దెయ్యాల బస్సు - కందుల నాగేశ్వరరావు

Deyyala bassu

అది 1962వ. సంవత్సరం. అప్పుడు నాకు పదిహేను సంవత్సరాల వయస్సు. ఆ సంవత్సరమే నేను SSLC (ఇప్పటి 11th class) పరీక్ష పాసయ్యాను. మాది విశాఖ జిల్లాలో ఒక పెద్ద గ్రామం. విశాఖపట్నానికి 75 కి.మీ. దూరంలోను, అనకాపల్లికి 40 కి.మీ. దూరంలోను ఉంటుంది. కలకత్తా నుండి మద్రాసు వెళ్ళే హైవే నుండి 5 కి.మీ. దూరం మా గ్రామం. హైవే నుండి మాఊరు వెళ్ళే దారి పొడవునా ఒక ప్రక్క ఏరు, రెండవ ప్రక్క అరటి, చెఱుకు, కొబ్బరి తోటలతో సంవత్సరం పొడవునా పచ్చగా ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. మా ఊరు దాటాక ఇంకో 8 కి.మీ దూరంలోనే బంగాళాఖాతం సముద్ర తీరం ఉంటుంది. మా ఊరిలో అప్పటికే ఒక తాలూక ప్రాధమిక పాఠశాల, జిల్లా బోర్డు హైస్కూలు ఉండడం వలన నా స్కూలు ఎడ్యుకేషన్ అంతా వీటిలోనే జరిగింది. మా వాళ్ళు నన్నుఅనకాపల్లి కాలేజీలో PUC (12th class) లో చేర్చారు. కాలేజి, కాలేజి హాస్టల్ అన్నీ కలిసి ఒకే ఆవరణలో ఉండేవి. అందుకని నన్ను హాస్టల్‌లో కూడా చేర్చారు. కాలేజి ఊరికి దూరంగా రైల్వే లైన్ ప్రక్కన, తోటల మధ్య, ప్రశాంతమైన పరిసరాలలో ఉండేది.

నేను ఊరుని, మా తల్లితండ్రులను వదలి అంతకు ముందెప్పుడూ ఉండలేదు. అందువలన రెండు రోజులు కాలేజీకి శలవులు వచ్చినా ఊరికి వెళ్ళేవాడిని. ఆ సంవత్సరం నరక చతుర్దశి, దీపావళి పండుగలు అక్టోబరు నెల చివరి శని, ఆదివారాలలో పడ్డాయి. అందుకని కాలేజీకి గురు, శుక్రవారాలు కూడా శలవులు ఇచ్చారు. బుధవారం రాత్రికి ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళడానికి మా స్నేహితులందరం నిర్ణయించుకున్నాం. అప్పట్లో విశాఖ జిల్లాలోని గ్రామాలకు ప్రైవేటు బస్సులు మాత్రమే తిరుగుతూ ఉండేవి. బస్సు డ్రైవరు, కండక్టర్లతో ఊరి ప్రజలకు మంచి సంబంధాలు ఉండేవి. బస్సు వెళ్ళే రూట్లో ఎవరికైనా ఒక ఉత్తరం పంపాలన్నా, అర్జెంటుగా కొద్దిపాటి డబ్బు పంపాలన్నా వీరి ద్వారానే జరుగుతూ ఉండేది. మా ఊరినుండి అనకాపల్లి మీదుగా విశాఖపట్నానికి ఒక బస్సు తిరుగుతూ ఉండేది. అది రాత్రికి మా ఊరిలో హాల్ట్ చేసి మొదటి ట్రిప్ తెల్లవారుజామున అయిదు గంటలకు పట్నానికి బయలుదేరి వెళ్ళేది. రెండవ ట్రిప్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండేది. రాత్రికి పట్నం నుండి మా ఊరికి తొమ్మిది గంటలకు చేరాలి. కాని ఎప్పుడూ రాత్రి లేటుగా వస్తూ ఉండేది. అందుకని మా ఊరిలో అందరూ దానిని ‘దెయ్యాల బస్సు’ అని పిలిచేవారు.

బుధవారం రాత్రి 07-45 దెయ్యాల బస్సు ఎక్కడానికి అనకాపల్లి బస్సు స్టాండుకు వచ్చాను. ఆరోజు ఉదయం నుండి కొద్ది పాటి వర్షం పడుతూనే ఉంది. బస్టేండు అంతా బురద బురదగా ఉంది. మా ఊరి వాళ్ళు చాలా మంది బస్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ‘ఏరా అబ్బాయి పండుగకి శలవులు ఇచ్చారా’ అని ఒకరు , ‘చదువెలా సాగుతోంది అని మరొకరు’ ఇలా ఒకరి తరువాత ఇంకొకరు కుశల ప్రశ్నలు వేస్తూండగా మా బస్సు వచ్చింది. .

రాత్రి 08-30: అందరం బస్సు ఎక్కాం. పెద్ద పెద్ద మూటలు ఉన్నవాళ్లు క్లీనర్లు సాయంతో బస్సు టాపు మీద ఎక్కించి తాళ్లతో కట్టారు. కండక్టర్ అందరికీ టిక్కెట్లు ఇవ్వడం పూర్తయ్యాక ‘రైట్ రైట్’ అని టికెట్ హోల్డర్తో డోర్ మీద ‘దబ్ దబ్’ మని చప్పుడు చేసిర తరువాత డ్రైవరు బస్సుని స్టార్ట్ చేసాడు.

రాత్రి 09-00: మొత్తం మీద ఒక గంట లేటుతో బస్సు బయలుదేరింది. వర్షం జోరు కూడా పెరిగింది. ఆరోజుల్లో జాతీయ రహదారులు (NH) కూడా రెండు లేన్ల కంటె ఎక్కువ వెడల్పు ఉండేవి కాదు. రోడ్డు ప్రక్కనున్న చిన్న చిన్న ఊళ్ళ దగ్గర బుడ్డి కిరసనాయిలు దీపాలు మాత్రమే ఉండేవి. రాత్రి పూట ఎదుట వెహికల్ వచ్చిన ప్రతీసారి డ్రైవర్లకు వేగం తగ్గించి హార్న్ కొట్టడం ఒక అలవాటుగా ఉండేది. బస్సు కిటికీలకు అడ్డంగా ఇనుప రాడ్లు, షట్టర్లు లేవు. టార్పాలిన్ గుడ్డతో కుట్టిన కర్టెన్లు మాత్రమే ఉన్నాయి. బస్సు నడుస్తుంటే గాలికి ఆ కర్టెన్లు ఊగుతూ చల్లగాలి తగుల్తుంటే చాలా హాయిగా ఉంది. బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణీకులు ఉన్నారు. అందులో ఇరవై మంది వరకు మా ఊరి వారే, ఒకరితో ఇంకొకరు పరిచయం ఉన్నవారే. అందుకనే మాటల్లో పడ్డారు. చాలా మంది అనకాపల్లిలో గాని , విశాఖపట్నంలోగాని పండుగకు కావలిసిన వస్తువులు కొని తిరిగి ఊరికి వస్తున్నారు. కాస్సేపు ప్రయాణం సాగాక, ఓ యువకుడు ముందు సంవత్సరంలో రిలీజయిన ‘జగదేకవీరుని కథ’ సినీమాలోని పాట పాడటం మొదలెట్టాడు. ‘జలకాలాటలలో - గలగల పాటలలో ఏమి హాయిలే హలా - ఏమి హాయిలే హలా’ ఆ పాట పూర్తయేసరికి మరొకాయన యస్.వి.రంగారావు లాగ ఫోజుపెట్టి మాయాబజారు సినీమా నుండి ‘వివాహ భోజనంబు – అహ్హహ్హ నాకె విందు వింతైన వంటకంబు ……….’ అంటూ అభినయంతోబాటు పాట అందుతున్నాడు. దానితో హుషారు వచ్చినట్టుంది, ఓ యువతి వాళ్ళాయన వైపు కొంటె చూపులు చూస్తూ చెంచులక్ష్మి సినీమా నుండి ‘చెట్టు లెక్కగలవా , ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన, చిగురు కోయ గలవా’ అంటూ నవ్వుతూ పాట అందుకుంది. వాళ్ళాయన కూడా ఏమాత్రం తగ్గకుండా; "కాళ్లకు గజ్జలు కట్టి, చేతికి గాజులు తొడిగి కంటికి కాటుక పెట్టి, సిగలోన పూలూ పెట్టి సింగారం వలకబోస్తూ, కొంటె చూపులతో నన్ను కవ్వించకే, నా ముద్దుల మరదలా" అంటూ పాటతోనే సమాధానం చెప్పాడు. ఇలా పాటలు వింటుంటే తెలియకుండానే అనకాపల్లి నుండి హైవేలో 35 కి.మీ దూరంలో ఉన్న మా ఊరికి వెళ్ళే జంక్షన్ దగ్గరకి వచ్చాసాం.

రాత్రి 10-30: డ్రైవరు బస్సుని హైవే నుండి మాఊరు వెళ్ళే మట్టి రోడ్డులోకి మళ్ళించాడు. ఇంతసేపు తెలియలేదు కాని వర్షం జోరు బాగా పెరిగింది. అసలే అమావాస్య ముందు రోజులు. దానిపైన వర్షం. ఈదురుగాలుల జోరు. రోడ్డు ప్రక్కనుండి కప్పల బెకబెకలు, కీచురాళ్ళ గోలతో వాతావరణం ఒక్కసారిగా చాలా భయానకంగా మారింది. మా ఊరికి వెళ్ళడానికి ఆ మట్టి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చెయ్యాలి. ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఒకపక్క ఏరు, రెండవపక్క పంట పొలాలు ఉంటాయి. అక్కడక్కడ వర్షం నీటితో నిండిన గుంతలు. డ్రైవరు బస్సు ఎంత జాగ్రత్తగా నడిపినా ముందు చక్రం ఏదో గోతిలో పడింది. డ్రైవరు సడన్ బ్రేకు వేసాడేమో కీచుమని శబ్ధం చేస్తూ బస్సు ఆగింది. రెండు నిముషాల తర్వాత మరల ఇంజన్ స్మార్ట్ చేసాడు. బస్సు ముందుకు కదిలింది కాని ఎంత ప్రయత్నించినా బస్సు హెడ్ లైట్లు, లోపలి లైట్లు వెలగలేదు. ఎక్కడో కరెంటు వైర్లు తెగినట్టున్నాయి. డ్రైవరు మరల బస్సు ఆపి టార్చ్ లైటు వెల్తురులో కండక్టరు సాయంతో బోనెట్ ఎత్తి ఎలిక్ట్రికల్ వైరింగ్ కదిపి చూసారు. అయినా సరే లైట్లు వెలగలేదు.

రాత్రి 11-00: చివరకి టార్చ్ వెల్తురుతోనే నెమ్మదిగా బస్సును ఊరిలోకి తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కండక్టరు ఎడమ పక్కన ఉన్న ముందు సీటులో కూర్చొని కిటికీలో నుండి కాంతి రోడ్డుమీద పడేటట్టుగా టార్చిలైటును పట్టుకున్నాడు. నెమ్మదిగా బస్సు బయలు దేరింది. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. రోడ్డుమీద వర్షం నీరు పారుతూ ఉంది. బిక్కు బిక్కమని ఊపిరి బిగబట్టి బస్సులో కూర్చున్నాను. ఓ పెద్దాయన జానపద పాట అందుకున్నాడు. ‘సీతమ్మ జడలోన సిరిమల్లెపూలు రామయ్య తెచ్చాడు వనమంత వెదికి రామయ్య తండ్రికి పట్టాభిషేకము సీతమ్మ తల్లికి ఎంతో సంతోషము రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి ప్రజలంతా పెట్టారు, శతకోటి దండాలు’

రాత్రి 11-30: ఎలాగైతేనేం ఊరి దగ్గరలోకి వచ్చాం. మొత్తానికి ఇంకో పది నిముషాలలో ఇళ్లకి వెళ్ళిపోవచ్చు. బస్సు చాలా నెమ్మదిగా నడక వేగంతోనే వెళ్తోంది. ఎదురుగా ఎవరో రోడ్డుకి అడ్డంగా వస్తున్నట్టు నీడలాగ తెలుస్తోంది. చేతిలో లాంతరు మినుకు మినుకుమని కొద్దిపాటి కాంతి ఇస్తోంది. ఒక పెద్ద మెరుపు మెరిసింది . ఆ మెరుపు కాంతిలో ఒక్క క్షణం పసుపు రంగు చీర కట్టుకున్న ఒక పెద్ద ముత్తైదువ చేతిలో ఓ లాంతరు పట్టుకొని బస్సు ఆపమన్నట్టుగా రెండవ చెయ్యి ఊపుతూ ముందుకు వస్తూ కనపడింది. డ్రైవరు కంగారు పడి సడన్ బ్రేకు వేసి స్టీరింగు ఎడమ ప్రక్కకు తిప్పాడు. బస్సు మట్టి రోడ్డు నుండి జారి పెద్ద కుదుపుతో ఎడమ పక్కనున్న పొలంలోకి దూసుకు పోయింది. ఏదో కొండ పైనుండి అగాధం లోకి పడిపోతున్న అనుభవం. అలాగే నాకు సృహ తప్పింది.

రాత్రి 12.00: కొద్దిగా స్పృహలోకి వచ్చాను. నేను ఎక్కడున్నానో, టైమెంతయ్యిందో తెలియదు. పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ల అరుపులతో అంతా గోలగా ఉంది. ఇంతలో నన్ను క్రింద నుండి ఎవరో పైకి తోస్తున్నారు. పై నుండి ఇంకొకరు నా చేతులు పట్టి లాగారు. నన్ను బస్సు కిటికీ లోనుండి బస్సు బయటకు లాగినట్లు అర్థమైంది. చుట్టూ కొంత మంది మనుష్యులు టార్చిలైట్లతో హడావిడిగా తిరుగుతూ అందరినీ క్రిందకి దించి కూర్చోపెడుతున్నారు. బస్సు ఎడమ ప్రక్కకు వాలి దాని టాపు వరుసగా ఉన్న తాటిచెట్లకు 45 డిగ్రీల కోణంలో ఆనుకొని నిలబడి ఉంది. నన్ను కూడా క్రిందకు దింపారు. బస్సు కుడిపక్క చక్రాలు రెండూ నేలకు తగలకుండా గాలిలో తేలుతున్నాయి. అందరినీ బస్సులోనుండి దించడం పూర్తయింది. అదృష్టం బాగుండి రెండు మూడు రోజుల్లో నయమయ్యే చిన్న చిన్న గాయాలు తప్ప ఎవరికీ పెద్దగా దెబ్బలు తగల లేదు. అక్కడ ఆ వరుస తాటిచెట్లు లేకుంటే బస్సు పల్టీలు కొట్టి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

రాత్రి 12-30: కాస్త తేరుకున్నాక అందరికీ బస్సుకు అడ్డుగా వచ్చిన స్త్రీ గుర్తుకు వచ్చింది. ఇద్దరు కుర్రాళ్ళు టార్చ్ తీసుకొని ఆమెను వెతుకుతూ రోడ్డు మీదకు వెళ్లారు. రోడ్డు మీద ఎవరు కనిపించకపోవడంతో వాళ్ళు మా ఊరి వైపు కాస్త దూరం వెళ్లారు. అక్కడకి 100 గజాల దూరంలో కుడి పక్క నున్న ఏరు నుండి ఒక పంట కాలువ రోడ్డుని దాటుకుని ఎడమ పక్కనున్న పొలాల వైపు వెళుతుంది. దాని పైన చిన్న వంతెన ఉంటుంది. మా వాళ్ళు దాన్ని ‘పొలిమేర మదుం’ అంటారు. ఆ మదుం దాటి కొద్దిగా ముందుకు వెళితే ఎడమ పక్కని పొలిమేరలో ఉన్న గ్రామదేవత ‘నూకాలమ్మ’ గుడి ఉంది. ఆతర్వాత కొద్ది దూరంలో ఊరు మొదలవుతుంది. పసుపుపచ్చ చీర కట్టుకుని లాంతరు చేతిలో పట్టుకున్న పెద్దామె వడివడిగా నడుచుకుంటూ దూరంగా వంతెన అవతల నుండి నూకాలమ్మ గుడివైపు వెళ్ళడం మా వాళ్ళకు కనపడిందట. ఏటి ప్రవాహానికి వంతెన చాలామట్టుకు కొట్టుకుపోయిందట. మావాళ్ళ వెనక్కి వచ్చి ఈ విషయం చెప్పారు.

రాత్రి 01-00: అందరం ఓపిక తెచ్చుకుని ఆ వంతెన దగ్గరకు చేరాము. అక్కడ పరిస్థితి చూసేసరికి గుండె ఆగినట్టనిపించింది. ఆ పెద్దామె వచ్చి బస్సు ఆపకపోతే ఆ బస్సు వంతెన నుండి కుడి పక్కన ఉన్న ఏటిలో గాని ఎడమ పక్కనున్న పంట కాలువలో గాని పడటం కాయం. అదే జరిగితే పరిణామం ఘోరంగా ఉండేది. మాలో చాలా మంది మృత్యువాతన పడేవారు. ఇంతకీ ఆమె ఎవరు? అంత రాత్రిమీద వచ్చి బస్సుని ఆపి గుడిలోనికి ఎందుకు వెళ్ళింది? మమ్మల్ని రక్షించిన ఆమె తప్పక మా గ్రామదేవత అయిన ‘నూకాలమ్మ తల్లి’ అని మావాళ్ళందరి నమ్మకం. ఆమె ఆ రోజు అలా రాకుంటే తప్పక మాలో చాలా మందికి అదే ఆఖరి రోజు అయ్యేది. మాలో ఇద్దరు ఈత వచ్చిన యువకులు వంతెన దాటి ఊరిలోకి వెళ్ళి జరిగింది చెప్పడానికి వెళ్లారు.

గురువారం తెల్లవారుజామున 03-00: ఊరి జనం పదిమంది మమ్మల్నందరినీ వంతెన దాటించడానికి కావలసిన సరంజామా పట్టుకొని వచ్చారు. వెదురు కర్రలతోను, తాళ్ళతోను టెంపరరీ వంతెన కట్టి ఒకరి తర్వాత ఒకరి చొప్పున మమ్మల్ని, మా సామానులను కాలువ దాటించారు. కాస్త ముందుకు నడిచేసరికి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి దర్శన మిచ్చింది. రోడ్డమీదనే నిలబడి మా గ్రామదేవతకు నమస్కారంచేసి మా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం.

పదిహేను సంవత్సరాల వయసుసులో జరిగిన ఈ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిది. మేము ఆరోజు బ్రతికి బట్ట కట్టడానికి కారణం దైవ కృపా, ప్రకృతి మాయా లేక మా డ్రైవరు భ్రమా అనేది కచ్చితంగా చెప్పలేం. కాని సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో ఆ స్త్రీ రూపం ఉన్నట్లు కనిపించడం వల్లనే డ్రైవరు బస్సును ఆ విధంగా నడిపి అందరి ప్రాణాలు కాపాడాడు అనేది మాత్రం, నమ్మలేని నిజం. అరవై సంవత్సరాల తర్వాత కూడా ఈ విషయం తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఆరోజు ఆ విధంగా మా ‘దెయ్యాల బస్సును’ ‘మా గ్రామదేవత’ రక్షించక పోతే ఆ తరువాత గడపిన జీవితం, అనుభవాలు ఏవీ ఉండేవి కాదుగదా!

మరిన్ని కథలు

Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు
Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి