అనుకోని అతిధి - వెంకట రమణ శర్మ పోడూరి

Anukoni atidhi

డ్యూటీకి వెళ్ళడానికి డ్రెస్ వేసుకోవడం పూర్తి చేస్తూ, బెల్ట్ బిగించడానికి కుస్తీ పడుతున్నాడు సి ఐ మోహన రావు.

"రోజూ మాంసం తినడం మానేస్తే కాస్త కొవ్వు తగ్గుతుంది " అంది అతని భార్య ఛాయ, హేట్ అందిస్తూ

" నిజమే సర్వీసులో చేరిన కొత్తలో ఎలా ఉండేవాడిని ?" అని పక్కకి తిరిగి అద్ధం లో బొజ్జని చూసుకున్నాడు మరొకసారి

" రాళ్ళ పల్లి సర్కిల్ కి బదలీ ఎంత వరకు వచ్చింది ?" అడిగింది . ఆమె ఆసక్తి ఏమిటంటే. ఆమధ్య ఎదో నగల షాపు వాడు ఒకామెకి ఒంటినిండా రక రకాల నగలు పెట్టి ప్రకటన

పెట్టాడు. అప్పటినుంచి మొత్తం అవన్నీ సేకరించాలని నిశ్చయించుకుంది. మోహన రావు మిగతా ఆస్తులు కూడ పెట్టాడు కానీ, భార్య నగల కోరిక తీర్చలేదు. " ఇదిగో రాళ్ళ పల్లి సర్కిల్ కి బదలీ అవనీ అన్ని కొనుక్కోవచ్చు" అంటున్నాడు ఈ మధ్య . అందుకే ఇప్ప్పుడు ఆవిడ వేసిన ప్రశ్న.

" మంత్రి గారికి ఇవ్వవలిసింది ఇచ్చేశాను కదా ? జిల్లా ఎస్ ఎస్పీ కి అయన చెప్పడమే తరువాయి, కానీ ఇప్పుడున్న ఎస్ ఎస్పీ బదలీ అయిపోయాడు. కొత్త గా వచ్చే ఆయన పేరు

ఇవాళో రేపో తెలుస్తుంది " అన్నాడు బయటికి వెడుతూ .

మోహన రావు పని చేస్తున్న జిల్లాకి విక్రమ్ చంద్ర ని ఎస్ఎస్ పి గా బదలీ చేశారు అన్న వార్త, జిల్లా అంతా దావానంలా వ్యాపించింది. ఎక్కువమంది ఆనందిస్తే, కొంత మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

విక్రమ్ చంద్ర ఎక్కడికి బదిలీ మీద వెళ్లినా అతని కథలు అతని కంటే ముందు అక్కడికి చేరతాయి.

ఏ వ్యవస్థలో లోనయినా, అవినీతి పరులయిన అధికారులు, నిజాయతీ పరులయిన అధికారులు ఉండడం సహజమే. మంత్రులు తమ కున్న రాజకీయ బలం ఆధారంగా,

తమకి కావలిసిన చోట కొంత మంది అధికారులని తెచ్చుకోవడం, చెప్పిన మాట వినని వాళ్లని బదలీ చేయించడం జరుగుతూనే ఉంటుంది. నీతిపరులయిన ఆఫీసర్లకి ఎక్కువ

బదిలీలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అదిగో అలాంటి బదిలీలలో భాగంగానే , పొరుగు రాష్ట్రాలకి సరిహద్దు లో ఉన్న ఒక జిల్లాకి విక్రమ్ చంద్ర ని ఎస్ఎస్ పి

గా పోస్ట్ చేసారు. ఆ వార్త అన్ని వర్గాలలోనూ ముఖ్యంగా పోలీస్ వర్గాలలో కల కలం రేపింది.. నిజాయతీ గా పనిచేసే ఆఫీసర్లు ఆనంద పడితే, అవినీతి తో ఆస్తులు

కూడపెట్టే వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆయన గతంలో ఇదె జిల్లాలో ఏఎస్పీ గా పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. .

విక్రమ్ చంద్ర ఆ జిల్లాకి రావడం, సీఐ మోహన రావు కి పెద్ద సమస్య వచ్చి పడింది. పద్ధతి ప్రకారం, ఎస్ ఏస్ పి, ఏస్ పి, ల స్థాయిలోనే బదిలీ ఆర్డర్లు ఇచ్చినా, సీఐ లని మార్చే

దాంట్లో కూడా ఆ జిల్లా మంత్రి జోక్యం మామూలు. అక్రమ మద్యంతయారీ, గ్యాంబ్లింగ్ డెన్ లు, గంజాయి ఉత్పత్తి, రవాణా, హత్యల నిందితుల ప్రాసిక్యూషన్ వ్యవహారాలు ఇలాంటి

అనేక వాటిలో వచ్చే అక్రమ సంపాదన స్థాయి బట్టి, కావల్సిన సర్కిల్ కి బదలీ కి రేట్లు ఉంటాయి. ఆ జిల్లాల్లో రాళ్ళ పల్లి సర్కిల్ అన్ని విధాలా ఆదాయం పెంచే సర్కిల్. అక్కడికి

బదలీ కోసం చాల పెద్ద మొత్తం సంబంధిత మంత్రి గారికి ముడుపు చెల్లించి, ఆర్డర్లకోసం ఎదురు చూస్తూ ఉండగా, మోహనరావు కి, విక్రమ్ చంద్ర బదలీ నిద్రలేకుండా చేసింది.

" ఈ కొత్త్త ఆఫీసర్ వల్ల బదలీ కుదరదా ?" అంది ఛాయ భర్తతో

" ఎంత స్ట్రిక్ట్ ఆఫీ సరయినా మంత్రి ని కాదనడు. కొత్తాయన వచ్చిన తరవాత మంత్రి ని కలుస్తాను " ఆనాడు ధైర్యం చెబుతూ. పైగా మంత్రి గారు నియోజక వర్గం మోహన్ రావు సర్కిల్

లోనిదె. అందు చేత మంత్రి గారు తన అనుచరులకు సహాయం చేయడానికి మోహన రావు అవసరం చాలా ఉంది. మంత్రిని మెప్పించే పని ఏదయినా చేసి ప్రొమోషన్ కూడా

పొందాలని ఉబలాట పడుతున్నాడు మోహన రావు.

******

విక్రమ్ చంద్ర జిల్లాలో ఛార్జి తీసుకున్న వారానికి , మంత్రి నారప్ప గారు తన నియోజక వర్గం పర్యటన చేసి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడిది చేశారు.

విక్రమ్ చంద్ర , , తన క్రింద ఉన్న విభాగాల అధిపతులతో సమీక్షలో ఉండగా, మంత్రి గారి పిఏ నుంచి ఫోన్ వచ్చింది. " సార్ మంత్రి గారు మిమ్మలిని ఒకమారు వచ్చి కలవమన్నారు"అని.

విక్రమ్ చంద్ర' తన సర్వీసు లో రాజకీయ వేత్తలలో చాలా మంచి వాళ్ళని, అతి నీచులని కూడా చూశాడు. ఎవరినీనొప్పింపకుండానే తన ప్రిన్సిపుల్స్ కి అనుగుణంగానే నడుచు కుంటూ పేరు తెచ్చుకున్నాడు.

సాయంత్రం మంత్రి గారిని కలిశాడు. మంత్రి గారు అవి ఇవి కాసేపు మాట్లాడి న తరువాత, విక్రమ్ చంద్ర వెనక్కి వస్తోంటే, మంత్రిగారు " సిఐ మోహన రావు రాళ్ళపల్లి సర్కిల్ కి బదలీ కావాలంటున్నాడు. నా నియోజక వర్గం లో మంచి పని చేశాడు . కొంచం ఆ సంగతి చూడండి " అన్నాడు

" అలాగేనండి. అతన్ని వచ్చి నన్ను కలవమనండి " అని వచ్చేశాడు విక్రమ్ చంద్ర

అతను తన సర్వీసులో ఇలాంటి వి చాలా చూశాడు. బదలీ లు కానీ, ప్రమోషన్ లలో కానీ, ఇలా పై అధికారులనుంచి ఎవరయినా వత్తిడి తెస్తే, కాదని చెప్పకుండా " ఆ ఆఫీసర్ని రెండురోజుల తరవాత వచ్చి కలవమనండి. అని వచ్చేసేవాడు. ఎప్పుడయితే ఇలా మెసేజ్ అందిందో, ఆ ఆఫీసర్ విక్రమ్ చంద్రని కలిసే ధైర్యం చేసే వాడు కాదు. అలాంటివి అతనిని కలవకుండానే డ్రాప్ అయేవి. ఒకవేళ ఎవడైనా ధైర్యం చేస్తే , వాళ్ళు కలిసి వచ్చి, అక్కడ ఏమి జరిగిందో తెలియదుకాని మిగతా వాళ్ళకి అలాంటి పైరవీలు ఎప్పుడూ విక్రమ్ చంద్ర వద్ద చేయవద్దని సలహా ఇచ్చే వారు. రెండు రోజులు తరవాత ఎందుకు కలవమని చెప్పేవాడో వాళ్ళకి తెలుసు. ఈ రెండు రోజులలో, వాడి మొత్తం హిస్టరీ తెప్పించుకుని, అది ముందర పెట్టుకుని రెడీ గా ఉండేవాడు అయన. ఈయన వద్ద కి వచ్చి కలవడం జీవితం లో చేసిన పెద్ద తప్పు రా బాబు అనుకునేలా చేసేవాడు ఆయన.

ఇవన్నీ మోహన రావు కి తెలుసు . అందుచేత మంత్రిగారి వద్దనుంచి " బదలీ నిమిత్తం" విక్రమ్ చంద్ర ని కలవమని అయన చెప్పగానే ఆశ వదులు కున్నాడు. కలిస్తే ఏమి జరుగుతుందో అతనికి తెలుసు. విక్రమ్ చంద్ర అదే జిల్లాలో ఎఎస్పీగా ఉన్నప్పుడు మోహన రావు కి ఒక చేదు అనుభవం, పైరవీ సందర్భం గా కాదు కానీ, వేరే అయింది.

అప్పట్లో అతను ట్రాఫిక్ డ్యూటీ చేసేవాడు. ఓ కమాటు ఎఎస్పీ గారు రమ్మంటున్నారని కబురు వచ్చింది. ఎఎస్పీ గారు మఫ్టీ లో తిరుగుతూ స్టాఫ్ పనితీరు గమనిస్తున్నారన్న

గ్రేప్ వైన్ నడుస్తోంది. ఏమిజరిగిందిరా బాబు అనుకుంటూ సార్ ని ఆఫీస్ లో కలిశాడు. ఆ రోజు మోహనరావు జీవితం లో మరిచిపోలేడు

ఇంకో ఇద్దరు ఆయన రూమ్ లో ఉంటె వాళ్ళని బయటికి పొమ్మన్నాడు

అప్పటికి మోహన రావు కి బొజ్జ పెరగడం ప్రారంభ మయింది.

" తిండి తగ్గించి కసరత్తు చేస్తే ఆ బొజ్జ పెరగదు . నిన్ను చూస్తే ప్రజలకి రక్షక భటుడు అనిపించాలి భక్షక భటుడు అనిపించకూడదు "

" లేదు సార్, నా శరీర తత్వం వల్ల --- " అని చెప్పబోయాడు

" వెధవ కబుర్లు చెప్పకు . (ఆతరవాత వచ్చిన పదాలు రాసేవి కావు). నీకు రోజూ డ్యూటీ ఎక్కే ముందు, ట్రాఫిక్ జంక్షన్ టిఫిన్ బడ్డీ వాడు టిఫిన్ ఇవ్వాలి, మధ్యలో జంక్షన్ కి పక్కనే సిగరెట్ బడ్డీ వాడుసిగరెట్

పాకెట్ ఇవ్వాలి, ఆఖరున ఇంటికివెళ్ళేటప్పుడు ఖాదర్ మాసం కొట్లో మాంసం. వీటన్నిటిని డబ్బు ఇచ్చి ఎప్పుడయినా పుచ్చుకున్నావా ? ఆఖరుకి, రోడ్డు పక్కన వేరుశనగ కాయలు అమ్మే

ముసలి అవ్వ నీకు పొట్లాలు ఇవ్వాలి. దానిని ఎప్పుడయినా సరిగ్గా చూశావా? కాలే కడుపుతో అది చేసుకునే చిన్న వ్యాపారం చూసి కూడా నీకు జాలి లేదు .

ఆఖరికి పడుపు వ్రిత్తి మీద బ్రతికే లీల బేబీ ని కూడా వదలడం లేదు . నిన్ను తిట్టడానికి నాకు మాటలు దొరకటం లేదు. . ఒక నెలలో నువ్వు పధ్ధతి మార్చుకోపోతే నేను చెప్పను ఏమిజరుగుతుందో.. నీలాంటి వెధవలు వల్ల మొత్తం డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తోంది . ఫో నా కళ్ళ ముందునుంచి " అని అరిచాడు

ఆ తరవాత వారం నిద్దర పోలేదు మోహన రావు. విక్రమ్ చంద్ర ప్రమోషన్ మీద వెళ్లే దాకా, ప్రవర్తన అణచు కొక తప్పలేదు. అణచు కోవడమే, మార్చుకోవడం కాదు. అయన వెళ్లిపోయిన తరవాత రెచ్చిపోయాడు. ఇప్పుడు పెద్ద బొజ్జ ఆ లైఫ్ స్టయిల్ ఫలితమే. ఇప్పుడు మళ్ళీ, మంత్రి గారు కలవమన్నారని వెళ్లి కలవడమే ? ప్రశ్నే లేదు. బదలీ సంగతి మర్చి పోవాలి అనుకున్నాడు. మంత్రి కి సమర్పించింది గోడకు కొట్టిన సున్నమే. దానిని బావమరిది ఇసుక రీచ్ లైసెన్సు కి వాడుకోవాలి అనుకున్నాడు.

మంత్రి గారిని అంత సులువు గా వదిలేయడం మోహనరావు భార్య ఛాయ కి ఇష్టంలేదు. ఆఫ్ట్రాల్ మంత్రి ముందు ఎస్ఎస్ పి ఎంత . అయన తలుచుకుంటే డైరెక్ట్ గా ఆర్డర్ లే

పంపవచ్చు కదా? ప్రభుత్వ వ్యవస్థలో ఎవరికీ అపరిమిత అధికారాలు ఉండవని ఆవిడ గ్రహించలేదు. మోహన రావు మాత్రం ", మళ్ళీ సమయం వస్తుంది అప్పుడు బదలీ ఏమిటి ?

ప్రమోషన్ కే ఆయనని వాడుకుందాము " అని నచ్చ చెప్పాడు

ఎదో భార్య ని ఊరుకోపెట్టడానికి అలా చెప్పినా తన ఉద్యోగం చేసే విధానం లో అలాంటి సందర్భం వస్తుందని అతనికి ఏ కోశానా లేదు.

కానీ ఆశ్చర్యం ఏమిటంటే, అతను ఊహించకుండా ఒక అవకాశం అతనికి ఆరునెలల లోపే వస్తుందని అతను ఊహించ లేదు.

మోహన్ రావు సర్కిల్ హెడ్ క్వార్టర్స్ తట్టి కోన లో ఉంది. అది చుట్టుపక్కల చాలా గ్రామాలకి వ్యాపార కేంద్రం. రాళ్ళ పల్లి తర్వాత చెప్పుకోదగ్గ ఊరు. అక్కడే ఉన్న గోవర్ధన్ చాలా పెద్ద కాంట్రాక్టర్. అతనిని మంత్రి గారి బినామీ అని అందరూ అనుకుంటారు. అతని ఇంట్లో ఒక రాత్రి పెద్ద దొంగతనం జరిగింది.

మర్నాడు అన్ని పేపర్లలోనూ, టీవీ ల లోను ఇదే గొడవ, పైనుంచి విక్రమ్ చంద్రకి ఫోన్ లు వచ్చాయి. దొంగలిని త్వరగా పట్టుకోవాలని. మంత్రిగారు ప్రెస్టీజ్ ఇస్స్యూ గా

తీసుకున్నారని. విక్రమ్ చంద్ర సంబంధిత ఎస్పీ కి చెప్పడం జరిగింది.

******

గోవర్ధన్ ఇంట్లో దొంగతనమ్ జరిగిన రెండోరోజు పూర్తి కాకుండానే, విక్రమ్ చంద్ర ఎదో మీటింగ్ లో ఉండగా, తట్టి కోన ఎస్పి మెసేజ్ పంపాడు " గోవర్ధన్ ఇంట్లో పడ్డ ముఠాలోఒకడిని మోహన్ రావు సిఐ పట్టుకునాడని. మిగతా వాళ్ళకోసం ప్రయత్నం జరుగుతోందని "

ఆ సాయంత్రం విక్రమ్ చంద్ర తన ఇంట్లో టివి చూస్తూ ఉండగా తట్టి కోన లో పట్టుకున్న వ్యక్తిని మీడియా ముందు,ఎస్పి,సిఐ ప్రెసెంట్ చేసిన క్లిప్ వేశారు. మోహన్ రావు ప్రమోషన్కోసం మంత్రి గారి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనుకున్నాడు విక్రమ్ . మీడియా ముందు ప్రెసెంట్ చేసినప్పుడుపట్టుకున్న వ్యక్తి ముఖం మీద గుడ్డ ఉంది.

అతన్ని నిర్బంధించిన తరవాత, రెండురోజులకి, ముద్దాయి ఫోటో తో పాటు , అతను నేరం ఒప్పుకుంటున్నట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ కాపీ కూడా విక్రమ్ చంద్రకి చేరాయి.

ముద్దాయి దగ్గర దొరికిన వస్తువులలో ఒక దానిని గోవర్ధన్ ఇంట్లో వాళ్ళు గుర్తు పట్టారు. మిగతా ముఠా వాళ్ళని, దొంగిలించిన సొమ్ములను త్వరలోనే రాబడతామని రిపోర్ట్ లో రాశారు.

*****

విక్రమ్ చంద్ర క్రింద పని చేసే వాళ్ళల్లో రాజేంద్ర చాల సమర్ధుడు. ముఖ్యమయిన పనులు ఏమన్నా ఉంటె విక్రమ్ చంద్ర అతనికి అప్పచెబుతూ ఉంటాడు.

ఆదివారం రాత్రి రాజేంద్ర కి విక్రమ్ చంద్ర ఫోన్ చేశాడు " రేపు, తట్టి కోన లో గోవర్ధన్ ఇంట్లో చోరీకి అరెస్ట్ అయినా వ్యక్తిని కోర్టులో ప్రవేశ పెడతారు, నువ్వు కోర్టుకు వెళ్లి అక్కడ

ఏమిజరిగిందో అంతా వివరంగా చెప్పు " అన్నాడు

రాజేంద్ర " అలాగే సార్ ప్రొద్దుటే వెడతాను " అన్నాడు

"రుతుపవనాల వానలు ఉధృతం గా ఉన్నాయి. రేపు వర్షం పడవచ్చు . అయినా నువ్వు సమయానికి కోర్టు చేరేలా ప్లాన్ చేసుకో " అని చెప్పి పెట్టేశాడు విక్రమ్ చంద్ర

ఎక్కడో జరిగిన ఒక దొంగతనానికి అంత ప్రాముఖ్యం అతను ఇవ్వడం రాజేంద్ర కి కొంచం ఆశ్చర్య మేసింది. మంత్రుల, మిత్రులు, బంధువుల కేసులు అయినంత మాత్రాన ఆయన భయపడి అతి శ్రద్ధ చూపడం ఎప్పుడూ జరగ లేదు.

సాయంత్రం కోర్టు నుంచి తిరిగి వచ్చి రాజేంద్ర, విక్రమ్ చంద్ర కి మొత్తం వివరాలు ఇచ్చాడు

కోర్టు లోనే కాకుండా, ఊరంతా ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే, ముద్దాయి తరపున వాదించడానికి మొత్తం జిల్లాల్లో ప్రముఖ న్యాయవాది రఘునాధరావు వచ్చాడు. మొదట్లోనే ఆయన, తన క్లయింట్ తో ఒక గంట సమావేశం అవాలని కోరాడు. అందుకోసం కోర్టు కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేసింది

ప్రాసిక్యూటర్ ముందర తన కేసు చెబుతూ, ఉత్తరాది ముఠాకి ఈ ప్రాంతం లో సహాయకారిగా పనిచేసే సభ్యుడు భూషయ్య అని, దొంగతనం జరిగిన ఇంట్లో ఖరీదయిన వస్తువు అతని వద్ద దొరికిందని ఒక ఖరీదయిన చలికి కప్పుకునే శాలువా చూపించారు . నేరం జరిగిన మరునాడు ప్రొద్దుట మిగతా సభ్యుల తో పారిపోడానికి ప్రయత్నిస్తుంటే వ్యాన్ నుంచి క్రింద పడిపోవడం వల్ల చిక్కాడని, మిగతా వాళ్ళు పారిపోయారని, వాళ్లని కూడా పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని, చెప్పి, నేరస్థుడు నేరం ఒప్పుకున్నట్టు కన్ఫెస్ చేశాడని, స్టేట్మెంట్ కోర్టుకు సమర్పించారు.

కోర్టు ఇచ్చిన సమయం లో రఘునాధరావు ముద్దాయి తో మాట్లాడిన తరవాత మధ్యాహ్నం ప్రారంభమయిన సెషన్ లో రఘునాధరావు ముద్దాయిని ప్రశ్నించి కొన్ని విషయాలు

కోర్టు కు వివరించారు.

ముద్దాయి భూషయ్య చెప్పినదేమిటంటే, తనని బెదిరించి బలవంతంగా నేరం ఒప్పు కునేలా చేశారని, తాను వానలు పడే సమయం లో పొలం లో విత్తనాలు నాటాలని,

అవి కొనడానికి టౌన్ కు వచ్చానని, అవి కొని, వర్షం వస్తే ఒక చోట ఆగి, ప్రతిమాటు తన ఊరు వెళ్లే బస్సు ఎక్కే చోటికి వచ్చేటప్పటికి , లాస్ట్ బస్సు వెళ్లిపోయిందని, అందువల్ల

అక్కడే బస్ స్టొప్ లో పడు కున్నానని, తెల్లవారుజామున ఎవరో నలుగురు వచ్చి అక్కడ ఆగి, ఒకడు నన్ను పొరపాటున తన్నితే, మెలకువ వచ్చి చూశానని, వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి

వ్యాన్న్ తీసుకురమ్మన్నారని చెప్పాడు. వాళ్ళు తెలుగు లోనే మాట్లాడుకున్నారని చెప్పాడు. ఇదంతా రఘునాధ రావు ప్రశ్నలు వేసి రాబట్టాడు. ఎలా జవాబులు చెప్పాలో భూషయ్యకి

అయన చెప్పినట్టున్నాడు

" మరి ఈ శాలువా నీకు ఎలావచ్చింది ?" అని రఘునాధరావు అడిగితే " నా బట్టలు తడిసి, చలికి వణుకుతూ ఉంటె, వాళ్లల్లో ఒకడు అది నాకు ఇచ్చి, తడిసిన చొక్కా విప్పి అదికప్పుకోమన్నాడు. వాళ్ళ వ్యాన్ రాగానే "ఎటువైపు వె డుతున్నారని అడిగినప్పుడు, మాఊరు మీదుగానే వె డుతున్నారని తెలిసి, శెట్టి పల్లి రోడ్డు దాకా వస్తానని చెప్పాను. వాళ్ళు

ఎక్కినతరువాత, నేను ఎక్కబోతోంటే, వాళ్ళు సిఐ గారు వస్తూ ఉండడం చూసి వ్యాను స్టార్ట్ చేసి స్పీడ్ గా వెళ్లిపోవడానికి ప్రయత్నించడం తో, నేను క్రింద పడిపోయాను . అప్పుడు వచ్చి సిఐ గారు

నన్ను పట్టుకున్నారు. అని చెప్పాడు.

" అసలు శెట్టి పల్లి నుంచి తట్టి కోన ఎందుకు వచ్చావు ?" అని అడిగితే " వానలు పడిన వెంఠనే విత్తనాలు చల్లాలని అవి కొనడానికి వచ్చానని చెప్పాడు.

" మరి విత్తనాలు కొన్నావా ? అవెక్కడ ఉన్నాయి ?" అని అడిగితే కొన్నానని, వ్యాన్ ఎక్కేముందు వాటిని వ్యాను లోకి ముందు విసిరానని, ఆ తరవాత తాను ఎక్కబోతూ కింద పడ్డానని చెప్పాడు.

భూషయ్య నేరం ఒప్పుకున్నట్టు ఇచ్చిన స్టేట్ మెంట్, మిగతా సాక్ష్యాధారాలు లేకుండా చెల్లదని రఘునాధరావు వాదిస్తే, ప్రాసిక్యూటర్, దొంగిలించిన వస్తువులలో ఒకటి ముద్దాయి దగ్గర దొరకడం సాక్ష్యం కాదా అని వాదించాడు.

నేరం జరిగిన స్థలం లో ముద్దాయి ఉన్నట్టు సాక్ష్యం ఏమయినా ఉందా ? అని అడిగాడు రఘునాధరావుమోహనరావు ని బోనులో పెట్టి

దానికి జడ్జి, నేరం జరిగిన స్థలం లో వేలిముద్రలు సేకరించలేదా ? అని అడిగారు ప్రోసిక్యూషన్ ని . దానికి ప్రాసిక్యూటర్ మోహన రావు మొహంలోకి చూశారు

" వేలి ముద్రలు అన్ని చెరిపేసి ఉంటారు " అన్నాడు మోహన్ రావు

"ఆ విషయం వేలిముద్రల నిపుణులు చెప్పాలి. వేలిముద్రల నిపుణుల్ని పంపి అక్కడ దొరికిన వేలిముద్రలు లో ముద్దాయి వేలిముద్రలు ఉన్నాయో లేదో కోర్టుకు చెప్పాలి" అని వాదించాడు"

"ఆ పని చేసి ఫారిన్సీక్ నిపుణుల్ని రిపోర్ట్ తో సహా కోర్టు లో హాజరు పరచండి " అని రెండు రోజులు వాయిదా వేశాడు జడ్జి

భూషయ్య పాత నేరస్తుడు కాదని, అతను గౌరవంగా బ్రతికే ఒక రైతు అని , అందు చేత అతన్ని మిగతా నేరస్తులతో కలపకుండా వేరే ఏర్పాట్లు చేయాలనీ ఆర్డర్లు కోరారు రఘునాధరావు . దానికి జడ్జి గారు అంగీకరించారు.

"ఓకే , మళ్ళీ కేసు గురువారం కదా . ఆ వేళకూడా కోర్టుకు వెళ్లి , నాకు వివరాలు చెప్పు " అన్నాడు విక్రమ్ చంద్ర, రాజేంద్ర తో

**********

గురువారం సాయంత్రం, విక్రమ్ చంద్ర టెన్నిస్ ఆడి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటె, రాజేంద్ర ఫోన్ చేశాడు.

ఇవాళ కోర్టులో ఫారిన్సీక్ నిపుణుడు సాక్ష్యం ఇచ్చాడు సార్. ఇంట్లోవాళ్ళవి కాకుండా, బయటివాళ్ళవి కొన్ని వేలిముద్రలు ఉన్నాయి అని వాటిలో భూషయ్యది లేదని చెప్పడంతో

కేసు డిస్మిస్ చేసి అసలు దొంగలిని పట్టుకోమని పోలీసు లకి చెప్పాడు జడ్జి. రేపు ప్రొద్దుటే భూషయ్యని విడుదల చేస్తారు సార్ అన్నాడు రాజేంద్ర

" సరే నువ్వు ఒక పని చేయి, రేపు ప్రొద్దుటే భూషయ్యని విడుదల చేసే టయిముకి వెళ్లి, అతనిని ఇంటివద్ద దింపమని ఆర్దర్లు ఉన్నా యని చెప్పి అతనిని స్టేషన్ బయటకు తీసుకురా . బయట కారులో ఉంటాను నేను " అని ఫోన్ పెట్టేశాడు

రాజేంద్ర కి ఏమీ అర్థం కాలేదు. కొంపతీసి ఎంకౌంటర్ ఏమీ ప్లాన్ చేయలేదు కదా ? అన్న ఆలోచన వచ్చినా, అలాంటిదాంట్లో విక్రమ్ చంద్ర స్వయంగా పాల్గొనడని అతనికి తెలుసు

మరునాడు ప్రొద్దుటే తట్టి కోన స్టేషన్ బయట కొంచం దూరం గా కారు ఆపుకుని విక్రమ్ చంద్ర వెయిట్ చేస్తున్నాడు.అతను ఫుల్ యూనిఫామ్ లో ఉన్నాడు . కొద్ది సేపట్లోనే, రాజేంద్ర భూషయ్యని తీసుకువచ్చాడు.

రాజేంద్ర ని వెనక సీట్లో కూర్చోమని, భూషయ్యని ఫ్రంట్ సీట్లో తన ప్రక్కన కూర్చోమన్నాడు విక్రమ్ చంద్ర

భూషయ్య సంశయిస్తోంటే "పరవాలేదు ఎక్కు. సార్ జిల్లాకి అంతకి ఆఫీసర్ " అని ధైర్యం చెప్పాడు రాజేంద్ర

భూషయ్య కారు ఎక్కి , విక్రమ్ చంద్రకి నమస్కరించి కూర్చున్నాడు. అంత పెద్ద ఆఫీసర్ తనతో ఎందుకు వస్తున్నాడో అర్థం కాలేదు అతనికి.

"శెట్టి పల్లి రోడ్డు ఎంత దూరము ఉంటుంది ఇక్కడినుంచి" అన్నాడు కారు స్టార్ట్ చేసి విక్రమ్ చంద్ర

" అరవై దాకా ఉంటుందండి " అన్నాడు భూషయ్య

" రోడ్డు వద్దనుంచి ఊళ్లోకి కారు వెడుతుందా ? " అడిగాడు

" వర్షాలు పడుతున్నాయి కదండీ, అయినా కంకర రోడ్డు లేదు కాబట్టి, నడిచే వెళ్ళాలండి." అన్నాడు.

శెట్టి పల్లి రోడ్డు అనే బోర్డు వచ్చే దాక భూషయ్య, రాజేంద్ర ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.

మూడు రోజులు ఇంటికి రాక పోతే భార్య కూతురు ఆందోళన పడతారు అనుకున్నాడు. గతం లో ఒకటి రెండు మాట్లు, తట్టి కోన పక్కన కాట్ర పల్లి లో తన చెల్లెలు ఇంటికి వెళ్లడం అలవాటు ఉంది కాబట్టి అక్కడికి వెళ్లాన ని అనుకుంటా రనుకున్నాడు. భూషయ్య.

ఈ భూషయ్య ని తీసుకుని సార్ ఎందుకు బయలు దేరాడో అర్థం కాక, ఆయనే చెబుతాడని ఆలోచించడం మానేశాడు రాజేంద్ర

మెయిన్ రోడ్డు మీద ఒక పక్కన చెట్టు కింద కారు పార్క్ చేసి ముగ్గురు దిగారు.

రెండుకిలోమీటర్ల పైనే ఉంటుందేమో మీ ఇల్లు అన్నాడు విక్రమ్ చంద్ర

" మూడు కిలో మీటర్లండి " అన్నాడు ఈయనకి ఎలా తెలుసా అనుకుంటూ

" రా వెడదాం అని మట్టి రోడ్డు మీద నడవడం మొదలుపెట్టాడు విక్రమ్ చంద్ర. వెనకాల భూషయ్య, రాజేంద్ర ఫాలో అయ్యారు.

మెయిన్ రోడ్డు దగ్గర నుంచి కొంత దూరం పుంత రోడ్డు లా ఉండి ఇరువై వైపులా తాటి చెట్లు ఉన్నాయి . ఆతరవాత పూర్తి గా మట్టి రోడ్డు,ఇరువైపులా పొలాలు ఉన్నాయి .

కొంత దూరం వెళ్లిన తరవాత భూషయ్య ని ముందు నడవమన్నాడు విక్రమ్ చంద్ర.

ఇంచుమించు మూడు కిలోమీటర్లు వెళ్లిన తరువాత పొలాల మధ్య ఒక దిబ్బ మీద ఒక చిన్న పెంకుటిల్లు కనపడింది.

భూషయ్య వెళ్లి తలుపు కొట్టగానే ఒక పదిహేను పదహారు సంవత్సరాల అమ్మాయి " ఆయ్యా ఏమయిపోయావు అని ఇంచుమించు అతనిని కౌగిలించుకోబోయి, వెనక్కాల ఉన్న

ఇద్దరిని చూసి ఆగి పోయింది . తెల్లబోయి చూస్తుంటే " రండి సారూ లోపలికి రండి " అని ముందు చిన్న హాలులో కుర్చీలు చూపించి లోపలికి వెళ్ళాడు భూషయ్య. వెనకాలే వెళ్ళింది ఆ అమ్మాయి.

ఉన్న రెండు కుర్చీలలోను ఇద్దరు కూర్చున్నారు. భూషయ్య లోపలి కి వెళ్లి భార్య తో మాట్లాడి వచ్చాడు. నుంచునే ఉంటె . కూర్చో భూషయ్య అని విక్రమ్ చెబితే అక్కడే ఉన్న మంచం వాల్చుకుని కూర్చున్నాడు.

అతని కూతురు మంచినీళ్లు తీసుకు వచ్చింది అందరికి

" నిన్ను మోహన్ రావు నేరం ఒప్పుకోమని ఏమన్నా శారీరకంగా బాధించాడా ? " అన్నాడు

" లేదు సార్ కానీ అక్కడేనుంచున్న కూతురిని, ఇంట్లో లోపలి కి ఒక మాటు చూసి "వేరే విధంగా చాలా భయపెట్టాడు సార్. ఆ రఘునాధరావు సార్ రాకుండా ఉంటె చాలా కష్టంఅయ్యేది సార్ " అన్నాడు భూషయ్య

" ఇవాళ ఇక్కడే లంచ్ చేయాలి రాజేంద్ర " అని రాజేంద్ర తో అని "ఆవిడని పిలవండి ఒక మాటు" అన్నాడు భూషయ్యతో . అతని భార్యని పిలవమని సూచిస్తూ

" అమ్మని రమ్మను శ్యామలా " అన్నాడు కూతురు కేసి చూసి. ఈ మాటలు ఆవిడా వింటోంది కాబోలు ఆవిడ వచ్చి గుమ్మం దగ్గర నుంచుని నమస్కారం పెట్టింది

విక్రమ్ చంద్ర ఆ ముగ్గురికేసి చూసి " ముగ్గురూ నన్ను గుర్తు పట్టలేదు " అన్నాడు నవ్వుతూ

ముగ్గురూ తెల్లబోయి చూశారు

శ్యామల ని దగ్గరికి రమ్మని విక్రమ్ చంద్ర " ఏది మంచి పని ?" అన్నాడు నవ్వుతూ

ఒక్క క్షణం శ్యామల తెల్లబోయి , విక్రమ్ చంద్ర ముఖం లోకి చూసి అమ్మా " వర్షం సారే " అని అరిచింది

ఆ ! వర్షం సారా? అని అంత వరకు దూరం గా ఉన్న భూషయ్య భార్య బిడియం విడిచి దగ్గరగా వచ్చింది. భూషయ్య కూడా లేచి దగ్గరగా వచ్చాడు

" అస్సలు గుర్తు పట్టలేదండయ్యా . చాలా మారిపోయారు. వర్షం వచ్చినప్పుడల్లా 'వర్షం సార్' మళ్ళీ ఎప్పుడూ రాలేదు అనుకుంటూ ఉంటాము సార్. మీరు పంపిన బట్టలు మూడేళ్లు క్రితం దాకా కట్టుకుని మురిసి పోయేది శ్యామల. సార్. మీరు పోలీసు ఉద్యోగంలో ఉన్నారని అప్పుడు చెప్పలేదు సార్ " అన్నాడు భూషయ్య

రాజేంద్ర తెల్లబోయి చూస్తుంటే , తరవాత చెబుతాలే అన్నాడు విక్రమ్ చంద్ర.

"మళ్ళీ మంచి భోజనం పెట్టాలి, మంచిది అంటే ఆ వేళ పెట్టినట్టే . చింతకాయ పచ్చడి, పచ్చిమిరపకాయ వాసన తెలిసేలా పప్పు చారు, గడ్డ పెరుగు . అంతే అంత కన్నా ఎక్కువ అక్కరలేదు " అన్నాడు నవ్వుతూ విక్రమ్ చంద్ర

ఆ వేళ అంతకన్నా ఏమీ ఇంట్లో లేవు సార్. పైగా గాలివాన . ఇవాళ ఆలా అంటే ఎలాగ సార్ అంది భూషయ్య భార్య

" నాకు అదే అమృతం అంటూ ఉంటె, మళ్ళీ వేరే పెడతానంటావేమిటి ?. ఊరికే అన్నాను, మీకు ఎలా వీలయితే అలా పెట్టండి. మేము త్వరగా వెళ్లి పోవాలి " అన్నాడు విక్రమ్

కరెంట్ పోయి ఫాన్ ఆగిపోయింది. బయట వేప చెట్టుకింద కూర్చోండి సార్ అని కుర్చీలు బయట వేసి లోపలికి వెళ్ళాడు భూషయ్య.

అతని భార్య, శ్యామల వంట పనిలో పడ్డారు. భూషయ్య బయటికి వచ్చి " ఇప్పుడే వస్తాను సార్ " అని బయటికి బయలు దేరాడు

" నువ్వేమీ హడావిడి చేయకు భూషయ్యా , ఇంట్లో ఉన్నవి చాలు " అన్నాడు విక్రమ్. బయటికి వెడుతున్న భూషయ్యతో

బయట కుర్చీలలో స్థిరపడి " ఇప్పుడు చెప్పండి సార్ వీళ్ళు మీకు ఎలా పరిచయం ? " అన్నాడు సస్పెన్స్ విప్పమన్నట్టు

" నాకు ఎస్పీ గా ప్రమోషన్ రాక ముందు ఈ ఏరియా లో ఏ ఎస్పీ గా పనిచేశాను కదా. ఒకమాటు శెట్టిపల్లి ప్రాంతం లో నక్సలైట్ కదలికలు ఉన్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ వస్తే కొంచం వేషం మార్చి మఫ్టీ లో సైకిల్ మీద ఈ ప్రాంతానికి వచ్చాను. మెయిన్ రోడ్ మీదనుంచి ఇందాక మన వచ్చిన దారిలో వస్తోంటే, హాఠాత్హు గా కుండపోత వర్షం ప్రారంభ మయింది.దగ్గరలో షెల్టర్ ఏమన్నా దొరుకుతుందేమో నని పరిగెత్తితే, దూరం నుంచి ఇదే దిబ్బ మీద ఉన్న ఇంటిని చూసి ఇక్కడికి పరిగెత్తి వచ్చాను. అప్పుడు ఇది పెంకుటిల్లు కాదు.

మట్టి అరుగులు తో ఆకులు కప్పిన కప్పుతో ఉంది. కాసేపు అరుగు మీద కూర్చునే సరికి, తలుపు తీసుకుని భూషయ్య వచ్చాడు.

నన్ను చూసి లోపలకి రమ్మని ఆహ్వానించాడు. వర్షానికి ఆగానని అర్థం అయింది. శెట్టిపల్లి ఊళ్ళో మిత్రుడిని కలవడానికి వెడుతోంటే, వర్షం వచ్చి ఆగానని చెప్పాను.

ఒక అనుకోని అతిధిని ఎలా ట్రీట్ చేయాలన్నది సంస్కారం వల్ల వస్తుంది కానీ, ఒకళ్ళు నేర్పితే రాదు. ఆ వేళ ఒక తెలియని వ్యక్తికి వాళ్ళు చూపిన ఆప్యాయత మరువ లేనిది.

ముందు మంచి టీ ఇచ్ఛారు . ఇప్పుడు పదిహేను ఉంటె అప్పటికి శ్యామలకి ఎనిమిదేళ్లు ఉంటాయేమో. నన్ను వదల లేదు

వాళ్ళ కుటుంబ విషయం అడిగాను కబుర్లలో. భూషయ్యకి ఇంటి చుట్ట్టూ ఉన్న ఐదెకరాలు భూమే ఆధారం. ఇక్కడ దగ్గరలో నదులు ఏవీ లేవుకదా ? ఎప్పుడో బోరు బావుల కార్పొరేషన్

వారు ఒక ఇరవై ఎకరాలకు ఒక బోరు వేశారు. నీళ్లు తక్కువ కాబట్టి, వర్షం కూడా ఆధారం. వరి పంట కి నీరు ఎక్కువ కావాలి. తినేది వరి కాబట్టి మిగతా పదిహేను ఎకరాల వాళ్ళు వరి వేసి ఉన్న నీళ్ళని వాడేసేవారు. భూషయ్య మాత్రం కార్పొరేషన్ సలహా మేరకు తక్కువ నీరు తీసుకునే నాలుగు అయిదు రకాలు వేసుకుని, అవి అమ్మి కావలిసిన ధాన్యం

కొనుక్కనేవాడు. దానివల్ల ఆర్థికం గా వాళ్ళ కంటే బాగానే ఉండేవాడు. అయితే మంచి విత్తనాలు తెచ్చుకుని వర్షాలు పడగానే నాటితే మంచి పంటలు పండుతాయి. మొన్న తట్టి కోన అతను విత్తనాలకోసమే వచ్చాడు. ప్రతి సంవత్సరం, తట్టి కొననుంచి, వర్షాలు పడగానే విత్తనాలు తెచ్చుకోవడం అలవాటు.

వర్షం తగ్గక పోతే, కబుర్లు చెబుతూ ఇవన్నీ చెప్పాడు. అతనికి పెద్ద ఆశలు లేవు. తనకి వ్యవసాయం లో సహాయం గ ఉండే కుర్రాడిని చూసి ఇల్లరికం తెచ్చుకోవాలని ఉందని అప్పుడేచెప్పాడు. కూతురు అంటే ప్రాణం ఇద్దరికీ .

ఆ రాత్రి ఎంతకీ వర్షం తగ్గలేదు. నింగి నేల ఏకమయినట్టు పడుతోంటే, వాళ్ళు నన్ను బయటికి వేళ్ళ నివ్వ లేదు. రాత్రికి అక్కడే ఉండి పొమ్మని వేడి వేడి అన్నం, ఇందాక నేను చెప్పిన వాటితో కమ్మని భోజనం పెట్టారు. ఆ రాత్రి, ఉన్న రెండు గదులలోను, ఒక గదిలో నేను శ్యామల పడుకున్నాము" ఆగాడు విక్రమ్

" అవును ఆ అమ్మాయి " ఏది మంచి పని " అని మీరు అడగ గానే మిమ్మలిని గుర్తు పట్టడం ఆశ్చర్యం గా ఉందే . అదేమిటి ?" అన్నాడు రాజేంద్ర .

" ఓహో అదా. ఆరాత్రి శ్యామల నిద్రపట్టక పోవడంతో దొర్లుతూ ఉంటె ఒక కథ చెబుతాను, విని, నేను వేసిన ప్రశ్నకి జవాబు చెప్పాలి అని ఒక చిన్న కథ చెప్పాను . గో తెలుగు.కామ్. లో"ఏది మంచిది " అని ఎవరో శర్మ గారు ఒక కథ రాశారు. తరవాత నువ్వు కూడా చదువు . పిల్లలే కాదు పెద్దలు కూడా చదవాలి అది. ఆ వేళ చెప్పిన కథ, నేను వేసిన ప్రశ్న ఆమె మనసులో ఉండిపోయాయి. అందుకే వెంఠనే గుర్తు పట్టింది.

" ఇప్పుడు అర్థం అయింది సార్ రఘునాధ రావు అపియర్ అవడం, భూషయ్యకి జైలు లో ఏర్పాట్లు ఇవన్నీ మీరే ఏర్పరిచారన్న మాట. ఎదో చిన్న కేసు వ్యవహారం విషయం లో కోర్టులో ఏమి జరుగుతోందో నన్ను వెళ్లి చూడమన్నప్పుడు నాకు అర్థం కాలేదు , కేసులో ముద్దాయి భూషయ్య అని మీకు ఎప్పుడు తెలిసింది సార్. ?

" మోహన రావు పట్టుకున్నాడు అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. అతని సామర్థ్యము నాకు తెలుసు. అయినా నాకు అనుమానం రాలేదు. ఉత్తరాది ముఠా లో వాడు అని అనడం తో

కుతూహలం కొద్దీ ఫోటో తెప్పించి చూశాను. చూడగానే ఆశ్చర్య పోయి, మోహనరావు ఎదో చేసి ఉంటాడు అన్న అనుమానం వచ్చింది. వాడికి ప్రొమోషన్ పిచ్చి పట్టింది. ఆ మధ్యన

బదలీ కి మంత్రి తో చెప్పించాడు . ఇలాంటిది ఎదో చేసి ప్రెషర్ తేవాలనుకున్నాడేమో. నేను ఆ ఫోటో చూడక పోతే చాలా డామేజ్ జరిగేది భూషయ్యకి " అన్నాడు విక్రమ్ నిట్టూరుస్తూ.

మనం వెనక్కి వెళ్ళగానే, ఆ ఎస్పీ ని పిలిచి ఒక టీమ్ ఫారం చేయి. ముఠాని పట్టుకోవాలి. పెద్ద కష్టం కాదు. లోకల్ వాళ్లే కదా ? " అన్నాడు విక్రమ్

****

భూషయ్య భార్య , శ్యామల శ్రద్ధ గ వడ్డించి మంచి భోజనం పెట్టారు. భోజనాలు సమయం లో విక్రమ్ భూషయ్యకి ఎలా సహాయం చేశాడో, విక్రమ్ వద్దు అంటున్నా వివరించాడు రాజేంద్ర. భోజనాలుచేసి బయలు దేరుతోంటే " అస్తమానం మేము ఇక్కడ ఆతిధ్యం కాదు. రేపు భూషయ్య మళ్ళీ విత్తనాలకురావాలి. నా కారు పంపుతాను అందులో మీరు కూడా రండి. మా ఇంటికి రావాలి మాతో భోజనం చేయాలి. మీ భోజనం అంత రుచి గా కాకా పోయినా ఎదో మేము పెడతాము " అన్నాడు నవ్వుతూ శ్యామలని, భూషయ్య భార్యని చూస్తూ.

భూషయ్య, వాళ్లతో మెయిన్ రోడ్డు లో కారు దాకా వచ్చాడు.

విక్రమ్ కారు ఎక్కబోతొంటే, " మీరు అడ్డు పడక పోతే చాలా కష్టాలు పాలయ్యేవాడిని సారూ " అని చేతులెత్తి దండం పెట్టాడు

విక్రమ్చ చలించి పోయాడు . " నీలాంటి మంచి వాళ్ళని రక్షించుకోక పొతే ఇంక పోలీసులు ఎందుకు భూషయ్యా?" అని కారు ఎక్కాడు

******

రాజేంద్ర ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన టీమ్ కేసు చేప్పట్టిన నాలుగు రోజులకే, దొంగలిని పట్టారు. వాళ్ళు గోవర్ధన్ వ్యాపార ప్రత్యర్ధులు. గోవర్ధన్ మోసాలిని నిరూపించే ముఖ్య మయిన

కాగితాలు దొంగిలించ బడ్డాయి. దానిలో మంత్రి గారి ప్రమేయం కూడా బయట పడ్డం తో అయన రాజీనామా చేయాలిసి వచ్చింది.

మోహన్ రావు, ప్రమోషన్ మాట మరిచిపోయి తప్పుడు కేసులు కావాలని పెట్టిన వాళ్ళని శిక్షించే ఐపీసీ 211 ప్రకారం రఘునాధరావుపెట్టిన కేసు ను ఎదుర్కొంటున్నాడు

సమాప్తం

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్