చిన్ని ఆశ - బంటుపల్లి శ్రీదేవి

Chinni Aasha

అవును! అది ‘చిన్నిఆశే’, తీర్చలేని ఆశ, తీరని ఆశ.

“జన్మంతా నా మనసుని కాల్చేస్తుంది...నన్నుధహించేస్తుంది

ఆలస్యం అమ్రుతం విషం అన్నారు పెద్దవాళ్ళు. కాని, దాన్ని కొన్నింటికి అన్వయించుకుంటాం, కొన్నింటికి అన్వయించుకోం.

జీవితంలో ఏది ముఖ్యమో! తెలుసుకోలేము సుమా!

తెలుసుకునేసరికి ‘జీవితం’ చేతిలో ఉండదు

‘జీవితం’ అంటే, అదేనేమో!"

ఎడమ చేతితో కళ్ళద్దాలను తీసుకుని, కళ్ళవెంబడి వచ్హిన కన్నీళ్ళను భారంగా తుడుచుకున్నాడు చక్రవర్తి.

కళ్ళ ముందు గడిచిన కాలం గిర్రున వెనక్కి తిరిగింది.

“అతి పేద కుటుంబం, తల్లితో పాటు ఇద్దరు చెల్లెళ్ళు...తండ్రి పోవడం తో పిల్లాడి మీదే కుటుంబ భాద్యత ఉంటుంది, కాస్తా ఆలోచించుకోండి” పిల్లాడు కష్ట జీవి...బుద్ది మంతుడు...చెడు అలవాట్లు లేవు...ఇకపోతే పిల్ల అదృష్టం, పిల్ల వెళ్లిన వేళా విశేషం” అంటూ నసిగిన నానమ్మతో....

“ఖాయం చేసేయమ్మా, కష్టం సుఖం తెలిసినవాడైతే చక్కగా చూసుకుంటాడు, ఇక పోతే మనపిల్ల వనజ కాకి బంగారమాయే...వచ్హిన ప్రతివాడు పిల్ల నల్లగా ఉంది అంటూ వెనుతిరుగుతున్నారు, వీళ్ళు అమ్మాయిని నచ్హారు కదా! పైగా చిన్నదో పెద్దదో ప్రయివేటు ఉద్యోగం కూడా ఉంది, ఇక మరి ఆలోచించద్దు” అన్నాడు కొడుకు పరంధామయ్య ...

అంతే, భాజా, భజీంత్రీలు మ్రోగాయి..

వనజ,చక్రవర్తిల పెళ్లి జరిగిపోయింది. ఉన్నంతలోకట్న కానుకలు ఇచ్చి ఘనంగా మూడో పిల్లకి కూడా ‘పెళ్లి’ చేసేసాడు అనిపించుకున్నాడు పరంధామయ్య.

చక్రవర్తికి కూడా ఎన్నో సంభందాలు వచ్చి ఆస్తి పాస్తులు లేవని, జీత బత్యాలు తక్కువని వెనక్కి వెల్లిపోయేవి.

అంతేకాక చిన్నప్పుడు నుంచి ఎంతో ప్రేమ గా ఉండే మామయ్య కూతురు ఎంతో ఆస్తి ఉన్న రవిని పెళ్ళాడిందే తప్ప బావ చక్రవర్తి ముఖం చూడలేదు...

“నీరజా...నువ్వు నా ప్రాణం’, నువ్వు నా మరదలివి, నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా...నువ్వు అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్లిపోకు...ఇంతవరకు నా మీద చూపించింది ‘ప్రేమ కాదా! నీరజా”అని ఎంతో చక్రవర్తి అడిగాడు మరదల్ని.

కాని, డబ్బు లేని కారణంగా నీరజ నన్ను కాదంది...అందుకే..అందుకే ... ఆ ‘డబ్బు సంపాదించాలి’....కోట్లు సంపాదించాలి అని ‘కసి’ పెంచుకున్నాడు చక్రవర్తి.

“వనజ నల్లగా ఉంటేనే౦?....నాకు చేదోడు,వాదోడు గా ఉంటుంది. ముఖ్యం గా నా ఉద్యోగం, నేను నచ్హాను....చాలు.....రూపాయ్ రూపాయ్ సంపాదిస్తా...కోటీశ్వరుడ్నిఅవుతా!అని గట్టిగా అనుకున్నాడు మనసులో చక్రవర్తి.

వనజ,అతి సామాన్యుడు, నిరుపేద ఇంట్లో అడుగుపెట్టి, భర్త చక్రవర్తికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్హింది. తన ఆడపడుచుల వివాహాలు జరిపించి, అత్తగారిని చక్కగా చూసుకునే ఇల్లాలైంది....తమ ప్రేమ కి ప్రతిరూపాలైన ఇద్దరి పిల్లల చదువులో, పెంపకంలో ఓ వైపు, ఇంకో వైపు ఇంటి భాద్యతలతో తలా మునకలైపోయినా, అలసిపోకుండా భర్త కి సహకరిస్తూ వస్తోంది వనజ.

కొన్నాళ్ళకి, చక్రవర్తి ఉద్యోగం పెద్దదైంది, .దానితో పాటు ‘రియల్ ఏస్టేట్’ వ్యాపారం లో డబ్బు సంపాదన పెరిగింది. సైకిల్ పోయి రెండు చక్రాల బండి వచ్చింది. మరి కొన్నాళ్ళకి, అది పోయి నాలుగు చక్రాల బండి వచ్హింది ఇంట్లోకి.

వనజకేం! అది కోటీశ్వరురాలు అంటున్నారు అంతా...

కాకి బంగారం కాకి బంగారం అన్నారు, చూడు ఇదంతా దాని దశ అంటున్నారు మరికొందరు..

ఇలాంటివి ఎన్ని విన్న!సంతృప్తిగా లేదు వనజకి ...ఎందుకో మరి?

“ఏమండీ ఈ రోజు మనిద్దరం గుడికి వెళ్ళి వద్దామండి” అంది వనజ

ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అన్నాడు చక్రవర్తి.

“ఈ రోజు మన పెళ్ళీ రోజు మర్చి పోయారా?”....

“ఓ అవును కదూ! ....ఆ...సాయంత్రం వెల్దాం, వేగం గా వస్తా”....అంటూ బయల్దేరాడు కారు తాలాలు గాల్లోకి ఎగరేస్తూ.....

ఎదురు చూసిన సాయంత్రం....రాత్రి అయింది....రాలేదు చక్రవర్తి.

రాత్రి పదింటికి వచ్హి నిద్రపోయిన భర్తని చూసి ‘పాపం అలసిపోయారు’ అనుకుని వనజ కూడా నిద్రపోయింది.

మరుసటి రోజు ఉదయం, యదా విదిగా రోజు మొదలైపోయింది....ఎవరి పనుల్లో వారు ములిగిపోయారు

నిన్న ‘మ్యేరేజ్ డే’ అని గాని....వనజ తో గుడికి వస్తానని చెప్పిన మాట గాని....ఇవేమీ పట్టించుకోలేదు చక్రవర్తి.

టేబుల్ మీద టిఫిన్ తింటున్న చక్రవర్తికి సడన్ గా అప్పుడు గుర్తుకు వచ్హింది, నిన్న మ్యారేజ్ డే రోజు గుడికి వెల్దామని వనజ అడిగిన విషయం.

“వనజా! ఇంకో రోజు నిన్నుగుడికి తీసుకుని వెల్తా,నిన్న వీలు కాలేదు” అని ముక్తసరిగా చెప్పాడు చక్రవర్తి.

పేలవంగా నవ్వింది వనజ.

ఇంతలో “నాన్న....ఈ రోజు మా స్కూల్లో పేరెంట్స్ డే మీరు రావాలి” అన్నాడు నందు.....

“నందూ నన్ను విసిగించకు నందూ, నాకు చాలా పనులున్నాయి,అమ్మ వస్తుంది కదా!అంటూ బయటకు వెళ్ళిపోయిన నాన్న మీద నందుకి ఉక్రోషం వచ్హింది.

ఆ కోపం అమ్మ మీద చూపిస్తూ,కంచం లో పెట్టిన ఇడ్లీ విసిరికొట్టాడు నందు.

“నందూ .... నాన్న బిజీగా ఉన్నారు నువ్వు అల్లరి చెయ్యకూదదు నాన్నా....మనకోసమేగా! నాన్న కష్టపడుతున్నారు, అలా నాన్నని ఇబ్బంది పెట్టచ్హా!అంటూ బుజ్జగించి ‘పేరెంట్స్ డే మీటింగ్ కి కాస్తా మనసు నొచ్హుకుంటూ తనే వెళ్ళింది.

ఇంకో రోజు, “అమ్మా....అమ్మా,,,,ఎక్కడున్నావ్? నా డాన్స్ ప్రొగ్రాం ఉంది రేపు రవీంద్ర భారతిలో నాన్నకి ముందుగా చెప్పు....రేపు నా ప్రొగ్రాం చూడడానికి రాకపోతే నేను ఊరుకోను” అని హెచ్హరిక చేసింది ఇంటర్ చదువుతున్న సింధు.

‘ఆ...అలాగే లే’అంటూ ఫోన్ తీసి భర్త కి ఫోన్ చేసింది వనజ.

“అమ్మా....సార్ మీటింగ్ లో ఉన్నారు తరవాత చెయ్యండి” అన్నాడు డ్రైవర్ ఫోన్ ఎత్తి....

అలా సాయంత్రం వరకు చేస్తూనే ఉంది ....ఇన్ని సార్లు డ్రైవర్ ఫోన్ ఎత్తటమే గాని చక్రవర్తి ఫోన్ ఎత్తకపోవడంతో కాస్తా కోపం వచ్హి ఫోన్ పక్కనే పెట్టేసింది వనజ.

వనజా భోజనం పెట్టు, ఆకలి గా ఉంది”. అంటూ వచ్చాడు చక్రవర్తి.

“ఏంటండి? ఈ రోజు ఎన్ని సార్లు ఫోన్ చేసినా మన డ్రైవర్ వీరాస్వామి ఫోన్ లిఫ్ట్ చెయ్యడమే గాని, మీరు ఎత్తలేదు”......అని అడుగుతున్న వనజతో...

“ఈ రోజు కాస్తా బిజీగా ఉన్నానోయ్, చిన్న చిన్న గొడవలు లావాదేవీలు ఉన్నాయి. డీల్ సెటిల్ చెయ్యాల్సి వచ్హింది.....ఫోన్ డిస్టెర్బెన్స్ కదా! అని మనవాడి కిచ్చా, ఆ .....ఈ పేపర్లు లోపల పెట్టు..... ఈ సంవత్సరం వచ్హిన లాభాలతో నాలుగు సైట్లు కొన్నాను, అన్నట్టు....ఆ బంగ్లా రేటు పెరిగేలా ఉంది....అప్పుడే అమ్మనని మీ బాబాయ్ వస్తే చెప్పు.....రేపు తెల్లవారి కాస్తా వేగం గా బయల్దేరాలి...అలారం పెట్టు” అంటూ అసలు ఎందుకిన్ని సార్లు చేసిందో కూడా కనుక్కోకుండా నిద్రకి ఉపక్రమించిన భర్త ని చుసి జాలి పడింది వనజ.

ఆరింటికి లేచిన సింధు, నాన్న రూం లోకి వచ్హి నాన్నని పట్టుకోవాలి అనుకుంది....కాని అప్పటికే వెల్లిపోయాడు చక్రవర్తి.

“అమ్మా.....అమ్మా......నాన్న ఏరి......మంచం మీద లేరు.....ఎక్కడికి వెళ్ళారు అని అడిగిన కూతురికి....ఈ రోజు నాన్నకి ముఖ్యమైన పని ఉందని....అందుకే నాలిగింటికే వెళ్ళిపోయారని.....ప్రొగ్రాం కి రానందుకు చాలా బాదపడి మరి వెళ్ళారని అబద్దం చెప్పింది” వనజ.

“నేను నీకు ముందే చెప్పాను కదా!....నాన్న రావాలని, అంటూ ఆరున్నరొక్క రాగం మొదలు పెట్టింది సింధు.

“నాన్న నీ ప్రొగ్రాం కి రానందుకు చాలా ఫీల్ అవుతున్నారు”.....అని అబద్దం చెప్పడంతో కాస్తా కన్విన్స్ అయి ఊరుకుంది సింధు.......

యధావిధిగా కూతురి డాన్స్ ప్రోగ్రాం చూడడానికి వెల్లింది వనజ.

ప్రోగ్రాం చాలా బాగా చేసింది, చిన్నారి ని ‘నాట్యమయూరి’ అని వెయ్యి నోళ్ళు వేల వేల రకాలుగా పొగిడారు, ఎంతో మెచ్హుకున్నారు.

చాలా గర్వంగా అనిపించింది వనజకి.

ఈ వేడుకకి నిజంగా చక్రవర్తి ఉంటే బాగుండు కదా! అని ఎన్ని సార్లు అనుకుందో వనజ.

“నా ప్రొగ్రాం నాన్న చూస్తే ఎంత బాగుండేదో!” అంది సింధు

“అయితేనేం? నాన్నకి ఫొటో లు చూపిద్దాం....రేపు పేపర్లో చూసి నాన్న చూడు ఎలా తబ్బిబైపోతారో అని కూతుర్ని ఊరడిస్తూ....ఇంటికి తీసికెళ్లింది వనజ

ఆ మరుసటి రోజు చక్రవర్తి ఇంటికి రాలేదు,కాస్తా ఫోన్ లో అయినా సింధు ని పలకరిస్తే బాగుంటుంది అని ఫోన్ చేసి చెప్పాలనుకుంది, కాని ఫోన్ కలవలేదు.

పేపర్లో, పొగడ్తల వర్షం కురుపించిన వార్త చూసిన సింధు, వాటిని కనీసం కట్ చేసి కూడా పెట్టు కోకుండా....అలా పక్కని పెట్టేసింది.

సింధు.... సింధు ముఖం చిన్నబోయింది పాపం

“నాన్నకి, తినడానికి కూడా టైం చిక్కడం లేదని....మనకోసం అంత కష్టపడుతున్నారని”......చెప్పబోయిన వనజ...నోటికి సింధు చెయ్యి అడ్డం పెట్టి....”వద్దమ్మా...అలా నువ్వు చెప్పకు అంటూ కన్నీళ్ళుపెట్తుకుంది సింధు.

సింధు ని వాటేసుకు ని వనజ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది.

“నాకు అంతా తెలుసు...మీ నాన్నకి డబ్బు పిచ్హి పట్టింది అని నాన్నమ్మ నాతో చాలా సార్లు అంది....అది నిజమే అమ్మా....నాన్నకి డబ్బు ఉంటే చాలు ....మనం అక్కరలేదు” అంది సింధు

“అదేంటి అలా అంటావు నాన్న ఎవరికోసం సంపాదిస్తున్నారు...మనకోసం కాదా!”అని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బుకాయించబోయింది వనజ.

కాని కళ్ళార్పకుండా జాలిగా వనజ కల్లల్లోకి చూస్తోంది.... సింధు

అది చూసి ఏడవటం ఆపేసింది వనజ

ఒక రోజు..... “ఏమండీ మీరు చేసింది ఏమి బాగాలేదు.....రాత్రి పగలు మాకోసమే కష్టపడుతున్నారు......డబ్బు కంటే మాకు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయ్ ....మీతో మాట్లాడి చాలా రోజులైంది అని మీ అమ్మ గారు వాపోతున్నారు.....కాస్తా ఇంటిపట్టున ఉండండి ఒక వారం రోజులు” అని అడిగింది వనజ.

“వనజా!....అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడతావేంటి? అమ్మకేమైంది? ....బాగానే ఉంది కదా! వారం రోజులంటే.....కొన్ని లక్షల వ్యాపారం దెబ్బ తింటుంది, అది నీకు తెలుసా!” అన్నాడు చక్రవర్తి

“డబ్బు మన దగ్గర ఎక్కువ ఉంటే...ఎలా కావాలనుకుంటే అలా......మనకు కావల్సినట్టు గడపచ్హు,...అమ్మతో...నీతో ...పిల్లలతో... తప్పకుండా గడుపుతా” .....అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు చక్రవర్తి.

“ఎక్కువ అంటే ఎంతండీ.......చిన్న ఉద్యోగం అని మానేసారు....రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించారు...ఇక చాలు....ఎక్కువ అన్నదానికి పరిమితి లేదు.....ఇంకో వెంచర్...ఇంకో వెంచర్ అంటూ పరుగులు పెడుతున్నారు ఈ పరుగు ఆపేయండి.... ఒక సారి అందరం బద్రాచలం వెల్లి వద్దాం....మీరు మా అందరితో గడిపినట్టుంటుంది పిల్లలు కూడా ఎప్పటినుంచో అడుగుతున్నారు” అనగానే.....అంత ఎత్తు లెగిచాడు చక్రవర్తి.....

“నీకు అర్ధం కాదా.....నాకు టైం లేదని చెప్పా కదా!ఎందుకలా బుర్ర తింటావ్” అని గసిరేసరికి మిన్నకుండి పోయింది వనజ.

అంతే, మరెప్పుడూ వనజ చక్రవర్తిని అడగలేదు.

చూస్తుండగానే నందు, సింధు పెద్ద వాళ్ళైపోయారు, చదువులు పూర్తైపోయాయి, ఉద్యోగాలలో స్థిరపడ్డారు .....ఎవరికి నచ్హిన వాల్లతో వాల్లు పెళ్ళి చేసుకోవాలని నిర్నయించుకున్నారు.

“ఆ విషయం లో నా వైపు నుంచి ఎటువంటి అబ్యంతరం లేదు” అంది వనజ.....చక్రవర్తి సలహా ఎవ్వరూ అడగలేదు....తండ్రి కాబట్టి చెప్పాలని వనజ వత్తిడి తేవడంతో పిల్లలిద్దరూ చెప్పారు........

ఇదిగో ఈ ఆస్తి నీది....ఇది నీకోసం అని ఇద్దరికీ ఆస్తి ఇచ్హాడు చక్రి

“మా బాల్యాన్ని మాకు కాకుండా చేసిన ఈ ఆస్తి మాకొద్దు నాన్నా.....మేము మీ కష్టంతో చదువుకున్నాం....దానితో కొద్దో గొప్పో సంపాదించుకుంటాం....మా కుటుంబంతో మమేకమై జీవించాలనుకుంటున్నాం...పరుగు పెట్టి బతకాలనుకోవటం లేదు నాన్నా! అన్నారు పిల్లలిద్దరూ

“మీకోసం కాకపోతే ఈ ఆస్తి ఎందుకు?” అని పిచ్హివాడిలా చూసాడు ఆ కాగితాల వైపు......

అప్పుడు మాత్రం నువ్వు” పిల్లలిద్దర్నీ సరిగా పెంచలేదు వనజ” అన్నాడు చక్రవర్తి.

పేలవంగా నవ్వి ఊరుకుంది వనజ.

“మా పెళ్ళిల్లు ఘనం గా చెయ్యక్కర్లేదు.....రిజిస్టార్ ఆఫీసులో సింపుల్ గా చేసుకుంటాం”....అని తెగేసి చెప్పారు ఇద్దరూ

“అదేంటి? ఇదంతా నేను వీళ్ళకోసం కదా సంపాదించినది, నేను పడ్డ కష్టం వృధా” అన్నమాట అని భాద పడుతున్న చక్రవర్తి కి ఆ ఆస్తి కాగితాలు పెద్ద విలువైన వి గా కనిపించలేదు.

“ఈ రోజు తన జీవితానికి ఒక అర్ధం ఉందా!.....నేను సంపాదించిన ఆస్తి నా భార్యకి గాని నా పిల్లలకి గాని అవసరమే లేదా?

ఏంటిది? “ అని తనమీద తనే జాలి పడ్డాడు చక్రవర్తి.

ఎవరెవ్వరికి ఇవ్వవలసిన లావా దేవీలు వారికి ఇచ్హి సెటిల్ చేసెయ్యాలి.....వాళ్ళకి అక్కర్లేనివి నాకు మాత్రం ఎందుకు.?”అని గట్టిగా అనుకున్నాడు మనసులో చక్రవర్తి.

కాని, ఎక్కడో మనసులో ఒక మూల....”ఈ డబ్బు కోసం ఎన్ని పాట్లు పడ్డాను?.....ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను?.....ఇప్పుడింత డబ్బును త్రుణపాయం గా ఎలా వదిలెయ్యను?” అని అనుకున్నాడు. ఇంతలోనే....

కాని ఇంత కస్టపడి సంపాదించిన ఈ డబ్బుకి విలువ ఉండాలి....దాన్ని సరైన మార్గం లో ఉపయోగించాలి అని అనుకున్నాడు ఈ సారి చక్రి.

ఇదివరకు అత్తయ్య గారు ఉండే వారు కాస్తా మనసుకి ఊరటగా ఉండేది...... “బద్రాచలం వెళ్ళాలి వెళ్ళాలి అంటూ ఉన్న అత్తగారిని....రా నానమ్మ నేను తీసుకు వెల్తా” అన్నాడు నందు.....నా కొడుకుతో నేను వెల్తా మీ అమ్మని నువ్వు తీసుకెళ్ళు అని మొండిపట్టు పట్టింది నానమ్మ. కాని, అది తీరకుండానే సంవత్సరం క్రితం ఆమె పరమపదించారు.ఇప్పుడు వనజ ని ఒంటరి తనం మరింత బాదిస్తోంది.

పిల్లలిద్దరూ రోజు మాట్లాడతారు.....రమ్మని పిలుస్తారు....కాని “నాన్న కోసం ఎదురుచూసేవాళ్ళేవరుంటారు”? నేను మీ దగ్గరకు వస్తే” అంటుంది వనజ.....

“అమ్మా! ఎప్పుడో వచ్హి.....ఏదో రాత్రి పడుకుని వెళ్ళి పోయేవాడికోసం నువ్వెందుకు ఎదురుచూడాలి?” అంటుంది సింధు

“అది నీకు అర్ధం కాదులే....ఆ ఎదురుచూపుల్లో ఎంతో ప్రేమ ఉంటుంది....తీయని బాధ ఉంటుంది....అది నీకు అర్ధం కాదులే” అంటుంది వనజ.

ఆ రోజు శు క్రవారం.

వనజ, చక్రవర్తిల పెళ్లి రోజు.....

నందూ....సింధూ ఇద్దరూ అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్హారు.

తలుపు తీసి లోపలికి వెళ్ళారు.

పట్టు చీర కట్టుకుని దేవుడిగదిలో అమ్మ...... పూజలో ఉంది అని ఇద్దరూ ఇంట్లో కూర్చున్నారు.

ఎంతకీ బయటకు రాలేదు అమ్మ.

“ ఎంత సేపని చూస్తాం? వెళ్లి అమ్మని తీసుకురా!” అన్నాడు నందు.

“ అమ్మా! ఇంకా ఎంతసేపునీ పతిదేవుడి గురుంచి పూజలు చేస్తావు?”

అంటూ వెళ్ళిన సింధు, వనజ భుజం మీద చెయ్యి వేయగాని వెనక్కి వాలిపోయింది వనజ.

అమ్మా...అమ్మా.......అని ఏడుస్తున్న సింధు చేతిలో అచేతనం గా అమ్మ.......... “అమ్మ మనల్ని ...ఈ లోకాన్ని వదిలి వెల్లిపోయింది”.......అని ఇద్దరూ బావురమన్నారు.

ఇంతకీ, ఈ పెద్దాయన ఎక్కడికెళ్ళినట్టు?అని అటు ఇటు చూస్తున్న నందూకి గేట్ దగ్గర కారు ఆగిన శబ్దం వినబడింది.

“వనజా...వనజా..... ఈ రోజు నేను ఎంత మంచి పని చేసానో తెలుసా!....అది వింటే ఎంత సంతోషిస్తావో తెలుసా!.....మన అవసరానికి మాత్రమే ఉంచి...పిల్లలు నువ్వు వద్దన్న ఆస్థిని అనాధ శరణాలయానికి రాసి వచ్హా.....ఇదిగో.ఇదిగో....ఇదిగో నీకోసం ‘బద్రాచలం టికెట్స్’ తెచ్హా.....రా బయల్దేరు....సాయంత్రమే ప్రయాణం......అక్కడనుంచి మనం తిరుపతి.....కానిపాకం....ఒకటేమిటి.....నువ్వు ఎక్కడికంటే అక్కడికి” అంటూ ....వనజని సంతోష పెట్టాలనుకుని వచ్హిన చక్రవర్తి భార్య శవాన్ని చూసి బిక్క చచ్హిపోయాడు చక్రవర్తి.

బిక్క చచ్చిపోయి గోడని పట్టుకుని మెల్లిగా కూర్చున్నాడు.

“నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేట్ “నాన్న అంది సిందు

పిల్లలిద్దరూ.....బావురుమన్నారు.......

డాక్టర్ అంకుల్ వచ్హి గుండె పోటు.....అని చెప్పారు

“అదేంటి, వనజకి గుండె పోటు అని ఎప్పుడూ చెప్పలేదే?” నాకు అన్నాడు మెల్లిగా

“ఇదివరకు..ఓక సారి వచ్హింది చక్రి... ఇదిరెండో సారి”....అన్నారు డాక్టర్ అంకుల్

నువ్వెప్పుడైనా పెళ్ళాం పిల్లల్ని పట్టించుకున్నావా! అని చూసిన సిందు చూపు....చక్రి గుండెల్లో గుచ్హుకుంది.

తదుపరి కార్యక్రమాలు చూడండి అంటూ.....ఇరుగుపొరుగు రాకతో కార్యక్రమం పూర్తైంది.

శూన్యం లోకి చూస్తున్నాడు చక్రవర్తి......

నాన్నా! అన్న సింధు పిలుపుతో ఈ లోకం లోకి వచ్హాడు చక్రవర్తి.

“నాన్నా ఇదిగో అమ్మ డైరీ ....ఇందులో కావల్సినంత ప్రేమ ఉంది....బతికెయ్....

ఇదిగో ఈ కుండలో అమ్మ ఆస్థికలున్నాయ్.....టైం ఉంటే గంగలో కలిపేయ్, వాయిదా వెయ్యకుండా ఇదైనా వెంటనే చెయ్యండి నాన్న” అంటున్న కూతురి వైపు చూడలేక ముఖం దించుకున్నాడు చకరవర్తి.

“ఇంతకంటే పెద్ద శిక్ష ఏ తండ్రికి వద్దు నాన్న, వస్తాం” అంటూ సిందు,నందు....వెల్లిపోయిన వైపు చూస్తూ ఉండిపోయాడు చక్రి.

అస్థికలు కలపడానికి బయలుదేరిన చక్రి...కారులో కూర్చుని...సింధు ఇచ్హిన డైరీ చదవ సాగాడు

“చిన్న ఆశ.................

చల్లని సాయంత్రం వేళ ఈ కారి డా ర్ లో చక్రి నేను ఎదురెదురుగా కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలని ఆశ......

అదిగో ఆ పరువల్లు తొక్కుతున్న సముద్రపు ఒడ్డున నడిచి నడిచి అలసిన వేళ.....ఒకరి పక్కన ఒకరం కూర్చుని సముద్రంతో మాట్లాడుకోవాలని ఆశ.......

చక్రీ, కాళ్ళ పట్టీలు అవి చేసే శబ్దాలు నాకు అస్సలు నచ్హవు...కాని, అవి నీకిష్టమని నాకు తెల్సు....అందుకే నీకోసం....నా కాళ్ళకు పట్టీలు వేసుకున్నా....అవి నువ్వు చూడాలని...ఆశ......

పెళ్ళి అయిన ఏడాది నువ్వు నన్ను దుర్గమ్మ గుడికి తీసుకెళ్ళావు గుర్తుందా!.....ప్రతి పెళ్ళి రోజు అక్కడకెళ్ళి నీతో కాసేపైనా గడపాలని ఆశ.........

నాయనమ్మ పిల్లలు, మనము...బద్రాచలం పడవలో వెళ్లి వస్తే....ఆ హాయే వేరు కదా! చక్రి.........

పిల్లలు నేర్చుకునే ముద్దు ముద్దు మాటలు నీకు చెప్పి మురిసిపోవాలని ఆశ..........

సింధు వేసిన డాన్స్ చూసి...చప్పట్లు కొడుతున్న ఆ జనసముద్రం లో నువ్వుంటే ఇంకెంత బాగుంటుందో..... సింధు ఇంత బాగా డాన్స్ చెయ్యడానికి కారణం నువ్వే ... ప్రతిరోజు క్లాస్ కి తీసుకొని వెల్లి ఎంత కష్టపడి ఉంటావో కదా! వనజ.....’నువ్వు చాలా గ్రేట్’ అని నువ్వు వెన్ను తడితే పొంగిపోవాలని ....ఆశ....

నందు వేసిన డ్రాయింగ్ చూసి ....పక్కింటి పింకీ (వాడి క్లాసమ్మాయి) వచ్హి వాటేసుకుంది తెలుసా!.

నా చిన్ని చిన్ని ఆశలు నీకు చెప్పాలి అని చాలా సార్లు అనుకునే దాన్ని...డబ్బు వెంట పిచ్హి వాడిలా పరుగులు పెడుతున్న నీకు...... ఇవన్నీ అర్ధం కావని చెప్పలేదు చక్రీ. ఎలా చెబితే అర్ధమవుతుంది....ఒక వేళ చెప్పినా నీకు అర్ధం చేసుకునేంత టైం లేదుగా! .....మా జీవితమంతా నీ కోసం ఎదురుచూపులు, నువ్వేమో.....డబ్బుకోసం పరుగులు ...

రోజుకి ఎన్నిసార్లు ఆ ముసలి ప్రాణం నిన్ను అడిగేదో తెలుసా! చక్రి.....

నా చిన్ని చిన్ని ఆశలన్నీ..... ఈ పుస్తకంలో రాస్తున్నా........ నీ పరుగులో నువ్వు అలసిపోయి....ఆగిపోయినప్పుడు ఇది చదువుకుని సేద తీరు చక్రి.......

ఒక రోజు సింధు ఈ డైరీ చదివి....ఏమందో తెలుసా!......నాన్న రోజుకి ఎంత సంపాదిస్తారు అని అడిగింది...

ఏమో! అన్నాను....వందా.. వెయ్యీ...లక్షా...కోటి.....ఎంతమ్మా? అంది

ఏం? అన్నాను....

అదేమందో తెలుసా!...ఆ డబ్బు నేను సంపాదించి ఇస్తాను....”ఆయన టైంలో ఓ రోజు నాకిమ్మని అడుగమ్మా”......అంది

చెంప మీద చెల్లున కొట్టినట్టు అనిపించింది .......మీతో గడపాలని పిల్లలు ఎంత ఆశ పడ్డారో తెలుసా!.......

పిల్లలూ.... నేను.... మిమ్మల్ని అంతలా మిమ్మల్ని మిస్ అయిపోయాం.......ఆ రోజులు ఎన్ని కోట్లు పెడితే వస్త్తాయో చెప్పు చక్రి.....

అని చదువుతున్న చక్రవర్తి కి కన్నీళ్ళు ఆగలేదు......

“మీరు నన్ను మిస్ అవడం కాదు వనజ మిమ్మల్నందర్నీ నేను మిస్ అయిపోయాను....డబ్బు సంపాదించటం ఒక్కటే జీవితం అనుకున్నా.....ఆ జీవితం లో మీరున్నారని గుర్తించలేకపోయాను.... ఇప్పుడు జీవించడానికి నా చేతిలో” జీవితమే” లేకుండా చేసుకున్నాను”.....’మిస్ యు’ అంటూ బోరుమన్నాడు చక్రి.... తన చేతిలో వనజ అస్థికలను ప్రేమగా స్పురిస్తూ.....”నన్ను క్షమించు వనజా క్షమించు “ అంటూ పశ్చాత్తాపంతో కాశి గంగలో అస్థికలు కలిపేసాడు చక్రి.........

****

తెల్లవారింది....ఇక లేవండి అంది సిందు....

“అరె ...నా పక్కనే పడుకున్న అమ్ము ....ఏది? మీ దగ్గర నిద్రపుచ్హాను కదా!” ....... అంది భర్త రాఖీతో సింధు

“మనింటికి కొత్తగా ఒక అతిది తెల్లవారు ఝామున వచ్హారు......ఆయన దగ్గర పడుకుంది అమ్ము” అన్నాడు సింధు భర్త.....రాఖీ

“అతిధా.....ఎవరు....రాఖీ?...అంటున్న సింధు కి ఎదురుగా దివాన్ మీద నాన్న చక్రి ...........గుండెలపై ప్రసాంతం గా నిద్రపోతున్న సింధు కూతురు అమ్ము........

పక్కనున్న గోడ మీద....”.సిందూ.....క్షమించవూ” .....అని రాసి ఉన్న అక్షరాలను ప్రేమ గా తాకింది సిందు. “దేవుడు నా బాల్యాన్నితిరిగి వెనక్కి నాకిస్తే బాగుండు నాన్నా...అమ్ములా నీ గుండెలపై పడుకునేదాన్ని” అని మనసులో కన్నీరు కార్చింది సింధు.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ