శృతి తప్పిన రాగం - బి.రామకృష్ణా రెడ్డి

Shruti tappina raagam

నేటి సమాజంలో నివసిస్తున్న సగటు మనిషి ఏదో ఒక విధంగా ఇతరులమీద ఆధారపడి తమ తమ అవసరాలు తీర్చుకోవడం సహజం. ఈ అవసరాలు తప్పనిసరి అయినవి కావచ్చు, లేదా సామాజిక హోదాకు అనుగుణంగా కావచ్చు.ఇటువంటి అవసరాలు తీర్చుకోవటానికి మనము ఇరుగుపొరుగు వారితో కానీ, ఏ పరిచయము లేని వారితో గాని కొంత అనుబంధాన్ని కొనసాగించవలసిందే. ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆ సంబంధాన్ని కొనసాగించవచ్చా! లేదా !అని నిర్ణయించుకోలేక పోతే ... సున్నిత స్వభావం గల కొందరు వ్యక్తులకు ఏదో ఒక సందర్భంలో అటువంటి వారితో ఆటంకాలు ఎదురవుతాయి. అదృష్టవశాత్తు బయట పడటం కానీ, చాకచక్యంగా వ్యవహరించ గలగటం వలన కానీ ,ఆ సమస్యను అథికమించక పోతే ఆ కుటుంబాలే విచ్ఛిన్నం కావచ్చు. ఆపదలో ఉన్న ఒక స్త్రీ ని ఆదుకునే ప్రయత్నంలో, ఆమె వ్యక్తిగత ప్రవర్తన విషయంలో పొరబడి, ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి, తప్పించుకున్న సంఘటన ఒకటి గుర్తుకు వచ్చి, ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు జాగరూకత వహిస్తారనే ఆలోచనే ఈ అక్షర రూపకల్పన. ఇక అసలు కథలోనికి విపులంగా వెళితే.... 1986-1990 వ సంవత్సరం మధ్య నేను ప్రస్తుతం స్థిర నివాసం ఉంటున్న ఇంటిలో కాక ,మాకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మల్కాజిగిరిలో అద్దె ఇంట్లో ఉండేవాడిని. ఆ రోజుల్లో ఉద్యోగరీత్యా నేను ఆఫీస్ కి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటలకు కానీ ఇంటికి చేరుకునే అవకాశం లేకుండా పోయేది . కారణం ఓవర్ టైం పనిచేయటం వలన .అందుచేత నాకు ఇరుగుపొరుగు వారితో ఎక్కువగా పరిచయాలు ఉండేటివి కాదు .ఇంటికి కావలసిన అన్ని వసతులను, పిల్లలకు కావలసిన సౌకర్యాలు అన్ని మా శ్రీమతి స్వయంగా చూసుకునేవారు. ఇంటిలో పని చేయటానికి ఒక పని మనిషి కూడా ఉండేది. కానీ నేను ఆవిడను ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడూ చూడలేదు. మేము అద్దెకు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉండే మరో ఇంటిలో ఒక మరాఠీ మహిళ పనిమనిషిగా ఉండేది. ఈ ఇద్దరు పని మనుషులు ముందుగానే పరిచయస్తులో, లేక ఎదురుగా ఉండడం వల్ల కలిగిన పరిచయమో తెలియదు కానీ ,ఈ మరాఠీ మహిళ తన పని అయిపోయిన తరువాత, మా ఇంట్లో పనిచేస్తున్న మహిళ దగ్గరకొచ్చి, కబుర్లు చెబుతూ, భేషజాలు లేని మా శ్రీమతితో పరిచయం ఏర్పరుచుకుని, అప్పుడప్పుడు ఆర్దిక సహాయము,బట్టలు పొందుతూ ఉండేదట. ఆ విషయాల గురించి నేనెప్పుడూ పట్టించుకునే వాడిని కాదు. ఇంటి దగ్గర ఉన్న ఆదివారాలలో వీరి కలయికను ఒక సాధారణ విషయంగా గమనించే వాడిని. నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 1990లో మా స్వగృహంలో చేరిన తర్వాత ఆ యువతి ఎప్పుడూ మా దగ్గరకు వచ్చినట్లు గుర్తులేదు. కానీ మా శ్రీమతికి అప్పుడప్పుడు మార్కెట్లో కనిపించేదట. ఈ పూర్వ పర్వాన్ని ఇక్కడ కట్ చేస్తే.... అది 1998వ సంవత్సరం .మాది కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీ కావున అక్కడక్కడ విసరి పారేసినట్లు అతి పలుచగా ఇళ్ళు ఉండేవి .రోడ్డు సౌకర్యము, నీటి సౌకర్యం, కమ్యూనికేషన్ వ్యవస్థ ,విద్యుత్ వెలుగులు అంతంత మాత్రమే. ఇటువంటి వాతావరణంలో రాత్రిపూట దొంగతనాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉండేవి. అందుచేత కాలనీవాసులు కర్రలు ,టార్చ్ లైట్లు ధరించి ఐదారు మంది ఒక గ్రూపుగా ఏర్పడి, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళం. పోలీస్ పెట్రోలింగ్ కూడా అప్పుడప్పుడు ఉండేది. ఇలా వారము , పది రోజులకు ఒక ఇంటి సభ్యుడు ఈ డ్యూటీ చేయవలసి వచ్చేది. ఒక రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మాఇంటి గేట్ గట్టిగా శబ్దం చేస్తూ ..సార్ !సార్! అనే పిలుపు వినిపించింది . నేను, మా శ్రీమతి ఇద్దరమూ లేచి కిటికీలో నుండి గమనిస్తే ,ఎవరో ఒక మహిళ గేటు ముందు నిలబడినట్టు ఆ చీకటిలో అస్పష్టంగా కనిపించింది. బయట లైట్ వేసి ఎవరూ? అని కిటికీ నుండి అడిగితే" నేనమ్మా! మనీషా"ను అని అన్నది. ఆవిడ ఎవరో కాదు. మేము అద్దెకుంటున్న కాలనీలో మా ఆవిడకు పరిచయమై, సహాయం పొందిన మహిళ అని మా ఆవిడ ద్వారా తెలిసింది. తలుపు తెరచి, విషయం తెలుసుకుందామని, మా ఆవిడకు తోడుగా నేనూ బయటకు వెళ్లాను. తనని గమనిస్తే బట్టలు నలిగి, జుట్టు చెదరి ,ఏదో గాభరాగా ఉన్నట్లు కనిపించింది. విషయం ఏమిటి అని ఆరా తీస్తే, తను మాకు దగ్గరలో ఉన్న కాలనీలో తెలిసిన వారి ఇంటికి దావత్ కు వచ్చి తిరిగి ఒంటరిగా వెళుతూ ఉంటే తనను ఎవరో రౌడీలు వెంబడి స్తున్నారని, వారి నుండి తప్పించుకోవటానికి ఇటు వచ్చానని ,ఈ రాత్రికి మా ఇంటిలో ఉండటానికి అవకాశం ఇవ్వాలని, లేదా తన ఇంటిదగ్గర వరకు నన్ను తోడుగా రమ్మని అడగటం జరిగింది. నేను మా ఆవిడ ఆలోచించి తనను వారి ఇంటిదగ్గర విడచి రావటమే మంచిదని భావించి, చేతిలో ఒక కర్ర ,మరియు టార్చ్ లైట్ తీసుకొని, ముందు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో అని ఆలోచించకుండా, ఆవిడ వెంట కొంత దూరం నడిచి వెళ్ళాను. ఒక సందు మలుపు తిరిగితే మెయిన్ రోడ్ వస్తుంది. ఆమె అక్కడ ఆగి, సార్ !మెయిన్ రోడ్డు వరకు నన్ను వాళ్ళు వెంబడించారు. నేను తప్పించుకొని ఇటువైపు వచ్చాను .ఇటువైపే వాళ్ళు ఉండవచ్చు ...అని ఆవిడ నాతో అంది . నేను కొంచెంసేపు ఆలోచించి ,పెట్రోలింగ్ చేస్తున్న కాలనీవాసులు అటువైపు వస్తున్నారని వారు వేస్తున్న విజిలె్ మరియు కర్రల శబ్దము ద్వారా గ్రహించి ,వారితో కలసి వెళ్దామని అక్కడే ఆగాను. కానీ వారికన్నా ముందే పోలీస్ పెట్రోలింగ్ వాహనం మా వైపు రావటం ,అందులో ఈవిడను వెంబడించిన వ్యక్తులు పోలీసుల అదుపులో ఉండటం ,నన్ను కూడా ఆ ముఠా వ్యక్తే అనుకొని ఈవిడతోపాటు నన్ను కూడా జీపులో ఎక్కమని చెప్పడం, ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోతున్నాయి. నేను ఆ పోలీసు వ్యక్తితో అసలు విషయం ఏమి జరిగిందో ,నేను ఎందుకు బయటకు వచ్చానో తెలియజేసే ప్రయత్నం చేశాను. కానీ వారు ఏమి వినిపించుకోలేదు. నేను ఆశించినట్లే పెట్రోలింగ్ చేస్తున్న మా కాలనీ వాసులు మా మాటల చప్పుడికి మా దగ్గరికి రావడం జరిగింది .వారు ఇచ్చిన వివరణ మూలంగా నన్ను కాలనీ వాసిగా నిర్ధారించుకుని, అమాయకంగా ఇటువంటి మహిళకు సహాయం చేయవచ్చిన వ్యక్తిగా భావించి ,ఆ ముగ్గురిని స్టేషన్కు తరలించారు. తరువాతి విచారణలో నిర్ఘాంతపరచే విషయం ... ఆమె ఒక్క వ్యభిచారిని అని, తరచుగా మాకు దగ్గరలో ఉండే కాలనీ లో మరో యువతితో కలిసి ఒక ప్రదేశంలో ఇటువంటి వృత్తి కొనసాగిస్తుందని, బేరసారాలలో తేడాలు వచ్చినప్పుడు బయట పడటం వలన పోలీస్ స్టేషన్ కూడా అప్పుడప్పుడు వెడుతూ ఉండేవారని, పోలీసులు దేహశుద్ధి చేసి, వారి దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని విడిచిపెట్టారని తెలిసింది. కొన్ని రోజుల తరువాత మేము ఇంతకు మునుపు ఉంటున్న కాలనీ వైపు వెళ్లి ఈవిడను గురించి విచారిస్తే తను భర్త నుండి విడిపోయి, తన కూతురితో ఒంటరిగా వచ్చిన ఒక మరాఠీ యువతి అని ,మొదట్లో సత్ప్రవర్తనతో ఉండేదని, తర్వాత చెడు సహవాసాలకు, మధు పానానికి బానిసై ఇలాంటి పనులు చేస్తుందని తెలిసింది . ఆ సమయములో ఏదో ఒక అదృశ్య శక్తి నాకు సహాయ పడినట్లు...పెట్రోలింగ్ చేస్తున్న కాలనీవాసులు అటువైపు రావడం, జరిగిన విషయం తెలుసుకుని ,నా పరిచయము మరియు ప్రవర్తన పోలీసువారికి తెలియజేయడం వలన ఆ నిందితులతో పాటు నన్ను స్టేషన్ కి తరలించలేదు . లేనిపక్షంలో ఆ నిందితులతో పాటు నన్ను కూడా స్టేషన్ కు తరలించి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వారేమో! కానీ ఇది తాత్కాలిక అపనింద మాత్రమే. ఎదుటి వారి ఆలోచనా విధానం, ,ప్రవర్తన ,ఉద్దేశం, ఏదైనప్పటికీ మనము సత్ సంకల్పముతో ముందుకెల్లి అసలైన సహాయార్థిని ఆదుకునే ప్రయత్నంలో, మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా, చివరకు అది సత్ఫలితాలను ఇవ్వగలిగితే, దాని ద్వారా పొందే ఆనందం చాలా తృప్తినిస్తుంది. --కొసమెరుపు-- --------------------- ఈ సంఘటనలోని మరాఠీ మహిళ తన కూతురిని మా అబ్బాయి చదువుతున్న హై స్కూల్ లోనే చదివించేది. బురదగుంటలో తామర పువ్వు వికసించినట్లు ఆ అమ్మాయి చదువులో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉండేదని, తన ప్రతిభను గమనించిన పాఠశాల యాజమాన్యం స్కూల్ ఫైనల్ వరకు ట్యూషన్ ఫీజు తీసుకోకుండానే చదివించారని తెలిసి, కనీసం అమ్మాయి అయినా బాగుపడాలని మనసారా కోరుకునే వారం ఆ రోజుల్లో. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత వారికి సంబంధించిన సమాచారం పూర్తిగా మరుగున పడిపోయింది. ***

మరిన్ని కథలు

Nene apaadhini
నేనే అపరాధిని
- సరికొండ శ్రీనివాసరాజు
Parasuraamudu
భాగవత కథలు - 16 పరశురాముడు
- కందుల నాగేశ్వరరావు
Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు