వజ్రాల దొంగ - Srinivas Kasturi

Vajrala donga

కెనడా దేశంలో, టొరంటో మహానగరానికి వంద కిలోమీటర్ల దూరంలో…ప్రకృతికి దగ్గరగా ఉంది ఆ కాటేజీ. చలికాలపు వారాంతరాలలో విశ్రాంతి కోసం, పార్టీల కోసం తీసుకున్న కాటేజీ.

చలికాలం కాబట్టి త్వరగానే చీకటి పడింది. బయట మంచు మెత్తగా కురుస్తోంది.

“గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ పార్టీ కి వచ్చిన మీ అందరికి థాంక్స్” అన్నాడు రాజేంద్ర, నిలబడి కోర్ట్ సర్దుకుంటూ. పక్కనే అతని భార్య వీణ పట్టు చీరలో పట్టపురాణిలా ఉంది. విశాలమయిన హాల్లో, వీరితో పాటు మరో మూడు జంటలు ఉన్నాయి.

“మిమ్మల్ని ఆహ్వానించిన కారణం మా పెళ్లిరోజు అన్న సంగతి మీ అందరికి తెలుసు.” రాజేంద్ర చెబుతున్నాడు

“పుణ్యభూమిలో యావజ్జీవ కారాగార శిక్ష కూడా పద్నాలుగేళ్లే బ్రదర్” అన్నారు ఎవరో…. అందరూ నవ్వులు

రాజేంద్ర కూడా నవ్వి,"ఇలాగే ఇంకో ఆరు జన్మలు తప్పదు బ్రదర్…” అంటూ తన కోటు జేబులో నుండి చిన్న పెట్టెని తీసి వీణకి ఇచ్చాడు. ఆమె అది అందుకుని తెరిచి చూస్తే, అందులో ఒక చిన్న వెల్వెట్ సంచి ఉంది. ఏమిటిది అన్నట్టు చూసింది. తెరిచి చూడమన్నట్టు సైగ చేసాడు. అది విప్పి లోపల చూడగానే ఆమె మొహం విప్పారింది. అందులో మిల మిలా మెరిసే వజ్రాలు....మొత్తం 15, వివాహం అయిన ఒక్కో సంవత్సరానికి ఒక్కో వజ్రం.

రాజేంద్ర వజ్రాల వ్యాపారి. దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారస్థులలో అతనొకడు. ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికా నుండి ప్రత్యేకంగా తెప్పించిన వజ్రాలు అవి.

"థాంక్యు రాజ్" మెరిసే కళ్ళతో చెప్పింది వీణ, వజ్రాలతో పోటీ పడుతున్నట్టు వెలిగిపోతున్న మొహంతో. "హ్యాపీ వెడ్డింగ్ యానివెర్సరీ" అన్నాడు రాజేంద్ర.

“ఈ శుభ సందర్భంగా ఒక చీర్స్ కొట్టాలి” అంటూ లేచాడు వెంకట్. అతనితో పాటు వినోద్, ప్రసాద్ కూడా గ్లాసులు పట్టుకుని లేచారు. అందరూ చీర్స్ కొట్టారు.

ఆడవాళ్ళంతా వీణ చుట్టూ చేరారు ఆ వజ్రాలను చూడడానికి.

పిల్లలు పక్క గదిలో ఆడుకుంటున్నారు. మనిషి కోతి నుండి పుట్టాడు అన్న సిద్ధాంతానికి ప్రతీకగా ఉన్నారు వాళ్ళు.

వజ్రాల ప్రదర్శన అయ్యాక, వీణ వజ్రాల సంచిని తిరిగి ఆ పెట్టెలో పెట్టి, తన సోఫాకి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది.

అందరూ కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, పార్టీను ఎంజాయ్ చేస్తున్నారు.

అంతలోనే...ధబ్ మన్న శబ్దం.... బిగ్గరగా బాబు ఏడుపు

అంతా ఒక్కసారిగా బాబు ఉన్న పక్కగదివైపు పరిగెత్తారు.

డైనింగ్ టేబుల్ మీద ఎక్కి ఆడుకుంటూ, బాలన్స్ తప్పి కింద పడ్డాడు బాబు. బాబు తల్లి బిందు కళ్ళలో నీళ్లతో బాబును దగ్గరకు తీసుకుని దెబ్బ తగిలిన చోట రుద్దుతూ ఓదారుస్తోంది. ఆమె భర్త ప్రసాద్, బాబును ఆమె నుండి ఎత్తుకుని బాబు ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు.

“పెద్ద దెబ్బేమీ కాదు, మీరు వెళ్ళండి. ఒక్క 5 నిముషాలలో వచ్చేస్తాను” అన్నాడు ప్రసాద్ అందర్నీ ఉద్దేశిస్తూ

అందరూ వెనక్కి వచ్చారు. రాజేష్ వజ్రాలు పెట్టిన పెట్టెని తీసి కోట్ జేబులో పెట్టుకోబోతూ.....ఎందుకో అనిపించి ఒకసారి పెట్టి తీసి, లోపల సంచిలోంచి వజ్రాలు తీసి చూసుకున్నాడు. ఆందోళనతో అతని కళ్ళు పెద్దవయ్యాయి.....అందులో ఉన్నవి…..10 వజ్రాలే.

వజ్రాలు లోపల పెట్టి, చుట్టూ చూసాడు. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటిదాకా తన కళ్ళ ముందే ఉన్న ఆ పెట్టెనుండి, ఒక్కసారి పక్క గదిలోకి వెళ్లి వచ్చాక 5 వజ్రాలు మాయం. అందరూ ఒకేసారి ఆ గదిలోకి వెళ్ళారుగా? మళ్ళీ అందరి కన్నా ముందు తనే వచ్చాడు. ఇదెలా సాధ్యం? ఇప్పుడేం చెయ్యాలి?

***

వణికిపోయాడు రాజేంద్ర. పోయిన వజ్రాల విలువ దాదాపు లక్ష డాలర్లు. పోలీసులకు ఫోన్ చెయ్యాలా? అందరినీ అడగాలా? ఎం చెయ్యాలో తోచడం లేదు.

ఇంతలో అతని ఫోన్ మోగింది. చేసింది సాగర్. తనకు అత్యంత సన్నిహితుడు. పార్టీకు ఈపాటికి వచ్చెయ్యాలి

"ఎక్కడున్నావు సాగర్?" అడిగాడు రాజేంద్ర

"సారీరా, మంచు ఎక్కువ కురవడం వలన కొన్ని రోడ్లు మూసివేశారు. అందుకే వేరే దారిలో రావడం వల్ల లేట్ అయ్యింది" చెప్పాడు సాగర్

అతనితో మాట్లాడుతూ తన లైబ్రరీ రూమ్ లోకి వచ్చి తలుపువేసి, జరిగింది క్లుప్తంగా చెప్పాడు రాజేంద్ర.

అంత విన్న సాగర్, "నేను వచ్చేంత వరకు ఎవరిని బయటకి వెళ్ళనివ్వొద్దు. వచ్చాక ఎం చెయ్యాలో నిర్ణయిద్దాం" అన్నాడు.

పావు గంటలో వచ్చాడు సాగర్. రాగానే అతన్ని లైబ్రరీ గదిలోకి తీసుకు వెళ్లి తలుపు వేసి. జరిగింది వివరంగా చెప్పాడు.

అంత విన్న సాగర్, "వజ్రాల విలువ ఎంత?" అన్నాడు

రాజేంద్ర,"లక్ష డాలర్లు"

"అయితే, పోలీసులకు కాల్ చేద్దాం"అన్నాడు సాగర్

"వీళ్లంతా నా స్నేహితులు. పోలీసులకు చెబితే, వాళ్లందరినీ అనుమానితులుగా భావిస్తారు. పోలీస్ ఇంటరాగేషన్ పేరిట వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు మిగిలిన వాళ్లకు అవమానం,.... ఇబ్బంది" అన్నాడు రాజేంద్ర

"అలా అని నీ లక్ష డాలర్లు వదులుకుంటావా?"అడిగాడు సాగర్

రాజేంద్ర కుర్చీలో నీరసంగా కూర్చుంటూ,"అందుకే నీ సహాయం కావాలి. నువ్వు చాలా తెలివయినవాడివి. ఎవరు చేసారో కనిపెట్టగలవన్న నమ్మకం నాకుంది” అన్నాడు.

“అప్పటిదాకా అందరూ హాల్ లో ఉన్నారు. బాబు కింద పడ్డాక, అందరూ ఒకేసారి డైనింగ్ రూమ్ కు వెళ్లారు. వెనక్కి వచ్చిన వాళ్లలో మొదటి వాడివి నువ్వే. వజ్రాలు మాత్రం హాంఫట్!!!” అన్నాడు ఆలోచనగా సాగర్.

సాగర్ వైపే చూస్తున్నాడు రాజేంద్ర.

“వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఈ గదిలోకి పంపించు. నేను ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. వాళ్ళ పర్సులు, హ్యాండ్ బ్యాగులు కూడా వెతకాలి” అన్నాడు సాగర్

“వజ్రాలు పోయినట్టు నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు. నువ్వేమో వాళ్ళని ప్రశ్నిస్తూ, వాళ్ల వ్యక్తిగత వస్తువులని వెతుకుతాను అంటే బాగోదు. తీసింది ఒక్కరే అయితే మిగిలిన వాళ్ళు తమని దొంగల లాగా చూశామని బాధ పడతారు. చాలా సున్నితమయిన పరిస్థితి ఇది సాగర్. అందరూ నాకు బాగా కావలసిన వాళ్ళే” బాధగా అన్నాడు రాజేంద్ర

“అవును. అందులో ఒకళ్లకు మాత్రం “నీ” వజ్రాలు కావాలి" వెటకారంగా అన్నాడు సాగర్.

“నిజమే. కర్రా విరగ కుండా, పాము చావకుండా ఏదన్నా చేయగలవా?” అన్నాడు రాజేంద్ర

కాసేపు ఆలోచించి. "వాళ్ళకి తెలియకుండా వాళ్ళమీద పరిశోధన చేసి దొంగని పట్టుకుని వజ్రాలు రాబట్టాలి. కష్టమే...కానీ, నేను పట్టుకోలేకపోతే నువ్వు పోలీసులకి తెలియచేయాలి. సరేనా?"అన్నాడు సాగర్.

"సరే, ఆ పరిస్థితుల్లో మరో దారి లేదు కదా...తప్పదు" అన్నాడు రాజేంద్ర.

***

సాగర్ ఈ మధ్యనే అమెరికా నుండి కెనడాకు వచ్చి స్థిరపడ్డాడు. అతనికి అక్కడ ఉన్న వాళ్ళందరిని కలవడం అదే మొదటిసారి. ఒక్కొక్కళ్ళతో పరిచయం చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుతూ తనకి కావలసిన సమాచారం రాబడుతున్నాడు. మధ్యలో రాజేంద్రను, లైబ్రరీ రూమ్ లో కలుస్తున్నాడు.

వినోద్, ప్రసాద్, వెంకట్ లతో జరిగిన సంభాషణల సారాంశం చెప్పాడు సాగర్

“వినోద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. బాగా సంపాదించాడు. అతని స్టేటస్ నలుగురికి తెలిసేలా చెయ్యడానికి తెగ తాపత్రయ పడే రకం…”

“ప్రసాద్ IT రంగంలో ఎదిగి కెనడాలో, అమెరికాలో, ఇండియాలో సంస్థలను స్థాపించి విజయవంతంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇలాంటి పని చేసి దొరికిపోతే అతని ఖ్యాతి దెబ్బతింటుంది. కాబట్టి, అతను కాదు”

“వెంకట్ ప్రొఫెసర్ కాబట్టి ఎప్పుడూ తాను చేసే రీసెర్చ్ గురించి తప్ప, మిగిలిన లౌకిక విషయాలను పట్టించుకోరు. ఈయనను అనుమానించక్కర లేదు”

దానికి రాజేంద్ర,"అవును వీళ్లంతా నాకు ఆప్తమిత్రులు. బాగా స్థిరపడ్డవాళ్లు. వాళ్ళ రంగాలలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్లు. అందుకే పోలీసుల వరకు వ్యవహారం తీసుకువెళ్లనిది" అన్నాడు నీరసంగా

"నేను ఆడవాళ్ళతో కూడా మాట్లాడి నా పరిశోధన పూర్తి అయ్యాక నీకు చెబుతాను" అంటూ లేచాడు సాగర్

పార్టీలో సరదా ఆటలు ఆడుతున్నారు. ఆటలని నిర్వహిస్తున్న ఆడవాళ్ళతో కలుపుగోలుగా ఉంటూ వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. కిచెన్ నుండి తినుబండారాలను తీసుకురావడం, వాటిని ప్లేట్లలో సర్ది అందరికి అందించడం లాంటి పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో, ఒక్కొక్కళ్ళని పరిచయం చేసుకుని, వాళ్ళతో మాటలు కలిపి తన పరిశోధన సాగించాడు.

ఒక గంట తరవాత మళ్ళీ రాజేంద్రతో లైబ్రరీ లో భేటీ.

“వినోద్ భార్య సరళ, ఎం బి ఏ చేసి ఒక బహుళజాతి సంస్థలో డైరెక్టర్ పదవిలో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఆధునిక భావాలు గల స్వతంత్ర మహిళ. ఈమె అలాంటి పని చేస్తుందని నేను అనుకోను”

“ప్రసాద్ భార్య బిందు గృహిణి. తన వ్యాపారాలతో బిజీగా ఉండే ప్రసాద్ కు కావలసినవి సమకూరుస్తూ, పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే గృహిణి. ఇందాక బాబుకి తగిలిన దెబ్బ గురించి ఇంకా ఆందోళన పడుతోంది. ఈ దొంగతనం ఈమె చేసే అవకాశం లేదు”.

“వెంకట్ భార్య శిరీష - తన అందం, డబ్బు, పరపతిని సామజిక మాధ్యమాలలో ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. ఆమెతో పరిచయం అయినా కొద్దీ సేపట్లో తన పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో నన్ను కలుపుకుంది. అందరి దృష్టిలో పడడం కోసం, పొగడ్తల కోసం తెగ తాపత్రయపడుతుంది. ఈమె ఇలాంటి దుస్సాహసం చేస్తుందా? నాకు అనుమానమే? అన్నాడు సాగర్

"వీళ్ళెవ్వరూ చేసే అవకాశం లేదు. కానీ సంచిలో వజ్రాలు మాయం" కణతలు రుద్దుకుంటూ అన్నాడు రాజేంద్ర.

సాగర్ మౌనంగా ఆలోచిస్తున్నాడు.

మళ్ళీ రాజేంద్రే,"అయితే, పోలీసులకు చెప్పక తప్పదంటావా?" అన్నాడు

"ఇంకో విషయం. పోలీసులకు దృష్టికి తీసుకువెళితే, వాళ్ళ అనుమానితుల జాబితాలో నువ్వు కూడా ఉంటావు" చెప్పాడు సాగర్

"అదేంటి? నా వజ్రాలు కదా పోయినవి? నేనెలా అనుమానితుడను అవుతాను?" ఆశ్చర్యంగా అన్నాడు రాజేంద్ర

"నువ్వు తెలిసే అంటున్నావో, తెలియక అంటున్నావో, నాకు తెలియదు కానీ....ఈ వజ్రాలకు నువ్వు ఇన్సూరెన్సు చేయించేవా?" అడిగాడు సాగర్

"అ...అవును"అన్నాడు రాజేంద్ర

"మరి పోయిందని నిరూపణ అయ్యాక, నీకు ఇన్సూరెన్సు డబ్బులు వస్తాయి కదా?. వజ్రాలు నీవే… ఇన్సూరెన్స్ డబ్బూ నీదే" అన్నాడు సాగర్

"బాబూ....ఇంకాసేపు ఆగితే నన్నే దొంగ అని నిరూపించి. పోలీసులకు నువ్వు చెప్పేటట్టు ఉన్నావు" గ్లాసులో ఉన్న మద్యాన్ని ఒక్క గుక్కలో తాగేసి చెప్పాడు రాజేంద్ర

"నాకు ఒక్క గంట సేపు సమయం ఇవ్వు. ఆ తరవాత నీ ఇష్టం"అన్నాడు సాగర్ నిశ్చయంగా

"కానీ మరి. ఈ దొంగ దొరికితే దండేసి దణ్ణం పెట్టాలి” అంటూ గది బయటకి నడిచాడు రాజేంద్ర.

వెనకాల అతన్నే చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న సాగర్

***

సాగర్ పార్టీలో అందరిని గమనిస్తున్నాడు. ఎక్కడన్నా ఒక్క ఆధారం దొరుకుతుందా అని తీక్షణంగా పరిశీలిస్తున్నడు. కొందరితో మాట్లాడుతున్నాడు. కొందరిని గమనిస్తున్నాడు.

ఇక తాను చేయగలిగేది ఏది లేదని అనిపించి, రాజేంద్రకు సైగ చేసాడు లైబ్రరీ గదికి రమ్మని.

నీరసంగా లైబ్రరీ గది వైపు నడవడం మొదలు పెట్టాడు. అలాంటి తరుణంలో.....ఎక్కడో మస్తిష్కంలో చిన్న అనుమానం.....చాలా చిన్న విషయం అది. అలా ఎందుకు కాకూడదు? అదే నిజమయితే? దొంగ దొరికినట్టే.

వెనక్కి తిరిగి మళ్ళీ పార్టీ హాల్ వైపు వెళ్ళాడు.

రాజేంద్ర లైబ్రరీలో సాగర్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొంత సేపటికి సాగర్ వచ్చాడు. అతని మోహంలో విజయగర్వం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

"చెప్పు సాగర్! ఎవరు చేసారు?" ఆతృతగా అడిగాడు రాజేంద్ర

"ఎవరు చేసారో తెలిసింది. కానీ, అది నిరుపిస్తేనే చేసిన వాళ్ళు ఒప్పుకుంటారు, వజ్రాలు వెనక్కి ఇస్తారు. అప్పటిదాకా ఎం చెయ్యలేదని బుకాయిస్తారు కదా?"సాలోచనగా అన్నాడు సాగర్

"నిజమే, నిరూపించగలవా?" అడిగాడు సందేహంగా రాజేంద్ర.

"అవును, ఇక్కడే ఉండు" అంటూ సాగర్ వెళ్ళాడు.

ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది రాజేంద్రకి. బయటకి వెళ్లి ఒక సిగరెట్టు తాగాలన్న కోరికను బలంగా అణిచివేసుకున్నాడు.

సాగర్ లైబ్రరీ వైపు వస్తూ కనిపించదు. వెనకాలే ఒకరు. ఎవరో తెలియడం లేదు.

దగ్గరదాకా వచ్చాక, చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చినది ప్రసాద్ భార్య - బిందు.

నమ్మశక్యంగా లేదు అతనికి. సాగర్ వైపు అయోమయంగా చూసాడు.

సాగర్ రీడింగ్ చైర్ మీద కూర్చున్నాడు. అతని ఎదురుగా కుర్చీలో బిందు. వాళ్ళిద్దరి పక్కన, కిటికీ దగ్గర ఉన్న సోఫాలో రాజేంద్ర ఉత్కంఠతో చూస్తున్నాడు.

"బిందుగారు, కాసేపటి క్రితం రాజేంద్రగారు చూపించిన 15 వజ్రాలలో, 5 వజ్రాలు దొంగతనం చెయ్యబడ్డాయి. మీరు అవి తీసారని నాకు తెలుసు. దయచేసి అవి ఇచ్చేస్తే, మనమందరం ఇక్కడితో ఈ విషయాన్నీ మర్చిపోదాము" అన్నాడు సాగర్

బిందు మోహంలో రంగులు మారాయి. "మీరేం మాట్లాడుతున్నారు? నాకు దొంగతనం చెయ్యాల్సిన అవసరం ఏంటి? నా భర్తకి ఎన్నో పెద్ద వ్యాపారాలున్నాయి. డబ్బూ మాకో లెక్క కాదు. మా బాబుకి గాయం అయ్యిందని మేము బాధ పడుతూ ఉంటే, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు?" అంటూ లేచి నుంచుంది వెళ్ళడానికి.

"మీరే చేసారని నిరూపిస్తే?" అన్నాడు సాగర్ ఆమె కళ్ళలోకి చూస్తూ

"అయితే నిరూపించండి చూద్దాం"ఛాలెంజ్ చేసింది బిందు

"నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే, మీరు వెళ్లిపోవచ్చు" అన్నాడు సాగర్ తన వేలి గోళ్లను చూసుకుంటూ

"నేను సిద్ధమే" అంది బిందు స్థిరంగా

సాగర్ లేచి నిలబడి, అతని వెనక ఉన్న లైబ్రరీ పుస్తకాల వైపు తిరిగి అన్నాడు. "నేను వేసుకున్న చొక్కా రంగు చెప్పగలరా?" అని

రాజేంద్ర జరిగేదంతా విచిత్రంగా చూస్తున్నాడు.

కొన్ని క్షణాలు మౌనం. రాజేంద్ర, సాగర్ ఆమె వైపు చూసారు.

ఆమె అలాగే మౌనంగా చూస్తూ ఉంది సాగర్ వైపు.

"చెప్పలేరు కదా. నేను చెబుతాను వినండి. మీకు వినికిడి శక్తి తక్కువ. చెవిలో మిషను పెట్టుకోవడానికి నామోషీ అనిపించి పెట్టుకోరు. అందుకే నేను అటువైపు తిరిగి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు…. వీణ వజ్రాలు చూపించిన తరవాత అవి తిరిగి ఆ సంచిలో పెట్టి, సోఫా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది. బాబు పడిన శబ్దం, దాని తరవాత ఏడుపు విన్న మిగిలిన అందరూ వెంటనే పిల్లలు ఆడుకుంటున్న గదివైపు వెళ్లారు. ఆ సమయంలో మీరు సెల్ ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు. సహజంగా మీకు వినపడకపోవడం వల్ల మీరు వెంటనే తల ఎత్తి చూడలేదు. అందరూ పరిగెత్తడం గమనించి మీరు లేచారు, టేబుల్ పైన వజ్రాల సంచి చూసాక, దుర్బుద్ధి పుట్టి వెంటనే అది తెరిచి, చేతికి అందిన వజ్రాలు తీసుకుని మీ హ్యాండ్ బాగ్ లో వేసుకున్నారు. అక్కడకి వెళ్ళాక కానీ తెలియలేదు మీ బాబుకి గాయం అయ్యిందని. అందరికన్నా పది సెకనుల తరవాత వచ్చిన మీ “ఆలస్యాన్ని” ఎవ్వరు గుర్తించలేదు. రాగానే బాబు దగ్గర ఉన్నారు కదా. అందరూ, మీరు కూడా తమతో పాటే వచ్చారని అనుకున్నారు.” నెమ్మదిగా చెప్పాడు సాగర్.

రాజేంద్ర, బిందు నిశ్ఛేస్టులై ఉన్నారు.

ముందుగా తేరుకుంది బిందు. తన బాగ్ లో చెయ్య పెట్టి వజ్రాలను బయటకి తీసి, ఎదురుగా టేబుల్ పై పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

రాజేంద్ర వజ్రాలను తీసుకుని, సంచిలో పెట్టి కోటు జేబులో పెట్టుకుంటూ అన్నాడు,"శెభాష్ సాగర్. భలే కనిపెట్టావు. ఇంతకీ ఆమెకు చెముడు ఉందని నీకెలా తెలుసు? అందరితో మామూలుగానే మాట్లాడుతుంది కదా?"అడిగాడు కుతూహలంగా

“వినికిడి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణంగా ఎదుటివాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ల పెదవుల కదలికను బట్టి వాళ్ళు ఏమంటున్నారో గ్రహించగలరు. అందుకే నేను వెనక్కి తిరిగి అడిగిన ప్రశ్నకు ఆమే జవాబు చెప్పలేకపోయింది.” చెప్పాడు సాగర్

వినికిడి శక్తికి, వజ్రాల దొంగతనానికి ఏమిటి కనెక్షన్? అడిగాడు రాజేంద్ర

సాగర్ నవ్వి, “అందరూ ఒకేసారి వెళ్లామని చెబుతున్నారు. ఎవరో ఒకరు ఆఖరున వెళ్లి ఉండాలి. వాళ్ళే తీసి ఉండాలి. అది ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే, ఈమెకు వినపడదు అన్న సంగతి తెలిసింది. వినపడకపోతే, వెంటనే స్పందించలేరు. అందుకే ఖచ్చితంగా ఈమే ఆఖరున వచ్చి ఉండాలి.”

“ఈమెకు వినిపించదని మీకెలా తెలిసింది? అన్నాడు రాజేంద్ర

"నేను ఇంతకు ముందు ఆమెతో మాట్లాడుతూ ఉంటే, ఆమె చూపులు నా కళ్ళ వైపు కాకుండా, నా పెదవుల వైపు ఉండడం గమనించి అనుమానం వచ్చింది. ఇంతలో ఆమె వెనక ఉన్న శిరీష చేతిలోనుండో గ్లాస్ జారి పడింది. ఆమె తొణకకుండా నాతో మాట్లాడుతూనే ఉంది. అప్పుడు నా అనుమానం బలపడింది. బహుశా బాబు కింద పడి ఏడుస్తున్న సమయంలో ఆమె ఫోన్ చూసుకుంటూనో...తన హ్యాండ్ బాగ్ లో ఏదన్నా వెతుక్కుంటూనో....లేక ఏదన్నా కింద పడితే తీసుకుంటుండడమో జరిగి ఉండాలి. అందుకే చీకట్లో బాణం వేసాను.”చెప్పాడు సాగర్

"ఓహో! అందుకేనా మాతో ఫోన్లో ఎప్పుడూ మాట్లాడినా, వీడియో కాల్ చేస్తుంది. అందులో మా పెదవుల కదలికలు మేము చెప్పేది అర్ధం చేసుకుని సమాధానం ఇస్తుంది. వీళ్ళు పరిచయమయ్యి ఒక సంవత్సరం కూడా కాలేదు. అందుకే మాకు అనుమానం రాలేదేమో" గుర్తుచేసుకుంటూ అన్నాడు రాజేంద్ర

"చివరి ప్రశ్న. దొంగతనం ఎందుకు చేసిందంటావు?" అడిగాడు రాజేంద్ర

"వజ్రాలు ఎంతపనయినా చేయిస్తాయి" కిటికీ నుండి బయట కురుస్తున్న మంచుని చూస్తూ అన్నాడు సాగర్

ఇంతలో వీణ అక్కడికి వచ్చి చెప్పింది,"బిందు వాళ్ళు బయలుదేరారు. వాళ్ళబ్బాయికి కళ్ళు తిరుగుతున్నాయట. ఎమర్జెన్సీ కి తీసుకు వెళతామని చెప్పింది"

రాజేంద్ర, సాగర్ మొహాలు చూసుకున్నారు. వీణ అక్కడినుండి వెళ్ళిపోయింది.

ఇక ఆ కుటుంబంతో తమకున్న బంధం తెగిపోయిందని అర్ధమయ్యింది. అప్రయత్నంగా జేబులో వజ్రాలను తడుముకున్నాడు రాజేంద్ర.

అతనికి అనిపించింది. వజ్రాలు, వజ్రాలనే కోసేయ్యగలవు. ఈ బంధాలెంత???

సమాప్తం

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి