది. ఇక ముందు ఎవరి జోలికీ వెళ్లనని అడవిలోని కందమూలాలు తింటూ జీవనం కొనసాగిస్తానని వెళ్లి పోయింది. *

మరిన్ని కథలు

Taram maarindi
తరంమారింది
- శింగరాజు శ్రీనివాసరావు
Rest rooms
రెస్ట్ రూమ్స్
- చెన్నూరి సుదర్శన్
Anumanam
అనుమానం
- తటవర్తి భద్రిరాజు
Kottalludu
క్రొత్తల్లుడు
- మద్దూరి నరసింహమూర్తి
Prakruthi malachina shilpalu
ప్రక్రుతి మలిచిన శిల్పాలు
- వెంకట రమణ శర్మ పోడూరి
Manasuke manchi toste
మనసుకే మంచి తోస్తే
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu