స్వయం ఉపాధి - మద్దూరి నరసింహమూర్తి

Swayam vupadhi

"ఏరా నాన్నా, నీ పదోతరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయో ఏమేనా తెలిసిందా" కుతూహలంగా అడిగేడు మధ్యతరగతి తండ్రి - నారాయణ, కొడుకుని.

"పదిహేను రోజుల్లో వస్తాయని ఈరోజు ఉదయమే తెలిసింది నాన్నా, నేనే మీకు చెపుదాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే అడిగేరు" ఉత్సాహంగా బదులిచ్చేడు రాజు.

"మార్కులు ఎలా ఉంటాయనుకుంటున్నావు"

"బాగానే వస్తాయి నాన్నా"

"అలాంటప్పుడు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నావు, ఏమిటి అవాలనుకుంటున్నావు? నాకైతే, నిన్ను ఇంజనీర్ గా చూడాలని ఉంది"

"క్షమించండి నాన్నా. నేను, నా స్నేహితుడు రమేష్ ITI లో చేరాలని అనుకుంటున్నాం"

"అదేమిటి అలా ఆలోచించేరు" ఆశ్చర్యం ఆత్రుత కలబోసి అడిగేడు.

"అదంతే నాన్నా. ఇంజనీర్ అవ్వాలనుకుంటే బోలెడంత ఖర్చుపెట్టాలి. అంతా చేసి ఇంజినీర్ అయితే, మీలా నీతిగా నడవనివ్వదు ఈ లోకం."

"నీ ఆదర్శం బాగుంది కానీ, ITI లో చేరి ఏమిటి అవాలనుకుంటున్నారు."

"నేను ఎలక్ట్రీషియన్ కోర్సులో జాయిన్ అవుతాను. రమేష్ ప్లంబర్ కోర్సులో జాయిన్ అవుతాడు."

"అసలు అలా ఎందుకు అనుకున్నారు?"

"ఆ కోర్సులు నేర్చుకొని మెకానిక్ గా స్వంతంత్రంగా ఉంటే, అవినీతిగా పని చేయవలసిన అగత్యం లేనే లేదు. ఏళ్లతరబడి మిమ్మల్ని చూస్తున్న నాకు, మీలాగే తలెత్తుకొని ఉండాలనిపిస్తోంది. అలా ఉండాలంటే, స్వతంత్రంగా ఉంటేనే నాకు సాధ్యం."

అడ్డాలనాటి బిడ్డ ఈరోజు చెట్టంత ఎదగడం చూసి, పొంగిన పితృప్రేమ కాసింత దాచుకొని, "ఆ చదువుకి ఎంత ఖర్చు అవుతుందో ఏమేనా తెలుసుకున్నారా"

-2-

"ఇంజనీర్ చదువుకంటే చాలా చాలా తక్కువ నాన్నా. పైగా, 10 తరగతిలో మాకు వచ్చే మార్కులు బట్టి, ఫీజులో రాయితీ వచ్చే అవకాశం ఉంది. చదువు ముగిసిన తరువాత ఎవరి దగ్గరో నాలుగునెలలు పనిచేసి మెళుకువలు తెలుసుకుంటే, ఆ తరువాత స్వతంత్రంగా స్వయంగా పని ఆరంభించడమే. పని సక్రమంగా చేస్తే, మంచి గుర్తింపు ఆదాయం రెండూ వస్తాయి అన్న నమ్మకం ఉంది మాకు"

"నా ఆర్ధిక అసమర్థతే నిన్ను ఇలా ఆలోచింపచేసిందేమో" అన్నాడు ఆవేదనగా R & B ప్రభుత్వ కార్యాలయంలో హెడ్ అసిస్టెంట్ గా పనిచేసే నారాయణ.

"నేను అలా అనుకోవడం లేదు. మీరు కూడా అలా అనుకొని మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి. మీ నీతి నిజాయతి గురించి నేను నా స్నేహితులు ఎంతో గర్వంగా ఉంటాం ఎప్పుడూ"

"నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత నేను మాత్రం ఏం చెప్పను. పోనీ ఏదేనా డిగ్రీ కోర్సులో చేరతావేమో ఆలోచించు, కడుపులో చల్ల కదలని సర్కారు ఉద్యోగం వస్తుంది కదా."

"లేదు నాన్నా. నా మనస్తత్వానికి సర్కారు ఉద్యోగం పడదు. అక్కడ పాతుకుపోయిన అవినీతిలో మీరు ఎలా నెట్టుకొస్తున్నారో కానీ, నాకు చేత కాదు."

"ఇంకా పదిహేను రోజుల తదుపరి మాట కదా. ఈమధ్యలో నీ మనసు మారితే చెప్పు. డబ్బు సమకూర్చుకుందికి సమయం కావాలి కదా"

"నా గురించి మీరేమీ చింతపడకండి నాన్నా. నేను చదివే ఎలక్ట్రికల్ పనులు రమేష్ కి నేర్పడానికి, అలాగే వాడు నేర్చుకొనే ప్లంబింగ్ పనులు నాకు నేర్పడానికి మేమిద్దరం నిశ్చయించుకున్నాము. ఆ విధంగా, మేమిద్దరమూ రెండు పనులూ చేయగలిగే ప్రయోజకులమవ్వాలని మా కోరిక. మీ ఆశీస్సులుంటే చాలు." అంటూ –

రమేష్ ని కలవడానికి బయలుదేరేడు రాజు.

-3-

కొడుకు తన కష్టాన్ని అర్ధం చేసుకున్నాడన్న ఆనందంతో బాటూ తన ఆర్ధిక పరిస్థితి వలన వాడిని ఇంజనీర్ గా చూడలేకపోతున్నానన్న దుఃఖం కలబోసి తడిసిన కళ్ళు తుడుచుకుంటున్న నారాయణ వీపు మీద –

తన చేత్తో వ్రాస్తూ "మనల్ని అర్ధం చేసుకొని మనకి భారం కాకుండా సరియైన దారి వెతుక్కుంటున్న సంస్కారవంతమైన అబ్బాయిని ఇచ్చిన భగవంతుడికి నమస్కారం పెట్టుకొని, వాడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించమని వేడుకుందాం" –

అని అనునయించింది భార్య.

నారాయణ నిజాయతీని భరించలేని అతని సహోద్యోగులు –

‘గడ్డివాము దగ్గర కుక్క’ , ‘చేతకాని వాడు’, ‘అసమర్ధుడు’ అని ఎగతాళి చేస్తుంటారు.

ఎవరేమనుకున్నా - నారాయణ మాత్రం తనదైన నిజాయతీకి ముక్కుసూటి వ్యవహారం కలగలిపి, తన పని తాను చేసుకుంటూ, జీతంమీదే ఆధారపడి, బల్ల క్రింద చేతులు చాపక, మనసు చెప్పినట్టు నడుచుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉంటాడు.

ఉదయం, రాత్రుళ్ళు రెండేసి గంటలు ట్యూషన్స్ చెప్పి వేన్నీళ్ళకి చన్నీళ్లన్నట్టు అధిక ఆదాయం కోసం కష్ట పడుతూఉంటాడు.

గుట్టుగా ఇల్లు నడుపుకొని వస్తున్న భార్య, తండ్రి కష్టాన్ని అర్ధం చేసుకొని గొంతెమ్మ కోరికలు కోరని కొడుకు - అతనికి అందిన ఎనలేని విలువైన అదృష్టం.

ఇరవై రోజుల తరువాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. రాజు రమేష్ ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయేరు.

ఈ మధ్యన కొడుకు ఏమేనా మనసు మార్చుకున్నాడేమో తెలుసుకోవాలని, నారాయణ –

-4-

"ఏరా నాన్నా మంచి మార్కులతో రిజల్ట్స్ వచ్చేయి కదా. పైచదువులు గురించి ముందు అనుకున్నదేనా లేక మరేమైనా ఆలోచించేవా"

"ముందు అనుకున్నట్టే నాన్నా" అన్న రాజు జవాబు విన్న నారాయణ మనసులో కొడుకు పరిపక్వతకు పులకిస్తూ, తన అశక్తతని తలచుకొని భారంగా నిట్టూర్చేడు.

అనుకున్నట్టుగానే ITI లో చేరిన రాజు రమేష్ ఇద్దరూ, వారు కోరుకున్న ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కోర్సులలో ప్రావీణ్యం సంపాదించేరు.

మనకి దొరికిన దానితోనే సంతృప్తిగా ఉంటే, తనువూ మనసూ ఆరోగ్యంగా ఉంటాయి అన్న ఆలోచనతో ఉన్న వారిద్దరూ దొరికే చిన్న చిన్న ఆదాయంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అచిరకాలంలోనే రెండు విద్యలలో నైపుణ్యులు అనిపించుకున్నారు.

ఒక రోజు రాజు రమేష్ తో కలిసి నడుస్తూ - "రమేష్, మనం ఒక పని చేద్దాం. ‘రాజురామేష్ ఎలక్ట్రికల్ & ప్లంబింగ్ యూనిట్’ అన్న పేరుతో మన ఇద్దరి మొబైల్ నెంబర్ లు ఉన్న పాంప్లెట్ లు న్యూస్ పేపర్లలో పెట్టి వీలైనంత ఎక్కువ జనానికి అందేటట్టు చేద్దాం. ఏమంటావు నువ్వు"

"తప్పకుండా చేద్దాం. అంతేకాదు, మన పని అవసరంతో మనలో ఎవరికి ఫోన్ వచ్చినా, ఎవరు ఖాళీగా ఉంటే వారు ఆ పనిని అటెండ్ అవుదాం."

"అయితే పద, ఇప్పుడే న్యూస్ పేపర్లు పంచే అబ్బాయిలతో మాట్లాడుకొని పాంప్లెట్ లు ప్రింట్ చేయిద్దాం."

అలా ఇద్దరూ వారు అనుకున్నది ఆచరణలో పెట్టిన నెల తిరక్కుండానే, ఇద్దరికీ పనులకోసం పిలుపులు రావడం ఆరంభం అయేయి.

పనికి పిలుపు వస్తే, వెళ్లి ఏమైనదో చూసి ఏమి చేసి సరిదిద్దాలో చెప్పడానికి 300 రూపాయలు తీసుకొని, అవసరమైన సామగ్రికి వేరే డబ్బు, వారి పనికి వేరే డబ్బు అన్న విధంగా వసూలు చేసేవారు.

-5-

ఆరు నెలలు తిరిగేసరికి, వారి స్వయం ఉపాధితో పనిలో ప్రావీణ్యతతో ఎక్కువగా పనులకి పిలుపులందుకుంటూ ఇద్దరికిద్దరూ చేతినిండా నికరమైన సంపాదనలో పడ్డారు.

ఆలోచన ఆచరణలో చూపించి, త్వరలోనే మంచి పేరు తెచ్చుకొని, చేతినిండా ఆదాయం తెచ్చుకుంటున్న రాజుని చూసుకొని కించిత్తు గర్వపడుతూ మురిసిపోయిన తల్లితండ్రులు –

సంస్కారవంతుడు, వివేకవంతుడు, బాధ్యతతో వ్యవహరించే కుమారుడిని ప్రసాదించిన భగవంతుడికి మౌనంగానే మనసులో కృతఙ్ఞతలు తెలియచేసుకుంటూ –

‘వీడితో సమానమైన సంస్కారవంతమైన అమ్మాయిని వెదికి తెచ్చి త్వరలో ఒక ఇంటివాడిని చేయాలి’ అని నిశ్చయించుకున్నారు.

*****

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ