తగినశాస్తి - డి.కె.చదువులబాబు

Tagina Saasthi

చెన్నపట్నంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. వ్యాపారంలో మోసాలు చేసి బాగా సంపాదించాడు. అయినా తింటే ఖర్చవుతుందనే రకం. ఒకసారి పనిమీద ఉదయమే బయలుదేరాడు. ఇంటికి త్వరగా వద్దామనుకున్నాడు.చల్లటి పొద్దున చెప్పులేసుకెళ్ళటం దండగ. చెప్పులు అరిగిపోతాయనుకున్నాడు. చెప్పుల్లేకుండా బయలుదేరాడు. పని పూర్తయ్యేసరికి మధ్యాహ్నమయింది. ఇంటి దారి పట్టాడు.

వేసవి కాలం కావటం వల్ల కాళ్ళు మండిపోతున్నాయి. పదడుగులు కూడా వేయలేక పోయాడు. ఇంటికెలా చేరటం అనుకున్నాడు. ఓగోడ నీడకు చేరి ఆలోచనలో పడ్డాడు. ఇల్లు చేరాలంటే రిక్షా ఎక్కడం లేదా చెప్పులు కొనడం రెండే మార్గాలు. రెండూ డబ్బు దండగ పనులే. మరి పైసా కూడా ఖర్చు కాకుండా ఇల్లు చేరడమెలా? అని ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. వెంటనే దగ్గరగా ఉన్న చెప్పుల దుకాణంలోకి వేగంగా నడిచాడు.

"మా తమ్ముడికి చెప్పులు కావాలి. చూపించండి" అన్నాడు. తన పాదాల కొలత సరిపోతుందన్నాడు. రకరకాల చెప్పులు చూశాడు. పిసినారి ధనయ్య అలాంటి విలువైన చెప్పులు ఎన్నడూ తొడగలేదు. పైసా ఖర్చు కాకుండా ఆ చెప్పులు ఒక్క రోజయినా తొడగాలనుకున్నాడు. మంచి విలువైన చెప్పులు ఎన్నుకున్నాడు. డబ్బు చెల్లించి చెప్పులపెట్టె తీసుకొని బయటకు నడిచాడు. బయటకు రాగానే పెట్టెనుండి చెప్పులు తీసి తొడుక్కుని దర్జాగా ఇల్లుచేరాడు. కొత్త చెప్పులను బాగా వాడాడు.

రెండు రోజుల తర్వాత చెప్పులను తీసుకొని కొట్టుకెళ్ళాలనుకున్నాడు. ఇంటి నుండి దారి పట్టాడు. వచ్చేవేళకు ఏ వేళవుతుందోనని పాతచెప్పులు వేసుకున్నాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. అంగడి దగ్గరకు వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. తన చెప్పులు అరిగిపోతాయికదా! అనుకున్నాడు. అంగడిదాకా కొత్తచెప్పులేసుకెళ్ళి అక్కడికెళ్ళాక తుడిచి, పెట్టెలో పెట్టి లోనికెళ్ళి చెప్పులు తిరిగిస్తే సరిపోతుందనుకున్నాడు. కొత్తచెప్పులేసుకున్నాడు. తన పాతచెప్పులు పెట్టెలో పెట్టుకుని బయలుదేరాడు. అలా నడుస్తూ తన లావాదేవీలకు సంబంధించిన ఆలోచనల్లోపడి అసలు సంగతి మరిచిపోయాడు. చెప్పుల అంగడి లోపలికెళ్ళేటప్పుడు చెప్పులు మార్చడం మరిచాడు. కొత్తచెప్పులు బయట వదిలి లోనికెళ్ళాడు.

"అయ్యా! మా తమ్ముడు నేను వెళ్ళే వేళకు కొత్త చెప్పులు కొెని తెచ్చుకున్నాడు. నాకు చెప్పులు ఎలాగూ ఉన్నాయి. మీ చెప్పులు తీసుకుని డబ్బు ఇవ్వండి" అని చెప్పులపెట్టె, బిల్లు కాగితం ముందరుంచాడు.

"అలా వెనక్కి తీసుకోవడం ఎలా కుదురుతుంది?"అన్నాడు యజమాని.

"ఎందుక్కుదరదూ? నీ చెప్పులేమన్నా బంగారమా? కొరుక్కుతిన్నానా? ఇచ్చినవి ఇచ్చినట్లు తెచ్చాను. అవసరంలేనివి మెడకేసుకుని తిరగమంటావా?" అవసరమైతే వచ్చి మీ దగ్గరే కొంటాలే !" అంటూ వాదనకు దిగాడు.

విధిలేక చెప్పులవ్యాపారి పెట్టె తీసుకుని విప్పి చూశాడు. లోపల అరిగిపోయి, చితికిపోయిన పాతచెప్పులున్నాయి. ధనయ్య తన పొరపాటుకు అవాక్కయ్యాడు. వెంటనే లేచి బయటకు పరుగెత్తాడు. బయట తాను వదిలిన కొత్తచెప్పుల్లేవు. ఎవరో తొడుక్కెళ్ళారు. అక్కడ ఓ క్షణం కూడా ఉండలేక వేగంగా ఇంటి దారి పట్టాడు. ఇంటికొచ్చాక పాతచెప్పులు షాపులో వదిలేెసి వచ్చానని గుర్తించాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రెండురోజులు కొత్తచెప్పులతో తిరగడంవల్ల కాళ్ళకు గాయాలయ్యాయి. పిసినారితనంతో మందులు వాడక గాయాలు పెద్దవయ్యాయి. కొత్తచెెప్పులు, పాతచెప్పులు పోవడమేకాక గాయాలు నయం కావడానికి ఐదువందలు ఖర్చయింది.

విషయం తెలుసుకున్న ధనయ్య మిత్రుడు రామనాథం"ఒరే! నిన్ను మొదట్నుండీ చూస్తున్నా! అతి తక్కువ సమయంలో చాలా ధనం సంపాదించావు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరాక కూడా అతి పిసినారితనం మంచిది కాదు. కనీస అవసరాలక్కూడా ఉపయోగించని ధనం ఎందుకు? నీకుటుంబ అవసరాలు తీర్చుకుంటూ పదిమందికీ చేతనైనసాయం చేసినప్పుడే నీ సంపదకు సార్థకత" అంటూ హితోపదేశం చేశాడు.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు